Sunday, 8 December 2019

అష్టసంఖ్యల విశిష్ఠతలు – అష్ట పుష్పములు (మొదటి విభాగము)


                                      "సుగంధపుష్పాలెన్నోవేలు- అనంత సుందర సువర్ణపూలు
                                         కస్తూరి మల్లిక కుందవనాలు-పారిజాత వన సౌగంధాలు
                                         కోటి ప్రకృతుల సౌందర్యాలు; మణి ద్వీపానికి మహానిధులు"




అని మణిద్వీపేశ్వరిని వివిద పుష్పములతో ఆరాధించుతూ స్తుతిస్తాము. ప్రకృతి సౌందర్యముతో మెరిసిపడేది తనలో నిక్షిప్తమై ఉన్న అందచందముల వలనే. మనలో చాలామందికి తోటలో విరిసిన పూలతో దేవీదేవతలను అర్చించే అవకాసము ఉంటుంది అదే అత్యుత్తమ పూజ అని భావిస్తారు. కానీ అవకాశం లేనివారు తమలోని భక్తిశ్రద్ధలనే నమఃసుమాంజలులతో అష్ట పుష్పములలో ఏది సమర్పించినా అది ఒక అధ్భుత ఆరాధనే అవుతుంది. ఎవరికి వారు తమ మనసనే తోటలో, తమ దైనందిన జీవనములో, నడతలో విజ్ఞతతో నాటి పెంచ వలసిన మొక్కలు. వాటికి శ్రద్ధ అనే నీరు పోసి పెంచితే విరిసే అసమాన్య పుష్పములు. మనిషిలోని విజ్ఞానము నుంచి ఆవిర్భవించుట ఒక విశేషమైతే అవి వెదజల్లే సుగంధ పరిమళ సౌరభ్యములను ఆశ్వాదించితే లభ్యమయ్యే సంతృప్తికి విలువకట్టలేము.

                                            "చైతన్యార్ఘ్య సమారాధ్యా-చైతన్య కుసుమ ప్రియ"

అని శ్రీ లలితాదేవిని ఆరాధిస్తాము. చైతన్యమనగా నిత్యజ్ఞాన స్రవంతి. ఇది అనేక విభాగములలో, అనేక రూపములలో వ్యాప్తీకరించి ఉంటుంది. జ్ఞానమనే నీరు పోసి పెంచగా విరిసిన పుష్పమే చైతన్య కుసుమం. దేవికి ఎంతో ప్రీతికరమైనది. కావున విశిష్ఠ, విలక్షణ సుమములతో చేసే ఆరాధన శుభప్రదమే.

మనస్సు, ధ్యానం, స్వచ్చత, అహింస, సహనము, సత్యం, ధైర్యం, ధర్మములతో కూడిన అష్ట పుష్పములతో అర్పితము చేసే దేవి ఆరాధన ఒక అధ్భుతము. సృష్టిలోని విశిష్టలతో మానవ హృదయాల్లో పరివర్తన తెచ్చి మనసున్న మనుషులుగా తీర్చి దిద్దడము కొరకు విలక్షణ కుసుమముల ప్రాధాన్యతను వివరించడమే వ్యాస ముఖ్యోద్దేశ్యము.

1.మనస్సు:-సర్వ దేవతలకు ప్రీతి పాత్రమైన పుష్పం "నిర్మలమైన మనస్సు". ఫ్రాపంచిక కోరికలకు దాసులైన మానవాళిని  అను క్షణం హెచ్చరించి వారిలో మిళితమై ఉన్న మంచి చెడుల మధ్య విచక్షణ తెలిపి సదా సుగమమైన దారిలో నడప గలిగే అత్యంత శక్తివంతమైనది "మనస్సు". మనోబలం లేనివారు శారీరకంగా ఎంత బలసంపన్నులైనా ఎందులకు కొరగారు. దీని అర్ధము మనము పురాణ యుగముల మాదిరి తపఃశక్తితో మనసులో చెలరేగే కోరికలను అదుపులోనికి తేవడము అనునది అసాధ్యము. కావున అందరానివి, సాధ్యము కానివి జీవితములో ఎదురయ్యే ఎన్నో విపరీత పరిస్థితులను ఎదుర్కొనుటకు తగిన ధైర్యస్థెర్యములు పొందాలన్నా నిరాశ నిస్పృహలకు లోనుకాకుండా కాపాడగలిగేది అతి శక్తివంతమైన ఔషధము "మనస్సే". భావనే మనల్ని శాంతి, సంతోష, నెమ్మదులతో ఓలలాడిస్తుంది. సదా పంచేంద్రియముల ద్వారా పెరిగే వాంఛల సంకెలలో మనస్సు బంధింపబడుతుంది.  మానసిక తృప్తి, బలం ఉన్నవారు సంకెలలో బిగుసు కొనక ఇంద్రియ నిగ్రహము కలిగి కోరికలను అదుపులో ఉంచుకొని విజయపధము వైపు పయనిస్తారు. వారు మానసికముగా ధనవంతులుగా కొనియాడబడతారు. సదా అసంతృప్తితో ఈర్ష్వ అసూయలతో రగిలే వారు ఎంత ధనవంతులైనా మానసికంగా పేదవారే. కావున మనల్ని మానవత్వముతో మసలే ధైర్యవంతులుగా, నీతిమంతులుగా తీర్చి దిద్దగలిగేది ఒక్క నిర్మలమైన మనస్సు కలవారికే సాధ్యము. కావున పుష్పాన్ని భక్తితో సమర్పించితే కరుణతో కరిగి అశేష ఆశీర్వచనములను కురిపించే దేవికి  "నమో నమామి".

2.ధ్యానం:-మానసిక బలాన్ని పెంపొందింప చేసేది, బాహ్యాంత రంగములను పరిశుద్ధ పరిచేది "దైవధ్యానమే". ప్రపంచములో నమ్ముకొన్న బలమైనా (జన బలం, ధన బలం, స్థాన బలం) ఓటమిపాలై వెను తిరగవచ్చు. కానీ దైవబలం ఎప్పటికైనా గెలిచి తీరుతుంది. అందువలన అతి సామాన్య రీతిలో పరుగులు తీసే జీవన పయనంలో ధ్యానించడానికి తగిన అవకాసములు లేవు. కానీ ఇప్పటికీ కొందరు దారిలో కనపడిన మందిరమైనా, మసీదు అయినా, చర్చి అయినా, ప్రార్ధనా స్థలం అయినా ఒక్క క్షణం వారి వారి మతానుసారము తమదైన రీతిలో ధ్యానం చేసికొనడము ఒక ప్రాచీన భారతీయ సంప్రదాయమే. ఇదే ఆత్మావలోకనం. మనిషిలోని ఆత్మ ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు అది మనసులో అవగాహన తెలిపి మనల్ని మనసున్న మనుషులుగా తీర్చి దిద్దుతుంది. విచక్షణా జ్ఞానం పెంపొందింప చేస్తుంది.
సామాన్య రీతిలో చేయ గలిగే ధ్యాన రీతిలు:-

1.సుప్రభాత సమయములో తన ఇష్ట దైవాన్ని ఒక్క నిముషము ధ్యానించడము తదనంతరం దినచర్య ప్రారంభం ఒక మంచి శుభసంకేతమవుతుంది.
2.తాము అధివేష్టించే ఆసనము ఉద్యోగరీత్యా లేక ఇతర కర్తవ్య పాలనలో పని ఆరంభించే సమయములో ఒక్క క్షణము దైవ ధ్యానం చేసినా శక్తి ఎంతో ఆత్మ బలాన్ని, ఆత్మ విశ్వాసాన్ని పెంపొందింపచేస్తుంది.
3.రాత్రిపవళించే సమయములో ఒక్క క్షణం తమదైనందిన విషయములు విపులీకరించు కొని చెడుని వదలి మంచిని స్వీకరించు కొనిన బలము తమని తాము తీర్చి దిద్దుకొనుటకు సోపానముగా మారుతుంది. రాబోవురోజును ఎదుర్కొనుటకు, మనపై మనకు నమ్మకము పెంపొందింప చేయుశక్తిప్రదాతగా మారి పరిశీలనాత్మిక దృష్టిలో మనిషి తనలో తాను పెంపొందించు కొను నమ్మకమే "ధ్యానం"

కలి యుగములో అతి త్వరితగతిలో గడిపే జీవనములో భగవధ్యానం కనుమరుగై వెలవెల పోతున్నది. కర్తవ్యమును మరిచి చేసే ధ్యానమైనా నిరుపయోగమే. మానసిక, శారీరక ఆందోళనలుంచి విముక్తి కలిగించి, స్వలాభాపేక్ష లేక వేడుకొనే ధ్యాన పుష్పము దేవికి సమర్పించితే సకల సౌభాగ్య సంపదలు మన స్వంతము అవుతాయి.

3.స్వచ్చత:- ఎవరికైతే మనసు శరీరము ఎల్లప్పుడూ నిర్మలంగా ఉంటాయో వారు సహజంగా ఏది ఆలోచిస్తున్నారో అదే విషయాన్ని ఆచరణలో పెట్టడానికి ప్రయత్నిస్తారు. సమయంలో వారు పొందే ఆనందం సంతృప్తి ఎనలేనిది. వారి హృదయం వెన్న కన్నా మృదువుగా, వెన్నెలలా తెల్లగా, మల్లెలలా సుమధురమై అలరారుతుంది. అటువంటి వారికి వయసు ఎంత వచ్చినా వృద్ధాప్యం దరిచేరదు. శారీరకంగా మరియు మానసికంగా ఎప్పటికీ వారు తరుణ వయస్కులే అవుతారు. కారణం వారు మనసులో ఒకరీతిగా తలంచి వెలుపల వేరొక రీతిగా చేయరు. చెప్పరు. ఇదే వారిలో నిగూఢ మైన "స్వచ్చత".

మన శారీరక అంతరంగములలో నెలకొన్న నిర్మాలిన్యములను వెలికి తీసుకొనే ప్రక్రియే "స్వచ్చత". ఇందు వలన మనకు ఎంతో మానసిక తృప్తి, సంతోషం, ప్రశాంతత లభిస్తాయి. ప్రకృతి పంచ భూతములతో (ఆకాశము, భూమి, అగ్ని, వాయువు, జలము) నిబిడీకృతమై ఉన్నది. వీనిని కాలుష్య నివారణముల నుంచి కాపాడుట అనునది మన స్వచ్చత అను అభిలాషకు తొలి సోపానము. పరిసరములలోని నిర్మాలిన్యములను తొలగించితే పరిసర స్వచ్చత ఏర్పడుతుంది. ఇందువలన మన మనస్సుకి ఎనలేని తృప్తి, సంతోషం, ఆరోగ్య రక్షణ లభిస్తుంది. మానవ, పశు, పక్ష్యాదులు మరియు జలచరములు వశించు పరిసరములలో స్వచ్చతను ఆపాదించ గలిగిననాడు "స్వచ్చతే జయతే" అను నినాదమును ఆచరణలోకి తేగలిగిన నాడు పుష్పము విలువ అసమాన్యమే అవుతుంది.

క్రైస్తవ మత సంస్థాపకుడైన జీసస్ "తాను ఈశపుత్రుడను" –ఏసు - అను వ్యవహరిక నామముతో భారత దేశమునకు ఆగమించితినని తెలిపెను. ఇచట ఋషుల వద్ద వేద విజ్ఞానమును ఆకళింపుచేసికొని వారి వద్ద "స్వచ్చత" పై విజ్ఞతను సంపాదించి స్వచ్చత అనునది బాహ్య శుద్ధియే కాదు అంతరంగ శుద్ధి కూడా మనుష్యులకు అవసరమే అను నీతి సూత్రము పశ్చిమ దేశవాసులకు బోధన చేసిన మహనీయుడు.

మనిషికి రెండు పవిత్రతలు అవసరమే.
1.శారీరక మాలిన్యములు తొలగింపబడు పద్ధతిస్నానము" అయితే 2.అంతరంగ శుద్ధి సత్ప్రవర్తనతో మాలిన్యములను తొలగించుతుంది.
స్వచ్చత లేని మనిషి జీవితమైనా నిరుపయోగమే.

"శారీరక శుద్ధి స్నానముతో మాలిన్యములను తొలగించుకొను పద్ధతి
అంతర్గత శుద్ధి సత్ప్రవర్తనతో మాలిన్యములను తొలగించుకొను పద్ధతి"

'క్లీన్లినెస్ ఈస్ నెక్స్ట్ టు గాడ్లినెస్" అనునది ఆంగ్లనుడి. ముందు పరిశుభ్రత తరువాత దైవ ప్రార్ధన అని వర్ణించితే మన వేదములు మానవ సంతతికి "త్రికరణశుద్ధి" అవశ్యకము అని ప్రభోధించినవి. అనగా మనస, వాచ, కర్మల ద్వారా చేయు పనులే "త్రికరణములు" ఇందు వలన మనిషి మనఃశుద్ధి, వాక్ శుద్ధి, చేయు కర్మశుద్ధిలతో తల్లీనమై జీవితమును ధన్యత చేసి కొనుటకు ప్రయత్నిస్తాడు (మనస, వాచ, కర్మలతో కూడిన శుద్ధి).

నేడు భారత దేశములో "స్వచ్చత మిషన్" అను కార్యక్రమము ప్రధాని మోదీ గారి ఆధ్వర్యములో 2014 అక్టోబర్ 2 ప్రారంభమై దేశమంతటా వ్యాప్తీకరించబడినది. దేశ విదేశ ప్రజలు ఎంతగానో ఆకర్షితులై ముందుకు వచ్చి కార్యోన్ముఖులై అపరిశుభ్రతను తొలగించుట విశేషమే.

స్వచ్చతవైపు చేసే పయనములో ఎన్నో అశుచితో నిండిన దుర్గంధ భరితమైన నీటివనరులు, విద్యాసంస్థలు, దేవాలయములు, రవాణా సంస్థలు, గృహ పరిసరములు, పశుపక్ష్యాదులు వశించు పరిసరములు ఎన్నో, మరెన్నో లెఖ్ఖకు అందని విభాగములు నేడు పరిశుభ్రతతో అలరారు తున్నవి.

"స్వచ్చతే జయతే" అను నినాదముతో అతి సామాన్య రీతిలో ప్రారంభించబడిన విజ్ఞత ఆచరణలోకి తేబడి అసమాన విలువలను జనతలో ప్రతిష్టించ బడుట ధీటులేనిది. సాటిలేనిది. కావున, మనము మనకు సాధ్యమైన రీతిలో "స్వచ్చత" అను మార్గములో పయనించి విలువతో కూడిన పుష్పమును దేవి చరణములపై నిలిపి నిశ్చలతతో, నిర్మలత్వముతో కూడిన ఆరాధనలకు ఎప్పటికీ విలువ కట్టలేము అని నేనంటాను మరి మీరేమంటారు?

4.అహింస:-అన్ని ధర్మములలో "అహింసయే పరమ ధర్మము" మరియు ఉత్తమమైనది. సృష్టిలోని ప్రాణులను హింసించక పోవడమే అహింస. మాటలనే తూటాలతో మనుష్యులను మానసికముగా, మారణాయుధములతో మానవజాతిని, పశుపక్ష్యాదులను, క్రిమికీటకములను హింసించక పోవడమే "అహింస". రిగ్వేద కాలములో అహింస యొక్క గొప్ప తనమును వేదములు వర్ణించి జగతిపై వ్యాప్తీకరింప చేసినవి. వ్యాస మహర్షి మహాభారతములో "అహింస" యొక్క విభిన్న విశిష్ఠతలను రీతులలో విశదీకరించెను.

1.అహింసయే పరమధర్మం-అహింసయే పరమ దమః
2.అహింసయే పరమ ఆనందం-అహింసయే పరమ తపం
3.అహింసయే పరమ యజ్ఞం-అహింసయే పరమ బలం
4.అహింసయే పరమ మిత్రం-అహింసయే పరమ సుఖం
5.అహింసయే పరమ సత్యం-అహింసయే పరమ శరుతం

అనగా అహింసను మించిన ధర్మం, సమ విశ్లేషణ, ఆనందం, తపం, యజ్ఞం, బలము, మిత్రులు, సత్యం, సంతృప్తి ఇలపై లేవు. అతి విలువైన సద్గుణములతో అభివర్ణింపబడు సంపద అహింసయే అని తెలిపెను. అర్ధశాస్త్రమును రచించిన చాణక్యుని యుద్ధ నీతిలో "అహింస" గొప్పతనము నిక్షిప్తమై ఉన్నది. క్రీ. . 3, 4 శతాభ్ధములలోచరక సంహిత" రచించిన చరకుడను విజ్ఞానవేత్త కపిస్థల రాజ్యములో (జలంధర్) జీలం చీనాబ్ నదుల మధ్య విస్తీర్ణమై ఉన్న ప్రాంతములో వశించెను. "ఇండియన్ ఫాదర్ ఆఫ్ మెడిసిన్" గా విఖ్యాతి పొందెను. ఆయుర్వేదమునకు సంబంధించిన వైద్య విజ్ఞానమును విశదీకరించెను. అందులో ప్రపంచములో హింసాత్మిక సంఘఠనలు ప్రబలుటకు కారణము వారు తిను ఆహారపదార్ధములే అని తెలిపెను. ముఖ్యముగా మాంసాహారము కోప గుణమును అహంకారమును పెంచి శాంతి నెమ్మదులను దూరం చేస్తుంది. ఇదికాక కొన్ని దేశములలో పశువులను వధించి వాటి మాంసమును భుజిస్తారు. ఇది ఒక విధంగా హింసా ప్రవృత్తే.

అనేక భీకర యుద్ధములను చేసి సమస్త భారతా వనిని గెలిచిన "అశోక చక్రవర్తి" హింసాత్మికతను విడనాడి బౌద్ధ మతమును స్వీకరించి అహింసా మార్గమును అనుసరించిన వైనము భారత చరిత్రలో మరపురానిదే.

మొదటిసారిగా స్వాతంత్ర సంగ్రామములో మహాత్మాగాంధీ "అహింస" అను ఆయుధమును ఉపయోగించి భారత దేశమునకు స్వాతంత్రమును సంప్రాప్తింప చేసి ప్రపంచ దేశములను దిగ్భ్రాంతింప చేసి ప్రపంచ చరిత్ర తిరగ వ్రాయడమైనది. సదా పగతో, ఈర్ష్వతో, ద్వేషముతో రగిలే మనసున్న వారికి "అహింస" అను పుష్పము అందనంత ఎత్తులోనే ఉంటుంది.

జపాన్ దేశస్థుల యుద్ధ నీతిలో స్వరక్షణకు ప్రాధాన్యమిచ్చి "అయికిడో" ప్రతిష్ఠాపకుడైన "మోరి హై ఉషిభా" అహింస సూత్రములకు ఎంతో ప్రభావితుడై శతృవునైనా శిక్షించుటలో అహింస అతి ఉపయుక్తకరమైన ఆయుధము అని అభివర్ణించెను.

మనుషుల మధ్య సంబంధాలను పెంచే సద్గుణ సంపదే "అహింస" పశుపక్ష్యాదులపై చూపించే అహింస ఒక రక్షణ కవచముగా మారిననాడు వారు వాటి జీవన ప్రదాతలుగా ఇలపై కీర్తించబడతారు

అమెరికన్ సివిల్ రైట్స్ మూవ్మెంట్ సమయములో మార్టిన్ లూథర్ "జేంస్ బెవెల్గాంధీ పధమును అనుసరించుట విశేషమే. దైవత్వం నిండి ఉన్న సత్యంఆహింస" అని హిందు, జైన, బౌద్ధ, ఇస్లామిక్ మత ప్రవక్తలు ఉద్భోధించుట జగద్విదితమే.

మనలోని దుష్టశక్తులను, క్రూర ఆలోచనలను దునుమాడి స్వచ్చతతో అలరింప చేసేది "యోగ శాస్త్ర బలమే". ఇది మనుష్యుల్లోని "స్వచ్చతను" పెంపొందింప చేసేది సన్మార్గములో నిలపగలిగే శక్తివంతమైనది.

వశిష్ఠ మహర్షి ద్వారా విరచితమైన "యోగవాశిష్ఠ" గ్రంధములోని ఎన్నో సూక్తులను అన్వయించు కొని సిక్కుల మత గురువైన "గురుగ్రంధాసాహెబ్" యోగ విద్య ద్వారా ఎందరినో అహింస మార్గములో తీర్చిదిద్దెను. ఆరోగ్యవంతులుగా మార్చి వారిలో శాంతి దీపమును వెలిగించెను.

ఇస్లాం మత సంస్థాపకుడైన మహమ్మద్ ప్రాఫిట్' అహింస తత్వాన్ని సమర్ధించి జగతికి వెలుగు చూపిన మహితాత్ముడు.

జైన మత సంస్థాపకుడైన వర్ధమాన మహావీరుడు తన బోధనలో సాత్విక శాకాహారము వలన ఎన్నో హింసాత్మిక గుణములను నిర్మూలించి అహింసను పెంపొందింప చేయవచ్చును అని తెలిపెను.

బౌద్ధ మత సూత్రములను అశేష జనవాహినికి ప్రబోధించిన గౌతమ బుద్ధుదు మూడు వ్యాపార దుష్ట శక్తులను నిర్మూలించమని తెలిపెను.

1.దేశ విదేశములలో మారణాయుధముల మారాటము.
2.జీవమున్న పశుపక్ష్యాధులను దునుమాడుటకు చేసే విక్రయము
3.మాంసము, మత్తు పదార్ధములు, విషతుల్యమైన హానికర పదార్ధముల విక్రయము.

పై మూడు కాలములోనైనా నిషేధించబడిన నాడు ప్రపంచములో హింసాత్మికతలు తొలగి "అహింస" తనదైన రూపు దిద్దుకొనుటకు సాధ్యము అవుతుంది. శాంతి భద్రతలుతో అలరారుతుంది. ఆనంద డోలికలలో ఓలలాడుతుంది.

మన నిత్య పూజలో పుష్పము దేవి పదముల చెంత అర్పించుట వలన  మనలోని క్రూరత్వమును, హింసా ప్రవృత్తులను  వదలి వేయడమే అవుతుంది. ప్రపంచమే శాంతి భధ్రతలతో ఆనందడోలికలలో ఓలాడుతుంది. అని నేనంటాను. మరిమీరేమంటారు?