"అగ్ని
సాక్షిగా నడయాడే సప్తపది నడకలే
వివాహ బంధాన్ని నిలిపే శాశ్వత
బంధనాలు"
“వివాహము
నూరేళ్ళపంట" అనునది పెద్దల నుడి.
ఈ బంధానికి సరితూగగల
బాంధవ్యములు ధరణిపై లేవు. అగ్ని
సాక్షిగా వధూవరులు చేసే శపధములు
సుస్పష్టరీతిలో వ్యక్తీకరింప చేసి ఇరువురిని ఒకటిగ
చేసే బంధమే వివాహము.
మంత్ర పూర్వకముగా వారిరువురు పలికే పదములు, వేదములలో
వ్యక్తీకరించిన శపధములను అర్ధ పూర్వకముగా
వివరించడమే ఈ వ్యాస
ముఖ్యోద్దేశ్యము. నేడు అతి చిన్న
కారణములతో విచ్చిన్నమౌతున్న సంసారములు కాల మార్పులతో దేశ
ప్రగతిని ఎటువైపు నడిపిస్తున్నవో అనిపించినా
ఇది చదివి కొందరైనా తమ
మనస్సులలో మెదలే శంకలు విడనాడి
ఆనందమయమైన సుఖమైన జీవనము గడపాలని
కోరుతున్నాను.
ఈ మంత్రములు సంప్రదాయములు నేడు ఒక్క హిందూ
మతమునకు వేద నిబద్ధతలతో కూడిన
భారత దేశమునకు చెందినవి మాత్రమే
కాదు ప్రపంచమంతా ఎదుర్కొంటున్న విపరీతములు. ఏ జాతి
అయినా, ఏ దేశమైనా,
ఏ మతమైనా వివాహబంధము
అనునది వధూవరులను కలకాలము కలిసి జీవించమని
భాధ్యతాయుతమైన జీవనం గడుపమని, గుణాత్మిక
సంతానాన్ని దేశ ప్రగతికి ప్రసాదించమని
చెబుతున్నది.
శ్రీ వేదవ్యాసవిరచితమైన "గరుడ పురాణం" పూర్వ
ఖండములో భాధ్యతాయుతమైన దంపతుల విధులను వివరించి
స్త్రీ బాధ్యతలను ఈ రీతిలో
వివరించిరి: "కార్యేషుదాసి
- కరణేషు మంత్రీ - రూపేషు లక్ష్మీ
– క్షమయాధరిత్రీ - భోజ్యేషు మాతా - శయనేషు
రంభ షట్ కర్మయుక్తా కులధర్మ
పత్నీ".
- కార్యేషు దాసి:- గృహ బాధ్యతలను నిర్వహించునపుడు దాసిగా మెలగాలి.
- కరణేషు మంత్రి:- అత్యవసర పరిస్థితిలో భర్తకు మంత్రిలా ఉపయుక్తకరమైన సలహాలు ఇవ్వగలగాలి.
- రూపేషు లక్ష్మి:- బాహ్య రూపములోనే కాదు అంత రంగములో నిర్మలమైన మనస్సుతో వెలిగిన ఆమె అందము సాక్షాత్ లక్ష్మీదేవి సౌందర్యముతో సరి పోల్చబడినది.
- క్షమయా ధరిత్రీ:- ఇతరుల తప్పులను క్షమించ గలిగే గుణము స్త్రీలకు పెట్టని ఆభరణము. ఆమె సహనము, ఓర్పు భూదేవితో సరిపోల్చబడటము స్త్రీ జాతికే గర్వకారణము.
- భోజ్యేషు మాత:- భర్తకు, కుటుంబ సభ్యులకు, అతిధులకు, పనివారికి, ఆకలిదప్పులతో అలమటించేవారికి అన్నపానాదులను సమర్పించే సమయములో తల్లిని మరపించ గలగాలి.
- శయనేషు రంభ:- భార్యాభర్తల సంసారిక జీవన పయనములో వారి కలయక శారీరక, మానసిక సంభంధములతో కూడితే ఆమె అందం దేవలోక అప్సరస అయిన రంభతో సరితూగగల అతులిత అధ్భుత సౌందర్యముతో భర్తని దాసోహం చేసుకొనే శక్తిమంతురాలు అవుతుంది. ప్రపంచమే ఆమె సౌందర్యానికి దాసోహం అయిన తృప్తితో పరవశించే ఆనందం ఆమె స్వంతమేమరి.
వివాహ బంధం సనాతన
హిందుధర్మ ప్రకారము చేసే శపధములు
నేడు యాంత్రికముగా అర్ధము తెలియని రీతిలో
పరిసమాప్తమవడము మంత్రబలము క్షీణించి జీవిత చరమాంకము వరకు
నిలవక పోవడము ఒక సమస్య.
విధి నిర్వహణలో భార్యభర్తలు సుఖములోనే కాక కష్టములు ఎదురైనపుడు ఒకరి
చేయి ఒకరు విడవకుండా నడవగలిగిన
నాడు పరస్పర గౌరవభావములతో నిలచిననాడు
మరణము తప్ప వారిని ఏ
శక్తీ విడదీయలేదు అను నమ్మకముతో నిలచిననాడు
ఈ శపధములు సఫలీకృతమౌతాయి.
మనకు మంత్రోచ్చారణ ఎంత వరకు అర్ధము
అయినది అను విషయము కన్న
ఆ మంత్రబలముతో ఎంత
విడదీయలేని బంధాన్ని మన సత్ప్రవర్తన ద్వారా పెంపొందించు
కొన్నామో అనునది ముఖ్యము. ఇవి
మాంగల్య ధారణ, తల మీద
చేయి పెట్టి చేసే ప్రమాణములు,
నుదుట దిద్దే కుంకుమ, కాలి
మట్టెలధారణ వగైరాలేవీ మనసులు కలవని బంధాలని
నిలపలేవు. క్రమేపి యాంత్రికముగా మారి
జీవనశైలిని దుర్భరము చేసి అధోగతికి
లాగుతున్నాయి. ఏ విషయంలోనైనా
అర్ధం లేని పరిజ్ఞానము ఎంత
ఉన్నా అది వ్యర్ధమే. అర్ధ
వంతమైన మంత్రముల పరమార్ధమును సామాన్య
రీతిలో, సామాన్యులకు విశదీకరించడమే ఈ వ్యాసము
యొక్క ముఖ్యోద్దేశ్యము.
సప్తపది
నడకలలో వధూవరులు అగ్ని సాక్షిగా
చేసే శపధములు, అగ్రజులైన పెద్దలు
కురిపించే ఆశీస్సులకు ఎన్నటికీ ఎప్పటికీ విలువ
కట్టలేము.
- ప్రధ మపదము
అగ్ని సాక్షిగా వధూవరులు కలిసి
వేసే ప్రధమ అడుగులో వారి
భవిష్యత్తును సూచించే తీరులో సంసారభవన
నిర్మాణమునకు పునాది రాయి వేయడమే
విశేషము. వరుడు తను చేసే
మొదటి శపధము
“ఓం
ఇషా ఏక పది భవ
ఇతి ప్రధమం”
ఓ సఖీ నీతో అగ్ని
సాక్షిగా నడిచే ప్రధమ అడుగు
ఇదే. నాకు సమర్పించిన ఆహారమునకు,
అన్ని మార్గములలో చేసిన సహాయ సహకారములకు
గురుతుగా నేను మన సంతానానికి
సంతోష సౌభాగ్యములను కలిగించడమే నా ప్రధమ కర్తవ్యముగా
భావిస్తాను. అనగా మితి మిక్కిలి
ఆనందముతో వధువు:
"త్వత్తోమేఖిల
సౌభాగ్యం వివిధైకృతః దేవః
సంపాదితో
మహత్త్యం వధురధే పదేస్ బ్రవీతం"
ఈ సమయములో
నాకు సమర్పించిన అఖండ సంపత్తులను స్వీకరించడము
నా సౌభాగ్యముగా భావిస్తూ
ఈ కుటుంబ అభివృద్ధికి
నా సాయశక్తులా ప్రయత్నించి
నా కర్తవ్యమును సంతోషముతో
స్వీకరిస్తాను అను ఒప్పికతో మనః
స్పూర్తిగా చేసే శపధం వరుడు
ఎన్ని జన్మలెత్తినా మరువలేనిదే.
- ద్వితీయ పదము
అగ్ని దేవుని ముందు వధూవరులు
కూడి నడిచే ద్వితీయ పదములో
వారు చేసే అతి ముఖ్యాతి
ముఖ్యమైన శపధము వరుడు ఈ
రీతిలో
"ఓం
ఊర్జే జరదస్తమః"
మన ఇరువురము కలసి
నడిచే ద్వితీయ పదములో ఈ
కుటుంబమును ఉన్నత స్థితిలో నిలపడము
మరియు సత్సంతానఅభివృద్ధికి కృషిసల్పడము
మన భాధ్యత" అనగా
వధువు సంతోషముతో తనలో చెలరేగిన భావములను
ఎదలో పదిల పరచుకొని ఈ
రీతిలో ఉచ్చరిస్తుంది:
"కుటుంబం
పాలతీష్యామీ హ వృభాలకదికం
తధా లభ్దేన సంతుష్టా వ్రతే
కన్యా ద్వితీయకే"
సదా కుటుంబ రక్షణలో, సంతోషములో
భాగము పొందుట నా ధర్మముగా,
నా కర్తవ్యముగా భావిస్తాను.
అతులితమైన అనురాగ సాక్షిగా శపధము
చేసి ద్వితీయ పదములో వెంట
నడిచే ఆమె అమృతతుల్య వచనములకు
ముగ్ధుడైన వరుడు ఆమెను తృతీయ
పదము వైపు నడిపించడము అధ్భుత
వీక్షణమే కదా.
- తృతీయ పదము
అగ్ని ముందు వధూవరులు కలిసి
నడిచే తృతీయ పదములో వారు
చేసే శపధములు భవితవ్యానికి సూచనగా
"ఓం
రయస్ సంతు జోర దస్తయః"
“ఓ
సఖీ! ఈ జీవన
పయనములో మన ఆర్ధిక సంపత్తులను
పెంపొందింప చేసుకొని మన గుణాత్మక
సంతానాన్ని ఉత్తమ విద్యావంతులుగా తీర్చిదిద్ది
వారు చిరకాలము ఆయురారోగ్య ఐశ్వర్యములతో
ఇలపై తుల తూగే రీతిలో
కృషి చేద్దాము” అని వరుని నోట
వచ్చిన అమృత పలుకులు విన్న
నూతన వధువు పరవశముతో వ్యక్తపరచిన
శపధ రూపము ఇది:
"మిష్టాన్నవ్యం
జనాదినీ కాలే సంపాదయే తవ
ఆజ్ఞాసంపాదినీ
నిత్యం తృతీయే సాక్భ్రవిద్ధరంబిః"
జీవన పర్యంతము తోడుగా నిలచి
పవిత్రమైన భావనలతో ధన్యతనొంది మీ
ఆజ్ఞకు బద్ధురాలిగా నిత్య జీవితము గడపటమే
నా అభిమతము. మీ
సేవలో ధన్యతనొంది జీవితంలో ఎవరు ఎదురైనా
ప్రప్రధమ స్థానములో ఎప్పటికీ మీకే నిలిపి
ఉంచుతాను" అని తనదైన రీతిలో
మనసులోని భావనలను ప్రస్ఫుట పరచి
చేసే శపధము విన్న వరుని
మనస్సు అంతులేని ఆనంద సంభ్రమములో
తేలిపోతుంది.
- చతుర్ధ పదము
అగ్ని దేవుని ఎదురుగా నడిచే
వధూవరులు చతుర్ధ పదము లోనికి
వచ్చి తమ ఆశయమ్ములను ఈ
రీతిలో శపధము చేస్తారు. వరుడు
తనలో విరిసి వెల్లువైన విశ్వాసమును
వ్యక్తపరుస్తూ
"ఓం
మయోభవ్యస్ జరదసతయః"
“ఓ
సఖీ నా జీవితములోనికి అఖండ
పవిత్రతను ఆపాదించుటకు వచ్చిన మానవత్వముతో నన్ను
ఉత్తమ మనిషిగా వినయ విధేయతలు
మూర్తీభవించిన ఉత్తమ సంతానానికి రూపునిచ్చే
ఉత్తమ తల్లి తండ్రులమౌదాము" అనగా
వధువు ఆనంద పరవశమై:
"శుచిః
శృంగార భూషణ శహం కాయ
కర్మవదేద్ధరం
క్రీడేష్యామి
త్వయ సార్ధ తురీయేసా"
తన సంతోష భావసంపత్తులను వర్షపు
జల్లులా ఆతని శిరస్సుపై నుండి
పాదముల వరకు కురిపించడమే కాక
తనకు సాధ్యమైన రీతిలో తృప్తికర
జీవనమును సాగించడమే తనధ్యేయమని వ్యక్తపరచడము వివాహ బంధానికి చిరాయువే
అవుతుంది ఎప్పటికీ.
- పంచమ పదము
అగ్ని దేవుని చుట్టూ నడిచే
వధూవరులు పంచమ పదములో చేసే
శపధములో అనేక దేవీ దేవతామూర్తుల
ఆరాధనలలో పంచ భూతములను సాక్షీ
రూపముతో నిలిపి వధువుపై గల
అనన్య ప్రేమానురాగములను ప్రదర్శించే క్షణములో పంచమ పదము
వేస్తూ వరుడు
"ఓం
ప్రజబ్యః సంతు జరదస్తయః"
ఒక మంచి స్నేహితురాలిగా నా
బాగోగులను సదా పరిరక్షించే ఉత్తమ
వ్యక్తిగా జీవన గమనాన్ని ఉన్నత
శిఖరమ్ములపై ప్రతిష్ఠాపించిన అనుకూలవర్తినిగా సర్వ దేవతల ఆశీస్సులు
నీపై నా దీవనల రూపముతో
సదా నిలవాలి" అనగా అది విన్న
వధువు అమిత ఆనంద పరవశముతో
ప్రతిగా:
"దుఃఖే
ధీరే సుఖేహస్తా సుఖ దుఃఖా విభాగినీ
నాహం పరతరం యామీ పంచమే
సాశ్ బ్రవిధ్వరం"
తను జీవించి ఉన్నంత కాలం
ఆతని సంతోషమే తన సంతోషముగా
ఆతని దుఃఖమే తన దుఃఖముగా
ఆతని కష్టసుఖములే తన కష్టసుఖములుగా భావించడమే
కాక పరిపూర్ణ విశ్వాసముతో ఎప్పటికీ
చెరగని నమ్మకముతో తరగని గౌరవభావముతో సదా
సదా ఆతని ఆశయమ్ములు నెరవేర్చడమే
తన కర్తవ్యమని ప్రేమతో
కూడిన భావములను శపధ రూపములో
తెలుపుతుంది. ఆమె అనురాగానికి ముగ్ధుడైన
వరుడు మరొక పదమువైపు ఆనందముతో ముందుకి
సాగే నడకలోనే సృష్టి లోని
విచిత్రం దాగి ఉన్నది.
- షట్ పదం
అగ్ని సాక్షిగా వధూవరులు కలిసి
నడిచే షష్ట్ పదములో ఎంతో
అర్ధ వంతమైన సత్యము నిబిడీకృతమై
ఉండటములో అమరిన ఈ పదముల
అల్లికలో వరుడు
"రుతుబ్
యహః షట్ పదిభవ"
అనగా ఆమెతో నడచిన ఆరవ
అడుగులో ఆతని హృదయము వెల్లువై
విరిసిన సంతోష తరంగములతో నిండినదని
తెలుపుతూ ఇదే జీవనమును సంప్రాప్తింప
చేయుమను భావమును
ప్రస్పుటింప చేయుమనగా వధువు తన
జీవన పరమావధిని తెలుపుతూ:
"సుఖేనే
సర్వ కర్మాణీ కరిష్యామి గృహే
తవ
సేవా స్వస్తుర్ యోశ్చామిబంధూనాం
సత్కృతిం
తధా యత్రత్వం వా అహం
తత్ర
నాహం ప్రియేణా వత్సాహి కన్యా
షష్టీ పదేస్చ బ్రవిత్"
ఇరువురు
కలసి నిర్వహించిన యజ్ఞ, హోమ, జప,
తప మంత్ర బలముల
ద్వారా చేసిన శపధములకు బద్ధురాలై
ఆతని జీవన సహచరిణిగా కలకాలము
సంసార బాధ్యతలు నిర్వహించడమే తనదైన
గురి అని చేసే విశ్లేషణ
విన్న ఏ వరుని
మనస్సు తనువు ఆనందముతో ఉప్పొంగదు!
ఒకరిపై ఒకరికి గల నమ్మకములను
ఋజువు చేసుకొని సప్తమ పదము
వైపు పయనించడమే వారి లక్ష్యము అవుతుంది.
- సప్తమ పదం
అగ్ని సాక్షిగా వధూవరులు కలిసి
నడిచే సప్తమ పదములో చేసే
శపధములో సర్వ దేవతలను సాక్షులుగా
ఆహ్వానించి తమ స్థిర నిశ్చయమ్ములను
వ్యక్తీకరింప చేయడమే ఈ పదములలో
దాగిఉన్న అర్ధము. అమిత సంతోషముతో
వరుడు
"ఓం
సఖి జరదస్త్య హః గ"
“ఓ
సఖీ! నేడు మనమిరువురము అగ్ని
సాక్షిగా సర్వదేవతల సాక్షిగా శాశ్వతముగా శాస్త్ర
ప్రకారము దంపతులుగా శరీరములు వేరైనా మనసులు
ఒకటే అనుభావమును జగతికి తెలియ పరచడము
మన కర్తవ్యము." అని
తన స్థిర నిశ్చయాన్ని,
నిశ్చలతతో కూడిన భావములను శపధ
రూపములో వ్యక్తపరచగా వినిన వధువు యొక్క
మనస్సు శరీరము సంతోషముతో పులకించిపోయి
తన స్థిర నిశ్చయమ్మును
ముదముతో సప్తమ అడుగు వేసి:
"హోమ
యజ్ఞాది కార్యేషు భవామిచ సహాయకృత
ధర్మార్ధ
కామ కార్యేషు మనో వ్ర్త్తనుసారిణీ
సర్వశాస్త్ర
సాక్షీణాస్తవం మే పతిర్ భూతోశ
సిసం ప్రతం”
యజ్ఞహోమాది
క్రతువులలో తాను భాగస్వామినిగా నిలచి
సదా ధర్మ, అర్ధ, కామ
మరియు మోక్ష ఆదిగా గల
కార్యములలో మనఃస్పూర్తిగా సర్వ శాస్త్రముల సాక్షిగా
సదా పతిని అనుసరించడమే తనదైన
వ్రతము అని చేసిన ప్రతిజ్ఞలో
సర్వ దేవతల సాక్షిగా, అగ్ని
సాక్షిగా అతను ఆమెను అర్ధాంగిగా
స్వీకరించిన తరుణములో వారిరువురి నడుమ
పరస్పర గౌరవముతో కూడిన అవగాహన,
ప్రేమ మరియు రక్షణ ఎప్పటికీ
శాశ్వతముగా నిలచి ఉంటాయి" అని
మనఃస్పూర్తిగా తన ధృఢ సంకల్పముతో
కూడిన స్థిర నిశ్చయమ్మును వ్యక్తీకరిస్తుంది.
వైవాహిక
ధర్మ సూత్రముల ప్రకారము పైన
ఉదహరించిన సప్త పదముల నడకలు,
చేసిన శపధములు, ప్రమాణములు, జీవన
సహచరులుగా కలసి పయనించే వధూవరుల
భవిష్య జీవనమ్మును అత్యున్నత స్థితిలో నియంత్రీకరింప చేయబడటము
ఒక విశేషమైతే ఎదురయ్యే
ఒడుదుడుకులు, ఆటుపోట్లు, కష్టనష్టములు తట్టుకొని నిలబడగలిగే ధైర్యాన్ని, శక్తిని, ఆత్మ విశ్వాసాన్ని
సంప్రాప్తింప చేయడానికి ఈ శపధ
నిర్ణయములు దోహదపడతాయి. సంసారము అనగా శారీరక
వాంఛలతో తృప్తి చెంది లభించే
ఆనందమే అంటే తప్పుడు అర్ధమే
వస్తుంది. పరస్పర గౌరవ భావములతో
వారిరువురు కలసి తీసుకొనే నిర్ణయములతో
గుణాత్మిక సంతాన ప్రాప్తి మరియు
సమాజ అభివృద్ధి కొరకు ఇరువురి పాత్ర
వెలకట్టలేని విలువలతో కూడినదిగా ఏర్పడి
జగతికి శోభనిస్తుంది. జీవితాంతము వరకు విడదీయలేని బంధముగా
రూపొందిన నాడే వారి కలయికకు
సప్త పద నడకలకు, సప్త
జన్మ సంబంధములకు మరియు వివాహబంధమునకు అర్ధము
పరమార్ధము ఏర్పడుతుంది అని నేనంటాను. మరి
మీరేమంటారు?