ఏ కాలమైనా విద్యార్థులు అధిక శ్రమ
అవసరం లేకుండా నాణ్యమైన చదువు దానితో పాటు విషయ పరిజ్ఞానం పెంపొందించుకొని ఆడుతూ పాడుతూ
తమ విద్యార్థి దశ పూర్తి చేసుకోవాలి. ప్రస్తుత ఆధునిక విద్యావిధానంలో క్రొత్తగా వచ్చి
చేరిన హంగులు, ఆర్భాటాలు ఎక్కువై అసలు విషయం తారుమారు చేస్తు న్నాయి.
నేడు దేశంలో అత్యుత్తమ అత్యున్నత విద్యావంతులు కూడా నేటి పిల్లల కోర్సులు చూసి వారికి
అర్ధమయ్యే రీతిలో చెప్పడానికి బెంబేలు పడిపోతున్నారు. చిన్నారి విద్యార్థులను చదువుకోసం
ఇంతహింసించడం అవసరమా! ఇంత ఒత్తిడి కావాలా! అనిపిస్తోంది. మన దేశ చదువుల గురించి ఒక
కవి సరదాగా తెలుగులో ఇలా వ్రాసారు.
“ఆదిలో మన
విద్య లయబద్ధమే
వేదాలు నాలుగు
సంగీతమే
సంగీత మేదైన
సాధించును
పాడుకో ఆడుకో
ఆడుతూ చదువుకో
అని
దీని వలన తెలుస్తోంది విద్య ఎంత కఠినమైనదైనా
మనం ఎంత సులభంగా నేర్పగలమో ఎంత సులభతరం చేయవచ్చునో!
ప్రస్తుత విద్యావిధానం ఎన్నో తేడాలతో
రాష్ట్రానికీ రాష్ట్రానికీ స్కూల్‌కీ స్కూల్‌కీ మధ్య ఎన్నో మార్పులతో చేర్పులతో విస్తరించింది.
ఇందువలన ఏ చదువులు మంచివో ఏ కోర్సులో జాయిన్ అయితే అధిక సంపాదనాపరులవుతారో అన్న అతృత,
అభిలాష ఎక్కువై నేటి విద్యావ్యవస్థని అయోమయంలో పడే స్థితికి తెచ్చింది.
ఎ) నేషనల్
కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఎండ్ రిసర్చ్ ట్రైనింగ్ అనే సంస్థ 1961లో సెప్టెంబర్ 1న ఢిల్లీలో
స్థాపితమైనది. వీరు విద్యపై పరిశోధనలు జరిపి పరిశ్రమించి అతివిలువైన విజ్ఞానంతో కూడిన
సిలబస్ 1 నుండి 12 క్లాసుల వరకు ప్రవేశపెట్టారు. ఇది స్వతంత్ర (అటానమస్) సంస్థ. వీరు
తయారు చేసిన సిలబస్ సి.బి.యస్.ఇ.గా ప్రాచుర్యంలోకి వచ్చినది. ఈ సంస్థ మినిష్టరీ ఆఫ్
ఎడ్యూకేషన్ వారి ఆధ్వర్యంలో పనిచేస్తుంది.
బి) స్టేట్
కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఎండ్ రిసర్చ్ ట్రైనింగ్ (యస్.సి.ఇ.ఆర్.టి) 1988లో మే 27న
ఢిల్లీలో స్థాపితమైనది. వీరు రాష్ట్ర ప్రైమరీ విద్యాభివృద్ధికి మరియు టీచర్స్ ఎడ్యుకేషన్
విభాగంలో విద్యపై పరిశోధనలు చేసి ముఖ్యంగా దేశభాష అయిన హిందీ భాష అభివృద్ధికి కృషి
సల్పడం అమోఘం. ఈ సంస్థ కూడా మినిస్టరీ ఆఫ్ ఎడ్యూకేషన్ ఆధ్వర్యంలో పనిచేస్తుంది.
సి) ఇండియన్
సర్టిఫికెట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (ఐ.సి.ఎస్.ఇ.) అనే విద్యావిధానం ఒక ప్రైవేట్ సంస్థ
ద్వారా 1958లో నవంబర్ 3న కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ వారిచే ఢిల్లీలో స్థాపించబడినది.
వీరికి వచ్చే ఆదాయం ప్రైవేట్ సంస్థల ద్వారా లభించడం జరుగుతుంది. వీరు అమలు పరచిన సిలబస్
చాలా కఠినతరం. 1 నుండి 12 క్లాసుల వరకు ఈ సంస్థ తమ స్వంత సిలబస్ తయారు చేసి మన దేశ
విద్యావిధానంలో ప్రవేశపెట్టారు.
డి) ఇవి
కాక ప్రతీ రాష్ట్రం తమదైన స్వంత విద్యావిధానంలో మాతృభాష లేదా ఆంగ్ల మాధ్యమంలో 1 నుండి
10 క్లాసుల వరకు స్కూల్స్‌లోను + 2 కోర్సు (పి.యు.సి.) కాలేజీల్లో వివిధ కోర్సులలో
చేర్చటం జరిగింది. ఒకే దేశమే అయినా విద్యమాత్రం రాష్ట్రానికి రాష్ట్రానికి మారింది.
స్కూల్‌కీ స్కూల్‌కీ కూడా సిలబస్ విభిన్న రకాల్లో విస్తరించింది.
పైన ఉదహరించిన కొన్ని విద్యావిధానాలు
దేశమంతటా వ్యాపించి వున్నాయి. ఇందులో ముఖ్యంగా ఎన్.సి.ఇ.ఆర్.టి.వారు ముద్రించే సి.బి.యస్.ఇ.
సిలబస్ విద్యార్థులకు ఉన్నతమైన విద్యని అంధించటం కొరకు ప్రభుత్వ ఉద్యోగులు తరచు బదిలీల
మీద తిరిగేవారి పిల్లలకు మధ్యలో చదువుకి అవరోధం కలగకుండా దేశమంతా ఒకే రకం సిలబస్‌తో
విద్య లభ్యమయ్యేలా చేయడం కోసం కేంద్రీయ విద్యాలయాలు వర్తిస్తాయి. దేశంలో వీటి సంఖ్య
పరిమితం కావటం వలన అందరికీ సీట్లు లభ్యం కాకపోవటం వలన కాలక్రమేణా కొన్ని ప్రైవేట్ సంస్థలు
ఈ సిలబస్ ప్రవేశపెట్టడం జరిగినది. పేరుకి మాత్రం సి.బి.యస్.ఇ. అయినా వారిచే పబ్లిష్
చేయబడిన సిలబస్ ఎన్.సి.ఇ.ఆర్.టి. ద్వారా ప్రచురింపబడిన సిలబస్ కాదు. వీరి దృష్టిలో
సిలబస్ ఎంత కఠినతరం అయితే అంత విజ్ఞానం విద్యార్థుల్లో పెంచవచ్చు అన్న తప్పుడు భావన
పెరిగింది. దేశంలో అడుగడుగునా వెలసిన ప్రైవేట్ పబ్లిషర్సే తమదైన రీతిలో సిలబస్ తయారు
చెయ్యడం జరుగుతోంది. ఈ దురభిప్రాయం వలన ఎప్పుడో కాలేజీ లెవెల్లో నేర్పవలసిన విద్య కఠినం
చేసి నేడు స్కూల్ లెవెల్లోకి దింపారు. అనేక విద్యాసంస్థల్లో వారు నిర్ధేసించిన పుస్తకాలే
కొనాలి అన్న నిబంధన వలన విద్యార్థిలోకం అధిక ప్రెజర్ అధిక విద్యని తమ వీపుపై మాత్రమే
కాదు తలలో కూడా మోస్తున్నారు. జీవితమంతా కష్టపడి చదివినా పూర్తి కాని చదువు నేటి విద్యార్థులు
1 నుండి 12 క్లాసుల్లోనే ముగించవలసివస్తోంది. ఈ విద్యావిధానం ఇంతటితో ఆగలేదు. మరల పైచదువులకి
ఎంట్రన్స్ పరీక్షలు వ్రాసి ఆ మార్కులు ఆధారంగానే సీటు రావటానికి అర్హత సంపాదించాలి.
ఈ అవరోధాలు అధిగమించి గమ్యం చేరితే కొంతవరకు ఫర్వాలేదు. ఇవి ఏ మాత్రం ఫలించలేకపోయినా
విద్యార్థుల్లో నిరాశ, సిగ్గు, అపరాధభావం, భవిష్యత్తు గాఢాంధకారంగా ఊహించుకోవడం, సమాజం
నుంచి ఎదురయ్యే సూటిపోటీ మాటలు, ఇవి భరించలేక ఆత్మహత్యలు లేదా డ్రగ్స్‌కి మత్తుమందులకి
దాసోహం అవడం ఇవీ నేటి విద్యార్థిలో కొన్ని అతలాకుతలం చేస్తున్న సమస్యలు.
ఈ అవరోధాలు తొలగాలంటే వారికి చిన్నతనం నుంచే ప్రతీ విద్యలో ఏ విభాగం అయినా వాటిలో దాగిన విలువలు అర్థమైన రీతిలో నేర్పాలి. చదువు అంటే ఒక్క ఇంజనీర్, డాక్టర్ కోర్సులే కాదు వేరే ఏ కోర్సులు చదివినా అభివృద్ధిలోకి రావచ్చు అన్న నిజం గ్రహించుకునేలా తల్లిదండ్రులు వారికి విద్యనిచ్చే గురువులు అవగాహన పెంచాలి వారి మనస్సుకి నచ్చిన రీతిలో చదవటానికి స్వతంత్రత ఇవ్వాలి. ఏ విద్య అయినా అంకితభావం ముఖ్యం. ఇది కలిగిననాడు వారు తమ చదువులో అద్భుతాలు సృష్టించగలరు లేకుంటే వీరి శక్తి, ఉత్సాహం అన్నీ విద్యార్థి దశలోనే ముగిసిపోయి ఉద్యోగం వచ్చేసరికి యాంత్రికంగా మారిపోతున్నారు. అదే మామూలుగా చదివిన విద్యార్థులు మానసిక వికాసం కలిగి తమ వృత్తుల్లో అత్యంత ఉత్సాహం, అభివృద్ధి కనపరుస్తున్నారు అన్నది నిపుణుల విశ్లేషణ కానీ సమస్య వీరు మెరిట్లో ముందుండలేరు.
కాలం గడిచే కొలదీ విద్యాభివృద్ధి దేశమంతా ప్రభావితం చేయాలనే సదుద్దేశ్యంతో 1 నుంచి 4 క్లాసుల వరకు అన్ని ప్రభుత్వ విద్యాసంస్థల్లోను ఉచిత విద్యావిధానం తప్పనిసరి చేసారు. అంతే కాక విద్యార్థులను తప్పనిసరిగా ఉత్తీర్ణులను చేయాలనే నిబంధన కూడా ఉంది. దీని వలన చదువులో వెనుకబడిన విద్యార్థులు కూడా ఉత్తీర్ణులై ఒక్కసారిగా 5వ క్లాసుకి వచ్చేసరికి వారికి విద్య అతి భారంగా మారుతుంది. తమకు ఏమీరాదనే సంకుచితంతో వెనకపడుతున్నారు. టీచర్కి కూడా వారిని ఆ 5వ క్లాసు లెవెల్లోకి తీసుకురావటం కష్టతరంగా మారుతోంది. ఈ పద్ధతినే కొంచెం మార్పులతో సరైన పర్యవేక్షణలో చదివించి వారిని ఉత్తీర్ణులను చేయటం మంచిది. నేడు కొన్ని విద్యాసంస్థలు స్కూల్ లోనే అనువైన వాతావరణం కల్పించి ప్రత్యేక టీచర్ల ద్వారా వారిని అభివృద్ధి పరచడానికి ప్రయత్నిస్తున్నారు. ఇందులో సఫలీకృతులైన వారు ఉన్నారు. ఇది నిజంగా హర్షించదగ్గ విషయం. ఇదే విధానం ప్రభుత్వ సంస్థల్లో కూడా అమలుపరచడం సర్వదా శ్రేయస్కరం. 1 నుండి 12 క్లాసుల వరకు ఒకే సిలబస్ ఉండటం సర్వదా ఉపయుక్తకరం. ముఖ్యంగా మాతృభాషలో బోధన చేసే కాలేజీల్లో, స్కూల్సులో ఇంగ్లీషు (ఆంగ్లము) హిందీ సబ్జక్ట్సు సిలబస్ దేశమంతటా ఒకే తీరుగా ఉంటే మన విద్యావిధానం సర్వసమానత్త్వం సంతరించుకుంటుంది. విద్యార్థులు చదివే సిలబస్ గానీ వ్రాసే పరీక్షలు గానీ 1 నుండి 12 క్లాసుల వరకు ఒకే తీరుగా ఒకే ప్రశ్నాపత్రంతో ప్రచురిస్తే మన విద్య చాలా అభ్యుదయం వైపు దారితీస్తుంది దేశం మొత్తం సెంటర్లు అన్నీ ఒకే ఎంట్రన్స్ పరీక్షావిధానం కలిగి ఉన్ననాడు, ఒకే దేశం ఒకే విద్య అన్న నినాదంతో మేము భారతీయ విద్యార్థులం అన్న భావన పెరుగుతుంది. ఇది కేవలం
మన దృష్టిలో మాత్రమే కాదు మన విద్య విదేశీయుల దృష్టిలో కూడా గౌరవం పెంచేదిగా ఉంటుంది అన్నది మనందరి అభిప్రాయం కావాలి.
అర్థం తెలియని విద్య వ్యర్ధం అన్న నానుడి సర్వతోముఖంగా వ్యాప్తి చెందిననాడు విద్యార్థులు అర్థవంతమైన విద్య నేరుస్తారు.
ప్రతీ సంవత్సరము విద్య నేర్పే టీచర్ ఒకే సబ్జక్టు, ఒకే క్లాసు ఏళ్ళతరబడి చెప్పిన పాఠాలే చెబుతూ ఒకరకమైన యాంత్రిక జీవనానికి అలవాటు పడుతున్నారు. కానీ విద్యార్థులు క్రింద తరగతుల్లో ఉత్తీర్ణులై నవ్యతతో క్రొత్తక్లాసు, క్రొత్తపుస్తకాలు, క్రొత్త యూనిఫారంలతో తయారయి అత్యుత్సాహంతో ఉరకలు వేస్తూ వస్తారు. వారికి ప్రపంచమే ఉత్సాహభరితంగా కనపడుతోంది. దయచేసి వారి ఉత్సాహాన్ని అణచివేయవద్దు. మీరు క్లాసుకి వెళ్ళారంటే వారి కన్నులు ఆనందంతో వెలిగిపోవాలి. ముందుగా వారిలో ఈ ఉత్సాహం నింపి తరువాతే పాఠాలు వల్లె వేయించడం మంచిది. మంచి విద్య నేర్పేవారు ఎంత అవసరమో నేర్చుకునే వారి సహకారం కూడా అంతే అవసరము. రెండు కలిసిన నాడు అది ప్రపంచంలోనే అత్యుత్తమ తరగతి అవుతుంది.
నేటికాలంలో ఉపాధ్యాయులని కూడా విజ్ఞాన అభివృద్ధితో రాణింపచేయడానికి ఉత్సాహవంతులుగా తీర్చిదిద్దడానికి చాలా వరకు ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు అభివృద్ధిదశలో ముందుకి వచ్చి సమ్మర్ కేంప్స్, వర్క్ షాప్స్ టెక్నికల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఎన్నో మరెన్నో వారి కొరకై ఏర్పరుచుతున్నారు. ఇంకా కొన్ని విద్యాసంస్థలు ప్రవేశపెట్టిన అత్యంత అద్భుతమైన ఆధునిక పరికరాలు విద్యార్ధులు యాంత్రికంగా విన్నదానికన్నా ఆ వివరాలు ప్రత్యక్షంగా స్మార్ట్ క్లాస్లో టెలివిజన్ ద్వారా చూపించి వారిలో అవగాహన శక్తిపెంచడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది హర్షదాయకమే అయినా ఇక్కడ మెషీన్ ఎప్పటికీ ప్రాణమున్న టీచర్ కాలేదు. ఒకసారి స్మార్ట్ క్లాసు పాఠం మొదలవుతే అది సినిమా రీలులాగా ముగిసిపోతుంది. వారికి టీచర్ ద్వారా లభించే ప్రశంసలు, అవగాహన శక్తికి సంబంధించిన ప్రశ్నలు ఉత్తర్వులు లభించకపోవచ్చు. ఇవి గురుశిష్యుల మధ్య దూరాన్ని పెంచడమే అవుతుంది. ప్రతీ టీచర్ ఈ ఆధునిక పరికరాలు వాడడంతో పాటు కొంత సమయాన్ని విద్యార్థులు వీక్షించిన పాఠాన్ని విపులీకరించి అర్థవంతంగా చర్చించడానికి కొంత సమయం తమ టీచింగ్ లో ప్రవేశపెట్టిన అది అత్యుత్తమ ఆధునిక విద్య నేర్పడం అవుతుంది.
నేటి పరీక్షా విధానంలో కూడా కొన్ని ముఖ్య మార్పులు చేయటం అత్యంత అవసరం. ప్రశ్నాపత్రాలు ఎంత కఠినతరం చేస్తే అంత తెలివి విద్యార్థుల్లో పెరుగుతుంది. అంత విజ్ఞానం వెలికితీయవచ్చు అన్న భావన కనబడుతోంది. సామాన్యంగా చైల్డ్ సైకాలజీ ప్రకారం విద్యార్థులు ప్రశ్నాపత్రం చూసిన వెంటనే అతి తెలివైన విద్యార్థి మొదలు అతి వెనకబడిన విద్యార్థి వరకు ఒకే ఉత్సాహంతో స్పందించాలి. తాము తప్పక వ్రాయగలము ఉత్తీర్ణులము అవుతాము అన్న నమ్మకం పెరగాలి. సులభమైన రీతిలో మొదలైన ప్రశ్నాపత్రం కఠిన ప్రశ్నలు వైపుగా మార్చి నూరు శాతం మంది అరవై శాతం మార్కులు పొందేలా ఆపైన ఇరవై ఐదు శాతం తెలివైన వారు ఇక మిగిలిన పదిహేను శాతం అతి తెలివైన విద్యార్థులు (డిస్టింక్షన్) వస్తారు. పరీక్షల ముఖ్యోద్దేశ్యం చాలా ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు ఉత్తీర్ణులు కాగలగాలి అన్నదే. ఈ విధంగా మన పరీక్షావిధానంలోని అవరోధాలు తొలగించి కొన్ని మార్పులు తెస్తే పేపర్ లీక్ అయినదని, పాసవ్వాలన్న తపనతో కాపీలు కొట్టడం మార్కెట్ లో పరీక్షా సమయాల్లో లభ్యమయ్యే ప్రశ్నాపత్రాలు డబ్బుతో కొనటం అందులో చదివిన ప్రశ్నలు రాకపోతే నిరాశచెందడం, గాభరా పడటం అయోమయావస్థలు లాంటి అన్యాయ మార్గాలు మూసుకుపోతాయి. విద్యార్థులకి ప్రశ్నాపత్రం అర్థవంతంగా వుండి వ్రాయటానికి తగిన అనుకూల వాతావరణం మనం కల్పించినపుడు పరీక్షలు వ్రాసే విధానం సుగమం అవుతుంది.
పూర్వకాలంలో శ్రద్ధగా పాఠాలు వినడం వలన ఇరవై శాతం, వాటిని చదవటం వలన ఇరవై శాతం, వినిచదివిన దానిని తర్కించిన పదిశాతం, మిగిలిన యాభైశాతం ఒకసారి వ్రాయటం వలన విద్యలో అద్భుత ఫలితాలు వస్తాయి అన్న నమ్మకం ఉండేది. ఈ పైన చెప్పిన నాలుగు, విద్యని అత్యుత్తమ స్థాయిలో మలచడానికి మూలస్తంభాలు. వీటి పునాదితో నిర్మాణమైన విద్యాసౌధం చాలా ధృఢంగా ఎప్పటికీ నిలిచి ఉంటుంది. మట్టిలో మాణిక్యాల్లా వెలుగొందే విద్యార్థులు ఈ ప్రపంచంలో ఎప్పటికీ ఉంటారు. వారిలో నిగూఢమైన తెలివితేటలు వెలికి తీసే బాధ్యత గురువులది. వీరు నిస్వార్ధంగా నిష్పక్షపాతంగా వెలుగులోకి తేబడిననాడు.
“ద ఫ్యూచెర్ డెస్టినీ ఆఫ్ ఎ నేషన్ కేన్ బి మేడ్ ఇన్ ఎ స్మాల్ క్లాస్ రూం” (“ఒక దేశం యొక్క భవితవ్యం అనేది ఒక చిన్న తరగతి గదిలో తయారవుతుంది” ) అన్న మాటలు నిజమవుతాయి. ఈ చిన్న చిన్న మార్పులు మన విద్యావిధానంలో చేర్చిననాడు భారత రథ సంకెళ్ళు తొలగి భావి భారత విద్యారథం అభ్యుదయ మార్గంలో ముందుకు సాగుతుంది.
No comments:
Post a Comment