Monday, 21 January 2019

సప్త సంఖ్యల విశిష్టతలు (ఆరవభాగము)


సప్త పుణ్య క్షేత్రముల ఆవిర్భావమే- భువిలో పెంచే పవిత్ర ఆధ్యాత్మిక సంపత్తులు
"అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచీ, అవంతికాపురీ, ద్వారావతీ చైవ సప్తైతే మోక్షదాయికా"

వేద కాలము నుంచి భారత దేశములో నెలకొన్న సప్త పుణ్య క్షేత్రములు నేటికీ తమతమ అగణిత పుణ్యసంపదలతో, వైశిష్టములతో, మహిమలతో, ఆధ్యాత్మిక భావములను భక్తకోటిలో ప్రతిబిబింప చేయుట విశేషమే. అయోధ్య, మధుర, కాశీ, కంచి, అవంతిక, ద్వారక, హరిద్వార్ ప్రముఖ సప్త పుణ్య క్షేత్రములుగా అభివర్ణింపబడినవి. భగవంతుని పేరుతో పిలచినా, పుణ్య క్షేత్రములో సందర్శించినా లభించే పుణ్యము అంతు లేనిదే అయినా పైన ఉదహరించిన సప్త క్షేత్రముల వీక్షణము పురాణములలో నిర్దేశించబడటానికి కారణము భగవంతుని పాద స్పర్శతో అవనిలో ధర్మ పరిరక్షణ ప్రతీ యుగములో నెలకొల్ప బడినది. బూదేవి అణువు అణువు పవిత్రతను ఆపాదించుకొన్నది. ఇన్ని మహిమలతో, మహిపోతమై వెలసిన సప్త పుణ్య క్షేత్రముల గురించి అతి క్లుప్తముగా విశదపరచడమే వ్యాస ముఖ్యోద్దేశ్యము.

అయోధ్య
వైవశ్వత మన్వంతర ఆరంభములో ఏడవ మనువుగా విలసిల్లిన వైవశ్వంతుని కుమారుడుగా ఇక్ష్వాకు మహారాజు జన్మించడము జరిగినది. అయోధ్యా నగరమును సరయూ నదీ తీరమున నిర్మించి పరిపాలించిన మొదటి చక్రవర్తి గా ఇక్ష్వాకు మహారాజు ఎనలేని కీర్తి ప్రతిష్టలను సంపాదించెను. తరువాత కాలములో సరయూ నదీ తీరములో అనేక సంవత్సరములు తపమాచరించగా, పరమేశ్వరి అనుగ్రహముతో నూరుగురు కుమారులు జన్మించిరి. వారు భూలోకములోని వివిధ దేశములను అనేక లక్షల సంవత్సరములు ధర్మనిరతితో సుపరిపాలన గావించిరి. ఇక్ష్వాకు వంశస్థులు అయోధ్యా నగరమును రాజధానిగా ఏర్పరచికొని విశేష వైభవములతో నగరమును తీర్చి దిద్దిరి.  సూర్య, మరియు చంద్ర వంశ చక్రవర్తులు తమ అగణిత శౌర్య పరాక్రమములతో సుపరిపాలన గావించి అయోధ్య ప్రతిభను ఉత్తుంగ శిఖరములపై నిలిపి ఆధ్యాత్మిక, వైద్య, విజ్ఞాన, సాంకేతికపర యుద్ధ నైపుణ్యతలతో అలరింప చేసిరి. త్రేతా యుగములో శ్రీరాముని జన్మస్థలముగా పేరుపొందడము ఒక విశేషమైతే ధర్మానికి మారు రూపైన శ్రీరాముడు 11000 వేల సంవత్సరములు ప్రజానురంజకముగా పాలించిన పుణ్య భూమిగా పేరొందినది.


అయోధ్యా నగరము కృత, త్రేతా, ద్వాపర, కలి యుగములలో విశేష ప్రతిభను సంతరించు కొన్నది. "రామ" "ఆయనము" అను విశేష పదములతో శ్రీరాముని జీవిత పయనమును ధర్మరీతిలో తీర్చిదిద్ది సామాన్యులకు అవగాహన కలిగించు రీతిలో వాల్మీకి మహర్షి ద్వారా విరచితమైన భారత ఇతిహాసిక కావ్యముగా, రామాయణము రూపు దిద్దుకొన్నది. అయోధ్యలో నేడు సరయూ నదీ తీరములో "అయోధ్యాఘాట్", విజయ రాఘవ మందిరము, హనుమ మందిరము, తేత్రాకిదాడూర్ (శ్రీరాముడు అశ్వమేధయాగము చేసిన ప్రదేశము) గోపతారాతీర్ధము (శ్రీరాముడు స్వర్గారోహణ చేసిన ప్రదేశము) ఆనాటి అయోధ్య వైభవమును తలపింపచేస్తాయి.

బ్రహ్మాండ పురాణము అయోధ్యను పవిత్ర పుణ్య స్థలముగా వర్ణించితే ఆదిపురాణము కీర్తి ప్రతిష్టలలో సాటిలేని నగరము అని తెలిపినది. విష్ణుపురాణము "సాకేతపురము" గా అభివర్ణించినది అనగా అత్యంత ఆకర్షణీయమైన సాకేతపర విజ్ఞానముతో భవంతులు, గృహములు సక్రమ రీతిలో నిర్మింపబడిన పట్టణముగా అయోధ్యా నగరము పేర్కొనబడినది. అధర్వణ వేదము నగరము శతృవులు ఆక్రమించుటకు అభేద్యము, అసాధ్యము అయినది కావున "అయోధ్య" అని తెలిపెను. సత్యోపాఖ్యానము నగరము పాపములను ప్రక్షాళింప చేసే పుణ్యభూమిగా పవిత్రతను ఆపాదింప చేసినది. 5 మరియు 6 బి.సి. మధ్య కాలములో బౌద్ధ మతస్థులు నగరమునకు "శ్రావస్థి" అని నామాంకితము చేయడము మరియు వైభవోపేతమైన నగర చరిత్రను తమ గ్రంధములో విపులీకరించడము ఒక విశేషమైతే విక్రమాదిత్యుడు తన పాలనలో సాహిత్య వేత్త అయిన "వాసుబంధు" అను బౌద్ధ విజ్ఞానిని 30000 వేల బంగారు నాణెములతో సత్కరించగా ధనముతో అనేక బౌద్ద ఆరామములను అయోధ్యలో నిర్మించి బౌద్దమతమును విస్తరింపచేసెను. 1838 లో రాబర్ట్ మెట్గోమ్నీ మార్టిన్ "రామావతార పరిసమాప్తానంతరము అయోధ్యా నగరములో కొన్ని దేవాలయములు శిధిలావస్థకు చేరుకొనగా 4 శతాభ్ధములో ఉజ్జయినీ అధినేత విక్రమాదిత్యుడు 300 దేవస్థానములను పునర్నిర్మితము గావించెను అనునది చారిత్రక సంఘటన

మహాకవి కాళిదాసు "రఘువంశ" కావ్యములో అయోధ్య ప్రతిభను, వైభవమును వర్ణించెను. ఏడవ శతాభ్ధములో చైనా దేశ రాయబారి "హుయెన్-త్సంగ్" " ఒయూత్ " (.యు.ట్.) అను పేరుతో అయోధ్య నగర వైభవమును స్తుతించెను. 1226 సి..లో ఢిల్లీసుల్తానేట్ "అవధ్" విభాగము తీర్చిదిద్దిరి. జైన మతస్థులు అయోధ్యా నగరము అనేక మతముల కలయికతో విజ్ఞాన సంపదలతో ఏర్పడిన నగరమే కాక ఐదు మంది జైన తీర్ధంకరులు జన్మించిన పవిత్ర భూమిగా భావించి తమ మతమును విస్తరింప చేసిరి. 1707 లో ముఘల్ చక్రవర్తుల పరిపాలన అంతము కాగా అయోధ్య స్వతంత్ర రాజ్యముగా మారి కొంత కాలము విలసిల్లినా, 1856 లో ఆంగ్లేయుల పాలనలో మిళితమైనది. "ఆగ్రా-ఔధ్" మధ్య వెలసిన భూభాగము కావున ఆంగ్లేయులు "అజోధ్య" అను పేరుతో పరిపాలన గావించిరి. 1528-29 సంవత్సరములో ముఘల్ పరిపాలన భారత దేశములో స్థాపితము చేసిన బాబర్ ముఖ్య అనుచరుడైన "మీర్ భాక్వీ" బాబర్ ఆనతి మీద అయోధ్యలో శ్రీరాముని జన్మస్థలమైన మందిరమును విధ్వంసము చేసి స్థలములోబాబ్రీ మసీదునునిర్మించెను. ఘఠన హిందూ, ముస్లిముల మధ్య వైషమ్యములకు దారితీసెను. తరువాత కాలములో అనేక మంది పాలకులు, ప్రజాధిపతులు, న్యాయాలయములు అతి సున్నితమైన, కఠినాత్మికమైన సమస్య పరిష్కారము కొరకు దారులు కానక ఎన్నో పర్యాయములు ప్రయత్నించి చివరకు సాధ్యము కాక తాత్కాలిక న్యాయ పరిష్కారము కావించిరి. భవిష్యత్తులో భారతదేశ పుణ్యభూమి అయిన అయోధ్యా నగరములో ఇరు మతముల మధ్య శాంతి, నెమ్మది, సౌభాతృత్వము నెలకొల్పు సమయము ఆసన్నమై సుదీర్ఘ కాలము నుంచి అడ్డగించబడిన సరయూ నది నీటి ప్రవాహమునకు అడ్డంకులు తొలగి తన సహజ రీతిలో ముందుకి ప్రవహించి, రామమందిర సుస్థాపన తప్పక నిర్మింపబడుతుంది అన్న నేటి నాయకుల వినూతన నిర్ణయములకు మరియు మన అందరి నమ్మకమునకు ఊపిరి పోసినది. కాలవశమున మనుష్యులలో చెలరేగిన ఈర్ష్య, అసూయలతో భారత దేశ చరితను చాటిచెప్పే కోటలు, భవంతులు, దేవాలయములు, కూల్చివేయబడినా, శిధిలము చేయబడినా, ఆనాటి వైభవమును తలపింపచేసే చరిత్ర మాత్రము మన హృదయములలో నుంచి నాటికీ, నేటికీ, ఎప్పటికీ కనుమరుగు కాలేదు అన్న నిగూఢసత్యము నగరములో నేటికీ శాశ్వతముగా ప్రతిఫలిస్తున్నది. భారత దేశములో అలరారే అన్ని మతముల వారికీ శాంతి, నెమ్మదులను పెంపొందింపచేసి, విభేధములు లేక ఐక్యతతో సుఖ జీవనము ప్రసాదించే పుణ్య భూమిగా వెలుగులీనే ఆధ్యాత్మిక భక్థి భావనల నగరముగా అయోధ్య రూపుదిద్దుకొన్నది. కావున యుగయుగాల చరిత్రకు తార్కాణముగా నిలచిన పుణ్య క్షేత్రమును కాపాడుట మరియు స్వచ్చ రీతిలో ప్రకాశింపచేసి ముందు తరములవారికి అందించడము మనందరి కర్తవ్యము అని నేనంటాను. మరి మీరేమంటారు?

మధుర
భారత దేశములో వెలసిన సప్త పుణ్య క్షేత్రములలో అతి ముఖ్యమైన పుణ్య భూమిగా నెలకొన్న ముఖ్య నగరము మధుర అని ఇతిహాసములు వర్ణించినవి. ఇక్ష్వాకు వంశ సుప్రశిద్ధ రాజకుమారుడు శతృఘ్నుడు లవణాసురుని వధించి అడవి రూపములో అతి సుందరవనములతో నెలకొనివున్న సుందర పరిసరములను వీక్షించి "మధువనము" అను పేరుతో పరిచయము చేసెను. కాలక్రమేణ "మధుర" అని నామాంకితమైనది. సుమారు 5000 సంవత్సరములకు పూర్వము భూగర్భములో కంసుని ద్వారా నిర్మింపబడిన చెరసాలలో దేవకి వసుదేవులకు శ్రీ కృష్ణుడు జన్మించిన పవిత్ర భూమి. ద్వాపర యుగములో ధర్మ సంస్థాపన చేయుట కొరకు పాండవులను సదా పరిరక్షించిన విష్ణుమూర్తి అవతారముగా  విలసిల్లిన  శ్రీ కృష్ణుని బాల్యము ఆటపాటలతో సంతోష తరంగాలతో గోపికలతో విహరించిన యమునా తీరము  ప్రశిద్ధి సంతరించుకొనడము ఒక విశేషమైతే శ్రీ కృష్ణుడు తన బాల్యములో ఇచట చూపిన లీలలు, మహత్యములు సర్వజనులను దిగ్భ్రాంతులను, ఆనంద పరవశులను చేసెడివి అనునది ఇతిహాసిక కధనము. మధురా నగరములో నిర్మింపబడిన దేవాలయములు, భవంతులు మానవులతో కాదు సాక్షాత్ దేవతలచే నిర్మింపబడినవి అని వేదములు వర్ణించెను. గరుడ పురాణము  మదురా నగరమును సప్త పుణ్య క్షేత్రములలో మోక్ష ప్రదాయినిగా వర్ణించెను. 6 శతాభ్ధములో (బి.సి..) సూరసేన మహారాజు తన రాజధాని గా పరిపాలించెను. 4 నుండి 2 శతాభ్ధము (బి.సి.) వరకు మధురా నగరము  మౌర్య చక్రవర్తుల పరిపాలనలో విశేష వైభవముతో అలరారినది అని మెగస్తనీస్ అను గ్రీకు రాయబారి "ఇండికా" అను గ్రంధములో "మెథురా" అను పేర నగర ప్రతిభను వర్ణించెను. 400 .డి. లో చైనా రాయబారి - ఫాహియాన్ మధురలో విరాజిల్లిన బౌద్ధ మత విశ్లేషణములను అభివర్ణించెను. 1300 .డి లో కుషాన్ రాజ్య ప్రతిభావంతుడైన కనిష్కుని రాజధానిగా విశ్వవిఖ్యాతి చెందినది. ఇచట నిర్మింపబడిన విష్ణు దేవాలయమును 1207 లో వీక్షించిన విక్రం సావట్ అధ్భుత పరవశుడై మందిరము శ్వేతవర్ణముతో మెరిసిపడుతూ ఆకాశములో తేలియాడే మేఘములను తాకే రీతిలో అతి సుందరముగా నిర్మింపబడినది అని అభివర్ణించెను.

1018 లో మహమ్మద్ ఘజని చాలా వరకు దేవాలయములను నేల మట్టము చేసి నిర్మూలనము గావించెను. కాలములో భారత దేశములో ఎన్నో దేవాలయములు కూల్చబడి, ఆస్థానములో మసీదుల నిర్మాణములు జరిగినవి. ఘజనీ ఆజ్ఞ ప్రకారము హిందు దేవాలయములను మంటలలో కాల్చివేసి బంగారు, వజ్ర, వైడూర్య, ఆభరణములను వందలకొలదీ ఒంటెలపైన నింపి తమ దేశములకు తరలించుకు పోయిరి అనునది నాటి కాల చరిత్ర చాటినది. స్థానికులలో అధిక శాతం నేటికీ హిందువులే అయినా అనేక దండయాత్రలకు లోనైన మధుర తిరిగి తన పూర్వ వైభవమును వివిధ మతస్థుల పాలనలో రూపు దిద్దు కొనడము విశేషమే. సదా శ్రీకృష్ణుని భక్తిలో అలరారే 'చైతన్య ప్రభు" 1515 లో వృందావనిలోని వివిధ దేవాలయములను సందర్శించి వాటి పునర్నిర్మాణమునకు చేసిన ప్రయత్నములు కొంతవరకు సఫలీకృతమాయెను. టరువాత కాలములో సుస్థాపితమైన "ఇస్కాన్" సంస్థ ద్వారా నిర్మితమైన అనేక శ్రీకృష్ణ దేవాలయములు హిందూ సంస్కృతిని, సంప్రదాయములను మధురా నగరములో పునరుద్ధరింప చేసిరి. స్థానికులలో "బ్రిజ్" భాష వాడుకలో ఉన్నది. వారందరు శ్రీకృష్ణ భక్తులు. మధురలో నేటికి స్థానికులు భక్తితత్పరలతో చేయు అభినయ జనపద నృత్యశైలి, రాధా కృష్ణుల నాట్యరీతితో వృందావన్ శోభను దిగ్వుణీతపరుస్తు సర్వజనులను సమ్మోహితులను గావించు రీతి  మనదైన సుశోభిత సంప్రదాయము. మధుర నగరములో. ద్వారకది శిరంగాజీ, గోవర్ధనగిరి దేవస్థానము, కేశవదేవ దేవాలయము, గర్భగృహ (యోగమాయ ఆవిర్భవించిన ప్రదేశము) పోత్రకుండ్ (మొదటిసారిగా శ్రీకృష్ణుడు పుట్టిన వెంటనే స్నానమాచరింప చేసిన ప్రదేశము) ముఖ్యమైన సుందర విభాగములు. ద్వారకాదిష్ దేవస్థానములో వెలుగులీను శ్రీకృష్ణుని విగ్రహము నల్లని పాలరాయితో, రాధాదేవి విగ్రహం తెల్లని పాలరాతితో తీర్చిదిద్ద బడినవి. లాట్ మార్హోలీ, కృష్ణాష్టమి, రాధాష్టమి, బ్రిజ్ పరిక్రమ, గురుపూర్ణిమ, జుల్ జులాన్, జులాన్ యాత్ర మహోత్సవ్, లాంటి పండుగలు విశేషరీతిలో ఆచరించే విధానములతో నాడు ద్వాపర యుగ సంతోష తరంగాలతో తేలియాడే యమునా నది నేటికీ కలియుగములో ప్రతిబింబింప చేయుట అధ్భుత విశేషము.

హరిద్వార్
భారత దేశములో వెలసిన సప్త పుణ్య క్షేత్రములలో 'హరిద్వార్" అతి పురాతనమైన మరియు మహిమాన్వితమైన "దేవభూమి" గా ఉత్తరాఖండ్ రాష్ట్రములో నెలకొన్నది. కాలచక్ర భ్రమణములో నగరము "మాయాపురి" “హరిద్వార్ "కపిలస్థాన్" “గంగాద్వార్" అను వివిధ నామములతో అలరింపబడినది. శివుని శిరస్సు నుండి బయల్వెడలిన గంగా నది హిమాలయ పర్వతముల వద్ద "గంగోత్రీ" అను కుండము చేరి తన సహజ ప్రవాహ రీతిలో కొండలు, గుట్టలు, వనములు దాటి సమతల ప్రదేశములో హిమాలయ పర్వత పాదముల వద్ద "గంగ" అను పేరుతో హరిద్వార్ చేరుకొని, భారత "జీవ నదిగా భక్త కోటి పాపములను హరింప చేయుటకు ఇలపై వెలసి, అంతులేని పవిత్రతను ఆపాదించు కొన్నది. అంతరిక్షమున గరుడుని వద్ద నిక్షిప్తమైఉన్న అమృత కలశము నుండి జాలువారిన అమృత బిందువులు ఉజ్జయిని, నాశిక్, ప్రయాగ, హరిద్వార్ల వద్ద ప్రవహించు నీటిని అమృతమయము చేసినవి అనునది ఒక ప్రగాఢ నమ్మకము అశేష భక్తుల హృదయములలో సుస్థిరముగా నిలచినది.

అత్యున్నతమైన పవిత్రతను ఆపాదించే "హరిద్వార్" మనలో విశ్వసనీయతను పెంపొందించే "హరి" "హరుల" నిరువురను స్మరింప చేసుకొని భక్తిలోతల్లీనమై జీవితాంతమున ప్రతీ మనిషి భువి నుంచి దివికి చేరే "మోక్షకవాటముగా" పేరొందినది. కావున "హరిద్వార్" అను పేరు సార్ధక మైనది. కపిల మహర్షి తపమాచరించిన పవిత్ర భూమిగా అభివర్ణించబడినది. సత్య యుగములో భగీరధుడు స్వర్గ విహారిణి అయిన గంగను భువికి తెచ్చే ప్రయత్నములో తపమాచరించిన పుణ్య భూమి. వేదవ్యాసుడు మహాభారతములో దౌమ్య మహర్షి యుధిష్టరునకు భారత దేశములో వెలసిన విశేష తీర్ధముల యొక్క మహిమలను వివరించిన సమయములో "హరిద్వార్" యొక్క అనన్య కీర్తి ప్రతిష్ఠలను, మహిమలను విపులీకరించెను. పాండవులు ద్వాపర యుగాంతమున ద్రౌపదీ సమేతులై స్వర్గారోహణమునకు బయల్వెడలిన తొలి సోపానముగా మహాభారతములో రూపుదిద్దుకొన్న అతిముఖ్య సంఘటన. "హరికపురి" లో వెలసిన శ్రీమహా విష్ణువుని పాదములు నిరంతరము గంగా జలములతో అభిషేకింపబడటము క్షేత్ర మహిమ.

"హరిద్వారే, కుశావర్తే, బిల్వక, నీలపర్వతే, స్నాత్వకనఖాత్, పునర్జన్మ నవిద్యతే"
హరిద్వార్ వద్ద గంగా నదీ సమీపములో వెలసిన ఐదు తీర్ధములలో స్నానపానాదులను గావించిన భక్తులకు మరి పునర్జన్మ ఉండదు అని వేదములు అబివర్ణించినవి. హరిద్వార్ వద్ద వెలసిన ముఖ్య దేవాలయములు చండి, మానసాదేవి, కంఖత్ సురేశ్వరీదేవి, సుప్రశిద్ధము. అష్టాదశ శక్తి పీఠములలో ఒకటిగా వెలసిన "మాయాదేవి" ఆలయము 11 శతాభ్ధములో నిర్మింపబడినది. ఇచట సతీదేవి హృదయము మరియు నాభి విభాగములు పడిన స్థలముగా పురాణములు విశ్లేషించినవి. ఇన్ని మహిమలతో కూడిన "హరిద్వార్" లోని గంగ నీరు అతి స్వచ్చతతో, చల్లగా, అమృతమయమై ఉండటము మన సుకృతము.

హరప్పా నాగరికుల కాలములో (3000 బి.సి. నుంచి 1500 బి.సి.) హరిద్వార్లో "టెర్రకోటసంప్రదాయములు నెలకొన్నవి. వీరు మట్టిని అధిక (సుమారు 1000ఓసి) ఉష్ణోగ్రతలో వేడి చేసి, వివిధ ఆకృతిలలో మట్టి పాత్రలు, ఇటుకలు, సుందరమైన ప్రతిమలు, మురికి నీరు పారుదలకు, ఉపయుక్తకరమైన పైపులు ఎన్నో తయారు చేసిరి. అవశేషములు చరిత్రకారుల పరిశోధనలలో తవ్వకములలో నిరూపితమైనది. ఛైనా రాయబారి "హుయెన్-త్సంగ్" హర్షవర్ధనుని పాలనలో పుణ్య క్షేత్రమును దర్శించి "మో.యూ.లోఅను పేరుతో నగర వైభవమును లిఖిత పూర్వకముగా తెలిపెను. 1336-1405 తైమూర్ ఆక్రమణకు లోనైనది. 1469-1539 లో సిక్కుల మత గురువు "గురునానక్" క్షేత్రమును దర్శించి "కుశావర్త్ ఘాట్" వైభవమును తెలిపి అచ్చట ప్రవహించు నీరు సమీప తీరములకు తరలించబడి వ్యవసాయమును అభివృద్ధి పధము లోనికి తేవడము అత్యున్నతమైన వ్యవసాయ వృత్తిగా వర్ణించెను. అక్బర్ ఆస్థాన కవిశెఖరుడు అయిన అబుల్ ఫజల్ "అక్బర్-నామాఅను గ్రంధములో క్షేత్ర మహిమను తెలుపుతూ అక్బర్ చక్రవర్తి గంగా జలము పాపములను ప్రక్షాళింప చేయునది మాత్రమే కాదు మనుష్యులను జీవంతవాగి నిలుపు శక్తి గలది అని తనదైన రీతిలో హరిద్వార్ మహిమను తెలిపెను.

హరిద్వార్లో రాగి నాణెములు తయారు చేయు కర్మాగారము సుప్రశిద్ధము. ఆంగ్లేయుల పాలనలో "టెహరీడాం" నిర్మింపబడినది. భారమైన ఎగుమతులకు వివిధ విభాగములకు తరలింప చేసి ప్రశిద్ధ నౌకా కేంద్రముగా తీర్చిదిద్దిరి. మానసిక, శారీరక, ఆధ్యాత్మిక తత్వములను పెంపొందింప చేయు శక్తివంతమైన నగరము మాత్రమే కాక, అనేక కళలకు, చిత్ర లేఖనములకు, విజ్ఞానమునకు, సంప్రదాయములకు కాణాచి. ఆయుర్వేద వైద్యములో ఉపయోగించే అనేక ఔషధ మొక్కలు విరివిగా పెరిగే స్థలము. ఇచ్చట నేటికీ "గురుకుల విద్య" విశేష ప్రఖ్యాతితో వెలుగులీను తున్నది. "రూర్కి" నగరములో అతి పురాతనమైనఇంజనీరింగ్ విద్యాలయమునెలకొని ఉండటము ఎందరో విజ్ఞానవేత్తలు తమ తమ భవితవ్యమును చక్కని రీతిలో రూపు దిద్దుకొని భారతదేశ కీర్తి ప్రతిష్ఠలను ఉన్నత శిఖరములపై అధిరోహింప చేయడము మనకు గర్వకారణము. హరిద్వార్ లో ఏడు, ఎనిమిది తరముల నుంచి స్థిరనివాశమున్న పండాలు, సిక్కులు, ముస్లిములు, క్రైస్తవులు నేటికీ వారి సంప్రదాయ పద్ధతులను అనుసరించుకొని భక్తి ప్రఫుల్లతలతో సుఖ జీవనముతో నివసించి ఉండటము ఎంతో గర్హనీయము. పన్నెండు సంవత్సరములకు ఒకసారి ఆచరింపబడే "కుంభమేళా" ఉత్సవానికి కోట్లాది భక్తులు పాల్గొని తమ పాపములను ప్రక్షాళనము గావించుకొని పునీతులు కావడము మనదైన సంప్రదాయము మరియు నమ్మకము. భారత దేశములో సాక్షాత్ దేవతలు నడయాడే "దేవ భూమిగా" పేరొంది యుగ యుగములకు తార్కాణముగా నిలచిన పుణ్యభూమి "హరిద్వార్" అని నేనంటాను. మరి మీరేమంటారు?


కాశీ (వారణాశి)
భారత దేశములో వెలసిన సప్త పుణ్య క్షేత్రములలో "కాశీ" అతి పురాతనమైన పుణ్య క్షేత్రముగా రూపు దిద్దుకొన్నది. ఒకానొక కాలములో ప్రపంచమంతా జలమయమై ఉండగా బ్రహ్మ తన సృష్టిరచనకై తగు ప్రదేశము కొరకు వెతుకులాడగా శివుడు తన త్రిశూలముపై కాశీ నగరమును నిలబెట్టడముతో అవనిపై సృష్టి ఆరంభమైనది. ఋగ్వేదము ప్రకారము కాశీ అనగా "ప్రకాశించునది", “రుద్రవాసరుద్రుని నివాశ స్థలము, "వారణాశి" వరుణ మరియు అసీ నదుల మధ్య వెలసిన భూమి, "అముక్తము" ముక్తి కలిగించునది "ఆనందవనం" ఎప్పటికీ ఆనందము కలిగించు క్షేత్రము అను వివిధ నామములతో అర్ధవంతముగా అభివర్ణించ బడిన సుప్రశిద్ధ ప్రదేశము. యుగాలు అంతమైనా నాశము కానిది కాశీ నగరమే. సాక్షాత్ పరమశివుడు ద్వాదశ జ్యోతిర్లింగములో ఒకటిగా మారి విశ్వేశ్వరుని రూపముతో వెలసెను. అన్నపూర్ణేశ్వరీదేవి మరియు అష్టాదశ శక్తి పీఠాధి దేవత విశాలాక్షితో కూడి తమ మహిమాన్వితమైన రూపములతో ఇలపై అవతరించిన పవిత్రభూమి.

"కదా కాశీం గమిష్యామి-కదా ద్రక్ష్యామి శంకరం ఇతి ఋవాణ స్సతతం కాశీ వాస ఫలం లభేత్" అని కాశీ విశ్వేశ్వరుని దర్శనము కొరకు తపన పడే వారికి కాశీలో నివసించినంత పుణ్యం నామస్మరణతో లభిస్తుందని పురాణములు చెబుతున్నాయి. "విశ్వమునేలు విశ్వజననీ విశ్వేశ్వరుని రాణీ విభుధ జన వాణీ వారణాశి ప్రాంత వాసినీ-ఆకొన్నవారి క్షుద్భాధ తీర్చే జననీ విశాలాక్షీ వందనం-శివనారీ శరణం అన్నపూర్ణా వందనం.


మానవ శరీరంలో హృదయ స్థానానికి ఎంతటి విశేషత ఉన్నదో భారత దేశంలో కాశీ నగరానికి అంత విశేషత ఉన్నది.
బ్రహ్మాది దేవతలు, సప్త ఋషులు, ఎందరో మహనీయులు ప్రతిష్టాపితము చేసిన ఆరు వేల కోట్ల లింగములు వివిధ దేవీ దేవతా మూర్తులతో, అనేక తీర్ధములతో అలరారే భూమి. ఏయుగమైనా సృస్ఠిలోని సర్వ జీవులకు వారణాశిని మించిన పుణ్యభూమిలేదు. కాశీ విశ్వనాదుని స్మరణను మించిన మోక్షములేదు అన్నది వేదనుడి. దేహాంతము వరకు కాశీలో వశించు భక్తకోటికి మోక్షప్రదము, పునర్జన్మ ఉండదు అను నమ్మకము భారతావనిలో నేటికి వెలుగులీనే ముఖ్య నమ్మకము. స్కందపురాణము ధర్మార్ధ కామ మోక్షములను, సర్వ విజయములను లభ్యపరచు నగరము కాశీగా తెలిపెను. ముల్లోకముల వారినీ తరింపచేయు "గంగానది" కాశీలో ప్రవహించి భారత జాతీయ నదిగా భాసిల్లుతున్నది. శ్రీరాముడు తన వనవాసానంతరము భరతాదులను విజయదశమి రోజున కలసిన పవిత్ర ప్రదేశము "భరత్ మిలాప్" అను పేరుతో జరిగేగంగా మహోత్సవము" నేటికీ గంగా తీరములో ఆచరింప బడటము, పాండవులు మహాభారత యుద్ధానంతరము బ్రహ్మహత్యా పాప విముక్తి కొరకు విశ్వేశ్వరుని దర్శించి కాశీలో శివలింగ ప్రతిష్టాపనము చేసిరి అనునవి కొన్ని ఇతిహాసిక సంఘఠనలుగా పేర్కొనబడినవి.

528 బి.సి. లో బౌద్ధులు "ధర్మచక్ర" సుస్థాపితము చేసిరి. చైనీస్ యాత్రికుడు - హ్యుయన్ సాంగ్ 635 సి. . లో ఈనగరమును దర్శించి "పోలినిస్సీ" అను పేర వారణాసి నగర వైభవమును వర్ణించెను. ఆది శంకరాచార్య, కబీర్, తులసీదాస్ ఎందరో మహానుభావులు నగరము దర్శించి భక్తి భావనలతో తన్మయులై ముక్తిని సంపాదించు కొనిరి. సిక్కుల మతగురువు గురునానక్ 1507 లో కాశీలో నివసించి నగరము ఆధ్యాత్మికతకు ఆలంబనము అని తెలిపెను. ముఘల్ చక్రవర్తి అక్బర్ శివ కేశవుల భేధములు లేవని చాటిచెప్పే తీరులో కాశీలో శివ, కేశవుల మందిరములు నిర్మించెను. 18 శతాభ్ధములో మరాఠా పేష్వా (రెండవ బాజీరావ్) అన్నపూర్ణేశ్వరి దేవి మందిరమును నిర్మించెను. ఫ్రెంచ్ రాయబారి "జీన్ బాప్టిస్ట్" 1665 లో బిందుమాధవుని దేవాలయ నిర్మాణరీతిని వెల్లువయ్యే సౌందర్యమును ప్రశంసించెను. షీర్షా సుర్ తన పాలనలో అత్యాధునిక రీతిలో అతిపెద్ద రోడ్ రవాణా మార్గమును వారణాశి నుంచి తక్షశిల, పాటలీపుత్ర నగరములను సంధానముచేయు రీతిని నిర్మించెను. 1339 లో కబీర్ జన్మించిన భూమి కావున భారత దేశమంతా భక్తి భావనలు ఆతని ద్వారా వ్యాప్తీకరించ బడినవి. 1747 లో మహమ్మద్ షా "మన్మందిర్ ఘాట్" నిర్మించెను. 1867 లో వారన్ హేస్టింగ్స్ సంస్కృత కళాశాలను సుస్థాపితముచేసెను. మార్క్ తివారీ 1897 లో "కాశీ ప్రపంచ చరిత్రకి అందని అతిపురాతన నగరము మరియు భారత సంస్కృతీ సంప్రదాయములను ప్రపంచమునకు తెలిపే మహానగరము" అని వర్ణించెను.  8 బి.సి శతాభ్ధములో జైన్ తీర్ధంకరులు జన్మించిన పవిత్రభూమిగా విలసిల్లిన కాశీ నగరము జైనమత సుస్థాపితమునకు జీవనాడి అయినది. 5 బి సి .లో భారతీయ విద్యలు శస్త్రచికిత్స, ఆయుర్వేద, వైద్య, యోగా, ఆదిగాగల ఎన్నో విభాగములతో, విజ్ఞాన వేత్తలతో సుప్రశిద్ధమైనది కాశీ నగరము. 1839 లో రాణీ అహల్యా భాయి విశ్వనాదుని మందిరము శిఖరాగ్రములతో నిర్మించగా సిక్కుల రాజ్య పరిపాలకుడు మహారాజ్ రంజిత్ సింగ్ బంగారముతో తీర్చిదిద్ది తన భక్తికి నిదర్శనముగా కాశీ విశ్వేశ్వరుని సువర్ణ మందిరము శాశ్వత రీతిలో నిలిపెను. ఆసియా ఖండములోనే అతిపెద్ద విశ్వవిద్యాలయముగా ప్రసిద్ధిచెందిన "కాశీ విశ్వవిద్యాలయము" 1916 లో మదన్ మోహన్ మాలవ్య వారణాశిలో సుస్థాపితము చేసెను. నేటికీ అనేక రంగములలో ప్రతిభావంతులను భరత దేశ ప్రగతికి ధీటుగా దేశ విదేశములకు సమర్పించుతున్నది. కాశీ నగరము మట్టిబొమ్మలకు, చేనేత పట్టు వస్త్రముల తయారీకి, బంగారు వెండి ఆభరణములను చేయడములో, సంగీత వాద్య పరికరములకు ఎంతో విఖ్యాతి చెందిన మహా నగరము. స్థానికుల దైనందిన జీవనములో తమలపాకుల వినియోగము అత్యధికము మరియు దేశములోనే "బనారస్ పాన్" అత్యధిక ప్రఖ్యాతి గాంచినది.

సాంస్కృతిక, ఆధ్యాత్మిక, విద్య, వైద్య, సాంకేతిక అభివృద్ధి కాశీ నగరములో అడుగు అడుగునా ప్రజ్వలింప బడుతూ దేశ విదేశీయుల ఆకర్షణకు ఆలంబనగా నిలచినది. "గంగా జాత్ర, కార్తీక పౌర్ణమి, మహా శివరాత్రి, విజయదశమి" వైభవోపేతముగా ఆచరింపబడటమే కాక కాశీ నగరములో అలరారే వివిధ మతములకు సంభందించిన పండుగలు విశేష రీతిలో వైభవోపేతముగా ఆచరింప బడటము మన దేశ ప్రజల ఔన్నత్యమునకు, స్నేహ సౌశీల్యములకు, ఉదార స్వభావములకు, ఆదరణములకు నిదర్శనము కాశీ నగరము, అని నేనంటాను. మరి మీరేమంటారు?

కంచి
భారత దేశములో వెలసిన సప్త పుణ్య క్షేత్రములలో అతి పురాతనమైన కంచీ నగరము వేగవతీ నదీ తీరములో నెలకొని ఉన్నది. ఇతిహాసములు తమిళ్ నాడు రాష్ట్రమును "దేవాలయముల నగరము" (లేండ్ ఆఫ్ టెంపెల్స్") గా వర్ణించినవి. సంస్కృతములో "కా" అనగా బ్రహ్మ "అంచి" అనగా ఆరాధన సాక్షాత్ సృష్టికర్త అయిన బ్రహ్మ పరమేశ్వరుని ప్రసన్నము చేసికొనుటకు ఘోర తపమును ఆచరించిన పవిత్ర భూమి కాంచిపురము.
"కామాక్షీ కంచికాపురే" అని స్తుతించబడే శక్తి స్వరూపిణి "కామాక్షీ దేవి". అశేషకోటి భక్తుల పూజలందుకొని వారి కోరికలను ఈడేర్చుటకు ఇలపై అవతరించినది. 
"ఓం కామాఖ్య దేవతాయనమః" అని కొలచిన భక్తులను కాపాడి వారి కామ్యములను తీర్చే శక్తిస్వరూపిణి. "కామ" అనగా కామ్యములు "అక్షి" అనగా కనులు అని అర్ధము. దేవి కనులతో కురిపించే ఆశీస్సులే భక్తులకు లభ్యమయ్యే శతకోటి వరములు. కంచి సిద్ధి నొసగు శ్రీశక్తి పీఠం అష్టాదశ శక్తి పీఠములలో రెండవ శక్తి పీఠముగా వెలసినసతీ దేవి కంకాళము పవిత్ర ప్రదేశములో పడినటులుగా పురాణ విదితం. శ్రీ మహా విష్ణువు వరదరాజ స్వామి రూపములో అనేక దేవి దేవతా మూర్తులతో అలరారే నగరము. కంచి లోని ఆలయములన్నీ ఆది శంకరాచార్యులు ప్రతిష్టించిన శ్రీశక్తి పీఠము దిశగానే తిరిగి ఉండటము క్షేత్ర విశిష్ఠత. ఇచట బంగారు, వెండి బల్లి రూపములను స్పర్శించితే ఆకస్మికముగా మనపైన బల్లి పడిన దోషనివారణము తొలగి పవిత్రతను ఆపాదించుకొనే భాగ్యము కలుగుతుంది అనునది ఒక ప్రగాఢ నమ్మకము. పురాణోక్తి ప్రకారము కాంచీ పురములో 10000 శివలింగములు వేయి దేవస్థానములు ద్రవిడ సంప్రదాయముతో నిర్మింపబడినవి. అందు వలననే కంచి "పవిత్ర నగరము" (సేక్రెడ్ సిటీ ఆఫ్ ఇండియా) అని నామాంకిత మైనది. మహాభారత కాలములో దక్షిణ భారత దేశములుద్రవిడ రాజ్యములుగాపేరొందినవి. మహాకవి కాళిదాసు కాంచీ పుర వైభవమును వర్ణించి నగరము "బనారస్ ఆఫ్ సౌత్" (దక్షిణ కాశీ) గా ప్రశంశించెను.


కామాక్షీ దేవి దేవాలయము 985-1014 లో ప్రముఖ చోళ రాజు "రాజ రాజ చోళుడు నిర్మించెను. నగరమును పల్లవులు, చోళులు, పాండ్యులు, విజయనగర పాలకులు (తుళు, సాళువ) ఎందరో ప్రముఖ ఏలికలు పరిపాలించిరి. దానికి తార్కాణముగా నిర్మితమైన దేవాలయములు కాల వైభవమును తలపింప చేయురీతిలో నేటికీ నిలచిఉన్నాయి. రెండు - మూడు, శతాభ్ధములలో ప్రముఖ ఆయుర్వేద విజ్ఞాన వేత్త పతంజలి వేగవతీ నదీ తీరములో కాంచీ పురములో నివశించెను. వైకుంఠ పెరుమాళ్ ఆలయము, కైలాసనధర దేవస్థాన సమీపములో ఎన్నో చారిత్రక ఆధారములు లభ్యమైనవి. తుళు వంశ సంజాతుడు, అరి వీర భయంకరుడు, విజ్ఞాన సంపన్నుడు, లక్ష్మీ ప్రసన్నుడు, అయిన శ్రీ క్రిష్ణదేవరాయలు తన పరిపాలనలో ఎన్నో వైష్ణవ మరియు శైవ దేవాలయములను కంచి నగరములో  "విజయనగర శిల్పకళ విశిస్ఠలతో" నిర్మించెను. వంశ పరిపాలకులు కాలములో సువర్ణము, ముత్యాలు, వజ్రాములు, మరకత మాణిక్యములతో తమను తాము తులాభారము చేసుకొని సంపదను పేదలకు పంచెడివారని చరిత్ర చెబుతున్న నిజాలు. నాలుగు - ఐదు శతాభ్ధములలో జైనులు, బౌద్ధులు తమ మత సిద్ధాంతములను కంచిలో వ్యాప్తీకరింప చేసి సర్వ విద్యలకు నిలయము (ఘఠిక స్థానము) గా తీర్చి దిద్దిరి. నేడు జైన కంచిలో "తిరుపరుత్తి కుంద్రం"   సుస్థాపితమైనది. 640 లో చైనా రాయబారి "హుఎన్ త్ సాంగ్" కాంచీపుర దర్శనము చేసుకొని నగరవాసులు ధైర్యవంతులు, భగవధ్భక్తులు, న్యాయ పరిరక్షకులు, విగ్రహారాధకులు గా తను రచించిన "ఘో ఖో ఖీ" అను గ్రంధములో తమిళుల సంస్కృతి సంప్రదాయములను స్థానికుల జీవనశైలిని ఎంతగానో ప్రశంశించెను. 1672 లో గోల్కొండ సుల్తానేట్ ఆధ్వర్యములో ఉన్న కాంచీ పురము 1700 లో ముఘల్ చక్రవర్తుల పరిపాలనలో జరిగిన  "పొల్లిలూరు" (రెండవ ఆంగ్లో మైసూర్ వార్) యుద్ధములో హైదర్ ఆలీ ఉపయోగించిన రాకెట్స్ ద్వారా చెలరేగిన అగ్నిజ్వాలలు ఎన్నో దేవాలయములను సిరిసంపదలను అగ్నికి ఆహుతి చేయబడినవి అనునది కాంచీపుర చరిత్రలో జరిగిన దుర్గటనలు.

ఆరవ సి.. లో ఎందరో సంస్కృత విధ్వాంసులు కంచిలో వాసము చేసి తమ సాహిత్య సంపన్నతలతో భారత దేశమును పుణ్య భూమిగా తీర్చి దిద్దిరి. 11-12 శతాభ్ధములలో శ్రీ రామానుజాచార్యులు భక్తితో, ధర్మనిరతితో కూడిన మన హైందవ సంస్కృతీ సంప్రదాయములను నగరవాసులకు ప్రభోధించి తరువాత కాలములో సర్వ జగతిని భక్తి తత్పరలతో ఓలలాడించెను. ప్రపంచ విఖ్యాతి చెందిన కాంజీవరములో తయారైన పట్టు చీరలు కనులకింపైన రంగులతో వెండి బంగారు జలతారు దారములతో ఆకర్షణీయముగా నేయబడి భారత దేశ సంపన్నతను, సంస్కృతిని, సంప్రదాయములను వ్యక్తీకరింప చేయడము మనకు గర్వ కారణమే. కంచిలో మనకి శివ, కేశవులు ఇరువురూ నెలకొని తమ ఆశీస్సులతో భక్త కోటిని అలరింపచేయడము అను విశేష పద్ధతి నిరంతరము వేద ఘోషలతో, యజ్ఞ యాగాదులతో, మంత్ర బలములతో అశేష భక్తులలో భక్తిభావములను పెంపొందింప చేసే కంచి క్షేత్ర మహిమ వర్ణించనలవి కానిది.

కంచి నగరములో ప్రతిష్ఠాపించబడిన ప్రముఖ దేవాలయములు ఏకాంబరేశ్వర, ఉంగలంధర, వైకుంఠపెరుమాళ్, కైలాసనాధ, కామాక్షి మరియు ఆది శంకరాచార్యుల ద్వారా ప్రతిష్టింపబడిన "కంచి కామకోటి పీఠము" ఆదిగా గల ఎన్నో అతి సుందరమైన దేవాలయములు ఎటువంటి విధ్వంసములకు లోను కాక శాస్త్రోక్తముగా నిత్య పూజా విధులతో కొలువు తీరి ఉండటము వీరి భక్తి శ్రద్ధలకు నిదర్శనమే. కంచి నగరములో అశేష భక్త జన సందోహాములు మరియు స్థానికులు పాల్గొని వైభవోపేతముగా అత్యుత్సాహముగా ఆచరించే పండుగలు, ఉత్సవముల లో ముఖ్యాతి ముఖ్యమైనవి, బ్రహ్మోత్సవము, గరుడోత్సవము, దేవాధి రాజమహోత్సవం, శంకరజయంతి, శివరాత్రి, తాయిలియకప్ప, పవిత్రోత్సవం, సిల్క్ టూరిజం ఫెస్టివల్, నయనారురుగవన పవిత్రోత్సవం, ఫ్లోట్ ఫెస్టివల్, సొక్కపనై, వైకుంఠ ఏకాదశి అనునవి నేటికీ విశేషరీతిలో ఆచరింపబడటము మన దేశ సంప్రదాయములను సర్వదా, సర్వదా ఎప్పటికీ కాపాడు కొనడమే అవుతుంది అని నేనంటాను. మరి మీరేమంటారు?

అవంతిక (ఉజ్జయిని)
భారత దేశములో అతి పురాతన సప్త పుణ్య క్షేత్రములలో ఒకటిగా వెలుగులీనే ఆధ్యాత్మిక ప్రదేశమే "అవంతికాపురి". సంస్కృతములో "మహాకాలవనము" గా స్తుతించబడినది, అనగా మహా పాపములను నశింప చేయు పుణ్య భూమి అని (గ్రేట్ రియల్మ్) అని అర్ధము. వింధ్య పర్వతములకు ఉత్తర దిశ విభాగములో అవంతిక, దక్షిణలో విభాగము మాహిష్మతీ రాజ్యము నెలకొన్నవి (6 బి.సి.). పాళి భాషలో ఉజ్జయినీ "విజయపురి" గా వర్ణిస్తే, సంస్కృతభాషలో "ఉత్+జయినీ = ఉజ్జయినీ విజయాన్ని ఉన్నత శిఖరములకు అధిష్టింపచేసే నగరముగా, స్కందపురాణము "మంగళ గృహము" అని అగ్నిపురాణం "దేవతలకు నివాస గృహము" గా అభివర్ణించినవి. శివ పురాణం షిప్రా నదిలో స్నాన, పాన మహిమలను తెలుపుతూ సర్వ పాపములను నశింపచేసి, అష్ట దరిద్రముల నుంచి భక్త కోటి విముక్తులగుదురని సూచించినది. దేశ ప్రజలు అత్యంత బలవంతులు. సుమారు 5000 వేల సంవత్సరములకు పూర్వమే అవంతిక నగరము "షిప్రానదీ తీరములో వైభవోపేతముగా అలరారినది అని చరిత్ర చెబుతున్నది. షిప్రా నదీ తీరమునకు తూర్పు దిశలో నెలకొని ఉన్న నగరము. శ్రీరాముడు వనవాస సమయములో భరతాదులతో కలిసి దశరధునికి పిండ ప్రధానము చేసి తర్పణములను వదలిన "రాంఘాట్" నదీ తీరములో ఉన్నది. మహాభారత కాలములో బలరామ కృష్ణులు విద్యను అభ్యసించిన "సందీపనీ ఆశ్రమము" నగరములోనే విరాజిల్లుతున్నది. స్కంద పురాణము ప్రకారము అవంతికా నగరములో లెఖ్ఖకు మించిన దేవాలయములు వివిధ శక్తులను ప్రతిబింబిస్తూ వెలసినవి. వరాహ పురాణ ప్రకారము మహాశివుడు "మహాకాలుని" రూపములో ద్వాదశ జ్యోతిర్లింగములో ఒకటిగా వెలసెను. "మహా" అనగా అతిగొప్ప, “కాల" అనగా సమయము సృష్టికి అంతు పట్టని కాలములో వెలసిన మహాశివుని రూపము, అష్టాదశ శక్తి పీఠాధిపతురాలైన శక్తిమహాకాళీ" రూపములో నెలకొని  నాటి నుంచి నేటి వరకు నిర్విఘ్నముగా పూజలందుకొని మన భక్తితత్పరతలకు  నిదర్శనముగా నిలచిన అతి గొప్ప పుణ్య క్షేత్రము అవంతికా నగరము. ఇక్కడ మహాశివునికి కనులుండటము విశేషము.



వేదములు అవంతికా నగరములో వెలసిన శివలింగముల వర్ణనలో "ఆకాశే తారకం లింగం; పాతాళే హటకేశ్వరం; మర్త్య లోకే మహాకాళం లింగ త్రయ నమోస్తుతే" అని అభివర్ణించినవి. మహాకాళేశ్వర లింగముపై ప్రతిష్టింపబడిన 12 రాశుల కాలచక్రం కోట్లాది భక్తులను అద్భుత ఆకర్షణలో నిలుపుతుంది. రాజా జైసింగ్ కాలములో నిర్మించిన "నక్షత్ర గ్రహ వేదశాల" ఇప్పటికీ ఖగోళ శాస్త్రజ్ఞులకు ఎంతో ఉపయుక్తకరము కావడము ఎంతో అత్యద్భుతము.

"మహా మంత్రాధి దేవతాం : ధీర గంభీరతాం మహాకాళీ స్వరూపిణీం : మాం పాలయమాం" సంస్కృతములో "కాళీ" అనగా మహిమ గల దేవి అని అర్ధము. మహా కాళికాదేవి నవ దుర్గలలో అతి భీకరమైన శక్తి స్వరూపిణి. భక్తితో స్మరిస్తే కోరిన వరములనొసగే కరుణామయి. సతీదేవి మోచేయి పడిన పుణ్య స్థలముగా అవంతికా నగరము పేరొందినది. కుశస్థలి, కనకశృంగి. పద్మావతి, కుముద్వతి, అమరావతి, విశాల, అవంతిక, ఉజ్జయిని అను వివిధ పేరులతో కాల పరిస్థితులకు అనువుగా నామాంకితమైనది. మహాకాలుని ఎదురుగా మహాకాళీ చేసే తాండవ నృత్యమే భక్త కోటికి అందించే ఆనంద మోక్షపురి, మహాపురి, శివపురిగా విజయవంతమైన పుణ్య ప్రదేశము. “న్యూక్లియస్ ఆఫ్ వరల్డ్గా ఉజ్జయినీ నగరము సూర్య సిద్ధాంత పుస్తకములో వర్ణించిరి. ఖగోళ శాస్త్రజ్ఞులకు నేటికీ అంతు పట్టని విజ్ఞాన గని అవంతికా నగరము. ఇచట వెలసిన "నవగ్రహ" అమరిక అంతరిక్ష సంభంధిత విజ్ఞానులకు వెల్లువ అయ్యే ఎన్నో ప్రశ్నలకు లభించే ఉత్తరువులు క్షేత్రములో నిబిడీకృతమై ఉన్నవి. క్షేత్రమును భూమికి నాభిగా పేర్కొంటారు. ఉజ్జయినీ మహాకాలేశ్వరుని దేవాలయ నిర్మాణము భారత దేశమునకు కుడి భాగములో సూర్యదేవుని అమరిక వలన "మధ్యప్రదేశ్" గా నామాంకితమైనది. అంతరిక్షమునకు సంభంధిత విషయములో చెలరేగే ఎన్నో, మరెన్నో ప్రశ్నలకు సృష్టి యొక్క ఆది అంతములకు సంబంధించిన సమాధానములు తెలిపే శక్తి వంతమైన ప్రదేశము అవంతికా నగరము అని శాస్త్రనిరూపణ. “మార్స్" గ్రహము అనేక మార్పులతో భూమి నుండి విడివడి సరికొత్త గ్రహముగా రూపు దిద్దుకొన్నది అను విషయము నేడు ఖగోళ శాస్త్రములలో విశదీకరింపబడినది. మన వేదములలో మంగళ గ్రహమును "ధరణిగర్భసంభూతం" అని వర్ణించినవి
ఒకటవ శతాభ్ధములో గుప్తుల పరిపాలనలో ఉజ్జయినీ నగరము "భారత స్వర్ణ యుగముగా వెలుగొందినది. విక్రమార్కుని కొలువులో "తొమ్మిది మంది కవులు (నవ రత్నములు) తమ సంగీత, సాహిత్య గోష్టులతో సభా స్థలిలో అశేష ప్రజలను ఆకట్టుకొని తమ అతులిత విజ్ఞతను పెంపొందింప చేసిరి. కాళిదాసు ఉజ్జయినీ నగరముదివి నుంచి భువికి దిగిన స్వర్గముగా వర్ణించెను. కాలములో భారత దేశము వ్యవసాయ, పరిశ్రమ, వ్యాపార, విద్య, విజ్ఞతలతో కూడి అత్యున్నత స్థితిలో నిలచినది. ఒకటవ శతాభ్ధములో అవంతికా నగరము నుండి కళాత్మికముగా ఆకర్షణీయమైన రంగులతో తీర్చిదిద్దిన వివిధ మట్టిపాత్రలు, సుగంధద్రవ్యములు, మస్లీన్ క్లాత్, పట్టు వస్త్రములు పడమర ఆసియా ఖండమునకు, దక్షిణ భారత దేశమునకు ఎగుమతి చేయబడటము భారత వ్యాపార అభివృద్ధికి చిహ్నమే. గ్రీకు చక్రవర్తుల కాలములో నగరము "ఓజీన్" అను పేరుతో అత్యంత పేరు గణించిన వ్యాపార కేంద్రము.

ఉజ్జయిని నగరములో సూర్య దేవాలయ సమీపములో నెలకొన్న "బ్రహ్మకుండము" "సూర్యకుండము" లలో స్నాన మాచరించిన ఆధ్యాత్మిక శక్తి ప్రజ్వరిల్లడమే కాక ఆరోగ్య రీత్యా ఎంతో ఉపయుక్తకరము అనునది మనదైన నమ్మకము. ద్వాపర యుగములో అవంతీ రాజ్యమునకు రాజధాని ఉజ్జయినీ నగరముగా పేరొందినది. 1234 లో ఇల్తు ముష్ దండయాత్రలలో అవంతికా నగరములోని ఎన్నో దేవాలయములు నాశనము చేయబడినవి అని నాటిచరిత్ర వివరించినది. 1458 లో మహమ్మద్ ఖిల్జీ ఉజ్జయినీ నగర కోట చుట్టు నీటి నిల్వలు పారుదల చేసి వాని ద్వారా వీచే చల్లని గాలులను అంతఃపుర మందిరములలోనికి ప్రవేశింపచేసి అతి చల్లని వాతావరణమును నెలకొల్పెను. 17 శతాభ్ధములో అవంతికా నగరము మరాఠా దండ యాత్రలలో వారిచే ఆక్రమింపబడుట వలన ఎన్నో నవీన మార్పులు ఏర్పడి తిలకేశ్వర్, కాలభైరవ, కపిలేశ్వర్ దేవాలయములు మరాఠీ సంప్రదాయములతో అలరారుతున్నవి. 1750-1810 లో మరాఠీలను ఓడించిన సింధియాలు ఉజ్జయినీ నగరము ఆక్రమణచేసి వ్యాపార సాంస్కృతిక కీర్తి ప్రతిష్ఠలను నేలకూల్చిరి. ఆంగ్లేయుల పాలనలో ఉజ్జయినీ అభివృద్ధి క్షీణించినది కారణము స్థానిక వ్యాపారులు ఆంగ్లేయులను వ్యతిరేకించడము వలన వారు "ఇండోర్" ను అభివృద్ధి పరచి నగరముతో సరిసమానముగా తీర్చిదిద్దిరి.  భారత దేశ స్వరాజ్యానంతరము అవంతికా నగరము "మధ్య భారత్" అను పేరుతో నెలకొని ఉన్నా 1956 లో "మధ్య ప్రదేశ్" అను పేరుతో రూపాంతరము చెంది భారత దేశములో అతి ముఖ్య రాష్ట్రము అయినది.

షిప్రా నదీ తీరములో 12 సంవత్సరములకు ఒకసారి జరిగే వైభవోపేతమైన "కుంభమేళా" (సింహస్తి) విశేష హిందూ సంప్రదాయ రీతిలో అశేష భక్తకోటి పాల్గొని నదిలో స్నానమాచరించి పునీతులు కావడము నేటికీ జరిగే విశేషము. అవంతికా నగరములో నెలకొన్న ప్రముఖ దేవాలయములలో చాముండి, చింతామన గణేష్, గోపాలమందిర్, కాలభైరవ ఆలయము, ఇస్కాన్ మందిరములు సుప్రశిద్ధము. అవంతికా నగరము నాడు, నేడు, ఆధ్యాత్మిక, వేద, వైద్య, ఖగోళ, భౌగోళిక, అంతరిక్ష, నక్షత్ర శాస్త్రములకు ఆలంబనగా నిలచి ప్రపంచ విజ్ఞాన వేత్తల సందేహ నివృత్తుల కొరకు భారత దేశమునకు ఆహ్వానించే, స్వాగతించే సాంకేతిక పరంపరలతో ధీటుగా వెలసిన మహా పుణ్య నగరమే "అవంతిక" అన్నది మన అభిమతముగా చిరకాలము నిలవాలి. అని నేనంటాను, మరి మీరేంటారు.

ద్వారక
ద్వారక భారత దేశములో వెలసిన సప్త పుణ్య క్షేత్రములలో "ద్వారక నగరము" అఖండ కీర్తిప్రతిష్ఠలతో అలరారిన పుణ్య భూమి మరియు పురాతన ద్వారకను "దేవభూమి" గా పురాణములు వర్ణించినవి. మహాభారత కాలములో "కుశస్థలి" అను పేరుతో యాదవుల పరిపాలనలో వారి దేశ రాజధానిగా వెలసినది. గుజరాత్ రాష్ట్రమునకు ఉత్తరపశ్చిమ దిశలో నెలకొన్న మహానగరము (సంస్కృతము లో "ద్వారకఅనగా స్వర్గానికి మార్గము). మోక్షపురి, ద్వారకామతి, ద్వారకావతి, అను వివిధ నామములతో విరాజిల్లిన నగరములో నిర్మిత మైన అతి పురాతన దేవాలయముద్వారకాధీష్ మందిరము దేవాలయమునకు ఉత్తర ద్వారము దేవతల నివాశస్థలముగాను, దక్షిణ ద్వారము భూలోకము నుంచి స్వర్గమునకు దారి చూపే రీతిలో సుమారు 2500 సంవత్సరములకు పూర్వము శ్రీకృష్ణుని పాలనలో నిర్మితమైనది. కంసుని వధించిన తదనంతరము బలరామ శ్రీకృష్ణులు యాదవులతో కూడి తమ బంధు బలగములతో ద్వారకను చేరి అనేక సంవత్సరములు ధర్మనిరతితో సుపరిపాలన గావించిరి.
అరేబియా సముద్ర తీరమున నెలకొన్న "శంఖోధర" ద్వీపములో అసంఖ్యాకముగా శంఖములు లభ్యము అవుటవలన ద్వీపమునకు "శంఖోధర ద్వీపము" అని పేరు వచ్చినది. మహాభారత కాలములో ద్వారకా నగరము చేరుటకు "నావలే" ముఖ్య సాధనములు. నాటి కాలములో 90000 అంతఃపుర భవంతులు, వజ్ర, వైడూర్య, వెండి, బంగారములతో అలంకృతమై దంతపు నగిషీ పనులతో సుశోభితమై ఉండెడివి. సువాసనభరిత జలములతో నిండిన సరోవరములు, పక్షుల కిలకిల రావములతో కనులకు విందుచేసే ఉద్యాన వనములతో రంగురంగుల పుష్పభరిత శోభితమై ద్వారకా నగరము వెలుగులీనెడిది. రాణివాస మందిరములు దేదీప్య మానముగా వెలుగుతూ, ముత్యాల సరములతో జాలువారుతూ అలంకరింప బడెడివి. వశిష్ఠ మహర్షి మహిమతో భువికి ఏతెంచిన గోమతీనదీ తీరమున వెలసిన రుక్మిణీదేవి మందిరము విశేష శిల్పకళలతో సుమారు 2500 సంవత్సరములకు పూర్వము నిర్మితమైనది. "గోపీతలాబ్" సరోవర తీరములోని మన్ను సుగంధ భరితము. హిందువులు మన్ను తమ నుదిటిపై తీర్చి దిద్దు కొనడము వారి సంప్రదాయమునకు చిహ్నము. ద్వారకా నగరిలో "బియ్యమును" దానముగా ప్రజలచే అర్పించబడటము అను సంప్రదాయము నేటికీ ఆచరింప బడటము ఒక అధ్భుతమైన సంప్రదాయ చిహ్నము. ఇందులకు కారణము శ్రీ కృష్ణుడు తనబాల్య స్నేహితుడైన కుచేలుడు భక్తితో సమర్పించిన అటుకులను తృప్తిగా ఆరగించి అతనికి అఖండ సంపత్తులను వరముగా ఒసంగెను, అను పురాణ సంఘఠన సంప్రదాయమును మన దైనందిన జీవనములో నిత్యకృత్యముగా నేటికి అలవడినది.

670-717 లో భారతదేశ నలుమూలలు పర్యటించిన ఆది శంకరాచార్యులు అద్వైత మత  సిద్ధాంతమును వ్యాప్తీ కరింప చేసి భారత దేశమునకు ఉత్తరమున - జ్యోతీర్మఠ్ (బదరీనాథ్), దక్షిణమునరామేశ్వరము (శృంగేరి మఠ్), తూర్పునపూరీ (గోవర్ధన పీట్), పడమరలోద్వారకా (ద్వారకా మఠ్)   సుస్థాపితము చేసి అఖంఢ భారతావనిని ఒకటిగా నాలుగు దిక్కులలో నిలిపెను. ద్వాదశ జ్యోతిర్లింగములలో ఒకటిగా వెలసిన "నాగేశ్వరజ్యోతిర్లింగ దేవాలయముఇచ్చోట నిర్మితమైనది. 1241 లో మహమ్మద్ షా దండ యాత్రలలో ఎన్నో దేవాలయములు నేలకూలినవి. 1437 లో సుల్తాన్ మహమ్మద్ బెగాడా నగరములో వెలుగులీనే కొన్ని దేవాలయములను నిర్మూలించగా స్థానికులు శ్రీకృష్ణ, రుక్మిణీదేవి మూర్తులను బావిలో నిక్షిప్తము చేసి 1551 లో మరల పునఃప్రతిష్ఠ గావించిరి అనునది నాటి చరిత్ర విశ్లేషణ. 19 శతాభ్ధము వరకుగల్ఫ్ ఆఫ్ కచ్" సమీపములో గోమతీ నదిపై వెలసిన వంతెన ముఖ్య నౌకా కేంద్రముగా ఉపయుక్త కరమైఉండెడిది. సర్ధాంసేతువు వంతెన గోమతీ నదిపై ద్వారకను పెంచుక్కీలను కలుపుతూ 2016 లో ఆరంభ మైనది. ఇచట వెలసిన అతి ముఖ్య దేవాలయములు జగోటా మందిర్, ద్వారకా పీఠ్, సముద్ర నారాయణ, లక్ష్మీ, సరస్వతి, హనుమన్ దండి, దేవస్థానములతో, మరియు శిలపై వెలసినశ్రీ మహావిష్ణు చక్రము" వైభవోపేతముగా చక్రనారాయణ మందిరము లో నేటికీ సుశోభితమై ఉన్నవి. జన్మాష్టమి, గర్భా నృత్యములు, రాసలీల, ఉట్టికొట్టడము, వగైరా ఎన్నో ఉత్సవములు వైభవముగా ఆచరింప బడుతున్నవి. సంస్కృతములో "ద్వారావతి" అనగా ఎన్నో రీతుల స్వర్గ ద్వారములు కలిగిన పవిత్ర భూమి. కారణము నగరము నేటికి అనేక విభిన్న మతములతో శోభిల్లుతూ, "సౌరాష్ట్రము" అను పురాతన పేరుతో ప్రసిద్ధి చెంది, 1947 లో మహారాష్ట్రము లో విలీన మైనది.

అరేబియా సముద్ర తీరమున నెలకొన్న ద్వారకా నగరము తుఫానుల భీభత్సముల వలన ద్వాపర యుగానంతరము సముద్ర గర్భములో కొంత భాగము విలీనమైనది. 1963 లో జరిగిన పరిశోధనలలో లభ్యమైన ఎన్నో అవశేషములు ద్వాపర యుగములోని ద్వారకా నగర వైభవమును మన కనులముందు ప్రస్పుటింప చేసినవి. సూర్య శక్తితో పనిచేయు 40 అడుగుల "లైట్ హౌస్" నిర్మాణము "ఫొటో వోల్టారిక్మాడ్యూల్ గా స్థాపితమై మన దేశ విజ్ఞానమునకు ధీటుగా నిలచినది. ద్వారకాదీషత దేవాలయ శిఖరాగ్రమున వెలసిన పతాకము శ్రీకృష్ణుని స్థిర నివాసమును ప్రతిబింబింప చేయడమే కాక పృధ్విపై సూర్య, చంద్రులు ఉన్నంత కాలము ఎప్పటికీ అవనిపై ఎదురులేక ఎగురుతుంది అని నేనంటాను. మరిమీరేమంటారు?