Thursday, 6 December 2018

సప్త సంఖ్యల విశిష్టతలు (మూడవ భాగము)


"సప్త ఋషుల తపః సంపదలే పృధ్విపై చల్లిన సంస్కార విజ్ఞాన బీజములు"



పురాణోక్తుల ప్రకారము సప్త ఋషులు సదా లోక క్షేమమును కోరే మహాత్ములు. భూలోకమున జరిగే విశేషములను ఆశక్తితో వీక్షిస్తారు. పురాణములలో, మరియు వేదములలో సప్త ఋషుల ప్రస్త్తావన ఉన్నది. ప్రతీ ఒక్కరి వంశానికి ఒక ఋషి మూల పురుషుడిగా ఉండటము సంప్రదాయ బద్ధముగా నిర్దేశింపబడటమైనది. వీరు సదా పూజనీయులు. వివాహాది శుభ కార్యములలో, దేవ పితృకార్యముల ఆచరణ సమయములలో, నిత్యపూజలో గోత్రమును, గోత్ర రూపములో వెలసిన తమ వంశ మూల పురుషుని సంస్మరణము తప్పనిసరి. వేద నీతి ప్రకారము  తండ్రి వైపు గోత్రము తనయులకు సంక్రమిస్తుంది. కృత, త్రేతా, ద్వాపర, కలియుగములు నాలుగు సూర్యోదయ, సాయంసంధ్యా సమయములతో కలసి ఒక దివ్య యుగముగా పరిగణింపబడినవి. 14 మనువులు కలిగి ఉన్న బ్రహ్మదేవుని సృష్టిలో ఒక మనువు. ఆయువు పరిమాణము 71 దివ్య యుగములు. మనువుకి మనువుకి మధ్య నుండే విభాగములే మన్వంతరములు. మన్వంతర కాలములో మను వంశ రాజులు, సురలు, మునులు, భగవదంశమున పుట్టి ధరణిపై సుపరిపాలనచేయడము ఒక విశేషమైతే ప్రస్తుతము ఏడవ మనువు అయిన వైవశ్వంతుని ఆధ్వర్యములో జగతి "వైవశ్వత మన్వంతరము" గా అభివర్ణించడమైనది. మన్వంతరములో అత్యధిక కీర్తి ప్రతిష్టలతో విరాజిల్లే సప్త ఋషులు కశ్యపుడు, అత్రి, భరద్వాజుడు, విశ్వామి త్రుడు, గౌతముడు, జమదగ్ని, వశిష్టుడు వీరు తమ అతులిత ప్రతిభతో ఎప్పటికీ మాయని కీర్తి ప్రతిష్టలతో సదా అలరారే మహితాత్ములు. వీరి గురించి అతి సులభరీతిలో తెలియ పరచడమే వ్యాస ముఖ్యొద్దేశ్యము.



కశ్యపుడు

బ్రహ్మ మానస పుత్రునిగా అభివర్ణించబడే మహానుభావుడు. పృధ్విపై సమస్త జీవజాలము ఉధ్భవించి వ్యాప్తి చెందడానికి కారణజన్మునిగా ఇలపై అవతరించిన మహనీయుడు. కశ్యప మహర్షి వలన వృద్ధి పొందిన సృష్టి కావున పృధ్వికి "కాశ్యపి" అను పేరు వచ్చినది. ఆయుర్వేదిక విజ్ఞానవేత్త. "కశ్యప సంహిత" అను గ్రంధమును రచించి ఆయుర్వేదిక విజ్ఞానమును పెంపొందింప చేసి సర్వ మానవాళికి ఉపయుక్తకరము చేసెను. గ్రంధము ద్వారా శిశువుల ఆరోగ్య రక్షణ మరియు స్త్రీల గర్భ  రక్షణలకు ఎన్నో ఎన్నెన్నో ఉపాయములను గ్రంధము ద్వారా విశదీ కరించెను. కశ్యపుడు అత్యంత తపఃశక్తి సంపన్నుడు. పరీక్షిత్ మహారాజు మరణము తక్షకుని ద్వారా తధ్యమని తెలిసి  ఆతని అడ్డుకొని తన యోగ బలముచే పచ్చని చెట్టును బూడిదగా మార్చి తిరిగి తన మంత్ర బలముచే చెట్టును చిగురింప చేసెను. తక్షకుడు అమిత ఆశ్చర్యముతో మహాత్మునికి నమస్కరించి విశేష కానుకలు సమర్పించి దారి మళ్ళించ బోగా కశ్యపుడు పరీక్షిత్తు మరణం బ్రాహ్మణ శాపము కావున తన ప్రయత్నము అసాధ్యము అని తెలుసుకొని నిష్క్రమించెను. తరువాత కాలములో తన తప్పు తెలుసుకొని ఒక వైద్యునిగా తన కర్తవ్యము సదుపయోగము చేయలేదు అని చింతితుడై తిరుపతి క్షేత్రములో తపమాచరించి పాప ప్రక్షాళన చేసి కొనడము ఒక పురాణ సంఘటన. పృధ్విలో కశ్యప సంతతి వారు "కాశ్యపశ" గోత్రస్థులుగా వృద్ధి చెందటము విశేషము.

అత్రి

సృష్టికర్త అయిన బ్రహ్మ మానస పుత్రులలో ఒకరుగా అవతరించిన ప్రతిభావంతుడు అత్రిమహర్షి. పతివ్రతా శిరోమణి అయిన అనసూయా దేవి మహనీయుని జీవన సహచరిణి. పాతివ్రత్య శక్తి సంపత్తులను ముల్లోకములకు చాటి చెప్పిన మహాత్మురాలుగా త్రిమూర్తులచే మన్ననలందు కొనిన మానవకాంత. ఒకానొక కాలములో ఆమె పాతివ్రత్యాన్ని పరిశీలింపదలచి త్రిమూర్తులు ఆమెను వివస్త్రగా భోజనము వడ్డించమని కోరగా ఆమె వారిని తన యోగ బలముతో పసిబిడ్దలనుగా మార్చి వారి కోరిక తీర్చినది. తరువాత తమ భర్తల తప్పు మన్నించి సహజ రూపు ప్రసాదించమని వారి పత్నులు వేడు కొనగా మామూలురూపు ఒసగిన ఘనత ఒక మానవ స్త్రీ శక్తికి, యుక్తికి ఉదాహరణ. సోమ, దుర్వాస దత్తాత్రేయులు వీరి కుమారులు. అత్రి మహర్షి మహాతపః శక్తి సంపన్నుడు. అశేష విజ్ఞాన ఘనుడు. " అత్రిసంహిత, అత్రిస్మృతి" అను గ్రంధములను రచించి ఉపనయన రీతి, రివాజులను జగతికి తెలిపెను. వనవాస సమయములో శ్రీరాముడు సీతా, లక్ష్మణ సమేతుడై అత్రి మహర్షి ఆశ్రమమునకు విచ్చేయగా అనసూయా దేవి సీతా దేవిని ఆశీర్వదించి ఆమెకు పసుపు, కుంకుమ, నగలు, ఎప్పటికీ చిరగని, వన్నెమాయని చీరలు కానుకగా ఇవ్వడము జరిగినది. సీతకు ఎన్నో పతివ్రతా ధర్మములను నేర్పిన ఉత్తమ సాధ్వీమణిగా చరిత్రలో నిలచినది. భర్త సంపదలో ఉన్నపుడు ఇచ్చే గౌరవమే సంపదహీనుడైనను ఇవ్వగ లగటమే స్రీకి ఉత్తమ మర్యాద అని తెలి పినది ధర్మ సూత్రము సీతా దేవి తన జీవితాంతము ఆచరించినది. మహర్షి సంతతివారు "అత్రిస్య" గోత్రస్యులుగా జగతిపై విరాజిల్లు తున్నారు.

భరద్వాజుడు

అపార తపః శక్తి సంపన్నుడు. అతులిత మేధావి. కౌరవ పాండవ గురుతుల్యులైన ద్రోణాచార్యునికి, ఘృతాచి అను యువతికి జన్మించిన వైనము మహా భారతములో రూపు దిద్దుకొన్నది. ఇంద్రుని కొరకు తపమాచరించి  ఆతని ఆనతి మీర  పార్వతీ పరమేశ్వరులను ప్రసన్నము చేసుకొని వారి కృపతో  వేద విజ్ఞానము సంపాదించెను. వేదవిజ్ఞానిగా అఖండ కీర్తి ప్రతిష్టలను సంపాదించిన మహితాత్ముడు. భార్య సుశీల అత్యంత గుణసంపన్నురాలు. భర్తకు అనుగుణముగా, అనురక్తితో, సహ జీవనము సాగించిన పతివ్రతా శిరోమణి. భరద్వాజ మహర్షి సంతతి వారు "భరద్వాజ" గోత్రస్థులుగా నేటికీ ఇలపై విరాజిల్లుతున్నారు.

విశ్వామిత్రుడు

ఎన్ని యుగములు గతించినా విశ్వామిత్రుని కీర్తి ప్రతిష్టలకు అవనిపైన తిరుగులేదు. విశ్వామిత్రుని తండ్రి గాధి, తల్లి సత్యవతి దేవి. చంద్ర వంశరాజు గా "కౌశికుడు" అను పేర రాజర్షి గా వాశికెక్కెను. సమయమున ఈతని సంతతి వారు "కౌశిక" గోత్ర నామముతో భువిపై ధర్మనిష్టలతో ఉండిరి. ఒకానొక కాలములో వశిష్ట మహర్షితో మాట పట్టింపుతో పుట్టుకతో రాజకుమారుడైనా తపఃశక్తి శారీరక బలము కన్న గొప్పదని గ్రహించి రాజ్య సంపదలను త్యజించి తపః సమాదిలో లీనమై తన తపోశక్తిచే "బ్రహ్మర్షి" పదవిని పొందిన ఘనుడు. మహాత్ముడు. విశ్వామిత్రుడు కఠోర తపమాచరించు సమయములో ఆయనకు "గాయత్రీ మంత్రం" వినబడగా మంత్రమును పునః శ్చరణము చేసెను. అంతటి మహిమోన్నతమైన గాయత్రీ మంత్రమును జగతికి విపులీకరించి పరిచయము చేసిన జ్ఞాని. మంత్ర బలము ఎంతగొప్పదో మాటలతో వర్ణించలేము. మంత్ర పఠనము వలన కష్టములు తొలగుతాయి. ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది. తెలివి తేటలు వృద్ధి పొంది మాట చాతుర్యముతో విరాజిల్లుతారు. న్యాయ పోరాటములో ప్రపంచానికే స్నేహితుడు కావున వశిష్ట మహర్షి ద్వారా "విశ్వామిత్రుడు" అని బిరుదాంకితుడాయెను. రామాయణములో యాగ సంరక్షణకు రామలక్ష్మణులను తోడ్కొని వెడలి ఉదయ సంధ్య సమయములో. “కౌసల్యా సుప్రజామ - పూర్వాసంధ్యాప్రవర్తతే" అను శ్లోకముతో మేల్కొలిపి వారికి "బల అతిబల" అను విద్యలను ఉపదేసించిన మహిమాత్ముడు. రామలక్ష్మణులను మంత్ర ప్రభావ శక్తితో అతి బలవంతులను చేసి తాటక, మారీచ, సుబాహుల పై విజయభేరి మ్రోగింపచేసెను. తదనంతరము మిధిలా నగరమేతించి వారి కళ్యాణ వైభవమునకు కారణభూతుడై రఘువంశ కీర్తి ప్రతిష్టలను పెంపొం దింపచేసెను. త్రిశంకుని బొందితో స్వర్గమునకు పంపే ఉద్దేశ్యముతో  మాట ఇచ్చి, ఇంద్రాది దేవతలు నిరాకరించగా తన యావత్ తపఃశక్తిని ధారపోసి సృష్టికి ప్రతిసృష్టిగా "స్వర్గమును" సృష్టించిన ఘనుడు. స్వర్గమే "త్రిశంకుస్వర్గము" గా స్వల్ప కాలము వెలుగులీనెను. బ్రహ్మర్షిగా మారిన తదనంతరము ఈతని అను యాయులు "విశ్వామిత్ర గోత్రస్థులుగా" వినుతికెక్కిరి. మానవులలో నేటికీ చిరంజీవిగా, మహిమాత్ముడుగా విలసిల్లడము ఆతని భక్తి తత్పరతలకు నిదర్శనమే.

గౌతముడు

సప్త ఋషులలో ఒకరైన గౌతముడు అత్యంతానురక్తితో ప్రకృతి సంపదలను కాపాడిన కరుణామయుడు. త్రేతాయుగమున రహుగున్, ప్రద్వేషి అను దంపతులకు జన్మించెను. ఒకానొక కాలములో దేశములో పది సంవత్సరములు కరవు కాటకములు సంభవించగా జనసందోహములు తండోపతండములుగా అసువులుబాసిరి. వారిలో కొందరు క్షుద్భాథ పీడితులై గౌతముని ఆశ్రమమును చేరిరి. వారి కొరకు నియమనిష్టలతో అగ్నిహోత్రుని ముందు నిలచి గాయత్రీ ఉపాసన చేసెను. ఆయన తపస్సుకి మెచ్చిన గాయత్రీ దేవి ప్రత్యక్షమై ఒక పాత్రను ఇవ్వగా దాని మహిమతో కోరిన ఆహార పదార్ధములు సంవృద్ధిగా ఏర్పడినవి. వర్షములు కురిసి పుడమి భూతల స్వర్గమైనది. వైభవమును చూసి ఓర్వలేక కొందరు బ్రాహ్మలు ఒక మాయ గోవుని సృష్టించి ఆతని యజ్ఞశాలను ద్వంసము గావింప చేసిరి. అగ్రహించిన గౌతముడు ఒక దర్భను మంత్రించి అదిలించగా ఆదర్భతగిలి గోవు మరణించెను. బ్రహ్మహత్యాపాతక నివృత్తికొరకు దారి కానక గౌతముడు దేవ లోకము చేరి బ్రహ్మ కమండలము నుంచి వెలువడిన గంగను భువికి తెచ్చి గోవుకు పుణ్య గతులు కలిగించెను. నేడు ఆనదే "గౌతమీ నదిగా" (దక్షిణగంగ) పేరొందిన గోదావరీ నది. తనకి అన్యాయము చేసిన పాప కార్యము దివ్య దృష్టిలో తెలుసుకొని కోపోద్రిక్తుడై వారిని రాబోవు కాలములో ఆచారం, మడి, గురు, మాతృ, మరియు పితృ భక్తులు లేని మంద భాగ్యులుగా జన్మించమని నీచ జీవనమ గడుపమని శపించెను. వారు శాప నివృత్తికై గౌతముని పాదములపై పడి వేడుకొనగా కరుణించి కనీసము "గాయత్రీ మంత్ర" ధ్యానము చేసిన సర్వ పాపముల నుండి విముక్తులగుదురని తెలిపెను. నేడు కలి యుగములో జరుగుతున్న అధర్మ, అన్యాయ, అవినీతులకు కారణము గౌతముని శాపమే అంటారు వ్యాసమహర్షి "భవిష్య పురాణములో". గౌతముని భార్య అహల్యాదేవి ఉత్తమ ఇల్లాలు. పతివ్రతా శిరోమణీ. కాలమహిమోపేతమునకు గురిచెంది భర్త శాపము వలన కఠిన శిలగా మారి అనేక వేల సంవత్సరములు భర్త రాకకై ఎదురు చూపులతో నిరీక్షించడము ఒక విషాదమైతే శ్రీరాముని పాదములు సోకి తన పూర్వ పవిత్రతను ఆపాదించుకొనడము తదనంతరము గౌతమునిచే పరిగ్రహింపబడటము రామాయణములో రూపు దిద్దుకొన్న అపూర్వ సంఘటన. గౌతమ మహర్షి సంతతివారు ధరణిపై "గౌతమ గోత్రస్థులు" గా నేటికీ  వెలుగులీనుతున్నారు.

జమదగ్ని

సప్త ఋషులలో ఒకరైన జమదగ్ని అత్యంత ప్రతిభావంతుడు. రుచికముని, సత్యవతి కుమారుడు. అగ్నిని స్వాహా చేసుకొన గలిగినంత శక్తి మంతుడు కావున "జమదగ్ని" అనుపేర విఖ్యాతి చెందెను. సూర్య వంశ రాజకుమారి అయిన రేణుకాదేవిని వివాహమాడెను. అనేక అణ్వాయుధముల తయారీకి సంబంధించిన విద్యలో ప్రవీణుడు, తపఃశక్తి సంపన్నుడు. ధనుర్వేద, ఔషనాశ విద్యలు, యుద్ధనిపుణతలు నేర్చిన జ్ఞాని. వేదములను క్షుణ్ణముగా తెలుసుకొని సూర్యదేవుని వేడికి తాళలేక అత్యంత శక్తి వంతమైన బాణములతో నింగిని నింపెను. సూర్యుడు కనికరముతో ఆతని శక్తి యుక్తులకు మెచ్చి గొడుగు, మరియు పాదుకలను కానుకలుగా ఒసగెను. దీని వలన ఎండ తీవ్రత నుంచి తట్టుకొనే శక్తి సామర్ధ్యము మనుషులలో పెరుగుటకు తోడ్పడుట అను ప్రక్రియ నాటినుంచి నేటివరకు ఆచరణములో వచ్చి చేరినది. భారత దేశములో కొన్ని ప్రాంతములలో వివాహ సమయములో "కాశీయాత్ర" అను ఉత్సవము జరిపి  వరునికి గొడుగు, పాదుకలు కమండలము సమర్పించు వేడుక నేటికీ ఉన్నది. నదీ తీరమునకు నీరు తెచ్చుటకు వెడలిన రేణుకా దేవి అచట గంధర్వుల ఆటపాటలను చూసి మైమరచిన వైనముతో రాక ఆలస్యము చేసెను. జమదగ్ని ఆగ్రహించి ఆమె శిరస్సును నరకమని తన కుమారులకు ఆనతినీయగా వారు నిరాకరించగా శిలలు కమ్మని శపించెను. ఆతని కుమారుడు పరశురాముడు తండ్రి ఆనతి నెరవేర్చెను. ఆతని పితృ భక్తికి మెచ్చి రెండు వరములను కోరుకొమ్మనగా తల్లిని జీవంతవాగి చేయుమని, శిలలై పడిఉన్న సహోదరులను పునర్జీవితులను చేయుమని కోరెను. జన్మనిచ్చిన తల్లికి మరియు సహొదరులకు పునర్జీవితము నొసంగిన ఘనత పరశురామునిదే. ఒకానొక కాలములో జమదగ్ని కార్తవీర్యుని వద్దనున్న కామధేనువుని అడుగగా ఆతడు నిరాకరించి విశేష ధన సంపత్తులను సమర్పించెను. వాటిని నిరాకరించిన జమదగ్ని ఆతనితో యుద్ధముచేసి అశువులుబాసెను. ఇది తెలిసిన పరశురాముడు ఆగ్రహముతో కార్తవీర్యుని యుద్ధములో వధించడమే కాక 21 పర్యాయములు భూప్రదక్షిణము చేసి క్షత్రియ నిర్మూలనము చేసెను. చివరకు సీతా రామ కళ్యాణ సమయములో మిధిలకు ఏతెంచి శ్రీరామునితో యుద్ధము చేసి రాముడు సాక్షాత్ విష్ణు రూపమని తెలుసు కొని పరాజయము అంగీకరించి అవతార పరిసమాప్తి చేసెను. జమదగ్ని చేత విరచితమైన వేద విజ్ఞాన సంపుటములను నేటికీ బౌద్ధ మతస్థులు ఆచరించడము వలన వాటి విలువలు చిరస్థాయిగా అవనిపైన నిలచిఉన్నాయి.

వశిష్టుడు

బ్రహ్మదేవుని మానస పుత్రుడైన వశిష్టుడు నాలుగు యుగములకు తార్కాణముగా నిలచిన మహనీయుడు. రుగ్వేద కాలమునుంచి   వీరి సంతతి వారు అత్యున్నతులు. సూర్య వంశ ఏలికలకు రాజ గురువుగా అత్యంత ప్రతిభను కనపరచి చక్రవర్తులకు అండగా నిలచిన అతి గొప్ప మహిమోన్నతుడు. ఈతని సత్ప్రవర్తన, నీతి, నియమములు ధర్మ సంరక్షణ, శాంతి సౌశీల్యములు "బ్రహ్మర్షి" స్థానమునకు అలంకృతము చేసినవి. పరమ సాధ్వీమణి, పతివ్రతా శిరోమణి అయిన "అరుంధతీదేవిని" ఇల్లాలుగా పొందిన ఘనత వశిష్టమహర్షిదే. అంతరిక్షములో సప్త ఋషి మండలము వద్ద వశిష్టుని సరసన నక్షత్రముగా మెరిసే తార అరుంధతీదేవి.




నేటికీ వివాహాది శుభ కార్యములలో వివాహానంతరము వధూవరులకు అరుంధతీ నక్షత్ర దర్శనము ఆమె ఆశీర్వచనములను పొందటము ఒక విశేష కార్యక్రమము. అన్యోన్నతకూ, అనురాగానికీ, అరుంధతీ వశిష్టుల దాంపత్యము పురాణములలో అత్యంత ప్రధాన మైనది. ఎన్నో తీర్ధ యాత్రలు చేసి, పుణ్య క్షేత్రములను దర్శించి అనంతరము "యోగవాశిష్టము" అనుగ్రంధమును రచించెను. యోగధ్యానము ద్వారా సంపన్నమయ్యేవి శాంతి, వ్యక్తిస్వాతంత్రము, జీవితములో ఒడుదుడుకులను తట్టుకొనే శక్తి సామర్ధ్యములు, సహనము, ఆధ్యాత్మికబల పెరుగుదల సాధ్యమని వివరించెను. వేదాంత తత్వములుగా భాసిల్లబడే శాంతి, విచారణ, సంతోష, సత్సంగములు అనునవి నాలుగు అశేష విజ్ఞాన వెలుగులుగా అభివర్ణించెను. యోగవాశిష్ట గ్రంధము ద్వారా అత్యంత ప్రభావితులైన సిక్కులు తమ మత గ్రంధమైన "గురు గ్రంధా సాహెబ్" లో మూల శక్తులను గ్రహించి తమ దైనందిన ఆచరణలో ప్రభవిల్లడము వారి భక్తి తత్పరతలకు తార్కాణము. జ్యోతిష్య శాస్త్రములపై పరిశోధనలు చేసి "వశిష్ట సంహిత" అను గ్రంధము రచించి ఎన్నో గ్రహముల సంచారములపై విశేష పరిజ్ఞానమును పెంపొందించుకొని లోకములకు విపులీకరించెను. ఇలపై వశిష్ట మహర్షి సంతతివారు "వశిష్టగోత్ర" నామముతో విఖ్యాతిచెందటము  విశేషమే.

3 comments:

  1. అక్కా
    నమస్కారములు
    పౌరాణిక విశేషాలతో కూడిన నీ వ్యాసమంజరి చాలా ఆసక్తికరంగా సాగుతోంది.
    హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ
    శ్రీలక్ష్మి చివుకుల
    నైమిశారణ్యం నుండి

    ReplyDelete