కొండల కోనలలో పుట్టిన నదులు తమ సహజమైన రీతిలో నిర్మల ప్రవాహఝరిలో సాగిపోతూ గలగల పారుతూ దూకుతూ మంద గమనముతో పల్లెలు, పంటపొలాలు, జనవాసములు, నగరములు ఎన్నో మరెన్నో ప్రదేశములను దాటి మన ఐదువేళ్ళ మాదిరి ఐదు పాయలుగా విడివడి సాగరములో చేరడము అనునది భగవంతుని సృష్టి ప్రకృతి ధర్మం.
"నదీనాం సాగరం గతి" అనునది వేద నుడి.
"నీరు పల్లమెరుగు నిజము దేవుడెరుగు" అన్న నానుడి అక్షర సత్యము.
మనుష్య సంతతి తమ స్థిర జీవనమును నదీ తీరములలో ఏర్పరచుకొని, తరువాత కాలములో వ్యవసాయము ముఖ్య వృత్తిగా చేపట్టి, ఆప్రాంతములను అభివృద్ధి పరచి నీటి వ్యవస్తీకరణమునకై బావులు, చెరువులు, కాలువలు, వాగులు, నదులు ఝరులు అధిక ప్రాచుర్యములో వెలుగులీను పురాతన పద్ధతులు. మనదేశ ములో కొన్ని నదులు ఎప్పటికీ జీవంతవాగి ప్రవహిస్తే మరికొన్ని వర్షా కాలములో జలకళతో ప్రస్ఫుటించి తరువాత కాలములో ఎండి బీటలు పడే పరిస్థితి. మనకు లభ్యమయ్యే వర్షపు నీరు సద్వినియోగ పరచుకొన లేక పోతున్నాము. ప్రతీ వర్ష ఋతువులో కురిసే వాన నీరుని వ్యర్ధము చేయడము, సదుపయోగము చేసే సామర్ధ్యము లోపించడము, అధిక నీరుని సముద్రము లోనికి విడుదల చేయడము అనునవి మానవ దుష్కర చర్యలే. అసలు సమస్యలు మన దేశములో ఉన్న నదుల నీరు దురుపయోగము చేసే తీరులోనే నిబడీకృతమై ఉన్నవి. నేడు కాల చక్రభ్రమణములో ఋతు ధర్మములు మారిపోవడముతో అకాలములో వీచే పెనుగాలులకు ఉత్పన్నమయ్యే అతివృష్టి, అనావృష్టిలను తట్టుకొన గల శక్తి మానవాళిలో లోపించినది. ప్రతీ ఒక్కరు తమ తమ ధన సంపత్తులను వివిధ రూపములలో అతి జాగరూకతతో పొందు పరచుకొని నటులే వాననీరుని పొదుపుచేసి, సురక్షితము చేసికొనగలగాలి.
నేడు నదులపై రవాణాకొరకు వందలకొలది మోటారు లాంచీలు, నావలు, ఫెర్రీలు ఎన్నో లెక్కకు మించినన్ని నదీ తీరములలో నిలిపి వాటిలో మితిమీరిన జన సందోహములతో కలసి చేసే ప్రయాణము ఎంతో ప్రాణ భీతిని కలుగ చేస్తున్నది. అధిక బరువుతో వాహనములు నీటిలో ఒరిగిపోవడము, ఎందరో విగతజీవులుగా మారడము సర్వసామాన్య మైనది.
ఇవి ధన లాభము కొరకు ప్రైవేటు యాజమాన్యము చేసే పనికిరాని చేతలే. పారే నీటికి కొంతశక్తి, మరియు వాహనానికి కొంత పరిమితము సహజము. మితి మీరిన జన సంఖ్యతో చేసే ప్రయాణము హితకరము కాదు అనుసత్యాన్ని మనము గ్రహించు కొనవలెను. ఇంతేకాక తగిన రక్షణ కవచములు ధరింపక ఎందరో యువతీ యువకులు మరియు చిన్న పిల్లలు నదీజలములలో జరిపే కేళి వారి జీవనమునకు ముప్పు తెచ్చి పెడుతున్నది. సంభంధిత అధికారులు నియమ అతిక్రమణ జరిపిన వారికి శిక్షలు కఠినతరము చేయడము ఎంతో సురక్షితము. ప్రమాదకర ప్రాంతములలో తగు రక్షణా అధికారులను నియమించడము ఎంతో అవసరము. ఆపద వచ్చేక పరిష్కారము కొరకు కనపడని దారులు వెతికేకన్న ముందే జాగరూకతతో మెలగడము ఎంతో మేలు.
కొన్ని నదులలో ప్రతీ సంవత్సరము వచ్చే వరదల ఉధృతిని తట్టుకొనే సామర్ధ్యము నేడు కరవు అవుతున్నది. కొండల పైన వృక్షములు వివిధ కారణములతో తొలగింపబడుట వలన నీరు తన ప్రవాహ రీతిలో ఉధృతమై అనేక లోతట్టు తీరములకు చేరి ఎన్నో పల్లెలు, పంటలు, జంతు జాలములు జన జీవనమ్ముల రూపు రేఖలు మార్చి వేయబడటము, మరెన్నో అరుదైన జీవములు తమ ఉనికిని శాశ్వతముగా పోగొట్టుకొనిన పరిస్టితి నేడు ఎదురౌతున్నది. దేశ వ్యవస్థని, నెమ్మదిని అతలాకుతలం చేసి కొన్ని ప్రాంతములలో కనీసం త్రాగునీరు దొరకని పరిస్థితి, మరికొన్ని ప్రాంతములు వరద నీరులో మునిగిపోయిన స్థితి వలన ప్రకృతి చేసే భీభత్సములతో మానవసృష్టి వెలవెల పోతున్నది. ఈసత్యం మనకి అనుక్షణమూ తెలిసి వస్తున్నా మన నిర్లక్ష్యమే ఈ ప్రమాదములకు హేతువు.
అధికమైన నీరు కాలువలద్వారా, లేదా పైపుల ద్వారా నీటిఎద్దడి ఉన్న సుదూర తీరములకు పంపే పద్ధతి ఉత్తమము. భూగర్భ జలములను పొందు పరచుకొను మూలాధారములు బావులు, చెరువులు, ట్యాంకులు, నదులు వీటిని ఉపయుక్తపరచు కొనుట ఎంతో మేలు.
భారత దేశము స్వాతంత్రానంతరము ముఖ్య నదుల నీరు సదుపయోగ పరచుకొనడానికి గాను అనేక "బహుళార్ధక ప్రాజెక్ట్స్" నిర్మాణానికి నాందీ పలికినది. వీటిని "నవీనభారత దేవాలయములు" (మోడర్న్ టెంపుల్స్ ఆఫ్ ఇండియ) అని అభివర్ణించడ మైనది. ఈ ఆనకట్టల నిర్మాణము వలన కలుగు అనేక ప్రయోజనములు, లాభములు, పరిష్కరింపబడే కష్టనష్టములు దృష్టిలో ఉంచుకొని ఎన్నో కలలుసాకారము చేయగలమను ఆశాభావములు ప్రజలలో పొంగి పొరలినవి. త్రాగు నీటి పంపకము, వ్యవసాయము, నీటి రవాణా, మత్స్య పరిశ్రమలు, విద్యుత్ ఉత్పాదన, వరదలు అరికట్టబడటము లాంటి ఎన్నో లాభములు ప్రజలకి వివరింపబడటముతో వారికి వినూతన సంతోషకరమైన సందేశములు అందేయి. కానీ కాలక్రమేణ బహుళార్ధసాధక ప్రణాళికలు దేశాభివృద్ధికి అశనిపాతము అయినవి. నేటి కాలములో ఈశాన్య రాష్ట్రములలో, తూర్పు పశ్చిమ కనుమలలో మరియు హిమాలయ పర్వత శిఖరములపై వృక్ష సంపదలు నాశనము కావడమే ఒక ముఖ్య కారణము. ఇందువలన కొద్దిపాటి వర్షమునకే లోతట్టు ప్రాంతములన్నీ జలమయమైపోవడము అన్న పరిస్థితి నేడు ఎదురౌతున్నది. ఈ సమస్య ఎదుర్కొనే ఆయుధము మట్టి కొండల పైన ఒరిగి పడిన వృక్షములను సాధ్యమైన రీతిలొ పునః స్థాపితము చేసి జీవంతవాగి చిగురింప చేయడము కొంతవరకు వరద ఉధృతిని తగ్గిస్తుంది.
ప్రతీ నది ఆనకట్టకి జీవన ప్రమాణములో పూడికలు (సిల్ట్) ఎంతగానో ధరావతు అవడముతో అదిక నీటిని నిల్వచేసుకొనే సామర్ధ్యము లోపిస్తున్నది. సిల్ట్ వెలికి తీయబడటము ద్వారానే నీరునిల్వలు పెంపు చేయడము సాధ్యము అనునది నిపుణుల తీర్మానము. ఇది అత్యధిక వ్యయ ప్రయాసములతో కూడిన పని. ముందుగా సిల్ట్ నదులలో ఎంతమేరకు వ్యాప్తి చెందినది, ఏతరహా మన్ను అను విషయము తెలుసుకొని ముందువరియాలి. అర్ధికముగా కూడ అధిక భారమే. నిపుణుల ఆధ్వర్యములో తగు యంత్రములు, పంపులు, లేదా జలశక్తులు (హైడ్రాలిక్ ఎరోషన్) ఉపయోగించి నదులలో సిల్ట్ వెలికి తీయడమనునవి వ్యాప్తీకరించి ఉన్న కొన్ని పద్ధతులు ఉపాయములు.
ఈ సులభరీతుల పరిజ్ఞానముతో వెలికి తీయబడిన మన్ను "వ్యవసాయ పంటలకు అత్యంత శ్రేష్ట కరమైనది" అన్నది వ్యవసాయ నిపుణుల పరిశోధనలో నిరూపితమైనది. రైతులు తమ పొలములలో అదిక దిగుబడి కొరకు ఈ మన్ను వారి పంట పొలములకు తరలించు కొనడము అనే ప్రక్రియ వారికి ఆర్ధికముగా భారమైనను దిగుబడి అధికము మరియు లాభదాయకము.
నదీ తీరములలో పేరుకొని ఉన్న కలుపుమొక్కలు, ప్లాస్టిక్ వ్యర్ధములు, వస్త్రములు ఆదిగా ఎన్నో నదీ ప్రవాహమునకు అవరోధము కల్పించడమే నీటి నిల్వల సామర్ధ్యము క్షీనిపంచేయడము మరియు పరిసరములను దుర్గంధ భరితము చేయడము అనునది ముఖ్య సమస్య. ఇది పరిష్కరింప బడటానికి "స్వచ్చత" అను అస్త్రముతో నిర్మూలనము చేసి నదీ తీర అందాలు పెంపొందింప చేయుటకు పూల మొక్కలు, ఔషధ మొక్కలు, ఫల భరిత వృక్షములు లేదా ఉధ్యాన వనములను పెంపుదల చేయ గలిగితే పూడికల మన్ను సద్వినియోగ పరచబడటమే కాక ప్రకృతి అందాలు పరిరక్షించిన వారము అవుతాము అని నాఉద్దేశము.
నేటి కాలములో నదీ జలముల పంపిణీ కొరకు అనేక విరుద్ద వైషమ్యాలు రాష్తానికి రాష్తానికి మధ్య, వివిధ దేశాల మధ్య చెలరేగుతున్నాయి. ఈ జలవివాదములు పరిష్కరింపడే ఏకైక మార్గము వర్షపు నీటిని సద్వినియొగపరచి కాపాడుకొన గలిగిననాడు నదులలో నీటి నిల్వలు పెంచగలిగిననాడు జలపంపిణీ మార్గములు సుగమ మయమే అవుతాయి.
ఈ సమస్యలు ఎంతో అభివృద్ధి చెందిన దేశములలో ఎదురైనా నివారణకై వారు నదులపై చిన్న చిన్న ఆనకట్టలు అనేకము అనేకము నిర్మించి తాగునీరు, వ్యవసాయము, పరిశ్రమలకు జలపంపిణి ఆదిగా గల ముఖ్యావసరములకు ఉపయోగించడము గమనార్హం. అడవుల సౌందర్య వీక్షణకు " రోప్ వేలు " ముఖ్యాకర్షణ. అందువలన వారి దేశములలో అటవీ సంపదలకు, వన్య మృగములకు, ప్రకృతి సౌందర్యములకు ఎటువంటి విఘాతములు కలుగక పోవడము అనునది ప్రస్ఫుటించే ప్రత్యేకత.
కొన్ని దేశములలో వివిధ ఖనిజములు అత్యధికముగా లభ్యమైనా వాటి కొరకు కొండలు, గుట్టలు తవ్వి నాశనము చేయక పోవడము వాటి రక్షణే తమ ముఖ్య కర్తవ్యముగా భావించడము, అత్యవసర పరిస్థితులలోనే వెలికి తీయడమనునది వారి భవిష్య విజ్ఞానానికి ప్రతీక. ప్రకృతిలో లభ్యమైన వివిధ శక్తులు (సూర్య రశ్మి, గాలి, అలలు, జలపాతములు) వినియోగ పరచి ఎంతో విద్యుత్ లభ్యపరచు కొనడము ఉపయుక్తకరమైన రీతి రివాజులే వారి జీవన శైలి. ఇదే మనము వారివద్ద నేర్చుకొన వలసిన గొప్ప విషయ పరిజ్ఞానము. మన దేశములో కూడా ఈ ప్రయత్నములలో సఫలీకృత మవడానికి విషయ పరిజ్ఞానము మరి కొంత పెంపొందించు కొనడానికి శ్రీకారము చుడితే కనీసము భావి తరముల వారికి రక్షణ కల్పించిన వారము అవుతాము. అతి చిన్నవిగా కనిపించే ఈ అతి పెద్ద మార్పులు మనదైనందిన జీవితములో ఆచరణలలో పెట్టిననాడు, అవి నిజమై స్వచ్చమైన రూపురేఖలు దిద్దుకొనిన నాడు నవీన మానవుడు ప్రకృతి పరిరక్షణోద్యుక్తుడై భావి తరములకు రక్షణ కల్పించ గలిగిననాడు, ఈ పదముల అల్లిక సుగంధభరిత పరిమళములను వెదజల్లుతూ ప్రకృతి మదిలో ఎప్పటికీ నిలిచే అపురూప అనుభవాల సంపద అవుతుంది.
ఓం ప్రకృతి నమో నమః"
"ఓంకారముతో వెలసిన సృష్టే
ప్రకృతి వనరుల పవిత్రీకరణ
కృషితో దేశాల పరిరక్షణ
తిరుగులేని సందేశాల ఆకర్షణ
నవభారత సుసౌభాగ్యాల సంస్కరణ
మోదకరమైన భావి భాగ్య సంస్మరణ
నయనానందకరమైన అలంకరణ
మః మహిమాన్వితమైన ఆదరణ”
"నవీన మానవ సృష్టే ఇలపై వెలసిన స్వర్గం"