Friday, 8 February 2019

సప్తసంఖ్యల విశిష్ఠతలు (ఏడవ భాగము)

"సప్తదినములతో కూడిన వారమే
భువిలో దివిలో సప్త దేవతల ఆరాధనమే"
సర్వ సృష్టికి ప్రత్యక్ష ఆరాధ్య దైవమైన సూర్యునితో కూడిన వివిధ గ్రహముల సంచారమే అంతరిక్షమున వెలుగులీను తున్నది. ఇది "సూర్యకుటుంబము" అని మనము వ్యాఖ్యానించితే ఆధునిక విజ్ఞానవేత్తలు (సోలార్ సిస్టము) గా అబివర్ణించిరి.


కాలగణనము ప్రకారము పురాణములు సప్త దినములలో కూడి ఉన్న కాలమును ఒక వారముగా పరిగణించడ మైనది. సప్త దినములు వివిధ గ్రహములతో సరిపోలిచి ఆరాధించడము మన నిత్య జీవనములో ఒక ప్రముఖ భాగమైనది. శ్రీ వేదవ్యాస మహర్షిచే మంత్ర రూపములో విరచితమైన ప్రముఖ గ్రహముల ఆరాధన ప్రతి మనిషి జీవనములో ఎదురయ్యే ఒడుదుడుకులు, కష్ట నష్టములు, క్లిష్ట సమస్యల నుండి రక్షణ కవచముగా మారడమే కాక వారి జాతక రీత్యా ఎదురయ్యే ఆపదలను తొలగించి ఎంత శక్తివంతమైన గ్రహసంచార మైనా కొంత వరకు కౄర దృష్టుల నుంచి తప్పించి సుఖ శాంతులను ప్రసాదిస్తుంది అనునది మన నమ్మకము. శ్రీ వేదవ్యాసుడు ఖగోళ, జాతకచక్ర సంభంధిత గ్రహసంచార నిభద్ధతలను, గ్రహముల యొక్క శక్తిని మంత్రము ద్వారా విశదీకరింప చేయడమే కాక మంత్ర మహిమలను దినములో నెలకొన్న అధిష్ఠాన దేవత యొక్క శక్తి యుక్తులను ఎంతో వివరముగా విశదీకరింప చేసి విశ్వ మానవ కళ్యాణమునకు దోహద పరచెను.
ఆదివారము
సప్త దినములలో ఆరంభమయిన ప్రధమ దినమే ఆదివారము, ఆదిత్య వారము, రవి వారము, బాను వారము  అను వివిధ నామములతో రూపు దిద్దుకొన్నది.
"జపాకుసుమసంకాశం-కాశ్యపేయం మహాద్యుతిం
తమోరిన్ సర్వపాపఘ్నం-ప్రణతోస్మి దివాకరం"
అని చేసే ప్రార్ధన ఎంతో విశిష్ఠతతో కూడి ఉన్నది.



ఎర్రని జపాకుసుమముగా నింగిపై వెలిగే సూర్యుని యొక్క కిరణములు ధరణిపై వెలుగును ప్రసరింప చేసి మానవుల ఎదలో నిగూఢమై ఉన్న, జగతిని ఆవరించి ఉన్న అంధకారమును తొలగించి విజ్ఞతను, ఆరోగ్యమును పెంపొందింప చేసే ఉచిత శక్తి ప్రదాత ఆదిత్యుడే. భువిపై సర్వ ప్రాణి కోటిని వ్యాప్తీకరింప చేసిన "కశ్యప" మహర్షి వలన ధరణికి "కశ్యపి" అను పేరు సుస్థిరమైనది. సూర్య రధ పయనమునకు ఆలంబనముగా నడయాడే సప్త అశ్వములు సప్త దినములకు సంకేతములు. ఆందుకే తన వంశ మూల పురుషుడైన సూర్యుని కీర్తిస్తూ శ్రీరాముడు "సప్తాశ్వరధమారూఢం ప్రచండం కశ్యపాశ్మజం శ్వేత పద్మ ధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం" అని స్తుతించెను.

సోమవారము
స్వచ్చమైన ధవళ కాంతితో అతి చల్లని ఆహ్లాదకరమైన వెన్నెలలను ధరిత్రిపై ప్రసరింప చేసే చంద్రుని సప్త దినములలో ద్వితీయ స్థానములో నిలిపిరి.
"దధి శంఖ తుషారాభం-క్షీరోధార్ణవ సంభవం
నమామిశశినం సోమం - శంభోర్మకుట భూషణం
అని సొముని పేర నెలకొన్న దినము "సోమవారము" అయినది.


క్షీర సాగర మధనము చేసే సమయములో ఉధ్భవించిన చంద్రుడు ఈశ్వరుని శిరస్సుపై అలంకృతమాయెను. అమృతమయుడు, మనోమయుడు, అన్నమయుడు, వేల్పులకు ఔషధీలతలకు, చెట్లకు, జీవకళలు ప్రసరింప చేయు శక్తిమంతుడు. పదహారు కళలతో కళకళలాడే చల్లని మూర్తి. మాసములో పదిహేను కళలతో వృద్ధి పొంది - దేవతలకు పదిహేను కళలతో క్షీణత పొంది పితృదేవతలకు వైభవమును ప్రీతిని కలిగించే సద్గుణ సంపన్నుడు అని చంద్రుని వైభవమును వేదములు వర్ణించినవి. శివ కేశవుల భేధములేని "కార్తీక పౌర్ణమి" "దేవ దీపావళి" గా వినుతికెక్కినది. చంద్రుడు కృత్తికా నక్షత్రములో సంచరించుట వలన  కృత్తికకు అగ్ని అధిష్ఠాన దేవత అందువలన కార్తీక మాసములో దీపారాధన విశేష ప్రాముఖ్యతను సంతరించు కొన్నది. జ్ఞానానికి, సకల సంపదలకు, విజయ సిద్ధికి, మరియు పాపములు, ఆందోళనలు, కష్టములు తొలగుటకు చంద్రుని ఆరాధన శుభప్రదము. దినము చంద్రుని కిరణములు అతి శక్తివంతమై ఉండుట వలన ఒక పాత్ర క్షీరముతో నింపి కొంత సమయము వానిపై చంద్ర కిరణములు ప్రసరించు తీరులో అమరించుట తదనంతరం వాటిని స్వీకరించిన ఆరోగ్య రీత్యా ఎంతో మంచిది.

స్త్రీలకు గర్భాశయ సమస్యలు దరిచేరవు అనునది వేదోక్తి. దినమున "ఓం చద్ర సహోదర్యేయనమహః" అని లక్ష్మీ దేవిని ఆరాధించితే సకలైశ్వర్యములు సంప్రాప్తమౌతాయి. "ఓం కార్తికేయనమః" అని  ఆరాధించితే కృత్తికా నక్షత్ర అధిదేవత అగ్ని ప్రీతి చెందడము ఒక విశేషమైతే ఏడు జన్మల వరకు ధనవంతులుగా, పండితులుగా ఇలపై జన్మలు ఎత్తడము తధ్యము అనునది పురాణ ఉవాచ. శ్రీ లలిత ఫలస్తుతిలో "పౌర్ణమాస  చంద్రబింబే ద్వాత్వా శ్రీ లలితాంబికాం" అని ఆమె మూర్తి పున్నమి చంద్రునిలో వెలసిన రూపమును ఆరాధించడము అశేష పుణ్య సంపదలు మనకు సంప్రాప్తమవునని వేద విశ్లేషణ. ఇన్ని మహిమలతో అలరారే చంద్రుని వైభవమును కీర్తించి "సోమవారము" చేసే ప్రార్ధనలు అత్యంత విశేషమైనవే మరి.

మంగళవారము
సప్త దినములలో తృతీయ స్థానములో అలరారే మంగళకరమైన దినము. "జయవారము" గా అబివర్ణించబడినది. భూదేవి గర్భమున ఉదయించిన మంగళుండు (మార్స్) విద్యుత్కాంతితో సమానమైన కాంతులు వెదజల్లుతూ సూర్యుని చుట్టు పరిభ్రమించే గ్రహమే మంగళుండని అని వేదములు విధముగా ప్రస్తుతించెను.
"ధరణీ గర్భ సంభూతం-విద్యుత్కాంతి సమప్రభం
కుమారం శక్తి హస్తం-తం-మంగళం ప్రణమామ్యహం"


హస్తములో ఈటెవంటి ఆయుధమును ధరించి సదా యవ్వనవంతుడై వెలుగులీనే మంగళునికి అభివాదములు. శ్రీ ఆంజనేయునికి మరియు శక్తిరూపిణి అయిన మంగళ చండికకు అతి ప్రీతిపాత్రకరమైన దినము కావున విశేష పూజలతో  భక్తకోటి తన్నీలమౌతారు.

బుధవారము
సప్త దినములలో విశిష్ఠమైన శుభప్రదమైన రోజు బుధవారము, అంధకారములో అలమటించు జనతకు వెలుగును విరజిమ్మే అతి చిన్న కాంతి పుంజం బుధగ్రహమే. సరిపోలికలు లేని మొగ్గవంటి పాదరస గుళికవంటి రూపము దాలిచి అలరారే బుధుని వేదములు విధముగా వర్ణించినవి.
"ప్రియంగు గుళికా శ్యామం-రూపేణ ప్రతిమం బుధం
సౌమ్యం సత్త్వగుణోపేతం-తం బుధం ప్రణమామ్య-హం"


సర్వ జనులకు సర్వదా ప్రీతిపాత్రుడై సౌమ్య రూపముతో సత్వ గుణ సంపన్నుడైన బుధునకు నమస్కృతులు. సూర్యునితో సరిసమానముగా పరిభ్రమించు గ్రహముగా వేదముల వర్ణన. సూర్యుని విడిచిన కాలములో పెనుగాలులు, వర్షబాధలు కలిగి దేశనెమ్మదిని, శాంతిని అతలాకుతలము చేయడము కాలగణన ప్రకారము వెల్లువ అయ్యే అనేక విపత్తులు సంభవించు కాలముగా పరిగణించబడటమే, గ్రహ సంచార లక్షణము. అదే సమయములో బుధగ్రహ సంచారము దేశకాలమాన జన మరియు శాస్త్ర ఆమోదితుడుగా అసమాన్యుడు. ఆతి సౌమ్యవంతుడుగా అంగీకరింపబడిన గ్రహమే కాక శ్రీ మహావిష్ణువుకు ప్రీతి పాత్రకమైన రోజుగా నుతించడము జగతిని సర్వదా సురక్షితము చేయమని సర్వ జనులకు మేలు చేయమని ఆరాధించడము మన కనీస కర్తవ్యము, భాద్యత.

గురువారం
సప్త దినములలో విజ్ఞాన సంపదలకు మూల పురుషుడైన గురువునకు చేసే విశేష ఆరాధనలే పంచమ దిన రూపములో గురువారముగా నెలకొని ఉన్నవి.
"దేవానాంచఋషీణాంచ-గురుకాంచన సన్నిభం
బుద్ధిమంతం త్రిలోకేశం-తం నమామి బృహస్పతిం"


"గు" అనగాఅంధకారము" “రుఅనగా "తొలగించునది". రెండు శభ్ధముల నుండి" గురు అను పదము ఉధ్భవమైనది. మనిషిలోని అజ్ఞానమనే చీకటిని పారద్రోలి విద్య అనే వెలుగును ప్రసరింపచేసి, జీవితాన్ని సరి దిద్దే వారే "గురువులు" గా భావింపబడిరి. "స్వదేశే పూజ్యతే రాజ విద్వాన్ సర్వత్ర పూజ్యతే" అను వేదోక్తి అక్షర సత్యము. కాలం అనే గురువు ప్రతీ మనిషికి ప్రతీ క్షణం నవ్యతతో నిండిన పాఠాలు నేర్పుతూనే ఉంటుంది. అవి ఎవరి ద్వారానైనాసరే మన అనుభవసారముగా స్వీకరించి జీవితములో ముందుకు సాగితే అనుభవమే మన జీవన పరమావధిని చేర్చే "చుక్కాని" గా మారుతుంది. స్నేహితులైనవారు, ఆత్మీయులు మంచి పాఠాలు నేర్పితే శతృవులు గుణపాఠాలు నేర్పుతారు. దేవతలకు, ఋషులకు. గురువైన బృహస్పతి అతిబుద్ధి కుశలోపరి. ముల్లోకములలో విశేష తెలివితో, తేజస్సుతో సౌమ్య రూపముతో గురు స్థానమలరించిన విజ్ఞాని. సదా దేవతల క్షేమమును ఆకాంక్షించి వారికి విపరీత పరిస్థితులు ఎదురైనప్పుడు ఎంతో విజ్ఞతతో  వారిని అనుక్షణము కాపాడిన క్షేమంకరుడు. సదా బుద్ధి కుశలతతో అలరారే బృహస్పతిని విజ్ఞతతో కూడిన విద్యావంతులను, వినయవంతులను బుద్ధిమంతులను "బుద్ధిలో బృహస్పతి" అని అభినందించడము మనదైన  మరువరాని విజ్ఞతతో కూడిన సంప్రదాయమే.

శుక్రవారము
 సప్త దినములలో వెలుగులీనే షష్టి రొజుగా "శుక్రవారము" అని వేదములు నిర్దేశించినవి. సూర్యునికి ముందు వెనుక భాగములను అనుసరించి సమాన గతిలో తిరిగే గ్రహముగా వేదములు విశ్లేషించినవి. లోక క్షేమంకరుడు. అనావృష్టి, కరువు కాటకములు, క్షుధ్బాధలు, గ్రహ పీడనములు ఆదిగా ఎదురయ్యే అతి ఘోర సమస్యల నుండి మానవాళిని రక్షించడము గ్రహసంచార విశేషము. మానవ జీవితములో జాతకగణన ప్రకారము అభివృద్ధి పధములోకి అత్యున్నత కీర్తి ప్రతిష్ఠలలతో వెలుగొందే పధములోనికి చేర్చగలిగేది శుక్ర గ్రహబలమే. ఉన్నత స్థితి కొరకే సర్వ మానవాళీ తపించేది ఆరాటపడేది. అదే "శుక్ర మహాదశ" గా జాతక శాస్త్రము విశ్లేషించినది. మహార్దశలో చేరిన మనుష్య జీవనము అన్ని రంగములలో సుప్రకాశవంతమై అలరారడము ఒక విశేషమైతే స్వచ్చమైన ధవళ కాంతితో వెలుగులీనే మంచు శిఖరములా స్వచ్చమైన మల్లెపూల సౌరభమంత సువాసన భరితమై విలసిల్లుతుంది శుక్రగ్రహ సంచారము.
మహర్ధశలో అలరారే శుక్రగ్రహ మహిమను స్తుతిస్తూ శ్రీ వేదవ్యాసుడు
"హిమకుంద మృణాలాభం. దైత్యానాం పరమం గురుం
సర్వ శాస్త్ర ప్రవక్తారం-భార్గవం ప్రణమామ్యహం"



క్షీరాభ్ధి కన్యగా ఉధ్భవమైన శ్రీమహాలక్ష్మి జన్మించినది శుక్రవారమే. కావున దేవిని ఆరాధించి పూజించిన అఖండ సిరిసంపదలు లభ్యమయ్యే ఆశీస్సులు మనస్వంతము అనడములో సందేహము ఎంతమాత్రము లేదు. దైత్యుల గురువుగా సర్వ శాస్త్రపారంగతుడైన అతి విజ్ఞానోపేతుడైన "శుక్రాచార్యుడు" సదా వారి రక్షణ కొరకై పడే తపనలో విజ్ఞతలో శుక్రాచార్యునికి ధీటుగా వేరెవ్వరు లేరు అనునది జగద్విదితము. ఇన్ని శుభములను సంప్రాప్తింప చేయు శుక్ర దేవునికి అశేష వందనములు.

శనివారము
సప్త దినములలో అలరారే సప్తమ దినముగా సుశోభితమైనది"శనివారము". దినమునకు అధిష్ఠాన దేవత శనిపరమాత్ముడు. ప్రతీ మనిషి జీవితములో అతి భయంకరమైన రూపముతో తన ఆగమనమే జనులలో భయభీతులతో కంపింపచేసే శక్తిమంతుడు. చాలా కురచ రూపముతో అతి మెల్లగా సంచరించే గ్రహము. వేద, పురాణములు మహనీయుని స్మరణము, ప్రార్ధన శ్లోక రూపమున విధముగా విరసించినవి.
సూర్యదేవునికి చాయాదేవికి జన్మించిన కుమారుడే శనిపరమాత్ముడు. మృత్యుభీతాహుడు, ధర్మనిరతుడు ధర్మ సమవర్తిగా పేరొందిన అతి కఠినాత్ముడై సంచరించు యమధర్మరాజు యొక్క సోదరుడు మరియు యమునా నది వీరి సోదరి. నీలి వర్ణముతో, నల్లని వస్త్రములు ధరించి, జగతిని  భయభీతులతో కంపింప చేసే శనిపరమాత్ముడు తనని ఆరాధించే భక్తులకు సకల కోరికలు సిద్ధింపచేయు కరుణామయుడు.
"నీలాంజన సమాభాసం- రవిపుత్రం-యమాగ్రజం
చాయామార్తాండ సంభూతం-తం నమామి శనైశ్చరం"



పైన ఉదహరించిన శ్లోకము పదకొండు పర్యాయములు చదివి శనిదేవుని కృపాకటాక్షముల కొరకు తపించే భక్తులు నల్లని నువ్వులు దానము చేసిన నువ్వుల నూనెతో శనీశ్వరునికి అభిషేకము చేసిన అత్యంత ప్రీతిపాత్రుడై అఖండకోటి భక్తుల వశుడై వారిని సర్వదా సర్వవేళల పరిరక్షించును అనునది వేదవిశ్లేషణ.

ఇంతే కాక మరియుకొన్ని విశేషములతో అలరారే "శనివారము" కలియుగ ప్రత్యక్ష దైవముగా భాసింపబడే తిరుమలేశునికి అత్యంత ప్రీతికరమైన దినముగా పురాణ ఉవాచ. సప్త గిరులపై వెలసిన శ్రీనివాసుని స్మరణముతో కొంత వరకు శనిపరమాత్ముని తృప్తి చేయగలము అనునది అశేష భక్తకోటి నమ్మకము.

గ్రహమైనా భక్తితో ధ్యానించి నమఃస్సుమాంజలులను అర్పించిఅన్యధాశరణం నాస్తి త్వమేవశరణం మమ" అని చేతులు ముగించి తల వంచి చేసే వందనములతో పరవశమై కృపా కటాక్షణములను భక్తులపై కురుపించని దైవము ఇలపై లేదు. ఇటువంటి పవిత్ర ధ్యానముతో మిన్ను విరిగి మీద పడే ఆపదల నుంచి మానవాళిని తృటిలో తప్పించ గలగడమే దైవ శక్తికి నిదర్శనము. సత్యం మనకి అనుక్షణం తెలిసి వస్తున్నా మన మూఢత్వముతోనే దైవ ధూషణ, పరనింద చేసి అవివేకులము అవుతున్నాము అని నేనంటాను, మరి మీరేమంటారు?

ఇవే సప్త దినములు రోమనులు మరియు యూరోపియనులు వారు ఆరాధించే వివిధ దేవతా స్వరూపములను స్మరించు రీతిరివాజులతో కూడిన సప్త దినములను "శాస్త్రీయ గ్రహములు" గా (సేక్రెడ్ ప్లానెట్స్) అభివర్ణించిరి.
ప్రపంచములోని ఎందరో విజ్ఞానులు కాలచక్ర గమన ప్రాముఖ్యతలను వివిధరీతులలో వివరించిరి. ఒకటవ శతాభ్ధములో రోమనులు, మరియు ఈజిప్షియనులు విజ్ఞానమును మధ్య ఆసియా దేశములకు సంక్రమింప చేసిరి. వీటి గురించి క్లుప్తరీతిలో విభిన్న దేశములలో వారి దేవతల ఆరాధనలు ప్రకృతితో మిళితమై ఉండటము గమనించ వలసిన విశేషము. నాల్గవ శతాభ్ధ కాలములో "హెల్లెన్ స్టిక్" జాతకచక్ర విశ్లేషణ ప్రకారము గ్రహములయొక్క ఉనికి క్రమరీతిలో సన్, మూన్, మార్స్, మెర్క్యురీ, జూపిటర్ వీనస్ సాటర్న్ గా వివరింపబడినది.



ఛైనీయుల "సిహాయీ" అను గ్రంధములో అంతరిక్షమున మెరిసే సప్త గ్రహములను వాటి నిర్దేశిత సమయమును ఒక క్రమ పట్టికలో "సప్తదినములు" గా తెలిపి అది ఒక వారమని మరల మరల ఇదే క్రమరీతిలో తిరిగే కాల చక్ర గమనమే కాల గణనము అని తెలిపిరి.



మండే (మోనండేయజ్)
సప్త దినములలో భాసిల్లే ప్రధమ దినముగా రూపు దిద్దుకొన్నది. దినమున చంద్ర గ్రహము తనదైన విశిష్టలతో "మూన్" గా ఆరాధింప బడుతున్నది. లాటిన్లో (డైస్ లూనే) అని చంద్రుని వర్ణించిరి. పురాతన గ్రీకుల సంప్రదాయమును అనుసరించి "హెమరా సెలినెస్" (చంద్రుని రోజు) పురాతన ఆంగ్లములోమోన్ డేజ్ (చంద్రునిరోజు) అని వర్ణించిరి. సదా భువిపై చల్లని కిరణములు ప్రసరింపచేసే చంద్ర గ్రహమును అన్ని దేశముల ప్రజలు ఆరాధించి శాస్త్ర సమ్మతముగా ఆతని పేరున "మండే" గా కీర్తింప బడే సంప్రదాయము అభినందించ దగినదే.

ట్యూస్ డే (టివిస్డే)
సప్త దినములలో నిలచిన ద్వితీయ దినము. “టివిస్" అనగా "మార్స్" గ్రహము ఆవిర్భవించిన రోజు "ట్యూస్ డే". దేవుని ప్రతిబింబము ఒకే చేతిలో ఈటెవంటి ఆయుధమును ధరించి ప్రతినచేసే రీతిలో నెలకొనడము ఒక సంప్రదాయము. నార్స్ మైథోలొజీ లాటిన్ భాషలో "దార్స్" శాస్త్రప్రకారము "మార్టిస్ దినము" (డే ఆఫ్ మార్స్) అనిరి. వీరి శాస్త్ర రీత్యా మార్స్ గ్రహము కాలమార్పులతో వాతావరణ చేర్పులతో భూమినుండి విడివడి అత్యంత కాంతులతో ప్రతిబింబించే గ్రహము.
ఆంగ్లేయులు, జర్మనులు గ్రహము అంతరిక్షములో నెలకొన్న "యుద్ధ దేవునిగా" (గాడ్ ఆఫ్ వార్) ఆరాధించడమే విశేషము. పురాతన గ్రీకులు "డే ఆఫ్ అరెస్" మధ్యకాల నాగరీకులుటివిస్ డేఅని వారి వారి సంప్రదాయములలో వివరించితే మన వేదములు "ధరణీ గర్భ సంభూతం" అని మంగళ గ్రహమును బ్రహ్మ సృష్టి రచనను విశదీకరిం చడమైనది.



వెడ్నెస్ డే (వుడ్ నెస్ డే)
 సప్త దినములలో తృతీయ దినముగా వార మధ్యములో నెలకొన్నది. సూర్య గ్రహమునకు  అతి దూరములో మెరిసే అతి చిన్న గ్రహము. జర్మనుల పరిశోధనల ప్రకారము వారి దేవుని పేరు "వోడెన్" ఆతని పేర "వోడెన్స్ డే" గా నామాంతరము చెందినది. గ్రహదేవత ఉపయుక్తకరమైన సందేశములను ఇతర దేవతలకు చేరవేసే ముఖ్య ప్రతినిధిగా ప్రతిష్ఠాపితమై "మధ్య గ్రహము" గా పేరొందినది. అందువలన "వుడేన్స్ డే" వార మధ్యములో నెలకొన్నది. రోమనుల శాస్త్ర రీత్యా మెర్క్యురీ గ్రహము వాణిజ్య, వ్యాపార, ప్రయాణ, విజ్ఞాన పరిశోధనలకు ప్రతీకగా నిలచినది అని ఆరాధనలు చేయగా మోస పూరితమైన పరిశోధనలను, దొంగ తనములను, దోపిడీలను అణచివేయుటకు అతి శక్తివంతముగా పోరాడి విజయమును సంప్రాప్తింప చేయును అను వారి విశ్వాసమునకు ఊపిరిపోసినది.

థర్స్ డే (తోర్స్ డే)
సప్త దినములలో చతుర్ధ స్థానమును అలంకరించిన  అతి ముఖ్యమైన దినము. "జూపిటర్" అను పేరుతో విశ్లేషించబడి "జూపిటర్ డే" అని నామాంకిత మైనది. రోమనులకు "పున్రెస్ డేజ్" "పునర్" అనగా "పిడుగు" ఆంగ్లములో "తోర్" అని పిలువబడి "తోర్స్ డే" రూపు దాల్చినది.


గ్రహ ఆరాధ్యము యొక్క ముఖ్యోద్దేశ్యము ప్రకృతి తన భీభత్సములో కురిపించే పిడుగులు సర్వ మానవాళి జీవనమును అతలా కుతలము చేసి సర్వ వినాశనమునకు దోహద పడటము మానవ విజ్ఞతకు అందని దూరములో నిబిడీకృతమై ఉన్నది. మన పెద్దలు పిడుగుబారి నుండి తప్పించుకొనుటకు మరియు రక్షణకొరకు "అర్జున, ఫల్గుణ, పార్ధ, కిరీటి, శ్వేతవాహన భీభత్సో, విజయో, కృష్ణ, సవ్యసాచి, ధనుంజయః" అని దసనామ స్మరణ చేయమనుటకు కారణము అర్జునుని వద్ద రక్షణ కవచము ఉన్నది అనునది ఒక ప్రగాఢ నమ్మకము. అందువలన సర్వజన సురక్షితము కొరకు గ్రహమును ప్రార్ధించే సద్గుణము మన సంస్కృతిలో ప్రతిఫలిస్తున్నది.

ఫ్రై డే
సప్త దినములలో ప్రతిబింబించే పంచమ దినముగా నెలకొన్నది. పురాతన గ్రీకుల, రోమనుల సంప్రదాయములలో, శాస్త్ర పరిశోధనలలో "డే ఆఫ్ అఫ్రోడైట్" గా వర్ణించిరి. "అఫ్రోడైట్" గ్రీకులు ఆరాధించే సౌందర్య దేవత. ఆమెపేరుతో "అఫ్రో డే" గా రూపాంకిత మైనది. ఆమె స్వర్గము నుంచి భువికి దిగిన రూపవతి. అతి సౌందర్యానికి, సంసారిక సుఖ శాంతులను ధరణిపై సర్వజనులకు ప్రసాదింప చేయుటకు సముద్ర  నురగల నుంచి అవతరించిన దేవిగా నుతించుట వారి సంప్రదాయ చిహ్నము. ఈమె సముద్ర ప్రయాణీకులను సర్వదా కాపాడుతుంది అనునది వారి ధ్రుఢమైన నమ్మకము.



"అఫ్రో" అనగా "నురగ" (ఫోం) ఆంగ్లో సక్సేనులచే ఆరాధింపబడు దేవత "ఫ్రిజి" అనగా ప్రకాశ వంతమైన నక్షత్రము. ఆమె సౌందర్యమునకు గురుతుగా "ఫ్రిజి డే "ఫ్రై డే" గా అభివర్ణించిరి. మన వేదములు "లక్ష్మీ దేవిని" "క్షీర సముద్ర రాజ తనయా" అని కీర్తించడము ఒక విశేషమైతే ఆమె ఉధ్భవించినది సముద్ర నురగల పైనే మరియు శుక్రవార దినము  కావడమే హిందువుల సంప్రదాయమునకు ప్రాణ సమానము. హిందూ సంస్కృతి ప్రకారము ఏస్త్రీ అయినా అందముగా సంప్రదాయ సుమంగళ చిహ్నములతో శోభిల్లుతే ఆమెను సంపదల నొసగే దేవత అని లక్ష్మీదేవితో సరిపోల్చడము మనదైన నమ్మకము.
ఇస్లామిక శాశ్వత మఠాధిపతుల సంఘ ప్రవక్తలు శుక్రవారమును అతిపవిత్రమైన షట్ దినముగా భావించడము ఒక నిబద్ధత. "సలాల్-అత్-జుమహా" అనునది ప్రతీ ముస్లిం మధ్యాహ్న సమయములో తప్పక మసీదులో చేసే ప్రార్ధనకు హాజరుకమ్మని ఆహ్వానించడమే సమయములో దినమున "అల్లా" స్వర్గము నుంచి భువికి దిగి వచ్చి  మనుషుల పాపములను క్షమించి వారిని పుణ్యవంతులుగా తీర్చి దిద్దడము ఒక విశేష నమ్మకము అయితే సమయములో చేసే ప్రార్ధన అంతరిక్షములో సూర్యునిపయన నిబద్ధతను రోజులో ఐదు కాలపట్టికలుగా (టైం జోన్స్) విభజించి ప్రత్యక్ష దైవమైన సూర్యుని దినములో ఐదు పర్యాయములు ఐదు సమయములలో ప్రార్ధించు సంప్రదాయమునకు వారి ఆధ్యాత్మికతకు నిదర్శనమే.

సాటర్డే
సప్త దినములలో వెలసినషట్" దినముగా ఆరాధింపబడు  అతి పవిత్రమైన రోజు. రోమన్స్ మరియు ఇటలీ దేశస్థులు గ్రహమును వ్యవశాయ అభివృద్ధికొరకు (గాడ్ ఆఫ్ అగ్రికల్చర్) గా ఆరాధించడము ఒక సంప్రదాయము. అవనిపై సంతోష తరంగములు వెల్లువయ్యే కాలములో భూమి అతి తేజస్సుతో వెలుగులు చిమ్మే కాలములో "సాటర్న్" పరిపాలన గావించెను



అను రోమనుల నమ్మకములను సదా నిలుపుటకు నేటికీ ఆదేవతను "సాటర్ డే" రూపములో వారములో నిలిపి స్మరించుట వారి విజ్ఞతకు ఒక నిరూపణమైతే ఆహారము జీవుల ప్రాణములను నిలుపుటకు ముఖ్య అవసరము అనునది వారు గ్రహించిన తిరుగులేని సత్యము. సకాల వర్షముల మరియు సకాల పంటల సంవృద్ధికి ఎంత విలువలు ఇచ్చేవారో నాటి కాలములోని ప్రపంచ ప్రవక్తలు, ప్రతినిధులు ప్రకృతి రక్షణ ఎంత అవసరమో జనతకు విశదపరచిన రీతిని సుగమ మార్గములో అనుసరించడము సృష్టిని పరిరక్షించడము మనదైన కనీస కర్తవ్యము, బాధ్యత. రోమన్ దేవతా మూర్తి "సాటర్న్" తన అనుచరుడైన "టైటాన్ క్రోనస్" మరియు "చా ఒలింపియన్స్" తో కూడి దిన ఆవిర్భావమునకు తోడుగా నిలిచెను. లాటిన్ లో "సాటుర్ని" (డేఆఫ్ సాటుర్న్) ఆంగ్లో సక్సన్ లో "సాటర్ నె డిఎజ్" గా నామాంకితము చేసిరి.
సండే

సప్త దినములలో సప్త స్థానములో వెలుగులీనే సండే అత్యంత విశేషములను అలరించు కొన్నది. "బైబిల్" ప్రకారము  “సబ్బత్ డే" "దేవునియొక్కదినము" మరియు "విశ్రాంతిదినము" గా పరిగణింప బడినది. కారణము ఆరు దినములు భగవంతుడు సృష్టికార్యమును జరిపి విశ్రాంతి లభ్యపరచుట కొరకు దినము "విశ్రాంతి దినముగా వివరించడము ఒక విశేషమైతే క్రైస్తవులు దినములో దేవుని సన్నిధిలో ఆరాధనలు చేసి తమను తాము పుణ్యవంతులుగా తీర్చిదిద్దు కొనడము మరియు తమదైన రీతిలో సంస్కృతీ సప్రదాయములను కాపాడు కొనడము అను ప్రక్రియ నాటినుంచి నేటివరకు తప్పక అచరించబడటము అను ఒక నియమమును కాపాడుటకు వారు తమ ప్రార్ధనా మందిరమునకు (చర్చి) సండే హాజరు కావడము వారి జీవనశైలిని ప్రతిబింబించడము అధ్భుత విశేషమే. జగతిలో జరుగు పాపపుణ్య విచక్షణలను వెలికితీసి ప్రజలను సన్మార్గములో నడుపుటకు ధర్మ సంస్థాపనకు దోహద కారులుగా చర్చి అధికారులు ఆలంబనముగా నిలచి తమ కర్తవ్యమును నిర్వహించడము ఎంతో ప్రశంసనీయము.


గ్రహములయొక్క సంచారములు మనుష్య జీవనముపై వారి జాతక ప్రభావమును సాముద్రిక శక్తులను, దేశకాల పరిస్థితుల పైన, నాయక ప్రతినాయకుల పైన తమ దుష్ప్రభావములను ప్రసరింపచేస్తాయి. అందువలన వాటిని శాంతి పరచుట కొరకు అధిష్ఠాన దేవతలయొక్క, ఆశీస్సులకొరకు, యజ్ఞ యాగ జప తపములను ఒనరించుట వారి వారి సంప్రదాయములలో ఏమతమైన, ఏభాష అయిన, ఏప్రాంతమైన, ఏదేశమైన తప్పదే ఆచరించుట, ఆచరింపబడుట అన్నది నాటికీ, నేటికీఎప్పటికీ నిలిచిఉండే శాస్త్ర పూరితమైన సంప్రదాయములు అని నేనంటాను. మరి మీరేమంటారు?

2 comments: