కాశీలోని పంచ తీర్ధములలోని స్నాన మహిమ
గంగానదీ తీరములో 88 ఘాట్స్ ఉన్నాయి. అందులో రెండు మాత్రము (మణికర్ణికా ఘాట్, హరిచంద్ర ఘాట్) దహన సంస్కార కర్మలకు ఉపయుక్తమైనా మిగిలిన తీర్ధములు అన్నీ పూజాపునస్కారములతో తమదైన విశిష్టతను, పవిత్రతను ఆపాదించుకొన్నవే. ఈ తీర్ధములలో స్నానమహిమ అత్యున్నత ప్రశాంతత, శారీరక, మానసిక పవిత్రత భక్త కోటికి ఆపాదిస్తుంది అన్న నిగూఢ సత్యము వేద పురాణ ఇతిహాసములలో నిక్షిప్తమైఉన్నది.
రేవఘాట్
గంగానదీ తీరములో వెలసిన అతి ముఖ్యమైన, శ్రేష్టమైన తీర్ధము. సర్వ పాపములను హరించి ముక్తిమోక్షములను ప్రసాదించు పవిత్ర తీర్ధముగా ప్రదేశముగా వేద వ్యాస విరచితమైన స్కంద పురాణములో వివరించబడినది. ఈ తీర్ధ స్నానము అత్యున్నతము మరియు అమోఘమహిమోన్నతము.
కేదారఘాట్
గంగానదీతీరములో వెలసిన మరియొక ముఖ్యమైన తీర్ధము. ఇచట స్నానమాచరించిన వారు తమను తాము బాహ్యంగా శుద్ధి పరచుకొనటమేకాక అంతకరణములోకూడ శుద్ధులు అవుతారు అన్నది జగద్విదితము. అంతేకాక భక్త కోటి తమతమ పాపకర్మలనుండి ప్రక్షాళితం అవుతారు. ఈతీర్ధ సమీపమున వెలసిన మహిమోన్నతమైన కేదారేశ్వరుని ఆలయము వలన ఈ తీర్ధమునకు "కేదార్ఘాట్" అను పేరువచ్చినది. అంతేకాక ఈ ప్రదేశము విజ్ఞానానికి అలవాలము. ఈ సౌందర్యవంతమైన తీర్ధ సమీపములో యోగనిష్టతో గడపడము భగవంతుని ధ్యానం అత్యంత ప్రశాంతతను లభింపచేయును.
దశాశ్వమేధఘాట్
గంగా నదీతీరములో వెలసిన అతి పురాతనమైన తీర్ధము. పూర్వకాలములో బ్రహ్మ దేవుడు ఈ పవిత్ర ప్రదేశములో పది అశ్వమేధ యాగములు చేయుటవలన "దశాశ్వమేధఘాట్" అని పేరొందినది. సాయంసమయములో "గంగా ఆరతి" అనే విశేష కార్యక్రమము చూడటానికి అశేష భక్త జనులు అత్యంత ఉత్సాహభరితులు అవుతారు. మొదటిసారిగా మదనమోహనమాలవ్య గారు ఈ గంగా ఆరతి కార్యక్రమము ప్రారంభించుట జరిగినది. హరిద్వార్, ఋషికేశ్ మరియు వారణాశిలో ఒకే నిర్ణీత సమయములో నేటికీ జరపబడటం విశేషమే. అదే సమయములో అనేక కోటి భక్తులుకూడా అరటి దొన్నెలలో ఆరతిని ఇచ్చి నదిలో వదలగా అత్యంత అందాలతో అలరారే దృశ్యము ఆదివిలో మెరిసే నక్షత్రాలు భువిపై దిగి గంగా ప్రవాహంలో అలలపైన తూగి ఊగుతున్నాయా అనిపించకమానదు. ఇది అనంత భక్తి పారవశ్యములో జనుల మనస్సులు ఉప్పొంగే దృశ్యవీక్షణమే.
పంచగంగా ఘాట్
గంగా తీరమున విలసిల్లే ఈ తీర్ధమున కిరణ, ధూతపాప, గంగ, యమున, సరస్వతి అను పంచ నదుల కలయికతో అత్యంత ప్రాముఖ్యాన్ని సంతరించుకొని "పంచ గంగా తీర్ధము" గా వెలసినది. ఇచట స్నానమాచరించిన వారు మరల పంచ భౌతిక శరీరమును ధరింపరు. అంతేకాక ఇచట దానమిచ్చిన పితృదేవతలు తరింతురు. స్తీలు గర్భవాస దుఖమును పొందరు. ఇంతయే కాక ఈ తీర్ధసమీపమున వెలసిన నవదుర్గలు, బిందుమాధవడు, మరియు మయూఖాదిత్యుడు ఎన్నో మరెన్నో వివిద మహిమలుగల దేవీ దేవతామూర్తుల సందర్శనము భక్తకోటి జన్మ తరింపచేయును. ఇన్ని మహిమలుగల ఈ పంచ నదీతీర్ధమునకు అశేష నమస్సుమాంజలులు.
మణికర్ణికాఘాట్
గంగాతీరమున నెలకొన్న అత్యంత ప్రముఖ తీర్ధముగా అభివర్ణించడమైనది. కాశీయందలి అన్ని తీర్ధములకన్నా విశేష మహిమకలిగినది. కాశేఎయందలి తీర్ధములన్నియు పాపుల స్నానమువలన తమకు సంక్రమించిన పాపములు పోగొట్టుకొనుటకై మణికర్ణికా తీర్ధమునందు స్నానముచేసి నిర్మలమగుచుందురు. ఇచట మధ్యాహ్న సమయములో స్నానమాచరించిన ఉత్తమ ఫలములు కలుగును అన్నది స్థానికుల నమ్మకము. కారణాలు అనేకం. ఆ సమయమందు విశ్వనాధుడు అన్నపూర్ణతో, వైకుంఠమునుండి హరి లక్ష్మీదేవితో, సత్యలోకమునుండి బ్రహ్మ సరస్వతితో, ఇంద్రాదిదిక్పాలకులు, మరీచాది మహర్షులు, నాగలోకమునుండి శేష, వాసుకాది నాగదేవతలు, తాపసులు, దానములు, యజ్ఞయాగములనొనర్చినవారు, చివరకు మోక్షప్రాప్తికై ఎందరో కోట్ల మానవులు ఈమణికర్ణికా తీర్ధములో స్నానమాడి తరించెదరు. ఈ నమ్మకమే ఆదికాలమునుంచి వేదాలలో సమయ నిర్దేశనమువిదించడమైనది. ఇచట గంగ నీరు పైకి బురదతో మలినమయముగా కనిపించినా మనము స్వచ్చ పరచుకొనే రీతిలోపైనీటినిపక్కకు తొలగించిన స్వచ్చమైన నీరు కనిపించడమే ఒక అధ్భుత విశేషము.
పైన ఉదహరించిన పంచ తీర్ధములలో రోజుకొక తీర్ధమున లేక ఒకే రోజున అయిదు తీర్ధములలో మధ్యాహ్నసమయములో స్నానమాచరించిన వారు పంచభౌతిక శరీరమును ధరింపరు అనే శాస్త్ర విధికి రీతికి ఇవే ఇవే అశేష నమస్కృతులు.
కాశీలో ముఖ్య కుండముల స్నాన మహిమ
లోలార్క కుండము
కాశీ క్షేత్రమునకు దక్షిణ దిక్కుగా "అసీ'నది సమీపమున ఉన్నది. "లోలము" అనగా "మిక్కిలి కోరికకలిగినది" "ఆనందితము" అని అర్ధము. కాశీ దర్శనమువలన సూర్యునిమనస్సు లోలమైనది అందువలన "లోలదిత్యునిగా" ఈ తీర్ధ సమీపమున వెలసి భక్తులను తన ఆశీస్సులతో అలరించుట విశేషమేమరి. “లోలర్కేశ్వరుడు" ఈ తీర్ధ సమీపమున వెలసి కాశీ జనుల మరియు భక్తుల యోగక్షేమములను వీక్షించును. ఈలింగ దర్శనమువలన సర్వపాపములు నశించును. ఇచట చేయు దానములు కొంచమైనను లభించు ఫలములు అలవికానివి. సమస్త తీర్ధ స్నాన ఫలములు భక్త కోటికి సంప్రాప్తించును. స్వచ్చతతో నిర్మలమైన జలము నేత్రరోగములు, చర్మరోగములు మరియు ఇతర వ్యాధులను నివారించును. స్నానము చేసిన అనంతరము వస్త్రములు అచటనే దానరూపములో సమర్పించే నియమంతో పాటు వేరొక వస్త్రము ధరించి అసీ నదీ సమీపమున వెలసినదేవికి షోడశోపచారములతో ధూప దీప నైవేద్యములతో పూజ చేసే ఆచారము నేటికి ఆచరింపబడుతున్న ఒక పవిత్ర కార్యము.
కాశీ క్షేత్రమున నెలకొన్న సూర్యభగవానుదు సాంబుని పేర "సాంబాదిత్యునిగా" ఇచట వెలసెను. సాంబుడు సూర్యకుండము నిర్మించి ప్రతీదినము సూర్యుని ఆరాధించి కుష్టురోగ విముక్తుడాయెను. ఇచట స్నానము పరమ పవిత్రతను ఆపాదించును. అవియేమనగా సర్వవ్యాధులనివారణ, సర్వసంపదలుభక్తుల వరమైతే స్త్రీలు పూజించిన ఏ జన్మలోను వైధవ్యము పొందరు. గొడ్రాలుపుత్రవతి అగును. అనేక రోగములు నశించి, అనంత పుణ్యసంపదలు లభించటమే ఇచటస్నానమహిమగా ఆపాదించడమైనది.
కాశీక్షేత్రమున వెలసిన పవిత్ర కుండముగా భాసిల్లుతున్నది. దుర్గాదుర్గా ఘాట్ 1772 లో నారాయణ దీక్షిత్ అనే యోగి ద్వార నిర్మితమైనది. ఈ తీర్ధ సమీపాన వెలసిన దుర్గాదేవి మూర్తి స్వయంభు. ఈ మందిరము 18వ శతాభ్దములో నాగర విధానముతో నిర్మితమైనది. మందిరమునకు కుడిభాగమున నిరెమితమైన ఈ తీర్ధ స్నానము సకల పాపములను హరింపచేయును అనునది ఒక నమ్మకము అయితే సమీపాన వెలసిన దుర్గాదేవి ఆశీస్సులు భక్తుల దుర్గతులు తొలగింపబడుట ఇంకొక విశిష్టత.
పైన తెలిపినవి కొన్నిమాత్రమే. ఇంకా ఎన్నో కాశీ క్షేత్రములో అడుగడుగునా పవిత్ర తీర్ధములే వెలసిఉన్నవి. కావున ఇచ్చోట స్నానమొనరించినవారు ఇహలోకమునందు సర్వ భోగములను అనుభవించి దేహాంతమున ముక్తి పొందెదరు.
ఈ కాశీ క్షేత్రములో గడిపిన తొమ్మిది రోజులు ఆధ్యాత్మికతతో సంపూర్ణమైన యాత్రలో ఇంకా ఎన్నో ఎన్నెన్నో దర్శింప వీలుకానివి, మనసుకిగోచరింపనివి, అదృశ్యరూపములో కనుమరుగైనవి, మరియు అనేకనేక దేవతలు, యక్షులు,కిన్నెరలు, కింపురుషులు, విజ్ఞులు, యోగీంద్రులు. తాపసులు, యజ్ఞయాగాదులొనర్చిన మహాత్ములు, దానవులు, నాగులు, పశుపక్ష్యాదులు మరియు దానకర్తలచే ప్రతిష్టింప బడిన శివలింగములకు మహిమోన్నతమైన దేవి దేవతామూర్తులకు విశ్వవిఖ్యాతి చెందిన ఆధ్యాత్మిక సంపదలతో సతతము అలరారే ఈ భారత భూమికి ఇవే ఇవే మనమందరము శిరసు వంచి చేసే ప్రణామములుమరియు అశేష నమస్సుమాంజలులు తెలుపుతూ అల్లిన ఈ పద కవితల గీతమాలిక:
“వందే విశ్వ భారత జననీ
వందే పుణ్య నదుల సంగమ ప్రవాహినీ
వందే పంచతీర్ధ స్నాన సౌభాగ్య ప్రదాయినీ
వందే ఓంకార శివశక్తి స్వరూపిణీ
వందే షష్టిథికోట్ల లింగాల ఆశీస్సుల శుభకరిణీ
వందే భక్త కోటి ఆరోగ్య సంరక్షిణీ
వందే యుగయుగాల ఇతిహాసరూపిణీ
వందే పవిత్ర హారతుల సుప్రకాశినీ
వందే జననీ వర ప్రదాయినీ"