Friday, 13 September 2019

సప్త సంఖ్యలవిశిష్ఠతలు - సప్త పతివ్రతలు (12వ విభాగము)


యుగానికైనా
"సప్త పతివ్రతాశిరోమణులేసతీ లోకానికి కర్తవ్య భోధకులు
భారత దేశంలో మానవ కాంతలుగా దైవాంశలతో జన్మించి తమదైన రీతిలో పతివ్రతలుగా అత్యున్నత స్థానములో నిలచిన స్త్రీలు నాడే కాదు నేడే కాదు ఎప్పటికీ అవనిపై తిరుగాడుట మన పుణ్య సంపదే. భారత స్త్రీకి "పతియే ప్రత్యక్ష దైవం" వారి సేవలో తరించి తమ జన్మను సార్ధకం చేసుకొన్న పతివ్రతల మహిమలను వర్ణించడము సామాన్య విషయము కాదు. సప్త సంఖ్యల విశిష్ఠతలతో కూడిన వ్యాసములలో సప్త పతివ్రతల జీవన చరితలను కొన్ని వ్రాయుటకు ప్రారంభించితిని మిగిలినవారిని చులకన చేయడమూ కాదు, నిర్లక్ష్యము అంతకన్నా కాదు.  నా దృష్టిలో కాలమైన పతిసేవలో ధన్యమైన ప్రతీ స్త్రీ పతివ్రతే. నా వ్యాసము పతివ్రతలందరికీ ఆమోద యోగ్యము కావాలని కోరికతో ఆరంభించుతున్నాను

1.సీతాదేవి


రామాయణ మహాకావ్య నాయిక. పతివ్రతలలో ప్రప్రధమ స్థానమలరించిన పుణ్యశీల. సీత గుణసంపన్నతలను వర్ణించుట వాల్మీకి వంటి మహాత్ములకే సాధ్యము. మనలాంటి సామాన్యులకు అంతుపట్టని విజ్ఞాన సంపద. సీతతో మమేకమైన ముఖ్య సంఘఠనలను అతి సామాన్య రీతిలో విశదీకరించడమే వ్యాస ముఖ్యోద్దేశ్యము.

నాగేటి వాలునకు చిక్కినది కావున "సీత" అని జనకుని కుమార్తెగా "జానకి" అని యోని నుంచి జన్మించనిది కావున "అయోనిజ" అని భూమి నుంచి వచ్చి చేరినది కావున "భూజాత"/ధరణిజ" అని మిధిలా రాజ్య యువరాణిగా "మైధిలి" అని వివిధ నామములతో  జనకుని ఇంట పెరిగిన సీత అతి సుకుమారి. కానీ వేల కొలది వీరులు కదలింప శక్యము కాని శివ ధనస్సు నిక్షిప్తమై ఉన్న పెట్టెను అవలీలగా కదలించిన సీత తన ఆటల బంతిని అందుకొనగా అది చూసిన వారలకు విస్మయమే. ధనస్సు ఎక్కుపెట్టిన వీరుడే సీతను చేపట్ట అర్హుడని జనకుడు భావించెను. పరీక్షలో నెగ్గిన శ్రీరామునితో వివాహము అయోధ్యలో కాపురము అన్నీ వైభవోపేతమే. అంతఃపురమైనా కారడవులైనా పతిని అనుసరించుటే సతి ధర్మము అను భావముతో 14 ఏండ్లు వనవాస జీవనము సీతకు ఆహ్లాదకర మైనది. సీత ప్రకృతి ప్రేమికురాలు.

పూలను శిగలో అలంకరించుకొనడమన్నా, జలపాతములలో ఈజాడుట అనినా, పశుపక్ష్యాదులతో సంభాషణలనినా ఆమెకు అత్యంత ప్రీతికరము. సరయూనది దాటి గోదావరి వరకు చేరిన సీత పతివ్రతా శిరోమణి అయిన అనసూయ వద్ద ఎన్నో పతివ్రతా ధర్మములను ఆకళింపు చేసుకొన్నది. పతి ధనహీనుడైనా, ధనవంతుడైనా ఒకే రీతి గౌరవం మన్నన సతి నుంచి పొందగలగాలి అన్న సూత్రం జీవితాంతము వరకు మరచి పోలేదు. ఎప్పటికీ రంగు మాయని, చిరగని దేవ వస్త్రములు నగలు సీతకు బహూకరించినది. అవి వనవాస సమయములో సీతకు ఎంతో  ఉపయుక్తకరమైనవి. తాత్కాలిక ప్రలోభానికి లొంగి మాయలేడిని  కానుకగా కోరిన సీత జీవన శైలినే కూకటి వేళ్ళతో కూల్చి వేసినది. తల్లిలా భావించే లక్ష్మణుని అనుమానించి నిందించడము, లక్ష్మణ రేఖను దాటి రావడము సీతలో మామూలు స్త్రీ జాతి గుణములే కనపడతాయి. రావణుని ఆగమనం సీతారాముల ఎడబాటుకి నాందీ. యుద్ధమూ చూడని సీత రావణ జటాయువుల  యుద్ధతీరుని చూసి భయ కంపితురాలు అయినది.

రావణ చెరలో కన్నీరు మున్నీరుగా రోదిస్తూ నిరంతరం రామధ్యానంతో క్షణమొక యుగముగా గడిపినది. సీత ఆత్మస్థైర్యం, సహనం, ఆమె జీవితములో ఎచటను ప్రస్ఫుటించక పోయినా రావణ చెరలో వంటరిగా, తన వారందరికి దూరముగా గడపటం ఆమె నిర్భీతిని, ఆత్మ రక్షణ శక్తిని వాల్మీకి ఎంతో అర్ధవంతముగా వివరించెను. రాక్షసమాయలకు, బెదిరింపులకూ చెదరని సీత రావణుడు తనని ఏమిచేస్తాడో తెలియక పోయినా తన నగల మూటను వానర సమూహముల నడుమ వేయగా శ్రీరామునికి ఆనవాలు చిక్కినది.

హనుమ ఆగమనముతో స్వాంతన పొందిన సీత శ్రీరాముని అంగుళీయకమును వీక్షించి అమిత ఆనందము పొందినది. తన జీవితములోని ప్రతీ విషయమును హనుమతో విశదముగా వివరించిన సీత, రామునకు ఆనవాలుగా చూడామణి సమర్పించినది. అంత నిస్సహాయ స్థితిలోను హనుమ మూపుపై కూర్చుని రాముని సన్నిధికి చేరటము ఊహ మాత్రములో కూడా అంగీకరించ లేదు. శ్రీరాముడే వచ్చి తనని చెర విడిపించడము రఘువంశ గౌరవమని హనుమతో తెలిపినది. సమయములో సీతలో రాముని చూసిన హనుమ తిరిగి కిష్కింద చేరి రామునిలో సీతను కని పరవశుడాయను. భక్తితత్పరులతో వారి అనురాగ దాంపత్య రీతిని కనిన హనుమ వారి ఇరువురిని తన హృదయములోనే ప్రతిష్టించు కొనుట ఒక ముఖ్య సంఘటన.

రావణుడు తనతో సంభాషించు సమయములో వైదేహి గడ్డి పరకను నిలిపి తన దృష్టిలో ఆతని విలువను తన ద్వేషాన్ని ప్రస్పుటింప చేసినది. తన జీవితాన్ని రెండు నెలలలో పరిసమాప్తం చేయుదునని రావణుడు బెదిరించినా రాముని చేతిలో రావణ వధ తధ్య మన్నది ధరణిజ ధైర్యంగా ఆధారము లేకపోయినా రామునిపై గల నమ్మకంతో.

యుద్ధానంతరం ఆనందంతో రాముని సన్నిధి చేరబోయిన సీత విముఖుడై నిలచిన రాముని చూసి విచలిత అయినది. తనకు అగ్ని పరీక్ష అని తెలిసి నిప్పులో దూకడానికైనా సిద్ధపడినది కానీ శ్రీరాముని అపవాదుకు గురి కానీయ లేదు. “సీత నిప్పు. నిప్పుని నిప్పు కాల్చ లేదు" అని అగ్నిదేవుడే అగ్ని పునీత అయిన సీతను రామునకు సమర్పించగా పతి వెనుక అడుగులు వేసినది అయోధ్యకు.

అయోధ్యా వాసులు వేసిన అపనింద మరల సీతారాముల ఎడబాటుకు నాందీ అయినది. గర్భవతి అయినా ఆమె కోరిక మీద కారడవులలో విడిచి రమ్మనిన ఆదేశాన్ని లక్ష్మణుడు శిరసా వహించెను. ప్రకృతికి సమీపాన నిలవాలి అనుకొన్న సీత ఆనందమగ్నురాలైనది. కానీ  రాముడు తనను అపనిందతో పరిత్యజించినాడని తెలిసి తట్టు కొనలేక ఆత్మహత్యకు ప్రయత్నించిన సీత తనకు తానే ధైర్యం తెచ్చుకొని అపనిందతో ఆత్మహత్య హానికరమని తన గర్భంలో ఉన్న రాముని సంతతిని కని తన పాతివ్రత్యాన్ని లోకానికి నిరూపించి లోకమును వీడుట మర్యాదకరమని ఎంచి మనో బలంతో వాల్మీకి ఆశ్రమములో "లోకపావని" అను పేరుతో నిరాడంబర జీవనము గడిపినది. లవ కుశ జననం వారిచే రామ గాన పారాయణ చేయించి సకల విద్యా పారంగతులుగా వాల్మీకి తీర్చి దిద్దెను. రామునిచే సీత పరిత్యాగము కావింపబడినదని తెలిసిన లవ కుశులు అశ్వమేధ యజ్ఞ అశ్వాన్ని బంధించి రామునితో ప్రచండ యుద్ధము చేయ సంకల్పించిరి. రాముడు బ్రహ్మాస్రం వారిపై ప్రయోగించబోగా భూమి కంపించెను. విషయము తెలిసిన సీత నిష్ఠతో చేసే దేవీ పూజను ఎంత అనర్ధదాయకమైనా మధ్యలో నిలిపి వేసి పరుగు పరుగున చేరి యుద్ధమాపించినది. వాల్మీకి ద్వారా లవ కుశులు తన కుమారులని తెలిసు కొనిన రాముడు అక్కున చేర్చికొనగా సీత ఆనంద భాష్పములు రాల్చి తన ముఖమును రామునకు చూపనెంచక చివరిగా ముకుళిత హస్తములతో తల వాల్చుకొని ప్రక్కకు తిరిగి నమస్కరించినది. ఆమెను చూసిన లక్ష్మణుడు అయోధ్య ప్రజలు తమ తప్పు తెలిసికొనిరని వారిని క్షమించి మరల రాజ్యమేలమని కోరగా మృదువుగా తిరస్కరించిన సీత "లోకాపనింద నేటితో ముగిసినది, తన కర్తవ్యం తీరినది" అని సత్య నిరూపణము గావించు కొన్న  భూజాత భూదేవిని ప్రార్ధించు కొనగా భూమి కంపించినది. భయంకర గాలి దుమారములో కనులకు కాన రాని ప్రకృతి విలయ తాండవముల మధ్య భూమిలో చేరినది. దారులన్నీ మూసుకు పోవటము దైవేచ్చ. రాముని వేదనను ప్రకృతి క్షమించ లేదు.

ధరణిజలోని ధైర్యం, స్థైర్యం, అమాయకత్వం, స్వాభిమానం, సుకుమారం, సమయానుకూల సంభాషణ పటిమ, పతిభక్తి, ప్రకృతిలో మమేకమై ఆనందించే ఎన్నో దైవత్వాన్ని ప్రతిబింబించే గుణములు యుగానికైనా ఆదర్శమే అని నేనంటాను. మరి మీరేమంటారు?

2. ద్రౌపది

శ్రీ వేదవ్యాస విరచితమైన పంచవేదముగా ప్రస్తుతింపబడిన మహాభారత గ్రంధములోని "ద్రౌపది" పాత్ర అత్యంత విశిష్టాత్మక మైనది విలక్షణలతో కూడుకొని ఉన్నది. ఆమె ద్రుపదుని యజ్ఞకుండము నుంచి ఆవిర్భవించినది కావున "యజ్ఞసేని" కృష్ణ వర్ణముతో వుండుట వలన కృష్ణ ద్రుపదుని కుమార్తెగా "ద్రౌపది" పంచ పాండవులకు ఆలిగా "పాంచాలి" అని వివిధ నామములతో ప్రశిద్ధి గాంచినది.

త్రేతాయుగ అనంతరము "స్వర్గలక్ష్మి" గా ఒక లక్ష సంవత్సరములు ఈశ్వరునికై ఘోర తపమాచరించినది. కొంత కాలము ఫల భక్షణ, ఎండు అకుల భక్షణ, జల భక్షణ, వాయు భక్షణ చేసి మరి కొంత కాలము పంచాగ్నుల మధ్య (నాలుగు వైపుల అగ్నులు, పైన సూర్యుడు) తపమాచరించగా ఈశ్వరుడు ప్రత్యక్షమై వరము కోరు కొమ్మనగా "పతిందేహి" అని ఐదు పర్యాయములు ఉచ్చరించుట వలన "తధాస్తు" అను వరము పొందినది. జరిగినది తెలుసుకొన్న స్వర్గలక్ష్మి మిక్కిలి విచారించి లోక విరుద్ధమైన ఇట్టి వరమా వద్దు అని ఈశ్వరుని వేడు కొన్నది. దానికి పరమశివుడు రాబోవు యుగములో ఆమె కోరిక ఈడేరుతుంది అని అప్పుడు ఆమె పతివ్రతా ధర్మము ఎంత మాత్రము చెడకుండా ఆమె యవ్వనము, పతిసేవా లక్ష్యం, సౌభాగ్యం సదా వెన్నంటి ఉండును అని అనుగ్రహించెను (ఇది నన్నయ్య భారతములోని వివరణ). తన జీవన పయనములో ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా సడలని ఆత్మ విశ్వాసముతో, సౌశీల్యముతో, కుమార్తెగా, సోదరిగా, భార్యగా, తల్లిగా, మహారాణిగా, రాజనీతిజ్ఞురాలిగా, దాసిగా  మహాభారతములో అత్యధ్భుతముగా వర్ణించబడినది.

స్వయంవరములో ద్రౌపదిని గెలుచు కొన్న పాండవులు ఒక అధ్భుతమైన బిక్షను తెచ్చితిమి అని తల్లి కుంతీదేవికి తెలుపగా ఆమె వెను తిరిగి చూడకుండా తెచ్చిన భిక్ష ఏమిటో తెలియ కుండా ఐదుగురిని పంచుకొమ్మని ఆదేశించినది. వాక్కు ఫలితమే బహుభర్తృత్వానికి నాందీ పలికినది. తదనంతరము ద్రౌపది అగ్ని సాక్షిగా, సంప్రదాయ బద్ధముగా పంచ పాండవులకు ఇల్లాలుగా మారి "పాంచాలి" అయినది.

ఒక స్త్రీ ఒకరి కంటే ఎక్కువ మంది పురుషులతో అనుభవం ధర్మ విరుద్ధము ఏమో అన్న ప్రశ్నలు ఆమెను కలవరపరచగా వ్యాస మహర్షి  ఆమె సంక్షోభమును  తెలిసికొని సందేహ నివృత్తి చేయ సంకల్పించెను. ద్రౌపది  ఆతనిని ప్రార్ధించి అడిగిన ప్రశ్నలు
"యజ్ఞ వేదిక నుంచి జన్మించిన అయోనిజనా!
చలించే అగ్ని జ్వాలవి. నిత్యాగ్నిహోత్రానివి" అనెను.
"వేదవతినా! లేక సీతనా!"
"అంతకు ముందే నీవు ఉన్నావు"
భూదేవినా! శ్రీదేవినా! విద్యాధి దేవతనా!"
నిత్య చైతన్యవతివి. అన్ని రూపాలు దగ్ధమై యజ్ఞజ్వాలలో నుంచి ఆవిర్భవించిన యజ్ఞసేనివి" అనగా ఆమె సందేహములు నివృత్తి కాలేదు. అచటనే ఉన్న శ్రీకృష్ణుడు ఆమె పూర్వ జన్మ స్మృతులు గుర్తుచేయ సంకల్పించి ఈశ్వరవర ప్రభావమే  ఆమెకు బహు భర్తృత్వాన్ని ప్రసాదింప చేసినది కావున వ్యాసుని అభివాదము ప్రకారము ద్రౌపది సతీదేవి, భూదేవి, శచీదేవి, లక్ష్మీదేవి, సరస్వతి, వేదవతి, సీత మరియు ఆదిశక్తి ఆదిగాగల దేవతల అంశలతో రూపు దిద్దుకొన్న ఏకైక రూపమే అని ఆమె జన్మ రహస్యమును వివరించెను. ప్రపంచములో స్త్రీకి లేని విలక్షణరీతిలో పరాక్రమవంతులైన పతులు లభించినా తనలో చెలరేగే కోట్లాది ప్రశ్నలకు ఉత్తర్వులు లభించక పోయినా ద్రౌపది పాండవుల పాదముల చెంత పతివ్రతా ధర్మములు పాలన చేస్తూ తన జీవితమంతా గడిపినది అది అంతఃపురమైనా అడవులలోనైనా.

ఒకానొక సమయములో నారద మహర్షి ఆగమనము చేసి వారి సందేహ నివృత్తి చేసెను అనేక విషయములు వారితో చర్చించి ద్రౌపది విషయములో వారిని ఐకమత్యము పాటించమని ఆమె వలన వారిలో ఎటువంటి స్పర్ధలు రాకుండా జీవించమని తెలుపగా ధర్మరాజు తాము ఏడాదికి ఒకరుగా కాపురము చేయ సంకల్పించితిమి అని నియమ ఉల్లంఘనకు తావులేదని ఒక వేళ నియమోల్లంఘన జరిగితే 12 నెలలు తీర్ధ యాత్రలు జరిపి బ్రహ్మచర్య పాలన చేయుదుము అను నియమముతో ద్రౌపది "పంచభర్తృక" గా మారినది. రీతిలో ద్రౌపది కాలి అందియలు పాండవుల హృదయములలో వసంతాలు పూయించగా ప్రత్యర్ధుల గుండెలలో మరణ మృదంగ ధ్వనులు చేయుట అను విశ్వసనీయత మహాభారతము నిరూపించినది.

అతి ముఖ్య సంఘఠన  భారతములొ యుగములో జరగ కూడనిది జరిగి పాండవుల జీవితాలనే తలక్రిందులు చేసినది. జూద క్రీడలో కౌరవ సభలో ధర్మరాజు ఓటమి. సభలోకి ద్రౌపదిని ఈడ్చుకు రమ్మనగా ఆమె వేసిన ప్రశ్న "ధర్మరాజు మొదలు తానుఓడి తనను ఓడెనా, లేక తనను ఓడి తాను ఓడెనా? చాలా సూక్ష్మమైన ధర్మము ఆమెను కాపాడినది అనుకొన్నా అవినీతి ప్రగల్భాల ముందు ధర్మం ప్రప్రధమముగా అణచి వేయబడినది. "రాజువోడితే ఆతని సర్వస్వమూ ఓడినట్టే" అని కర్ణుని వాదన. అంతేకాక ఆమెను "పంచభర్తృక" “వేశ్య" “దాసి" అని పరిహసించి తమలో ఒకరిని ఆరవ పతిగా ఎంచుకొమ్మని ఎద్దేవా చేసిన వారిని అసహ్యించు కొన్నదేగాని తన భర్తలు తమ శక్తియుక్తులను ఎప్పటికైనా నిరూపించుతారు అను ధృఢ నమ్మకము  ఆమెను సమాజములో ఉన్నత శిఖరములపై నిలబెట్టగా ధీరత్వము మరియు సహనము ఆమె భవిష్య విజయానికి సోపానములు గా మారినవి.

సభలోకి ఈడ్చుకువచ్చి ఆమె వలువలు తీయమని విన్న ఆదేశాన్ని అతిరధ మహారధులు కురు సార్వభౌములు, గురుతుల్యులు శక్తిహీనులై ప్రతిఘటించలేక అసహాయులైరి. సభలో కొందరు ఆమె సౌందర్యాన్ని చూసి భయపడితే, మరి కొందరు జాలిగా చూసేరు, ఇంకా కొందరు తమ చూపులతోనే గుచ్చి గుచ్చి చూడటం పాండవులకు సహించలేని అవమానమే అయినది. కౌరవుల వికృత చేష్ఠల ముందు అవహేళనల ముందు ద్రౌపది చేసిన ప్రయత్నములు ఫలించలేక వైరాగ్యంతో, అచేతన స్థితిలో శ్రీకృష్ణ ధ్యాన నిమగ్నురాలై చేతులెత్తి నమస్కరించుతూ ఆత్మ ప్రదక్షిణ గావించినది. దైవబలం ముందు వారి ప్రయత్నములు విఫలమై చీర కట్టు విడలేదు. శ్రీకృష్ణుని కృపతో చీరలు అక్షయమై ఆమెను చుట్టివేయగా ద్రౌపది తనను తాను తన పాతి వ్రత్యముతో కాపాడు కొన్నది. సమయములో ద్రౌపది జ్వలించే అగ్నిజ్వాలలా కౌరవులను కబళించి తినేసే మృత్యు దేవతలా కనపడినది. సభా సదులందరినీ రక్తంచిందే అరుణ నేత్రాలతో  "కౌరవ వంశం సర్వనాశనం కావాలి" అని శపించబొగా గాంధారీ ధృతరాష్ట్రులు భయకంపితులై ఆమెను శాంత పరచడము తమ కర్తవ్యమని ఎంచి వరప్రదానము గావించిరి. "ధర్మరాజుని దాస్య విముక్తిని గావించమని, భీమ, అర్జున, నకుల, సహదేవులు వారి ఆయుధసమేత దాస్య విముక్తులు కావాలని రెండు వరములను కోరినది. వారు దాస్య విముక్తులు అయితే ప్రపంచములోని శక్తీ వారిని ఆపలేదు అను విషయం ద్రౌపదికి తెలుసు. మూడవ వరము కోరుకొమ్మనగా క్షత్రియ కాంతకు రెండుకన్నా వరములు అడిగే అర్హతలేదని తెలిపిన రాజనీతిజ్ఞురాలు ద్రౌపది. దృతరాష్ట్రుడు ఆమె ఆత్మాభిమానమునకు సంతసించి ధర్మరాజు జూదములో ఓడిన సర్వమూ వారికి సంప్రాప్తింపచేసెను.

కర్ణుడు ఆశ్చర్య చకితుడై "ద్రౌపది పాండవుల కష్టాలను తీర్చి వారిని దాస్య విముక్తులను చేసి అగాధములో మునిగి పోయిన వారిని పైకి తెచ్చిన ఘనురాలు. ధన్యురాలు." అని సభా ముఖముగా ఆమెకు నివాళులను అర్పించెను. భీమార్జునుల భీషణ శపధాలతో సభ దద్దరిల్లినది. పాండవులు కౌరవులు అగ్రహావేశములతో మాటలు వదిలినా ద్రౌపది మాత్రం న్యాయబద్ధముగా శతృవుని సైతం క్షమించి, సహనంలో భూదేవితో సమానమైన ఓర్పుతో కూడిన విజ్ఞతతో నిలచిన ధీమంతురాలు.
సభలోకి ఆమె కురులు పట్టి ఈడ్చుకు వచ్చిన దుశ్శాసుని దుశ్చర్యకు సహింపజాలని భీముడు ఆదురాత్ముని వధించి రక్తముతో ఆమె కురులు ముడి వేసెదనని చేసిన శపధం నెరవేరు వరకు ఎదురు చూస్తూ కురులను విరబోసుకొని నిలచిన ద్రౌపది పౌరుషాన్ని నిరూపించే  సంఘఠన ఇది మహాభారతములో.

పాండవులలో ఒక్కరూ తమ ముఖము ఆమెకు చూపడానికి సాహసించలేదు. విషణ్ణ వదనముతో చలించే ద్రౌపది కాలాగ్నిలా ఎవరిని దహించుతుందో అని భయభ్రాంతులైరి. అశాంతిలో మరల జూదమాడి ఓడిన ధర్మరాజు 13 సంవత్సరముల అరణ్య వాసము, ఒక సంవత్సరము అజ్ఞాతవాస నియమము పాటించుట సర్వ సంపదలను పోగొట్టుకొని పాండవులు సభను వదిలేరు.

అరణ్య వాసములో సూర్యదేవుని ఆరాధించి "అక్షయపాత్రను" పొందిన ద్రౌపది తమను అనుసరించి వచ్చిన వారికి అన్నపానములను సమకూర్చి కన్నతల్లిని మరపింప చేసిన కరుణామయి ద్రౌపది. గంధ మాధన పర్వతముపై ద్రౌపదితో విహరించే సమయములో భీముడు, ద్రౌపది  చేతిలో పడిన సౌగంధికా పుష్పము చూసి ఆమె మనసు పడగా  ఆమె కోరికను ఈడేర్చుటకు కుబేరుని మెప్పించి పుష్పములతో ఆమె దోసిలి నింపి సంతోష పరచెను.

వన వాస దీక్షలో పాండవులు ద్రౌపదిపై అంతులేని ప్రేమాభిమానములు చూపడము శ్రీకృష్ణునితో ఛూడవచ్చిన సత్యభామాదేవి ఆశ్చర్యచకితురాలై తన సంశయములు తీర్చ మనగా భార్యభర్తల సంబంధములు ద్వాపర యుగములో ద్రౌపది  విశదీకరించిన సూత్రములు నేటి కాలానికి కూడా అన్వయిస్తాయి.

పతీ పత్నుల ప్రేమాభిమానములు కలకాలం నిలవడానికి ముఖ్య సూత్రములు:-
1.ఒకరిపై ఒకరికి నమ్మకము.
2.భర్త రాజ్యాలు ఏలే రాజే అయినా, కటిక దరిద్రుడే అయినా అతనిపై అనురాగం చెక్కుచెదర కూడదు.
3. ఎంత అంద వికారులైనా తగు మాత్రం అలంకరణలతో ఇంపుగా సొంపుగా కనపడితే భర్తనే కాదు వారి అనురాగ ఆప్యాయతలను చూసిన ఇతరులు కూడా మంత్ర ముగ్ధులు అవుతారు.
4.అనుమానం పెనుభూతం. సంసారాలను విచ్చిన్నం చేస్తుంది కావున ఎప్పటికీ దంపతులు వారి నడుమ అనుమానానికి తావు ఇవ్వరాదు.
5.శారీరక మానసిక కోమలతలు ప్రతీ స్త్రీకి అవసరమే. భార్యలో సద్గుణము కనిన భర్త ఆనందమగ్నుడు కావడములో సందేహము ఎంతమాత్రము లేదు
6.ఒకరి తప్పు ఇంకొకరు ఎత్తి చూపించుకొని శూలాల వంటి మాటలు విసురుకుంటే సంసారము నరకమే అవుతుంది. కావున  ఎవరు తగ్గినా వారి సంసారం  లోకుల దృష్టిలో ఆదర్శమే అవుతుంది.
7.తనలో విశేషాన్ని భర్త మరీ మరీ చూడాలని తపన పడతాడో భార్య అదే రీతిలో అలంకృతమైతే ఎంత కాలమైనా వారి నడుమ ఆకర్షణ తగ్గదు అని తనదైన రీతిలో ద్రౌపది తెలుపగా సత్యభామ ఎంతో ప్రభావితురాలైనది.

ద్రౌపది తను పాండవులతో అనుభవించిన సంసార సుఖములను తన వరకే పరిమితం చేసుకొన్నది. అది సంసార, సౌందర్య, దాంపత్య అనుభవములను తనలోనే పదిలంగా దాచుకొన్న సద్గుణవతిగా చరిత్రలో నిలచినది. మహాభారతములో ద్రౌపది స్త్రీకి ఏది అనుకూలము కాదో వాటి బారి నుంచి ఎలా తప్పించుకోవాలో తనని తాను ఎలా రక్షించుకోవాలో అన్న ఉపయుక్తకరమైన సందేశములను  నాడేకాదు నేడేకాదు ఎప్పటికీ యుగమైనా ఆదర్శవంతమే అను సత్యము అడుగు అడుగునా తన జీవితములో నిరూపించినది.

అజ్ఞాత వాసములో విరాట కొలువులో రక్షణకరవై కీచకుని చేతిలో అల్లాడినది ద్రౌపది కీచక వధానంతరము రాణి సుధేష్ణాదేవి కనులకు మృత్యుదేవత రూపములో కనబడినది. తక్షణము తమ రాజ్యమును వీడిపొమ్మని ఆమెను ఆజ్ఞాపించినది. పాంచాలి తాను ఎవరు అన్నది క్షణకాలము మరిచి కొన్ని రోజులు తనకు గడువు ఇమ్మని తన భర్తలు విరాట దేశమునకు రాజ్యరక్షణ, ప్రజారక్షణ కల్పించుతారన్న నమ్మకాన్ని ఆమెలో కలిగించి తనను తాను కాపాడుకొన్నది అజ్ఞాత వాసము ముగిసే వరకు సైరంధ్రి రూపములో.

మహాభారత యుద్ధానికి కౌరవుల పాత్ర ఎంత ఉన్నదో ద్రౌపది అంతే భాద్యురాలు. భువిలో పాపభారము అధికమై భూదేవి విష్ణుమూర్తిని ప్రార్ధించగా తాను కృష్ణావతారము దాల్చి అవనిపై పాపభారము కురుక్షేత్ర సంగ్రామము ద్వారా రూపుమాపడం జరుగుతుంది అని భూదేవికి ఇచ్చిన మాటే మహా సంగ్రామానికి పునాది.

అపాండవీయం చేస్తానని కొన ఊపిరితో ఉన్న దుర్యోధనుకి మాట ఇచ్చి నిదురలో ఉన్న ఉపపాండవులను (ద్రౌపది పుత్రులు) వధించిన అశ్వద్ధామ ఘోరకృత్యాన్ని క్షమించిన ద్రౌపదిలొ నిగూఢమైఉన్న క్షమాగుణము మరువలేని సత్యమే.

ధర్మ బద్ధంగా గెలిచిన కురు సింహాసనాన్ని ధర్మరాజుతో అధిష్టించిన ద్రౌపది అజాత శతృవులు, అరివీర భయంకరులు అయిన పాండవులు ద్రౌపది సమేతులై ధర్మాన్నీ, శాంతినీ కలకాలం భారతావనిపై నిలిపిరి. విశేషమైన అనేక యజ్ఞయాగాదులు చేసిన తరుణములో ధరణి నిత్య వేద ఘోష్ఠులతో ప్రతిధ్వనించినది. పాండవ పత్నిగా  ధర్మాన్ని, శాంతినీ కలకాలము భారతా వనిలో నిలిపి అనేక యజ్ఞ యాగాదులు చేసి అవనిపై స్త్రీ జాతి ఔన్నత్యాన్ని నిత్యనూతనపరచి ఉన్నతశిఖరముల పై నిలపినది.

స్త్రీ జాతికి ఆదర్శవంతమై తనదైన సౌందర్యముతో, సహనముతో, ఆత్మాభిమానముతో, ధైర్యముతో అతులిత పతి భక్తితో నిలచిన ద్రౌపది సప్త పతివ్రతలలో అత్యున్నత స్థానములో నిలచి తన జీవనమును ముత్తైదువుగా పాండవుల సన్నిధిలో పరిసమాప్తము చేసుకొన్నది. ఇంతటి మహోన్నతమైన  ఒక మానవ కాంత ధరపై భారతా వనిలో తిరుగాడి ధర్మాన్ని ప్రతిష్టింప చేయడము మనకి గర్వకారణమే ఎప్పటికీ యుగమైనా ఆదర్శవంతమే అని నేనంటాను. మరిమీరేమంటారు?
3.మండోదరి


సప్త పతివ్రతలలో ప్రముఖ స్థానము అలరించిన దైత్యకుల మహారాణి "మండోదరి" మహా పతివ్రతగా కొనియాడబడినది. పాతాళలోక పాలకుడైన మాయాసురునికి మరియు అప్సరస కన్య హేమలకు జన్మించినది. అతిలోక సౌందర్యవతిగా అభివర్ణించబడినది. రామాయణ మహా కావ్యములో కొన్నిపాత్రలు మానవత్వాన్ని మరచి ప్రవర్తిస్తే మరికొన్ని పాత్రలు దానవ కులమైనా మానవత్వాన్ని ప్రతిబింబించేయి. "మండూకము" అనగా "కప్ప" అతి సన్నని సున్నితమైన కప్ప ఉదరము వంటిది కలది కావున "మండోదరి" అని నామాంకితమైనది. మరియొక ఉదాహరణముగా ప్రతీ స్త్రీ  ఉదరము భూమిని పోలి ఉండటము సంతాన సాఫల్యము కొరకే. తన ఉదరములో జన్మనిచ్చే బిడ్డని సురక్షితముగా నిలిపి భూదేవిని మించిన సహనముతో నొప్పిని దిగమ్రింగి జన్మనిచ్చి ఇలపై తీసికొని రావడము సృష్టిధర్మం. కావున "మండనస్య" అను పదము నుండి మండోదరి గా మారినది.

మండోదరి తండ్రి దైత్యశిల్పి.కావున లంకాధిపతి అయిన రావణుడు తనకి ఒక క్రొత్తనగరము నిర్మించమని అడుగుటకు పాతాళలోక మేతెంచెను.అచట మండోదరిని గాంచి ఆమె అందచంద ములకు ప్రభావితుడై వేదోక్తముగా వివాహమాడెను. ద్వాపర యుగములో శ్రీకృష్ణుని ఆనతిమీర పాండవులకు "ఇంద్రప్రస్థ నగరాన్ని" (డిల్లి) నిర్మాణముచేసినది మయుడే. చిత్రవిచిత్రములతో అలరారిన ధర్మరాజు సభామండపము "మయసభ" గా వినుతికెక్కినది. కౌరవులు సైతం. సభానైపుణ్యతను చూసి అచ్చెరువొందిరి.

మండోదరి జాతక ప్రకారము ఆమె మొదటి సంతానము వలన ఆమె భర్తకు ప్రాణహాని కలదని తెలిసిన  మండోదరి తన ప్రధమ సంతానమును విచిత్ర రీతిలో కన్నది. రావణుడు తాను వధించిన మునులందరి  రక్తమును ఒక కుండలో భద్రపరచెను. ఒక దినము మండోదరి నీరు అనుకొని త్రాగి గర్భము దాల్చి ఒక కుమార్తెను కన్నది. రావణుడు తన ప్రాణహరణము చేయు బిడ్డను బ్రతకనివ్వడని తెలిసి ఒక పేటికలో భద్రపరచి సముద్రములో విడచినది. సముద్రుని ద్వారా భూమిలో నిక్షిప్తమైన భూజాత జనకుడు యజ్ఞశాలను దున్నగా నాగేటిచాలునకు చిక్కి "సీత" గా జనకుని ఇంట వెలసినది. రావణుడు సీతను అపహరించి లంకకు తెచ్చినపుడు మండోదరి ఆమెను గుర్తుపట్టి రావణునికి మృత్యువు తప్పదని తెలిసి వగచినది.
ఒకానొక కాలములో వేదవతిని బలాత్కరించబోయిన రావణునితో ఆతని ఇంట పుట్టి ఆతని మృత్యువునకు కారణము అవుతాను అని శపించి అగ్నిలో దూకినది. మండోదరి శాపమును రావణునికి గుర్తుచేసి సీతను రామునికి అప్పగించమని వేడుకొన్నది.

సీతతో సమానమైన రూపురేఖలు గల లావణ్యవతి మండోదరి. సీతను వెదకుచు లంక చేరిన హనుమ రావణ మందిరములో శయనించి ఉన్న అతిలోక సౌందర్యవతి మండోదరిని గాంచి సీత అని క్షణ కాలము భ్రమసెను. మండోదరి పతికి సదా అనుకూలవర్తినిగా జీవన పర్యంతం ధర్మ నిరతితో అంకితమైన పుణ్యవతి. రావణుడు అనేక మంది స్త్రీలతో గడిపినా ధర్మము తప్పి నడచినా ఆతని పట్టపు రాణిగా ఆతనిని సరి అయిన మార్గములో నడుపుటకు శతవిధముల ప్రయత్నించిన సాధ్వి.

మండోదరికి అతివీరులైన మేఘనాధుడు, అతికాయ, అక్షయకుమారులు పుత్రులుగా జన్మించిరి. ఇంద్రుని జయించిన వీరుడు కావున "ఇంద్రజిత్" అని బిరుదాంకితుడాయెను. తనవీర కుమారులకి శతవిధముల రామునితో యుద్ధ విరమణ చేయమనినా వినకపోగా అసహాయురాలైనది.

రావణుడు చివరిపోరులో వారి కులదేవత అయిన "నికుంబలాదేవి" యజ్ఞమును చేయ సంకల్పించెను. యజ్ఞము సఫలీకృతమైతే రావణుని వధ దుస్సాధ్యము. కావున విఘ్నపరచుటకు అంగదుడు మండోదరిని రావణుని సమీపమునకు తీసుకొని రాగా ఆమె రక్షణకై అర్ధించినది. రావణుడు తన యజ్ఞము మధ్యలోనే విరమించి అంగదునిపై కత్తిదూసి యుద్ధమునకు తలపడెను. ఆతను ఒక్క ఉదుటున లంఘించి రావణునికి హితభోధ చేసి రాముని దరిచేరెను.

మండోదరికి ఈశ్వర అనుగ్రహము వలన సర్వసౌభాగ్యములు కలుగచేయు ఒక ప్రభావితమైనత్రికోణాకృతి" లో ఒక మణి ఉన్నది. ఎల్లపుడు తన దిండు క్రింద రహస్యముగా భద్రపరచెడిది. అది ఆమె భర్తకు రక్షాకవచమే. భర్త విజయము కొరకు చివరగామహాగౌరీ వ్రతము" చేయ సంకల్పించగా హనుమ బ్రాహ్మణ రూపములో వచ్చి ఆమణిని దక్షిణగా స్వీకరించెను.
రావణవధానంతరము మణియొక్క మహిమ తెలిసిన రాముడు హనుమను సుదూరతీరములో సముద్ర గర్భములో మానవ శక్తికి భవిష్య కాలములో అందనంత లోతులలో మణిని నిక్షిప్తము చేయుమని ఆనతి ఇచ్చెను. కారణము మణి ప్రభావము నిర్వీర్య పరచుట కొరకు మరియు భవిష్య కాలములో  మానవుల సురక్షితము కొరకే. ఇది భవిష్య కాల సందేహములకు అందనంత విజ్ఞానముతో అలరారు పురాణ ఆయుధముల శక్తియే నేడు భయంకరమైన "బర్మోడాట్రయాంగిల్" (డెవిల్స్ ట్రయాంగిల్) గా మారి నవీన మానవ విజ్ఞతకు అందని విషయ వలయముగా మారినది. ఉత్తర అమెరికా దేశములో ఉత్తర అట్లాంటిక్ మహాసముద్ర సమీపములో ఎగిరే విమానములుగాని, పయనించే షిప్స్ గానీ విచిత్ర రీతిలో మాయ మగుట అనుమానాస్పద స్థితిలో అధ్భుత రహస్యముగా మిగిలిఉన్నది.

యుద్ధానంతరము శ్రీరాముడు మండోదరిని ఓదార్చి ఆమె సతీ సహగమునకు సంసిద్ధపడగా వలదని రాజమాతగా విభీషణుని రక్షణలో గడపని ఆదేశించెను. త్రేతా యుగములో ఆర్యుల సంస్కృతిలో పరిపాలనలో దేశ రక్షణకు మరియు అధికార పూరిత పదవి కొరకు వెలసిన సమాజిక నిభద్ధతలు "సతీ సహగమనము" లేదాపునర్వివాహముఅనునవి ప్రముఖము. రీతిలో మండోదరి విభీషణుని అండలో తనదైన రీతిలో శాంతియుత జీవనము గడిపిన రాజ్య రక్షకురాలు, ధీమంతురాలు, మరియు వివేకవతి అని రామాయణములో వాల్మీకి వర్ణన.

భారత దేశములో వెలసిన సమాజ నీతులు, రీతులు ఆర్యుల సంప్రదాయములు ఎప్పటికీ కాలమైనా సమాజాన్ని అరాచకముల పాలు చేయకూడదని స్త్రీ జీవన పరిరక్షణే తమ ద్యేయముగా నిభంధించబడినవి అని నేనంటాను. మరి మీరేమంటారు?

4.సావిత్రీదేవి



సప్త పతివ్రతలలో ప్రముఖ స్థానమలరించిన పరమ పతివ్రతా శిరోమణి "సావిత్రిదేవి" ఈమె సాక్షాత్ యమధర్మరాజుతోనే సంభాషించి మెప్పించి ఆతని కృపకు పాత్రురాలైనది. ఈమె గురించి వివరములు మహాభారతములో వేదవ్యాసుని ద్వారా వాన పర్వములో వివరించబడినవి. ఒకానొక సమయములో ధర్మరాజు యొక్క సందేహనివృత్తి కొరకై మార్కండేయ మహర్షి సావిత్రి సామాన్య మానవకాంతగా సాధించిన ఘనవిజయములను వివరించెను. అందువలన పాండవులు ద్రౌపదీ సమేతులై అనుభవించు కష్టములు తాత్కాలికమే అని విజయము తప్పక సాధించి రాజ్యసంప్రాప్తకులు కావడము తధ్యమని దీవించెను. ఉదాహరణముగా సావిత్రి జీవన సంఘఠనలు తెలిపి  వారిలో మెదిగే నిరాశ నిస్పృహలను దూరము చేసెను.

మద్రదేశ రాజ్యాధిపతి అయిన అశ్వపతి, మాలతిలకు చాలా కాలము సంతానము లేదు. కావున "సవిత్రు" (సూర్య దేవుని పేరు) ని ఆరాధన చేయగా ఆతని వరముతో జన్మించినది కావున "సావిత్రి" అని నామాంకితము చేసెను. అందమైన, స్వచ్చమైన, పవిత్రురాలైన ధీరమతి అయిన, అతులిత దైవభక్తితో సుశోభితమై అలరారు సావిత్రి అతి గారాబముగా అంతఃపుర జీవనములో తేలియాడినది.

ద్యుమత్శేనుడు సాల్వదేశాధిపతి. ఆతని కుమారుడైన సత్యవంతుని గురించి వినిన సావిత్రి ఆతనిని వివాహము చేసికొన నిశ్చయించెను. తండ్రి కూడా సావిత్రి యొక్క వివాహ నిర్ణయము ఆమె పైనే వదలెను. ఇది తెలిసిన నారదుడు జాతక ప్రకారము సత్యవంతునితో వివాహము అయిన ఒక సంవత్సర కాలములో సావిత్రికి పతీ వియోగము తప్పదని వేరెవ్వరితోనైనా ఆమె వివాహము జరుపమని తెలిపెను. కానీ సావిత్రి తన స్థిర నిర్ణయమును మార్చు కొనలేక పట్టుదలతో వివాహమాడినది. శతృవులు ఆతని రాజ్యముపై దండెత్తి యుద్ధములో ఆతనిని ఓడించి పదవీభ్రష్టుని గావించిరి. ఆతను యుద్ధములో అంధుడాయెను.

అంతఃపుర సంపదలు వదలి ఆశ్రమ జీవితము సత్యవంతునితో గడుపుటకు కానలకేగుట విధిలీలలే కదా!. అత్తమామలను భర్తను సేవించుకొని ఒక సంవత్సర కాలము ఆనందముగా గడిపినది. భర్తకు మరణకాలము ఆసన్న మైనదని తెలిసిన సావిత్రి భర్తని అనుసరించి వెళ్ళుటకు అత్తమామల అనుమతిగై కొన్నది.

కానలలో చెట్టు పైకి ఎక్కి కొమ్మను నరకబోయిన సత్యవంతుడు పట్టుజారి హఠాత్తుగా నేలపై పడబోగా సావిత్రి ఆతనిని తన ఒడిలోనికి తీసుకొనగా  ఆతను ఆమె ఒడిలో ఒరిగి చలనరహితుడాయెను. సావిత్రి పతివ్రతాఫల మహత్యము వలన ఆమె కనుల ముందు సమవర్తిగా నుతించబడు "యమధర్మరాజు" యొక్క దర్శన భాగ్యము కలిగెను. ఆతని చూసి భక్తితో కరములు మోడ్చి ప్రార్ధించినది. యముడు ఆమెను చూసి సత్యవంతుని ఆయువు నేటితో తీరినది కావున ఆతని ప్రాణములను తోడ్కొనపోవ వచ్చితిని అనగా తనలో చెలరేగే ఆందోళనలను అణచుకొని భర్తని పరుండబెట్టి యమధర్మరాజుని అనుసరించ సాగెను.

కొండలు, గుట్టలు, ఏరులు సునాయాసముగా దాటి తనను అనుసరించి వచ్చిన సావిత్రిని చూసి " సాధ్వీ! నీవు ముందుకు వచ్చు దారి అతిదుర్లభం, ఒక వరము ఇచ్చెదను నీ పతి ప్రాణములు తప్ప" అనగా సావిత్రి వినయముతో "అంధులైన నా అత్తమామలకు దృష్టిని రాజ్యమును సంప్రాప్తింపచేయుము" అనగా "తధాస్తు" అని ముందువరియగా దుర్భేద్యమైన దారిని దాట అశక్తురాలైన సావిత్రిని జాలిగా చూసిసావిత్రీ నీ పతి భక్తి నీకు దారి చూపుతున్నది కావున రెండవ వరము నొసగెదను  నీ పతి ప్రాణములు తప్ప" అనెను. "నా తండ్రికి పుత్ర సంతానము అనుగ్రహించుము" అని వేడుకొన్నది, "తధాస్తు" అని ముందుకు సాగెను. సావిత్రి తన పాతివ్రత్య బలముతో అంధకారమయమై, అగమ్యగోచరమై దుర్గంధ పూరితమై భరింప శక్యము కాని దుర్వాసనల నడుమ తనలో శక్తి క్షీణదశకు రాగా తనలోని పట్టుదలను వదలలేక సమవర్తిని అనుసరించినది. ఆమెలోని పతి భక్తికి మెచ్చిన యమధర్మరాజు "వరము ఏదైనా నెరవేర్చెదను కొరుకొమ్మనెను" సావిత్రి తనకు పుత్ర సంతానమును అనుగ్రహింపుమని వేడుకొన్నది. ఇచట ధర్మసూత్రము సంకటస్థితిలో పడినది. భూమిపై మానవ స్త్రీ పతిలేక ధర్మ సంతానము పొందుట దుర్లభము. కాలునికి ఆమె పతి ప్రాణములను  ప్రసాదింప చేసి సత్యవంతుని పునర్జీవితుని చేయుట తప్ప మరి దారి  కానరాలేదు. మామూలు మానవ స్త్రీగా  భర్త లేక సంతానవతి ఎటులకాగలదు? అను ప్రశ్నతో అసాధ్యమైనది సాధ్యము కావించినది సావిత్రి. తన పాతివ్రత్య మహిమతొ ఆత్యంత కఠినాత్ముడైన యమధర్మరాజును మెప్పించి తన పతిని పునర్జీవుని గావించు కొన్నది

కాలుని మెప్పించి పుట్టినింటికీ, మెట్టినింటికి శోభను తెచ్చి తన జీవితమును సరిదిద్దుకొన్న సావిత్రి భారత దేశములో తిరుగాడిన ఒక మానవ కాంత.

అడవిలో దృష్టి పొందిన అత్తమామలు సాల్వదేశ సింహాసనము తమకు సంప్రాప్తమవగా ఆనందమగ్నులైరి మరియు సావిత్రి తల్లితండ్రులు శతపుత్రులతో సంతసముతో అలరారిరి.

బీహార్, జార్ఖండ్, ఒరిస్సా రాష్ట్రములలో జ్యేష్ఠ మాసములో అమావాస్య దినమున "సావిత్రీ వ్రతమును ఆచరించుట ఒక సంప్రదాయము. పశ్చిమ దేశస్థులు పూర్ణిమ రోజున వివాహితలు పతుల క్షేమము కొరకు చేసే పూజలు ఒక విశేషమైతే పెళ్ళి కాని యువతులు వ్రతమును దీర్ఘాయువు కలిగిన పతిని ప్రసాదించుమని పూజించుట ఒక సంప్రదాయము. ఫాల్ఘుణ మాసములో సావిత్రి తన పతిని పునర్జీవితుని గావించు కొన్నది కావున తమిళనాడు లో "కారాదాయన్ నొంబు" అను పేరుతో సావిత్రీ వ్రతమును ఆచరించుట  విశేషమే.

పతిభక్తికి, పట్టుదలకి, ధైర్యసాహసములకు, మాటనేర్పుకు, విజ్ఞతకు ప్రతీకగా నిలచిన సావిత్రి యుగమైనా ఎప్పటికీ ఆదర్శమే అని నేనంటాను. మరి మీరేమంటారు?

5.అహల్య


రామాయణ మహాకావ్యములో తళుకుమని మెరిసి మెరుపులా మాయమైన అతి చిన పాత్ర "అహల్య". సప్త పతివ్రతలలో పేరొందిన ముఖ్య పతివ్రతా శిరోమణి. "అయోనిజ సంభవి" గా విఖ్యాతి గాంచినది. స్త్రీలు సహితం ఆమె అందాన్ని చూసి ఈర్ష పడే సౌందర్యవతి. బ్రహ్మ దేవుడు తన అధ్భుత జలశక్తితో అతిలోక సౌందర్యముతో అలరారే అహల్యను దేవనర్తకి అయిన ఊర్వశి యొక్క గర్వమును అణచుటకు సృష్టించెను. అపూర్వ సౌందర్యవతిని తరుణ వయస్సు వచ్చు వరకు సంరక్షించమని గౌతమ మహర్షి ఆధీనములో ఉంచెను. తల్లితండ్రులు లేని అహల్య ఆతని రక్షణలో ఉన్న సమయములో దేవతలు సైతము ముగ్ధులై ఆమెను వివాహమాడుటకు తమలో తాము వాదులాడుకొనిరి. దేవతల ప్రభువైన ఇంద్రుడు సైతం ఆమెను విపరీతముగా ప్రేమించెను. తన దానిని చేసికొనుటకు ఆరాటపడెను.

"అహల్య" అనగా హలము చేయబడనిది. అనగా గౌతముని చేత శాపగ్రస్తయై ఎండిన బీడువలె వేలకొలది సంవత్సరములు శిలారూపమున ధూళిలో, దుమ్ములో పడి హలము చేయ బడలేదు. అందువలన "అహల్య" అని నామాంకితురాలైనది.
కొంత కాలమునకు గౌతముడు అహల్యను తోడ్కొని బ్రహ్మ దేవుని వద్దకు చేరెను. ఆమెకు తగిన వరుని నిర్ణయించి వివాహము గావించమని కోరెను. ఆమె అందానికి ప్రభావితులైన దేవతలు ఆమెను పాణిగ్రహణము చేయబోవు వరునికి ముందు పరీక్ష జరుపుమని, ఉత్తీర్ణుడైన వానితో వివాహము జరగాలని బ్రహ్మ దేవుని కోరిరి. సృష్టి కర్త త్రిలోకములను చుట్టి ముందుగా ఎవరు తన వద్దకు చేరెదరో వారే అహల్యను చేపట్టుటకు తగిన వరుడని తెలిపెను.

దేవేంద్రుడు త్రిలోకములను తిరిగి వచ్చి గమ్యము చేరుసరికి అచట ముందుగా వచ్చి చేరిన గౌతముని గాంచి ఆశ్చర్యచకితుడాయెను. వెంటనే నారదుడు గౌతముడు తన పూజలో భాగముగా కామధేనువుకు ముమ్మారు ప్రదక్షిణ చేయు సమయములో గోవు ఒక లేగదూడను ప్రసవించినది. అధ్భుత వీక్షణమే ఆతనికి ముల్లోకముల ప్రదక్షిణముతో సమానమైనది మరియు శాస్త్ర సమ్మతమైనది. అందు వలన గౌతమునికే అహల్య తగిన భార్య కాగలదని న్యాయబద్ధతను విపులీకరించెను.

ఇది వినిన దేవతలు వయసు మళ్ళిన వానితో పెండ్లి ఏమిటని తర్క వితర్కములు జరిపినా, దేవేంద్రుడు తీవ్ర నిరాశకు గురి అయినా అహల్య గౌతముని ఇల్లాలుగా మారి పతిని అనుసరించినది.

సుర లోకములో దేవేంద్ర భోగములు అనుభవించ వలసిన అహల్య కానలలో ఆశ్రమ జీవనములో గౌతమునితో మిధిలానగర సమీపమున నెలకొని ఉన్న "ఉపవనము" వద్ద నిర్మితమైన గౌతముని ఆశ్రమములో సామాన్య మానవ కాంతగా జీవించినది.
కొంత కాలము తరువాత అహల్యపై ఇచ్చను చంపుకోలేని దేవేంద్రుడు గౌతముని వేషధారుడై ఆతను లేని సమయములో ఆగమించి అహల్యను అనుభవించెను. వారిరువురిపై ఆగ్రహము చెందిన గౌతముడు "ఇంద్రును వృషములు పడుగాక" అని శపించెను. అహల్యను చూసి "వాయు భక్షణ చేయుమని పరులకు కానరాక శిలా రూపములో వేలకొలది సంవత్సరములు ఒంటరిగా పడి ఉండుమని శపించెను.

తన రూపములో వచ్చిన ఇంద్రుని క్షమించ లేక పోయినా, అహల్యకు నిజము తెలియని రీతిలో జరిగిన అనాకృత్యము క్షమించ గలిగిన గౌతములోని సద్భావము ఆమె శాప విమోచనమునకు దారిచూపినది. "త్రేతా యుగములో దశరధ తనయుడు శ్రీరాముని ఆగమనముతో ఆతని పాదస్పర్శతో నీ పూర్వ అందచందములు పొందగలవని తదనంతరము పునీతగా మారిన నిన్ను స్వీకరించెదనని" తెలిపి హిమవత్పర్వత ప్రాంతమునకు తపమును ఆచరించ వెడలిపోయెను.

పురాణ కాలములో ఋషులు వ్యధ చెందినా, అగ్రహించినా శపించుట సర్వ సామాన్యము. అందు వలన వారి తపఃశక్తి నిర్వీర్యమై పోతుంది. తిరిగి దైవబలము సంప్రాప్తింప చేసుకొనుటకు వారికి తపమే ఒక సుగమమైన మార్గము.

వాల్మీకి వర్ణనలో అహల్య శిలా రూపమున నిర్జీవముగా ప్రకృతి వైషమ్యముల నడుమ అరవై వేల సంవత్సరములు పరుల కంట పడలేక సిగ్గుతో అవమాన భారముతో గడిపినది. పశ్చాతాపాన్నిమించిన ప్రాయశ్చిత్తము లేదు. అందు వలననే ఆమె జీవితము భవిష్య కాలములో సరిదిద్దబడినది.
'తప్పు చేసిన వారిని శిక్షించడము మానవత్వమే
కానీ
తప్పు చేసిన వారిని రక్షించడము దైవత్వమే"
ఇక్కడ ఒక మానవునిగా అగ్రహముతో గౌతముడు శిక్షించినా-దైవాంశ సంభూతుడైన శ్రీరాముడు తన కరుణతో అశేష దీవనలను ఆమెపై కురుపించెను.

విశ్వామిత్ర మహర్షి వర్ణనలో అహల్య దేవత. తప్పు అనే మరక లేని అందం ఆమె స్వంతం. సృష్టికర్త ఆమె రూపమును శారీరక, మానసిక సౌందర్యములతో తీర్చి దిద్దెను. సూర్యునికి గ్రహణము కమ్మినటుల అహల్య అందము శాపమనే గ్రహణములో దూళిపాలైనది.

ఇంద్రునియొక్క మితిమీరిన ప్రేమ, మరియు కామము విడదీయలేని రీతిలొ ఆహల్య జీవితములో పెనవేయబడి ఆమెను బంధించినవి.

ఆధ్యాత్మిక రామాయణ వర్ణనలో శ్రీరాముడు బాల కాండలో మూడు దుష్టశక్తులను దునుమాడెను
1.అహల్య చేసిన పాపకర్మ నిర్మూలన
2.గౌతముని శాపము నుంచి విమోచన
3.తన రాకచే ఆమె బాధను, వేదనను నివారింప చేసి విముక్తి కలిగించెను.

వశిష్ఠునిచే విరచితమైన "యోగవాశిష్ఠము" లో అహల్య ఇంద్రులు దేవాంశ సంభూతులు. వారి కలయికను గౌతముడు ఒక మానవునిగా తాత్కాలిక ఆవేశములకు లొంగి శపించెను. సూర్యదేవుని ఆరాధించి దేవేంద్రుడు తన సహజ రూపమును పొందెను. అహల్య శ్రీరాముని కరుణకు పాత్రురాలై సద్గతిని పొందెను. కావున ఇచట మనకు దోషులు ఎవరన్నది ప్రశ్నార్ధకమే అవుతుంది. అహల్య శీలమునకుశిక్ష" అను ప్రతిబంధకము తాత్కాలికముగా ఆమె జీవన పయనమునకు అవరోధము కలిగించినను ఆమెలోని పతిభక్తి, సహనము, నిరీక్షణ, విశ్వాసము అను విలువ కట్టలేని సద్గుణములు భవిష్య కాలములో ఆమెను జీవన పధములో ముందుకు నడిపేయి.

శ్రీరాముడు సైతము విశ్వామిత్రుని ద్వారా ఆమె కధ విని ఆశ్రమ పరిసరములను వీక్షించి అహల్య పవిత్రతను, స్వచ్చతను, భాద్యతగల గృహిణిగా దోషరహితగా భావించి ఆమె పాదములకు వంగి నమస్కరించు వైనము వాల్మీకి బాల కాండలో అధ్భుతముగా వర్ణించెను.

దేవతలు శాపవశాన లేదా ధరపై ధర్మము సుస్థాపితము చేయుటకు మానవుల మధ్య అవతరిస్తారు. అందు వలననే "మానవ కాంతలు" గా మన మధ్య మసలి వారు నిర్గమించినా వారి సందేశములు అజారామమే అవుతాయి అని నేనంటాను. మరి మీరేమంటారు?

6. అనసూయ



సప్త పతివ్రతలలో తన పాతివ్రత్య మహిమతో త్రిమూర్తులను సహితము మెప్పించగలిగిన సాధ్విగా వినుతికెక్కినది "అనసూయ". ఈమె కర్దమ ప్రజాపతి, దేవహుతిల పుత్రిక. మనువులలో మొదటి వాడైన స్వాయంభవుని మనుమరాలుగా వినయ, వివేకములు అను సహజ లక్షణములతో తీర్చి దిద్దబడిన మానవ కాంత.

సాధారణముగా స్త్రీలలో అసూయ గుణము అధికము. కానీ అందుకు విరుద్ధముగా అసూయ లేనిది కావున "అనసూయ" అను పేరుతో తనకు తాను తనదైన రీతిలో తీర్చిదిద్దు కొన్నది. వైవశ్వతమన్వంతరములో సప్త ఋషులలో ఒకరుగా విరాజిల్లిన "అత్రిమహర్షి" ప్రముఖుడు. ఆయనను వివాహమును చేసుకొని చిత్రకూట పర్వత ప్రాంతములో (మధ్యప్రదేశ్) వారిరువురు మందాకినీ నదీ తీరమున ఆశ్రమమును నిర్మించుకొని ఆనంద జీవనమును గడిపిరి. వైవశ్వమన్వంతరములో సప్త ఋషులలో ప్రముఖుడైన "అత్రి" మహర్షిని వివాహము చేసుకొనుట ఒక విశేషమే అయినా ఈమె అతులిత పతి సేవాతత్పరతకు మెచ్చిన అత్రి మహర్షి ఆమెకు "అష్టాక్షరీ మంత్రోపదేశము" గావించుట మరియొక విశేషము. మంత్రబలమే ఆమెకు రక్షగా ఆపత్కాలములో నిలచినది.

త్రిలోక సంచారి అయిన నారద మహర్షి ఒక దినము త్రిమూర్తుల పత్నులైన లోక మాతల ముందు అనసూయ యొక్క పాతివ్రత్యము యొక్క గొప్ప తనమును వివరించెను. ముల్లోకములు వెదకి చూసినా ఆమెకు సాటి వేరెవ్వరూ లేరని పొగడెను. దానికి వారు కినుక చెంది కానలలో తపస్సులతో, భక్తితో తమని ఆరాధించి తమ యొక్క మెప్పుదలలతో, తాము ఒసగే వరములతో తృప్తిచెందే సాధారణ మానవ కాంతలు తమని తాము పాతివ్రత్యమను ఆయుధముతో రీతిని రక్షించుకొనగలరో, రీతిని గెలువగలరో అను కుతూహలము కలిగెను. అత్రి మహాముని భార్య అనసూయ యొక్క పాతివ్రత్యమును తమకు నిరూపించమని కొరగా లొకమాతల సందేహము నివారించుటకు, సర్వ లోకములలో ఆమె కీర్తి సుస్థాపితము చేయు నెపమున త్రిమూర్తులు భూలోకమున అత్రి మహర్షి ఆశ్రమమునకు అరుదెంచిరి.

వారి ఆగమమునకు సంతోష పరవశులైన అత్రి అనసూయ దంపతులు తగు రీతిని స్వాగత సత్కారములు గావించి వారి రాకకు కారణము తెలుపమనిరి. వినయపూర్వకముగా వారి కోర్కెను తప్పక తీర్చెద మనినా వారు సందేహముతో  సంశయించిరి.

మహా పతివ్రత అయిన అనసూయా దేవిని తమకు నగ్నముగా భోజనము వడ్డించ వలెనని  విచిత్ర కోరికను కోరిరి. ఇది విన్న దంపతులు నిశ్చేష్ఠులైరి. కానీ మాట ఇచ్చిన తదనంతరము వారి ఈప్సితమును సఫలము చేయుటకు అంగీకరించిన అనసూయ వారిని భోజనము చేయుటకు సిద్ధముకమ్మని తెలిపి తాను భగవధ్యానములో అత్రి మహర్షి చెప్పిన అష్టాక్షరీ మంత్రమును జపించి మంత్ర జలమును వారిపై చల్లగా అధ్భుతమవు మార్పు వచ్చి త్రిమూర్తులు ఆమంత్ర ప్రభావమునకు పసిపాపల రూపమును దాల్చిరి. లోకాల్ని సృష్టించే సృష్టికర్త అయిన బ్రహ్మని, సృష్టిరక్షకుడైన శ్రీ మహావిష్ణువుని, సర్వసృష్టిని లయముచేయు పరమేశ్వరుని పసిపాపల రూపములో ఊయలలో వేసి ఊపిన మహా పతివ్రత. తమ తమ కర్తవ్యములను మరచిన  త్రిమూర్తులను ఆమె తన లాలనలో వారి ఆకలి దప్పులను తీర్చి మాతృ ప్రేమను వర్షింప చేసి వారి కోరిక తీర్చినది.

తమ భర్తల రాకకు ఎదురు చూసి అలసిన లోకమాతలైన సరస్వతి, లక్ష్మి, పార్వతి విషయము తెలిసి కొనుటకు అత్రి మహర్షి ఆశ్రమమునకు ఆగమించిరి. అచట ఊయలలో పాపలుగా మారి ఊగుతున్న త్రిమూర్తులనుగని ఆశ్చర్యచకితులై దారి కానక తమ పసుపు కుంకుమలను కాపాడమని తమ భర్తల తప్పిదనము క్షమింపుమని, పసిబిడ్డలుగా మారిన వారికి సహజరూపునొసంగుమని  అనసూయా దేవి కాలికి అమె పాతివత్య బలమునకు నమస్కరించి వేడుకొనగా కరుణతో అనసూయా దేవి వారికి తిరిగి సహజ రూపము నొసగినది. త్రిమూర్తులకు మాతృమూర్తిగా, లోకమాతలకు పతి భిక్ష ప్రసాదింప చేసి అత్తగారి స్థానమలరించిన పతివ్రత అనసూయ జగతిలో చిరస్థాయిగా నిలచినది.

త్రేతా యుగములో వన వాస సమయములో శ్రీరాముడు సీతా, లక్ష్మణ సమేతుడై  అత్రి మహర్షి ఆశ్రమమునకు విచ్చేసెను. అనసూయ వద్ద సీతాదేవి ఎన్నో పతివ్రతా ధర్మములను కూలంకషముగా చర్చించి ఆమె ఆశీస్సులను మన్ననలను పొందినది. సమయములో అనసూయ సీతకు దేవవస్రములను (ఎప్పటికీ చిరగనివి, వన్నెతరగనివీ) నగలను బహూకరించగా చీరలు సీతకు వనవాస సమయములో ఎంతో ఉపయుక్తకరము కాగా ఆమె తెలిపిన సతీ ధర్మములను సీత తన జీవితాంతము వరకు ఆచరణలో నిలిపినది

పతివ్రతామ తల్లులను పరీక్షింప దుస్సాధ్యము. వారిలో నిగూఢమైన శక్తి ఎవరి అంచనాలకూ అందదు. ఒకానొక సమయములో ఒక పది సంవత్సరములు వానలు లేక విపరీతమైన కరవు కాటకములు సంభవించినవి. విపరీత పరిస్థితులలో ఎన్నో మానవ, మృగ, పశుపక్ష్యాదులు అసువులుబాయగా అనసూయ అతి కఠినతరమైన వ్రతమాచరించి మందాకినీ నదీ జలములను చిత్రకూట పర్వత ప్రాంతములలో ప్రవహింప చేయగలిగిన మహిమోన్నతురాలు.

నేటి నవీన యుగములో అనసూయ లాంటి సాధ్వీమణులు ఉన్నారా! సాధ్యమా! అని సందేహించవలదు. వారు తమ పతిభక్తితో, దైవభక్తితో, తమ ధర్మములను నెరవేర్చుకొను పుణ్యస్త్రీలుగా  కాలానుగుణముగా యుగధర్మ రీతిలో వారి సత్ప్రవర్తనలతో సద్భుద్దితో అశేషజన మన్ననలను అందుకొని గౌరవ భావములను పెంపొందింప చేసుకొని ఎన్నోదైనందిన కష్టనష్టములకు ఓర్చి ధీఠుగా నిలబడి ఉండటము వలననే నేటికి భారత దేశ సౌభాగ్య సంపత్తులు, సంస్కృతీ సంప్రదాయములు పరిరక్షింబడుటకు సోపానములుకాగలిగినవి.

మనసులో చెలరేగే అసూయ ద్వేషాగ్నులలో దహనము కాని స్త్రీ అయినా "అనసూయ" తో సరిసమానమే.
"అసూయస్థానములో అనురాగం పంచుతుంది.
డ్వేష స్థానములో ప్రేమను పెంపొందింప చేస్తుంది"
అనినేనంటాను.మరి మీరేమంటారు?

7. అరుంధతి


సప్త పతివ్రతలలో అత్యుత్తమ స్థానము అలరించిన "అరుంధతిభువి పైనే కాదు దివిలో కూడా పతి సరసన నక్షత్ర మండలములో సుస్థిర స్థానమలరించిన ఒక మానవ కాంత విజ్ఞతకు తార్కాణముగా అన్ని యుగములకు ప్రతీకలుగా నిలచి గురు స్థానములో అధిష్ఠితుడై వెలుగొందిన వశిష్ఠ మహర్షి ధర్మపత్ని.

కర్దమ మహర్షి దేవహూతిలకు అష్టమ సంతానముగా జన్మించినది. చిన్నతనాన తండ్రే ఆమెకు గురువు. గృహకృత్యములలో తల్లికి సహాయకారిగా ఉన్నా గురుకుల విద్యార్ధులకు నేర్పే వేదాంత సారాంశములను విని అవగాహనము చేసికొని ఔపాసన పట్టి తనను తాను విద్యావంతురాలిగా తీర్చిదిద్దుకొన్నది. పసిప్రాయముననే వేదాలు నేర్చుకొని వాటి అర్ధములను సారాంశమును అనువదించుకొని ఆచరణలో ప్రభావితము చేసిన విజ్ఞానవతి.

తదనంతరము వశిష్ఠునితో వివాహము సింధూ నదీ తీరములో ఆశ్రమ నిర్మాణము చేసుకొని అశేష సంఖ్యలో విద్యార్ధులను తీర్చి దిద్దిరి. పతీపత్నుల అనురాగ బంధములకు ప్రతీకగా నిలచిన వారి దాంపత్యము యుగయుగాలకు ఆదర్శవంతమైనది. ఒకానొక కాలములో 12 సంవత్సరములు వానలు లేక ప్రజలు దుర్భిక్షముతో అల్లాడిరి. అశేష నష్టములు, కరువు కాటకములు మానవ లోకాన్ని అల్లకల్లోల పరచినవి. సమయములో కృత యుగాంతము సంభవించినది. త్రేత, ద్వాపర యుగములలోవారు తమ జీవనమును సరస్వతీ నదీ తీరమున సాగించిరి. వారి తపః ఫలితము మరియు సేవా తత్పరతలకు మెచ్చిన బ్రహ్మ నందిని గోవును (కామధేనువుకు జన్మించిన లేగ) కానుకగా ఇచ్చెను. ఇష్టకామ్యములను, అభీష్టములను, నిస్వార్ధ పరమైన కోరికలను, తీర్చే నందిని రాక వారి ఆశ్రమ తీరు తెన్నులను మార్చి వేసినది. లక్షల కొలదీ విద్యార్ధులు అస్త్ర, శస్త్ర, గణిత, యోగ, నక్షత్ర, వైజ్ఞానిక, ఆయుర్వేద సంభందిత విద్యలలో నిపుణులుగా మారి దేశ విదేశములలో భారతీయ విజ్ఞానమును పెంపొందింప చేసిరి. ప్రతీ సంవత్సరము ఆశ్రమ విద్యార్ధులకు పదివేల మందికి విద్యా దానము చేయుట ఒక విశేషమైతే వారికి ఉచితముగా అన్నపానాదులు ఒసగి నివాస యోగ్యమును కల్పించిరి. వారు చేసిన విద్యాదానము, అన్నదానము వారిని కలకాలము చిరంజీవత్వముతో అలరింప చేయుట మరియొక అధ్భుత విశేషము. త్రేతా, ద్వాపర యుగములలో భారత దేశమునేలిన అఖండ ప్రజ్ఞావంతులు, అరివీర భయంకరులు గా వినుతికెక్కిన సూర్య, చంద్ర వంశ చక్రవర్తులు ఎందరో వశిష్ఠుని ఆధ్వర్యములో తమ రాజ సింహాసనములను సుస్థిరము చేసికొనిరి. కలి యుగమున వశిష్ట సంతతుల వారు "వశిష్ట" గోత్రస్ఠులుగా నేటికి వెలుగులీనుతున్నారు.

ఒకానొక సమయములో కన్యకుబ్జ రాజు కౌషికుడు సపరివార సమేతముగా ఆశ్రమమునకు ఏతెంచగా వారికి అన్నపానాదులొసగి అతి వైభవోపేతము గా సత్కరించిరి. ఆశ్రమ వాసులకు ఇంత సంపత్తులకు కారణము తెలిసికొనగోరెను. దానికి వారు నందినీ గోవు మహత్యమనిరి. అది రాజుల వశములో ఉండవలసినది అని తన స్వంతము చేసుకొన తలచి తరలించ ప్రయత్నించెను. నందిని సైనిక బలము సృష్టించి వారి గర్వమును అణచెను. ఓటమిని అంగీకరించిన కౌషికునితో వశిష్టుడు ఇది తన తపఃఫలముచే నందిని రాక సంభవమైనది అని తెలిపెను. వెంటనే కౌషికుడు రాజ్య సంపత్తులను వీడి ఘోర తపోబలముచే 'బ్రహ్మర్షి" గా మారి విశ్వమునకు స్నేహితునిగా మారి  వశిష్ఠుని ద్వారా "విశ్వామిత్రుడు" అని బిరుదాంకితుడాయెను.

అష్టవసువులు ఇంద్రుని ప్రోధ్భలముతో నందిని గోవుని ఆశ్రమవాసులు ఎల్లరూ నిద్రావస్థలో ఉన్న సమయములో ఆశ్రమము నించి తరలించుకు పోయిరి. వారు దైవశక్తి కలవారు కావున నందిని ప్రతిఘఠించ లేక పోయినది. దివ్య దృష్టిలో సర్వమూ తెలిసికొన్న వశిష్ఠుడు అష్టవసువులు మానవులు కమ్మని శపించెను. వారిలో అష్టవసువు నందినిని తన శక్తితో నడిపించెను కావున వారిలో ఏడుగురు పుట్టిన వెంటనే శంతనుని భార్య గంగ ద్వార గంగలో వదలబడినా అష్టవసువు చిరాయువుతో భీష్మునిగా చిరకాలము జీవించెను. శాప ఫలితము అనుభవించెను.

నందిని లేక ఆశ్రమములో పేదరికము తాండవించెను. వశిష్ఠుడు అరంధతిని ఆశ్రమ రక్షణ కొరకు నియమించి తాను సహచరులతో హిమాలయ ప్రాంతమునకు తపమాచరించుటకు తరలిపోయెను. ఆశ్రమ విద్యాలయములు మూసివేయబడి నిర్మానుష్యమైనది. వశిష్ఠుడు ఒంటరిగా జీవనము గడుపుతున్న అరుంధతి క్షేమము కొరకు ప్రార్ధించెను. సమయములో ఒక పేద బాలుడు భిక్షకు రాగా ఏమీ చేయలేని స్థితిలో అరుంధతి వేచిన గింజలను భిక్షగా వేసెను. తను విద్యను అభ్యసించుటకు వచ్చితినని ఆశ్రమములో విద్యను నేర్పమని బాలుడు వేడికొనెను. అరుంధని తన అసహాయస్తిని వివరించి గురువు లేని ఆశ్రమం ఇది అని తెలుపగా ఆమెనే గురువుగా మారి విద్యను నేర్పమనెను.
అందులకు ఆమె అంగీకరించి తన దైన రీతిలో విద్యాదానము చేసి సఫలీకృతురాలాయెను. సుమారు సంవత్సరము తరువాత వశిష్ఠుడు తిరిగి వచ్చెను. అరుంధతి తనకు ఆపత్కాలములో సహాయ సహకారములను అందించిన తన విద్యార్ధిని చూపి ఆనందమగ్నురాలాయెను. అచట విద్యార్ధి స్థానములో సాక్షాత్ పరమేశ్వరుడు నిలచి వారికి సకలైశ్వర్యములు ఒసగి అశేష దీవనలు దంపతులపై కురిపించెను. బాలుని రూపములో  విద్యను సంప్రాప్తింప చేసికొను నెపముతో  మహేశ్వరుడు అరుంధతి ఒంటరి జీవనమునకు ఆసరాగా, వశిష్ఠుని ప్రార్ధనలను ఆలకించి భువికేతెంచిన వైనమునకు అమితానందము పొందిన, వశిష్ఠుడు విద్యాభోధనలో తనకు సహకరించి తనకు  తగిన అర్ఢాంగివి అని ఆమెను పొగడి భవిష్య కాలములో ఆతనికి ఆమె సహాయ సహకారములు లభ్యము కావలెనని తనకు నమ్మిన సతిగా ఆమెకు తనతో సమానమైన హోదా కల్పించి గగన తలముపై తన సరసన నిలుపుకొనెను.

భారతీయ సంప్రదాయములో వివాహానంతరము నూతన వధూవరులకు  అరుంధతీ నక్షత్ర దర్శనం చేయుట ఒక సంప్రదాయము. కలిమిలోను, లేమిలోను ఒకరికొకరుగా జీవించుట ఒక విశేషమే. అరుంధతీ నక్షత్ర దర్శనము అతి కఠినమైన కార్యమే. గగన తలాన సప్తఋషి మండలము ఇదే ప్రాతిపదికపై ఆధారపడి నెలకొని ఉన్నది. ముందుగా ఏడు నక్షత్రములు మన కంటికి స్పష్టతను చేకూర్చగా అరుంధతీ నక్షత్ర వీక్షణము అంత సులభతరము కాదు. కనుక ఆమె "అరుంధతి" అను పేరుతో వాసికెక్కినది. అరుంధతి సప్త ఋషిమండలములో కూడి ఉన్నా ఆమె దర్శనము కంటికి కానరాని అతి సూక్ష్మ రూపముతో తక్కువ మెరుపుతో మెరిసే నక్షత్రం. అందు వలననే కఠినతరమైన పనిని అతి సామాన్య రీతిలో ప్రారంభించి విజయము సాధించిన వారితో "అరుంధతీ నక్షత్రము చూసి వచ్చే రా!" అని ప్రశ్నించడము ఒక రివాజు. అందువలన ఆనాటి నీతి సూత్రం

"తెలిసినదానిని గురించి ముందు క్షుణ్ణముగా తెలిసికొని తరువాత తెలియని అర్ధము కాని కఠినమైన విషయాన్ని గురించి ప్రయత్నించడము అత్యుత్తమము" అని తెలిపినది

నేడు నవీన కాలములో అదే నీతి సూత్రాన్ని ఆంగ్లములో "సింపిల్ టు కాంప్లెక్స్" అనగా సులభతర మైన మార్గములో నుంచి కష్టతరమైనవి సాధించు. అని నవీన మానవ విజ్ఞత చెబుతోంది.

అరుంధతి విద్యావతి. తన స్వంత అభిరుచితో తండ్రిద్వారా, పతిద్వారా, విద్యార్ధుల, తన జీవిత అనుభవముల ద్వారా స్వయంకృషితో విద్యను వికసింప చేసుకొన్నది. స్త్రీ జాతి ఔన్నత్యాన్ని నిత్యనూతన పరచినది. వశిష్ఠునికి విద్యాబోధనలో సహకరించి, గృహోపకరణపనులను నిర్వహించడములో అంతే క్రమశిక్షణ పాటించినది. వేల కొలది విద్యార్ధులకు భోజన సదుపాయములను సమకూర్చుటలో కన్నతల్లిని మరపించడములో ఆమెకు సాటిలేరు. సమయాన్ని అతి పొందికగా ఉపయుక్తకరము చేసిన అరుంధతి " టైం మేనేజ్మెంట్" గురించి అవగాహన లేకపోయినా ప్రతీక్షణాన్ని సద్వినియోగ పరచుకొన్నది. మనకు ప్రస్తుత కాలములో అరుంధతి లాంటి స్త్రీలు ఉన్నారా! అని సందేహము కలగవచ్చు. కాలము ఏదైనా, యుగముఏదైనా, వ్యర్ధపూరిత మాటలు, అపనిందలు వేసే స్వభావములుతో  తమ కాలాన్ని వృధా చేసికొనని స్త్రీ అయినా అరుంధతే అవుతుంది.

లోకములో ఎందరో పతివ్రతలు ఉన్నా పతి సేవలో ధన్యమైన అరుంధతీదేవిలా విద్యావంతురాలై వినయ విధేయతలతో పతిని మురిపించి, మైమరపించి ఆతని సరసన నక్షత్ర మండలములో స్థిర నివాశినిగా మారిన సంస్కారవతి మానవ కాంత అరుంధతే అని నేనంటాను. మరి మీరేమంటారు?





1 comment:

  1. ధన్యోస్మి తల్లి.... చాల అద్భుతమైన వివరణ!

    ReplyDelete