Thursday, 31 December 2020

మహాత్మా గాంధీ ద్వారా సూచింపబడిన భవిష్య ప్రమాదములు (మొదటి విభాగము)

 


నవీనమానవ యుగములో ముఖ్యముగా కలియుగములో ఎంత విజ్ఞత అభివృద్ధి చెందినా వాని ద్వారా సంభవించబోయే సమస్యలు ప్రమాదముల గురించి ఊహించి అనుభవసారముతో తెలిపిన కొన్ని ముఖ్య ప్రమాదముల గురించి అతిక్లుప్త రీతిలో వివరించుట మరియు వాటికి తగిన పరిష్కార మార్గములను అతిసులభ రీతిలో తెలియపరచుటయే వ్యాసముఖ్యోద్దేశ్యము. ( వ్యాస రచనకు రూపకల్పమైనది వాట్సాప్లో ఒక అజ్ఞాన వ్యక్తిద్వారా ప్రచురింపబడిన ప్రముఖ సందేశములనే మూలాధారముగా చేసికొని  వ్రాయడమైనది. వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు).

1.పనిచేయకుండా దక్కేసంపద

బ్రహ్మ సృష్టిలో సంపాదనకి రెండే మార్గములను నిర్దేశించడమైనది, అవి ధర్మమార్గం మరియు అధర్మ మార్గం. ధర్మమార్గములో ఆర్జించిన సంపాదన మనిషిలో దైవత్వాన్ని పెంపొందింప చేస్తుంది. ధర్మనిరతిలో సంపాదించిన వారు ధైర్యముగా ఉంటారు. ధైర్యమే వారికి ఆరోగ్యాన్ని అగణిత సుఖాలను సంప్రాప్తింప చేస్తుంది. మరి అధర్మబద్ధముగా చేసిన ఆర్జన మనిషిలో అసుర తత్త్వాన్ని పెంచి మానవత్వాన్ని మృగ్యంచేస్తుంది. నేటి కాలములో వృత్తిలో నిమగ్నమైనా తాము చేసే పని పైన దృష్టి కన్నా పని చేస్తే తమకు ఏమి లాభము చేకూ రుతుంది? అన్న ఆలోచనలు అధికమై సంపాదన పక్కదారుల ఆర్జనకు సోపానము వేసినది. ఇదే పని చేయకుండా దక్కే సంపద". ఐశ్వర్యాన్ని ప్రపంచములో ఎంత ఎత్తున సమకూర్చుకొన్నామో భగవంతుని దృష్టిలో అంత దిగజారిపోతాము. సంపదని దాచేతీరుకి పడే వ్యాకులత దినదిన ప్రవర్ధమానమై మనసులోని శాంతిని నెమ్మదిని కృంగదీస్తుంది. కష్టపడి న్యాయబద్ధముగా సంపాదించిన ఐశ్వర్యములో ఉన్న తృప్తి, సంతోషము సులభరీతిలో అనవతరముగా లభ్యమైన సంపదలో ఉండదు.

అన్యాయ సంపాదన మార్గములు:-1. పన్నులు సకాలములో సక్రమ రీతిలో చెల్లించక పోవడం, లంచగొండితనం, నల్లధనం, వ్యాపారంలో గడించిన అన్యాయపరమైన ఆర్జన, 5. రసీదులు లేని డొనేషన్స్, ఫీజులు మరియు మోసభరితమైన తప్పుడు లెఖ్ఖలు వగైరాలు.

ఎదుర్కొను మార్గములు:-

1.ప్రభుత్వానికి సకాలంలో, సక్రమ రీతిలో పన్నులు కట్టి మనదైన సరైన దారిని నిరూపించుకొనడము

2 చేయ వలసిన పనులకు లంచమాశించకుండా కర్తవ్య నిర్వహణలో నిమగ్నులము కావడము.

3. ప్రభుత్వ అదికారులు పర్యవేక్షణకు వచ్చినా సర్వసన్నిద్ధముతో ధైర్యంగా నిలవగలగడము.

4.ప్రైవేట్ మరియు ప్రభుత్వ సంస్థలలో కృత్రిమ రీతులలో ఆర్జన వీడి, న్యాయరీతిలో ధర్మసమ్మతముగా చేయు ఆర్జనకే ప్రధమ స్థానం ఇచ్చినచో ఆహ్లాదకరమైన శక్తి, సంతృప్తి మన స్వంతము అవుతాయి అనడములో సందేహం ఎంత మాత్రములేదు.

2.వివేకము కొరవడిన వినోదం

భావితరాల వారు ఎదుర్కొనబోయే రెండవ  ముఖ్య ప్రమాదము "వివేకం కొరవడిన వినోదం"

పూర్వకాలములో మనం వినోదాన్ని అనుభవించడానికి, రేడియో, గ్రామఫోను, వీధి నాటకములు, నృత్యములు అరుదుగా సినిమాలు, పుస్తకాల పఠనం, కొన్ని ఆటలు, క్రీడలూ వినోదానికి ఊపిరి పోసేవి. వాటిలో "వినోదంఎంత ఉండెడిదో "వివేకం" అంతే మూర్తీభవించి ఉండెడిది. హాస్య పాత్రలలో సహితం వారి మాటల్లో, పాటల్లో వినోదం వివేకముతో కూడినదై ఉండుట ఒక విశేషమైతే సంగీత, సాహిత్య రచనలు భారతీయ సంస్కృతీ సంప్రదాయములతో అలరారుట మరియొక విశేషం. ఆడే ఆటలు, క్రీడలు కంప్యూటర్లూ అందించలేని విజ్ఞతతను , మెదడుకు చురుకుతనాన్ని  సంప్రాప్తింపచేసేవిమరి.

నేడు నూటికి 90% వినోదం హింసాత్కమే. ఒక 10% వెతుకుదామన్నా కానరాని వినోదము, వివేకము అహింసతత్వం. కోట్ల ఖర్చుతో తీసే సినిమాలు చూడటానికి ప్రజలు పడే ఆరాటం, వందల కొలదీ ఖరీదైన టిక్కెట్లు కొని "ఐనక్స్" ధియేటర్లలో పానీయములు సేవిస్తూ లభ్యమైన చిరుతిండ్లు (జంక్ పుడ్) తింటూ ఆనందించే వినోదంలో "వివేకం" శూన్యం. ఒకటి మితిమీరిన శభ్ధములు, గగుర్పాటు కలిగించే సన్నివేశములు, హింసతో కూడిన వాక్బాణములు కలిగించే అసౌకర్యం మరియు తినే అహారములు శరీర ఆరోగ్యానికి (ఊబకాయ పెరుగుదలలకు) ప్రమాదకరమే. ఇది డబ్బుతో కొనుక్కున్న హానికర వినోదమే నా దృష్టిలో అనిపిస్తుంది. ఇదే విజ్ఞత, ఆధునిక పరికరములు సరి అయిన రీతిలో ఉపయుక్తకరమైతే ఎంత విజ్ఞాన ఝరి ప్రవహించుతుందో కదా!

నేడు పురిటిపిల్లల నుంచి వయోవృద్ధుల వరకు ఆనందించే వినోద పరికరములే స్మార్ట్ ఫోన్, సినిమాలు, టి వీ, వాట్సాప్, పేస్ బుక్ మరియు విడియో క్రీడలు వగైరా వినోదం కొంత వరకు సామాజిక రూపురేఖలను మార్చివేసినది. అనుకరణాభిలాషలతో పెరిగే యువతలో భిన్నతరహా ప్రవర్తన, పెద్దలను ఎదిరించేస్థితి, మరియు సత్ సంబంధాలు దూరమయ్యే పరిస్థితి వైపు  పయనిస్తున్నాయి. కొన్ని తప్పుడు ప్రచారములు, గోరంతలు కొండంతలు చేసి చెప్పే విధానం కలతలకు వేదికగా మారినవి.

కాలమైనా మనలో మార్పు తెచ్చి శాంతి నెమ్మదులను పెంపొందింపచేసేది వివేకంతో కూడిన వినోదమే. వినోదాన్ని లభ్యపరచే సాధనము "మీడియా" కావున ఇప్పటికీ సమయం మించిపోలేదు. వారు ఎంత హింసాత్మిక సంఘఠనలు చూపినా వివేకాన్ని వినోదం పేరును రూపు మాపినా మనము మనదైన తీరులో నడిస్తే చెడుమార్పులూ మనదరికి రావు. ఉదా:- కమల పుష్పం సదా బురద నీటిలోనే ఉంటుంది. తన పరిసరములను తనే శుద్ధి పరచుకొని స్వచ్చమైన జలమును మనకు అందిస్తుంది. సుమధురమైన సువాసనలను విరజిమ్ముతుంది. అదే రీతిలో ధైర్య స్థైర్యములు మనలో రావాలి అంటే మనో నిశ్చలత, నిబ్బరం, ధృఢనిశ్చయం, మంచి ఆలోచనలు, శాస్త్రీయ, సాంఘిక పురాణ ఇతిహాసములను వివరించ గలిగే అవగాహన కలిగి మనదైన రీతిలో పొందే "వినోదం" ఎటువంటి వారికైనా ఎప్పటికీ వివేకమును పెంపొందింపచేస్తుంది.

3.మానవత్వం మృగ్యమైన సైన్స్

నేడు ప్రపంచ దేశాల్ని అతలాకుతలం చేస్తున్న పొంచిఉన్న ప్రమాదం "మానవత్వం మృగ్యమైన సైన్స్". "విజ్ఞానము" (సైన్స్) అనునది మానవత్వాన్ని, సర్వ జీవరాశులను సంరక్షించే తీరులొ అభివృద్ధి చెందుతేనే దాని విలువ ఉన్నతమైనదిగా పరిగణింపబడుతుంది. యుగయుగాల చరిత్ర నుంచి భారతదేశాన్ని ఏలిన చక్రవర్తుల కొరకు దివ్య విమానములు వచ్చి సగౌరవముగా వారిని సశరీరముతో స్వర్గాన్ని తలపింప చేయుట వేదవివరణ. సమస్త భూమండలాన్ని ఏలిన భారతదేశ పరిపాలకులు కొన్ని లక్షల యోజనముల దూరములో నెలకొన్న ఊర్ధ్వలోకములను వీక్షించి మరల భువికి తిరిగి రాగలిగిన అతి వీరులు ధీరులు ధరణిపై వెలిసారు.

కాలవశమున ప్రకృతి భీభిత్సములలో సైన్స్ శక్తి కనుమరుగై నేటి మానవ ఊహలకు అందరానిది అయిపోయినది.

మన పూర్వీకులు వారి విజ్ఞాన సంపదను దేశరక్షణకు ప్రజల రక్షణకు వినియోగించెడివారు. కానీ నేడు సైన్స్ అభివృద్ధి వక్రించినది. అల్పజీవులను ఆర్ధికంగా వెనుకపడిన చిన చిన్న దేశాల మీద అగ్రరాజ్యాధి నేతలు తమవద్ద ఉన్న విస్ఫోటకములను ఉపయోగించి వారి అసహాయతను స్వలాభముకొరకు  తమ ఆధిక్యతను అన్ని రంగాలలో ప్రకటించుట  అధికార దర్పమే. మానవత్వం మరచిన సైన్స్ అభివృద్ధి ఒక్క యుద్ధరంగాలలోనే కాదు అన్ని రంగాలలో రీతిలో వ్యాప్తీకరించబడినది.

1.జీవనదుల పైన కట్టిన బహుళార్ధక ప్రాజెక్టులు.

2.కూకటివేళ్ళతో పెకలించే మహావృక్ష సంపద.

3.అత్యధికముగా వాడుక లోనికి వచ్చిన ప్లాస్టిక్

4.అధిక ఉత్పత్తుల కొరకు, కొన్ని పదార్ధముల నిల్వల కొరకు ఉపయోగించే రసాయనముల తయారీ.

5.వ్యాపారాభివృద్ధికై పశువుల పాలను మెషిన్స్ ద్వారా తీయడం

6.లెక్క్ఖకు మించిన కర్మాగారములు అవి విడుదలచేసే కలుషిత నీరు సముద్రాలు, నదులు, ఏరులు, సెలయేరులు మురికితో కలుషితమయం చేయుట.

7.అంతులేని అణువిస్ఫోటక ప్రయోగములు ఒకరిని మించి ఒకరు పోటీలతో చేయు ప్రయోగములు.

8.భూఖనిజాలు అత్యధికముగా మెషిన్స్ ద్వారా వెలికి తీయడం

అవనిపై మానవ జీవచరాలకు ఎంతో నష్టం కలిగించుట శోచనీయమే.

వీటి నివారణ మన చేతిలోనే ఉన్నది రీతిలో:-

1.చెడు పనులకు మరియు మానవ విధ్వంశతకు సాంకేత పరమైన సైన్స్ అందించవద్దు.

2.నదుల పైన చిన చిన్న ఆనకట్టలు నిర్మించి వరదనీటిని కాలువల ద్వారా సుదూర తీరములకు మళ్ళించుట వలన వరదలు అరికట్టబడతాయి. సిల్ట్ వెలికి తీయుట సులభతరమౌతుంది. అధిక నీరు నిల్వలు నదులలో పెరుగుతాయి.

3.వృక్షో రక్షతి రక్షితః" అను విజ్ఞత పెంపొందింపచేశికొనుట వలన భూతలాన్ని సశ్యశ్యామలంగా తీర్చిదిద్ద వచ్చును.

4.దూడని వదిలితే పాలు చేపు అధికమై పశువులు ఎంతో ఆరోగ్యకరమైన రీతిలో అధిక క్షీరమును ఉత్పత్తి చేస్తాయి అనునది ఒక విశేషమైతే పశువుల ఆరోగ్యం సంరక్షింపబడుట మరియొక విశేషము.

5.ప్లాస్టిక్ ఉపయోగించుట గత 50 సవత్సరముల నుంచి అధికమై పెనుభూతంలా మారినది. నీటిలో వేయి సంవత్సరములు ఉంచినా నానదు. నిప్పులో కాల్చినా వాతావరణం విషతుల్యము అవుతుంది. ఎండలో ఎండదు కావున ఇది సైన్స్ ద్వారా వచ్చి చేరిన వినాశమే. ప్రస్తుతము ప్లాస్టిక్ వాడుకను నిషేధించుట ముఖ్యమని గ్రహించిన విజ్ఞానవేత్తలు మరల పాత పద్ధతులలో పేపర్ కవర్లు, సంచీలు వగైరా వాడుకలోనికి చేర్చడము ముదావహమే.

6.రసాయనముల వాడకము వీలైనంత తగ్గించిన ఆహారము సేవించుట ఆరోగ్యకరము. ప్రకృతిలో లభ్యమైన ఆర్గానిక్ ఎరువుల ద్వారా పండించిన కూరలు, పండ్లు, కాయధాన్యములు ఉపయోగించుట ఎంతో స్వచ్చతతో కూడిన ఆరోగ్యకరమైన ఆహారము.

7.భారీ పరిశ్రమలు సాధ్యమైనంత వరకు బీడు భూములలో సుదూరతీరములలో నెలకొల్పిన వాటి ద్వారా విడుదల అయ్యే కలుషితములు శుద్ధిపరచి నీటిని విడుదల చేయుట మన స్వచ్చతకు నిదర్శనమే.

8.భూమిలో నిక్షేపితమైన వివిధ ఖనిజములను అత్యధిక సంఖ్యలో వెలికి తీయుట హానికరమే. కారణము మరల ఖనిజములను ఉత్పత్తి చేయుటకు భూమికి కొన్ని కోట్ల సంవత్సరములు అవసరము. భూగర్భములో వెలితి ఏర్పడి భూకంపములు, లావాఉత్పన్నములు ఎన్నో అనర్ధములు సంభవించుట వానిని అరికట్టుట అనునవి మానవ విజ్ఞతకు అందనివే.

పైనచెప్పిన కొన్ని నిబంధనలు మనము పాటిస్తే తప్పక మానవత్వం ప్రస్ఫుటించబడుతుంది. సైన్స్ విజ్ఞతముందు సమస్త మానవ లోకం ప్రణమిల్లుతుంది.

4. వ్యక్తిత్వం లోపించిన విజ్ఞానం

నేడు ప్రపంచ మానవాళిలో ప్రస్పుటించే అతిముఖ్యమైన  ప్రమాదమే "వ్యక్తిత్వం లోపించిన విజ్ఞానం". మనిషికి మానవత్వం అనునది ఒక విజ్ఞాన గని. ఇందులోనే "వ్యక్తిత్వం" అనునది ప్రభవిస్తుంది. చదువుకున్న విజ్ఞానవేత్తలలోనే వ్యక్తిత్వం వెల్లివిరిస్తుంది అనునది మన ప్రగాఢ విశ్వాసం. కానీ వ్యక్తిత్వము ప్రకటితమవడానికి కావలసినవి ధనం, విద్య, ప్రశంసాపత్రాలు, పేరు ప్రతిష్ఠలు, మరియు విలువైన ప్రాపంచిక భోగములతో కూడిన బహుమతులు మాత్రమే కాదు. వ్యక్తిత్వం అనునది వారు చేసే పనులు మాట్లాడే తీరులోను ప్రభవిస్తుంది. అవి మనిషిలోని మంచితనాన్ని నిరూపణ చేస్తాయి. కేవలం డిగ్రీలు సంపాదించుకొనే విద్యను నేర్వడముతోనే ఆగిపోకుండా నడవడికను చక్కపరచే  విద్యను నేర్పాలి.

1.వ్యక్తిత్వం అనునది చిన్ననాట తల్లితండ్రుల వద్ద నేర్పబడుతుంది.

2.తరువాత కాలములో ఉపాధ్యాయుల వద్ద నేరుస్తారు.

3.తదనంతరం స్నేహితుల వద్ద నేర్చుకొంటారు.

3.తదనంతరము భార్యబిడ్డల వద్ద, బంధు బలగములు వద్ద తమనుతాము తీర్చి దిద్దుకొంటారు.

4.సహోద్యోగులు తగు భాధ్యత వహించి మనలో వ్యక్తిత్వాన్ని  పెంపొందిస్తారు.

5.వయసు మళ్ళిన రోజుల్లో ఆధ్యాత్మిక భావనలో, దైవారాధనలో వారి అనుభవసారంలో వ్యక్తిత్వం సదా నిలుస్తుంది.

మంచి వ్యక్తిత్వం మనలో పెరగటానికి కొందరు ప్రముఖుల దృష్తిలో నిర్దేశింపబడిన ముఖ్య సూత్రములు:-

1. గాంధీ:- వ్యక్తిత్వాన్ని కోల్పోయిన వ్యక్తి సర్వం కోల్పోయినట్టే.

2.రమణమహర్షి:- కోరికలు మితంగా ఉంటే బాధ్యతలు పరిమితంగా ఉంటాయి. ఇవి జీవితం వినాశనం కాకుండా వ్యక్తిత్వాన్ని అదుపులో పెడతాయి.

3.రాజారాం మోహన్ రాయ్:-చెడుని చూపడం కాదు. దాని స్థానంలో మంచిని తెప్పించగలగడమే నిజమైన సంస్కరణ. ఇదే నిజమైన వ్యక్తిత్వం.

4. స్వామి వివేకానంద:- ఎంత చిన్న పనైనా సరే సరి అయిన తీరులో చేస్తే మంచి ఫలితం వస్తుంది. అందులో మన వ్యక్తిత్వం ప్రతిఫలిస్తుంది.

5.సుభాషితం:-గౌరవం తెచ్చుకోవడము అంటే పదవిని చూసి నిలబడటము కాదు. వ్యక్తిత్వాన్ని చూసి నమస్కరించడము.

6.ఐన్ స్టీన్:- వ్యతిరేక భావాలు, వ్యతిరేక స్వభావంగల వారికి దూరంగా ఉంటే మనకొచ్చిన సమస్యలు చాలావరకు తగ్గుతాయి. మనవ్యక్తిత్వపు విలువలు పెరుగుతాయి.

7. సి.సి. రో:- సమస్య వెనక పరిష్కారం, కష్టం వెనుక సుఖం తప్పక ఉంటాయి. మనం చేయాల్సిందల్లా సహనంగా ఉండటమే. ముందు మనపై మనం విజయం సాధించాలి. అపుడు మనం ప్రపంచాన్ని గెలిచినట్టే. అబద్ధం మనలో తప్పించుకొనే ధోరణి పెంచితే నిజాయితీ మనం చేసే మంచి పనులలో నిరూపించబడుతుంది. వ్యక్తిత్వన్ని గుబాళింప చేస్తుంది.

8.సుభాషితం:- వ్యక్తిత్వమనేది బడాయి కబుర్లలోను, బుకాయింపు మాటలలోను, అధికారం చెలాయించడములోను కాదు. ఎలాంటి పరిణామాలు ఎదురైనా ఒక మంచి పని ధైర్యంగా చేయడములో ఉంటుంది. అవి రాజకీయాలు కావచ్చు లేదా సామాజిక ధర్మాలు కావచ్చు వేటినైనా సరే ఎదుర్కొనే ధోరణి పెంచుతుంది.

ఇన్ని విలువలతో కూడిన వ్యక్తిత్వాన్ని విజ్ఞాన పధములో  ఏకీకృతము చేస్తే  నిజమైన వ్యక్తిత్వముతో కూడిన విజ్ఞానం  మన స్వంతమే అవుతుంది  అని నేనంటాను. మరి మీరే మంటారు?


Monday, 7 December 2020

కాలవిభజనలో యుగధర్మములు

కాలాన్ని మించిన ఔషధం కాలాన్ని మించిన విలువైన కానుకలు, కాలాన్ని  మించిన సౌందర్యం కాలంతో   ముడిపడి   ఉన్న  యుగధర్మాలు  ఇలపై  లేవు.  కనుక    కాలము  యొక్క   విలువను విశదీకరించుట ఎవ్వరికీ సాధ్యము కాదు. కాలము అనునది  సమస్త జీవరాశుల పైన ఎటువంటి ప్రభావము చూపుతుంది అనునది సంక్షిప్తముగా వివరించడమే వ్యాస ముఖ్యోద్దేశ్యము.

1. మన మనస్సుకి గాని శరీరానికి గాని తగిలిన గాయములను కుదుటపరచే శక్తివంతమైన ఔషధమే "కాలం"

2. కాలాన్ని మించిన కానుకలు లేవు. కారణము శతృత్వాన్ని గాని ద్వేషాగ్నులను గాని కూకటి వేళ్ళతో పెకలించి మిత్రత్వాన్ని పెంపు చేయగల మహత్తర శక్తివంతమైనది "కాలం"

3. కాలాన్ని సౌందర్యానికి ప్రతి రూపముగా వర్ణిస్తారు. ఎందు వలన అనగా మారే ఋతువులు మనిషి పుట్టిన సమయం నుంచి యవ్వన దశకు చేరే వరకు సౌందర్యమే మూర్తీభవిస్తుంది. వయసు మళ్ళిన వారిలో పెరిగిన విజ్ఞత, వివేకం అనుభవసారం అనే సుందర రూపాలు ప్రస్ఫుటమవడము అనునది కాలముతోనే ముడిపడి ఉంటాయి.

4. ఋతువుల ఆగమనమునకు కారణము కాల చక్రభ్రమణమే.

5. యుగ ధర్మములు మారుటకు కాలమే కారణం. అందులకే మన పెద్దలు కలి యుగములో వచ్చి చేరిన అన్యాయ అక్రమాలను  చూసిఔరా! ఇదికలియుగ ధర్మం కదా! కాలమహిమ" అని గతించిన కాలాన్ని గుర్తు చేసుకొని నేటి కాలమహిమను విమర్శిస్తారు.

మనలో ప్రతీ ఒక్కరికీ గడచిన కాలం తిరిగి రాదని తెలుసు. అయినా  చాలా మంది కాలాన్ని వ్యర్ధ ప్రసంగాలతో, వ్యర్ధపూరిత ఆలోచనలతో, ప్రతీకార జ్వాలలతో, రగిలే పగలతో దుర్వినియోగ పరచు కొనడము మన సంకుచిత్త్వానికి నిదర్శనము. మరి కొందరు కాలాన్ని ఎంతో పొదుపుగా సద్వినియోగ పరచుకొను రీతి చూసి ఆశ్చర్య చకితులము కాక తప్పదు. మానవుల చేతిలో లేనిది, తేలేనిది, ఎప్పటికీ తిరిగిరానిదీ  గడచిన క్షణాన్ని సంపాదించలేక పోవడమే. కావున ఇటువంటి విలువైన కాలానికి ప్రతీ ఒక్కరూ శరణాగతులు కావడము ఒక విశేషమైతే కాలచక్ర భ్రమణములో చరాచర జగతిని తన చేతిలో నడిపే కాల పురుషుని మహిమ మరియొక విశేషము. సమయ గణనము అందరికీ ఒకే రీతిని సమర్పించిన భగవంతుని సృష్టే ఒక అధ్భుతము.

కాల గణనాన్ని పాశ్చ్యాత్యులు ఒక సెకండు నుంచి ప్రారంభించి ఒక సంవత్సరము వరకు విభజించడము జరిగినది (అరవై సెకెండులు = ఒక నిమిషము; అరవై నిమిషములు = ఒక గంట; ఇరవై నాలుగు గంటలు = ఒక రోజు; ముపై రోజులు = ఒక నెల; పన్నెండు నెలలు = ఒక సంవత్శరము). కానీ మన వేదములు లిప్త పాటు (కనురెప్ప మూసి తెరచిన సమయం) నుంచి యుగాంతముల వరకు విభజించడము విశేషమే. కాల విభజన శ్రీ వేదవ్యాస మహర్షి ద్వారా విరచితమైన "భాగవతంవర్ణన ప్రకారము రీతిలో కాలపరిమాణము వివరించడమైనది (ఒక రెప్పపాటుఒకపరమాణువు; రెండు పరమాణువులు - ఒక త్రిసరేణువు; మూడు త్రిసరేణువులు - ఒక తృటి; నూరు తృటిలు - ఒక వేధ; మూడు వేధలు - ఒక లవం; మూడు లవములు - ఒక నిముషం; మూడు నిముషాలు - ఒక క్షణం; ఐదు క్షణాలు - ఒక కాష్ఠ; పది కాష్ఠలు - ఒక లఘువు; పదిహేను లఘువులుఒకనాడిక; రెండు నాడికలు - ఒక ముహూర్తం; ఆరు నాడికలు - ఒక జాము; నాలుగు జాములుఒక పగలు; నాలుగు జాములు - ఒక రాత్రి; ఎనిమిది జాములు - ఒక అహోరాత్రి; పదిహేను అహోరాత్రులుఒకపక్షం; ఒక శుక్లపక్షం + ఒక క్రష్ణపక్షం = ఒక మాసం; ఒకమాసం - పితృదేవతలకు ఒక దినం; రెండు మాసములు - ఒక ఋతువు; మూడు ఋతువులు  ఉత్తరాయణంలో, మూడు ఋతువులు దక్షిణాయనంలో చేరి ఒక సంవత్సరము; పది సంవత్సరములు - ఒక దశాభ్ధం; పది దశాభ్ధములు - ఒక శతాభ్ధం; పది శతాభ్ధములు - ఒక సహస్రాభ్ధి; నూరు శతాభ్ధములు - ఒక ఖర్వ లేదా ఒక లక్ష సంవత్సరములు.)



ఒక మనుష్య సంవత్సరము దేవతలకు ఒక దినం

1. కృతయుగం – 17, 28,000 సంవత్సరములు

2. త్రేతాయుగం - 12,96,000 సంవత్సరములు

3. ద్వాపరయుగం – 8, 64,000 సంవత్సరములు

4. కలియుగం - 4,32,000 సంవత్సరములు

నాలుగుయూగాలు చేరి 43,20,000 సంవత్సరములు. నాలుగు యుగములు కలిసి ఒక చతుర్యుగం (చక్రభ్రమణం).

71 చక్రభ్రమణములు - ఒక మన్వంతరం

14 మన్వంతరాలు - ఒక కల్పం

200 కల్పాలు - బ్రహ్మకు ఒక రోజు

365 బ్రహ్మ రోజులు - బ్రహ్మకు ఒక సంవత్సరము

100 బ్రహ్మ సంవత్సరములు - బ్రహ్మ సమాప్తి

ఒక బ్రహ్మ సమాప్తి - విష్ణువుకు ఒక పూట

మరో బ్రహ్మ ఉధ్భవం - విష్ణువుకు మరో పూట

బ్రహ్మ చేత సృష్టింపబడిన 14 మనువులు దేవీ ఉపాసకులై సమస్త భూమండలాన్ని పరిపాలించిరి. వారి వలన వృద్ధి పొందిన సంతతే మానవ సంతతి. అందు వలననే మనకు "మానవులు" అనుపేరు వచ్చినది.

ఒక మనువు ఆయువు 70 మహాయుగాలు. ఒక మనువుకి వేరొక మనువుకి మధ్య కాలం మన్వంతరం. ఆసమయములో రాజులు, సురలు చక్రవర్తులు లోక పాలన చేస్తారు. పదునాలుగు మనువులలో (స్వాయంభవుడు, స్వారోచిషుడు, ఉత్తముడు, తామసుడు, రైవతుడు, చాక్షుషుడు, వైవశ్వంతుడు, శావర్ణి, దక్షశావర్ణి, మేరుశావర్ణి, సూర్యశావర్ణి, చంద్రశావర్ణి, రుద్రశావర్ణి, విష్ణుశావర్ణి) మొదటివాడైన స్వాయంభవుడు సమస్త భూమండలాన్ని పరిపాలించిన తొలి చక్రవర్తి.

బ్రహ్మ ఆయువులో మొదటి సగం "ప్రధమ పదార్ధము" అంటారు. ఇది పద్మ కల్పంలో శ్రీనారాయణుడి నాభి నుంచి పద్మం ఉధ్భవించిన కాలం "బ్రహ్మకల్పం"

మహా భారత యుద్ధ సమయానికి ప్రధమ పదార్ధం పూర్తి అయినది (సుమారు 5000 సంవత్సరములు) ద్వితీయ పదార్ధములో హరి శ్వేత వరాహ అవతారం దాల్చెను. అందు వలన శ్వేత వరాహ కల్పం, వైవశ్వత మనువు సుపరిపాలనలో ఉన్నది  కావున మనము పూజా సంకల్పములొ "ద్వితీయ పరార్ధే శ్వేత వరాహకల్పే వైవశ్వత మన్వంతరే కలియుగే ఫ్రధమపాదేజంబూద్వీపేభరత వర్షే భరత ఖండే" అను వేదోక్త మంత్ర స్మరణ సర్వ జనవిదితము.

యుగ ధర్మములు

1. కృత యుగము (సత్య యుగం) కాల పరిమితి-17,28,000  సంవత్సరములు

దయ, సత్యపాలన, ఏకపత్నీత్వము, దానము, అహింస, భూతదయ, ప్రజలలో ప్రదర్శితమయే గుణములు. చిన్న పల్లెలో కూడా దేవాలయము ఉంటుంది. విశిష్ఠ రీతిలో పూజలు నిర్వహించబడుత విశేషము. ధర్మ దేవత (ధేనువు రూపములో) నాలుగు పాదములైన తపం, జ్ఞానం, యజ్ఞం, దానంలతో సక్రమ రీతిలో నడిచే యుగమిది. జనులు మనశుద్ధి కలిగి తపములో జీవనము గడుపుతారు. తపోసంపన్నులైన వారిలో భక్తి తేజస్సు వెల్లివిరుస్తుంది మరియు సత్య వాక్కు పరిపాలకులు కావున "సత్య యుగం" అని నామాంకితమైనది.

వర్ణాశ్రమ ధర్మాలు సామాజిక నిబద్ధతలతో కూడిఉన్నవి. రీతిలో:

బ్రాహ్మణులు:-వేద మంత్రాలతో యజ్ఞయాగాదులు నిర్వహించి శుచిత్వముతో, భక్తి ప్రఫుల్లలతో రాజ్యాభివృద్దికి, ప్రజా శ్రేయస్సుకి, అధ్యయన, అధ్యాపనం, దానములిచ్చుట, గ్రహించుట  వీరి ముఖ్య కర్తవ్యము.

క్షత్రియులు:-దేశ రక్షణ, సుపరిపాలనలో శాంతి, ధర్మం, నీతి, సత్యం, అహింసలను సదా కాపాడుట, అధ్యయనము, యజ్ఞయాగాదులు చేయుట, దానములిచ్చుట  వీరి కర్తవ్యము.

వైశ్యులు:-వ్యాపారము, వాణిజ్యములలో నిపుణులు. అధ్యయనము, యజ్ఞయాగాదులు చేయుట, పశు రక్షణ వ్యవసాయము వీరి కర్తవ్యములు

శూద్రులు:-పై మూడు వర్ణముల వారికి వారి వారి ధర్మములు నిర్వహించుటలో సహకరించడము వీరి కర్తవ్యముగా భావించి ప్రభుసేవాతత్పరులుగా మెలుగుతారు.

కృతయుగాంతం

భరతవర్షంలో తుఫాను వలన సంపూర్ణముగా ప్రపంచములో చాలా భాగంలో వశించే ప్రాణికోటి వినాశనము కానున్నదని హిమాలయ శిఖరములపై రక్షణ తీసికొమ్మని కాళికాదేవి భరతవర్ష సుపరిపాలకుడైన అయోధ్యా నగర  సూర్యవంశ రాజైన సుదర్శనునికి స్వప్నములో కనిపించి తెలిపెను. ప్రధాన బృందములైన క్షత్రియ, బ్రాహ్మణ, వైశ్య, శూద్రులను తమ తమ పరికరములతో హిమాలయ తీరం చేరిన కొన్ని సంవత్సరములకు సముద్ర జలములు వెనుకకు మరలగా భూభాగము  స్థల రూపములో  నిలచినది. వైశాఖ శుద్ధ తదియనాడు సుదర్శనుడు తన పరివారముతో తిరిగి అయోధ్యా నగరము చేరి కీర్తి ప్రతిష్ఠలతో పరిపాలించెను.

2.త్రేతాయుగము:-కాల పరిమితి -12,96,000 సంవత్సరములు

ధర్మ దేవత జ్ఞానం, యజ్ఞం, దానం అను మూడు పదములతో సంచరించే యుగము. జ్ఞానసముపార్జన వీరి ప్రముఖ ధర్మం. యుగము వారికి దృష్టిమాపక శక్తి అధికము. ఉదా:-సంపాతి పక్షి తన దృష్టి బలంతో సుదీర తీరమైన లంకలో ఉన్న సీతను వీక్షించి ఆమె క్షేమ వార్తను హనుమంతాది వీరులకు తెలిపిన ఉదంతం రామాయణ కావ్యంలో వాల్మీకి వర్ణన. ఏక వీక్షణముతో చేసే భాణప్రయోగాలు ప్రముఖ ఆయుధములు, వానిలో నిబిడీ కృతమైవున్న మంత్రబలమే ముఖ్యమైన కారణము.

మిగిలిన ధర్మములన్నీ కృత యుగ ధర్మములే అనుసరణీయముగా ఉండుట విశేషమే.

త్రేతాయుగాంతము

త్రేతా యుగ అంతమగు సమయములో మహా సముద్రములు పొంగి పొర్లగా భూమి సుమారు 200 సంవత్సరముల కాలము జలదిగ్భంధమై ఉండెను. తరువాత పెనుగాలులు వీచడముతో సముద్రము నీరు వెనుకకు మరలెను. తదనంతరము భూమి పైభాగము గోచరమైనది. అగస్త్య మహర్షి తన తేజస్సుతో భూమిని సారవంతము చేయగా మరల 5 సంవత్సరముల తదనంతరము  భూమి మరలా పాడిపంటలతో విలసిల్లి సమస్త జీవచరములు వశించుటకు యోగ్యకరమైనది. సూర్య వంశ పరిపాలకుడైన సంవరణ చక్రవర్తి భాద్రపద కృష్ణపక్ష త్రయోదశి శుక్రవారము నాడు మునులను తోడ్కొని ప్రతిష్ఠాన పురము (ప్రయాగ) చేరెను. విశ్వకర్మ రాజప్రాసాదమును ఒకటిన్నర కి.మీ ఎత్తులో 5 యోజనముల (690కి.మీ) వైశాల్యముతో ప్రతిష్ఠానపుర నిర్మాణము చేసి సుపరిపాలన గావించెను.

3.ద్వాపరయుగం:- కాల పరిమితి 8,,64,000 సంవత్సరములు

ధర్మ దేవత యజ్ఞం, దానం అను రెండు పదములతో సంచరించుట యుగ ధర్మం. అహింస తన ఉనికిని కోల్పోవడము ఒక విశేషమయితే హింసాత్మికతకు పునాది పడటము మరియొక విశేషము. మంత్రశక్తి సామర్ధ్యం, మంత్రబలం అధికముగా ప్రస్ఫుటమయ్యే కాలం. జనులు పుణ్య, పాప కార్యములు చేయుట విశేషం. ధర్మార్ధ కామములను అనుభవనీయమైనవిగా ప్రజలు, ఏలికలు ఆచరించుతారు. కక్షలు, కార్పణ్యాలు, హింసాత్మిక ప్రవృత్తులు ద్వాపర యుగములో అడుగు అడుగునా  గోచరించుతాయి.

ద్వాపర యుగాంతము

యుగములో భయంకరమైన మహాభారత యుద్ధం కురుక్షేత్రములో జరిగినది. భారీ సంఖ్యలలో దేశవిదేశ సైన్యములు అశువులు బాసిరి. పాపుల భారం అధికమై భూదేవి శ్రీ మహావిష్ణువును ప్రార్ధించగా ఆతను శ్రీ కృష్ణునిగా అవతరించి దుష్టశిక్షణ, శిష్ట రక్షణ చేయుదునని తెలిపెను. శ్రీకృష్ణుని రూపములో ఆయన భారతదేశంలో అవతరించి ధర్మాన్ని, శాంతినీ సుస్థాపితము చేయుట జరిగినది. మహాభారత యుద్దానికి కారణము శ్రీకృష్ణుని పాత్ర ఎంత ప్రముఖమో, ద్రౌపది కూడా అంతే బాధ్యురాలు అయినది. ద్రౌపది జన్మించడము కురుక్షేత్ర సంగ్రామానికి భూభార నివృత్తికీ బీజము పడినది. యుద్ధానంతరము ద్వాపర యుగము అంతమునకు పునాది అయినది. తదనంతరము మ్లేచ్చుల జననం భరత ఖంఢముపై విస్తరించినది. రీతిలో న్యూహవు విష్ణు భక్తుడు. ఒక రోజు ఆతనికి విష్ణువు కలలో కనిపించి నాటికి ఏడవ రోజు ప్రళయం రాబోతున్నదని అందరూ నావపైకి ఎక్కి ప్రాణములు రక్షించు కొమ్మని తెలిపెను.

న్యూహవు 300 హస్తముల పొడవు, 50 హస్తముల వెడల్పు, 30 హస్తముల ఎత్తులో ఒక నావను అన్ని జీవులకు తగినటుల నియమించి "బదరీనాథ్" చేరికొనెను. ప్రాణి అనునది లోకములో మిగలలేదు. సంపూర్ణ భరత ఖంఢము సముద్రములో దిగ్భంధమైనది. ఇంద్రుని ఆజ్ఞతో 40 దినములు ఎడతెరిపిలేని బ్రహ్మాండమైన వర్షము కురిసినది. హిమగిరి శిఖరముపై ఉన్న మునులు సర్వ దేవతలను ప్రార్ధించగా ప్రశాంత వాతావరణము నెలకొన్నది. హిమాలయ ప్రాంతములో భూమి ఒక సంవత్సర కాలము నీరంతా తీయగా స్థలరూపము ఏర్పడినది. దానికి "శిషిణా" అను పేరుతో న్యూహావు తన పరివారముతో స్థిరపడుట జరిగినది. ఆతని భక్తికి ప్రసన్నుడైన శ్రీమహావిష్ణువు వారి వంశాన్ని అభివృద్ధి పరచెను. హిందూ సంస్కృతీ, సంస్కృత పదము కనిపించని రీతిలో మ్లేచ్చ సంస్కృతి మరియు వారి భాషలు రూపు దిద్దుకొన్నవి.

4.కలియుగం:-కాల పరిమితి 4,32,000 సంవత్సరములు.

ధర్మ దేవత "దానం" అను ఒకే పాదముతో సంచరించు  యుగమే "కలియుగము". తపం, యజ్ఞం, జ్ఞానం, అను మూడు పాదములు నిర్వీర్యమై ఒంటి పాదముతో నడయాడు యుగమిది. కామం అర్ధం రెండే ఆరాధ్య దైవాలు మరియు వేదనింద నాస్తికత సామాన్య ధర్మములుగా వ్యాప్తీకరించివుండుటయే యుగ ధర్మము. వర్ణ సంక్రమణ సిద్ధాంతములు సర్వ జనర ఆమోద యోగ్యము అవుతాయి. మంచి, చెడు పరులకు మాత్రమే ఉపదేశిస్తారు. మరి పాటించే వారు అరుదుగా కనిపిస్తారు. ఆహార శుద్ధి ఉండదు. రాజ్యాలను ఏలే పాలకులు దుశ్శీలురు, కపట ప్రవర్తకులు, అసత్య భాషకులు, స్వేచ్చా ప్రవృత్తులు కలిగివుంటారు. కలి యుగంలో అహంకారం, కోపం, మదమాత్సర్యం దేహాన్ని పట్టి ఊపిరి ఆడకుండా చేస్తాయి. దైవ ధూషణలు, వేద మంత్రాలను అవమానించే వారు, అతిధి సత్కారం చేయని వారు, దేవాలయ, బ్రాహ్మణుల మాన్యములను ఆక్రమించు కొనెడివారు, నీరు త్రాగు జీవములను బెదిరించువారు, పాలనా ప్రభువులను నిందించే వారు, జీవహింస నిష్కారణముగా చేయువారు అడుగు అడుగునా తారసపడతారు.

కలి యుగములో ధరణి ఎదుర్కొనబోయే విపత్తులు

కలి యుగం ప్రారంభమైన 5,000 సంవత్సరముల తరువాత ప్రపంచ దెశములలో ధర్మము నశించును. వింత వింత జ్ఞానములు పెరిగి పిరికి పందలు వాటిని సమర్ధిస్తూ వింత వింత వాదనలు వినిపింతురు. ప్రకృతి ధర్మము తలక్రిందులయ్యేను. పశ్చిమ దేశములలో స్త్రీ శక్తి అధికము కాగలదు. దేవ పితృ కార్యములు పూర్తిగా కనుమరుగై, అరాచకం వితండ వాదం ప్రజ్వరిల్లును. వేద మంత్రములు శూద్రులు తెలుపగా విప్రులు వినెదరు. దాంభికులు, అసత్య భాషకులు, జూదరులు, చోరులు ఆచార్య శూన్యులు జాతి, నీతి, లేక తిరిగేవారు అధికంగా కనబడుటయే విచిత్రము. నదులు జల శూన్యములు అయి పంట దిగుబడి శూన్యమవుతుంది. పట్టణాలు జన శూన్యం, వలసలు ఎక్కువ. స్త్రీలు, పురుషులు పశువుల కన్న నీచముగా ప్రవర్తిస్తారు. గొడ్రాళ్ళు ఎక్కువ. ఇరవై సంవత్సరాలకే ముసలితనం వస్తుంది. ధైర్య స్థైర్యములు లేని పాలకులు అధికంగా అధికారంలో ఉండుట వలన ప్రజలు అనేక కష్టనష్టాలు అనుభవించడం విచిత్రం. అహంకారానికి మారు రూపుతో స్త్రీలు ఉంటారు. బ్రాహ్మణ ఇండ్లలో మడి తడి ఆచారములు శూన్యమై కర్మకాండలు మటుమాయం అవుతాయి.

కలి యుగ మానవులు పురాణములను అధ్యయనము చేయలేరని వ్యాసుడు వేదములను విభజించి శతకోటి శ్లోకములను నాలుగు లక్షలుగా రూపుదిద్ది కేవలం 2.5% జ్ఞానరాశిని  అవనిపై నిలిపెను.

కలి యుగ విపత్తులను ఎదుర్కొను రక్షణ అయుధములు

అన్ని జన్మలలోను మానవ జన్మ ఉత్తమం. మనస్సునే మందిరం చేసి జ్ఞానాన్ని మధించి సాధించే నేర్పు ఒక్క మానవునికే సాధ్యం. మానవుని క్షేమం కోసం తమ ప్రతీ శ్వాసతో పాటు విశ్వంలోని విషాన్ని అంతా పీల్చి అమృతాన్ని పంచే పుణ్య కార్యాన్ని వృక్షములు చేస్తాయి. వాటిని సంరక్షించడము ఎంతో అవసరము. పరోపకారానికై నదులు కొండలను చీల్చుకొని అందరికీ జల దానం చేస్తున్నవి వాటిని శుద్ధీకరించి సుదూర తీరములకు ప్రవహింప  చేయుట మన కర్తవ్యం. పువ్వులు నవ్వుతూ పరిసరములను సుగంధభరితము చేయుట సౌందర్యాన్ని  పెంచి, జీవకళను పెంపొందింప చేయుటలో శోభ ఉన్నదని తెలుపుట వింతే మరి.

పాలకుల ముఖ్య ధర్మములు

సహాయత, పాలనపోషణ, శరణాగత రక్షణ, భూతదయ, ఏలికల ప్రముఖ ధర్మములు. ధర్మాన్ని వారు రక్షిస్తే ధర్మం సదా వారిని కాపాడుతుంది. భయభీతులైన వారిని అభయమిచ్చి రక్షించుట. గోబ్రాహ్మణులను సంతృప్తులను చేయుట. దండించేటప్పుడు నిస్పక్షపాతము. మృదుభాషణ. చిన్న పాపమైనా పెద్ద శిక్షవేస్తారు అను విషయం సదా గుర్తుంచు కొనుట ముఖ్య కర్తవ్యమే. చెడును బ్రతికించ రాదు. సమర్ధించ రాదు. తీర్ధ యాత్రల వలన పాపం నశిస్తుంది.

దేవీ, దేవతలను పూజించునపుడు మోసం, కపట గుణములు శాస్త్రప్రకారము నిషేధము మరియు దేవీ పీఠముల వద్ద యాచన కూడదు. ఆలయ ప్రాంగణములో యధాశక్తి మంత్ర జపం చేయాలి; నిజ భక్తుల సందర్శన మాత్రముననే పాపాలన్నీ ఎగిరిపోయి సుస్థిరమైన పుణ్య ప్రాప్తి లభిస్తుంది; పర దేవతను పూజించేవారలు, విష్ణుభక్తులు, యోగులు, ధర్మపరులు నరకానికి వెళ్ళరు. హరిహరుల నామములు జపించువారి సమీపమునకు వెళ్ళవద్దని యముడు తన భటులను ఆజ్ఞాపించెను; ఆచారం ఇలలో సుఖ జీవనము కలిగిస్తుంది. గుణాత్మిక జనవృద్ధికి బాటలు వేస్తుంది; పరిశుద్ధ వస్త్రములను ధరించి దేవిని ఆరాధించితే మంత్ర మహిమలు సిద్ధిస్తాయి; రాజ్యాలు పోయినవారికి, రాజ్యప్రాప్తి, దీర్ఘాయువు, కీర్తి వైభవములు సర్వ శుభములు కలుగుతాయి; జ్ఞాని ఉన్నచోట దేవతలు వాని మనస్సులో అంతర్లీనమై ఉంటారు. జ్ఞాన ప్రభలతో మనస్సు కలవాడు ఒక్కడున్నా చాలును వాని వలన భూమి పరమపావని అవుతుంది. వేదములు లోకానికి మర్యాద నేర్పేయి. మార్గదర్శకమైనవి. వానిని మన్నించాలి కానీ అవమానపరచరాదు; వేదములకు విరోధముగా చేయు ఉపన్యాసములను వినరాదు; ఉదయం నిదుర లేచినది మొదలు రాత్రి నిద్రించే వరకు రోజు తాను విన్నది, కన్నది, తిన్నది, చేసినది విమర్శించుకొని ధర్మానికి వ్యతిరేకతతో ఏదైనా జరిగితే అలాంటిది మరల చేయనని నిశ్చయము తీసుకోవాలి; వెళ్ళ రాని చోటుకి వెళ్ళడం అనాచారులకు దానం ఇవ్వడం, రహస్యముగా తప్పుడు పనులు చేయడం నిషిద్దములు.; ప్రతీ నిత్యము కనీసం స్నానానంతరము కొంత సమయమైనా దైవధ్యానం ఎంతో శాంతిని నెమ్మదినీ కలిగిస్తుంది; జపములు, హోమములు, యజ్ఞయాగాదూలు ఇండ్లలో చేయుటకు అశక్తులైనవారు నదీతీరములో లేదా ఆలయ ప్రాంగణములలో తమదైన జీవనములో ఆచరించుట ఉత్తమం.

పైన చెప్పినవి కొన్నైనా ఆచరించిన వారికి ఆచరించిన ఇహములో సుఖజీవనము, గుణాత్మిక జనవృద్ధి, మరియు జీవన్ముక్తి యుగమైనా సంప్రాప్తము అవుతాయి అనుటలో సందేహం ఎంతమాత్రం లేదు.

కల్కి అవతార వైశిష్ఠతలు

కల్కి" నామముతో శ్రీమహావిష్ణువు బ్రాహ్మణుని ఇంట అవనిపై అవతరించుట ఒక విశేషమైతే ఇంద్రుడు, ఆతని భార్య సచీదేవి ఆతని తల్లితండ్రులుగా గౌడ దేశములో, గంగా తీరములో శాంతి పురములో  అవతరించుదురు అనుట మరియొక విశేషము.

కల్కి ఖడ్గము, కవచము, డాలు ధరించి శ్వేత అశ్వమును అధిరోహించి దైత్యరూపులైన వారిని సంహరించి 16,000 సంవత్సరములు తపమాచరించగా ఆతపో అగ్నిలో ధగ్ధమైన లోకమంతా నిర్జీవమై పోతుంది. అప్పుడు ప్రళయకర మేఘములు ఉత్పన్నమై ప్రళయవృష్టిని కురుపిస్తాయి.





కలియుగ అంతము


చక్ష్షుషాంతరములో బ్రహ్మకి మధ్యాహ్న సమయములో పెద్ద తుఫాను రాగా దాని ప్రభావము వలన హిమాలయమే కంపించుతుంది. సప్త ద్వీపములతో కూడిన భూమి సముద్రములో మునిగి వేయి సంవత్సరముల కాలము ఇదే రీతిలో ఉండగా అధిక సంఖ్యలో ప్రాణికోటి వినాశనము జరిగుతుంది. ఉత్తర దిశలో లోకాలోక పర్వతము మిగిలివుంటుంది.

త్రిమూర్తులు యోచించి, భూమిని రక్షించుటకు తగిన మార్గమును అన్వేషించగా శ్రీమహావిష్ణువు ఆకాశమున శిశుమార చక్రమును స్థితం చేయగా అపుడు నక్షత్ర మండలములు, గ్రహములు యధాస్థితికి వచ్చి నింగిపై అమరిన జ్యోతిశ్చక్రమే  ధరణిపై ఉన్న నీటిని ఆవిరి చేసి యధా స్థితిలో భూమిని నిలుపుతుంధి. బ్రహ్మ తన ముఖము నుండి సర్వ విశారదుడు మహా మనిషి అయిన "సోముని (బ్రాహ్మణులు). రెండు భుజముల నుండి మహా బలశాలి, రాజనీతి పారంగతుడు, క్షత్రియ రాజు అయిన సూర్యుని (క్షత్రియులు); ఉరువులనుండి, సరితాపతి, రత్నాకరుడు వైశ్యరాజు అయిన "సముద్రుని" (వైశ్యులు); పదముల నుండి కళా విశారదుడు, శాస్త్రవిహిత కర్మష్టి, విశ్వ రచయిత శూద్ర రాజు అయిన "దక్షుని  (శూద్రులు) ఉత్పన్నం చేసెను).

రీతిలో యుగ విశేషములను దేవగురువైన బృహస్పతి ఇంద్రునితో తెలిపేను.

ఆకాశముపై ద్వాదశాదిత్యులు ఒక్కమారు ఉదయించగా జల మయమైన జగత్తుపై ఇండ్లు, భవనాలు, కొండలు, సర్వ జీవచరములూ మేటవేసికొని మరలా ద్వాదశాదిత్యుల  ప్రచండ తేజస్సుతో సృష్టికర్త అయిన బ్రహ్మ సర్వ జీవచరములను సృష్టించుటకు కార్తీక శుక్ల నవమి గురువారము అవతార పురుషుడు అయిన కల్కి అవని పైన ఆగమనమే అక్షయ నవమి లేదాయుగాది" పేర పర్వ దినముగా ధరణిపై అత్యుత్సాహముతో నూతన శకమున కృత యుగ ఆగమనమును స్వాగతించెదరు.

శ్రీహరి మరల కర్మ భూమిని రమణీయ స్థలముగా  చేసి, సర్వ సంపన్నము గావించి మరల అయోధ్యా నగర  రాజ్య పదవి ఇక్ష్యాకు వంశస్థులు అధిరోహించుట వలన కృతయుగ ఆరంభమునకు శ్రీకారము చుట్టబడుతుంది.



ధర్మవర్తనులు, వేదవేత్తలు, దైవభక్తులు, వివేకవంతులు యుగమైనా ఇలపై ఉంటారు. వారి వలన జగతి సుశోభితమై వెలుగు లీనుతుంది. ప్రజలు శాంతి సౌఖ్యములతో సదా సంతోష జీవనము గడుపుటకు ఆహ్లాదకర రీతిలో ధరణిని తీర్చి దిద్దుతారు. వారిలో మీరూ ఉన్నారని నేనంటాను. మరిమీరేమంటారు?