"సుగంధపుష్పాలెన్నోవేలు-
అనంత సుందర సువర్ణపూలు
కస్తూరి
మల్లిక కుందవనాలు-పారిజాత వన సౌగంధాలు
సృష్టిలోని
విశిష్ఠతలతో మానవ హృదయములలో పరివర్తన
తెచ్చి మనసున్న మనుషులుగా తీర్చి దిద్దుట కొరకు నిత్యజ్ఞాన చైతన్య స్రవంతిలో అనేక విభాగములలో అనేక
రూపములలో వ్యాప్తీకరించి తమ ఉనికిని తెలియచెప్పే
అసమాన్య పుష్పములుగా భాసించబడే:
ధైర్యం
ధర్మం
సహనం
సత్యం
అను విశేష
పుష్పముల విలువలను ఏర్చికూర్చి విశదీకరించడమే ఈ వ్యాస ముఖ్యోద్దేశ్యము.
ధైర్యం:-
విజయానికి
ప్రధమ సోపానమే "ధైర్యం". ఇది మనిషిలో నిలువెత్తున
పొంగిననాడు వారికి సాధించలేనిది ఏదీ ఉండదు. సాహసానికి
ప్రతిరూపమే "ధైర్యం". మానసికముగా బలహీనులైనవారు శారీరకముగా ఎంత సంపన్నులైనా, బలవంతులైనా
అపజయాన్ని భరించలేక తీవ్రవేదనకు గురి కావడము వారి
సహజ గుణం. అదే రీతిలో మానసిక
దారుఢ్యత కలవారు ఎన్ని అపజయాలు ఎదురైనా "ఆశ" అను దీప కాంతితో
ముందు వరియడము వారి సహజ గుణమును
ప్రస్ఫుటింప చేస్తుంది.
ప్రతీ
మనిషి పుట్టుకతోనే ధైర్య సాహసములను కలిగి ఉండక పోవచ్చు. జీవితములో
అనుభవాలు నేర్పిన పాఠములే వారిని ధైర్యవంతులుగా తీర్చి దిద్దుతాయి లేదా వారిని పిరికితనము
వైపు మళ్ళిస్తాయి.
ధైర్యం
అంటే చిన్నా పెద్ద తేడా లేక ఎంత
వారినైనా అవమాన పరచడము, బాధించడము కాదు. నిజమైన "ధైర్యం".
"నొప్పించక
తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ" అని సుమతీ శతక
ఉద్భోధ. కావున మన ప్రతాపాన్ని అల్ప
ప్రాణులను హింసించి పగ ప్రతీకారం తీర్చుకొని
అదే విజయము అనుకొంటే పొరపాటు. జీవిత
గమనంలో ప్రతీ మనిషి తనకు ఎదురయ్యే సమస్యలను
పరిష్కరించు కొనడానికి "ధైర్యము" ఎంత అవసరమో అదే
సమయంలో అంతే వినయము కలిగి
ఉంటే ధర్మం దారి తప్పదు.
విభిన్న
ధైర్యములు:-
1.శారీరక
ధైర్యం: శరీరం
పడే నొప్పులు బాధలు మరణ వేదనల నుండి
రక్షిస్తుంది.
2.మానసిక
ధైర్యం: మనలను అవమానకర చేతల నుండి మరియు
అపనిందల బారి నుండి కాపాడుతుంది.
3.సాంస్కృతిక
ధైర్యం: ఓర్పు, పట్టుదలను పెంపొందింప చేస్తుంది.
4.ఆదర్శవంత
మైన ధైర్యం: భయాందోళనలను అదుపులో పెట్టి మనలో చెలరేగే ప్రతికూల
ఆలోచనలను న్యాయపరంగా విశదీకరిస్తుంది.
5.సంగ్రామ
ధైర్యం: యుద్ధ వీరులను శతృవులను దునుమాడుటకు దేశ రక్షణను సుస్థాపితము
చేయుటకు దేశ
రక్షణకు పునాదిగా మారుతుంది.
6.న్యాయ
ధైర్యము: అన్యాయాన్ని ఎదిరించి న్యాయ పరిరక్షణకు చేయూతనిస్తుంది.
7.ఉద్యోగ
ధైర్యం: తమ తమ విధులను
ధర్మనిరతిలో నిర్వర్తించుటకు సహాయకరము అవుతుంది.
8.సంసారిక
ధైర్యం: పతీ పత్నుల సహాయ
సహకారములతో గుణాత్మిక జనవృద్ధికి బాటలు వేస్తుంది.
9.వైజ్ఞానిక
ధైర్యం: నవీన పోకడలతో విద్య,
వైజ్ఞానిక, వివిధ పరిశ్రమల, రవాణా అణ్వస్ర తయారీలో నూతన సాంస్కృతిక ప్రయోగములకు
దోహదకారిగా రూపు దిద్దు కొంటుంది.
10.సామాజిక
ధైర్యం: సమాజములో చెలరేగే అన్యాయ అక్రమాలను రూపు మాపి సురాజ్య
స్థాపన చేస్తుంది.
హిందూ
మతములో వేదములు ధైర్యం, సహనము ధర్మాన్ని నిలుపు సోపానములుగా అభివర్ణించేయి.
భయము, ధైర్యము మానవ జీవితములో ఒక
దాని సరసన వేరొకటి కలిసి
పనిచేస్తాయి.
"భయము
మనలో మనపై ఉన్న నమ్మకాన్ని
కూలదోస్తుంది
ధైర్యం
మనలో మనపై ఉన్న నమ్మకాన్ని
పెంపొందింప చేస్తుంది"
భయభీతులకు
లొంగక ముందుకు సాగేవారే నిజమైన విజేతలుగా పరిగణింపబడతారు. అది యుద్ధ రంగములోనైనా,
జీవన సమరంలోనైనా
"యుద్ధ
సమరంలో వీరుల ధైర్యం దేశ రక్షణకు
జీవన
సమరంలో వీరుల ధైర్యం స్వీయ రక్షణకు"
"టావోయిజం"
మత సంస్థాపకుడైన "లవోట్స్" తన బోధనలో "ప్రేమ
అనేది మనుష్యులలో ధైర్యాన్ని పెంపొందింపచేస్తుంది" అని తెలిపెను.
ప్రేమ
అనేది ఒక శక్తివంతమైన ఆయుధం.
అతులిత ధైర్యాన్ని నింపే సాధనము. మన కోసం తపన
పడేవారు, ఆరాటపడే వారు, అభిమానించే వారు, ఆరాధించే వారు ఉన్నారు అను
తృప్తే మనిషి లోని ధైర్యాన్ని పెంపొందింప
చేసి సంతోష భరితులనుగా తీర్చి దిద్దుతుంది. ఎంతటి కష్టాన్ని అయినా ఎదిరించ గలిగే ఆశకు ఊపిరి పోస్తుంది.
గ్రీకుల
వర్ణనలో "ఆశ" అనునది అత్యుత్తమ తెలివైన ఆయుధము" అని తెలిపిరి. వారి
సంస్కృతిలో ధైర్యం మనిషి లోని విజ్ఞతను ప్రతిబింపచేసే
శక్తిగా వర్ణించిరి.
ఇస్లామిక్
మతములో ధైర్యం మనసుని అదుపులో ఉంచి దుష్ట శక్తులను
అణచుటకు ఉపయుక్తకరమైన ఆయుధమని తెలుపుట ఒక విశేషమైతే వారి
మత సంస్థాపకుడైన మహమ్మద్ ప్రాఫిట్ "శాంతి సహనము అను గుణములతో మనపై
మనకున్న నమ్మకము సడలనంత కాలము ధైర్యం అనునది ఎల్లప్పుడు సత్యానికి అసత్యానికి నడుమ విచక్షణలను విశదీకరించి
మన నైతిక విలువలను పెంపొందింప చేస్తుంది" అని వర్ణించుట మరొక
గొప్ప ధర్మ విశ్లేషణ.
రోమన్
తత్వవేత్త "సి ఇ రో"
(106-43 బి.సి.ఇ) ధైర్యానికి
ఉన్న బలాలు విజ్ఞత, న్యాయము, నిగ్రహ శక్తి, ధీరత్వం. వీని ప్రభావం మనసుపై
ప్రభవించి ఉత్తమ తత్వాన్ని ప్రభోధించి జగతిలో మానవత్వం మూర్తీభవించిన మనుషులుగా తీర్చి దిద్దుతాయి" అనితెలిపెను.
ధైర్యం
మనలో చెలరేగే ప్రతికూల భావములను నిర్మూలించి స్వతంత్ర భావములను పెంపొందింప చేస్తుంది. కావున ప్రేమ అను ఆయుధముతో ప్రపంచాన్నే
గెలవగలము అనునది సర్వ మతముల వివరణ.
ఇన్ని
విలువలతో కూడిన "ధైర్యం" అను పుష్పాన్ని దేవికి
సమర్పించితే ఆమె కురిపించే అశేష
ఆశీస్సులతో విజయము మనకు సదా సంప్రాప్తము
అవుతుంది అని నేనంటాను. మరి
మీరేమంటారు?
ధర్మం
“యధా
యధాహి ధర్మస్య గ్లానిభవతి భారత - అభ్యుద్ధానం అధర్మస్య - పవిత్రాణాయ సాధూనాం - వినాశాయ విచుష్కృతాయ – ధర్మ సంస్థాప నార్ధాయ
సంభవామి యుగేయుగే"
అనునది
భగవద్గీత ప్రభోధమైతే మన నిత్య పూజలో
సంకల్ప సమయములో ఏ దేవుని స్మరించినా
"ధర్మ, అర్ధ, కామ, మోక్ష, ఫలపురుష
సిధ్దికొరకు మరియు సత్సంతాన సౌభాగ్య వృద్ధి కొరకు వేడుకొనుట సర్వ సామాన్యము.
ఈ ధర్మ నిరతిలో అలరారే
ఈ పుష్పము విలువ కనుగొనుట అసాధ్యము. కారణము "ధర్మము" అనుక్షణము కర్తవ్య పాలనతో మిళితమై ఉంటుంది. సోమరితనం దరిచేరకుండా ప్రతీ ఒక్కరు తమ తమ వృత్తులలో
లీనమై సదా సహాయ సహకారములతో
అంకిత భావం కలిగి ఉంటారో
వారందరూ నా దృష్టిలో ధర్మ
పరిరక్షణాధికారులే అవుతారు.
పురాణ
కాలములో సర్వమానవ సంక్షేమము కొరకు ఋషులు, మునులు, యోగులు యజ్ఞయాగాదులులతో దేవతలను సంతృప్తి పరచి ధరపై ధర్మ
రక్షణకు మార్గము చూపితే నేటి నవీన యుగములో
విజ్ఞానులు ధర్మాన్ని "కర్తవ్యపాలన"
తో సరిపోల్చి దీనిని మించిన యజ్ఞ యాగాదులు జప
తపములు లేవు అని సులభరీతిలో
ధర్మపరిరక్షణ సుస్థాపితమును చేసిరి.
“ధర్మాధార
– ధనాధ్యక్షా – ధనధాన్య వివర్ధినీ ధన్యా - ధర్మిణీ; ధర్మవర్ధినీ" అని
శ్రీ లలితాదేవిని స్తుతించుతాము. అనగా ఆమె ధర్మానికి
ఆధారమైనది. ధర్మానికి ప్రతిరూపం. సర్వ ధర్మాలను వృద్ధిపరచ
గలిగే శక్తిమంతురాలు. సర్వ ధన సంపత్తులకు
అధిష్ఠాన దేవత. తనను నమ్మి ఆరాధించిన
భక్తులను ధన ధాన్య సంపత్తులను
ధర్మనిరతిలో సంపాదించి వాటిని ధర్మనిరతిలో కాపాడుకొనమనే నీతి సూత్రం సర్వ
మానవాళికి ఈ శ్లోకములో విశదీకరించడమైనది.
ఆర్య
సంప్రదాయ ప్రకారము వేదములు, మానవ జీవనమును నాలుగు
ఆశ్రమ విభాగములుగా విభజించి వారి వారి ధర్మములను
నిర్దేశించడమైనది.
బ్రహ్మచర్య
ఆశ్రమము:- గురువు వద్ద విద్యను అర్ధించుట
విద్యార్ధి ధర్మము. సర్వ విద్యల్లో పరిపూర్ణతను
సంపాదించిన తదనంతరము గురువు కోరిన దక్షిణను "గురుదక్షిణ”
గా సమర్పించి భావి జీవన పధము
వైపు నడచుట విద్యార్ధుల ధర్మముగా పరిగణించబడినది.
గృహస్థాశ్రమము:- వివాహానంతరము దంపతులు సంసార జీవనము చేసి గుణాత్మిక జన
వృద్ధిని పెంపొందింప చేయుట, అతిధి అభ్యాగతులను ఆదరించుట, అనునవి భార్యాభర్తలు నిర్వహించు ప్రముఖ ధర్మముగా గృహస్థాశ్రమములో విశదీకరించడమైనది.
వానప్రస్థం:- తమ తమ బాధ్యతలను
సక్రమ రీతిలో ముగింపు చేసికొని ఇహలోక బంధాలకు దూరముగా ప్రకృతికి చేరువగా ఆనందముగా, తృప్తిగా, వనములలో వశించు చేయు ప్రశాంత జీవనమే
వానప్రస్థాశ్రమముగా వివరించబడినది. ఇది ఒక రకంగా
చెప్పాలంటే శాంత పూర్వక నిరాడంబర
జీవితమే అవుతుంది. ఇచట వశించువారు నిర్లిప్తతో,
నిరాడంబరముగా నిశ్శబ్ధ వాతావరణములో తల్లీనమౌతారు.
సన్యాస
ఆశ్రమము:- సర్వము త్యజించి
సదా భగవంతునికి చేరువగా ధ్యానంతో, తపములో గడిపే తపోజీవనమే సన్యాస ఆశ్రమముగా పరిగణించబడినది. ఈ రీతిలో తమ
జీవనము పరి సమాప్తము చేసికొనడమే
వీరు తమ ముఖ్య ధర్మముగా
భావిస్తారు.
ఆత్మ
సంతృప్తిని పెంపొందింప చేయు ధర్మములు:-
ఉద్యోగ
ధర్మం:- స్వంత
ఆర్జనకు దోహదకారి అయిన ధర్మం.
న్యాయ
ధర్మం:- సదా
న్యాయమును నీతిని ఉన్నత స్థితిలో నిలిపి పరిరక్షించు ధర్మము.
రాజ
ధర్మం:- దేశమును,
ప్రజలను సంరక్షించుట కొరకు నేటి కాలములో సంబంధిత
అధికారులు, మంత్రులు, పాటించ వలసిన ధర్మముగా నిర్దేశింపబడినది.
దానధర్మం:-
ధర్మ నీతిని పాటించు వారు విశేష రీతిలో,
వివిధ సమయములలో దానము చేసి ఆత్మ సంతృప్తిని
పెంపొందింప చేసి కొనుట ఈ
ధర్మము యొక్క ముఖ్యోద్దేశ్యము. తగు విచక్షణా జ్ఞానముతో
అపాత్ర దానం కాకుండా చేయు
దానమే సద్గతులను సంప్రాప్తింప చేస్తుంది అనునది వేద విశ్లేషణ. "వర్క్
ఈస్ వర్షిప్" అని ఆంగ్లములో తెలిపితే
మన వేదములు "ధర్మో రక్షతి రక్షితః" అను నీతి సూత్రాన్ని
ప్రభోధించేయి. అనగా ధర్మాన్ని మనం
రక్షించితే తిరిగి ధర్మం మనల్ని కాపాడుతుంది అను నీతి సూత్రాన్ని
జనతకు నిర్దేశించేయి.
స్వధర్మాచరణను
అనుసరిస్తూ కర్తవ్యపాలన చేయుటలో ఎవరు తల్లీనమై ఉంటారో
వారు దైవ కృపకు పాత్రులు
కావడములో సందేహము ఎంత మాత్రములేదు. ఈ
జగతిలో వారిని సత్కరించడము అనునది ధర్మానికి విజయాన్ని సంప్రాప్తింపచేయడము ఒక విశేషమైతే ధర్మాన్ని
ధర్మాసనముపై ప్రతిష్ఠాపన చేయడము మరి యొక విశేషము.
ఇన్ని విచక్షణలతో కూడిన ఈ విలువైన పుష్పము
దేవి పాదములపై అర్పించుట అనునది మనలోని ధర్మనిరతిని ప్రస్ఫుటింప చేయడమే అని నేనంటాను. మరి
మీరేమంటారు?
సహనము:-
మానవ
ఊహలకు అందనంత ఎత్తులో విరిసి అలరారే పుష్పమే "సహనము" అది ఎంత కఠిన
కార్యమైనా దాని ఫలితం మాత్రం
నిశీధిలో పయనించే వారికి కాంతి కిరణమే అవుతుంది. సుగమమైన మార్గం చూపుతుంది.
ఆది
నుంచి భారత దేశము "శాంతికాముక
దేశము" గా పేరొందినది. "సర్వేజన సుఖినోభవంతు"
అని శత్రువులు, మిత్రులు అను బేధములు లేకుండా
అందరి క్షేమాన్ని కాంక్షించి వారి సుఖ సంతోషములను
సంప్రాప్తింప చేయుమని సదా ప్రార్ధించే విశాల
హృదయం మనది.
సృష్టి రక్షకుడైన
శ్రీ మహావిష్ణువు రూపమును వర్ణించునపుడు
'శాంతాకారం-భుజగశయనం-విశ్వాకారం -గగన సదృశం" అని
స్తుతిస్తాము
శాంతం,సహనం అను సద్గుణాలతో
మూర్తీభవించిన నీలమేఘశ్యాముని ఆకృతి శాంతానికి ప్రతిరూపమై విశ్వాకారముదాల్చి నీలగగనవర్ణముతో శ్లాఘించబడుట
మరియు
"విశ్వప్రియే-విష్ణుమనోనుకూలే"అని స్తుతించబడు లక్ష్మీదేవిని
శ్రీమహావిష్ణువు తన ఎదపైదాల్చెను.ఆమెసదా
ఆతని మనోభావములకు అనుకూలవతిగా మరియు ప్రియసతిగా మంగళకర రూపముతో తననుకొలిచే అశేష భక్తులకు ధనధాన్యసంపత్తులను,స్త్రీలకు సౌభాగ్య సుమంగళీచిహ్నములను ప్రాప్తింపచేయుట గణనీయమే.
సమానత్వము,
సౌభాతృత్వం మనదేశ ముఖ్య ప్రమాణికతలు. ఇతరులపై మన ప్రేమాభిమానములు, సహనశీలత్వములను
కొలిచే సాధనములు.
భూమికి
అధిష్ఠానదేవత "భూదేవి" సహనములో, శాంతములో ఆమెతో సరిపోలు వారు లేరు. ఆమెలో
ప్రభవించే విశ్వము యొక్క వివిధాకృతులు శ్రీ లలితా నామావళిలో
ఈ రీతిలో వర్ణించబడినవి:-
1.విశ్వమాత:- చరాచర
జగతికి జనని రూపుతో భాసిల్లు
దేవి "విశ్వమాత"
2జగద్ధాత్రి:- జగములను
తనలో నిబిడీకృత పరచిన శక్తిమయి "జగద్ధాత్రి"
3విశ్వేశ్వరి:- వాయువులావిశ్వమంతా
వ్యాపించిన విశ్వేశ్వరుని అర్ధాంగి "విశ్వేశ్వరి"
4విశ్వాధారా:- విశ్వమునకు
ఆధారమైన రూపము "విశ్వాధారా"
5విశ్వధారిణి:- విశ్వమునే
తనలో ధరించుటవలన "విశ్వధారిణి"
6విశ్వతోముఖి:- సమస్త
లోకములను తన ముఖవర్చస్సులో ప్రతిబింబింపచేయు
శక్తిమయి "విశ్వతోముఖి"
7విశ్వభ్రమణకారిణి:- సూర్య
చంద్ర నక్షత్ర రాశులతో కూడిఉన్న కాలచక్ర పరిభ్రమణమునకు ఆధారభూతమై విశ్వాన్ని తన ఆధీనములో పరిభ్రమింపచేసి
కాల గణనమునకు ఆధారమై శక్తి కలది కావున "విశ్వభ్రమణకారిణి"
8విశ్వభారతి:- సర్వ
కళలను తనలో ప్రతిబింబింప చేసికొని
జగములను ఆనంద డోలికలలలో పరవశింపచేయు
కళామయి "విశ్వభారతి"
9విశ్వగ్రాసా:- ప్రళయ
సమయములో సమస్త చరాచర విశ్వములను అతి భయంకర కాళీరూపములో
ఊహించలేనంత పరిమాణములో కబళించి ఆహారముగా తినే శక్తిమంతురాలు "విశ్వగ్ర్రాసా"
ఈ రీతిలో ఎన్నో విభిన్న నామావళిలతో అభివర్ణించబడినది.
ఏ కాలమైనా ఏయుగమైన గగనాంత రోదసిలో పయనించే నవీనవిజ్ఞానవంతులైనా భారత ఇతిహాసిక పురాణవేదములలో
నిక్షిప్తమైఉన్న విజ్ఞతముందు శిరసువంచి తమవినయవిధేయ తలను ప్రస్ఫుటింపచేయవలసినదే.కాలచక్రభ్రమణములో మనవిజ్ఞత
తాత్కాలికముగా అవరోధింపబడినా మరల మన కఠోరపరిశ్రమతో
పూర్వ వైభవమును తప్పక సంప్రాప్తింప చేసికొనగలదు.
సహనములో
ప్రకటితమయ్యే గుణములు:-
1.కోపాన్ని
అధిగమించే గుణము
2.ఎన్ని
కష్టాలైనా, నష్టాలైనా, బాధలనైనా ఓర్పుతో సహించుటకు తగిన శక్తి
3.చేసే
పనిలో సమర్ధత
4. అతి
క్లిష్టమైన సమస్యలకు పరిష్కార మార్గము
5.ప్రతికూలముగ
చెలరేగే ఆలోచనలనుండి విముక్తి
6.నిరాశ
నుంచి బయట పడే మార్గము
7.ఇతరుల
తప్పులను క్షమించే గుణమును పెంపొందించి విషయ విశ్లేషణకు దోహదకారి
8.ఇతరుల
మనోభావాలను వినుటకు, మన భావములను వ్యక్తీకరించుటకు
సంభాషణలో సరి అయిన నిర్ణయమునకు
సహయకారి మరియు
9.మనలో
చాలామంది తమ మదిలో చెలరేగే
ఎన్నో కోరికలతో తమకు ఏమి కావాలో
తెలిసికొనలేని అయోమయ స్థితిలో అల్లాడు వేళలో వారికి సరియిన నిర్దేశికతను తెలిపే విజ్ణాని
ప్రతీ
మనిషి వారి వారి గమ్యం
సురక్షితముగా చేర్చు మర్గదర్శని మరియు సహనముతో
కూడిన వాగ్వాదములు నేర్పరితనానికి నిదర్శనము.
ఇన్ని
గుణములతో కూడిఉన్న "సహనము" ఒక కళగా మానవ
జీవనములో తనదైన ప్రత్యేకతను నిలుపుకొన్నది.
కొన్ని
మతములు సహనాని కున్న గొప్ప తనమును ఈ రీతిలో వర్ణించేయి:-
1.హిందూ
మతము:- హిందువుల
భావనలో సహనము ఒక సద్గుణము. నమ్మకముతో
కూడిన సహనము మనసుని శరీరాన్ని అదుపులో ఉంచి ఇతరుల దుశ్చర్యలను
క్షమించగల ఔదర్యాన్ని పెంచి ఆరోగ్య రక్షణ మరియు సర్వ కార్యములలో విజయాన్ని
ప్రాప్తింప చేస్తుంది.
2.జుడాయిజం:- సహనము
దేవుని యొక్క ప్రతి రూపము మరియు శక్తివంతమైన ఆయుధం అనునది వీరి నమ్మకము. ఆతనికి
అతి సమీపమున అతి దగ్గరగా నిలచి
జీవన అవరోధముల నుండి, దుష్టశక్తుల నుండి కాపాడుటకు తగిన శక్తిని ప్రసాదిస్తుంది
అనునది వీరి విశ్వసనీయత.
3.ఇస్లాం
మతం:- సహనము
అనునది భగవంతునికి అతి చేరువలో దరిచేరుటకు
మరియు అల్లాకు అత్యంత ప్రీతి పాత్రకరమైనది. తన కరుణను సదా
సహన వంతులపై కురిపించే అల్లాను
చేరుటకు ప్రధమ సోపానము.
4.బౌద్ధమతము:-
సహనము
వలన మనలోని సమర్ధత పెరిగి ధ్యానము వలన మనస్సుని అదుపులో
ఉంచుకొన గలిగే శక్తిమంతులము అవుతాము.
5.క్రైస్తవమతం:-
మనిషిలోని
సద్గుణములలో సహనం అత్యంత ప్రముఖమైనది.
ఎన్నో సమస్యలకు పరిష్కారము చూపించే శక్తివంతమైన ఆయుధము.
కొన్ని
సమస్యలు పరిష్కరింప బడుటకు ఎంతో కాలము వేచి
చూడవలసినపుడు మనలోని సహనము అంతము కాగా దాని స్థానే
కోపము, ప్రతికూల ఆలోచనలు పట్టుదలను రెచ్చగొట్టే వ్యతిరేక భావనలు అధికము అవుతాయి. ఆ సమయములో తాత్కాలికముగా
ఆ పనిని ఆపివేసి విశ్రాంతిగా ఆలోచనచేసి ఓపికతో, ఓర్పుతో తిరిగి ప్రారంభిస్తే విజయవంతులము కావడము తధ్యము.
ఎవరైనా
తమ సంభాషణలో వాగ్వివాదములు అదుపు తప్పిన వేళలో సహనముతో కూడిన మితభాషిత్వము ఎల్లవేళలా ప్రతీ రంగములో గురి తప్పని ఆయుధమే
అవుతుంది ఈ రీతిలో:-
1.న్యాయ
పరిరక్షణలో న్యాయ వాదులకు సరి అయిన తీర్పును
ప్రస్ఫుటింప చేయు "న్యాయ వాదిగా
2.విద్యా
బోధనలో విద్యార్ధుల మనస్సులో చెలరేగే కఠినమైన సందేహములను నివృత్తి పరచే గురువుగా
3.వైద్య
రంగములో రోగుల వ్యాధులను రూపుమాపి అనుకూల ఔషధములను నిర్దేశించు వైద్యురాలిగా
4.వ్యాపారస్థుల
అమ్మకాలు, కొనుగోలు లావాదేవీలలో వారికి సక్రమ మార్గములను నిర్దేశించి లాభాలను సంప్రాప్తింప చేసే వ్యాపారిలా
5.గృహ
సంబంధిత బాంధవ్యాలను సక్రమ రీతిలో పెంపొందింప చేయు గృహిణిలా
6.దేశప్రజల
సంక్షేమము కొరకు రాజకీయ నాయకులు సక్రమ రీతిలో ప్రణాళికలు చేయు సమయములో వారి
ఊహలలో సదా నిలిచే రాజనీతిజ్ఞురాలిగా
ఎన్నో మరెన్నో రీతులలో శక్తి ప్రదాతలా సతతము అన్ని రంగములలో సఫలీకృతమైన "సహనము" ఒక కఠినాతికఠినమైన తపస్సు
లాంటిదే మరియు మన అంచనాలకు అందనిదే.
ప్రపంచాన్నే
శాసించగల అతి శక్తివంతమైన శాంతి
మంత్రము భారత దేశ విద్యార్ధులు
తమ తమ నిత్య ప్రార్ధనలో
ధ్యానించడములో మన ఔన్నత్యాన్ని నిరూపణ
చేసేది
"సహనా
వవతు - సహనోభునత్తుతు
సహ వీర్యం కరవావహై - తేజస్వినా వధీతమస్తు
మావేర్వి
ష్యావహై
ఓం శాంతిః శాంతిః శాంతిః"
"సర్వ
మానవాళి సురక్షితముగా ఉండాలి
సర్వ
మానవాళికి సమృద్ధికరమైన ఆహార్యం లభ్యం కావాలి
సర్వ
మానవాళి శక్తివంతముగా కలిసి పని చేయాలి
సర్వ
మానవాళి విజ్ఞతతో శాంతి నెలకొన్న హృదయాలతో వివేకవంతులుగా తీర్చిదిద్దబడి శతృత్వము లేక దైవ శక్తితో
ప్రకృతిలో లభ్యమయ్యే వనరులను సంరక్షింపమని తెలిపే శాంతి మంత్రమే ఇది.
సర్వ
కళలనూ తనలో ప్రతిబింబింప చేసికొని
జగములను ఆనందడోలికలలో ఓలలాడించి పరవశింప చేసి విజ్ఞతతో కూడిన
భారత దేశ సంస్కృతీ సంప్రదాయములను
విశ్వమానవాళిలో ప్రకాశింప చేసి గుణాత్మిక జనవృద్ధికి
ధీఠుగా ధీరత్వముతో బాటలు వేసి సహన సౌశీల్యములతో
మూర్తీభవించిన సుసంపన్నురాలైన "విశ్వభారతి" నాటికీ, నేటికీ, ఎప్పటికీ ఆదర్శవంతమే అవుతుంది అని నేనంటాను. మరి
మీరేమంటారు?
భారత
జాతీయ చిహ్నముపై సువర్ణాక్షరములతో లిఖింపబడి ఉన్న సందేశమే "సత్యమేవజయతే"
ఈ వేద నుడికారము మన
ఘన విజయాలకి, కీర్తిప్రతిష్ఠలకి సంకేతముగా దేశ విదేశాలలో భేరీ
నినాదములతో ప్రతిధ్వనింపబడు అపూర్వ వచనము.
తెలుగు
నుడికారములో "నీరుపల్లమెరుగు నిజముదేవుడెరుగు" అనునది ఒకవిశ్లేషణ. నీటి ప్రవాహానికి ఎన్ని
అడ్డంకులు, అవరోధములు కల్పించబడినా పల్లపు దిశలోనే పయనిస్తుంది. అదే రీతిలో సత్య
సంభాషణలకు ఎన్ని విఘ్నములు కల్పించినా అవి తన పయనమును
దేవీదేవతల ఆశీస్సులతో తిరుగులేని రీతిలో మున్ముందుకి సాగించి జీవనపధములో విజయాన్ని సంప్రాప్తించ చేయగలిగడమే వారి ధ్యేయం.
"సత్యం"
మనిషిలోని నీతి నిజాయితీలను వెలికితీసే
ఆయుధం."సత్యమేవ జయతే" అనుసూక్తి "ముండకోపనిషత్తు" అథర్వణ వేదములోని విభాగములో నుండి వెలికితీయుట హర్షదాయకమే. తదనంతర కాలములో మన జాతీయ చిహ్నముపై
నిక్షిప్త పరచడము మన భారతీయ సంస్కృతీ
సంప్రదాయములను జగతికి చాటి చెప్పడమే.
సత్యం
మనిషిలో పెరిగే విశ్వాసానికి, వినయ విధేయతలకు, అత్యంత
ఖచ్చితమైన తత్వానికి మరియు నీతి నిజాయితీలకు నిదర్శనము.
ధరపై శ్రీ మహావిష్ణువు యొక్క
దశావతారముల ప్రముఖ ఉద్దేశ్యము భువిపై ధర్మాన్ని పరిరక్షించుట, సత్యాన్ని ప్రతిష్ఠాపించుట అను సూత్రములతో నిబిడీకృతమై
ఉన్నది.
మనల్ని
ఎన్నో విపత్కర పరిస్థితుల నుంచి రక్షించ గలిగేది, ఇతరులలో మనపై నమ్మకాన్ని, విశ్వాసాన్ని
అభిమానాన్ని పెంపొందింపచేయ గలిగేది సత్యమే. జీవన సమరంలో అసత్యం
తాత్కాలికంగా గెలుపొందినా సత్యము వచ్చి ఎదురు నిలచిన అసత్యం తన వికృతరూపును కోల్పోయి
నిర్జీవమౌతుంది.
సత్యం
సర్వసహజముగా స్వచ్చమైనది. సుందరమైనది. యుగయుగాల భారత చరిత్ర తరచి
చూసినా ఎందరో మహాత్ములైన, మహిమోన్నతులైన ఋషులు, మునులు, యోగులు, దేశాధినేతలు, చక్రవర్తులు, మహాపతివ్రతలు ఎందరో సత్య నిరూపణగావించు కొని
ఇలపై ధర్మమును ప్రతిష్టింప చేసిన వైనములు ఎన్నో నాటికీ, నేటికీ సాక్ష్యాధారములతో చరిత్ర పుటలలో సజీవత్వముతో నిలచి ఉన్నవి.
శ్రీ
లలితాదేవి యొక్క నామ స్తుతిలో ఆమె
సత్యమైన రూపము ఈ రీతిలో వర్ణించబడినది.
1.సత్యసంధా
సత్య
మనే ప్రతినతో శోభిల్లుదేవి. సత్య మార్గమును అనుసరించమని
తన భక్త కోటికి ఉపదేశించి
సత్య మను తన రూపముతో
సంధానపరచునది.
2.సత్యజ్ఞానందరూపా-సామరస్య పరాయణా
సత్య
మనే జ్ఞానముతో కూడిన ఆనందకరమైన రూపము దాల్చిన సమ్మోహనకరమైన రూపిణి. శివపార్వతులు సరిసమానమైన భావములతో, ఆలోచనలతో, నవరసాలతో కూడిన అభినయనములతో ఆది దంపతులుగా కీర్తించ
బడుట వలన సామరస్యపరముగా వారు
రెండుగా వెలసిన ఏక రూపముగా ఆరాధించుట
మన సాంప్రదాయము. ఇదే భిన్నత్త్యంలో ఏకత్త్య
నిరూపణకు సాక్షాత్కారము.
3.సత్యవ్రతా
తనను
కొలిచే భక్తులు ఏ రీతిలో పూజించినా
తాను వారిని సర్వదా రక్షించుతానని సత్యవ్రతముతో అలరారు కరుణామయి.
4.సత్యరూపా
సాగరమేఖలా:-
సర్వ
లోకములకు ఆధారమైనది భువిపై నెలకొన్న సప్త ఊర్ధ్వ లోకములపైన
సత్యలోకము ఉన్నది. అది ఆమె నివాసము.
అదే రీతిలో భూమికి దిగువున సప్త అధోలోకములు అగాధమైన
జలరాశితో నిండి ఉంటాయి. ఆ జలాలపైన భూమి
తేలుతూ ఎటువంటి ఉప్పెనలకు లోను కాకుండా సప్త
సముద్రములను తన నడుముకు వడ్డాణముగా
బిగించి హద్దులు దాటకుండా జగతిని కాపాడుటకు గల కారణము సత్యరూపములో
ఉన్న ఆకర్షణ శక్తే అనునది వేద వర్ణన. సర్వ
ప్రకృతిని ఆమె తన అలంకరణలో
ధరించిన సౌందర్యవతి.
కృత
యుగానికి మరోపేరు "సత్యయుగం" ఈ యుగములో వశించు
ప్రజలు సత్యసంధులు. ఈ యుగధర్మమే "సత్యవాక్పరిపాలన"
అయోధ్యా నగర పరిపాలకుడైన హరిశ్చంద్ర
చక్రవర్తి సత్యవాక్యమును నిలుపుట కొరకు ధర్మ ప్రతిష్ఠాపన కొరకు
అనేక కష్టనష్టములను నిర్భీతితో ఎదుర్కొని విజయమును సంప్రాప్తింప చేసికొనెను. ఆతని సత్య పరిపాలనకు
మెచ్చిన దేవతలు సశరీరముతో దేవ విమానములో స్వర్గారోహణము
సంప్రాప్తింప చేసిరి. ధరిలో ఆతని పేరు "సత్యహరిశ్చంద్ర"
అని శ్లాఘించబడినది.
సత్యాన్ని
తెలిపేవారు ఎన్నటికీ తలవంచి మాటాడరు. ఎదుటి మనిషి కనులలోకి సూటిగా చూసి మాటాడే ధైర్యం
వీరి స్వంతం.
"సత్యం"
మనపై మనకు నమ్మకాన్ని పెంపొందింపచేస్తుంది.
అసత్యం
మనపై మనకున్న నమ్మకాన్ని కూలదోస్తుంది"
కావున
శిక్షని అనుభవించినా ఫరవాలేదు. తగు సమయములో సత్యాన్ని
వెల్లడించి మనసులో చెలరేగే ఆందోళనల నుంచి విముక్తులము కావడము సర్వదా శ్రేయస్కరం. ఆరోగ్య రీత్యా కూడా ఎన్నో సమస్యల
నుండి సంరక్షించే ఔషధముగా పనిచేస్తుంది.
ఏ మతమైనా, ఏ భాష అయినా,
ఏ ప్రాంతమైనా, ఏ సంస్కృతీ సంప్రదాయమైనా
సత్యానికి ఉన్న విలువలను అ నేక ప్రవచనముల
ద్వారా మానవాళికి వివిధ మతముల ద్వారా ప్రభోధించిన మహనీయుల సుభాషితములు:-
హిందూమతము:- భగవద్గీత
సారాంశము ప్రకారము శ్రీ కృష్ణుడు తానే
సత్యానికి ప్రతి రూపమని కర్మను సక్రమరీతిలో ఆచరించి దాని ఫలితమును తనపై
నిలుపుమని ఆదేశించెను.
మనుస్మృతి:- నిజాన్ని
చెప్పడానికి మనిషిలో నిజాయితీ మరియు సూటిగా నిక్కచ్చిగా నిర్భీతితో స్పష్టముగా సత్యాన్ని వెలువరించు గుణముల వలన ప్రపంచ సమస్యలు
ఎన్నో శాంతియుతముగా పరిష్కరింప బడతాయి అని విశ్లేషించెను.
జైనమతం:-
సత్యము
అనునది ఒకే మార్గములో అన్వేషింపబడదు.
ఎన్నో రీతులలో, ఎన్నో విభిన్న రూపములలొ నిండి ఉంటుంది. ఒక నిజాన్ని వెలికి
తీయాలి అంటే ఆ మార్గమునకు
నమ్మకమే ఆధారము. ఈ దృక్కోణములో
వెలికి తీసే సత్యం నిప్పులో
కాలి స్వచ్చతను నింపు కొన్న మేలిమి బంగారములా మెరుపులీనుతుంది.
బౌద్ధమతము:-
1.సత్యము
అనునది దుఃఖ విముక్తిని కలిగించుతుంది.
2.సత్యం
దుఃఖానికి కారణములను వెలికి తీస్తుంది.
3.సత్యం
దుఃఖాన్ని దూరాన్ని
చేస్తుంది
4.సత్యం
దుఃఖవిముక్తికి ఒక సుగమమైన మార్గం
సూచిస్తుంది
క్రైస్తవమతం:-
ట్రూత్
మే బి బ్లేమ్డ్ బట్
కేనాట్ బి అషేమ్డ్"
నిజాన్ని
తప్పని ఆరోపించ వచ్చును. కానీ ఎప్పటికీ అవమాన
పరచలేము.
బైబిల్
ప్రభోధించిన మార్గములో "సత్యం" అనునది మనిషిలోని నిజాయితీకి దర్పణం.
సత్యం
అనునది మనిషిలోని నిక్కచ్చితమైన స్వభావానికి తార్కాణం
సత్యం
అనునది భగవంతునికి మారు రూపం
సత్యం
అనునది ఒక ఆధ్యాత్మిక వచనం"
జుడాయిజం:- సత్యం
అనునది ఒక దైవాంశ సంభూతమైన
ఆత్మావలోకనం. సర్వ జగతిని ఎదురు
లేకుండా ఏక చ్చత్రాధిపత్యముగా ఏలే ఏకైక
సరిపోలికలు లేని విశేష ప్రేరణను
సంప్రాప్తింపచేయు ధీఠైన ఆయుధము.
ఇస్లామిక్
మతం:- సత్యము
యొక్క నైతిక విలువలను ఖురాన్ ద్వారా వివరించడము ఒక విశేషమైతే సత్యము
అనునది ఎన్నో అడ్డంకులను తొలగించుకొని జీవన పయనములో ముందు
వరయుటకు తోడ్పడుతుంది అనునది వీరి ప్రగాఢ నమ్మకము.
ఇన్నివిలువలతో
కూడిన ఈ "సత్యము" అను పుష్పమును ఎంత
కష్టమైనా నష్టమైనా అందనంత ఎత్తులో విరిసి అలరారే రీతిలో అమరి ఉన్నా అందుకొని
మనలోని నిర్మలత్వానికి, నిజాయితీకి గురుతుగా దేవి పాదములచెంత అర్పించడము
మనలోని సత్యనిరూపణకి సంకేతమే అవుతుంది అని నేనంటాను. మరి
మీరేమంటారు?
అష్టపుష్పములలో
వెలిగే నీతి సూత్రములు
1.మానసిక
సౌందర్యాన్ని మించిన అందం (మనస్సు)
2.పవిత్ర
ధ్యానాన్ని మించిన పరిపూర్ణత (ధ్యానం)
3.పరిసర
స్వచ్చతను మించిన ఆరోగ్య నీతి (స్వచ్చత)
4.అహింసను
మించిన కారుణ్యం (అహింస)
5.ధైర్యాన్ని
మించిన రక్షణ కవచం (ధైర్యం)
6.ధర్మాన్ని
మించిన కర్తవ్య పాలన (ధర్మం)
7.సహనాన్ని
మించిన నైపుణ్యత (సహనం)
8.సత్య
నిరతిని మించిన విజయ రహస్యం (సత్యం)
అవనిపై లేవు.
ఏ యుగమైనా ఏకచ్చత్రాధిపత్యముతో జగముల నేలే విశేష విశిష్ఠ
సూత్రములు.