భావి భారత చైతన్యరథం అభివృద్ధి దశలో
మున్ముందుకు నడవాలి అంటే ఆరథానికి కట్టబడిన సంకెలలు తొలగాలి తరువాత ఆరథాన్ని సరైన దారిలో
నడిపే నాయకులు, అధికారులు అన్ని వర్గాల్లో రావాలి. ఇవి నేటి సమస్యలే కావు. మన భరతమాత
విదేశీ శృంఖలాలు త్రెంచుకొని స్వాతంత్రయ జండాను పట్టి నిలిచిన నాటి నుంచి ఉన్నవే. ఎంత
కాలమైనా సమస్యలెప్పుడు తగిన పరిష్కారం చూపితేనే సత్కాలంలో సరైన రీతిలో పరిష్కరింపబడతాయి.
కాలం గడిచే కొద్దీ ఆ సమస్యలు మరింత జటిలమై వాటి రూపే మారిపోతుంది. అందువలన వాటిని శీఘ్రగతిలో
కాలదోషం పట్టకుండా సరైన సమయంలో పరిష్కరించడమే ఉత్తమ మార్గం. ప్రస్తుతం మన దేశంలో పెరుగుతున్న
సమస్య సరిసమానత తేని ఉద్యోగావకాశాలు. సామాన్యంగా ప్రతి మనిషికి కావలసిన కనీస అవసరాలు
కల్పించాలి ప్రభుత్వం పడే ఆరాటం వేసే పథకాలు కొన్నింటిలో విజయం కలిగినా మరికొన్నింటిలో
ఆ విజయం మరీచిక అవుతోంది. ఈ కనీస అవసరాలు ప్రతిపౌరునికి అందకపోవటానికి కారణం ఆ పథకాల్లో
ఉన్న లోపమా! అని ప్రశ్నిస్తే 'కాదు ' అన్న జవాబు వస్తుంది. మరి కారణాలు? ఎన్నో మరెన్నో
అందరికీ తెలిసిన జవాబే, కొన్ని విషయాల్లో మన దేశ పురోభివృద్ధిని మనమే అడ్డగిస్తున్నాము
అనే అర్థం కూడా నిబిడీకృతమై వుంది.
ఇక్కడ మనసమస్యలకు కారణం భారతదేశం
పేద దేశం అనవచ్చు కానీ అది ఎంత మాత్రము కాదు. ప్రజలే పేదరికంలో వున్నారు. ఎందుకంటే
ఇక్కడ సంపద కాలానుగుణంగా జరిగిన అపజయాలతో మరియు మత విద్వేషాలతో పరదేశాలకు ఎంతో తరలించుకుపోబడినది.
సంపదలు పోయినా అవి దేశాభివృద్ధిని మాత్రం ఆటంకపరచలేక
పోయాయి. దోచుకోబడినది కేవలం ధనసంపదలు, విలువైన వస్తువులే కానీ విద్యా సంపద కాదు కదా. అదే ప్రస్తుతం మనల్ని కాపాడిన సంపద. మనదేశంలో విద్యావంతుల అభివృద్ధి ఎంతజరిగినా వారికి తగిన ఉపాధులు అన్ని వర్గాల వారికీ అందేలా కల్పించలేకపోతున్నాము అన్నదే నేటి సమస్య. దీనికి ముఖ్య కారణం మనం అమలు పరచిన రిజర్వేషన్ పాలసీ కొంతవరకు అడ్డుకుందేమో అనిపిస్తుంది. దేశంలో అట్టడుగు వర్గానికి చెందిన వారు 15%, అత్యధిక ధనవంతులు 15%, మధ్య తరగతి వారు 70% వున్నారు. ప్రభుత్వ పథకాలు 15% అతి పేదల అభివృద్ధి గురించే అమలుపరచబడ్డాయి. వేసే ప్రణాళికలన్నీ వారికి అనుగుణంగానే వుండడం వలన అత్యధిక జనాభా గల మధ్య తరగతి వారు ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారు. ఈ రిజర్వేషన్ పాలసీ ప్రకారం 15% షెడ్యూల్డ్ కేస్డ్ 6% షెడ్యూల్డ్ ట్రైబ్, 33% స్త్రీలు, 25% బేక్‌వర్డ్ కేస్ట్, 3% అంగవికలురు 1% ఎక్స్ సర్వీస్ ఇది కాక ప్రస్తుతం 2015లో అదర్ బేక్‌వర్డ్ కేస్ట్ (ఒ.బి.సి.) వారి 27% పబ్లిక్ సెక్టార్, ఉన్నత విద్యల్లో ఈ సౌలభ్యం ఏర్పరచడం జరిగింది. రాష్ట్రాన్ని బట్టి కొన్ని హెచ్చు తగ్గులున్నా ఈ పాలసీ సుమారుగా ఇదే శాతంలో చేసారు. కులవిభజన మత విభజన కూడదు అంటారు. కానీ విద్యార్థి దశలో విద్యార్హత గానీ తరువాత రోజుల్లో ఉద్యోగార్హతగానీ నిర్ణయింపబడేది ఈ ప్రాదికపైనే. ప్రస్తుతం ఉన్నత కులవర్గానికి చెందినవారు ఈ వివక్షత అనే సంకెళ్ళలో ఉన్నారు.
పూర్వం కుల విభజనతో వారి వారి వృత్తులు
నిర్దేశింపబడేవి. సంఘంలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులుగా వర్ణవిబేధం చేయబడినది.
ఇది తప్పు, అమానుషం అని వ్యతిరేకించింది మనమే కానీ రిజర్వేషన్ ద్వారా ఒకరి వృత్తిని
వేరొకరికి అందచేయటం వలన వృత్తుల్లో సమన్వయం కుదరలేదు. వేదమంత్రాలు చదివి గురు రూపంలో
ఆదరింపబడే బ్రాహ్మలు నేడు ఆర్థికాభివృద్ధి లేక హేవమైన వృత్తులు చేస్తూ దయనీయమైన జీవితాన్ని
గడపమనటం వారిపట్ల అమానుషమైనది. అదేవిధంగా రాజ్యాన్ని రక్షించే క్షత్రియులు పౌరుషానికి,
ధైర్యానికి ప్రతిరూపాలు వారిని దయనీయ హీన వృత్తుల్లోకి దించటం అరాచకమైనది. వ్యాపారంలో
తమ తెలివిని యుక్తిని పణంగా పెట్టి వెలుగొందే వైశ్యులు డబ్బుతో కొన్న సీట్లుతో విద్యకి
అవరోధం కల్పించడం న్యాయం చెయ్యలేకపోవటం ఆదర్శమైంది. శూద్రులకి రిజర్వేషన్ పేరిట ఎన్నో
అవకాశాలు ఎన్నో సౌలభ్యాలు సమకూర్చటం సమాజంలో విద్వేషాలు రేపింది.
ఈ సమానత్త్వం ధనసంపాదనపై ఆశ తప్ప
వారివారి వృత్తికి ఏ మాత్రం న్యాయం చేకూర్చటం జరగలేదు. కుల విభజన కూడదు. మత విబేధం
తప్పు అన్నమాటలు అర్థరహితం. ఇవి రాను రాను చాదస్తంగా మారి అనేక మూఢాచారాలు సమాజంలో
లేచాయి. ఎవరైనా ఎటువంటి వృత్తిలోనైనా రాణించగలరు అన్న భావం నవీన సమాజంలో లేచింది. ఈ
ఆలోచన కులవృత్తి అన్న పదాన్ని తీసెయ్యమంది. వర్ణబేధం రూపుమాపమంది అస్పృశ్యత అనేది అనాగరికం
అంది. కానీ నిదానంలో ఈ విధంగా అలోచిస్తే ఇందులో ఇమిడి యున్న అర్థం ప్రస్ఫుటమవుతుంది. అస్పృశ్యత అనే పదానికి
సరైన అర్థం సంక్రమణ రోగాలతో వున్నవారిని స్పృశిస్తే వారి రోగాలు ఇతరులకు సంక్రమిస్తాయి.
ఆ రోజుల్లో ఈ హీనజాతి అనబడేవారు నివశించే ప్రాంతాలు అనారోగ్యకరమైన దుర్గంధ పూరితమైన
వాతావరణంలో వారు గడిపే జీవిత విధానం వారిని సమాజం నుంచి దూరం చేసాయి. వారిని తాకడం
ఆ ప్రదేశాల్లో వీచేగాలి, నీరు అపరిశుభ్రం కనక అంటురోగాలు రాకూడదని ఆచారం అన్న పేరిట
నిషేధించారు. వారు వాడే నీరు, తిండి అన్నీ అపరిశుద్ధమైనవనే భావన జపతపాలకి అనర్హులుగా
అధములుగా పరిగణనలోనికి తీసుకు రాబడ్డారు. కాలక్రమేణా ఇది పరిశుభ్ర వాతావరణంలో గడిపే
అగ్రకులాల వారు చాదస్తం అన్న పేరుతో వారిని దూరం చేసారు. ఊరుకి దూరంగా వెలేయబడి అనాగరిక
జీవనం గడిపేవారు. వీటి వెనుక దాగిన అర్థాలు పరమార్థాలు వెలికి తీసిన విద్యావంతులు ముందుకి
వచ్చి ఈ అస్పృశ్యత నివారించడానికి పరిశుభ్రత అనే ఒక ఆయుధంతో వారి జీవన శైలి మార్చి
సమాజంలో పైకి తీసుకువచ్చారు.
ఇదే రీతిలో నల్లవారికీ తెల్లవారికీ
మధ్య ఏర్పడినదొక అగాధం. తెలుపు తొమ్మిది వంకలు కప్పితే నలుపు నాలుగు వంకలు
తెస్తుంది
అన్న సామెత వీరి విషయంలో నిజమైనది. నల్లవారిని బానిసలుగా అంగడిలో అమ్ముకునేవారు. వారి
చేత హీనకార్యములు చేయించడానికి వారి శరీర రంగే కారణము. వారిలో చాలామంది నిరక్షరాస్యులే
మృగానికీ మనిషికీ తేడా తెలియకుండా హింసించేవారు. కాలక్రమేణా వర్ణభేధం (రేషియల్ డిస్క్రిమినేషన్)
నల్లవారిలో తిరుగుబాటు తత్త్వాలు పెంచింది. వారు విద్యావంతులై తమ పురోభివృద్ధికై తెల్లవారితో
అనేక యుద్ధాలు చేసి సంస్కరణలు తెచ్చి ధీటుగా వారితో సరిగా నవీన సమాజంలో నిలబడటం జరిగింది.
మనం ఎంత అభివృద్ధి దశలోకి వస్తున్నామో లేక ఎంత అధఃపాతాళానికి మన సంస్కృతీ సంప్రదాయాలు
అణచివేస్తున్నామో తేల్చేది కాలమే అన్నది ఋజువైనది.
నేడు భారతదేశంలో రిజర్వేషన్ వివక్షతలో
వెనుకబడిన కులవర్గంవారు ఉన్నత కులవర్గం వారు అను తారతమ్యాలు లేచి అంతులేని అగాధాన్ని
ఏర్పరుచుతున్నాయి. ఉన్నత చదువులకి వెళ్ళాలన్న ఉద్యోగ సంపాదన చేయాలన్నా ఇరువర్గాల్లో
చాలా బేధం వచ్చింది. వెనుక కులవర్గం వారు ముందుగా రిజర్వేషన్ ద్వారా సీట్లు ఉద్యోగాలు
సంపాదించుకుంటారు. అదే విధంగా చదివి (అంతకన్న ఎక్కువ మార్కులు) తెచ్చుకున్న ఉన్నత కులవర్గంలో
పుట్టిన వారు సీట్లు రాక ఉద్యోగావకాశాలు లేక అల్లాడిపోతున్నారు. ప్రస్తుత సమాజంలో ఒక
వైపు కులవృత్తి చేతకాక ఇటు చదివిన చదువుకి సార్థకత చేయలేక విద్యావంతులు ఎందరో తమ విద్యను
మరచి కుటుంబ కనీస అవసరాలు తీర్చడానికి ఏ వృత్తి చేయడానికైనా సిద్ధపడుతున్నారు. అన్ని
వర్గాల విద్యార్థులు ఒకే టీచర్ ద్వారా విద్యనభ్యసించినా అది విద్యార్థి దశ వరకే పరిమితం.
వారు జీవితంలో ముందుకు వెళ్ళాలి అంటే రిజర్వేషన్ అనే సంకెలపడుతోంది.
స్వాతంత్రయం వచ్చి నాలుగుతరాలు గడిచినా
వీరికి ప్రభుత్వం ఇచ్చే రిజర్వేషన్ అవకాశాలు ఇప్పటికీ మెండుగా లభిస్తున్నాయి. ఉన్నత
కులవర్గం వారు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే వున్నట్లు నేటికీ ఆర్ధికాభివృద్ధి
లేక స్వసంపాదన లేక గందరగోళ స్థితిలో ఉన్నారు. ధన సంపాదనకై ఆశతో విదేశ పలాయనం చేస్తున్నారు.
ఈ సంకెల తెగాలంటే ప్రభుత్వం తమ ప్రణాళికల్లో
కొన్ని మార్పులు తెచ్చి అత్యధిక జనాభా గల సామాన్యులకి ఉపాధి చూపించగలిగితే దేశం అభ్యున్నత
పథంలో ముందుకి సాగుతుంది. సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన వారినే లెక్కలోకి తీసుకోవాలి.
వారిది ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ జాతి అయినా రిజర్వేషన్ లబ్ధి పొందడానికి వారి ఆర్థిక
పరిస్థితే కొలమానం కావాలి. ఈ అవకాశం మొదటి సంతానం వరకే కలిగి వుండటం ఎంతో శ్రయస్కరం.
ఈ సంస్కరణ కార్యరూపం దాలిస్తే స్వల్ప
కాలంలో మన నాయకులు చేసే సంఘ సంస్కరణలతో భారతదేశాన్ని ఆర్థికాభివృద్ధి దశవైపు నడపటం
సాధ్యమవుతుంది. ఇదే మనందరి కృతనిశ్చయం అయినపుడు ప్రజలందరికీ కనీస అవసరాలు తప్పక సమకూరుతాయి
అన్నది మనందరి విశ్వాసం అన్న నమ్మకంతో ఈ తెలుగు కవితా పదాలు వెలుగులతో విరాజిల్లుతాయి.
"ప్రజలకు
శాంతి సౌఖ్యం
కలిగించే
దేశమె దేశం
బానిస
భావం విడనాడి
ఏ జాతి వెలుగునో అది జాతి"
ఈ సమస్యలు పరిష్కరింపబడాలి అంటే ముఖ్యంగా
కావలసినది కులం, మతం, రంగు, రూపు, వేషం, భాషలు కావు.
"వృత్తిపై అంకిత భావం"
ఇది వుంటే మనం ఏ రిజర్వేషన్స్ చేసినా ఏ మతమైనా ఏ కులమైనా ఏ జాతియైనా ఏ భాషలు అయినా
మనిషికి సభ్య సమాజంలో నిలవడానికి అర్హత వస్తుంది.
కులం
- గౌరవంతో
మతం
- సహనంతో
శారీరకరంగు
- తెలివి అనే తేజస్సుతో
వేషధారణ
- సంస్కృతీ సంప్రదాయలతో
భాష
- అభిమానంతో పెరగాలి.
ఈ
భావనలు అభివృద్ధి దశలో పయనించేది
ఒక
గ్రామం నుండి - రాష్ట్రానికి
ఒక
రాష్ట్రం నుండి - దేశానికి
ఒక దేశం నుండి - ప్రపంచానికి
ఇది నిజమైన నాడు నవీన సమాజం తనంతట
తానే బాగుపడుతుంది. ఇది సత్యదూరం కానినాడు భరతమాత కనుల నుండి కారే ఆనంద భాష్పాలు విలువ
కట్టలేనివి అవుతాయి. అవే మీకు ఎప్పటికీ తరగని ఆశీస్సులు. ఈ అతి చిన్న ఉపాయాలు మన ప్రభుత్వం
తమ సంస్కరణలతో ప్రజలు తమ ఆచరణలలో తేవటానికి ప్రయత్నిస్తే భారతరథం సరిసమానతలేని ఉద్యోగావకాశాలు
అనే సంకెల తొలగి అభివృద్ధి దశలో ముందుకు సాగుతుంది అన్నది మనందరి మాట కావాలి. మరి మీరేమంటారు?