Wednesday, 26 December 2018

సప్త సంఖ్యల విశిష్టతలు (నాల్గవ భాగము)


"సప్త నదుల ప్రవాహమ్ములే: ఇలలో పెంచే సాగుసంపత్తులు"




"గంగేచ, యమునేచ, గోదావరి, సరస్వతి, నర్మదా, సింధు, కావేరి అస్మిన్ జలసన్నిధింకురు" అని సప్త నదుల నామస్మరణ నిత్యమూ స్నానమాచరించే వేళ, పూజా సమయములో, యజ్ఞయాగాది క్రతువులలో, దేవ శుభకార్య సమయములలో చేసే సంస్మరణతో జలమైనా పవిత్రముగా మారి దైవాన్ని ఆరాధించే మనకు, చేసే కార్య క్రమములకు, పూజా ద్రవ్యములకు పవిత్రతను, పరిశుద్ధతను ఆపాదించును. నిత్య పూజా సమయములో కలస పూజానంతరము సప్త నదుల సంస్మరణ చేసి పువ్వుతో నీటిని "పూజాద్రవ్యార్ధం సంప్రోక్షః ఓం దేవం ఆత్మానాంచ సంప్రోక్షః" అనుచూ పూజా ద్రవ్యములపైన మన శిరస్సు పైన చల్లుకోవడము పవిత్రీకరణకు చిహ్నమే. అంతటి మహిమ గల సప్త నదుల విశిష్టతలను అతి క్లుప్త రీతిలో వివరించడమే వ్యాస ముఖ్యోద్దేశ్యము.

గంగా నది:

శ్రీ మహావిష్ణువు పదముల నుండి ఉధ్భవమైన గంగ "విష్ణుపధి" అను నామముతో బ్రహ్మ నివాసమైన కమలము నుండి నాలుగు పాయలుగా విడివడి చాలాకాలము ధృవ మండలము, సప్త ఋషి మండలము, స్వర్గ లోకములలో సంచరించి చంద్ర మండలము చేరినది. ఆపైన బ్రహ్మపురికి వచ్చి నాలుగు విభాగములై సీత, చక్షువు, అలకనంద, భద్ర అను పేరులతో భువి పైకి జాలువారినది ఈవిధముగా-

సీత: బ్రహ్మకమలము నుండి జాలువారి అనేక పర్వతములలో ప్రవహించి గంధ మాధన పర్వతము నుండి "భద్రాశ్వరవర్షము" లో ప్రవేశించి తూర్పు సముద్రములో (తూర్పు పసిఫిక్ మహా సముద్రము) విలీనమైనది. ఇచట వైకుంఠుని హయగ్రీవ మూర్తిగా భద్రశ్రవశుడు అనే వర్షాధిపతి తన ప్రజలతో ఆరాధించడము విశేషము.

చక్షువు: బ్రహ్మ కమలం నుండి మాల్యవంత శిఖరము చేరి కేతుమాల వర్షములో ప్రవహించి పడమర సముద్రములో (వెస్టర్న్ పసిఫిక్) చేరినది. ఇచట హరి లక్ష్మీదేవిచే సదా పూజలందుకొనే పుణ్య ప్రదేశము.

భద్ర: బ్రహ్మ కమలము నుండి ఉత్తర కురు భూములలో చొచ్చి ఉత్తర సముద్రములో (ఆర్క్టిక్) మిళితమైనది. ఇచట విష్ణు రూపుడైన వరాహమూర్తిని భూదేవి సదా ఆరాధించే పవిత్ర భూమిగా వేదాలు వర్ణించేయి.

అలకనంద: బ్రహ్మ కమలము నుండి హిమాలయ పర్వతములు చేరి భారత వర్షములో ప్రవహించి దక్షిణ సముద్రములో (హిందూ మహా సముద్రము నుండి అంటార్క్టిక్ చేరి) సంగమించినది. నారాయణుడు అనుపేరుతో విష్ణుమూర్తిని ప్రియవ్రతుడు ఆరాధించే విశిష్ట భూమిగా అభివర్ణించబడినది.

భారతీయులచే ఆరాధింపబడే అతి పవిత్ర నది. పాపములను హరించునది కావున "పాపహరిణి" గా ఇలకు దిగినది. భారతీయులకు "జాతీయ నదిగా" మరియు "జీవనదిగా" విఖ్యాతి చెందినది. భగీరధుని తపస్సునకు మెచ్చి ధరణి పై దిగిన గంగ ఉధృత ప్రవాహ జోరును భూదేవి తట్టుకొనుటకు సాధ్యము కాని సమయములో శివుడు తన జటాఝూటమున బంధించి ఒకపాయను విడువగా తన ప్రవాహ ఝరిలో జుహ్ను మహర్షి ఆశ్రమము ముంచి వేయగా ఆయన ఆగ్రహముతో అవపోశన పట్టెను. తిరిగి భగీరధుడు వేడు కొనగా మన్నించి వదలగా "జాహ్నవి" గా మారినది. "భాగీరధి" గా భగీరధుని అనుసరించి అలకనందతో కలిసి "గంగ" అను పేరుతో పాతాళమును చేరి అచ్చోట సగర పుత్రులకు సద్గతులను సంప్రాప్తింప చేసెను.



పాపహరిణి గంగ హిమాలయములలో "గంగోత్రి" అను కుండములో ఉధ్భవమై హరిద్వార్, ఋషికేశ్, కాశీ, ప్రయాగ ఆదిగాగల పుణ్య క్షేత్రములను దాటి తన ఉపనదులను కూడి అనంత జీవన వాహినిగా ప్రవహించినది. గంగా నదీ తీరములలో వెలసిన పుణ్య క్షేత్రముల వద్ద నిత్యమూ నిర్దేశిత సమయములో గంగానదికి "హారతి" సాయంసమయములో అర్పించడము అనునది ఒక విశేష పూజారీతిగా కొనసాగు అత్యంత అధ్భుత వీక్షణము.


సమయములో అశేష భక్తకోటి పాల్గొని తమవంతు అరటి దొన్నెలలో గంగా దేవికి సమర్పించే హారతులు నీటి అలలపై తేలియాడుతూ ఆకాశమున మెరిసే నక్షత్రములు ఇలపై దిగి గంగా తరంగములపై తేలియాడు రీతిని తలపింప చేయడమే కాక పండితుల వేద మంత్రోఛ్ఛారణఘోషలతో పరిసరములు ఆధ్యాత్మిక శక్తులను పెంపొందింపచేస్తాయి. తెల్లని గంగ నీరు నల్లనియమున నీరు, అంతర్గామినిగా ప్రవహించే సరస్వతి ప్రయాగవద్ద "త్రివేణిసంగమ" రూపములో కలసిన కలయికే కోట్లాది భక్తులకు పుణ్యప్రాప్తి కలిగించే పవిత్ర స్నాన ప్రదేశముగా వేదముల ఉద్ఘాటన, మరియు ఉద్భోధన భారత దేశములో అతిపొడవైన గంగానది 2510 కి. మీ. సుదూర తీరములు ప్రవహించి తన ప్రవాహములో కొట్టుకు వచ్చిన మట్టిని తీరములలో ధరావతుచేయగా ఒండ్రుమట్టి వ్యవశాయమునకు అత్యంత ఉపయుక్తకరమే కాక తీరములన్నీ హరితవర్ణ శోభతో సస్యశ్యామలముగా విరాజిల్లడమే మన పుణ్య సంపద. చివరి మజిలీగా గంగానది "గంగా సాగరము" వద్ద బంగాళా ఖాతములో కలసి విశేష ముక్తిప్రదము గావించినది. అనేకనదులలో అనేక పర్యాయములు స్నానమాచరించినా "గంగా సాగర్" లో చేసే ఒక్క స్నానమే మానవ జన్మకు సార్ధకత అనునది వేద ఉవాచ మరియు స్థానికుల ప్రగాఢ విస్వాసము. 1975 లో గంగా నదిపై పశ్చిమ బెంగాలులో నిర్మించిన ఫరాకా ఆనకట్ట వలన థర్మల్ పవర్ స్టేషనుకు నీరు సరబరాజు మరియు హుగ్లీనదికి ఏర్పడిన పూడికల నిర్మూలనము ముఖ్య ప్రయోజనములుగా అభివర్ణించబడినవి. అపురూపమైన ఆధ్యాత్మిక నమ్మకములతో ఆరాధింపబడే గంగా నది ఫవిత్ర దేవతగా విశ్వ జనులందరికీ గర్వ కారణము. శ్రీ మహావిష్ణువు ఆనతి మీర గంగ మానవుల పాపహరణము చేసే నదిగా దివి నుంచి భువికి దిగి భక్తకోటి పూజలనందుకొని కలియుగాంతమున దివ్య దేహముతో వైకుంఠము చేరడమే యుగాంత సూచన.

మునా నది:

సప్త నదులలో గంగానదికి అతి పెద్ద ఉప నదిగా అత్యంత కీర్తి ప్రతిష్టలతో అలరారే నది యమున. సూర్య భగవానుడికి చాయాదేవికి జన్మించిన పుత్రిక. సంయమనుడు సమవర్తిగా ధర్మాన్ని నీతిని ఇలపై నిలిపే యమ ధర్మరాజు సహోదరి. సంస్కృతములో "యమ" అనగా "ద్వయం" అని అర్ధము వస్తుంది. "యమ" "యమి" ఇరువురు సోదర సోదరిలుగా అన్యోన్నతకి చిహ్నముగా ఋగ్వేదము వర్ణించినది.



హిమవత్ పర్వత శ్రేణిలో "బందేర్ పూచ్" కొండలలో "యమునోత్రి" అను కుండములో ఉధ్భవమైన యమున హిమగిరులలో వెలసిన వేడి నీటిబుగ్గలు" (హాట్ స్ప్రింగ్స్) వద్ద నీరు మరిగే స్థితిలో బయల్వెడటము సృష్టిలోనే అధ్భుతము. అచట వస్త్రములో బియ్యము, బంగాళా దుంపలు కట్టి నీటి ఆవిరిపై వదలగా అవి ఉడికిన అనంతరము ప్రసాదముగా యమునా దేవికి అర్పించడము ఒక పూజారీతి మరియు రివాజు. వసుదేవుడు శ్రీకృష్ణుని మధుర నుంచి రేపల్లెకు సురక్షితముగా చేర్చుటకు ఉధృతమైన హోరు వానలో భయ భీతుడైన సమయములో ఆయన ప్రార్ధనలను మన్నించి యమున తన ఉధృతిని తగ్గించుకొని రెండు పాయలుగా చీలి దారి సుగమము చేసిన కరుణామయి. "కాళిందిగిరి" నుంచి జాలువారి నది కావున "కాళింది" అను పేర వాసికెక్కినది. కాళీంగుడను విష సర్పము వెదచల్లిన విషముచే నీరు నలుపు రంగుగా మారినది అనునది పురాణోక్తి. సర్పమునుండి రేపల్లె ప్రజలను కాపాడినది శ్రీకృష్ణుడే.



యమునా నదీ తీరములో శ్రీకృష్ణుని రాస క్రీడలు రాధాదేవి సమేత గోపికలు పరవశమై ఆడిన నృత్య రీతులు వేణునాదముతో జగతిని ఆనంద పరవశముతో ఓల లాడించిన రీతి నాడు జయదేవునిచే విరచితమైన అష్టపదుల రూపములో గాయనీ గాయకులు చేసే గానాలాపములు నేటికీ శాశ్వతముగా ఇలపై నిలచి ఉన్నవి. మహా భారతములో పాండవుల రాజధాని అయిన "ఇంద్రప్రస్ఠం" (ఢిల్లీ) యమునా నదీ తీరమున దేవశిల్పి మయుని ద్వారా శ్రీకృష్ణుని ఆనతి మీద నిర్మితమైనది. క్రీ. . 16 శతాభ్ధములో వల్లభాచార్య అను తత్వవేత్తయమున తన ప్రవాహ ఝరిలో హిమాలయ పర్వతములు దిగి జగతికి అత్యంత ప్రియతముడైన శ్రీకృష్ణుని రాస కేళితో ఆధ్యాత్మిక పరిశుద్ధతను, అపార ప్రేమామృతమును పెంపొందింప చేయడమే కాక మోక్ష ప్రాప్తికి దారిని చూపే  మార్గదర్శినిగా ఇలకు వచ్చిన ఫవిత్ర నది" గా అభివర్ణించెను. గంగ యమునల మధ్య వెలసిన తీర ప్రదేశము "డోబ్ రీజియన్" గా సస్య శ్యామలమైన భూమిగా పాడిపంటలకు ఆలంబనముగా ప్రశిద్ధి చెందడము ఒక విశేషమైతే మగధ, మౌర్య, కుషన్, గుప్తులు, షంగ్, ఎందరో విఖ్యాతి చెందిన రాజవంశస్ఠులు, చరిత్ర వీరులు పరిపాలించిన సువర్ణ భూమిగా విలసిల్లినది. ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, బిహార్, హర్యాణ జార్ఖండ్ ఎన్నో రాష్ట్రములకు నీరు సరబరాజుకి జీవనదియే సుగమమైన మార్గము. అనేక కాలువల ద్వారా సుదూరతీరములకు యమున నీరు ప్రవహింప చేయుటము మన పుణ్య సంపదే. పవిత్ర నదిలో స్నానము, పానము భక్త కోటికి బాహ్య, అంతఃపరిశుద్దులను గావించడము అనునది వేదనుడి అయితే అపమృత్యువాత పడరు మృత్యుభీతి ఉండదు అను వరములను ప్రసాదించే అమృతమూర్తి యమున. ముఘల్ సామ్రాజ్య విస్తరణచేసి. అనేక కోటలు భవంతులు నిర్మాణము చేసి అత్యంత పేరు ప్రఖ్యాతులు పొందిన "షాజహాన్" చక్రవర్తి నిర్మించిన "తాజ్ మహల్" ఆగ్రాలో యమునా నదీతీరమున నెలకొని ఉన్నది. దేశ విదేశ పర్యాటకులకు ఆకర్షణీయముగా ప్రపంచములోని ఏడు వింతలలో "తాజ్ మహల్" కు గుర్తింపు రావడము ఎంతో మరెంతో కీర్తిదాయకము. పున్నమి రాత్రిలో తాజ్ వీక్షణము అత్యంత సుందరము సుమనోహరము. నది తనకు తానై సముద్రములో కలవక పోవడము ఒక వింతే అయినా త్రివేణీ సంగమము వద్ద గంగా సరస్వతులతో కలసి 1370 కి. మీ. తన ప్రవాహము సాగిస్తూ తూర్పు బంగాళా ఖాతములో విలీనమౌతుంది.

గోదావరి నది:

భారత దేశములో రెండవ పొడవైన నదిగా "దక్షిణ గంగ" అను పేరుతో విశ్వవిఖ్యాతి చెంది దక్షిణ భారత దేశములో ప్రవహించే పుణ్యనది గోదావరి. యుగ యుగాలకు తార్కాణముగా సప్త నదులలో సుప్రశిద్ధమైనది. పశ్చిమ కనుమలలో మహారాష్ట్రములో "నాశిక్" కుండములో ఉధ్భవమైనది. జ్యోతిర్లింగములో ఒకటైన "త్రయంబకేశ్వరుడు" నెలకొనిన అతి పురాతన మందిరముతో వెలుగులీనుతున్న పుణ్యభూమి. త్రేతాయుగమున శ్రీరాముడు, సీతా, లక్ష్మణ సమేతముగా వనవాస సమయములో తిరుగాడిన పవిత్ర నేలగా కీర్తించబడినది. రామాయణములో గోదావరీ తీరమున నిర్మింపబడిన పంచవటివద్దనే. సీతా అపహరణకొరకు రావణుని ఆగమనము, జటాయువు సందేశము, ఆదిగా అనేక సంఘటనలకు సాక్షీభూతముగా నిలచిన నది గోదావరీతీరమే. త్రేతాయుగ సంఘటనలే అయినా నేటికీ జీవంతవాగి చూపరులను ఆకట్టుకొనే తీరులో పర్ణశాల అమరిక, పరిసరముల విస్తారణ కనుల ముందు రామాయణగాధ సన్నివేశములను వివరించేతీరు అత్యంత అధ్భుతము. వనవాస సమయములో శ్రీ రామచంద్రుడు సీతా లక్ష్మణ సమేతముగా ప్రాంతములో తిరుగాడిన పవిత్ర భూమిగా రామాయణ కధనములో వర్ణించబడినది. శ్రీ రాముడు పశ్చిమ దిక్కుగా ఒక శిలపై ఆశీనుడై గోదావరి అందాలను వీక్షించు సమయములో శిలను అనుగ్రహించి మరు జన్మలో భద్రునిగా తన భక్తునిగా జన్మించమని తాను గిరిపై ఎప్పటికీ కొలువు తీరి ఉంటానని వరమొసంగెను. భద్రుని తపఃఫల సిద్ధిగా త్రేతాయుగానంతరము శ్రీ రాముడు విల్లు బాణములతో కాక శంఖచక్ర ధరుడై భక్త కోటికి దర్శన భాగ్యము కలుగచేయుట ఒక విశేషమైతే భద్రుని పేర "భద్రాచలము" గా గోదావరీ తీరమున వెలసిన అతి గొప్ప పుణ్య క్షేత్రముగా తెలంగాణా రాష్ట్రములో అలవైకుంఠమును అవనిపై కలియుగాంతమువరకు వెలసింపచేసి భక్త కోటి పూజలనందుకొనే అతి ప్రశిద్ధ పుణ్య క్షేత్రముగా విరాజిల్లుతున్నది. రాజమండ్రి వద్ద గోదావరినదిపై కట్టిన ఆనకట్ట విశేషము రైలు మరియు రోడ్ రవాణాములకు ఎంతో అనుకూలముగా నిర్మించడము జరిగినది. సాయంసమయములో వేదమంత్రములతో సమర్పించే వివిధ హారతులు, విద్యుత్ కాంతులు ఆనకట్టపై నుండి గొదావరి నదిపై ప్రసరించి అలలపై తేలే కాంతి కిరణములు ఎంతో శుభ సంకేతములుగా వెలుగులీనే మనోహర దృశ్యవీక్షణము భక్తకోటికి ఎంతో ఆనందకరము మరియు ఆధ్యాత్మికసంతృప్తిని కలుగచేస్తాయి.

గోదావరినది 1465 కి. మీ. సుదూర తీరము ప్రవహించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు మహారాష్ట్ర ప్రాంతములను సశ్య శ్యామలముగా తీరిచి దిద్దుతున్న ఘనత గోదావరి నదిదే అనుటలో సందేహము ఎంత మాత్రమూలేదు. గోదావరి నదిపైన ఆసియా ఖండములో రెండవ అతిపెద్ద రోడ్ రైల్ వంతెన విల్లు ఆకృతిలో నిర్మించుటకు 1970 సంవత్సరములో ప్రారంభమైనది. భారత దేశ అధ్యక్షుడైన ఫకృద్దీన్ ఆలి అహ్మ్మద్ గారు 1974 ఆగష్టు 16 ప్రారంభోత్సవము చేసిరి.



అనేక సంవత్సరముల నుంచి ప్రణాళికలకే పరిమితమైన "పోలవరం ఆనకట్ట" (ఇందిరా సాగర్ ఆనకట్ట) తూర్పు పశ్చిమ గోదావరి నదులను ఇతర నదులతో సంధానము చేసి ప్రపంచములోనే అతిపెద్ద ఆనకట్ట నిర్మించుటకు 2004 సంవత్సరములో ప్రారంభమైనది. రాష్ట్ర విభజన అనంతరము ఆనకట్ట నిర్మాణము కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యములో త్వరలో ముగింపు కానున్నది. వరదలు ద్వారా అదికమైన నీరు నీటికరువుతో అల్లాడే ప్రాంతములకు తరలించడము, కోట్ల ప్రజల దాహార్తి తీర్చడము, వ్యవశాయమే ముఖ్య వృత్తిగా నిలచే ఆంధ్ర ప్రజలకు జీవనోపాధి కలిగించడము ముఖ్యా అశయమ్ములుగా ఆనకట్ట నిర్మించబడుతున్నది. ప్రణహిత, పూర్ణ, మంజీర, శబరి. ఇంద్రావతి, ప్రవర, దార ఆదిగా గల ఉపనదులతో కూడి తూరుపు దిక్కుగా పయనించి "అంతర్వేది" వద్ద బంగాళా ఖాతములో విలీనమవుతున్నది.

సరస్వతీ నది:

భారత దేశము స్వచ్చమైన వైదిక సంస్కృతికి కేంద్రముగా భాసిల్లుతున్నది. సప్త నదులలో అత్యంత ముఖ్యమైన నదీమ తల్లి సరస్వతి. ఋగ్వేద దేవత. సాక్షాత్ విద్యా స్వరూపిణి. స్కందపురాణములో వివరించిన ప్రకారము నది సరస్వతి "సౌరస్సు" అను బ్రహ్మకుండము నుంచి ఉధ్భవించినది కావున "సరస్వతి" అను పేరుతో విరాజిల్లుతున్నది. సరస్వతి దృష్టధ్వతి నదులు ప్రవహించే తీర భూమిని "బ్రహ్మావర్తనం" మరియు "దేవభూమి" అని మను స్మృతులలో వర్ణించడమైనది. బలరాముడు ద్వారక నుంచి మధురకు ప్రయాణించినది మహాభారత యుద్ధానంతరము తపమాచరించినది నదీతీరమునే అనునది మహాభారత విశ్లేషణ. విద్యాధి దేవతగా అంతర్యామినిగా సర్వజన పూజార్హతను పొందిన సరస్వతీ నదికి సాటి అవనిలో వేరొకటి కానము. ప్రయాగవద్ద అంతర్గామినిగా ప్రవహించి గంగా యమునలతో మిళితమై ఏర్పడిన "త్రివేణి సంగమము" వద్ద స్నానము అత్యంత ముక్తికరము అనునది భారతీయుల ప్రగాఢ విశ్వాసము ఆధ్యాత్మిక నమ్మకము.



సరస్వతీ నది అలవికాని పాయలతో ప్రవహించు నది. కొన్ని ప్రదేశములలో దృష్టికి గోచరించినా మరికొన్ని ప్రదేశములలో ఎండి బీటలు వేసి కానరాని పరిస్థితి. రీతిలో విద్య అనునది ప్రపంచములో సరస్వతీ దేవి లాగే అసమానతలతో వ్యాప్తీకరించి ఉన్నది. ఎన్నో విభేదములు, కుల, మత, భాష, లింగ విభేదములు, సంస్కృతీ సంప్రదాయములు, దేశ విదేశ సమాజములలో పాతుకొని పోయినవి. కారణము ఏదైనా సర్వజనులను విద్యాధికులుగా తీర్చి దిద్దడము సాధ్యము కాని రీతిలో జటిలమైనది. ప్రతీ మనిషిలోనూ మేధస్సు అంతరంగములో అంతర్వాహినిలా నిబిడీకృతమై ఉన్నది. వెలికి తీసే మహాత్ములు అవనిపై ఉదయించిన నాడు ప్రతె మనిషి విద్యావంతుని గా తీర్చి దిద్దబడిన నాడు నిరక్ష్యరాశ్యత అనునది నిర్మూలనము అవుతుంది. "స్వదేశే పూజ్యతే రాజ విద్వాన్ సర్వత్ర పూజ్యతే" అన్న వేద నుడికారము అక్షరసత్యమై విద్యావంతులు దేశమేగినా సర్వత్ర సర్వజన పూజలందు కొంటారు ఎప్పటికీ అని నా ఉద్దేశము. సుమారు 4000 సంవత్సరాలకు పూర్వము ఎండి బీటలు వారిన నదిలో హర్యాన రాష్ట్ర గ్రామములో "సరస్వతీ హెరిటేజ్ డెవలప్మెంట్ బోర్డ్ " అను సంస్థ వారు చేసిన కృషి ఫలితముగా భూజలము 100 క్యుసెక్స్ వెల్లువ కావడము ఇటీవల కాలములో జరిగిన సంఘటన అనునది వారు చేసిన కృషి ఫలితమునకు తార్కాణము.



2014 లో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ నదిలో తిరిగి జలకళ తేవడానికి మూడు ఆనకట్టల నిర్మాణమునకు వర్షపు నీరు నిల్వలు పెంపొందింప చేయుటకు చేస్తున్న కృషి అభినందనీయమే. ఇందువలన హర్యాన, రాజస్థాన్, పంజాబ్, గుజరాత్ రాష్ట్రములకు నీటి సౌలభ్యములు సమకూరునను ఆశలకు ఊపిరి పోసినది. భారత దేశం "స్వర్ణ యుగం" అనుభవించినది అను ఇతిహాసకుల భావన బలపరస్తూ ఆర్.యెస్.యెస్ వారు పురావస్తు శాస్త్రవేత్తలను సంప్రదించి 2015 లో వేదనది యొక్క ఆనవాళ్ళను అన్వేషించమని ఆదేశములు జారీచేయడమైనది. భవిష్యత్తు కాలములో నది తన పూర్వ వైభవమును సంతరించుకొన గలదని ఆశించుదాము. ప్రయాగ వద్ద సరస్వతీ అంతర్గామినిగా ప్రవహించి గంగ, యమునలతో మిళితమై తూరుపు దిశగా పయనించి బంగాళా ఖాతములో విలీనమైనది.

నర్మదా నది:

సప్త నదులలో ఐదవ పెద్ద నదిగా భాసిల్లబడే నర్మదా నది భారత దేశ ఉత్తర దక్షిణ భూభాగములకు నడుమ ప్రవహించు నదిగా సుశోభిల్లుతున్నది.


వింధ్య సాత్పురా పర్వత శ్రేణిలో "నర్మదాకుండము" వద్ద ఉధ్భవమైనది తాను ప్రవహించు తీరములను జలకళలతో జీవంతవాగి సుశోభితము చేయుచున్నది. పురాణోక్తి ప్రకారము "నరం" అనగా సంస్కృత భాషలో సన్నని నాజూకైన ఆకారము కలవారికి ఉపయోగించే పదము. "నర్మద" అతి సన్నని నాజూకైన అందమైన బాలికగా శివుని శరీరము నుండి జాలువారిన స్వేద బిందువు నుండి ఉధ్భవించినది. తనతో పాటు తపస్సు చేసే బాలికను చూసి ముగ్ధుడైన శివుడు ఆమెకు "నర్మద" అను నామకరణము చేసి ఆమెకు అనేక వరములు ప్రసాదించెను. ఆమె ప్రళయములోను నాశముకానిది, పాపనాశిని, ఆమె నడయాడు తీరములలోని శిలలు ప్రాణ ప్రతిష్టావసరము లేకుండా మహిమ తగ్గక శివలింగములుగా మారి "నర్మదేశ్వరుడు" అను నామముతో జగతిని అలరారడమే కాక భక్తుల పూజలందుకొంటాయి. నర్మదా తీరము సర్వ దేవతలకు నివాశ యోగ్యమైనదిగా ప్రభవిల్లుతుంది అను దీవనలు శివుని వద్ద పొందిన నర్మదను ఆపర్వతరాజైన నిఖఠ్దేశ రాజ్యాధిపతి కుమార్తెగా పెరిగినది. ఆమెకు తగిన వరుని వెతకుట అసాధ్యమైన సమయములో అతి కష్ట సాధ్యమైన "గుల్బకాళి" పుష్పములను తెచ్చిన వీరునితో వివాహము జరుప నిశ్చయించెను. "సోంభద్రుడు" అను యువరాజు విజయము సాధించగా వరుని విషయములను తెలిసికొనగోరి నర్మద తన దాసీ "జోహిలా" కు తన వస్త్రములను, భూషణములను ధరింప చేసి రాజ ప్రాసాదమునకు పంపెను. ఆమె వరుని చేరి తానే నర్మదా దేవినని అబద్ధము చెప్పి రాజకుమారుని వశపరచుకొనెను. ఎంతకూ తిరిగిరాని జోహిలాను వెదకుచు వెడలిన నర్మద రాజప్రాసాదములో వారిరువురిని చూసి ఆగ్రహముతో జీవితముపై విరక్తి చెంది సన్యాసిని వేషము దాల్చి అపబ్రద్ధముగా నడుస్తూ తడబడుతూ, రాళ్ళు రప్పలు, కొండలు, గుట్టలు దాటుకొని వెడలిపోయెను. జరిగిన మోసం తెలుసుకొనిన రాజకుమారుడు ఆమె వెనుక "నర్మదా" అని పిలుస్తూ అనుసరించినా తిరిగి చూడక తూర్పు దిక్కునుంచి పడమర దిక్కుగా పయనించి సముద్రములో లీనమాయెను. పవిత్రతకు, పరిశుద్ధతకు, మారుపేరు నర్మద కనుక భక్త కోటి పాపములను హరించి పుణ్యవంతులుగా తీర్చిదిద్దే పుణ్యనది. నర్మద కావడము ఎంతో అదృష్టము పూర్వజన్మ సుకృతము. ఫూర్వ కాలమున నదీతీరములో "నర్మదేనీసిస్" అను డైనోసిరస్ జంతువులు అధిక సంఖ్యలో అలరారుట వలన తీరములో ప్రవహించే నది "నర్మద" అనుపేర వాశికెక్కినది అనునది స్థానిక కధనం. క్రీ. పూ. 2 శతాభ్ధములో గ్రీకు పరిశోధకుడైన "టోల్మీ" నర్మదా నదిని "నర్బడ" "నర్బోర్డారివర్" అను పేరుతో వ్యవహరించడము జరిగినది. తూర్పు కనుమల కన్న పశ్చిమ కనుమలు ఎత్తు అధికము అందువలన నర్మద ప్రవాహరీతి పశ్చిమ దిక్కుగా సాగినది. ఒకానొక సమయములో గంగ శివునితో "తనలో నిత్యము అనేక మంది పాపులు స్నానమాచరించి పాపములను హరింపచేసు కొనుట   నిజము మరి తాను ఎలా స్వచ్చమవాలి?" అని ప్రశ్నించగానీవు నర్మదలో కలసిన తక్షణము పునీత మవుట తధ్యము" అని తెలిపెను. ఆంత మహిమ గలది నర్మద. అందువలన గంగ నర్మదలో ప్రతీ సంవత్సరము కలయుట అనునది ఈశ్వరానుగ్రహమే. గుజరాత్ రాష్ట్రమునకు "జీవనదిగా" వినుతికెక్కినది. 1312 కి. మీ. దూరము ప్రవహించి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రములలో ప్రవహించి తీరములను సశ్యశ్యామలముగా తీర్చిదిద్దినది. నర్మదా నదిపై గుజరాత్ లో "సర్దార్ సరోవర్" ఆన కట్ట నిర్మితమవడానికి 1961 ఏప్రిల్ 15 ప్రారంభోత్సవము జరిగినా 57 సంవత్సరములకు పరిసమాప్తి కావడము ముదావహమే. విశేష ఆనకట్టని భారత జాతికి అంకితమిస్తూ 2017 సం. సెప్టెంబర్ 17 ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఆరంభించడము విశేషము.




దేశము గర్వించేలా భారత దేశములోనే రెండవ పెద్ద ఆనకట్టగా అభివర్ణీంచడమైనది. గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్, రాష్ట్రములకు తాగునీరు, వ్యవశాయ, విద్యుచ్చక్తి మరియు పరిశ్రమలకు నీటి సౌలభ్యములను సమకూర్చడమే ముఖ్యౌద్దేశ్యము. తావ, హిరణ్, బారవ, కోరల్ కరం, లోహర్ అను ఉపనదులతో కూడి పడమర దిక్కుగా పయనించి "గల్ఫ్ ఆఫ్ కేంబే" వద్ద అరేబియా సముద్రములో చేరి నదముగా మారిన విశిష్ట నదిగా విఖ్యాతి చెందినది.

సింధు నది:

సప్త పుణ్యనదులలో ఒకటిగా అబివర్ణించబడిన అతిపెద్ద జీవనది "సింధునది" సదా హిమముతో కప్పబడిన హిమవత్పర్వతములలో పుట్టిన నదిగా అత్యంత నాగరీక జీవనములకు ఆలవాలమైనది. సంస్కృత భాషలో "సింద్" అనగాఅత్యంత విశాల మైన నీటి విభాగము" అని అర్ధము. జొరాష్ట్రియన్స్ నదిని "అవిస్తాస్ హప్తహిందు" అనగా ఏడు నదుల అని అర్ధము. సింధూనది, జీలం, చీనాబ్, రావి, బియస్, సట్లజ్, కాబూల్, సింధు అను సప్త నదులతో కూడి ప్రవహించు నదిగా అభివర్ణించిరి.



టిబెట్ దేశములో నదిని "సెంత్సాంగ్ పో" అను నామాంకితము చేసిరి. దీని అర్ధము "సింహనది" దేశములోని నదులన్నియు స్త్రీ రూపముతో ఆరాధింపబడితే సింధు నది పురుష రూపముతో వ్యవరింప బడటము విశేషము. 25,000 సంవత్సరములకు పూర్వమే సింధు నదీ తీరమున హరప్పా, మొహంజాదారోల వద్ద ఏర్పడిన నాగరిక జీవనము "సింధు నాగరికతగా వెలుగులీలినది. ఇందుకు తార్కాణమే భారత దేశమునకు "హిందుదేశము " ఇండియాహిందుస్థాన్" అను వివిధ నామములు ఏర్పడినవి.

నది 2,880 కి.మీ. సుదీరతీరములు ప్రవహించి హిందుఖుష్ పర్వతములు దాటి తీరములను సశ్యశ్యామలముగా తీర్చిదిద్దడము విశేషము. ఎక్కువ భాగము పాకీస్థాన్ దేశములో విలీనమై ఉన్నందున వారి దేశ "జాతీయ నదిగా" గుర్తింపు పొందినది. భారత దేశములో పంజాబ్ రాష్ట్రములో నది జీలం, చీనాబ్, రావి, బియస్ మరియు సట్లజ్ అను ఐదు ఉప నదులతో ప్రవహించి పంజాబ్ భాషలోపాంచ్అనగా ఐదు "అబ్అనగా నది. అందువలన రాష్ట్రమునకు "పంజాబ్" అను పేరు సార్ధకమైనది. నదీతీరములు అత్యంత లాభకరమైన వ్యవశాయోత్పత్తికి కేంద్రములు గా నేటికి విలసిల్లుతున్నవి. ఎల్. కె. ఆద్వానీ గారు మన దేశ ఉప ప్రధానిగా ఉన్నరోజులలో లఢక్ సందర్శించి అచట ప్రవహించే సింధు నది వీక్షణము ద్వారా చేసిన నవీన మార్పు పర్యాటకులకు స్థానికులకు, అశేష భక్త కోటికి ఎంతో ఉపయుక్తకరమైనది. ప్రతీ సంవత్సరము జరిగే సింధు నది జాత్ర మొదటి సారిగా భారత దేశములో 1997 సంవత్సరము జూన్ మాసములో నదీ తీరమున ఆవిష్కరింప బడినది. అంతకు ముందు కాలములో పుష్కర వీక్షణతకు,




సింధు జాత్రకు స్నానపానాదులకు పాకిస్థాన్ చేరే భక్తులకు సువర్ణ అవకాసము భారత దేశములోనే లభించడము ఎంతో అనుకూలము, సులభ తరము, మరియు సురక్షితము అయినది. భారత్లో లడక్ వద్ద హిమాలయ శిఖరముల నడుమ ప్రవహించే సింధూ నది మనపుణ్య సంపదే. అత్యంత ప్రతిష్టాత్మకమైన సింధునది తన ఉపనదులతో కూడి పశ్చిమ దిక్కుగా పయనించి "న్యూ పోర్ట్" వద్ద అరేబియా సముద్రములో విలీనమవుతున్నది. 

కావేరినది:

భారత దేశములో సప్త పుణ్య నదులలో స్మరించబడే చివరి నదిగా "కావేరీప్రస్తుతించ బడుతున్నది. పశ్చిమ కనుమలలో కొడగు కొండలలో "తల కావేరీ" అను పవిత్ర కుండములో ఉధ్భవమైనది.



ప్రతీ సంవత్సరము అక్టోబర్ నెలలో సరికొత్త నీరు ఉధ్భవమయ్యే సమయము తిధి, వార, నక్షత్రము. గంటలు, నిముషములతో ముందుగానే పండితుల ద్వారా గణనము చేయ బడుతుంది. పవిత్ర క్షణములో వారు నిర్దేసించిన సమయములోనే తలకావేరీ కుండములో నీరు ఉప్పొంగి రావడము అధ్భుత విశేషము. ఇది సాంకేతికపర విజ్ఞానానికి అందని మహత్యము. నిగూఢపరమైన దైవసృష్టికి నిదర్శనముగా నాటి నుంచి నేటి వరకు జరుగుతున్న ప్రక్రియ. "కావేరీ సంక్రమణ" అను పేరుతో జరిపే ఉత్సవములో అశేష కోటి భక్త జనులు స్నానమాచరించి పవిత్రులు అవడమేకాక వారి కోరికలు కావేరీ మాత ఆశీస్సులతో సఫలమౌతాయి అనునది ఒక ప్రగాఢ విశ్వసనీయత. అగస్త్య మహర్షి ఆశీర్వాదముతో తాను ప్రవహించిన మేర సశ్యశ్యామలముగా తీర్చి దిద్దుట కొరకు అవతరించిన పుణ్య నది ఇలలో కావేరీ అనునది పురాణోక్తి.
రాజరిక ఠీవితో, రజ దర్పములతో, రాజ నగరుగా అభివర్ణించబడే మైసూర్ వద్ద అతిపెద్ద ఆనకట్ట కావేరీ నదిపై నిర్మించడము ఒక విశేషమైతే తీర ప్రాంతములో "బృందావన్ గార్డెన్స్" అను విశ్వ విఖ్యాతి చెందిన పూల తోటల నిర్మాణము వివిధ ఆకృతులతో, రంగు రంగుల విద్యుత్ బల్బులతో విరజిమ్మే నీటి తరంగ విన్యాసముల అమరికలు పర్యాటకులకు కనువిందు చేస్తాయి. భారత దేశములోనే అత్యంత సుందరమైన సాంకేతికపర విజ్ఞానముతో కూడిన "బృందావన్ గార్డెన్స్" నిర్మాణము విశ్వ విఖ్యాతి చెందిన ఇంజనీర్ సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి ద్వారా 1927 సంవత్సరములో నిర్మితమై 1932 లో పరిసమాప్తి అయినది.



దేశ విదేశీయులను విశేష రీతిని అధ్భుతమైన ఆకర్షణలతో మరీ మరీ చూడాలి అనిపించే సౌందర్యాన్ని విరజిమ్ముతున్నది నాటికీ నేటికీ ఎప్పటికీ అనడములో సందేహము లేదు. కావేరీ నది కర్ణాటక, తమిళనాడు, పాండిచ్చేరి రాష్ట్రములకు తాగునీరు, వ్యవశాయ, తోటగారిక మరియు పరిశ్రమలకు అతి చల్లని తీయని ఫవిత్ర నీరుని సరబరాజు చేసే అతి పుణ్య వంతమైన నదిగా భాసిల్లుతున్నది. కావేరీ తన ఉప నదులైన హేమవతి, కబిని, భవాని, ఆర్కావతి, లక్ష్మణతీర్ధ, మరియు హారంగిలతొ కూడి 800 కి. మీ. సుదూరతీరము తూర్పు దిశగా పయనించి తమిళనాడు లో "పూంపుహార్" వద్ద బంగాళా ఖాతములో విలీనమవు తున్నది.


8 comments:

  1. Anni nadhula gurinchi vivaranga chala bags rasarandi

    ReplyDelete
  2. భారత దేశంలో గల జీవనదులు పుట్టుక వాటి విశేషాలు వివరంగా చెప్పడం బాగుంది. సందర్భానుసారంగా ఉంచిన చిత్రాలు వ్యాసానికి వన్నె తెచ్చాయి.
    అభినందనలు తెలియజేస్తూ
    ముందు ముందు మరెన్నో పౌరాణిక చారిత్రక నేపథ్యంతో సాగే రచనలను ఆశిస్తున్నాము. శ్రీలక్ష్మి చివుకుల విజయనగరం

    ReplyDelete
  3. Stank you very much for the encouraging comments. This will give some more strength for me

    N Rajakamala

    ReplyDelete
  4. చాలా వివరంగా అన్ని విషయాలు ఒకే చోట చేర్చడం చాలా గొప్ప ప్రయత్నం. ధన్యవాదాలు

    ReplyDelete
  5. మీ ప్రయత్నం అభినందనీయం

    ReplyDelete