Thursday, 26 April 2018

కాశీ లో నవరాత్రులు (మొదటి భాగం)


ముందుమాటగా నాలుగు విభాగాల వ్యాస రచనకు సంభధితమైన కొన్ని వర్ణనలు సంభంధానుచితముగా ముందువరియడానికి దోహదపడిన రచనలు -
వేదవ్యాస మహర్షి రచించిన స్కంద పురాణాంతర్గత "కాశీఖండము" తెలుగు అనువాదకులు మల్లాది శ్రీహరి శాస్త్రిగారు
ద్వాదశ జ్యొతిర్లింగ చరిత్ర శ్రీ క్రిష్ణ పుబ్లిషర్స్ శ్రీశైలం.
"లలితా సహస్ర నామ స్తోత్రం" శ్రీమతి పవన నిర్మల ప్రభావతిగారు.
"శ్రీరామతారక ఆంధ్రా ఆశ్రమము వారణాసి"వారి ద్వారా నియమింపబడిన మార్గదర్శకులు శ్రీ పవన్ పాండే మరియు శ్రీ బిట్టు పాండే వారి సహాయ సహకారములతో అన్ని విభాగములలో కాశీ నగర వీక్షణము జరిగినది.
కొన్ని ప్రదేశాల్లో కెమేరా, మరియు చరవాణి అనుమతి లేని కారణాన ఫొటోలు తీయడము వీలుకుదరక "గూగుల్" ద్వారా సేకరించడము అయినది.
వీరందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు.

**

కాశీ నగరంలో తొమ్మిది రాత్రులు వాసము చేయడము అన్నది ఆది కాలమునుంచి జరిగే ప్రక్రియ మాత్రమే కాదు ఆదిదంపతులు స్రీలకు ఇచ్చిన వరము. స్త్రీ గర్భంలో పెరిగే శిశువు విడిచిన మలమూత్రాదులతో ఆమె శరీరం దుర్గంధభరితము అవుతుంది. మాతృగర్భంలో పెరిగే శిశువు తొమ్మిది నెలల, తొమ్మిది రోజుల, తొమ్మిది ఘడియలలో జన్మించడము అనేది భగవంతుని సృష్టి నియమము. దేవికి నవ సంఖ్య అత్యంత ప్రీతి పాత్రమగుట ఒక విశేషమైతే అదే సంఖ్యతో జరిగే సృష్టి రచన మరొక వింత. స్త్రీలు తమ ఋతుక్రమము పరిసమాప్తమైన తదనంతరం తొమ్మిది రోజుల కాశీ యాత్రకు అర్హులుగా పరిగణింపబడతారు. దోషముల నివారణకు శారీరక, మానసిక నిర్మలత్వం కొరకు తగిన ఉపాయము తెలుపమని పార్వతీదేవి పరమేశ్వరుని ప్రార్ధించగా ఆతను "కాశీలో నవరాత్రులు వశించి ప్రతీదినము అచట వెలసిన పవిత్ర నదులలో స్నానమాచరించి మహిమోపేతములైన దేవి దేవతల దర్శనముతో పవిత్రముగా గడపిన స్త్రీలు సకల సౌభాగ్యములు పొందెదరు". అని వినుతించెను. అవనిలో భారత దేశ పవిత్రత, ఔన్నత్యం, ఆధ్యాత్మికతలు బలపడడానికి సకల జీవులు భూత భవిష్య వర్తమాన కాలములలో ఆదిదంపతుల ఆశీస్సులతో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఎప్పటికీ విలసిల్లుతారు అన్న భక్తితత్పరతో కూడినస్వీయ అనుభవాలే వ్యాసంలో అభివర్ణించడమైనది.


ఓం శభ్దం యొక్క జన్మ రహస్యం:-




సృష్టికర్త బ్రహ్మ చిరకాలము కాశీయందు తపము ఆచరించగా అఖండ జ్యోతి ఒకటి ఆవిర్భవించినది. నిర్వికల్ప సమాధియందున్న అంతరంగమున వెలిగే జ్ఞానజ్యోతియే బాహ్య రూపమున అతి పెద్ద ధ్వనితో "ఓంకార"తో కనులముందు సాక్షాత్కరించెను.
మొదట సత్వగుణ సంపన్నమైన ఋగ్వేదౌత్పత్తికి స్థానమై సృష్టి పాలకమైన నారాయణ రూపం "అకారం" లో కనిపించినది.
రెండవ రూపం రజోగుణ సంపన్నమైన యజుర్వేదమునకు ప్రతిబింబమైన తన రూపమే "ఉకారం" లో కనిపించినది.
మూడవరూపం సామవేదమునకు ప్రళయకారణమైన రుద్ర స్వరూపమైన "మకారం" లో కనిపించినది.
విశ్వమంతయు చెప్పనలవికాని "ఓం" కారనాద శబ్ధముతో వ్యాప్తీకరించినది. శక్తి రూపమే బిందువుగా రూపుదిద్దుకొన్నది."అకార" "ఉకార" "మకార" కలయికతో వెలసిన "ఓంకార" లింగ రూపమును దర్శించి అలవికాని ఆనందభరితుడాయెను.

కాశీ చుట్టూ వెలసిన దేవీ దేవతా మూర్తులు:-

ఢుండి వినాయకుడు:- 



కాశీ విశ్వేశ్వరుని దర్శనానికి ముందుగా భక్తులు  ఇచటవెలసిన ఢుండు వినాయకుని దర్సించి ప్రార్ధించు కోవాలి."ఢుండు" అనగా "అన్వేషణ" అని అర్థం. భక్తులకు సమస్త అర్ధములు వెతకి  సిద్ధింప చేయును కనుక "ఢుండి" అను పేరుతో వాసికెక్కెను. ఈతని దర్శనము వలన అనేకానేక విఘ్నములు, అమంగళములు తొలగి లక్ష్మీకటాక్షంతో పుత్ర పౌత్రాభి వృద్ధులు, ధన ధాన్యములు ప్రాప్తించడమే కాక వారి మానసిక పాపములు నశింప చేయ బడును. వెతకి వెతకి కోర్కెలను తీర్చే మహిమగల వినాయకునికి అనేక వందనములు.

వారాహి దేవి:-




రాత్రి సమయంలో కాశీ నగర రక్షకిగా సంచరించి ఉదయ సమయంలో విశ్రాంతి తీసుకొనే దేవి. ఉదయం ఏడు గంటలకే పూజలు ముగించి ముఖద్వారాన్ని మూసివేస్తారు. అందువలన ఈదేవి దర్శనము ముందుగా ముఖ భాగము ఒక గవాక్షము ద్వారా తదనంతరం రెండవ వైపు అమర్చిన గవాక్షం ద్వారా పాద దర్శనము పొంది "వారాహీ వీర్య వందితా"అని నమస్సుమాంజలులు అర్పించ వలెను.

కామేశ్వరీ దేవి:-


సదా కామేశ్వరుని సతిగా ఆతనిలో అర్ధ భాగమై నిలచి ఉండే దేవి.భక్తుల కామ్యాదులను పూరింప చేయు మహా శక్తిమంతురాలు. స్త్రీలకు సర్వ సౌభాగ్యములను ప్రసాదింపచేయును. "కామేశ్వర ప్రేమ రత్నమణీ ప్రతిపణస్థనీ" అని స్తుతింపబడి నిత్యము పూజలందు కొనే కామేశ్వరీ దేవికి సహస్ర కొటి సుమాంజలులు.

త్రిముఖ కాళీ:-



"కాళీ" అనగా మహిమ గలది అన్న అర్ధము. దేవీ మహిమలు వర్ణించ అలవి కానివి. దర్శన మాత్రముననే భక్త కోటికి అనేక వరములొసగే కరుణామయి. "మహేశ్వరీ మహాకాళీ మహాగ్రాసా" అని స్తుతించిన ప్రీతి చెందుతుంది. దేవి నామాలు శ్రీమాత విరాడ్రూపసాక్షాత్కారాన్ని ప్రసాదింప చేస్తాయి. ప్రళయంలో మృత్యువుని సహితం మ్రింగివేసి సర్వ సృష్టినీ ఆహారముగా కబళిస్తూ ఆపోసన పట్టగల సమర్ధురాలు, అయిన దేవికి నమస్సుమాంజలులు.

విశృంఖలాదేవి:-



'శృంఖలాలు"అనగా సంకెలలు. అవి కారాగార సంకెలలు కావచ్చు ఇలలో భోగభాగ్యాలు అనుభవించే సంకెలలు కావచ్చు. ఇహపరబంధాలో చిక్కుకొని బయటపడలేక అలమటించుతూ తిరిగేవారిని బంధాలనుంచి దేవి విముక్తి కలిగిస్తుంది. "విశృంఖలా వివిక్తస్థా వీరమాతా వియత్ప్రసుహూ" అనే దేవి నామాలు వర్ణించడం అలవికానిది. మహిమాన్వితమైన దేవికి హృదయపూర్వక నమస్కారములు.

చండిచాముండమహారుండ:- 


ఏడు సంవత్సరాల బాలికను దేవీ నవరాత్రుల సమయంలో "చండిక" రూపంలో పూజించడం ఒక ఆచరం. "చండ" "ముండ" రాక్షసులను వధించినందున "చండి" "చాముండి" గా ఇలలో నెలకొన్నది."రురుడు" అనే అసురుని వధించి "మహారుండ" (చండిక) అన్న బిరుదాంకిత అయినది. "అపర్ణ, చండికా, చండా, ముండాసుర నిషూధినీ". "రురువు" శిరమునుశూలముతో ఖండించివాని చర్మం వస్త్రంగా ధరించిన అతి భయంకర రూపిణి శతృవులకు. మరి అదే సమయంలో కరుణామయితన భక్తులకు అని అభివర్ణించబడిన దేవికి ఇవే అశేష సుమాంజలులు.

రాజ రాజేశ్వరీ:- 


రాజాధి రాజులైన సుర ఇంద్రాదులు భూలొక సామ్రాట్టులు, ఇహలోకంలో రాజ్యాలు పోగొట్టుకొన్న ధీరులు వీరులు ఎందరో ఆమెను స్తుతించి పూజించి రాజ్యాల్ని పొందటమే కాక మహిలో సర్వ సంపదలతో తులతూగేరు. తరించేరు. "రాజ రాజేశ్వరీ రాజ్య దాయినీ రాజ్య వల్లభా రాజత్కృపా రాజ్య పీఠా నివేసితా నిజాశ్రితా రాజ్య లక్ష్మీ కోశనాధా చతురంగ బలేశ్వరీ" అని స్తుతించితే అశేష వరాలను కురిపిస్తుంది.ఇన్ని బలములతో విలసిల్లే రాజేశ్వరీ దేవికి నమస్కారములు

వింధ్యవాసిని:-



శక్తిపీఠాలలో ప్రసిద్ధి చెందిన దేవి వింధ్య పర్వతాలలో వెలసిన రూపిణి కావున "వింధ్యవాసిని" అను మనోహరమైన నామంతో  భక్తుల పూజలను అందుకొంటున్నది. "విశ్వాధికా వేద వేద్యా వింధ్యాచలనివాసినీ" జగత్తు అంతా తన చేతిలోనే వేద వేదాంగాలతో కూడి నిక్షిప్తమై ఉందని తెలిపే జననీఅశీర్వాదలకై శిరస్సు వంచి మ్రొక్కుతూ నిలచిన జన్మమే ధన్యము.

వైష్ణవీ దేవి:



సాక్షాత్ దుర్గా దేవి మరొక రూపమే వైష్ణవీ దేవి. "విశ్వగ్రాసా విద్రుమాభా వైష్ణవీ విష్ణు రూపిణీ" శివ కేశవులలో భేధం లేదు అని చాటి చెప్పే వైష్ణవీ దేవిని లలితా సహస్ర నామాలలో విధంగా వర్ణించడమైనది. త్రికూట పర్వతముపై నెల కొని ఉన్న వైష్ణవీ దేవికి శతకోటి నమస్సుమాంజలులు.

గవ్వలమ్మ దేవి:-



దేవిని కాశీ నగర గ్రామదేవతగా అభివర్ణిస్తారు. గవ్వలతో అలంకృతమైన దేవి తన అభయహస్తముతో కరుణా కటాక్షములతో కాశీ నగరాన్ని నగరవాసుల్ని అనంతకోటి భక్తులను కంటికి రెప్పలా కాపాడుతుంది. దేవి అనుగ్రహమునకై వందనాలు అర్పించడము ఎనలేని సుకృతం.

భవానీ మాత:-



సదా కాశీ వాసులను వారి యోగక్షేమములను కష్టనష్టములను చూసే దేవత.సాధారణంగా భక్తులు దేవిని దర్శించుకొని మోక్ష భిక్షను కోరుకొంటారన్నది సత్యము.

దుర్గా దేవి:-



దుర్గముడు అనే రాక్షసుని దునుమాడి "దుర్గ" అను నామముతో విరాజిల్లుతున్నది. ఈమెను పూజించిన వారికి విధములైన శతృభయములు ఉండవు. భూత, ప్రేత, పిశాచముల బారి నుండి సదా రక్షించును. విష జ్వర బాధల నుండి కాపాడును. విఘ్నములను హరించి విద్యా బుద్ధులను ప్రసాదించే దుర్గా దేవి దర్శనమే పరమ పవిత్రము. జన్మ ధన్యము.

దీప్తాదేవి:



సర్వదా తన భక్తులకు ఆరోగ్యాన్ని ప్రసాదించే కరుణామయి. హృదయపూర్వకంగా భక్తితో చేసే వందనములు దేవి తప్పక స్వీకరిస్తుంది.

సంతోషీమాత:-



సదా తన భక్తులకు సుఖ సంతోషములను కలిగించే దేవి. ఆమె కన్నుల్లో సదా ప్రతిఫలించే సంతోషకిరణాలు భక్తుల ధుఖములను హరించి కష్టములను పటాపంచలు చేసి వారిని ఎల్లప్పటికీ సంతోషంగా ఉంచుతాయి అనడంలో ఎంత మాత్రం సందేహము లేదు. "జై,జై, సంతోషిమాతా జై.జై" అనే భక్తుల పాటలతో నిండిన పరిసరములలో ప్రతిధ్వనించే నినాదములే అంతులేని స్పూర్థిని, అంతులేని సంతోష బలాన్ని ప్రసాదింపచేసే దేవికి అనంతకోటి నమస్కృతులు.

శీతలమాత:-



ఈమె దర్శనం సదా ఆరోగ్యానికి రక్షణ ఇచ్చే కవచం.చల్లని తల్లి. చల్లని నీటి పాత్ర చేతిలో ఉంచుకొని తన దరి చేరిన భక్తులను తన చల్లని కరుణాకటాక్షములతో చూపులతో కాపాడుతుంది. ఈమెను ఆరాధించిన వారిని విషజ్వరాలు, కలరా, విరోచనాలు, మొదలగు అతి భయంకర వ్యాధుల దరిచేరకుండా సదా రక్షిస్తుంది. ముఖ్యంగా దేవిని మశూచికం నివారించే దేవతగా ఆరాధిస్తారు. ఇంతటి మహిమోన్నతమైన దేవికి అనేక కోటి వందనములు.

కాల భైరవుడు:-



కాశీ పట్టణ శాసకుడు. ఈతని దర్శనము వలన అనేక జన్మల పాపములునశించును. భక్తుల పాపములను భక్షించును కావున "పాప భక్షకుడు" దుష్టుల మనోరధములను మర్ధించును కావున "అమర్ధకుడు" అను నామములతో ప్రసిద్ధిచెందెను. కాలభైరవుని దర్సనము వలన అశుభ కర్మల నుంచి భక్తులు విముక్తులగుదురు. ఈతని వాహనము శునకము. ధర్మానికి ప్రతీకగా ధర్మరాజు వెంట నడచిన సంఘటన మహాభారతములో వర్ణించబదినది. కార్తీక సొమవారం చేసే పూజలో కాల భైరవునికి నైవేద్యములు సమర్పించి పూజించడము ఒక ఆచారంగా నేటికీ నిలచినది. పాపములను హరించే దేవుని కృపా వీక్షణాల కొరకు నమస్కరించడమే ఒక విశేషం.


బృహస్పతి మందిరం:-




దేవతలకు గురువు బృహస్పతి. దర్శించిన వారికి విద్యాబుద్ధులు, అనంతమైన జ్ఞానసంపదలు ఒసగును. "బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం" అని త్రిలోకల్లో వేడుకొనే అనంత కోటి భక్తుల మదిలో జ్ఞాన దీపం వెలిగించే అతి సాత్మీకుడైన గురువు బృహస్పతికి అనంత కోటి ప్రణామములు.

లక్ష్మీ నారాయణ:-



అల వైకుంఠ పురమున వెలసిన లక్ష్మీనారాయణులు కాశీనగరములో వెలసి భక్తులకు తమ అభయహస్తములతో అఖండ సంపదలు కలిగేటట్టుగా వర దాన మొసగి దీవించి పంపుతారు. వారికివే నమస్సుమాంజలులు.

బిందు మాధవుడు:-



పూర్వము అగ్నిబిందువు అనే బ్రాహ్మణుడు కాశీలో పంచ గంగా తీరమున వెలసిన లక్ష్మీ కేశవులను స్తుతించుతూ అనేక సంవత్సరములు తపస్సు చేయగా మెచ్చి కేశవుడు వరము కోరుకొమ్మనెను. అగ్నిబిందువు ఆతనిని సదా పంచ నదీ తీరములో నెలకొమ్మని మరియు అచట స్నానమాచరించిన వారికి సకల సంపదలు మోక్షము ప్రసాదింపుమని వేడుకొనెను. అందులకు అంగీకరించిన కేశవుడు ఆతని భక్తికి మెచ్చి నాటినుంచి తన పేరు "బిందు మాధవుడు" అని తీర్ధము "బిందు తీర్ధం" గా విరాజిల్లునని కాశీలో తనని దర్శించిన వారు అగ్నిబిందువు వలెనే ఉత్తమ గతిని పొందెదరని వరములొసగెను.

కృతయుగమున:- ఆదిమాధవుడు
త్రెతా యుగమున:- అనంతమాధవుడు
ద్వాపరయుగమున:- శ్రీదమాధవుడు
కలియుగమున:- బిందుమాధవుడు
అను నామములతో వ్యవహరింప బడుతున్న లక్ష్మీ నారాయణులకు ఇవే నమస్సుమాంజలులు.