5.త్యాగ బోధన లేని మతం
నేడు ప్రపంచ దేశాల్ని
అల్లకల్లోలం చేసి విచక్షణా జ్ఞానాన్ని నశింపచేసే అతి ఘోరమైన ప్రమాదం "త్యాగ బోధన లేని మతం"
ఏ మతమైనా ఏ బోధనలైనా ప్రజల క్షేమ సుఖశాంతుల కొరకు, శాంతినెమ్మదులతో జీవనము గడిపేందుకు, వారి కష్టసుఖాలను అర్ధము చేసికొని సమాజములో నీతినియమాలను ప్రతిష్ఠాపన చేసి భగవంతుని అనుగ్రహం సంపాదించు కొమ్మని ప్రభోధిస్తాయి. ఏ మత ప్రవక్తాయినా, ఏ గురు బోధన అయినా, ఏదేవుని చరిత్ర చూసినా "త్యాగము" అనునది ప్రముఖముగా కీర్తించబడినది. ఏమతాన్ని నీవు గౌరవించినా ఆమతాధికారిని గౌరవించడమే అవుతుంది. అదే రీతిలో అవమానపరచినా, హాని చేసినా అది వారిని అగౌరవపరచడమే అవుతుంది.
గురువులు వేరు కావచ్చు అవతార పురుషులు వేరు కావచ్చు సంస్కృతీ సంప్రదాయములు వేరు కావచ్చు కానీ దేవుడు ఒక్కడే. "అతని కోసం ఎక్కడో వెతకనవసరం లేదు. నీలోనే ఉన్నాడు. నీ చుట్టుపక్కల నీ ముందు, నీ వెనుక నీ పైన నీకు మార్గదర్శి అయి సదా రక్షించుతాడు",
రాక్షస పాలకుడైన హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని "దేవుడనే నీ హరి ఎక్కడ?" చూపుమని గద్దించగా
"ఇందుగలడందులేడని సందేహము వలదు. చక్రి సర్వోపగతుండెందెందు వెతకి చూసిన నందందేగలడు దానవాగ్రిణివింటే". అనగా స్తంభములో చూపుమని గదతో పగలకొట్టగా అందునుంచి శ్రీహరి వచ్చి హిరణ్యకశిపుని వధించి దుష్టశిక్షణ, భక్తరక్షణ గావించుట ఒక కధనమే అయినా దేవుని ఉనికి, ఆతని శక్తి మన అంచనాలకు అందదు.
నీరు, గాలి ఆకాశం, అగ్ని, పృధ్వి అవనిపై ఉన్న వృక్ష సంపదలు, సర్వజీవచరములు మతాన్ని బట్టి సంప్రాప్తమైనవి కావు. వాటిలో నిబిడీకృతమైన త్యాగగుణమే అందులకు కారణము. త్యాగం అనగా మనకున్న సంపదలను త్యాగం చేసి బికారులము అవడము ఎంతమాత్రము కాదు. మనలో చెలరేగే అసూయ, ద్వేషం, కోపం, క్రోధం, మదం, మత్సరము అను దుర్గుణాలను దేవుని ముందు త్యాగం చేయమని ప్రభోధించడమే
సరి అయిన మతత్యాగ బోధనం అవుతుంది. అదే మతగురువుల నుంచి శిష్యులకు సంక్రమించే తరగని ధనసంపద.
1. హిందుమతం:- ఏయుగ చరిత్ర చూసినా త్యాగనిధులే కనిపిస్తారు. శ్రీమహావిష్ణువు దశావతారములను దాల్చి ఇలపై చేసిన ధర్మ సంస్థాపన మరియు నిరూపించిన త్యాగనిరతి అడుగు అడుగునా గోచరిస్తుంది.
2 ఇస్లామిక్ మతం:- వీరి ఆరాధ్య దైవమైన “అల్లా" నిర్దేశించిన ప్రకారము వారి పర్వదినములలో తమ సంపాదనలో కొంత భాగము పేదలకు పంచుతారు. ఇది వారి సంస్కృతి మరియు సంప్రదాయ నిబద్ధత.
3. బౌద్ధమతం:- బిక్షాటనము చేసికొని తమ జీవనము గడిపే బౌద్ధ బిక్షువులు మనలోని చెడుని బిక్ష రూపములో స్వీకరించి మనల్ని త్యాగధనుల్ని, పుణ్యవంతుల్నిగా చేయుట కొరకే అను జీవన రహస్యమును ప్రభోధించిన మహనీయులుగా కీర్తి పొందిరి.
4. క్రైస్తవమతం:- జీసస్ తన బోధనలో ప్రతీ మనిషి మానసిక, దైహికమాలిన్యములను సంపూర్ణముగా తొలగించుకొనుట ఒక పవిత్రతకు చిహ్నము అయితే అసత్య భాషణను త్యాగం చేసి న్యాయ సమ్మతముగా జీవించమని తెలిపెను. "వర్క్ ఈస్ వర్షిప్" అను సూక్తిని నమ్మి నిరంతరం ప్రతిఫలం ఆశించని కష్టజీవులుగా, త్యాగధనులుగా ఇలపై నిలిచారు. పర్వదినములలో దాన ధర్మములు చేయుట సర్వసామాన్యము.
5. జైన మతం:- వర్ధమానవీరుడు నిత్యం మనం భుజించు ఆహారములో తమోగుణమును పెంచే ఆహారమును త్యజించి సాత్వికపరమైన ఆహారమును స్వీకరించి సాత్వికగుణసంపన్నులై హింసను త్యాగము చేయమని తెలిపెను.
6. సిక్కు మతం:-గురునానక్ బోధనలో త్యాగగుణం ప్రస్ఫుటమవుతుంది.
బిడ్డకు మంచి చేయడము తల్లి స్వభావం. తన బిడ్డ సుఖసంతోషాల కోసం తల్లి చేసే త్యాగాలు గణనీయం.
అందు వలననే "మధర్ ఈజ్ అవర్ ఫస్ట్ టీచర్" "హోం ఈజ్ అవర్ ఫస్ట్ స్కూల్" అను సూక్తి వెల్లివిరియడము ఒక విశేషము అయితే భరతదేశమాత రూపంలో "భారతమాత" అని, ప్రపంచ దేశములను కూర్చిన ప్రపంచాన్ని `విశ్వమాత` అని సమస్త జగతిని తనలో నిక్షిప్తం చేసుకొని సహనానికి మారు రూపైన
భూమిని "భూమాత" అని వర్ణించిరి.
గాంధీ:- అన్ని మతములు ఒకే బిందువువద్ద కలిసే విభిన్న మార్గములు. అందరు చేరుకొనే గమ్యం ఒక్కటే అయినప్పుడు మనం విభిన్న మార్గములలో పయనించడము తప్పుకాదు.
ఓబమా:-ప్రపంచములో ఏర్పడిన వివిధ మతములన్నీ ఒకే చెట్టుకు ఏర్పడిన విభిన్న కొమ్మలపై విరిసిన అందమైన పూలవంటివి. కొమ్మలు వేరైనా ఇన్ని పూలతో విరగబూసి దీఠుగా నిలచిన
చెట్టు ఒకటే అని భారతదేశములో అలరారుతున్న విభిన్న మతముల ఐక్యతను ప్రస్తుతించి గణతంత్ర ఉత్సవములో తన భాషణలో తెలిపెను (26-01-2015)
శ్రీ సిద్ధ మహర్షి వ్రాసిన "శివుడే దేవాధి దేవుడు" అను గ్రంధములో సర్వమానవాళికి మంచి చేయడం మతము యొక్క స్వభావం. అది జ్వలించే "అగ్ని" లాంటిది. అగ్నికి దోషము అంటదు. అదే రీతిలో మతాన్ని వినియోగించుకొనే వారిపైనే మంచి చెడులు ఆధారపడి ఉంటాయి. కారణం మతాలు అనునవి దేవుని ద్వారా స్థాపించబడినవి కావు. మరియు బోధింపబడినవి కావు. అవి సిద్ధ పురుషుల ద్వారా వ్యాప్తీకరించబడినవి.
కాలక్రమమున మనుషులలో స్వార్ధచింతన అధికమై త్యాగము కనుమరుగైనది. ప్రతీవారు బోధనలు వినేంతవరకే. వెలుపలకి వచ్చిన తక్షణం స్వార్ధమే జయిస్తుంది. "నేను" "నాది" అను అహం పెరిగి పరులకు తనకున్న దానిలో త్యాగం చేయుట అసాధ్యము అనవసరము అనిపిస్తుంది.
ప్రపంచ పటములో మతపరమైన మతాధికారుల త్యాగచరిత్రలను పరిశీలించితే మనకు త్యాగవిలువ తెలుస్తుంది. అది భాషణలో ప్రజలకు అందించడము ఎంత అవసరమో విదితము అవుతుంది.
తమ మతాన్ని ప్రేమిస్తూ పర మతాన్ని గౌరవించే వారు ఉత్తములు. ఏమత ప్రవక్త అయినా త్యాగనిరతిని ఒకే రీతిలో బోధిస్తారు. ఈ రహస్యం తెలియని కొందరు మతద్వేషాలు రెచ్చగొట్టి మనుషుల్లో ద్వేషాగ్నిని ప్రజ్వలింప చేస్తున్నారు. ఈ మాయోపాయముల నుండి విడివడినచో త్యాగధనులుగా, జ్ఞానసంపన్నులుగా
ఇలపై అవతరిస్తారు. ఇది నిజమైన మత ప్రచారం. మతలక్ష్యం. అంతేగాని మత వ్యాప్తి కోసం పరమతాలను విమర్శించడం, నిందించడం, కించపరచడము, హేళన చేయడం కేవలము దురభిమానమే, దురహంకారమే అవుతుంది.
ప్రపంచ పటములో ఏదేశ చరిత్రలోను లేని ఔన్నత్యం, సర్వ మత సహనశీలతలు మూర్తీభవించినవి ఒక్క భారతదేశములోనే.
అందువలన భారత రాజ్యాంగ సిద్ధాంతములో సర్వమతములను ఒకే రీతిలో గౌరవించే రీతిలో సెక్యూలర్ దేశముగా తీర్చిదిద్దిరి. ఎందరో విభిన్న మతసంబంధీకులు భరతదేశమును సుపరిపాలన గావించి తమతమ దేశాలకు తరలిపోయినా వారి మతములు, భాషలు, వేషభాషలు, భోజన రీతిరివాజులు మరియు సంస్కృతీ సంప్రదాయములు ఈ దేశములో నేటికీ సజీవత్వముతో నిలచి ఉండుట మనకి గౌరవప్రదమే అని నేనంటాను.మరి మీరేమి అంటారు?
6. నీతి నియమాలు లేని వ్యాపారం
నేడు సర్వజనతకు కనీస అవసరములకు నోచుకొనలేని స్థితికి దిగజార్చేది అతిభయంకరముగా తన రూపును దిద్దుకొనబోతున్న ప్రమాదం “నీతి నియమాలు లేని వ్యాపారం"
వ్యాపారం అనగానే మనకు స్ఫురణకు వచ్చేది మన మనసుల్లో రూపుదిద్దుకొనేది అమ్మకాలు కొనుగోళ్ళ నడుమ లాభనష్టములు బేరీజు వేసికొనే వృత్తిగానే భావిస్తాము. సాధారణముగా కొనుగోలు చేసేవారు తక్కువ ధరకి అధిక సరకును పొందాలని ఆరాటపడతారు. అదే సమయములో వ్యాపారస్థులు సాధ్యమైన రీతిలో అధిక లాభములను సంప్రాప్తింప చేసికొని తమ వ్యాపారం అభివృద్ధి పధంలో నిలవాలని చూడటం సహజమే. అందువలన వ్యాపార లావాదేవీలు ఎల్లప్పుడూ ప్రజల నుంచి వచ్చే గిరాకీనిబట్టి సరఫరా చేసినచో వారి వ్యాపారం ఆరోహణలో అత్యున్నత స్థానమును అలరించుతుంది. లేనిచో అసమానతలు వచ్చిచేరి వ్యాపారంలో ప్రతిబింబింపచేస్తాయి. నష్టాల వైపు పునాది పడుతుంది.
వ్యాపారస్థులు ఎల్లప్పుడూ లాభ దృష్టితోనే ప్రణాళికలు రూపొందించుకొనక కొనుగోలు దారులకు నాణ్యమైన సరకును అందుబాటు లోనికి తెచ్చి అందించగలిగిన నాడు వారిపైన నమ్మకము పెంపొందుతుంది. ఏ వృత్తిలో అయినా నమ్మకం మరియు నీతినియమాలు ప్రధాన అంశాలు అయినా వ్యాపారంలో మాత్రం నమ్మకం ఒకసారి కోల్పోవడము జరిగితే తిరిగి నిలబెట్టు కోవడం అత్యంత కష్టతరము మరియు అసాధ్యము. ఎన్నటికీ చెదరని మారని నమ్మకం ప్రజల హృదయాల్లో స్థిరపడిన నాడు కొనుగోలుదారులు నాణ్యతపై ఉన్న నమ్మకముతో వారినే ఆశ్రయిస్తారు. కారణము నాణ్యతకు, నమ్మకానికి, మరియు ధరలు అందుబాటులో
నిలప గలిగే
వ్యాపార ఆయుధములే వారికి మూలాధారములు. వీని వలన వారి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతుంది. ఈ సూత్రములు ఒక్క దేశీయ వర్తకులకు సంబంధించినవి మాత్రమే కావు. విదేశ వ్యాపార లావాదేవీలలో కూడా ఈ నియమ నిబద్ధతలు అవసరమే.
ఉదా.: మార్కెట్టులో 100 బస్తాల ధాన్యం గిరాకీ ఉన్నప్పుడు రైతులు 200 బస్తాల ధాన్యం సరఫరా చేసినచో 100 బస్తాలకి డిమాండు లేక నష్టపోతాడు. కొనుగోలుదారుల నుంచి ధరలు కిట్టుబాటు లోనికి రావు. ఇదే రీతిలో 50 బస్తాలు ధాన్యం సరఫరా చేసినచో రైతులు లాభాల పరిధిలో ధరలు పెంచి లాభం చేకూర్చు కొనినా ప్రజలకి మార్కెట్లో ధరలు అధికమై వస్తువు లభ్యం కాక నష్టపోతారు. ఇటువంటి సందర్భములలోనే నీతినియమాలు లేని వ్యాపారానికి బీజం పడుతుంది.
మనకు నూరుమంది ఇంజనీర్లు అవసరమైతే 500 మందిని సరఫరా చేసినచో 400 మంది నిరుద్యోగ నిష్పత్తిలో వచ్చి చేరతారు వీరి సరాసరి ఆర్జన విలువ పడిపోతుంది. నిరుద్యోగుల సంఖ్య పెరుగుతుంది.
ధరలు అదుపు లోనికి రావాలంటే ప్రజల నుంచి
ఏ రకం వస్తువులకి డిమాండ్ ఉన్నదో అవి అదే రీతిలో
ఉత్పత్తి పెంచితే మార్కెట్లో వానికి
సరి అయిన న్యాయం చేకూరుతుంది.
నీతినియమాలు లేని వ్యాపారం తాడులేని బొంగరంలా తిరుగుతుంది. ప్రతీ వ్యాపారి నాణ్యతగల సరకును కనిష్ఠ ధరలకు సామాన్యులకు అందుబాటులో పంపిణీ చేసిన నాడు ప్రజలు సంతృప్తులు అవుతారు. సంతోషముతో సరకులు కొని తృప్తితో జీవిస్తారు. మనం చేసే ప్రతీ వ్యాపారంలోను లాభంతో సరిపోల్చలేము. ఒక్కోసారి నీతినియమాలు నష్టాన్ని తెచ్చే సందర్భాలు ఎదురౌతాయి. ఆ సమయంలో కూడా దీఠుగా, ధీరత్వముతో నిలబడి ముందుకు సాగేవారే నిజమైన నీతినియమాలతో కూడిన వ్యాపారులు కాగలరు.
7. సూత్ర బధ్ధత లేని రాజకీయం
ప్రపంచ దేశాలని ఒక త్రాటిపై నిలపగలిగేది శాంతి బధ్రతలు సుస్థిరముగా
స్థిర పరచే గలిగేదీ
నేడేకాదు ఎప్పటికీ
వెలుగులీనెడిది
రాజకీయ నాయకుల సుపరిపాలనలోనే
కానీ స్వార్ధ పూరితమైన కొందరు రాజకీయ నాయకులు
అతి ప్రమాదకరమైన "సూత్ర నిబద్ధతలేని రాజకీయములను నేర్చి తమతమ పదవులను కాపాడుకొనుటకు ధర్మాన్ని అతిక్రమించి
తమను నమ్మిన జనత జీవనమును ప్రమాదభరితము చేయుట ఒక ముఖ్య దేశ విపత్తుగా పరిణమించినది.
గాంధీ వ్యక్తీకరించిన
సూత్రములో "మనల్ని మనము పరిపాలించు కొనే పద్ధతి నేర్పే ప్రభుత్వమే అన్నిటి కన్నా ఉత్తమమైన ప్రభుత్వం కావున మనుషుల్లో గుణాత్మికమైన మార్పులు తెచ్చేందుకు రాజకీయ నాయకులు పెద్ద పెద్ద ఉపన్యాసాలు, పుంఖాను పుంఖాలుగా వాగ్ధానములు
మరియు రచనలు చేయ వలసిన పనిలేదు. కేవలం మన చేతలు, మన ప్రవర్తనే ఆపనిని చేయగలవు. అందు వలన రాజకీయ నాయకులు తమ జీవిత రాజకీయ అనుభవాలను అందరు చదివేందుకు వీలుగా
సూత్ర బద్ధతతో కూడిన రాజకీయ విశ్లేషణములను
తెరచిన పుస్తకములా ఉంచాలి” అప్పుడే భావి తరాల వారికి ఆకాలములో వెల్లివిరసిన నీతినియమాలు, సమాజ దృక్పధాలు విశదీకరణము అవుతాయి.
రక్షణ బలగాలను, వాటి పరిమితులను దాటి చూడగలిగితే భారత్ అంటే ఒకే సైన్యం కాదు
యుద్ధాలతో నిండిన
రణభూమి కాదు ఒక శాంతికాముక దేశము అని అర్ధము అవుతుంది.
కృతయుగములో అయోధ్యా నగరాధిపతి అయిన రాజర్షి విశ్వామిత్రుడు తన కుమారుడైన సత్యవ్రతుని రాజ్యాభిషిక్తుని గావించు సమయములో
ఉపదేశించిన రాజనీతులు:-
1.ధర్మమును అనుసరిస్తూ విప్రులను మన్నించి ప్రజలను పిల్లలవలె పాలించాలి.
2.అసత్యము ఆడరాదు.
3.ఇంద్రియనిగ్రహం కావాలి
4.మునులను కాపాడాలి.
5.ఆలోచనలను మంత్రి వర్గముతో రహస్యముగా చర్చించాలి.
6.చోరభయం లేకుండా చేసి పగను నిర్మూలించాలి.
7.మంత్రులను సదా అనురక్తులను చేసికోవాలి
8.దుష్టసావాసం చేయరాదు.
9.ప్రభుభక్తి విశ్వాసం గలవారిని చారులుగా ఉంచాలి.
10.ఆకలితో ఉన్నవారికి ఏ జాతి అయినా అన్నం పెట్టాలి.
11.ఎట్టి పరిస్థితులలోను ధర్మవర్తనులను అవమానించ రాదు.
12. ఆర్జన కొలదీ వ్యయం చేయాలి అతివ్యయం కూడదు.
ఈ నీతి సూత్రములు నాటికి నేటికి ఎప్పటికీ అనుసరణీయమే.
ధర్మాన్ని ఇలపై సుస్థాపితము చేసిన శ్రీరామునిలో ప్రతిఫలించే రాజనీతులు:- వీరత్వం, ధర్మపాలన, కృతజ్ఞత కనపరచే గుణం, సత్యబద్ధత, ధృఢవ్రతం, సర్వభూతదయ, అపారవిద్య, అసాధారణమైన సామర్ధ్యం, ప్రియకరమైన దర్శనం, మృదుభాషణము, అనంత పరాక్రమం, క్రోధాన్ని జయించే తత్వం, అసూయలేని గుణం, కోపించినపుడు దేవతలు సైతం భీతిల్లే ధీరత్వం, తొలి పలకరింపు, నిరాడంబరత
వీనిలో ఏ యుగమైనా ఏ కాలమైనా మన రాజకీయ నాయకులు అలరించుకొనిన ఆనందం వారి వెన్నంటి ఉండి సదా కాపాడుతుంది.
ద్వాపరయుగ కీర్తిమంతుడు, ధర్మానికి ప్రతిరూపుడైన
హస్తినాపురాధీశుడైన
ధర్మరాజులో ప్రతిఫలించే రాజనీతిజ్ఞతలు-
అపారమైన శాంతి, నెమ్మది, పెద్దల ఎడ గౌరవం, వినయ విధేయతలు, గురువులపై గౌరవం, పరుల మేలు కోరే శక్తి యుక్తులు, నిర్మల స్వభావం, సత్యము, సాధు పోషణ, మంచి వితరణ, పొగరు మోతులను దండించుట, సత్కృపాగుణముతో అభివృద్ధి, ధర్మ మార్గమున సంపాదించిన ఉన్నత సంపదలు, శాస్త్రగమనము, శమదమములు, సజ్జనులు కొనియాడు సౌజన్యము.
ఈ సుపరి పాలకులు తమ సౌజన్యముతో, పాలన గావించి
స్వర్గలోకానికి సశరీరులై ఆరోహణము చేసిరి. ఎంతటి సత్యమైనా నమ్మని వాళ్ళు ఉన్నంత కాలము దాన్ని పదేపదే చెబుతూ ఉండాలి. పైన చెప్పిన సూత్రములు సమస్త మానవాళి నమ్మాల్సినవే.
మతప్రచారకులు జీసస్, బుద్ధుడు, మహమ్మద్ జొరాస్టర్ వీరందరి మూల సిద్ధాంతములు ఒక్కటే. వీరందరూ ఈశ్వరాంశ సంభూతులే. వీరి అవసరం భూమికి కలిగినప్పుడు, ఆధ్యాత్మికత నిమ్నస్థాయికి చేరినప్పుడు, స్థూలవాదం ఈవిశ్వాన్ని జయించినప్పుడు, కొంతమంది నరరూప రాక్షసుల క్రూరత్వము వలన ప్రభావితులైన కోట్లాది మంది మానవజాతిని పునరుద్ధరించడానికి అవనిపై ప్రతీ శతాభ్ధంలోను
ఒక మహానుభావుని రూపంలో అవతరిస్తారు. ఇది ప్రకృతి నియమం.
శక్తివంతమైన పాశ్చాత్య వ్యాపారులు భారతదేశము వచ్చి తమతోపాటు వస్తువులు కాకుండా ఎన్నో నూతన భావాలు తెచ్చేరు. విధి ఈ దేశాన్ని వారికి సమర్పించినది. ఎక్కువ శ్రమ లేకుండా భారతదేశాన్ని వారి ఆధీనంలోకి తెచ్చుకొన్నారు. బ్రిటిష్ వారి కిరీటంలో భారతదేశం ఒక ప్రకాశవంతమైన వజ్రంలా రూపుదిద్దు కొన్నది (ఆంగ్లకవి పౌల్ బ్రుస్టొన్ వ్రాసిన "ఎ సర్చ్ ఇన్ సీక్రెట్ ఇండియా" లో విరచితమైన ప్రస్తుతి).
నేడు కలియుగంలో నవీన రాజకీయ నాయకులలో ప్రస్ఫుటించ వలసిన రాజనీతి సూత్రములు
ఖచ్చితమైన సమయ పాలన, చొరవ, భాగస్వామ్యం, గడువు లోపల పని పూర్తి, పరిచయాలతో నెట్వర్క్, ఫీడ్ బ్యాక్ తెలిసికొనడం, సమయస్ఫూర్తి, నిర్ణయం తీసుకొనే నైపుణ్యం, సహనం, శ్రద్ధ,
సమస్యను పరిష్కరించ గలిగే సహజ సామర్ధ్యం, అందోళనలు లేని మనస్సు, అధ్భుతాలు చేయగలిగే
సామర్ధ్యం, నిరంతరం తమలోని శక్తి యుక్తులను మెరుగులు దిద్దుకొనే తత్వం, పొరపాట్లు, విమర్శలు, అపనిందలు, అవహేళనలు, అపజయాలు, అవమానాలు ఆవేదనలూ ఇవన్నీ గెలుపు నిచ్చెనకు ఆరోహణ మెట్లుగా భావించడం, నీతిగా సంపాదించడము, ఎంతవరకు అవసరమో అంతవరకే మాట్లాడగలగటం, ఆత్మ విశ్వాసము, ఈ ప్రయత్నాలు వారి నిత్య జీవన సమరంలో
ప్రయత్నించినచో వారు
గెలుపు వాకిట ముందు ఉన్నటులే
వందేళ్ళలో భారత దేశ చరిత్ర మారుతుంది.
ఇది కలియుగం. విద్రోహ కశక్తులు, హంతకులు, ఉగ్రవాదులు, దోపిడీ దారులు అన్ని రంగములలో తమదైన రూపులో మనుషుల్లోని మంచితనాన్ని, దేశ శాంతిని సమాధి చేస్తున్నారు. దేశ సంపదలను కొల్లగొడుతున్నరు. కావున ఇది శాంతి భధ్రతలను పునఃస్థాపితము చేయవలసిన పరిస్థితిగా ప్రతీ రాజకీయనాయకుడు భావించ వలసిన సమయం ఆసన్నమైనది.
ఉగ్రవాదం అనునది గాంధీ గారి స్పందనలో ఈ రీతిలో వివరించిరి:-ఉగ్రవాదం, వంచన, దోపిడీ అనునవి బలహీనుల ఆయుధములు. చరిత్రలో ఎక్కడ చూసినా వారి సంకల్పం నెరవేరడములో గానీ, వారి భావాలను బాధితుల మీద ప్రయోగించడములో గానీ ఉగ్రవాదం విఫలమే అయినది. విజయం సాధించిన దాఖలాలు లేవు. ఒక నూతన శకాన్ని ఆవిష్కరింప చేసే ఉద్దేశ్యములో ప్రపంచ దేశాలు ఉగ్రవాదాన్ని అణచివేతలో ఈ రీతిలో భాగం వహించేయి. 28 జూన్, 2019 వ సంవత్సరములో జి20 (గ్రూప్ ఆఫ్ ట్వంటీ కంట్రీస్) జపాన్ దేశములో ఒకాసా నగరంలో షిర్జో అబె చైర్మన్ పదవిని అలరించగా ఈ సమావేశము
నిర్విఘ్నముగా
కొనసాగినది. ఈ సంధర్భములో
భారతదేశం ప్రముఖ స్థానం అలరించిన సందర్భములో మన ప్రధాని శ్రీ నరేంద్ర మోదిగారి స్పందన ఈ రీతిలో:-
“ఉగ్రవాదం, దోపిడీ, సమాజ విద్రోహ శక్తులుగా మారి పచ్చని వృక్షాన్ని నిలువునా దొలిచివేస్తున్న సమయములో ఈ వృక్షాన్ని
సంరక్షించి మరియు ప్రపంచ దేశాలను అభివృద్ధి పరచుట అందరి బాధ్యత. విశ్వ కళ్యాణం కొరకు భారత్ అవిర్భవించినది. వీటిని ప్రపంచ దేశాలతో చేరి ఎదిరించే శక్తి భారత్ కలిగి ఉన్నది.
అనర్హుల చేతిలో భ్రష్టుపట్టిన రాజకీయముల రూపును సరిదిద్దడమే మన తక్షణ కర్తవ్యము”.
నాయకత్వమంటే తనకి తాను ప్రముఖ వ్యక్తిగా మసలడము కాదు, ఆ ప్రముఖత్వాన్ని ప్రజల్లోకి తీసుకు వచ్చే వారే నిజమైన నాయకులు. ప్రముఖ రాజకీయ నాయకులు సామాన్యుల్లో అఖంఢమైన మార్పులు తెస్తారు. ప్రముఖ రాజకీయ నాయకులు ఎల్లప్పుడూ దేశాభివృద్ధిని గురించి ఆలోచిస్తారు. ప్రముఖ రాజకీయ నాయకులు ఎల్లప్పుడూ కార్య నిబద్ధలతో క్రమశిక్షణలో ఆరితేరి ఉంటారు.
"సత్యమే వ జయతే" గాంధీజీ సూత్రమైతే
"స్వచ్చతే వ జయతే" మోదీజీ సూత్రముగా మారినది.
దేశ స్వాతంత్రం "స్పూర్తి" అను చక్రాలపై ముందుకు నడుస్తుంది. ప్రపంచ శాంతి సుస్థాపిత ప్రక్రియలో భారత్ ఎప్పటికీ భాగస్వ్యామిని అవుతుంది. నాడే కాదు నేడే కాదు ఎప్పటికీ.
గాంధీజీ ప్రజాస్వామ్యం సరిదిద్దు రీతిని
ఈ విధముగా తెలిపెను. "చతురస్రాకార కోణంలో ఒక కోణాన్ని సరి చేసామంటే మిగిలిన కోణాలన్నీ వాటంతట అవే సరి అవుతాయి. ప్రజాస్వామ్యము అదే తీరున సరి అవుతుంది ".
నవీన మానవ యుగంలో పాఠశాలలొను, కళాశాలలొను సాంకేతకపరమైన విద్యను నేర్చిన ప్రతీ దేశ నాయకుని సరి అయిన ఆధునిక పధములో నడుపుతుంది. ప్రజాస్వామ్యములో ప్రజలదే తీర్పు. అవినీతిపై పోరాడేవారే అసలైన నాయకులు. 138.55 కోట్ల మంది భారతీయుల సుఖసంతోషాలే
విజయానికి సంకేతం కాగలవు.
ఒక శివుడు, ఒక బుద్ధుడు, ఒక ప్రవక్త, ఒక నానక్, ఒక వర్ధమాన వీరుడులాగ ఏ దాపరికము లేని తన జీవితాన్ని తెరచిన పుస్తకములా అందరి ముందు ఉంచి విశ్వ మానవాళి హృదయాల్ని గెలుచుకొన్న భారతీయతతో కూడిన స్వచ్చ వచనావాది అయిన మోదీ గారి ఆధ్వర్యంలో నేడు భారతదేశం తనదైన స్వచ్చపరమైన రూపును దిద్దుకొనుట ముదావహం.
ఈ పైన చెప్పినవి భారతీయ రాజకీయ చరిత్ర గురించి కొందరు ప్రముఖుల అనుభవముల సారంశమే యుగయుగాల నుంచి నిక్షిప్తమై ఉన్న విషయములను విశదీకరించడమైనది. కావున కొన్నైనా మనదైనందిన జీవనములో ఆచరణలో పెట్టదానికి ప్రయత్నించి ప్రజలను " సూత్ర బద్ధత లేని రాజకీయము" అను ఊబిలోనుంచి పైకి లాగి "సూత్ర బద్ధతతో నిండిన స్వచ్చ భారతీయ రాజకీయ చరితను సువర్ణాక్షరములతో లిఖించుట అనునది మన ఆశల సంపూర్ణతకు నిదర్శనమే మరియు భావి తరముల వారికి ఆదర్శమే అవుతుంది. అని నేనంటాను. మరి మీరేమటారు?