భారత దేశం సంవత్సరమంతా ఒకే రకం వాతావరణం కలిగి ఉండదు. నిర్దేశిత సమయంలో ఆరు ఋతువులు తెచ్చే మార్పులతో సమ ఉష్ణం, సమశీతలం, సమ వర్షపాతంతో ప్రకృతి తనదైన విశిష్టతను సంతరించుకొన్నది. కాలచక్ర భ్రమణమే మనకు సంప్రాప్తమైన విభిన్న వాతావరణం. మరియు ప్రకృతి ఇచ్చిన వరం. ఈ సృష్టికి ప్రతి సృష్తి చేస్తున్న మానవుడు ఎంతవరకు సఫలీకృతుడు అవుతాడు అన్నది నేటి కాలంలో సందేహాస్పదం చేస్తున్నాది. మరల అదే సమయములో మనిషి బుద్ధిబలమును ఉపయోగించి సృష్టిలో కొన్ని విజయ సంకేతాలు చేసుకొన్న రీతి హర్షదాయకమే. ప్రకృతి విలయ తాండవము చేయగా సంభవించే భూకంపాలు, వరదలు, అతివృష్తి, అనావృష్టి వంటి పరిణామాలు ఎదుర్కొనే సాహసం మరియు కొన్ని సులభతర నివారణోపాయములు సూచించడమే ఈ వ్యాసము యొక్క ముఖ్యోద్దేశము.
ఎటు
చూసినా దట్టమైన సహజ అడవులతో తోటలతో ఆకుపచ్చని వాతావరణముతో కనువిందు చేసేవి ఈశాన్య రాష్ట్రాలే. ప్రకృతి ఆకుపచ్చని చీర ధరించిందా అన్నట్టు ఎటు చూసినా పచ్చదనంతో నిండి ఉన్న ప్రాంతాలివి. ఉత్తరాన అత్యున్నత ఎత్తులో సదా హిమంతో నిండి ఉన్న హిమాలయ పర్వతాలు ఒరిగి, ఒరిగి ఇచట మట్టి కొండల రూపంలో దర్శనమిస్తాయి.
భారతదేశంలో అత్యధికంగా భూకంపాలు వచ్చేది ఈ ప్రాంతాల్లోనే. కావున ఇచట గృహ నిర్మాణం అతి తేలికపరమైన, పగులని, సామగ్రి వెదురు ఫ్రేములకు మట్టి లేదా సిమెంట్ లేయరు తాపడము చేసి కుడ్యాలు, భవంతుల తలుపులు, కిటికీ స్లాబులు తయారు చేసి ఇంటి పునాదికి బలమైన స్టీల్ రాడ్స్ ఉపయోగించుతారు. ఇది పాత పద్ధతే అయినా భూకంపములవలన వచ్చే నష్టాన్ని ఎదుర్కొనడానికి వీలుగా జపనీస్ విజ్ఞానముతొ సులభరీతిలో ఇండ్లు నిర్మించడం గర్హనీయమైన పద్ధతి. ఈ పగులని పరికరములతో మరల గృహనిర్మాణం చేసుకొనడం వారి విజ్ఞానికి నిదర్శనమే. కొంతవరకు ఆస్తి మరియు జన నష్టాలని అరికట్టడమే ఈ గృహనిర్మాణ ముఖ్యోద్దేశ్యము.
ఈ ప్రాంతాములొ వర్షపాతం సమృద్ధి. ప్రపంచములోనే అత్యధిక వర్షం కురిసే ప్రాంతం "చిరపుంజి" మేఘాలయ రాష్ట్రంలో సముద్రమట్తానికి 1484 మీటర్ల ఎత్తులో ఉంది. కొండల ప్రాంతం కావున వర్షపు నీరు పల్లానికి జాలువారి త్రాగు నీటి కొరతతో జనం పడే అవస్థలు వర్ణనాతీతమే. ఈ సమస్య అరికట్టడానికిగాను ట్యాంకులు తగు రీతిలో నిర్మించి వర్షపు నీటిని నిలువ చేయడమే ఉత్తమమైన మెరుగైన పద్ధతి. మిగిలిన రాష్ట్రలలో వర్షపు నీరు పోక్రీలలోను, పెద్ద సరస్సులలోను ఒడిసిపట్టి గృహోపకరణ పనులకు, పంటలకు వాడటం ఒక విశేషమైతే కొండలపై జాలువారే మట్టిని వ్యవసాయానికి అనుగుణంగా మలచుకొని పసుపు, అల్లం, దుంపజాతికూరలు, మరియు వరి పండించడము హర్షనీయమేమరి.
ఈశాన్య రాష్ట్రాలలో ని స్థానికులు “షిప్టింగ్ కల్టివేషన్ అనే వ్యవసాయ పద్ధతి అనుసరించడం ఒక విధానం. వీరు అడవులను కాల్చి పంటభూములుగా తీర్చిదిద్దుకొని భూసారం తగ్గిన వెంటనే వేరొకచోట వ్యవసాయం ప్రారంభించడమే రివాజు.
ఒక 40, 50 సంవత్సరాలలో మరల అడవిగా మారిపోతుంది. కానీ ప్రస్తుత కాలంలో మానవ తప్పిదాల వలన వృక్షాలను పడగొట్టడం, వంట చెరకు కోసమని, గృహనిర్మాణ పనులకని, నూతన రహదారుల నిర్మాణాని కని వివిధరీతులలో వివిధ ప్రాంతములకు తరలింపబడటము సర్వసామాన్యం. మహావృక్షములు కూకటి వేళ్ళతో నేలపై ఒరగడం భూసారం నిర్మూలమవడం వర్షాలు తగ్గిపోయి నీటి కొరత ఏర్పడటం వాతావరణంలో వేడి అధికమవడం జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్న పరిస్థితి. సింగపూర్ లాంటి దేశాల్లో మానవనిర్మిత వాతావరణం అభివృద్ధి చెందుతున్నా ప్రాకృతికవనరులు నాశనము కాకపోవడమే విశేషం. కారణాంతరాలవలన వృక్షాలు పడగొట్టినా ఆచెట్టు వేరొకచోట పాతిపెట్టే ప్రక్రియ కొనసాగుతుంది. నేడు వివిధ పనులకి అడ్డముగా వచ్చిన వృక్షాన్ని నరికేయడం లేద విద్యుత్తీగలకు అడ్డమని కొమ్మలు, రెమ్మలు తొలగించడం పరిపాటి అయినది. ఈ ప్రక్రియవలన చెట్లు కొంచెం గాలి వీచినా తట్టుకొనే శక్తిలేక నేలపై ఒరిగిపోతాయి. ఇది మానవ విధ్వంసకాండే. ఈ విధ్వంసక చర్య అరికట్టబడె మార్గము విద్యుత్ తీగలను భూగర్భ నిర్మాణము చేయడమే ఉత్తమమైన పద్ధతి. మనం నాటే ప్రతీ కొమ్మ, రెమ్మ, పూలు, కాయలు అన్నీ తమను తాము రక్షించుకొనే విధంగా పెరుగుతాయి. అందుకే ఒకకవి ప్రకృతిని ఇలా వర్ణించేరు.
ధరణికి గిరి భారమా; గిరికి తరువు భారమా; తరువుకు కాయ భారమా'ఏ వినాశనము జరిగినా ప్రకృతి విధించిన ధర్మాన్ని మీరినప్పుడే. క్రమ పద్ధతిలో నాటిన పెంచిన వృద్ధిపరచిన వృక్షాలు ఎన్నడూ మన జీవన గమనానికి ఆటంకము కావు అన్నది జగమెరిగిన సత్యం.
ఈశాన్య రాష్ట్రములలొ అనేక ఔషధ మొక్కలు అమితంగా పెరుగుతాయి. వీటి విషయమై స్థానికులు అంతులేని విజ్ఞానం కలిగిఉండి వాటి వేర్లు, పువ్వులు, ఆకులు, కాండములు తమ దైనందిన జీవనములో ఆహారములో ఉపయోగించి ఎన్నో వ్యాధులకు దూరమై ఆరోగ్య వంతులుగా తమను తాము యవ్వనవంతులుగా తీర్చి దిద్దుకోవడము ఒక అద్భుత విశేషం. ఈ మొక్కలు పెరిగే రీతి స్వచ్చమైన ప్రకృతి వారికి ప్రసాదించిన వరం. ఎటువంటి రసాయనాలు, కృత్రిమపద్ధతులుగాని వాడకపోవడమే ఇంకొక వరం. వీటి సారం సదా భూమిలో రక్షింపబడి వివిధ వ్యాధుల్ని దరిచేరనీయవు. రామాయణంలో హనుమ తెచ్చిన సంజీవనీ పర్వతం కలిగి ఉన్న ఔషధ మొక్కలు మహి మాన్వితమై భారతదేశ వైద్య విజ్ఞాన సుస్థిరతకు తార్కాణముగా నేటికీ నిలిచి ఉన్నవి. ఇప్పటికీ హిమాలయ ప్రాంతంలో నివసించే ఎందరో స్థానికులు విజ్ఞానవేత్తలు ఈ విజ్ఞానం కలిగి ఉండటము నిజంగా అధ్భుత విషయమే. బాగా ఆలోచిస్తే భగవంతుని సృష్టిలో అనవసరమైనది ఏదీ లేదు. వాటి ఉపయోగం తెలియని మనమే మన అవివేకంతో అనవసరం అనుకొని నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నాము.
మౌర్యచక్రవర్తి అశోకునికాలంలో రోడ్లకిరువైపుల చెట్లు నాటించెనని చరిత్ర చెబుతోంది. నేడు మనం అదే పద్ధతిలో రహదారుల్లో ఫలభరిత వృక్షములు నీడనిచ్చే చెట్లు పెంచడము ఎంతో అవసరము నేటి కాలంలో మనం రహదారుల్లో మహావృక్షాలను కూకటివేళ్లతో పెకలించి రోడ్ డివైడర్ల వద్ద అలంకార పూలమొక్కలు పెంచుతున్నరీతి మానవ సృష్టికి నిదర్శనమే. వీచే గాలికి ఈ రంగురంగుల పూలు ఊగుతూ మనకు స్వాగతం చెబుతున్న రీతి ఆహ్లాదకర అనుభూతి ఎంతోముదావహం. అదే సమయంలో కాలినడకన ప్రయాణించే బాటసారులకు పల్లెప్రజలకు కొన్నిసదుపాయములు అమరించే ప్రయత్నాలు చేయవలసిన భాద్యత ప్రభువులదేమరి.
ఇదేవిధముగా ఆంధ్రదేశములో శ్రీశైలశిఖర ప్రాంతములలో లభ్య మయ్యే అనేక ఔషధమొక్కలు ద్వారా ఎన్నో భయంకర వ్యాధులను అరికట్టబడేలా చేయగలిగే స్థానికుల విజ్ణానము హర్షనీయమే మరి. అచట పారే సెలయేరులలోని జలము అత్యంత స్వచ్చము మరియు ఆరోగ్యకరము. మహిమోన్నతమైన గుణ ప్రభావములను కలిగిఉండటమే నేటికీ అత్యంత అద్భుతముగా ఆశ్చర్య రీతిలో పర్యాటకుల మనస్సులను చూరగొన్న
స్థానికుల విజ్ఞాన సంపద అభినందనీయమే
“వృక్షో రక్షతి రక్షిత” అన్నది వేదనుడి.
వృక్షాలని మనం కాపాడితే తిరిగి అవి మనల్ని కాపాడుతాయి. పల్లెల్లో, పట్టణాలలో చెట్లు రాల్చే ఆకులు, పువ్వులు వగైరా మంట పెట్టడము అన్నది సామాన్య ప్రక్రియ. వాతావరణ కాలుష్యాన్ని పెంచే పని. కాలి బూడిద అయిన వాటిలొ మిగిలిన కార్బను ఎందుకు పనికిరాని వ్యర్ధముగా మిగులుతుంది. ఈ పరిస్థితి నివారణార్ధం పెద్ద గొయ్యి త్రవ్వి ఈవ్యర్ధాలు నిలువచేస్తే సేంద్రీయ{ఆర్గానిక్ ఎరువు తయారు అవుతుంది. ఈ ఎరువు పంటలకి ఉపయుక్తకరమే కాక అధిక దిగుబడి మరియు ఆరోగ్యరీత్యా హానికరంకాదు. దీనివలన అయ్యే ఖర్చు స్వల్పం, లాభాలు అనంతం. ఆకులు, కుళ్ళినపండ్లు, కాయగూరలు, కలుపుమొక్కలు, గడ్డి అన్నీ పనికిరాని వ్యర్ధాలే. మనసుపెడితే వీటితోనే అద్భుతాలు సృష్టించగలము.
శరీరానికి హాని కలిగించే రసాయనముల వాడిక నిరోధించ గలము ఇటువంటి ఉపయుక్తకరమైన సేంద్రీయ ఎరువు తయారుచేసి దేశ నలుమూలల ఎగుమతి చేయగలిగితే ఆర్ధికాభివృద్ధి మాత్రమే కాదు ఆరోగ్యాభివృద్ధికి కూడా తోడ్పడుతుంది. సేంద్రీయ ఎరువు తయారు చేసే ప్రక్రియ సక్రమరీతిలో జరగడాన్ని పూర్వకాలం చదువులలో అతిసామాన్య పదములతో పిల్లలకి పాటలరూపంలో నేర్పేవారు ఈ విధముగా
"బ్లాకువారి పిల్లలం మాట చెప్ప వచ్చినాం
చిన్నాపెద్ద రైతుల్లార ఒకే మాట వినండి
పది
అడుగుల పొడవుతొ ఏఅడడుగుల వెడల్పుతో
లోతు
మూడడుగులతో గోయితీయాలి
పచ్చి ఆకు రొడ్డను పశువు పేడ ముద్దను
కలిపి నిలువ చేసి ఎరువు చేయాలి"
అని
"వొకేషనల్" విద్యాభివృద్ధికి అన్నిరంగములలో ఆ రోజుల్లో ప్రాధాన్యమిచ్చేవారు అని తెలుస్తున్నది. విద్యార్ధులు తమకి తెలియకుండానే వివిధ వృత్తులు వాటి పరమార్ధాలు పాటలరూపంలో పద్య లేక గద్య రూపంలో నేర్చుకొనేవారు అనడానికి ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి. నేటికాలంలో కూడా ఇటువంటి ఉపయుక్తకరమైన అతి చిన్నవిగా కనిపించే అతిపెద్ద మార్పులు దేశ నలుమూలల ఆచరణలో పెడితే మానవ దైనందిన జీవనములో అత్యద్భుత మార్పులు వస్తాయి.