"సప్త మాతృకల దీవనలే అశేష భక్తులకు రక్షణ కవచములు"
విశ్వ నిర్వహణ శక్తిని జగన్మాతగా దర్శించి వేద పురాణములు మహాశక్తిలో ప్రభవించిన వివిధ రూపములకు వాటి ఉపాసనా విధులను ఏర్పరచడము జరిగినది. శ్రీదేవి భాగవత వర్ణనలో శంభు నిశుంభాది అసురులను అమ్మవారు సంహరిస్తున్న సమయములో భయంకరమైన అసుర సేనలను నిర్మూలించడానికి బ్రహ్మాది దేవతలలోని శక్తులు సప్త మాతృకలుగా ఆవిర్భవిం చడము జరిగినది.
1. బ్రహ్మదేవునిలోని శక్తి- బ్రాహ్మిణి
2విష్ణుదేవునిలోని శక్తి- వైష్ణవి
3.మహేశ్వరునిలోని శక్తి-మాహేశ్వరి
4.స్కందునిలోని శక్తి-కౌమారి
5.యజ్ఞవారాహస్వామిలోని శక్తి-వారాహి
6.ఇంద్రునిలోని శక్తి-ఇంద్రాణి
7. అమ్మవారి బ్రూ మధ్య నుంచి ఆవిర్భవించిన శక్తి – చాముండి (మహాకాళి)
ఒకేశక్తి తాలూకు వివిధ వ్యక్తీకరణలు ఆధ్యాత్మిక సాధనలోని పురోగతి క్రమములో మనలో జాగృతమయ్యే శివశక్తులు ఈ సప్త మాతృకలుగా రూపుదిద్దు కొన్నవి. వీరు దేవీ శక్తితో సమానమైన విలువలు, మహిమలు కలిగి ఆమెలో అంతర్లీనమై ధైర్యసాహసములు వివిధ నామములతో అవతారములు దాల్చి శక్తితో సమానమైన
ధైర్య సాహసములు కలిగి ఇలపై ధర్మాన్ని సుస్థాపితము చేయుట అను బృహత్కార్యము జరిగినది. తదనంతరము శక్తిమాతలో ఏకమైన ఈ సప్త మాతృకల మహిమలను అతిక్లుప్త రీతిలో వివరించడమే ఈ వ్యాస ముఖ్యోద్దేశ్యము.
1.బ్రాహ్మిణి
"ఓం బ్రాహ్మిణీ విద్మహే - మహాశక్తైశ్చ్య ధీమహీ - తన్నోదేవీ ప్రచోదయాత్"
బ్రహ్మదేవునిలోని శక్తి మరియు వర్చస్సుతో అవతరించిన ప్రధమ మాతృక రూపమే "బ్రాహ్మణి” అనంత ఆకాశములో విశాల హృదయములో అవ్యక్తానందముగా ప్రతిబింబించే శక్తిమయి బ్రాహ్మిణి కంఠాది ఉపాధులతో ఈ నాదమే స్వరాక్షరములుగా శభ్ధ రూపముతో వ్యక్తము అవుతుంది. సర్వ శాస్త్ర జ్ఞానములకు మూలమైన ఈ శభ్ధస్వరూపిణిని ఉపాసించడము జ్ఞానదాయకము. చతుర్ముఖ రూపముతో సువర్చస్సుతో కుడి చేతిలో శూలము ఎడమ చేతిలో అక్షమాల ముందు భాగ కుడి చేతిలో అభయ ఎడమ చేతిలో వరద ముద్రలతో కమలముపై ఆశీనురాలై హంస వాహినిగా పీతాంబరమును ధరించి పలస వృక్షము క్రింద సుశోభితముగా నెలకొన్న దేవిని "అంసుమద్భేగమ" అని వర్ణించిరి.
"ఓంకారములో వెలసితిని బ్రహ్మనాల్కపై నిలచితిని" విద్యాభ్యాస సమయములో అక్షరాభ్యాస మహోత్సవములో "ఓంకారం" నాలికపై గురువుగారి ద్వారా వ్రాయించుకొనే సంప్రదాయము మన దేశములో కొన్ని ప్రాంతములలో ఉన్నది. సరస్వతీ కటాక్షముతో తమ సంతానము విద్యావంతులుగా మారాలి అనునదే ఈ సంప్రదాయములో సుశోభితమైన ప్రగాఢ విశ్వాసము.
2.వైష్ణవీదేవి
"ఓంశ్యామవర్ణాయ విద్మహే: చక్రహస్తాయ ధీమహీ; తన్నో వైష్ణవీ ప్రచోదయాత్"
సప్త
మాతృకలలో ద్వితీయ శక్తి రూపిణిగా వెలసినదేవి "వైష్ణవి". శ్రీ మహావిష్ణువు అంశతో ఆవిర్భవించిన శక్తి రూపిణి. విశ్వమునందు తేజస్సుతరంగాలుగా వ్యాపించి అన్నివస్తువులను ప్రకాశింపచేసే అధ్భుత శక్తిగా స్థితికారణ శక్తిమయిగా వేదములు అభివర్ణించినవి. శంఖ, చక్ర అభయ, వరద హస్తములతో అత్యంత సుందరమైన ముఖవర్చస్సుతో నలుపు రంగు శరీర చ్చాయతో, అందమైన కనులతో పసుపు వర్ణ పీతాంబరమును ధరించి శిరస్సుపై కీర్తి మకుటముతో అనేక సువర్ణాభరణములను ధరించి రజ వృక్ష నీడలో సేద తీరుటకు ఆశీను రాలై భక్త కోటిని సర్వదా తన కృపాకటాక్షములతో కాపాడుట ఒకవిశేషమైతే శ్రీ మహావిష్ణువు ధారణచేసే "వనమాల" అలంకరించుకొని భారత దేశములో "త్రికూటపర్వతము" పై నెలకొన్నరూపమే "వైష్ణవి" విష్ణు శక్తితో ప్రభవించిన "వైష్ణవి" మాయాస్వరూపిణిగా అసురసం హారానంతరము శక్తిలో లీనమైనది.
3. మహేశ్వరి
“ఓంవృషాత్ వసాయ విద్మహే - మిరుగహస్తాయ ధీమహీ - తన్నో మహేశ్వరీ ప్రచోదయాత్ "
సప్త
మాతృకలలో తృతీయ శక్తి రూపిణిగా అవతరించిన దేవి "మహేశ్వరి”. మహాశివుని యొక్క అంశతో ఇలపై అసురసంహారము కొరకు ధర్మసంస్థాపితము కొరకు ప్రభవించినది కావున "మహేశ్వరి" అని నామాంకితమైనది. ప్రతీ హృదయములో వెల్లువయ్యేస్పురణే (అహం) నేను అను అహంభావము. ఈ భావచైతన్యమే "మహేశ్వరి". సృష్టిలోని సర్వ భూతములలోను నెలకొనిఉన్నది. ఆదిదంపతులుగా కీర్తినొందిన ఈశ్వరి ఈశ్వరుల ప్రేమానురాగములే అవనిపై సుప్రశిద్ధము. వారి భిన్నత్వములోని ఏకత్వకలయికని ఏకరూపముతో ప్రతిబింబించడమే అర్ధనారీశ్వర స్వరూపము. శివుని రౌద్ర రూపమునుండి ఆవిర్భవించిన శివుని శక్తిగా రుద్రాణి, రౌద్రి, మహేషి అను నామములతో ఋగ్వేద, మత్స్య, మార్కండేయ పురాణములలో కీర్తించబడినది. రౌద్రమూర్తిగా వెలసిన శివుని సర్వజగత్తును తన తీక్షణజ్వాలలతో సర్వనాశనము చేసే రుద్రరూపము నుండి వెలసిన శివశక్తి రూపమే "మహేశ్వరి". నంది వాహనముపై శ్వేతవర్ణముతో సుశోభిల్లుతూ త్రినేత్రధారిణిగా చతుర్భుజములతో త్రిశూలము, డమరు, అక్షమాల, పానపాత్రలతో ఆవిర్భవించినది. అలంకారములుగా కపాలమాల, నాగాభరణము, అర్ధచంద్రాకృతిలో వెలిగేచంద్రుని శిరస్సుపై వామభాగమున ధరించి భక్తకోటికి రక్షణ కల్పించి అసాధ్యమైన, అనవతరమైన సమయములో తన ఉనికిని ప్రదర్శించే దేవి. కరుణామయి. నృత్య, వాద్య,
సంగీత ఘోషణలతో సర్వదా ప్రసన్నమౌతుంది, స్కంద పురాణోక్తి ప్రకారము శ్రీ చక్రవాశినియిన శ్రీమాతకు మహేశ్వరి అసురసంహార సమయములో సహాయకురాలిగా ఆవిర్భవించిన శక్తి.
4.కౌమారి
"ఓంశిఖివాహనాయ విద్మహే శక్తిహస్తాయ - ధీమహి తన్నో కౌమారి ప్రచోదయాత్"
సప్త
మాతృకలలో చతుర్ధ శక్తిస్వరూపిణిగా అవతరించినదేవి "కౌమారి" స్కందునిలోని అంశతో అసురసంహారము కొరకు
కుమారస్వామిలోని శక్తిరూపము కావున "కౌమారి" గా ఇలపై పూజలందుకొన్నది. సాధన ద్వారా బాహ్య మరియు అంతఃకరణములలో స్వచ్చతని ఆపాదించే జ్ఞాన ప్రదాత. పచ్చని శరీరచ్చాయతో శక్తి, కుక్కుటములను ధరించి అభయముద్రలతో వెలసిన రూపముతో నెమలి వాహనముపై ఆశీనురాలై భక్తకోటిని పరిరక్షించుటకు ఊదుంబర (ఫిగ్ ట్రీ) వృక్ష నీడలో వెలసి భక్తకోటిని సంరక్షించు రూపము. ఎరుపురంగు పుష్పమాల ధరించి ఆపదలో శక్తిని మరియు ధైర్యాన్ని
భక్తకోటికి ఆపాదించుదేవిగా నుతించడమైనది.
5. వారాహీదేవి
"వారాహీచ విద్మహే - రత్నైశ్వరీ ధీమహీ - తన్నోదేవీ ప్రచోదయాత్"
సప్త
మాతృకలలో పంచమ రూపమే "వారాహీదేవి" గా అభివర్ణించడ మైనది. యజ్ఞవరాహస్వామి శక్తి నుండి ప్రభవించినదేవి కావున "యజ్ఞ వారాహీ" అని నామాంకితమైనది. మార్కండేయ పురాణము ప్రకారము శుంభ నిశుంభులను దునుమాడి కాశీ నగరమునకు తూరుపు దిశలో గంగానదీ తీరములో నెలకొని "కాశీనగర రక్షకిగా" పేరొందినది. శ్రీ వరాహదేవుని ముఖవర్చస్సు ప్రతిబింబించేలా నల్లని రూపముతో కరండ మకుటమును శిరస్సుపై ధరించి గవ్వలతో అలంకృతమై కల్పవృక్ష నీడలో ఆశీనురాలై హాలము, శక్తి, ఆయుధములుగా ధరించి అభయ, వరద ముద్రలతో భక్తులను అనుగ్రహించేదేవి, కరుణామయిగా అభివర్ణించడమైనది.
ఈమెను రాత్రిసమయములో వామమార్గ తాంత్రిక పద్ధతులలో "రాత్రిదేవత, ధూమవతి, ధూమ్రవారాహి" అను పేరులతో ముప్పై మంత్రములతో ముప్పై యంత్రశక్తులతో ఆరాధించుతారు. కారణము అసురులు రాత్రి సమయములో అతిబలవంతులై శక్తిమంతులై ప్రజ్వరిల్లుతారు. ఈ దేవిని లలితా సహస్రనామములో ఈ రీతి వర్ణించడమైనది. "విశుక్ర ప్రాణహరణ వారాహీ వీర్యవందితా - కిరిచక్ర రధారూఢ - దండనాధ పురస్కృతా" రాక్షసుల స్వభావములు పైకిప్రకటితమౌతాయి. వారికి దాచుకొనే శక్తి లేదు. స్వభావరీత్యా పైకి చిరునవ్వులు చిందిస్తూ లోలోపల కాలకూట విషంకన్నా ప్రమాదకరమైన ఆలోచనలతో ప్రణాళికలు దాచగలరు. "కిరి" అంటే "వరాహము" తన వాడి కొమ్ములతో మనస్సు అనే అగాధములో దాగిఉన్న దుష్టశక్తిని వెలికి తీసి శిక్షించగల సమర్ధురాలు.
భాగవత పురాణములో "దైత్యవారాహి" గా నామాంకితమై సప్త మాతృకలలో ఒకటిగా వెలసి దైత్యులను తన వాడికొమ్ములతో అంతమొందించి శేషనాగ శయనమూర్తి అయిన మహావిష్ణువు అంశతో "వైష్ణవి" గా అవతరించిన శక్తిమయి. ఈమె పొత్తికడుపు చాలా ఎత్తుగా అమరిఉండుటకు కారణము సమస్త భూతలము సురక్షితముగా ఆమెలో నిక్షిప్తమై ఉన్నది. అందువలన “భూగర్భపరమేశ్వరి" అని పేరొందినది.
వ్యాస విరచితమైన "మత్స్యపురాణము" లో ఈమె శివునిచే సృష్టింపబడి "వారాహి" రూపముతో అంధకాసురుని వధించి ధర్మాన్ని ఇలపై నిలిపినది. లలితాసహస్ర నామవర్ణనలో "దండనాయిక శ్రీవిద్య" అనుపేరులతో జ్ఞానప్రతీకగా నిలచి ముప్పై యంత్రములతో, ముప్పై మంత్రములతో ఈమె ఆరాధన విశేష పూజలతో నిర్వహింపబడుట విశేషమే.
శ్రీమహావిష్ణువు దశావతారములలో తృతీయ అవతారమైన వరాహుని వామభాగమున వెలసి "వారాహీ" దేవిగా పూజలందుకొన్నది. ఈ రూపమే పార్వతీదేవి ప్రతిరూపము. సాక్షాత్ యమధర్మరాజు రూపము. దుష్టులను నాశనము చేయుటకు అతి శక్తివంతముగా భయంకరముగా నెలకొన్న రూపము. "శ్రీదేవి మహత్యము" లో వారాహీదేవి రక్తబీజుని వధించి "చండిక" గా వేలకొలది అసురులను వధించి తన అద్వితీయ బలమును నిరూపించుకొన్నది. దేవతలను అనుగ్రహించే దేవిగా శవముపైన అధిరోహించి తన యుద్ధనైపుణ్యతను ప్రదర్శించినది.
భౌద్ధులు "వజ్రవారాహి" "మరీచి" అనుపేరులతో శతృ నిర్మూలనకు ప్రతిరూపముగా ఆరాధించడము విశేషమే.
బ్రిటిష్ సామ్రాజ్ఞ రెండవ ఎలిజిబిత్ మహారాణి బౌద్ధుల ఆరాధనను సమర్ధిస్థూ వారాహీదేవి యోగ తంత్రములతో శివుని నివాసస్థలమైన శ్మశాన నరకము నుండి బయల్వెడలి భువిపై అవతరించిన దేవిగా "వజ్రముఖి" "వజ్రపాణి" అని అభివర్ణించెను.
టిబెట్టియనులు వారాహిదేవిని మనసులోని మోహభ్రాంతి నిర్మూలనకు ఆరాధనలు జరుపుట ఒక సంప్రదాయము.
ఈజిప్టుదేశస్థులు "ఐసిస్" దేవతగా ఆరాధించడము ఒక విశేషమైతే ఈ దేవత తమ్ముడు "సేట్ సుకర రూపము కలిగి ఉండటముతో నాటి నుంచి "సెట్తి ట్రెడిషన్ " సంస్కృతి ప్రారంభమునకు నాందీ కావడము మరియొక విశేషము.
జపాన్ దేశస్థులు "వరాహము" యుద్ధవీరుల శక్తికి, ధైర్యమునకు, మనసులోని స్వార్ధపూరిత ఆలోచనల నిర్మూలనకు (ఇహలోక సంపదలు, శారీరక సౌఖ్యములు) ఆరాధించడము వారి భక్తి ప్రఫుల్లతలకు నిదర్శనము.
తొమ్మిదవ శతాభ్ధములో ఒరిస్సా దేశములో పూరీ క్షేత్రములో "మత్స్యవారాహి" గా ఆరాధింపబడుట ఒక సంప్రదాయము. కారణము ఈ సీమ సముద్రతీర సమీపమున నెలకొని ఉన్నది. పెనుతుఫానుల కారణముగా ఈదురుగాలులు విరుచుకుపడి అల్లకల్లోలము చేసే ప్రాంతము కావున ఈ దుష్పరిణామములను అరికట్టుటకు, ఈమెను ఆరాధించడము ప్రకృతి భీభత్సముల నుండి జన రక్షణ కొరకే అనునది ఒక నమ్మకము.
తమిళనాడులో బృహదేశ్వరాలయములో ప్రతె పౌర్ణమిరోజూ పవిత్రదినముగా భావించి "ఉత్తరభవాని" గా, గుజరాత్ లో "గోత్రదేవి" గా (దదానియా) భక్తపూర్ లో "జయవారాహి" గా నేపాల్ దేశములో "బారాహి" గా వెలసి పూజలందుకొను దేవిగా వినుతికెక్కినది.
అమెరికాలో ఫిబ్రవరి 2005 లో అంబికా హోమం నిర్వహించి యంత్ర ప్రాణ ప్రతిష్టలతో వారాహీదేవిని ప్రతిష్ఠించి ఆరాధించుట వారి భక్తితత్పరతలకు అధ్భుత నిదర్శనమే.
మలేషియాలో వారాహీదేవి పూజలు "లూనాస్ కేదార్" అను పేరుతో భక్తి శ్రద్ధలతో ఆచరింపబడుట అనువైనము నేటికీ ఉన్నది.
లాటిన్ భాషలో "డెలిగేటర్స్ డెలిగేర్" అనగా ఎవరికైనా అధికారపూర్వకముగా పదవి లోనికి తీసికొని రావడానికి సాక్షీభూత ఆధారములతో సక్రమ రీతిలో కార్యకలాపములను నిర్వర్తించడానికి తగు అధికారము సంప్రాప్తింపచేసే పరీక్షా విధానమే మరియు శతృ నిర్మూలమునకు ధైర్యానికి, శక్తికి ప్రతిరూపమే "వారాహీదేవి అవతారము.
సృష్టికర్త అయిన బ్రహ్మకు మతసంభంధిత విభేధములు లేవు. "ఇసవశ్యం - ఇదం సర్వం” అను భావనతో “యత్కించౌ - జగత్యం జగత్” అను రీతిలో సకల జీవరాసులను సృష్టించెను. సృష్టి ఆరంభములో వరాహ రూపమునకు కోరలు లేవు. కానీ హిరణ్యకశిపుని వధించుటకు మరియు ఒకానొక సమయములో అవని సముద్రములో మునిగిన సమయములో శివుని కోరికపై శ్రీ మహావిష్ణువు ధరణిని తన కోరలపై నిలిపి అతి బలవంతుడైన
అసురునితో వేయి సంవత్సరములు
అతి భయంకర యుద్ధము ఆచరించి హిరణ్యకశిపుని దునుమాడి ధరపై ధర్మము నిలిపెను. తదనంతరము సృష్టికర్త అయిన బ్రహ్మకు ఇలపై సృష్టి రచనకు సుగమమైన మార్గము ఏర్పరచడమైనది.
"ఓం గజధ్వజాయ విద్మహే - వజ్రహస్తాయ ధీమహి తన్నో ఇంద్రాణి ప్రచోదయాత్"
సప్త
మాతృకలలో వెలసిన షష్టమ రూపమే "ఇంద్రాణి" దేవలోకాధిపతి అయిన దేవేంద్రునిలోని శక్తితో దుష్టశిక్షణకు, శిష్టరక్షణకు ఇలపై అవతరించిన శక్తి స్వరూపిణి "ఇంద్రాణి". జగత్ రక్షణకు కావలసినది వీరత్వం. దుష్టులను సంహరించుటకు కావలసినది శౌర్యముతో కూడిన ప్రతాపము. దౌర్జన్యమును నిర్మూలించడానికి కావలసినది బలము. ఇంద్రుని ఆయుధమైన వజ్రా యుధమును చేతబూనిన దివ్యశక్తిమయి "ఇంద్రాణి".
దేవేంద్రుడు దేవతలకు అధిపతిగా ఏలికగా ప్రభువుగా వర్ణించబడుట తిరుగులేని సత్యం అయితే "ఇంద్రాణి" 'దేవతలకు రాణి" గా ప్రస్తుతింపబడినది. సచీదేవి, అయింద్రాణి, మహేంద్రి, పులోమజ, పులోమిని (అందానికిదేవత) (గాడెస్ ఆఫ్ బ్యూటీ) అను వివిధ నామములతో కీర్తించబడుట అధ్భుతము. అందమైన కనులుకల సుందర రూపముతో ఏనుగులు, సింహములు ఆదిగాగల వన్యమృగముల సమ్మేళనములతో తన జీవితమును గడిపినది.
హిందూ పురాణములు ఇంద్రాణి సౌందర్యమును "అంతము లేని అందం" అని అభివర్ణించడము ఎనలేని కీర్తి ప్రతిష్ఠతలను సంప్రాప్తింపచేసినవి. ఆషాఢ నవరాత్రి దినములలో భారత దేశములో కొన్ని ప్రాంతములలో "అయింద్రాణి" పూజలు శాస్త్రోక్తముగా నిర్వర్తించుట నేటికీ ఒక సంప్రదాయము. ఋగ్వేదము ఆమె అందాన్ని వర్ణిస్తూ ఈర్ష్వ అసూయలను పారద్రోలే సూత్రములతో వివరించినది. మరియు ఆమెను అత్యంత అదృష్టవంతురాలిగా కీర్తించుతూ ఇంద్రుని వలన అతి స్వచ్చమైన సౌందర్యముతో అలరారే ఆమెతో సరిపోలువారు ధరణిపై లేకుండుటయే ఆమె అందానికున్న ప్రత్యేకత.
సచీదేవి పురుష శక్తికి ప్రతిరూపమే అయినా దేవేంద్రుని నీడలా అనుసరించినా కొంత కాలము రాక్షసుల ఆధీనములో (గాడెస్ ఆఫ్ రాత్) గా నిలచి వారి వివిధ అస్త్ర శస్త్రములకు దైవశక్తిని ప్రసాదింప చేయగలిగిన శక్తిమయి కావున దక్షిణ భారత దేశములో ఆమె ఒక అయస్కాంత ఆకర్షణ గల శక్తిమంతురాలిగా సరిపోల్చి ఆరాధించడము నేటికీ జరిగే ప్రక్రియ.
ఇంద్రాణి వాహనము ఐరావతము.
స్వచ్చతకు చిహ్నము. జైనమతానుసారము వారి సంప్రదాయ పద్ధతిలో జైన తీర్ధంకరులు జన్మించిన సమయములో ఆమె దేవేంద్రునితో కలసి ఐరావతమును అధిష్టించి పర్వత ఆరోహణముచేసి వారి సన్నిధికి విచ్చేయడము వారు అధ్భుత విశేషముగా తలపోసి ఈ సందర్భమును అతిగొప్ప పర్వదినము గా వారి మతగ్రంధములో నిక్షిప్తముచేసిన ముఖ్య సంఘఠన.
ఇంద్రాణీదేవి మూడు కనులతో నాలుగు హస్తములతో వజ్ర, శక్తి, అభయ, వరద ముద్రలను దాల్చి ఎరుపురంగు శరీర చాయతో వజ్ర మకుటమును శిరస్సుపై ధరించి విశేష ఆభరణములతో అలంకృతమై శ్వేతవర్ణ సుశోభితమైన ఐరావతముపైన ఆశీనురాలై కల్పవృక్ష నీడ తన నిలయముగా భావించి సేదతీరు రూపములో భక్తకోటికి దర్శన భాగ్యము మరియు వారి కోర్కెలను సిద్దింపచేయు ఇంద్రాణి వైభవమును వర్ణించుట అలవికానిది.
7. చాముండి (మహాకాళీ)
“ఓం కృష్ణవర్ణాయ విద్మహే - శూలహస్తాయ ధీమహీ - తన్నో కాళీ ప్రచోదయాత్"
సప్త
మాతృకలలో సప్త స్థానము అలరించిన అఖండ శక్తిమయి "మహాకాళి". శ్రీదేవి భాగవత వర్ణన ప్రకారము ఆమె భ్రూ మధ్య భాగము నుంచి ఆవిర్భవించిన శక్తి "కాలశక్తి" లేదా "కాళీ" అను నామములతో ఆరాధించడము ప్రత్యేకత.
బ్రహ్మాండ పురాణ వర్ణనలో శ్రీ మహావిష్ణువు ఆదిశక్తి యొక్క నాలుగు రూపములు
"ఆధ్యాశక్తిర్మహే శన్య చతుర్ధా భిన్న విగ్రహా భోగే భవానీ రూపాచ - దుర్గారూపేచ సంగ్రాహే - కోపేచ కాళికారూప - పుం రూపాచ మదాత్మికా"
1. భోగమునందు - భవాని
2.యుద్ధమునందు - దుర్గ
3.కోపమునందు - కాళి
4.పురుష రూపమునందు - విష్ణువు
కలి
యుగములో వెలసిన శ్రీ వెంకటేశ్వరుని "స్త్రీ పుంసరూపాయనమహః" అని అభివర్ణించడమైనది అంతటి మహిమాన్వితమైన ఆకర్షక రూపము ఆదిశక్తి స్వంతమే. అందుకే ఒక కవి తన స్తుతిలో తిరుమలేశుని: "శివరూపమీవంచు చెప్పుదురు కొందరు ఆదిశక్తివటంచు అందురింకొందరు నారాయణుండంచు నమ్ముదురు కొందరు - తిరు వెంకటాధీశ జగదీశ" అని స్తుతించెను. అందు వలన స్త్రీ రూపములోని అమ్మవారి అందము శ్రీ శ్రీనివాసుని ముఖవర్చస్సులో ప్రతిబింబించడమే ఒక అధ్భుతము.
“శుంభ నిశుంభములను సంహరించ సమయము ఆసన్నమవగా దేవి కాళి వైపు చూసి" భయంకర రూపము అతి వికృతమైన ఆకారాన్ని ధరించి నీవు అసురులను పరిమార్చు" అని ఆనతినీయగా కాళికాదేవి ఆయుధములను చేపట్టి వారిని దునుమాడెను. చండ, ముండ అసురులను దునుమాడి "చాముండి" అను నామాంకితమైనది. ఈ దేవతను తాంత్రిక మంత్రశక్తులతో ఆరాధించడము ఒక విశేషమైతే అగ్నిజ్వాలలు ప్రస్ఫుటించు కనులతో త్రిశూలమును కరవాలమును ధరించి పుర్రెల మాలతో అలంకృతమై శ్మశానములో భూతప్రేత పిశాచముల నడుమ పుర్రెలో రుధిరమును త్రాగుతూ నివశించే అతి భయంకర శక్తిరూపిణి. రక్తబీజుని శరీరము నుండి జాలువారే రక్త బిందువుల నుంచి వేలకొలది రక్తబీజులు ఉద్భవము కావడము ఆతనికిఉన్న వరప్రభావము. ఆసురుని సంహారములో నేలపై పడిన రక్త బిందువులను త్రాగి "రక్తకాళి" అని నామాంకితమైనది. తదనంతరము రక్తబీజుని సంహారము సులభతరము కావించినది. తదనంతరము సప్త మాతృకలు తమ అంశలతో సృష్టించిన సప్త శక్తులను తనలోనే కలుపుకొన్నది. అన్నిశక్తుల మమేకమైన ఏక శక్తిరూపమే శ్రీ కాళీమాత.
శ్రీ
లలితా సహస్రనామ వర్ణనలో నెలకొన్న స్తుతి నామములు
"మహేశ్వరీ మహాకాళీ మహాగ్రాశా మహాసనా" దేవి విరాడ్రూపాన్ని ప్రతిబింబింప చేస్తాయి. ప్రళయ కాలములో మృత్యువుని సహితం మ్రింగివేసి సర్వసృష్టిని ఆహారముగా కబళిస్తూ ఆపోసన పట్టగల సమర్ధురాలు.
మహేశ్వరి - మహేశ్వరుని ఇల్లాలు.
మహాకాళీ - మహాకాళేశ్వర క్షేత్రమందు మహాకాళేశ్వరుని ఇల్లాలుగా వెలసిన దేవి.
మహాగ్రాసా - గ్రాసము అనగా “ఆహారము". అమితమైన ఆహారమును తీసికొనగల శక్తిమంతురాలు.
మహాశనా - సర్వచరాచర ప్రపంచమే ఆమెకి ఆహారము.
సంస్కృతములో "కాళి" అనగా “మహిమగలది" అని అర్ధము. ఈ దేవి మహిమలు వర్ణించనలవి కానివి. దర్శన మాత్రముననే భక్త కోటికి అనేక వరములనొసగే కరుణామయి. మహా మంత్ర తంత్రములకు మూలరూపిణి. ధైర్య, శౌర్య ప్రతాపములలో అత్యంతశక్తిమయి అయిన మహాకాళికా దేవిని కరుణించు అని వేడుకొనే భక్త కోటిలోని అజ్ఞానాన్ని తొలగించి విజ్ఞాన సంపత్తులను పెంపొందింపచేయు సుస్థానమే "శ్రీ కాళీనిలయం".
సప్త
మోక్ష పుర క్షేత్రములలో సుప్రశిద్ధమైన "ఉజ్జయిని" నగరములో క్షిప్రా నదీతీరములో ద్వాదశ జ్యోతిర్లింగములలో ప్రముఖమైన మహాకాళేశ్వరలింగము, అష్ఠాదశ శక్తిపీఠములలో ఒకటైన "మహా కాళీ శక్తిపీఠము”
నెలకొన్నవి. సతీదేవి మోచేయి పడిన ప్రాంతముగా విఖ్యాతిచెందినది. మరియు ఈ క్షేత్రము భూదేవి నాభిగా పేర్కొనుటయే విశేషము. జైన మతస్థులు "కులదేవి" అనుపేరుతో ఆరాధనలు జరిపి సస్యాహారమును నైవేద్యముగా సమర్పించడము ఒక రివాజు. హిమాచల్ ప్రదేష్ కంగ్రా జిల్లాలో "రుద్రచాముండి" మైసూర్ నగరములో "చాముండిదేవి" భువనేశ్వర్ నగరములో "కీచకేశ్వరి" అను వివిధ నామములతో విశేషరీతిలో ఈ దేవి ఆరాధనలు ప్రాచుర్యములో ఉన్నవి.
వేదములు శివలింగముల ఆవిర్భావమును ఈ రీతిలో వర్ణించినవి:
"ఆకాశే తారకలింగం - మర్త్యలోకే మహాకాళం - పాతాళే హఠకేశ్వరం - లింగత్రయ నమోస్తుతే"
"మహా" అనగా గొప్ప. "కాల" అనగా సమయము. సృష్టికి అంతుపట్టని కాలములో వెలసిన మహాకాళుని ఎదురుగా వెలసిన మహాకాళి నేటికీ నిర్విఘ్నముగా పూజలందుకొని భక్తకోటిని సంరక్షించడమే ఒక అధ్భుతము. మహాకాలుని ఎదురుగా మహాకాళి చేసే నృత్యమే భక్తకోటికి "ఆనందమోక్షపురి" "మహాపురి" "శివపురి" గా ప్రసిద్ధిచెందినది. అసుర సంహానంతరము ఉగ్ర రూపములో ఉన్న కాళికాదేవిని శాంతి పరచుటకు మహేశ్వరుడు ఆమె ఆగమించు దారిలో నేలపై శయనించెను. ఆమె పదములు ఆతని ఎదను తాకిన తక్షణము ఉగ్రరూపము
అదృశ్యమై శాంత రూపిణిగా నెలకొన్నది
అనునది ఒకపురాణ సంఘఠన.
వ్యాసవిరచితమైన భవిష్య పురాణములో పరమభక్తుడైన "కాళీవర్మ" వంగ దేశమును పరిపాలించు కాలములో "కాళికాదేవిని" భక్తితత్పరలతో ఆరాధించగా కొంత కాలమునకు ఆ దేవి ప్రసన్నురాలై దివ్యపుష్పములను వర్షింపచేసినది. ఆ పుష్పములన్నీ నేలపై రేఖలుగా ఏర్పడి
వివిధ ఆకృతులలో పరచుకొనగా ఆ రేఖల నడుమ ఒక సుందర నగరము ఏర్పడినది. కాళికా దేవి మహత్యము వలన ఏర్పడిన నగరము కావున నాటికాలములో "కలికాపురి" (పుష్పములతో వెలసిన పురము) అను పేరుతో విఖ్యాతి చెందగా నేడు "కల్కత్తాపురి" గా భారత దేశములో ముఖ్య నగరముగా వ్యాపార విశిష్ఠతలతో అలరారుతున్నది. ఇచట వెలసిన "మహాకాళి" తన వినూత్న మహిమలతో తన దర్శన మాత్రముననే
భక్తులను తన సన్నిధిలో వారి పాపములను "బలి ఇమ్మని" బలిప్రియ" అను నామాంకితురాలై సమస్త మానవాళిని బాహ్య అంతఃశుద్ధులనుకమ్మని తన అశేష దీవనలను కురిపించే దేవి "కాళీమాత".
ఇన్నిమహిమోపేతమైన మహిమాన్వితమైన శక్తులతో అలరారే సప్త మాతృకల ఆవిర్భావములు ధరపై అధర్మశక్తులను నిర్మూలించి ధర్మాన్ని ప్రతిష్ఠాపితమొనరించిన వైనము నాడే కాదు నేడే కాదు ఎప్పటికీ "ధర్మ సంస్థాపనార్ధాయ సంభవామి యుగే యుగే" అను పదముల అర్ధము మహిమోపేతమై ఏ యుగమైనా ధర్మసంస్థాపన అనునది సంభవమే.