Friday, 12 October 2018

నవీన మానవ సృష్టి (మూడవభాగము)


మన భారత దేశములో రాజరికము సుస్థాపితమైన కాలమునుండి కాలినడకన ప్రయాణముచేసే, పల్లెప్రజలకుమరియు దూరతీరాలనుంచి అలసిచేరే ప్రయాణీకులకు రహదారుల్లో చెట్లనీడన సేదతీరటానికి ఆకలిదప్పికలు తీర్చడానికి ఉచిత ధర్మశాలలు, సత్రములు ఏర్పరచినారని మౌర్య చక్రవర్తి అశోకుడు రహదారుల్లో చెట్లు నాటించెనని చెరువులు బావులు త్రవ్వించెనని ధర్మశాలలు నిర్మించెనని చరిత్ర చాటి చెబుతోంది. తరువాత కాలములో అనుకూలతలు ఎందరో ధర్మదాతలు ప్రభువులు ప్రజలకు సౌకర్యములు కలుగచేసిరి కానీ నేడు పాత రీతి రివాజులు సమసిపోకుండా ప్రభుత్వమే ప్రజలకు చేయూతనివ్వాలి. కనిష్ట ధరలు నిర్ణయించి వ్యవసాయదారులు ముందుకిరావాలి. స్వసంపాదనకై దారులు వెతికే నిరుద్యోగులు లేదా రైతులు తమ పొలాల్లో, తోటలలో లభ్యమయ్యే పండ్లు, కూరగాయలు (కేరట్, దోస, టమాట, ముల్లంగి) పండ్లరసాలు, తాగునీరు స్వచ్చమైన రీతిలో బాటసారులకు సరఫరా చేయ డానికిముందుకి వచ్చిన నాడు ఆనందమే మన ముంగిట వాలుతుంది.

నేడు జాతీయ రహదారులను విస్తరింప చేయడానికి నీడనిచ్చే మహావృక్షాలను కూల్చివేస్తున్నారు.


మండుటెండలో ప్రయాణించే ప్రజలు సేదతీరే అవకాశము పూర్తిగా కోల్పోతున్నారు. ధనికులు, పేదలు అనికాదు ఎవరికైనా దాహం వేస్తే నీరుకావాలి ఆకలివేస్తే కడుపునిండా భోజనము కావాలి. సామాన్యులకు అందుబాటులో లేనివిధముగా రహదారిపొడవునా నేడు పబ్బులు, దాబాలు, కాఫీడే, మొదలైనవి వెలసి అత్యంత అధిక ధరలతో అమ్ముకొనే వివిధపానీయములు, ఆధునిక కాల్పనిక చిరుతిండ్లు తినడము చాలావరకు తప్పనిసరి అయినది. కారుల్లో, ద్విచక్ర వాహనములలో, ఎడ్లబండ్లలో ఎందులో ప్రయాణించే బాటసారులైనా నేడు నీడనిపొందే సదుపాయము కానక అల్లాడిపోతున్నారు. త్రాగేనీరు భోజనముతోపాటు చల్లని నీడని కూడా కొనుక్కునే పరిస్థితి వచ్చి చేరుతున్నది. ఇది మన సంస్కృతికే తీరని అవమానము. కనుక జనజీవనానికి ఉపయుక్తకరమైన కనీస అవకాసములు నేటి ప్రభుత్వములు కల్పించగలగాలి. ప్రస్తుత కాలములో ఇంకా భారత దేశములో 70 శాతమువరకు సామాన్యులే ఉన్నారు.

నేడు మనము ఎడారులు అనుకొనే ప్రదేశాలే ఒకప్పుడు పంటలు పండి జనవాసానికి అనుగుణమైన స్థలాలు. మనిషి చేతలవలనే భూసారము తగ్గి ఇసుక నేలలుగా మారాయి. ఈజిప్టు దేశాన్ని 'గిఫ్ట్ ఆఫ్ నైల్" అంటారు.




నిజానికి ఇది ఒక పెద్ద ఎడారి. సమీపాన నైలునది సుదీరతీరములవరకు ప్రవహించడమువలన ఆప్రదేశములు భూతల స్వర్గంగా పచ్చని పొలాలతో సస్యశ్యామలముగా మారినవి. నేడుకొంచము కృషి చేస్తే కొంచము శ్రమపడితే ఎడారిని తిరిగి నందనవనము చేయగలము. ముందుగా కొద్దిపాటి నేలను ఒండ్రు మట్టితో చదును చేసి తక్కువ నీటితొ పెరిగే మొక్కలు (డ్రైక్రాప్స్) వేసి తరువాత ఇదేరీతిలో నేలను విస్తరింపచేయాలి. ఎడారిదేశాలైన దుబాయి, బెహరీన్, సౌదీ వంటి సంపన్న దేశములలో కూడా పచ్చదనము పెంచాలనే అవగాహన పెరిగింది. వారు ముఖ్యమైన ఆఫీసులవద్ద వివిధ రకముల చెట్లు వేస్తున్నారు, అక్కడి వాతావరణానికి అనుగుణముగా రహదారుల్లో రోడ్ల కిరువైపుల ఖర్జూరం చెట్లు పెంచి వాటిని రంగురంగుల విద్యుత్ దీపాలతో అందముగా తీర్చిదిద్దడముతో సీజన్లో ఖర్జూర ఫలములతో నిండి పర్యాటకుల మనసుకు ఆనందము పెంపొందింపచేస్తాయి. ఇంకా ఎడారిలో పెరిగే ఒపన్షియ, కేక్టస్, పాం, వంటి వివిధ మొక్కలు ఎడారికే అందాన్ని ఇస్తాయి అనడములో సందేహం ఎంత మాత్రము లేదు.

తీర సమీపములలో సరుగుడు చెట్ల పెంపకము.తుఫానుల భీభత్సముల బారి నుండి రక్షణ కల్పించడమేకాక వీటివలన లభ్యమయ్యే కలప వంటచెరకుగా ఉపయుక్తకరము.



ఇంక ఉపయోగకరమైన వృక్షములను కేవలము వంటచెరకు కోసమని కూల్చి వేసే అమానుషచర్యలు నియంత్రించ డము కూడా ఒక శుభయుక్తకరమైన ఆలోచనేమరి. "తీర ప్రాంతములలో సరుగుడు చెట్ల పెంపకము దేశ ప్రగతికి చిహ్నమే ఆవుతుంది".

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో అభివృద్దికి సంకేతముగావిశాఖపట్టణము అర్బన్ డెవలప్మెంట్ అధారిటిగ్రేటర్ విశాఖ మునిసిపల్ కార్పొరేషన్" అనబడు ప్రముఖ సంస్థలు సాగరతీరాన ఇసుకనేలలో ఎన్నో అందమైన ఉద్యానవనములు పెంపుచేసి విశాఖతీరాన్ని పచ్చతోరణంలా శోభాయమానముగా తీర్చిదిద్దారు.



సాగరతీరాన పెరిగిన తోటలు ఎంతో చల్లదనాన్ని ఆనందాన్ని పర్యాటకులకు ఆపాదిస్తాయి. ఉదయ సాయం సంధ్యా సమయములలో సాగర తీరాన వీచే చల్లని గాలులు ఆస్వాదించడానికి ఎందరో విచ్చేయడము అభినందనీయమే. విజయము వెనుక ఉన్న వారి కృషి, దీక్ష, పట్తుదల అభినందిచదగినదే.

భారత దేశమంతా ఆదికాలము నుంచి చిత్రకళ, శిల్పకళ, కలంకారి, చేనేత, బంగారు వెండి, వజ్ర, వైడూర్య మరియు ముత్యాల తయారీకి, చిత్రవిచిత్ర మైన బొమ్మల తయ్యారీకి ఎంతో ప్రఖ్యాతిగాంచినది. కళలు ఇతర ప్రపంచ దేశములలో లభ్యముకానివి. కాలక్రమమున వచ్చి చేరిన మార్పులతో తగిన ప్రోత్సాహము కరువై కుటీర పరిశ్రమలు కనుమరుగవుతున్నాయి. మహాత్మ గాంధిగారు కూడా భారీపరిశ్రమలను అంతగా ప్రోత్సహించలేదు, ఖాదీ, చేనేత మరియు చిన్నపాటి పరిశ్రమలని అభివృద్ధి చేయమని సాధ్యమైనంత సామాన్యరీతిలో జీవనము సాగించమని ప్రభోదించేరు. ఎందువలన అంటే ఇవి చాలా తక్కువ పెట్టుబడితో అధిక లాభములు పొందే విధానములు.

స్వాతంత్రానంతరము మన నాయకులు భారీ పరిశ్రమల నిర్మాణానికి ముందడుగు వేసారు. అంతవరకు పారిశ్రామికముగా అభివృద్ధి చెందిన దేశములు, భారతదేశము పారిశ్రామికముగా వెనుకపడినదని అభిప్రాయ పడటము వలన నాటి నాయకులు అదే నిజమని నమ్మారు. విదేశ సరకుల దిగుమతులు అరికట్ట వచ్చునని, ఎగుమతులు పెంపొందించ గలమని ఎందరికో జీవనోపాధి కల్పించగలమన్న సదుద్దేశ్యముతో స్వాతంత్రము వచ్చిన తదనంతరము రెండవ పంచవర్ష ప్రణాళికలో భారీపరిశ్రమల అభివృద్ధికి మొదటిస్థానము నిర్దేశించడమైనది. కానీ ప్రస్తుత కాలములో పరిశ్రమల ద్వారా ఎదురయ్యే నష్టాలను ఎదురీదే పరిస్థితులలో ప్రబుత్వము లేదు. భారీపరిశ్రమల నిర్మాణం అన్నది నవీన మానవసృష్టే. పరిశ్రమలు దేశము అంతా విస్తరించి దేశ చిత్రపటాన్ని కలుషిత మయముగా మార్చివేశాయి.

కార్ఖానములలో విడుదలచేసే రసాయనములు శుద్ధి పరచనిరీతిలో నదులలోకి మరియు సముద్రములలోకి విడుదల చేయడము అమానుషమైనది. అమానుష చర్యలు దేశంలోని జలములను, నేలతల్లిని, జంతు జీవనాన్ని, చివరకు జన జీవనముపైన ప్రభావితమై పర్యావరణ వినాశనమునకు కారణభూతము అవుతున్నాయి అనడములో సందేహము ఎంతమాత్రము లేదు. “సాద్యమైనంత రీతిలో వ్యర్ధములను శుద్దిచేసి విడుదల చేయడమే సమస్యను ఎదిరించే ఆయుధము.



ఇక ఫ్యాక్టరీలద్వారా విడుదల అయ్యే కలుషిత వాయువులు పరిసరములలో వ్యాప్తి చెంది పరిసరములను విష తుల్యముగా మార్చడము ఇంకొక వినాశనము. “సాధ్యమైన రీతిలో ఫ్యాక్టరీ చిమ్నీల ఎత్తును పెంచడమే నివారణోపాయము.”

ప్రస్తుతకాలములో ఎన్నో వ్యవసాయ క్షేత్రములను సైట్స్ రూపములో భవంతుల నిర్మణానికి, వివిధ కార్ఖానముల నిర్మాణానికి అనుకూలముగా మార్చి వేయడముతో పల్లెసీమల రూపు రేఖలు మారిపోతున్నాయి. ఇదే అత్యున్నత సాంకేతిక విజ్ఞానాభివృద్ధి పెరుగుదల అనుకొంటే అది తప్పుడు భావనే.  వివిధ వ్యవసాయ సంపదలు పెంచే దేశం మనది. మనం తలచుకొంటే మన దేశప్రజలకే కాదు ఎన్నో ప్రపంచ దేశములలొని ప్రజలకు ఆహార ధాన్యములు సరఫరా చేసి ఆకలిదప్పులు తీర్చగల సామర్ధ్యము కలిగి ఉండి నవనాగరిక మోజులో పడి ఎన్నో ఆహారధాన్యములు దిగుమతి చేసుకొనే దుస్థితి రావడము విచారకరమే. ఈసమస్యను ఎదుర్కొనే ఆయుధము. భారీపరిశ్రమల కొరకు వ్యవశాయక్షేత్రములను నాశనము చేయకుండా బీడు భూములలో, లేదా బంజరు భూములలో లేదా వ్యవసాయమునకు అనుకూలము కాని ప్రదేశములలో నిర్మించడము ఎంతో ఉత్తమోత్తమమైన మార్గము. మన దేశములో మానవవనరులకు ఎటువంటి లోపము లేదు మరియు విజ్ఞానవేత్తలకు స్వసంపాదనా భీష్టులకు సంబందిత అధికారులు ప్రభుత్వ అనుమతితో కొన్ని వ్యవసాయ భూములను సురక్షితమైనరీతిలో కొన్ని సంస్థలను ఏర్పరచి వానిద్వారా పంపిక చేయడమన్నది జరిగిననాడు దేశ వ్యవసాయ, నిరుద్యోగ, ఆర్ధిక సమస్యలెన్నో సమసిపోతాయి.

వాహనదారులు సమయానుకూలముగా తగు సమయములో తమ తమ వాహనములకు "ఉద్గార"(ఎమిషన్) పరీక్ష జరపక పోవడము వలన అవి వదలే పొగతో వాతావరణము కాలుష్యమయము అవుతున్నది. పాదచారులకు, ద్విచక్ర వాహనదారులకిది విషమ పరిస్థితి. “ సమస్య అరికట్టబడటానికి వాహనములకు ఉద్గార పరీక్ష ముఖ్యము అన్న నిభంధనతో పాటు పట్టు బడినవారికి శిక్ష కఠినతరము చేయగలగాలి.



విపరీతమైన వేగముతో అత్యధిక జనసందోహములతో వేగపరిమితి లేక చేసే ప్రయాణము అత్యంత భయంకర వాతావరణము సృష్టించడముతో ప్రాణములు గుప్పిట్లో పెట్టుకొని ప్రయాణించే పరిస్థితి నేడు నెలకొన్నది. ట్రాఫిక్ సిగ్నల్స్ ఉన్నా వాహనదారులు అతి నిర్లక్ష్యముతో ముందువరియడము అయోమయ అవస్థలో పాదచారులకు ఇక్కట్లు తెస్తున్నాయి. బెహరీన్ వంటి కొన్ని దేశములలో వాహనము నడిపేవారు ఎంత ధనికులైనా పాదచారులకు ప్రముఖస్థానము ఇచ్చి, వేగ పరిమితి తగ్గించి వాహనము ఆపి, తమ సహాయ హస్తం అందించి ఇచ్చే గౌరవానికి వెల కట్టగలమా!

వేగపరిమితి ఉల్లంఘిస్తే శిక్షలు కఠినతరం అన్న భయభీతులు వాహనదారులకు కలిగిన నాడు ప్రజలు తమ స్వంత వాహనము లేదా బాడుగ వాహనము ఎందులో ప్రయాణించినా అందమైన, ఆనందమైన, సురక్షితమైన అనుభవమ్ములు తమ స్వంతము చేసుకొంటారు అనడములో సందేహము ఎంత మాత్రములేదు. ఇంక రహదారుల్లో సాగే వాహనములు రాత్రి పగలు అనక అవసరము ఉన్నా లేకపోయినా వాడే హారన్స్ రొదతో శభ్ధ కాలుష్యము రోజురోజుకి అధికము అవుతున్నాది. ముఖ్యంగా అభివృద్ధికాని పల్లెలలో, నగరములలో నియమాలు మీరడమువలన ఈసమస్య అధికం అన్నది జగద్విదితము. అందువలనవాహనదారులు అత్యవసర పరిస్థితులలో మాత్రమే హారన్స్ ఉపయోగించే సక్రమరీతిని నేర్వాలి.

సుదూరతీరములకు ప్రయాణించేవారికి ముఖ్యముగా రాత్రి పూట బస్సులలో వేడుక కోసము వేసే సినిమాలు మితిమీరిన శభ్దముతో చెవుల్లో హోరెత్తించే ప్రయాణము అత్యంత కర్ణకఠోరముగా మారడమేకాక శభ్ద కాలుష్యము పెరిగిపోయి వినికిడి శక్తి దెబ్బతినడానికి అవకాశములు మెండు. ఇందువలన జనులు మానసిక, శారీరక అలసటతో ప్రయాణ సౌఖ్యాన్ని అనుభవించ లేక పోతున్నారు. నేడు శభ్ద కాలుష్యమన్నది ఆధునిక సినీధియేటర్లలో ప్రస్ఫుటముగా కనిపిస్తున్న సమస్య. పాటలు, మాటలు, ఫైట్స్ సమర్ధవంతముగా రావాలని మితిమీరిన శభ్ధము వలన అవి అర్ధము కాని రీతిలో ఉండటము నేడు ఫ్యాషన్ గా మారిపోయినది. “మైకులద్వారా వినిపించే ప్రసంగములు అర్ధవంతమైన రీతిలో వినగలగాలి అంటే మైకు ద్వారా వచ్చే శభ్ధ తరంగములను అదుపు చేయడమే నివారణమార్గము.

శ్రావ్యమైన రీతిలో సంగీతమును, సుస్పష్టమైన ఉచ్చారణతో వెలువడే పద ప్రయోగములు, మనసుకు ఉత్సుకత ఉల్లాసం కలిగించే కధా గమనాన్ని నెలకొల్పిననాడు సాంకేత పరముగా ఎంతో అభివృద్ధి చెందిన విజ్ఞానాన్ని మనము సదుపయోగము చేసుకొన్నవారము అవుతాము.

మనలోని మానవత్త్వ మమకారములు వెలువరించే పదముల అల్లికలు భారతమాత చరణములపై నిలిచే వసివాడని కమలములు.



"జై జై భారతజననీ-జై జై విశ్వప్రియ సుభోధినీ
భువిపై వెలసిన సాగరమ్ములు/పంచ భూతములు
గిరులు/తరులు-నదులు/నదములు
విరులు/ఫలములు-ప్రజలు/ప్రభువులు
మండు టెండలో స్వాంతన ఇచ్చి
రహదారుల్లో ఆకలి దప్పులు తీర్చి
బాటసారులను గమ్యం చేర్చి,
ఎడారులలో తరువులు పేర్చి
కార్ఖానాలలో స్వచ్చత తెచ్చి,
వాహనముల శుభ్రత నేర్చి
పదోచ్చారణలో స్పష్టత కూర్చి,
ప్రసంగాలలో ఐక్యత చేర్చి
విశ్వ ఔన్నత్యాన్ని ఆకాంక్షించే,
శుభతరుణాలను ఆహ్వానించే
వినూతన ఆశయమ్ములే,
శుభోదయ వీక్షణములే
మనదైన గమ్యం"

No comments:

Post a Comment