కాశీనగరములో నెలకొని కొలువు తీరిన ఈ ద్వాదశాదిత్యులు కాలవశాన కొన్ని శిధిలావస్థకు చేరుకొన్నా వాటిరూపు మసకబారినా మహిమలు తగ్గలేదు. ఈ మహిమోన్నతమైన్ ద్వాదశాదిత్యుల అవతరణ మరియు మహిమలు వర్ణించడము ఆ మహాత్ముడు వేదవ్యాసునికే సాధ్యమైనదా ఏమో మరి తెలియదు. వివిధ నామాలతో వెలసిన సూర్యభగవానుని మహత్యము అతి సామాన్య భాషలో అతిక్లుప్తంగా తెలియపరచటమే నా అభిమతము అని నేనంటాను.
విమలాదిత్యుడు
కాశీలో కంకువాన్ జనగంబరి గోడోవిలియా సమీపాన ఉన్న అతి పురాతనమందిరము.పూర్వం విమలుడనే రాజు కుష్టురోగ బాధతో తన భార్యాబిడ్డలను రాజ్యాన్ని త్యజించి కాశీకి వచ్చిచేరెను. అచట సూర్యుని మూర్తిని ప్రతిష్టించి ఎర్రని పుష్పములతో ధూప దీప నైవేద్యాలతో ఆరాధించెను. ఆతని అచంచల భక్తికి ప్రసన్నుడైన సూర్యుడు ఆతనిని కుష్టురోగ విముక్తిని విముక్తునిగా చేసి ఆతని కోరికపై "విమలాదిత్యుడు" అన్న పేరుతో వెలసిన పురాతన మందిరము. ఈతనిని దర్శించిన భక్తులకు రోగములు, దరిద్రము ఇత్యాది భాధలు కలుగవని వరమొసంగెను.
ద్రౌపదాదిత్య
కాశీలో విశ్వనాధ దేవస్థానమువద్ద వెలసిన ఆదిత్యుడే "ద్రుపదాదిత్యుడు" పాండవులు వనవాస సమయమున ద్రౌపదీ సమేతులై వారణాశికి చేరి తదనంతరము ద్రౌపది సూర్యభగవానుని ఆరాధించి ఆయన అనుగ్రహముతో మహిమోపేతమైన "అక్షయపాత్ర" పొందిన పవిత్ర ప్రదేశముగా అభివర్ణిచబదినది. వనవాస సమయంలో వారిని అనుసరించి వచ్చిన ఎందరో భక్తులకు ఆకలిదప్పులు తీర్చడానికి ముఖ్య ఆసరాగా మారినది. ద్రౌపది భక్తికి మెచ్చిన సూర్యుడు ఇచట "ద్రౌపదాదితునిగా" వ్యవహరింపబడుట సత్యము. ఈ ప్రదేశములో సూర్యుని శ్రద్ధగా ఆరాధించిన వారికి, పతివ్రత అయిన ద్రౌపదిని పూజించిన వారికి వ్యాధులు, ఆకలిదప్పులు మొదలైన కష్టములు ఉండవని ఆదిత్యుడు వరము ఇచ్చేను.
గంగాదిత్యుడు
కాశీలో నేపాలి మందిర సమీపాన వెలసిన సూర్యుడు "గంగాదిత్యునిగా" విఖ్యాతినొందెను. పూర్వము గంగానది భగీరధుని వెంట కాశీకి వచ్చినది. ఆసమయములో సూర్యభగవానుడు కాశీకి వచ్చిన గంగను స్తుతించెను. ఆ ప్రదేశములో వెలసిన ఆదిత్యుడు "గంగాదిత్యుడు" గా కొలవడము జరిగినది. కాశీలో ఈతని దర్శనమువలన భక్తులు ఎటువంటి దుర్గతుల పాలుకాకుండా కాపాడబడతారు.
వృద్ధాదిత్యుడు
కాశీలో మీర్ఘాట్ సమీపాన ఉన్న పురాతన మందిరము. పూర్వకాలమున వారణాసియందు వృద్ధహారీతుడనే బ్రాహ్మణుడు వార్ధక్యపు బాధలు పడలేక సూర్యుని ఆరాధించి సదాయౌవ్వనాన్ని కోరుకొనెను. ఆతనిభక్తికి మెచ్చిన సూర్యుడు వరమొసంగెను. ఈ ప్రదేశములో వృద్ధాదిత్యునిగా వెలసెను. ఈ ఆదిత్యుని దర్శించినవారు ముసలితనము, రోగములు మొదలగు దుర్గతులనుంది విముక్తులై సదా యౌవ్వనముతో విలసిల్లుదురు. మనోఫలసిద్ధి పొందెదరు.
అరుణాదిత్యుడు
కాశీలో త్రిలోచనేశ్వరుని దేవస్థాన సమీపమున త్రిలోచనాఘాట్ వద్ద వెలసిన మందిరము. కశ్యపునివలన కద్రువకు నూరుగురు పుత్రులు, వినతకు ముగ్గురు పుత్రులు కలిగారు. వారిలో మొదటివాడు ఉలూకుడు గుణహీనుడు. రెండవ కుమారుదు అరుణుడు పిండరూపములో ఉండగానే చూడాలనే ఆతృతతో పగలకొట్టగా ఆతని దేహము పైభాగము మాత్రమే తయారైనదిపాదములు కాలేదు. తన శరీర స్థితి చూసుకొన్న అరుణుడి ముఖంకోపంతో ఎర్రబడినది. తల్లిపై కోపగించుకొని ఆమెను సవతి తల్లి కద్రువకు దాసివికమ్మని శపించి మూడవ అండం పగులకొట్టవద్దని ఆతని ద్వారా ఆమెకు దాస్య విముక్తి కలుగునని తెలిపి కుంటినడకతో కాశీనగరము వెడలెను. సూర్యుని ప్రతిష్టించి తపమాచరించెను. ఆతని భక్తికి మెచ్చిన సూర్యుడు అరుణుని తన రధ సారధిగా చేసుకొనెను. నాటినుంచి ఆదిత్యుడు "అరుణాదిత్యుడు" గా కీర్తినొందెను. ఇచ్చోట సూర్యుని ఆరాధించిన వారికి దుఖము, దారిద్రము,పాపములు, వ్యాధులు మరియు బధలు కలుగవని వరములొసంగెను. ప్రాత కాలమున సూర్యునితో కూడిన అరుణుని దర్శీంచిన వారికి నమస్కరించినవారికి దుఖ భయములు ఉండవు.
యమాదిత్య
కాశీలో సంకటఘాట్ సమీపమున వెలసిన ఆదిత్యుని మందిరము అత్యంత పురాతనము. ఒకానొకప్పుడు యమధర్మ రాజు ఆదిత్యుని కాశీనగరంలో ఇచట ప్రతిష్టించి తపమాచరించెను. నాటినుంచి ఈ ఆదిత్యుని "యమాదిత్యుడు" అని పిలవడమైనది. భక్త కోటి ఈ సూర్యుని ఆరాధించిన యమలోక యాతనలనుండి నరక బాధలనుండి విముక్తులవుతారు. ఇచట పితృదేవతలకు పిండ ప్రధానము చేసిన వారినుంచి ఋణవిముక్తులవుతారు అన్నది పరమ సత్యము.
మయుఖాదిత్యుడు
కాశీనగరములో పంచఘాట్ సమీపాన వెలసిన ఆదిత్యుడే "మయూఖాదిత్యుడు". మయూఖము అనగా "కిరణము" పూర్వము సూర్యుడు పంచ నదీ తీరమున గభస్తీశ్వరలింగమును, మంగళగౌరిని ప్రతిష్టించి లక్ష సంవత్సరములు తపమాచరించెను. ఆతని తపోజ్వాలలకు చరాచర జగత్తంతయు కంపించగా విశ్వేశ్వరుడు సూర్యుని పిలచినా పలుకలేదు. కట్టెవలె నిశ్చలముగాఉన్న ఆతనిని కరముతో స్పృశించగా కనులు తెరచి శివగౌరి అష్టకములను స్తుతించెను.ఆ సమయములో ఆకాశమునందు కిరణములు మాత్రమే కనిపించినవి. రూపు గోచరమవలేదు. అందువలన సూర్యుని ఇచట "మయూఖాదిత్యుడు" అని అభివర్ణించడమైనది. సూర్యునిచే స్తుతింపబడిన "శివ గౌరి అష్టకము" పఠించినవారు జన్మ రహితులై పుత్ర పౌత్ర సంపదలు పొందెదరు. ఈ కధను విన్న చదివిన నరకము పొందరు. ఇచట వెలసిన ఆదిత్య సాక్షాత్కార మహిమ అంత గొప్పది.
ఖకోలాదిత్య
కాశీలో కామేశ్వర దేవస్థాన సమీపమున వెలసిన మందిరము. ఒక రోజున ఆకాశమార్గమున చరించే వినత వీపుపై యెక్కిన కద్రువ సూర్యుని వేడిని భరించలేక ఆతనిని దూరంగా వెళ్ళమని వేడుకొన్నది.తన రెక్కలతో వినతపై పడి మూర్చ్చిల్లిన కద్రువ "నబ్యుల్కొనిపతేత్" అనుటకు బదులుగా భయంతో "ఖఖోల్కా" అని అస్పష్టంగా సూర్యుని నామం ఉచ్చరించినది. సూర్యుడు ప్రసన్నుడై తన తాపమును తగ్గించెను. వారికి ఉచ్చైస్వర్యం కనిపించగా దాని తోక నలుపా లేక తెలుపా అని వేసుకొన్న పందెం సూర్యుని తీవ్రతవలన సన్నగిల్లిన వినత చూపులకు నల్లగా కనపడినది. పరాజయం అంగీకరించిన వినత కద్రువకు దాసిగా మారినది. తల్లి ఆనతి మీద నాగులు ఉచ్చైస్వర్యం తోకను చుట్టుకొనడమువలన కూడా అలా కనిపించినది అని ఇంకొక కారణము చెబుతారు. తల్లికి దాస్య విముక్తి కలిగించడానికి ఆమె కుమారుడు గరుడుడు తగిన దారి తెలుపుమనగా సవతితల్లి సుతులు తమకు అమృతము తెచ్చి ఇచ్చిన దాస్య విముక్తి అగును అనిరి. తల్లి ఆశీస్సులుకైగొని గరుడుడు అమృతము తెచ్చుట కొరకు నింగికి ఎగిరెను. అమృతకోసాగారము సాయుధులైన రక్షకులతో కర్తరీయంత్రముపై ఉండుట చూసి ప్రవేశించుటకు దారి కానక బహువిధముల విచారించెను. పరమాణువులో వెయ్యోవంతు రూపము ధరించి కర్తరీయంత్రము సమీపించి అమృత కలశము హరించి నింగికి ఎగరెను.గగనవీధులలో పయనమవగా విష్ణుమూర్తితో ఒక పగలు ఒక రాత్రి పోరాడి ఆతని మెప్పుదలతో రెందు వరములు పొందెను.ఒకటి గరుడుడు ఆతని వాహనముగామారుట, తల్లికి దాస్య విముక్తి అగుట. మరియు విష్ణువు అమృతము నాగులకు దొరకకుండా దేవతలకు చేర్చమని ఆదేశించెను.
నాగులు స్నానమాచరించి అమృతపానము చేయరాగా ఆ సమయములో గరుడుడు అమృత భాండము దేవతలకుచేర్చు ప్రయత్నము చేసెను. ఆ పాత్ర స్పర్స కలిగిన నాగులు దర్భలపై చిందిన అమృతమును నాలుకలతో నాకడమువలన వారి నాలుకలు రెండుగా చీలి ద్విజిహ్వలైరి.
అనంతరము గరుడుడు అమౄతకలశము దేవతలకు చేర్చి కాశీలో శివలింగము ప్రతిష్టించి నిశ్చలమగు భక్తితో తపమాచరించెను. శివుడు ప్రత్యక్షమై ఆ లింగము "గరుడేశ్వరలింగం" గా విరాజిల్లునని దానిని పూజించిన వారు పరమ జ్ఞానము పొందెదరని వరమొసంగెను.
దాస్యపాప నివృత్తికై వినత "ఖఖోల్క" అను పేరుతో సూర్యుని ప్రతిష్టించి తపమాచరించినది. ఆమె భక్తితత్పరతకు మెచ్చిన ఆదిత్యుడు ఆమెను దాస్య విముక్తురాలిని చేసి పిలపిలాతీర్ధమున 'ఖకోలాదిత్యునిగా' వెలసెను. ఈ మహిమోన్నతమైన ఆదిత్యుని దర్శనమువలన సర్వ పాపములనుండి విముక్తులగుదురు.సర్వాభీష్టములు సిద్ధించును. వ్యాధిరహితులగుదురు. ఈ కధను చదివిన విన్న వారెల్లరు సర్వ పాప విముక్తులగుదురు.
కాశీనగరములో రాజ్ ఘాట్ సమీపములో ఉన్న పురాతన మందిరములో సూర్యభగవానుడు నెలకొని భక్త కోటి పూజలు అందుకొనుచున్న మహిమోన్నతుడు. ఆది కేశవుడు ఇచట సూర్యుని ఆరాధించెను కావున "కేశవాదిత్యుడు" అను నామముతోవ్యవహరింపబడటము జరిగినది. ఆదికేశవుడు కాశీలో శివలింగ మహిమను సూర్యునికి నివేదించగా అతి భక్తితో ఆతనిని గురువుగా భావించి ఉత్తర భాగమున నేటికి నిలబడి స్ఫటిక లింగమును పూజించుటే విశేషము. కేశవాదిత్యుని ఆరాధనవలన అజ్ఞానము తొలగి వాంచితములు నెరవేరును. మోక్షకారణమగు జ్ఞానమును పొందుదురు. సప్తజన్మ పాపములు నశింపచేయు శక్తిమంతుడైన కేశవాదిత్యుని మహిమ అమోఘము.
సాంబాదిత్యుడు
వారణాశిలో ఈ మందిరము సూర్యకుండమునకు సమీపములో ఉన్నది.సాంబుడు కృష్ణుని కుమారుడు. తన అందముచే గర్వితుడు. తాపస రూపుడై వచ్చిన నారదునిచూసి నమస్కరించ లేదు. అందుకు కోపంతో నారదముని "కృష్ణుని అష్టమహిషులు తప్ప మిగిలిన స్త్రీలు సాంబుని చూసి కామవశులు కావచ్చునని" శపించెను.ఒకదినము శ్రీకృష్ణుడు ఏకాంత మందిరములో ఉండగా సాంబుని ఆగమనముతో అచట స్త్రీలు వివశులై వలువలు సరిచేసుకొనిరి.ఇది చూసిన కృష్ణుడు అగ్రహించి సాంబుని కుష్టురోగుడవుకమ్మని శపించెను. సాంబుడు తన అపరాధము మన్నింపుమని వేడుకొనగా కనికరించి కాశీ వెళ్ళి సూర్యుని ఆరాధింపుమని తెలుపగా సాబుడు కాశీలో సూర్యుని ప్రతిష్టించిసూర్యకుండము ఏర్పరచి నిత్యమూ పూజలు గావించెను. ఆతని భక్తికి మెచ్చిన సూర్యుడు సాంబుని కుష్టురోగ విముక్తినిగావించెను. మరియు అచట "సాంబాదిత్యుడు" అను నామముతో వెలసెను. ఈ కుండములో స్నాన మొనరించి ఈమూర్తిని దర్శించినవారికి దుఖములు కలుగవు. యమలోకముచూడరు. ఆయురారోగ్యములు పొందెదరు. అనంత పుణ్యవంతులగుదురు.
లోలార్కాదిత్య
వారణాశిలో తులసీఘాట్ సమీపములో ఉన్నది. "లోలము" అనగా మిక్కిలి కోరిక కలిగినది.లేదా "ఆనందితము" అని అర్ధము. కాశీ దర్శనానంతరము సూర్యుని మనసు ఆనందముతో లోలమైనది. అందువలన ఇచట "లోలాదిత్యుడు" అను రూపముతో వెలసెను.లొలార్కకుండములో స్నానమాచరించినవారు అనంత ఫలములు పొందెదరు. సమస్త తీర్ధ స్నాన ఫలములు లభించును. ఈ తీర్ధ సమీపములో వెలసిన లోలార్కేశ్వరునిపూజించినా దానముచేసినా కలుగు ఫలములు అమితము. సంసార దుఖములను పొందరు. చర్మ రోగములు, నేత్ర రోగములు కలుగవు. ఇన్ని మహిమలతో అలరారే ఈ ఆదిత్యునికి అనేక వందనములు.
వారణాశి సిటీ స్టేషను సమీపములో ఉన్న మందిరము. కాశీకి ఉత్తర దిక్కున ఆర్క కుండముకలదు. కావున ఇచట వెలసిన సూర్యుదు "ఉత్తరార్కాదిత్య" అను నామముతో వెలసెను. సజ్జనులకు దుఖ హరుడై కాశీ నగరమును సర్వదా రక్షించును.ఇచ్చోట సూర్యుని ఆరాధించినవారిని వ్యాధులు, దారిద్యము బాధింపవు.సర్వ సుఖములు పొందెదరు.
పూర్వము కాశీయందు ఆత్రేయ వంశజుడైన ప్రియవ్రతుడను విప్రుడుండెను. ఆతనికి శుభవ్రత అను భార్య కలదు. ఆ దంపతులకు చాలా కాలము తరువాత "మూల" నక్షత్రమున సులక్షణ అను కుమార్తె జనించెను. ఆమెకు తగిన వరుని వెతకుటకు కష్టమైన తల్లితండ్రులు చింతతో ఈ లోకమును వీడిరి. సులక్షణ ఏకాకిని అయి ఉత్తరార్క సమీపమున ఘోరతపమాచరించినది. సూర్యోదయానికి ముందు చలికి వెరువక ఆర్క కుండములో స్నానమాచరించి కడు భక్తి శ్రద్ధలతో చేసిన తపస్సుకి మెచ్చిన శివపార్వతులు ప్రత్యక్షమైరి ఆమె భక్తికి మెచ్చిన పార్వతీదేవి ఆమెను తన ఇష్టసఖిగా చేసుకొనెను. అనేక సంవత్సరములు ఆమెతోపాటు ఒక మేక కూడా తిరిగినది. సులక్షణ తనతో పాటుగా సంచరించిన మేకను కూడా కనికరింపమని వేడుకొనగా మరు జన్మలో కాశీరాజు కుమార్తెగా జన్మించి అష్టభోగాలు అనుభవించమని దీవించడము జరిగినది. ఇప్పటికీ ఇచ్చట మేకను పూజిస్తారు.
ఎన్నెన్నో మాహిమలతో అలరారే ద్వాదశాదిత్యులకు అనేకానేక నమస్సుమాంజలులు.
No comments:
Post a Comment