"సప్తవర్ణముల
ఆవిర్భావమే హరివిల్లు అందించే సొగసులు"
సృష్టిలోని
ప్రతీరంగుకి ఒక నిర్దేశికత, ఒక
విశిష్టత తనదైన రూపుతో సౌందర్యముతో
ఆహ్లాదకర నైజముతో ప్రకాశించుట అనునది
ప్రకృతి ప్రసాదించిన వరము. ఈ
సప్త వర్ణములు అనేక దేశవిదేశముల
వైశిష్టతలను, విభిన్న సంస్థలయొక్క ఆశయమ్ములను
ప్రజల సంస్కృతీ సంప్రదాయములను, మానుష్యజాతి
నమ్మకములను, ఉద్దేశ్యములను తెలియపరచుతాయి. సర్వమానవ సౌభాతృత్వములను, ఐక్యతను,
అభిమాన అనురాగ గౌరవ ప్రతిష్టలను
ఉన్నత శిఖరములపై నిలుపుతాయి అనడములో సందేహము ఎంతమాత్రము
లేదు.
గగనములో
ఎండావాన కలయిక ఏర్పడిన సందర్భములో
సూర్యకిరణములు వానచినుకులతో జాలువారే నీటిపైన ప్రసరింపబడినపుడు
అవి సప్తవర్ణములుగా విడివడి సుషమ్న, హరికేశ,
విశ్వకర్మ, సూర్య, రశ్మి, విష్ణు,
సర్వ బంధు అను నామములతో
వేదములలో వర్ణింపబడినవి.
నేటి విజ్ఞానవేత్తలు ఆ సప్త
వర్ణములతో ఏర్పడిన ఇంద్ర ధనస్సును
"రైన్ బో" గా అభివర్ణించి
సక్రమరీతిలో తీర్చిదిద్ది వాటిని వైలెట్ (ఆధ్యాత్మికత),
ఇండిగో (అంతములేనిది), బ్లూ (దైవత్వము), గ్రీన్
(ప్రకృతి), ఎల్లో (జ్ఞానసంపద) ఆరెంజ్
(సృజనాత్మకత), రెడ్ (వైభవం) అను
ఆంగ్ల నామములతో పొందుపరచి వాటి
విశిష్టతలు తమ విజ్ఞతను జగతికి
నిరూపించిరి. గగనతలముపై ఆవిర్భవించి ధనస్సు ఆకారములో వంగి
నింగి పైన ఏర్పడిన ఇంద్ర
ధనస్సు యొక్క అత్యంత అధ్భుత
వీక్షణము వర్ణించడానికి మాటలు చూడటానికి వేయికన్నులు
చాలవు అనిపిస్తుంది. ఈ సప్త
వర్ణముల కలయకతో శ్వేత వర్ణము
ఏర్పడుతుంది. ఈ నయ
నానంద కరమైన సప్త వర్ణముల
ఉనికిని వాటి వైశిష్టతలను అతి
సులభరీతిలో విశదపరచడమే ఈ వ్యాస
ముఖ్యోద్దేశ్యము.
ఆదివాసులకి
ప్రకృతి నుంచి లభ్యమైన వర్ణములు
మాత్రమే తెలుసు. తమదైనందిన జీవితములో
వాటిని ఉపయుక్తకరము చేసుకొనడము నేటికీ చెక్కు చెదరని
గుహలలో చిత్రీకరించిన చిత్రములు వారికి లభ్యమైన పూలు,
కాయలు, పండ్లు, ఆకుల పసరులను
ఉపయోగించెడి వారు. నేడు చేనేత
కార్మికులు ఇవే రంగులు వస్త్ర
తయారీలో వాడకముతో వారి ప్రతిభను
నిరూపించడమైనది. దేశ విదేశములలో ఈ
వస్త్రములకు గిరాకీ పెరిగి ఫ్యాషన్
గా రూపు దిద్దుకొన్నవి.
ఊదారంగు
(వైలెట్)
ఇంద్రధనస్సులో
కనిపించే మొదటి రంగుగా నెలకొన్నది.
మనసుకి అమిత ఆహ్లాదము శాంతి
నెమ్మది కలిగించే వర్ణముగా ఉత్తేజభరితమైనదిగా
నిలచినది. ఎరుపు నీలి రంగుల
కలయికతో ఏర్పడిన అతి సుందరమైన
రంగుగా భాసిల్లుతున్నది. పాతరాతి యుగములో ఆదిమానవులు
గుహలలో అలంకరించిన చిత్ర లేఖనములు 50000 వేల
సంవత్సరములకు పూర్వమే ఆస్ట్రేలియా ఖండవాసులు
చిత్రించినా నేటికీ జీవకళలతో అలరారుతున్నవి.
ఈజిప్షియన్స్ మల్బరీ పత్రములు మరియు
ద్రాక్ష ఫలములు నూరి ఊదా
రంగుతో తీర్చి దిద్దిన వస్త్రములను
బానిసలు ధరించడము అను పద్ధతి
ఆ కాలములో ప్రాచుర్యములో
ఉండెడిది. 1862వ సంవత్సరములో
క్వీన్ విక్టోరియా మహారాణి యొక్క వైలెట్
రంగు వస్త్రముల ప్రదర్శన పెర్కిన్లో పలుజనర
ఆకర్షణకు ప్రశంసలకు ధీటుగా నిలచి ఎనలేని
ప్రాముఖ్యతను సంతరించు కొన్నది. అంతకు
ముందు కాలములో యూరోపియన్ సమాజములో
విద్యావేత్తలకు, రాజ ప్రముఖులకు మాత్రమే
ఈ రంగు వస్త్రధారణకు
అనుమతి ఉండెడిది. సామాన్యులు ఈ రంగు
వస్త్రధారణకు అనర్హులుగా పరిగణింప బడెడివారు. తరువాత
కాలములో రాజకీయనేతలు, వ్యాపారవేత్తలు ఊదా రంగుతో తయారు
చేయబడిన సూట్స్, నెక్ టైలు
ధరించి విశేష మార్పును 21వ
శతాభ్ధములో సమాజములో అలరింపచేసిరి. తరువాత
కాలములో ఈ వర్ణము
దేశ శాంతికి, సమైక్యతకు, స్వతంత్ర
భావములను వ్యక్తపరచుటకు అనువుగా తన దైన
ప్రత్యేకతను తీర్చి దిద్దుకొన్నది. జపాన్
దేశస్థులు "అలకనేట్ ప్లాంట్" ద్వారా
ఈ వర్ణమును తయారుచేసి
వస్త్ర తయారీకి అనువుగా తీర్చిదిద్దడము
వారి విజ్ఞతకు నిదర్శనము.
మధ్య యుగములో ఈ రంగు
పుష్పములను "ఫ్రెంచ్ వైలట్" గా
అభివర్ణించిరి. ఆంగ్లేయులు 1370వ సంవత్సరములో
లవండర్ రంగుతో సుగంధ పరిమళములతో
ఆహ్లాదకరమైన పుష్ప తోటలను అభివృద్ధి
పరచి అమిత ఆకర్షణీయముగా పెంపుదల
చేసిరి. బ్రిటన్ వాసులు స్వతంత్ర
భావములను వ్యక్తపరచే వర్ణముగా స్థిర అభిప్రాయమును
కలిగి ఉండటమే ఒకప్రత్యేకత. ఉన్నతపదవులలో
విలసిల్లేవారికి ఈరంగు వస్త్రధారణ ఎంతో
హుందాతనాన్ని, గౌరవాన్నీ పెంపొందింపచేస్తుంది. ఈవర్ణము మనిషిలోని తెలివికీ
రాజసానికి, కళాత్మకహృదయానికి ఇతరులదృష్టిలో మనపై అత్యధిక ఉన్నతభావములను
పెంపొందింప చేయడానికి, వారిలో వికాసమయ్యే శక్తిసామర్ధ్యములను
బలపరచుటకు ఈరంగు తార్కాణము. లవండర్
వర్ణముగా సుపరిచితమై కురిపించే సుగంధపరిమళములు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని వెల్లువ పరచడము ఒక
విశేషమైతే ప్రకృతి ఈరంగు పూలతోనిండితే
ఆసౌందర్యము వర్ణించడానికి ఎన్ని మాటలు కావాలో
చూడటానికి మరి ఎన్నికన్నులు కావాలో
అనిపిస్తుంది.
గాఢనీలి
(ఇండిగో)
ఇంద్ర ధనస్సులో అలలారే రెండవ
వర్ణముగా నెలకొన్నది. నీలి, మరియు ఊదా
రంగుల కలయికతో ఆవిర్భవించిన రంగు
ఇండిగో అనుపేర వెలసినది. 4000 బి.సి లో తూర్పు
ఆసియా ఖండములో "ఇండిగోఫెరా" అను మొక్క ద్వారా
గుర్తింపబడిన వర్ణము. తరువాత కాలములో
ఈజిప్ట్, ఇండియా, పెరు దేశములలో
వ్యాప్తి చెందెను. లాటిన్ భాషలో
"ఇండియం" ఆంగ్లేయులు, ఫ్రెంచ్, పోర్చుగీస్, "ఇండిగో"
మెక్సికో లో "ఆనీల్" అను
వివిధ నామములతో ఈ వర్ణమును
ప్రాచుర్యము లోనికి తెచ్చి, ఇలపై
నిలిపిరి క్రీ.శ.1229వ
సంవత్సరములో ఆంగ్లేయులు ఈ మొక్క
ద్వారా లభ్యమైన వర్ణ పుష్పములను
తోటలలో సమృద్ధిగా పెంపుదల చేసి పరిసరములను
అత్యంతశోభితము చేసిరి. తరువాత కాలములో
క్రీ.శ. 1778వ సంవత్సరములో
స్పైన్ దేశము ప్రపంచములోనే అత్యధిక
"ఇండిగో" ఉత్పత్తి చేయు దేశముగా
కీర్తి పొందినది. ఫ్రెంచ్ రివల్యూషన్ సమయములో
రాజపదాతి దళము వారు ధరించే
"సైనిక కోట్స్" తెలుపు వర్ణముతో ధరించడము
ఒక సమాజ నిభద్ధతగా
నెలకొని ఉండెడిది. క్రీ.శ. 1914వ
సంవత్సరములో వారి వస్త్రధారణ "ఇండిగో"
రంగు లోనికి మార్చడము ఒక
సమాజ మార్పునకు సూచనగా నిలచినది. జపాన్
దేశములో ఈ రంగు
"పెర్న్ నికేరియ టింక్ టోరియా"
అను పేరుతో ప్రాముఖ్యత సంతరించు
కొన్నది. ఇస్సాక్ న్యూటన్ పరిశోధనములో
తెలుపు వర్ణము ఏడు రంగులతో
మిళితమైనదని ఇండిగో రెండవ వర్ణముగా
ఆవిష్కరింపబడినని నిరూపించెను. 21వ శతాభ్ధములొ
ఎలక్ట్రిక్ ఇండిగో కొన్ని
సమయములలో " కంప్యూటర్ గ్రాఫిక్స్ లైటింగ్" అబివృద్ధి పరచుటకు ఉపయుక్తకరముగా మారినది.
"సుడో సైంటిఫిక్ న్యూ ఏజ్" వారి
పరిశోధనల ప్రకారము "ఇండిగో చిల్డ్రన్" అత్యున్నత
ప్రజ్ఞను కలిగి ఉన్నత స్వాభావిక
శక్తులను తమదైనందిన జీవనములో ప్రతి బింబింప
చేయుట అను ప్రసంసకు పాత్రులు
కావడము ఈ రంగు
విశిష్టత. మానసిక తత్వవేత్తలు ఈ
వర్ణము మనుషుల్లో ప్రతిఫలించే నిజాయితీ, న్యాయ విశ్లేషణ, స్వచ్చత,
నిస్పక్షపాతము, అంకితభావము, స్వపర భేధభావములు లేకుండుట
అను తత్వములను ప్రతిఫలింప చేయుటకు ప్రతీక అని
తమ పరిశోధనలలో నిరూపణ
చేసిరి. ఇండిగో రంగు నూలు
దారములకు, పట్టు వస్త్రములకు, మరియు
నీలి జీన్స్ తయారీలో రంగుల
అద్దకములో ఎంతో ఉపయుక్తకరమే కాక
ఆధునిక ప్రపంచ నాగరీకుల అలంకరణలో
జీవనములో ప్రముఖమైనది. మనిషిలోని ఉన్నతప్రశాంతతకు, ఆలోచనలకు, అంతః దృష్టికి ఒకరినొకరు
అర్ధముచేసుకొనే శక్తికి ప్రతిబింబమే ఈవర్ణము.
మనలో ప్రతిబింపచేసే నమ్మకము, తెలివితేటలు, విజ్ఞానము,
విశ్వాసము. నిజాయితీల నిరూపణలకు నిలకడగా నిలిచే వర్ణము.
మన జాతీయ పతాకములో
విలసిల్లే "ధర్మచక్రము" నీలిరంగుతో నెలకొని ఉండటము భారతీయులలోని
శాంతి భావములను ప్రపంచానికి చాటిచెప్పే
సంకేతమే ముఖ్యోద్దేశ్యము.
శాంతియుతమైన
ఆధ్యాత్మిక భావములు, రక్షణ, నమ్మకము,
ఓర్పు, ప్రపంచ ఏకీకరణముపైన నమ్మకము
ఆపదలోనిలచినవారిపై ఓదార్పు వచనములతో ధైర్యము
నిలపడము మరియు సర్వజనతను అభివృద్ధి
పధమువైపు నడిపి తీర్చిదిద్దే రంగుగా
నెలకొన్నది ఈరంగు వస్త్ర ధారణ
అత్యంత సౌందర్యాని ప్రతిబింపచేయడమేకాక కనులకు ఎంతో ఉత్సాహభరితమును
అనందమును కలుగచేయును అనుటలో సందేహము ఎంతమాత్రములేదు.
నీలి వర్ణము (బ్లూ)
ఇంద్ర ధనస్సులో అలరారే మూడవ
వర్ణముగా భాసిల్లుతున్నది. వైలెట్, గ్రీన్ రంగుల
కలయికతో ఆవిర్భవించినది. అంతరిక్షము నుండి వీక్షించితే గాలిలో
తేలియాడే భూగోళము, అవనిపై అలలాడే
సముద్రములు, గగనసీమల తేలి తేలి
విహరించే మేఘములు నీలి రంగుకు
కొన్ని ఉదాహరణములు.
"విశ్వాకారం
గగన సదృశం, మేఘవర్ణం శుభాంగం"
అని వైకుంఠనాధుని వర్ణనలో నీలిరంగు ఎంత
ప్రశస్థమైనదో విశదీకరించడమైనది. వేదములు స్వర్గ లోకమును
నీలి వర్ణముతో వర్ణించినవి. సదా
సృష్టిని పరిరక్షించే శ్రీ మహావిష్ణువుని దేహచ్చాయ
దశావతారములలో నీలివర్ణముతో ప్రస్తుతించడము పురాణోక్తి.
పాత రాతి యుగములో గుహలలో
చిత్రీకరింపబడిన చిత్రములు మెసపటొమియన్స్, ఇరానియన్స్ విలువైన ఈ రంగు
రాళ్ళను ఆభరణములలో అలంకరించుకొనడము అద్భుతమే. ఈజిప్షియన్స్ సిలికొన్, సున్నము, కాపర్, ఆల్కాలై
800.ఫా.డిగ్రీల వద్ద వేడి
చేసిన ద్రవముతో కర్ర పరికరములు,
మట్టి పాత్రలు, కాన్వాస్, టేబిల్వేర్
చిత్రీకరణముల తయారి ఒక విశేషమైతే
మృత్యువు బారి నుండి క్షుద్రశక్తుల
నుండి రక్షించే వర్ణముగా భావించడము
అనే నమ్మకము ఇంకొక విశేషము.
9 వ శతాభ్ధములో చైనా దేశస్థులు గాజు
పాత్రలపై చిత్రీకరణకు ఈ రంగు
ఉపయోగించి ప్రపంచ విఖ్యాతి పొందిరి.
13వ శతాభ్ధములో యూరప్ లో రక్షణాధికారులు,
ప్రభుత్వ ఉద్యోగస్థులు ధరించే దుస్తులు అఫీషియల్
గా ఈ వర్ణము
నిశ్చయించడముతో వారి దేశ ఆర్ధిక
సంపత్తులకు, గౌరవ ప్రతిష్టలకు నవీన
ఫ్యాషన్ డిజైన్లతో తీర్చిదిద్దబడిన వస్త్రములు ఈ రంగుతో
పొందు పరచబడినవి.14వ శతాభ్ధములో
భారతీయులు "ఇండిగో" మొక్క పత్రములను నీటిలో
నానపెట్టి తయారుచేసిన పేస్టుతో ఇటుకల రూపములో
ఎండపెట్టి ఇంగ్లండ్ దేశమునకు ఎగుమతి
చేయడము ఆర్ధిక సంపత్తులను పెంపొందింప
చేసినది.
1781వ సంవత్సరములో "బ్లు లా" అను
సూత్రము అమెరికా దేశములో ఆధ్యాత్మికతను,
పెంపొందింప చేసి చర్చిలోని ప్రార్ధనలకు
విశ్రాంతికి, ప్రతీకగా మరియు అన్ని
రంగముల వారికీ ఆదివారము శెలవు
దినముగా నిశ్చయింప బడినది. యూరప్ లో
"నీలిరిబ్బన్" అను ప్రక్రియ వారి
దేశ ఔన్నత్యమును ఉన్నత శిఖరములపై అధిష్టింప
చేయుటకు నిర్ణయించబడిన నిపుణులను ఈ విధముగా
సన్మానించడానికి దోహదకారి అయినది. జంతుశాస్త్ర
సంబంధిత వైద్యులు నీలి రంగు
క్రాసును తమ వృత్తికి ధీటుగా
నిలపడము వారి విశిష్ట వైభవమునకు
వృత్తిపై అంకిత భావనలకు సూచన.
అమెరికాలో ఈ రంగు
"డెమొక్రటిక్ పార్టీ" ని సుస్థిర పరచేదిగా
అలరారుతున్నది. ఇటలీ దేశస్థులకు "జాతీయ
వర్ణము" గా శోభిల్లుతున్నది. మొదటి
ప్రపంచ యుద్ధ సమయములో ఈ
రంగు స్త్రీ పురుషులకు అనువుగా
నిర్ణయింపబడినా 1940 వ సంవత్సరము
తరువాత ఆ దేశములో
ఈ రంగు పురుషులకు
మాత్రమే నిర్ణయింపబడటము కేవలము ఆ దేశములోనే
కాక నేడు ప్రపంచమంతటా ఈ
భావము విస్తరించినది. నేడు భారత క్రికెట్
క్రీడాకారులు ఈ వర్ణ
దుస్తులను ధరించి దేశ విదేశములలో
తమ శక్తి సామర్ధ్యములను
నిరూపించుతూ దేశ ఔన్నత్యమును నిలబెట్టి
భారతీయ కీర్తి పతాకమును ఎగరవేయడము
దేశ ప్రతిష్టతను ద్విగ్విణీకృతము చేయడమే అవుతుంది. ప్రతీ
మనిషిలోను నమ్మకము, తెలివితేటలు, ప్రజ్ఞ,
విశ్వాసము, చేసే పనిపై గురి,
సృజనాత్మక శక్తి, విజ్ఞానము, అంతులేని
నిలకడ తత్వము, విధేయత, నెమ్మది,
మరియు కష్టములో ఉన్న వారికి
అందించే సహాయ హస్తం అను
సద్గుణములను పెంపొందింపచేయు రంగుగా ఇలపై విరిసి
మురిపించేది నీలి వర్ణమే. ఇంత
సౌందర్య సౌలభ్యములతో వికసించే నీలి పుష్పములు
కూడా ప్రకృతి సౌందర్యమును ఇనుమడింప
చేయుట అనునది సృష్టిలోని వింతే.
ఆకుపచ్చ
(గ్రీన్)
ఇంద్రధనస్సులో
మెరిసే నాల్గవ వర్ణముగా సుశోభిల్లుతున్నది.
నీలి పసుపుల కలయికతో ఏర్పడిన
నూతన వర్ణము. ప్రకృతికి అతి
చేరువలో నిలచి వసంత ఋతువు
ఆగమనానికి, సూచనకి ఆరోగ్యానికి, యవ్వనానికి.
మంచి ఆలోచనలకి నిదర్శనము.
పురాతన ఆంగ్లములో ఈ వర్ణమును"గ్రీనీ "అనేవారు అనగా స్వచ్చతకు
శుభ్రతకు ప్రతీకగా నిలచిన రంగు
అని అర్ధము. జర్మనీభాషలో" "గ్రౌనీ" గా
పిలువబడటము వారి వైభవమునకు చిహ్నముగా
నిలచినది. ఆదివాసులు ప్రకృతికి సమీపాన జీవనము సాగించెడివారు
అను నిదర్శనానికి "బార్క్"
వృక్ష పత్రములను వస్త్రములుగా మలచుకొన్నది హరితవర్ణమే. ఆకులలొ నిండివున్న పత్రహరితము
(క్లోరోఫిల్) సూర్య కిరణములతో సంయోగము
చెంది ఆకుకూరలు, పండ్లు, కాయగూరలు ఆదిగా
గల ఉపయుక్తకరమైన ధాన్య
సంపత్తులను తయారు చేసి మనకు
అందించేది ప్రకృతి ద్వారా లభ్యమయిన
ఉచిత కానుకలే. ఇవి లేకుంటే
జీవకోటి మనుగడయే లేదు అనునది
సత్యము. ఎండ తీవ్రత నుండి
మనకు రక్షణ కల్పించేది హరితభరిత
వృక్షములే. కొన్ని ఔషధ వృక్షములైన
వేప, నిమ్మ, తులసి, రావి
చెట్ల వద్ద వీచే గాలి
పరిశుద్ధము ఆరోగ్యకరము. యూరోపియన్స్ ఈ హరిత
వర్ణమును రాజకీయ చిహ్నముగా నమ్మడము
ఎంతో వింత. పాకిస్తాన్ దేశమునకు
జాతీయ రంగుగా విలసిల్లుతున్నది. వారి
మత ప్రవక్త ఖురాన్
గ్రంధములో ఒక జాతిని ఉన్నత
స్థితిలో నిలుపు అబివృద్ధి చిహ్నములుగా
"జలము, హరితవర్ణము, అందమైన నిర్మల ముఖము” అత్యంత
విశేషమైన సంపత్తులుగా అభివర్ణించెను. జేడ్స్, ఎమరాల్డ్స్ అనునవి
హరిత వర్ణముతో మెరిసి సువర్ణ
ఆభరణములలో పొందు పరచబడి కీర్తి
ప్రతిష్టలకు చిహ్నములుగా నిలవడము అభివృద్ధికి సంకేతమే.
ఈ రంగు సురక్షిత
పయనమునకు చిహ్నముగా ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద వాహనదారులకు సురక్షిత
గమ్యమును నిర్దేశించుట అనునది సర్వత్ర ఆమోదకరము.
పండుగలలో, శుభకార్యములలో అలంకరణ కొరకై కట్టే
ఆకు పచ్చని పందిళ్ళు, మామిడాకుల
తోరణములు శుభ సంకేతానికి వైభవానికి
చిహ్నములు. యవ్వనానికి, అభివృద్ధికి, సమాజములో ఉన్నత స్థితికి,
అంగీకార యుక్తమైన ఆలోచనలకి, మనస్సులో
వెల్లువ అయ్యే భావనలకి నిదర్శనముగా
హరిత వర్ణము నిలుస్తుంది. అన్ని
రంగములలో ఎవరైనా అభివృద్ధి పధములో
తమ జీవనమును గడిపిన
సమస్యలకు ఎదురొడ్డి విజయోన్నతులైనా వారిని "ఎవర్ గ్రీన్" గా
అభినందించడము ఒక విధమైన ప్రశంసకు
ధీటుగా నిలచిన వర్ణము.
ఇన్ని సుగుణములతో కూడియున్న హరిత వర్ణము భారతీయ
జాతీయ పతాకములో సుస్థిర స్థానముతో
నిలచి ఉండటము దేశ ఆర్ధిక
ఆభివృద్ధికి మరియు ప్రకృతి వనరుల
పెంపుదలలకు చిహ్నముగా అలరారడము మనకు లభించిన
అపూర్వ కానుక మరియు శుభ
ప్రదమైన వాతావరణాన్ని సదా నెలకొల్పుట ఇలలో
మన సంప్రదాయము అని
నేనంటాను. మరిమీరేమి అంటారు?
పసుపు రంగు (ఎల్లోకలర్)
ఇంద్రధనస్సులో వెల్లి విరిసే ఐదవ
వర్ణము పసుపు రంగు. నారింజ
ఆకుపచ్చల కలయికలతో ఆవిర్భవించిన వర్ణము.
పురాతన ఆంగ్లములో "జియోలు" డచ్ "జీల్” స్కాట్లేండ్ "ఎల్లా" జర్మనులు "జెల్బ్" ఈజిప్షియన్స్ "గోల్డ్" అని పసుపు రంగును
వివిధ నామములతో అభివర్ణించెడి వారు.
రాతియుగ
కాలములో పసుపు రంగు వర్ణమును
"రాసేడా లూటిలో” అను కలుపు మొక్క
నుంచి తయారు చేసి వర్ణ
చిత్రములను చిత్రీ కరించెడివారు. 17300 సంవత్సరములకు
పూర్వము ఫ్రాన్స్ దేశములో నెలకొన్న
"లాస్ కాక్స్" అను గుహలో పసుపు
రంగుతో చిత్రించిన జంతువుల చిత్రములు నేటికీ
వన్నె మాయక అలరారుతున్నవి. జ్వుస్
మతస్థుల సంప్రదాయ వర్ణముగా శోభిల్లుతున్నది.
ఈజిప్షియన్స్ వారి సమాధులను పసుపు
వర్ణముతో అలంకరించుకొనిరి. 15వ శతాభ్ధములో
హోలీ రోమన్ ఎంపైర్ చక్రవర్తులు
ఉపయోగించిన పతాకముల రంగు మరియు
వారి భవంతులు, గృహములు పసుపు
రంగుతో తీర్చి దిద్దుకొనిరి. క్రీ.పూ.7వ శతాభ్ధములో
అశీరియన్స్ "క్రోకస్ సాటియస్" పుష్పము
నుంచి తయారు చేయబడిన పొడిని
మసాలా దినుసులలో ఒకటిగా తమ భోజన
పదార్ధముల తయారీలో పసుపు వర్ణముగా
అలంకరించుటకు ఉపయోగించడము ఒక రీతి. యూరోపియన్
యూనివర్శిటీలలో పనిచేసే సంభంధిత అధికారులు
పసుపు వర్ణ పొడవైన గౌన్లు,
టోపీలు ధరించడము వారి విజ్ఞాన
పరిశోధనకి గుర్తుగా భావించెడి వారు.
ఇటలీ దేశస్తులు మాత్రము ఈ వర్ణమును
కౄరాత్మక కధలకు ప్రతీకగా తలపోయుట
సర్వ సామాన్యము. వేటికన్ సిటీ పతాకము,
క్రైస్తవ మతాధికారి అయిన "పోప్" ధరించే పొడవైన దుస్తుల
వర్ణము పసుపు రంగు కావడము
విశేషము. 20వ శతాభ్ధములో
పసుపు రంగు అత్యధిక జనసంఖ్యతో
అలరారే దేశముల యొక్క జాబితాను
తెలిపే రంగుగా భావించ బడెడిది.
"యాంటీ కమ్య్యూనిస్ట్ పార్టీ" 1955-1975 కాలములో సౌత్ వియత్నాం
దేశస్థుల గురుతు పసుపువర్ణమే. రహదారులలో
ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద పసుపు రంగు
సిగ్నల్ వాహనదారులు ముందు వరియడానికి సిద్దతగా
నిలవడము ఒక విశేషమైతే నేడు
స్కూల్ వాహనములు పసుపు వర్ణము
కలిగి ఉండటము సురక్షిత పయనమునకు
ప్రతీకగా నిలచినవి. వేద కాలము నుంచి
పసుపు వాడిక భారత దేశములో
ఆయుర్వేదిక వైద్యులకు సర్వ సామాన్యము. ఇది
భారత దేశములో పెరిగే "జాతీయ
మొక్క" గా పేరొందినది. తరువాత
కాలములో సౌత్ ఈస్ట్రన్ ఏషియన్
దేశములలో ప్రాచుర్యము పొందినది. 4000 సంవత్సరముల పూర్వము చరిత్రగల ఉపయుక్తకరమైన
పసుపు మొక్క "కుర్కుమా లోంగా" (ఇండియన్
సాఫ్రాన్) అను పేర నాటి
నుంచి నేటి వరకు దైనందిన
జీవనములో ప్రముఖమైనది. అత్యంత శుభ ప్రదమైన
మనస్సును ఉత్సాహ భరితము చేయ
గలిగే వర్ణము. సంతోషానికి, శక్తికి,
తెలివి తేటలకి ధైర్యానికి ప్రతి
రూపమైనది. కొందరు విదేశీయులు ఈ
రంగును ధైర్యానికి గురుతుగా తలంచడము విశేషము.
భారత దేశములో వివాహిత స్త్రీలకు
సుమంగళ చిహ్నముగా పసుపు రంగు దారముతో
ముడి వేసిన మాంగల్యము వివాహ
సమయములో వదువు కంఠమున మాంగల్య
రూపములో వరునిచే ముడి వేయబడటము
మన సంస్కృతీ సంప్రదాయములకు
చిహ్నము. ముత్తైదువులకు సౌభాగ్య చిహ్నముగా నాటికీ,
నేటికీ, ఎప్పటికీ నిలచి ఉండునది.
ఆరోగ్య రీత్యా పసుపు శారీరానికి
ఎంతో ఉపయుక్తకరము అని వైద్య శాస్త్రము
చెబుతోంది. వంటలలో పసుపు వాడటము
అతిసామాన్యము. పూర్వ కాలము నుంచి
నూతన వస్త్రములను ధరించే ముందు పసుపు
బొట్టు ఉంచి శుభ ప్రదం
చేయడము ఒక ఆనవాయితీ అయితే
పసుపుతో కలిపిన నీరు తులసీ
దళములతో శుభ, అశుభ కార్యములలో
జల్లటము ఒక పవిత్ర కార్యముగా
భావించడము, మరియు వివాహాది శుభ
కార్యములలో వధూవరులకు, పసుపు నీట స్నానము
శుభ సూచకమే. దక్షిణ భారత
దేశములో ప్రతీ ఇంటి గడపలు
పసుపు, కుంకుమలతో అలరింప చేయడము ముంగిళ్ళు
రంగ వల్లులతో తీర్చి దిద్దడము
శుభ సూచకము. ఈ రంగు
వస్త్రధారణ స్త్రీ, పురుషులకు అత్యంత
ఆకర్షణ శక్తి, సంతోషమును పెంపొందించేదిగా
ఉంటుంది. హిందూ ఉపనయన సమయములో
వటువుకు పసుపు వర్ణ దుస్తులను
ధరింప చేయడము ఒక రీతి
మరియు రివాజు.
పసుపు వర్ణము స్వచ్చతకు, నిర్మలత్వానికి,
అనుకూల భావనలకు, స్పష్టతకు, జ్ఞానమునకు,
సహాయమునకు అందుబాటులో ఉండే తత్వానికి, జ్ఞాపకశక్తికి,
తెలివితేటలకి గౌరవానికి ఊహాశక్తికి ప్రతీకగా నిలుస్తుంది. ఇతరులపై
ప్రేమని, స్నేహభావాన్ని తెలియపరచే వర్ణముగా శోభిల్లుతున్నది. మన
లోని నీతి నిజాయితీలకి తార్కాణము
మాత్రమే కాక కనులకు అత్యంత
ఆకర్షణ కలిగించే వర్ణము. బైబిల్
ప్రకారము ఈ వర్ణము
స్వచ్చతకి, జ్వలించే అగ్నికి, దైవశక్తికి
నిరూపణగా భాసిల్లుతున్నది. దేవాలయములలో వెలసిన దేవి, దేవతా
మూర్తుల పసుపు వర్ణ వస్త్రములతో
పుష్పములతో చేసే అలంకరణ ఆధ్యాత్మిక
భావములను భక్త కోటిలో పెంపొందింప
చేస్తుంది. సూర్యొదయానికి చిహ్నముగా ప్రభవించునది ప్రకృతి ఈ రంగు
పూలతో నిండితే అత్యంత ఆహ్లాదకరము
కమనీయముగా మన మనస్సులు సంతోష
తరంగాలతో నిండి కనులకు అంతులేని
ఆకర్షణగా నిలుస్తుంది.
నారింజ రంగు (ఆరంజి రంగు)
ఇంద్ర ధనస్సులో సుప్రకాశిత మయ్యే
అరవ రంగుగా విరాజిల్లునది నారింజ
రంగు. ఎరుపు మరియు పసుపు
రంగుల కలయికతో ఆవిర్భావమైనది. సంస్కృతములో
"నారంగా", అరబ్బు లో "నారంజ్",
ఫ్రెంచ్ లో "పోమ్మడ్ నారింజ్"
పోర్చ్ గీస్ లో "లారంజ"
గా వివిధ నామములతో
అలలారే వర్ణము. 1512వ సంవత్సరములో
ఆంగ్లేయులు "ఆరెంజి" అను పేరుతో అభివర్ణించిరి.
మధ్యయుగ
కాలములో రోమన్స్ మినరల్ పిగ్మెంట్
నుంచి తయారుచేసిన "ఆరంజివర్ణ" పదార్ధమును వ్యాపారమునకు ఉపయోగించెడివారు. క్రీ.శ. 15-16 శతాభ్ధములో
యూరోపియన్స్ మొదటిసారిగా ఆరంజి మొక్కలను ఆసియా
ఖండమునుంచి తమ దేశములకు చేర్చి
ఆ ఫలములను పరిచయము
చేసిరి. 18వ శతాభ్ధములో
"పోమన్నా" అను దేవత పేరుతో
ఈ వర్ణము అఖండ
కోరికలను తీర్చు దేవతగా ఆమెను
ఆరాధించిరి. ఫ్రాన్స్ దేశములో "క్లౌండ్మోనెట్"
చిత్రీకరించిన సూర్యోదయ వర్ణము నేటికీ
అధ్భుతముగా నిలచి ఉన్నది. 20-21వ
శతాభ్ధములలో ఈ రంగు
వ్యతిరేక అనుకూల భావములను ప్రతిబింబించెడిది.
రెండవ ప్రపంచ యుద్ధ సమయములో
నేవీ పైలెట్స్ ఈ వర్ణ
జాకెట్లను ధరించడము తప్పనిసరి. తరువాత
కాలములో సామాన్య ప్రజలకు ఆమోదయోగ్యమైనది.
క్రీ.పూ 5వ శతాభ్ధములో
బౌద్ధమత సన్యాసులు ఈ రంగు
వస్త్రధారణతో ప్రపంచ శక్తికి ధీటుగా
కట్టుబడి, క్రమభద్ధులై ఉండుటకు, ఏక సూత్రీకరణమును
నమ్మి ఆరంజి రంగు వాహనములో
టిబెట్, చైనా, జపాన్, కొరియా,
థాయిలేండ్, శ్రీలంక, సౌత్ ఈస్ట్
ఆసియా దేశములలో పయనించి బౌద్ధ
మత విశిష్టతలను ప్రచారము
చేయడము ఒక విశేషమైతే సుప్రసిద్ధ
చైనా దేశ మతప్రవక్త "కంఫూషియస్"
వారి అనుచరులతో ఈ వర్ణ
దుస్తులు ధరించి తమ మత
సిద్ధాంతములను ప్రజలలోకి వ్యాప్తీకరింప చేయడము ఇంకొక విశేషము.
చైనా దేశములో ఈ వర్ణముతో
తయారైన పధార్ధమును విషబాణముల తయారీకి మరియు రోగులకు
విషమ పరిస్థితి ఆసన్నమైనపుడు వైద్యులు అతి ఉపయుక్తకరముగా
రోగ నివారణకు ఉపయోగించడము వారి
విజ్ఞతకు నిదర్శనమే. 2వ ప్రపంచ
యుద్ధానంతరము యూరప్ అమెరికా దేశములలో
కార్మికులు దుస్తులు "క్రిస్టియన్ డెమొక్రటిక్ పొలిటికల్ పార్టీ" ఉద్దేశ్యములను వ్యక్తీకరించుటకు ఈ రంగు
నిరూపణగా నిలచినది. 2004 నవంబర్-డిసెంబర్ మధ్య
కాలములో "ఉక్రేయిన్" దేశములో జరిగిన వైపరీత్యములకు
"ఆరెంజ్ రెవల్యూషన్" అని నామాంకితము చేసిరి.
మనుష్య జీవనమ్ములో సంతోషమ్మును, యువతలోనిశక్తిని వైభవమ్మును పెంపొందింప చేసే రంగుగా సుస్థిరమైనది.
మనసులోని స్వచ్చమైన ఆలోచనలకు, ధైర్య సాహసమ్ములకు ప్రతీకగా
నిలుస్తుంది. సర్వజనదృష్టిని ప్రభావితము చేసే రంగు. నెదర్
ల్యాండ్ దేశమున కు జాతీయ
రంగుగా సుశోభిల్లుతున్నది. ఈ వర్ణముతో
తయారైన భోజన పదార్ధములు శరీర
దారుడ్యమును పెంపొందింప చేయడము ఒక విశేషమైతే
ఈ రంగుతో ఉత్పన్నమయ్యే
పండ్లు, కూరగాయలు కాయలు మన
జీర్ణశక్తిని పెంపొందింప చేయగల గుణముకలిగి ఉండటము
ఒక ప్రత్యేకత మరియు
ప్రకృతి మనకు ఇచ్చిన కానుక.
భారత దేశములో ఈ రంగు
పుష్పములు కాశ్మీర్ ప్రాంతములో అత్యధికముగా
పెంపుదల చేయు ప్రాంతము. ఆనాది
కాలము నుంచి వీనిని "కుంకుమ
పువ్వులు" (కేసరి) అను పేరుతో
అనేక ఆహార పదార్ధముల తయారీలో
వాడకము ఉన్నది. ముఖ్యముగా గర్భిణీస్త్రీలకు,
పుట్టబోయే బిడ్డలకు ఆరోగ్యరీత్యా మంచిది.
జీర్ణ శక్తిని మరియు శరీర
చ్చాయను పెంపొందింప చేసే విశేష గుణము
కలిగి ఉండటము వీని ప్రత్యేకత.
కుంకుమ పువ్వుతో తయారైన పదార్ధములు
నారింజ రంగులోకి మారడము విశేషమే.
మనుష్యుల లోని ప్రోత్సాహశక్తికి, స్థిరనిశ్చయానికి,
చైతన్యానికి మనసులోని అభిప్రాయములను వ్యక్తీకరించడానికి
ఈ వర్ణము తార్కాణము.
వేద కాలమునుంచి ఋషులు, యోగులు, మునులు,
సన్యాసులు ఈ రంగు
వస్త్ర ధారణ చేయడము వారి
లోని ఆధ్యాత్మిక శక్తులను వ్యక్తీకరించుటకే అనునది
ఒక నమ్మకమైతే వారు
చేసే లోకోపకారము ధరణిపై ధర్మ సంస్థాపనకే
అనునది నిరూపితమైనది. అందువలనే ఈ రంగు
దైవత్వాన్ని వ్యక్తీకరించడమే కాక మనలోని భక్తి
భావనలను పెంపొందింప చేస్తుంది. ఈ లోకములో
జరుగుతున్న వైపరీత్యములకు, సమస్యలకు తగు రీతిలో
శాంతియుత పరిష్కారము చూపే విజ్ఞానం వీరి
వస్త్ర ధారణలో నిబిడీకృతమై ఉన్నది
అనినేనంటాను.
తూర్పున
ఉదయించే సూర్య భగవానుని జపాకుసుమ
వర్ణముతో సరి పోలిచి ప్రత్యక్ష
దేవునిగా వివిధ రీతులలో ఆరాధించి
జనసందోహములు చేసే సూర్య నమస్కారములు,
యోగాభ్యాసములు, వ్యాయామములు, క్రీడలకు స్వాగతించి శుభోదయము
తెలిపే వర్ణమే కాషాయ వర్ణము.
ఉదయ, సంధ్య, సమయములలో సూర్య
కిరణముల ద్వారా ప్రాణికోటికి లభ్యమయ్యే
అపూర్వ ఆరోగ్య శక్తికి వెలకట్టలేము.
అనేక చర్మ వ్యాధుల బారినుండి
రక్షింపబడటమే కాక శరీరానికి అవసరమయ్యే
విటమిన్ "డి" పుష్కలముగా లభ్యమౌతుంది
అనునది జగద్విదితము. ఉచిత శక్తి ప్రదాత
అయిన సూర్యుని ఆరాధించి ఆరోగ్యకర
జీవనమును పొందమని వేదాలు నిర్దేశించడమైనది.
ఇన్ని విశిష్టతలతో జగతిని చైతన్య పరచే
నారింజ వర్ణము మన జాతీయ
పతాకము లో ప్రప్రధమ స్థానములో
అలరారుతున్నది. ధైర్య సాహసములకు, శాంతి
సుస్థాపితములకు సర్వమానవ సౌభాతృత్వములకు సతతము
నిలిచే భారతదేశ వైభవమును ఈ
ధరణిపై పెంపొందింప చేసే వర్ణముగా మన
జాతీయ పతాకములో నాటికీ, నేటికీ,
ఎప్పటికీ సుస్థిరముగా నిర్దేశితమై నెలకొని ఉన్నది.
ఎరుపు వర్ణము (రెడ్ కలర్)
ఇంధ్ర ధనస్సులో వెలుగులీనే ఏడవ
వర్ణముగా శోభిల్లుతున్నది. సౌత్ ఆఫ్రికన్స్ 170000 నుంచి
40000 వేల సంవత్సరములకు పూర్వము స్త్రీ, పురుషులు
ఈ వర్ణము తమ
అలంకరణలో ఉపయోగించడము ఒక విశేషమైతే పాత
రాతియుగములొ ఈజిప్షియన్స్, మాయా నాగరికులు చిత్ర
లేఖనమునకు ఉపయోగించెడివారు. తరువాత కాలములో యూరప్,
ఆఫ్రికా, ఆసియా ఖండ వాసులు
15000 బి.సి నుంచి 16500 బి.సి వరకు "మద్దర్
ప్లాంట్" నుండి లభ్యమయ్యే రంగు
చిత్రీకరించెడివారు. క్రీ.పూ.8వ
శతాభ్ధములో మొక్కల వేరులతో, కాండములతో
లభ్యమయ్యే పదార్ధమును ఉపయుక్త పరచుకొనిరి. చైనా
దేశస్థులు 5000 బి.సి నుండి
3000 బి.సి కాలములో ఎరుపురంగును
వైభవ చిహ్నముగా, వివిధ పరికరములను, పరిసరములను
తీర్చి దిద్దడము వారి కళాత్మికతకు
నిరూపణ. భారత దేశములో మూడవ
మిల్లీనియం బి.సి కాలములో
ఈ వర్ణమును మొహంచాదారోలో
చిత్రీకరించిన చిత్రములు నేటికీ జీవంతవాగి అలరారుతున్నవి.
గ్రీస్ దేశములో “మైనోయన్" నాగరీకులు
రాజ మందిరములను, దేవ స్థానములను ఈ
రంగుతో అలంకరించడము విశేషమే. పశ్చిమ యూరప్
రాజ్యాధి నేత "చార్లే మేగ్నీ" తన
అంతఃపురమును ఈ వర్ణముతో
తీర్చి దిద్దుకొని తన ఆధిక్యతకు గురుతుగా
భావించెను. వేద కాలములో కుటీరములకు
అలంకారముగా నిలచిన వర్ణం అయితే
నేటి కాలములో కొన్ని పల్లె
ప్రాంతములలో ఎరుపు రంగు మట్టితో
ఇండ్లను లేపనము చేసి రంగ
వల్లులతో తీర్చిదిద్దడము పల్లెవాసులకు అలంకార వైభోగమే. 19వ
శతాభ్ధములో ఈ రంగు
"సోషలిస్ట్" పార్టీ చిహ్నముగా విలసిల్లితే
1868 లో జర్మన్స్ మద్దర్ మొక్క
నుంచి లభ్యమైన పదార్ధముతో కృత్రిమ
రీతిలో చిరకాలము నిలిచే రంగుగా
తయారు చేయడము వారి విజ్ఞతకు
నిదర్శనము. ప్రేమికుల ప్రేమాభిమానములను వ్యక్తీకరించే వర్ణముగా రోమన్స్ భావనకు
రూపును ఇచ్చి ఐదవ శతాభ్ధ
చివరిలో "పోప్ జిలాసియస్" ఫిబ్రవరి
14వ తేదీని "ప్రేమికులదినము" గా ధృవీకరించడమైనది. నేడు
ప్రపంచ దేశములన్నీ ఆచరించడముతో ఈ వర్ణము
సుశోభితమైనది. నేడు ఒక ఆధిత్యతకు,
గౌరవమునకు సంప్రదాయ చిహ్నముగా "రెడ్
కార్పెట్" పరచి ఉన్నత అదికారులను
స్వాగతించడము ఒక శుభ సూచనయేమరి.
మానవ సంభంధిత వైద్యులు ఎరుపురంగు
క్రాస్ తమ మానవ సేవకు
నిదర్శనముగా నిల్పడము ఒక సేవాతత్పరతకు
చిహ్నమే.
1920 వ సంవత్సరములో "జూనియర్ రెడ్ క్రాస్
సొసైటీ" అను సంస్థ డిల్లీ
లో సుస్థాపితమైనది. ఈ
సంస్థ ముఖ్య ఆశయమ్ములు యువతలో,
విద్యార్ధులలో సేవాతత్పరిత భావములను పెంపొందింప చేయడము,
మానవతా దృక్పధములతో తమంత తాముగా మత
విభేధములు లేకుండా క్షతగాత్రులకు, రోగులకు,
వృద్ధులకు, తమవంతు వీలైనంత సేవలందించడమే
మానవ సేవకు దారి చూపే
ప్రగతి మార్గము.
అత్యంత ఆకర్షణీయ మైన రంగు.
ప్రేమను, ఉత్తేజభరితమైన భావములను మన సంస్కృతీ,
సంప్రదాయములను ప్రపంచానికి చాటి చెప్పే రంగుగా
వర్ణింప బడినది. కొన్ని సందర్భములలో
దృఢమైన వ్యతిరేక భావనలతో కూడిన
అధికారము, బలము, కోపము, విధ్వంసతలు
వంటి ప్రతికూల శక్తులను ప్రేరేపించడములో
తార్కాణముగా నిలుస్తుంది. మనలో ప్రజ్వలించే సేవాతత్పరతకి,
నమ్మకానికి, పరిశోధనలకి, ధైర్యానికి, ఆధ్యాత్మికశక్తి, శరీరదారుఢ్యానికి, అంతరంగములో వెలిగే జ్ఞానజ్యోతికి ఎరుపు
వర్ణము సాక్షీ భూతముగా నిలచి
ఉంటుంది. చైనా దేశస్థులు ఈ
రంగు అదృష్టానికి, ఆర్ధిక సంపదలను అభివృద్ధి
పరచేదిగా భావించడమే కాక భవితవ్యములో వెలుగులు
చిందే శక్తికి ప్రతిరూపముగా అబివర్ణించుతారు.
క్రీడాకారులు తమ విజయ సిద్ధికి
గురుతుగా భావించడము ఈ వర్ణము
యొక్క ప్రత్యేకత. నేటి కాలములో వాహనములు
ముందు వరియటానికి ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద
రహదారులలో ఈ వర్ణము
వాహన నిలుపుదలకు లేదా అపాయమునకు గురుతుగా
ఉపయోగించడము సర్వజనవిదితము.
వివాహాది
శుభ కార్యములలో వదువును ఈ వర్ణ
వస్త్రధారణతో అలంకరించడము శుభ లక్షణము, సౌభాగ్య
చిహ్నముగా భావించడము సంప్రదాయము. వివాహిత స్త్రీలు నుదురుపై
ఎరుపు రంగు తిలక ధారణ
(కొందరు పాపిటిలో) సుమంగళీ చిహ్నమునకు గురుతుగా
ధరించడము, యుద్ధ వీరులను ఈ
వర్ణముతో తిలకాంకితులను చేసి విజయముతో తిరిగిరమ్మని
వీర పత్నులు పంపే సంప్రదాయము
ఎప్పటికీ మనదే అనడములో సందేహములేదు.
భారతీయులు అగ్ని దేవుని ఈ
వర్ణమునకు సాక్షిగా ఆరాధించడము వారు
నిర్వహించే హోమములలో, యజ్ఞ యాగాదులలో "స్వాహా"
అను మంత్రోచ్చారణతో అగ్నిదేవుని అజ్వముతో జ్వలింపచేయడము ఆరాధించడము
ఆధ్యాత్మిక సంప్రదాయములను వ్యక్తీకరిస్తుంది. యువతీ, యువకులలో ఈ
రంగు వస్త్రధారణ ఆకర్షణ శక్తిని, సమ్మోహనపరచే
గుణమును పెంపొందించేదిగా ప్రతి ఫలిస్తుంది.
ఎరుపు రంగు పుష్పములతో చేసే
అలంకరణ వైభవానికి చిహ్నమైతే ప్రకృతి ఈ రంగు
పుష్పములతో నిండిన వాతావరణములో ఉత్సాహము,
ఆకర్షణ, సంభ్రమము ప్రతిఫలిస్తుంది అని
నేనంటాను. మరిమీరేమంటారు?
వావ్! సూపర్!
ReplyDeleteసప్తవర్ణాలకు ఇంత ప్రాధాన్యత ఉందా?
ఎన్ని పుస్తకాలు చదివి
ఎంత పరిశోధన చేస్తే ఇన్ని విషయాలను ఔపోసన పట్టినట్లుగా అందించగలుగుతారు.
ప్రత్యేక ధన్యవాదాలు అక్కా!
శ్రీలక్ష్మి చివుకుల విజయనగరం
Thank you very much
ReplyDeleteRajakamala