Monday, 10 September 2018

నవీన మానవ సృష్టి (మొదటి భాగము)


రోజుల్లో చల్ల గాలికోసం వ్యాహ్యాళికి తిరిగిరావడం, పల్లెల్లో అయితే పొలాల గట్లపైన నడకతో పరిశుద్ధమైన గాలిని పీల్చడం జనులకు ఒక రకమైన వ్యాయామం. ఇండ్లలోకి గాలి వెలుతురు సమృద్ధిగా ప్రసరించే తీరులో గృహనిర్మాణం జరిగేది. పల్లెల్లో ఇండ్ల నిర్మాణం మట్టితో నిర్మించితే అభివృద్ధిచెందిన పట్టణాలలో నల్లరాతి పలకలతో, లేదా పాలరాతిపలకలతో వాతావరణానుకూల ప్రకారం వాస్తు పరిజ్ఞానంతో  నిర్మించడం వారి విజ్ఞాన సోపానానికి తొలిమెట్టు.  అందువలన బయట ఎండ మండిపోతూ ఉన్నా ఇండ్లలో చల్లదనం ఉండేది. ఇండ్లలోకి తగురీతిలో గాలి ప్రసరణకి వీధితలుపులు, పెరటితలుపులు తీసి వచ్చే గాలిని ఆస్వాదించేవారు. ఇంతేకాక పెరటిలోని చెట్లు ఇచ్చే చల్లని గాలిలో గడపడము స్వర్గ సమానమయ్యేది. వాకిలిలో మంచాలు వేసి కుటుంబ సభ్యులు చెప్పుకొనే కబుర్లు నవ్వుల పువ్వులు పూయించుకోవటాలు ఇవన్నీ కలలో జరిగినట్టు కరిగిపోయాయి. నిరాడంబర జీవితాలకి కాలం చెల్లిపోయింది.

ప్రస్తుత కాలంలో నవీన మానవ నిర్మిత వాతావరణానుకూల స్థితి వచ్చి చేరినది. మానవుడు తన ఇచ్చ ప్రకారం గాలిని శాసించగలడు. చలిని తనకు కావలసిన రీతిలో పొందగలడు. బయటనుంచి వీచే వేడిగాడ్పులను దరి చేరనీయడు. అంతా తను శాసించిన రీతిలోనే నడపగలననే భ్రమలలో ఉన్నాడు. కానీ స్వతంత్రురాలైన ప్రకృతి మాత్రం నీటిని పిడికిట్లో ఇమడ్చాలని ప్రయత్నిస్తే ఎలా జాలువారిపోతుందో అలాగే మానవసృష్టి సుఖాలు జారిపోతున్నాయి. మనిషి కళ్ళెములేని తనకోరికలనెలా అదుపు చేసుకోవాలో తన తెలివితో పెంచే సుఖసదుపాయాల వెనుక వచ్చే దుష్పరిణామాలు గుర్తుంచుకొని తదనుగుణంగా మారితే ప్రకృతి తప్పక అతని అదుపులో ఉంటుంది.



పూర్వం ఎయిర్ కండిషన్ గదుల్లో ఉండటము లగ్జరీ. ఎక్కడో నూటికో కోటికో ఒక్కరు అనుభవించేవారు. మిగిలిన వారు అది వింతగా చెప్పుకొనేవారు. ఎందుకంటే సౌఖ్యం సామాన్య మానవుడికి అందుబాటులో ఉండేదికాదు. కాలంలో కాయగూరలు, పండ్లు చల్లని బట్ట పరచి నీరు జల్లుతూ ఎండిపోకుండా కాపాడుకొనేవారు. వేసవి కురిపించే మండుటెండల్లో కుండల్లోని చల్లని నీరు, మజ్జిగ తప్ప వేరే ఎరుగనివాళ్ళు ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంటే అది సామాన్య విషయమా! ఎంతో గొప్ప. కొద్దిమందికో సౌలభ్యం ఉండేది. ఐస్ బండి వస్తేపిల్లలు సంతోషముతో దాని వెంట పరుగులు తీసి కొని తిని ఆనంద పడే రోజులు కనులముందే కరగిపోయాయి.

నవీన కాలంలో ఎయిర్ కండిషన్ అంటే ఏమిటో అది ఇచ్చే సౌఖ్యం తెలియనివారు లేరు. కాలక్రమేణ శీతల వాయువు నిర్దేసించే వాతావరణం నేడు అన్ని విభాగాల్లోను సృష్టించబడినది. సుఖం లేనిదే బ్రతకడం ఎలాగ అన్నది ప్రశ్న కాక ఇదే ప్రతీవారి జీవితంలో ప్రముఖ భాగమైపోయినది.



ఎంత పెద్ద భవంతులైనా పూర్తిగా గాజు తలుపులతో మూసేసి సెంట్రలైజెడ్ ఎయిర్కండిషను చేస్తున్నారు. అవసరం కొద్దీ దీపాలు రాత్రి, పగలు తేడా లేకుండా దేదీప్యమానంగా వెలుగుతూ దేవేంద్రసభను మరిపించేలా ప్రకాశిస్తూనే ఉంటాయి. బయటనుంచి వచ్చే సూర్యరశ్మి గాని, వెలుగు గానీ, గాలి గానీ ఎలా ఉంటుందో తెలియదు. మానవనిర్మిత శీతానుకూల వాతావరణం నేడు ఆఫీసులు, ఆసుపత్రులు, సినిమాహాల్స్, విమానాలు, మాల్స్, పరిశోధనా కేంద్రాలు, బ్యాంకులు, రైళ్ళు, గృహములు, కార్లు, కొన్ని విద్యాసంస్థలు బస్సులు, హోటళ్ళు అన్ని విభాగాల్లోను ప్రాచుర్యంలోకి రావడం సామాన్యులకు సౌలభ్యం అందుబాటులోనికి వచ్చి చేరినది.

మనం సుఖపడటానికే పుట్టాము అనుకొనే నేటి తరానికి పెద్దలు ఏదన్నా చెప్పబోతే అది చాదస్తం చేతకానితనం. ప్రస్తుతం వారు అనుభవించే సుఖాల్ని చూసి ఓర్వలేక అంటున్నారు అని నిందలు వేస్తున్నారు. పాతతరం వారికి సుఖపడటం రాదు అని కొట్టిపారేస్తారు. తామే ఈకాలంలో పుట్టినవారం కనుక ఇన్ని సౌఖ్యాలు, సుఖాలు అనుభవిస్తున్నాము అని గొప్పగా తమ సాంకేతిక విజ్ఞానం గురించి చెప్పుకొంటారు. వారి మాటల్లో నిజం నిగూఢమై ఉందా! లేదా! అభినధించాలో లేక రోజంతా ఎయిర్ కండిషన్ వాతావరణములో ఎటువంటి శారీరక వ్యాయామము లేకుండా మానసిక వత్తిడితో తమ తెలివితేటల్ని మాత్రమే పణంగా పెట్టి రోజంతా బ్రైన్ డ్రైన్ చేసుకొంటున్నందుకు వాపోవాలో తెలియటం లేదు. వత్తిడి నేటి కాలంలో పిల్లల దగ్గర్నించి పెద్దలవరకు అన్ని వర్గాలకు వర్తిస్తుంది. ప్రస్తుతం వీరు అనుభవిస్తున్న సుఖాల ముందు నీతులు పనికిరావు. "మేము కష్టపడి సంపాదించడములేదా?" అని ప్రశ్నిస్తే "అవును" అనే సమాధానం వస్తుంది. ఇది అనారోగ్య వాతావరణాన్ని వ్యాప్తీకరించే సుఖమేమరి. మానవ నిర్మిత శీతల వాయువు ఇచ్చే సుఖాల్లో ఎదురయ్యే అవాంతరాలు అనర్ధాలు చెప్పాలన్నదే నా అభిమతం.

జన రద్దీ ఉన్న ప్రదేశాలలో మనం పీల్చే గాలి కలుషితము. ఈప్రదేశాల్లో అనేక హానికరమైన సూక్ష్మజీవులు పెరిగి పోయి ప్రతిఘటింపబడలేనంత శక్తివంతమై ఆరోగ్యవంతుల ఆరోగ్యాన్ని చెడ గొడుతున్నాయి.  హనికర జీవులు వ్యాప్తి చెందేది ముఖ్యముగా ద్వారములకు, కిటికీలకు, కట్టే పరదాలు చాలా కాలం ఉండటమువలన, తగు సమయములో శుభ్రత చేయక పోవడమువలన శౌచాలయములలో విపరీతంగా పెరుగుతున్నాయి. ఎంత పరిశుభ్రత పాటించినా తగినంత గాలి, వెలుతురు, సూర్యరశ్మి ప్రసరించక పోవటంవలన సంక్రమణ క్రిములు పెరిగి వేరే రకం వ్యాధులు సంక్రమించడానికి, వ్యాప్తీకరించడానికి దారి తీస్తున్నాయి. సూఖ్మజీవులు గుర్తులు పోలికలు ఒకే తీరున ఉండటముతో రోగికి మరల పరీక్షలు జరిపి వ్యాధి నిర్ధారణ చేసే సమయానికి ఎంతో కాలం వ్యర్ధం అవుతోంది. కొందరి విషయంలో చేయిజారిన పరిస్థితి. నేటితరం వైద్యులకి వీటిని నిరోధించడము పెద్ద సమస్యగా మారినది. ఎంతో అభివృద్ధి చెందిన దేశాల్లో సమస్య ఉన్నది. దీన్ని బట్తి చూస్తే ఆరోగ్యవంతులకే కాదు రోగులకు కూడా ప్రకృతి ద్వారా లభ్యమయ్యే గాలి వెలుతురు, సూర్యరశ్మి ఎంతో అవసరము.

ఇంకా చిన్న పల్లెల్లో ప్రభావం అంతగాలేకున్నా అభివృద్ధి చెందుతున్న నగరములలో ఉన్న సమస్య క్రొత్తగా నిర్మించే "అపార్ట్మెంటు" జీవనంలో ప్రస్ఫుటిస్తోంది నేడు నిర్మించే భవంతులు అంతస్థుల మీద అంతస్థులు లేపేస్తున్నారు. అవకతవక ఇండ్లలోనికి ఎటునుంచి సూర్యరశ్మి గాలి వచ్చే అవకాసం లేకపోవడంతో విటమిన్ "డి" లోపం జనాల్లో క్రమేణ వచ్చి చేరుతోంది. చాలావరకు శౌచాలయములు పడకగదులకి వంటగదులకి దూరములో నిర్మించడము ఉత్తమము. నేడు ఇండ్లలో ఎన్ని గదులో అన్ని స్నానగదులను, మరుగుదొడ్లను నిర్మించడము జరుగుతున్నది. ఇది అవసరమా అనిపిస్తోంది. నేటి నవీన భవంతులలో (2బి. హెచ్ కె & 3 బి. హెచ్. ఖె) సర్వెంటుగది దానికి జోడిస్తూ స్నానగది, మరుగుదొడ్ది అతి కొద్ది జాగాలోనే నిర్మించి ఇంటికి అవసరమైన గాలి, వెలుగు, స్వచ్చత అనే సదుపాయములు దూరం చేస్తున్నారు. ఆధునిక జీవనము మనము దిగుమతి చేసుకొన్నదే. మన సంస్కృతి, సంప్రదాయము ఆరోగ్య రీతిరివాజులు కానేకాదు. లక్షలు కోట్ల రూపాయలు వెచ్చించి జీవనము దుర్గంధభరితము చేసు కొంటున్నాము. సమస్య సానుకూలమయ్యేది నేడు నిర్మించే కట్టడాలు వాస్తు పరిమితులోనే కాక వాతావరణ అనుకూలతతో నిర్మించడం ఎంతో ఉపయుక్తకరము మరియు సానుకూలము అన్నది నిపుణుల విశ్లేషణ. మనము వాతావరణంలో ఉన్నా అది . సి.  గదుల్లో అయినా, మామూలు వాతావరణం అయినా ఒదిగేటట్టుగా ఆరోగ్యరీత్యా ఇమిడేటట్టుగా ఉంటే వాతావరణాన్ని మనం నిర్దేశించడము కాదు వాతావరణమే మనకు ఒదిగి పోతుంది నేడేకాదు ఎప్పటికీ. అందుకే మన పెద్దలు అన్నారు "ఆరోగ్యమే మహా భాగ్యము" అని.

ఇక పండ్లు, కూరగాయలు విషయానికి వస్తే ఇవి ఎక్కువ కాలం శీతల గిడ్దంగిలో చాలా కాలం ఉంచబడతాయి. తిరిగి వాటికి కిట్టుబాటు ధర వచ్చినపుడు మార్కెట్లో విక్రయిస్తారు. మనం వాటిని కొని రిఫ్రిజరేటర్లో దాచినా చాలావరకు వాటిలోని పోషక విలువలు స్వచ్చత అంతరించి పోతాయి. కొన్ని విషతుల్యంగా మారవచ్చు అని నిపుణులు విశ్లేషణ. పరిస్థితిని ఎదుర్కొనాలి అంటే మనం కొనుగోలు చేసేవి మండీలవద్ద, లేదా వ్యాన్లలో పల్లెలనుంచి తెచ్చి అమ్మేవారివద్ద, సంతల్లో చేయడం ఉత్తమోత్తమమైన పద్ధతి.

నేటికాలంలో సెంట్రలైస్జడ్ ఎయిర్ కండిషన్ షాపుల్లో విక్రయించే పప్పు దినుసులు ఇతర నాణ్యమైన వస్తువులు పైకి స్వచ్చతతో కనిపించినా మనం వాటిని తెచ్చి టిన్స్ లోపల దాచి వాడుకొనే సమయానికి పురుగులు పట్టి నిరుపయోగ మవుతున్నాయి. దీనికి కారణం మనం వాటిని నిలువ చేసే పద్ధతిలోనే లోపం ప్రస్ఫుట మవుతున్నది. కొంతకాలం చల్లని వాతావరణంలో, మరికొంతకాలం మామూలు వాతావరణంలోను మనం దాచే పద్ధతే కారణం. లోపం ఎక్కడ అన్నది ఆలోచిస్తే షాపులవారు, లేదా మనము కొన్న దినుసులు ఎప్పటికప్పుడు సూర్యరశ్మి ప్రసరింపబడే వాతావరణములో పరిశుభ్రము చేయడము అత్యంత సులభ పద్ధతి. ఇది అతి మామూలు విధానమే అయినా సూర్యకిరణాల వేడితో హానికర సూక్ష్మజీవులు పురుగులు వ్యాప్తి చెందకుండా రక్షణచేసే ఉపాయం. ఇదే విధానం పూర్వకాలంలో రైతులు ధాన్యం, పప్పుదినుసులు వగైరా ఇండ్లలో పొందుపరచుకొనే స్థానాలు పెద్దపెద్ద బానలు, గాదెలు. సకాలంలో లభించే దినుసులు చవకగాకొని ఎండపెట్టి దాచేవారు. వచ్చేది కాలమైనా అవి చెక్కు చెదరకుండా సంవత్సరమంతా నిలవ ఉండేవి.



నేటి కాలంలో ఇంకొక విపత్తు .సి బస్సుల్లో మరియు రైళ్ళల్లో ప్రయాణీకులకు చలిని తట్టుకొనేందుకు రగ్గులు వగైరా ఇస్తారు. మరియు సదుపాయం కోసమని, అందంకోసమని కట్టినపరదాలుకనులవిందు చేసినా వీటిని శుభ్రపరచడానికి తగిన వ్యవధి లేకపోవడముతోతిరిగి వాటినే మరల మరల  పయోగించడమువలన ఆరోగ్యానికి చేటు తెస్తున్నాయి. ఇందువలన వీటిలో దాగిఉన్న డస్ట్ మైట్స్, ఫంగస్, సూక్ష్మక్రిములు, నల్లులు  ఎన్నో మరెన్నో వ్యాప్తి చెంది ఆస్త్మా, జలుబు, దగ్గుమరియు జ్వరాలు వంటి వ్యాధులను వ్యాపింపచేస్తున్నాయి. ఇవి నివారించాలంటే వీటిని శుభ్రపరచే సులభ మార్గాలు ఎన్నో ఉన్నాయి.

సూర్యరశ్మిలో ఆరవేయడము, వాక్యూంక్లీనర్స్తో శుబ్రపరచడం, ఉతికి ఆరవేయడము, రగ్గులకి తేలికపాటిగలేబులు వేయడము, మరియు న్యాఫ్తలీన్ బాల్స్ మధ్య భద్రపరచడము కొన్ని పద్ధతులు. విషయమై సంభంధిత అధికారులు తగినంత శ్రద్ధ తీసుకొంటే ప్రయాణాలు ఆనందకరము ఆరోగ్యకరము అవుతాయి అనడములో సందేహం ఎంతమాత్రం లేదు.

మనము వాతావరణానుకూల భవంతులు నిర్మించవచ్చు గాలిని శాసించవచ్చు, అధిక వేడిని ఆపవచ్చు, వరదలు నివారించవచ్చు, వర్షాన్ని మేఘమధనం చేసి కురిపించవచ్చు, ఇవన్నీ చేయడమువలన మానవ సృష్టి ఇంత గొప్పదా అనిపించక మానదు. మానవ సృష్టి తెచ్చిన మార్పులలో ఎంతవరకు సఫలీకృతము అవుతాము అన్నది మన కృషి మీద మరియు జాగరూకత మీద ఆధారపడి ఉన్నది. ఆందుకే "కృషితో నాస్తి దుర్భిక్షం" అన్నారు.

ప్రకృతిలో ఉచిత శక్తి ప్రదాత సూర్యుడే. ఆతని రాక లేనిదే జగమంతా అంధకారమయం. ఆకిరణాలకున్న అమోఘ శక్తి వలన హానికర సూక్ష్మ జీవులు నశింపబడటమే కాక దీర్ఘకాల వ్యాధులెన్నో నివారింపబడతాయి. భూమిపై జీవత్వాన్ని చైతన్యాన్ని నింపుతున్న ప్రత్యక్షదైవానికి నవీనమానవ సృష్టిపై అల్లిన ఈస్వచ్చ శ్వేతసుమమాల హృదయ పూర్వకముగా అర్పించి శుభోదయాన్ని స్వాగతిద్దాము.



                                   "ఉదయాద్రిపై వెలసిన మార్తాండుని రాక
                                        ధరణి మదిలో నిలుపును ఆనంద రేఖ
                                        పక్షులు కిలకిలరవముల తో నిదుర లేచేవేళ
                                        చల్లని మలయ పవనమ్ములు వీచేవేళ
                                        దైనందిన జీవనారంభానికిదే సుప్రభాతం
                                        జన వ్యాహ్యాళికిదే తొలిమెట్టు"
                                        మానవనిర్మిత శీతగాలులు,గిడ్డంగి నిల్వలు
                                         విషభరిత శాకములు ఫలములు
                                         సూర్యవెలుగు నోచని గృహములు,శౌచములు
                                         శుద్దికి నోచని కంబళ్ళు పరదాలు
                                         రోగ భీతిని పెంచే క్రిములు,కీటకములు
                                         అష్టదిగ్భంధనముతో గడిపే జీవనమ్ములు"
                                         మన దారుణభవితవ్యములు కావని చెప్పే
                                         నవతర విజ్ఞానులు
                                         దేశ స్వచ్చతకి ప్రాణప్రతిష్ట చేసినవేళ
                                         ఉదయాద్రిపై వెలసిన మార్తాండుని రాక
                                         ధరణి మదిలో నిలుపును ఆనంద రేఖ
                                    "యధా యదా హి ధర్మస్య
                                          గ్లానిర్భవతి భారత
                                         అభ్యుధ్హానం అధర్మస్య
                                         తధాత్మానం సృజామ్యహం"

3 comments:

  1. Very nice comparative and real scenario of both the times. I wish we will get back the good old golden era.

    ReplyDelete
  2. Thank you Mrs.Radha for the comment and encouragement

    ReplyDelete