పాండవులేగి వశింపుచుండిరి
పోడిమిగలారు యోజనముల పొడవున
ఒక మామిడిపండుండెన్
గాండీవమ్మున వేసెను అర్జునుడు
గడగడవణకుచు ధర్మజనాభులు
పాండవ కులమిది మునిచే
చెడునని
భయమున తన ఆత్మబంధున్
తలచెన్
తలచిన అప్పుడు ధర్మజనాభులు
వైకుంఠంబున మాధవుడుండెన్
చనుదెంచా కృష్ణుడు వచ్చి
వచ్చా వృక్షము కడ
నిలచెన్
‘ఉత్తములార వినుడీ వనమున
ఒక ఋషిపరుడు
తపమొనరించెన్
నిత్యము ఆహారమ్ముగ
ఈ మామిడి
పండుండెన్
గుర్తు తెలియక వేసెను
అర్జునుడు
ఒకనైనా మీరేవురు నయముగ
సత్యము తప్పక పల్కిన
పండుశాఖకు పోయి
తొడిమిని అంటున్’
అనిన ధర్మాజులందరు కూడి
చనియా కొలనులొ స్నానముచేసి
వనితామణి ద్రౌపది సహితమ్ముగ
వచ్చా వృక్షముకడ నిలువంగన్
వనరుగ వచ్చి చేతులు
ముడిచి
వనరుగ తూరుపు ముఖముగ
నిలిచి
ధర్మాంగదులు తమరిట్లనిరి
‘సత్యం మాత పిత
జ్ఞానం
ధర్మం భ్రాత దయ
సతి
శాంతం పుత్రి క్షమపుత్రి
షడయతే మమబాంధవః
ధరణీశ్వరి మాతల్లే సత్యం
తరణీ జ్ఞానం తండ్రీ తమకు
అరుగదు శాంతం కులసతితప్పం
సోదరరక్షే తన ధర్మంబని
అతి ఓర్పే
తమ పుత్రుండైన
సహచరులే తన బంధుబలగమని
ధర్మరాజిట్లని పల్కగ
ఇరువడి దేవతలాకాశంబున
ఓహో ఓహో
ఓహోయనగా
పండప్పుడు వసుధకు ఒక
యోజన మెగసెన్
“అనిత్యాని శరీరాని
విభావొ నైవశాశ్వతః
నిత్యం సన్నిహితు కర్తవ్యో
ధర్మసంగ్రహః
ఇలలో దేహం అశాశ్వతంబని
మరి సంపాదన
అనిత్యమనగ
నిత్యం ధర్మం రక్షించుటకే
అభిమానం వాడగా నయం”
భీముండిట్లని పల్కగ పండప్పుడు వసుధకు
రెండో యోజనమెగసెన్
“పృధ్విలోన పరధనమెంతగ కల్గిన
పెంకు సమానంగా చూతున్
సతతము ఎప్పుడు పరోపకారం
తనధర్మంగా భావింతున్
పరోపకార మిదం శరీరం
మానంబే తమ ఆచంద్రార్కం
ఇలలో ఖ్యాతికి ఆదర్శంగా
తన వేల్పే
కృష్ణుండని”
అర్జునుండిట్లని పల్కగ పండప్పుడు వసుధకు
మూడో యోజనమెగసెన్
"ధరణీపతి మాభ్రాతే సత్యం
తరుణీ మణి మాతల్లే
నిత్యం
ఇడుములెన్నైనా గాని
కులసతి వీడం
పరస్త్రీ మానం తల్లిగ
చూతుం"
నకులుండిట్లని పల్కగ పండప్పుడు వసుధకు
నాల్గోయోజనమెగసెన్
“ధరపై ధర్మం నిలుపుటకొరకే
తమవృత్తే తమ సర్వస్వంబని
తరుగదు ఓర్మి తరుగదు
ఐక్యత
అతి ఓర్పే
తమదైన వ్రతంబని”
సహదేవుండిట్లని పల్కగ పండప్పుడు వసుధకు
ఐదోయోజన మెగసెన్
“చక్కని వాడే పురుషుండైన
సహోదరుండైన తనసుతుడైన
మక్కువతోడుత మనసు బోధించుట
మగువులకెల్ల ఇది మర్యాద”
ఎన్నుచు ఆ ద్రౌపది
పల్కగ
పండెగయక ఆకాశంబున నిలచెన్
పండెగరని కోపాన
పాండవులిదేమని కలవర పడుటన్ చూసి
కృష్ణుండప్పుడు
“ఓహో ద్రౌపది ఓహో
ద్రౌపది
సత్యము తప్పక పలుకుమూ”
అనగా
“అంతరేంద్రమున అలనాడర్జునుడు
యంత్రమత్స్యము వేసి తెచ్చిన
పందెము తోడ ఫలముగ
తెస్తిమని
భావము తల్లికి ఎరిగింపంగన్
కుంతిదేవి తన కొడుకుల
నైవురిని
వంతులవారిగ పంచుకొమ్మనన్
వంతులకు వారు పడిన
చింతేకానీ
వేరే అన్యాయము ఎరుగము
అనిరీ”
నిక్కమనుచు ద్రౌపది పల్కగ
సుర ఇంద్రాదులు
తగుతగుననిరి
రెండవమారిట్లని ద్రౌపది పల్కగ
పండప్పుడు వసుధకు ఆరోయోజనమెగసి
శాఖకు పోయి తొడిమిని
అంటిన్
"ఎండల కొండల కౌరవులలో
ఎరిగి తిరుగుడీ అజ్ఞాతవాసం
చనుదెంచా కృష్ణుడు పల్కగ
జలజలపువ్వుల వర్షము కురిసెన్
అవనిలోపల భారతకథ ఇది
ఇంపుగ సొంపుగ చదివిన
పాడిన
విన్నవారెల్లరు
వైకుంఠంబున వశియింపుదురు.
నేరెళ్ళ రాజకమల.