"సప్త
చిరంజీవుల ఆవిర్భావమే యుగయుగాల చరిత్రకు ఆదర్శము"
ఇలపై చిరంజీవత్వము అనునది వేదముల ప్రకారము
ఏడుగురు మహాత్ములకు సంప్రాప్తమైనది. యుగ యుగాలకు ఆదర్శముగా
సాక్షీ భూతముగా అవనిపై వెలసిన
వారి సంస్మరణ ఆవీరులు అనుసరించిన
ధర్మ మరియు అధర్మ మార్గములు
ఏ రీతిని ధరపై
ప్రభావితమైనవి అనునది అతి క్లుప్త
రీతిలో విశదీకరించడమే ఈ వ్యాస
ముఖ్యోద్దేశ్యము.
"అశ్వద్ధామ,
బలిర్ వ్యాసో హనుమశ్చ విభీషణాహ
కృపః పరశురామశ్చ"
ఈ ఏడుగురు సప్త చిరంజీవులుగా
అభివర్ణించబడిరి.
1.అశ్వద్ధామ
సప్త చిరంజీవులలో ప్రధమ స్థానము అలరించిన
మహనీయుడు "అశ్వద్ధామ". ఏకాదశ రుద్రులలో ఒక
అవతార పురుషుడు. అతిరధ మహారధులలో మేటి.
కౌరవ పాండవుల గురువైన ద్రోణాచార్యునికి,
కృపికి జన్మించెను. పుట్టుకతో వచ్చిన కేశముల నడుమ
ఒక విచిత్రమైన దివ్యమణితో
జన్మించెను. ఈ నిక్షేపితమైన
మణి ద్వారా అతనికి అమరత్వము
మరియు ఆకలి దప్పికలు కలగని
వరములతో అతి గర్వితుడై సంచరించ
సాగెను. తపః శక్తితో ఎన్నో
వరములు శివుని ద్వారా పొంది
చిరంజీవత్వమును సంప్రాప్తింప చేసికొనెను. తన తండ్రి ద్వారా
"బ్రహ్మశిరోరకం" అను అతి భయంకర
అస్త్రమును సంపాదించెను. ద్రోణుడు ఎటువంటి ప్రాణాపాయ
సమయములో కూడా ఆస్త్రము వాడవద్దని
జగతి వినాశనకారి అని తెలిపెను. ఆ
అస్త్రము ఉపసంహరము ద్రోణుడు వివరించలేదు.
పేదరికములో
క్షుద్భాధాపీడితుడైన ద్రోణుడు తన సహచరుడైన
ద్రుపదుని దరిచేరి సహాయము కోరగా
అతడు నిరాకరించి అవమాన పరచెను. ఇరువురి
పగల ప్రభావమే మహాభారత యుద్ధములో
విజృంభించిన ద్రోణుని సంహరించుటకు ధర్మరాజు
శ్రీకృష్ణుని ఆనతిమీర "అశ్వద్ధామ హతః" అని బిగ్గరగా "కుంజరః"
అని మెల్లగా పలికెను. వెనువెంటనే
ద్రోణుడు అస్త్రసన్యాసము చేయగా దృష్టద్య్యుమ్నుడు
వానిని వధించెను. అశ్వద్ధామ ఈ పగతో
రగిలి కౌరవ సైన్యాద్యక్షుడుగా నారాయణాస్త్రము
చేబూని పాండవ సైన్యమును దునుమాడగా
ఆతనియుద్ధ నైపుణ్యతకు పాండవులు నిశ్చేష్టులైరి.
కొన ఊపిరితో యుద్ధ భూమిలో
అలమటిస్తున్న దుర్యోధనునికి తృప్తి కలిగించేలా "అపాండవీయం"
చేసెదనని శపధము చేసెను. నిదురలో
ఉన్న ఉప పాండవులను, శిఖండి,
దృష్టధుమ్యులను హతమార్చెను. విలపించే ద్రౌపదిని అర్జునుడు
ఓదార్చి ఈ హత్యలకు
కారకుడైన అశ్వద్ధామను ఆమె
పాదముల ముందు పడవేయుదునని శ్రీకృష్ణుని
సహాయముతో ముందుకు కదలెను. అశ్వద్ధామ
భయముతో పరుగులు తీస్తూ ఇక పాండవుల వధే
తన కర్తవ్యమని "బ్రహ్మశిరోరకం"
అను దివ్యాస్త్రమును మంత్రించి "అపాండవీయం అగుగాక" అని వదలెను. దైవాశ
సంభూతులు కనుక పాండవులపై ప్రభావితం
కాలేదు. కానీ అభిమన్యుని భార్య
ఉత్తర గర్భంలోని శిశువును ఆస్త్రం బాధించెను.
శ్రీకృష్ణుడు యోగమాయను ఆమె గర్భంలో
ప్రవేశపరచి శిశువుని కాపాడెను.
అస్త్ర ఉపసంహారము తెలియని అశ్వద్ధామ భయభీతుడాయెను.
సకల ప్రాణికోటి హహాకారము చేయగా ప్రకృతి
విలయ తాండవమాడెను. సమస్త భూలోకములు దహింపబడ
సాగెను. అర్జునుడు శ్రీకృష్ణుని ఉపాయముతో "బ్రహ్మాస్త్రము" ప్రయోగించి ఉపసంహారము గావించెను.
ఈ వినాశనము చూసిన కృష్ణుడు అశ్వద్ధామను
వధింపుమనెను. కానీ అర్జునుడు నిర్ణయము
పాంచాలిదేనని రధమునకు కట్టి ద్రౌపది
పాదములపై వేసెను. పాపాత్ముడైనను క్షమించే
ఔదార్యం భారత స్త్రీ జాతిలో
ఇంకా మిగిలి ఉన్నందున తన
కుమారులను వధించిన గురుపుత్రుని క్షమించి
విడవమని తనలాంటి గర్భ శోకం
గురుపత్ని కృపికి కలుగ రాదని
బ్రాహ్మణ కోపం వంశ నాశనమని
వదలమనెను.
తగిన శిక్షగా ఆతని తలపైఉన్న
శిరోమణి తీయమని దేశ బహిష్కరణ
శిక్ష విధించమని శ్రీకృష్ణుడు తెలిపెను. క్రోధముతొ ఆశ్వధ్ధామను చూసి "రక్తం చిందే దేహముతో,
మరణ బాధలతో, సహాయ సహకారములు
లేక, కారడవులలో అలమటించమని, బాధా తప్త జీవితమును
అనుభవించమని ఇదే శిక్ష" అని
శపించెను.
ఈ విధంగా కలి యుగములో
కూడా అశ్వద్ధామ వంటి వారు నేటికీ
కారడవులలో కొండలలో, కోనలలో అన్యమనస్కులై
తిరుగాడు వారినే మనము నక్సలైట్స్,
ఉగ్రవాదులు, టెర్రొరిస్ట్స్, సెపరేటిస్ట్స్ అను వివిధ పేరులతో
సామాన్య జీవనమునకు దూరముగా తిరుగాడుటకు కారణము
క్షమా గుణమే నేటికీ మనల్ని
తరుముతున్నది. వారిలోని దుష్టశక్తిని దునుమాడి
అధర్మాన్ని అణచిన ఘనత పాండవులదే.
కలి యుగములో సంచరించే వేలాది
అశ్వద్ధామల అహంకారము అణచడానికి వేలాది
కృష్ణార్జునులు వెంటాడి ధర్మానికే విజయాన్ని
సంప్ర్రాప్తింప చేస్తారు. అని నేనంటాను. మరి
మీరేమంటారు?
2.బలిచక్రవర్తి
సప్త చిరంజీవులలో ద్వితీయ స్థానమలరించిన
దాన గుణ సంపన్నుడు, అతి
బలవంతుడు, త్యాగానికి ధీటుగా నిలచిన అసుర
పరిపాలకుడు "బలిచక్రవర్తి" దేవాంబ, విరోచనల కుమారుడు.
దైత్య గురువు శుక్రాచార్యుని అధివేష్ఠనములో
ముల్లోకములను జయించుటకు అశ్వమేధ యాగమును చేయ
సంకల్పించెను. నర్మదానదీ తీరములో జరుగు ఈ
యజ్ఞ వైభవమును తిలకించుటకు ఎందరో
మహానుభావులు ఏతెంచిరి.
శ్రీ మహావిష్ణువు బాలవటువు రూపముతో యజ్ఞ
ప్రదేశమునకు ఏతెంచి దానముగా మూడు
అడుగుల నేలను కోరెను. వెంటనే
బలి చక్రవర్తి దానము చేయబోగా శుక్రాచార్యుడు
వారించెను. కారణము ఇదేదో విఘ్నము
దేవతల మాయ అని తన
సందేహమును తెలిపెను. తను ఆడిన మాట
తప్పనని బలిచక్రవర్తి మూడు అడుగుల నేలను
ధారపోసెను. వటుడు ఇంతై అంతై ఆకాశమంతు
ఎత్తు ఎదిగెను. ఒక పదముతో
ఆకాశము నిండి పోయినది, రెండవ
పదముతో భూమి నిండిపోయెను. ఇక
మూడవ పదమునకు స్థలము కోరగా
బలి తన శిరస్సుపై నిలుపమని
కోరెను. ఆతని భక్తి తత్పరతలకు
దాన గుణ సంపన్నతలకు మెచ్చిన
వామనుడు రాబోవు మన్వంతరములో అతను
ఇంద్ర పదవికి అర్హుడు కాగలడని
దీవించెను. అతని తలపై పాదము
చేర్చిన వామనుడు పాతాళ లోకమునకు
అణచి వేసెను. పాతళము చేరబోయిన
బలి వామనుడే సాక్షాత్ శ్రీ
మహావిష్ణువు అని తలచి తన
దేశమును, ప్రజలను ప్రతి సంవత్సరము
ఒక సారి చూడవలెనను
కోరికను తెలిపెను.
బలిచక్రవర్తి
కేరళలో జరుగు "ఓనం" పర్వదినమున పాతాళము నుండి భువికి
వచ్చి చేరు శుభ దినము.
మలయాళ భాషలో మావలి చెప్పే
పాట "మావెలినాడు
వనీయం కాలం మనుష్యురెల్లరుం ఒన్నుపోలె"
అనగా ప్రజలందరిని సమాన దృష్టితో మహాబలి
చక్రవర్తి తన సుపరిపాలనలో తీర్చి
దిద్దెను”
అని అర్ధము.
బలిని స్వాగతించుటకు "ఓనం" పండుగ అతి వైభవోపేతముగా
రంగు రంగుల రంగవల్లులతో, పుష్పములతో
వీధివీధుల వాడవాడలా అలంకరింపబడి సంప్రదాయ
శాస్త్రీయ నృత్యములతో పంపా నదిపై జరుగు
పడవల పోటీలతో వినోదించుట కడు
రమణీయము. బలిచక్రవర్తి మరల భువిపై వచ్చి
అతి కష్ఠ సాధ్యమై అనవరతమై
నెరవేరని ఎన్నో కార్యములను పరిసమాప్తి
చేయును అనునది వారి విశ్వాసము.
బలి తాను దానమిచ్చిన చేయి
ఎప్పటికీ పైన ఉండటము ఒక
విధముగా అతని అహంభావమును ప్రస్పుటింప
చేసినది అనుటకు కారణముగా శ్రీహరిని తన
నివాశమైన పాతాళములో ద్వారపాలుని గా నియమించెను అనునది
ఒక సంఘఠన. సిరులదేవి
లక్ష్మీదేవి భార్య అయినా హరి
తన దగ్గరకు యాచనకి
రావడము తనకు భోగ భాగ్యములు
సంప్ర్రాప్తింప చేయుటకే అను రీతిగా
గర్వితుడు. రామచరిత మానసలో వామనుడు
నేటికీ పాతాళములో ద్వార పాలకునిగా ఉన్నటుల
వర్ణించెను.
దేవీ భాగవత వర్ణనలో పాతాళములో
అనంతుడు తన వేయి పడగల
మీద భూతలమును నిలిపి ఉంచి
ధరణి నిశ్చలత్వమునకు ఆలంబనమైనది శ్రీహరి వలననే. అదే
రీతిలో ఊర్ధ్వ లోకముల పైన
శంఖ, చక్ర, గదాపాణి అయికల్పాంతము
వరకు కాపాడుట వలన "సృష్టిరక్షకుడుగా"
పేరొందెను. సప్త అధో లోకములు
+ సప్త ఊర్ధ్వ లోకములుతో కూడిన
ఈ "బ్రహ్మాండము" పాతాళము నుండి సత్యలోకము
వరకు (కాస్మిక్ ఎగ్) శ్రీ
మహావిష్ణువు పర్యవేక్షణలో సురక్షితము అనునది ఒక విశిష్ట
సత్యము.
ఒకానొక సమయములో రావణుడు బలిని
అవమానించబోగా బలి హేళనగా నవ్వి
తన కాలి బొటనవేలితో
ఎగమీటగా పదివేల ఆమడల దూరములో
ఎగిరి పడెను. దాన గుణములోనే
కాదు దారుఢ్యములోనూ బలశాలిగా కీర్తింప బడెను.
సూర్యవంశ గురువైన వశిష్ఠుడు తాను
రచించిన “యోగ వాశిష్ఠము" అను
గ్రంధములో ముల్లోకములలోను బలిని మించిన పాలకుడు
లేడు. అందుకు కారణము తను
మనస్సుతో మనుషులను తృప్తి పరచుటకు
ప్రయత్నించడము అదే రీతిలో ప్రజలను
మెలగమని ఆదేశించుట ప్రముఖ నిపుణతలు అని
తెలిపెను. ఒక నాడు శ్రీరాముని
సందేహ నివృత్తి చేసిన వశిష్ఠుడు
బలిచక్రవర్తి గొప్పతనము ఆతనిలో కంటే ఆతడు
నమ్మిన విష్ణుభక్తిలో ఉన్నదని వివరించెను.
గురుగ్రంధాసాహెబ్
వర్ణనలో బలికి ముఖ్య ఆకర్షణ
శక్తి వామనుడే అని తెలిపినది.
భాగవత పురాణములో శ్రీ మహావిష్ణువు బలిచక్రవర్తి
సామ్రాజ్యాన్ని తిరిగి సంక్రమింప చేయుట
అను నీతి నిగూఢమై ఉన్నది.
భవిష్య పురాణము లో మహాభారత
యుద్ధమును బలి వీక్షించెను మరియు అచట అశ్వమేధయజ్ఞమాచరించగా
ఆ తపఃఫలమే రానున్న
మన్వంతరములో ఇంద్ర పదవి సంప్రాప్తము
అవుతుంది అని వ్యాసుడు వర్ణించెను.
బౌద్ధులు
బలిని తమ మతము స్వీకరించమనగా
తన ప్రజలను కుత్సితముల
నుండి క్రూర అలోచనల నుండి
విముక్తి పరచినచో తాను
బౌద్ధ మతము స్వీకరింతునని తెలిపెను.
ఆ కాలములో ఎందరో అసురులు
మానవత్వమున్న మనుషులుగా రూపుదిద్దుకొనిరి. దానములో,
మంచితనములో, దయ కనికరములలో, భక్తి
తత్పరతలలో బలిచక్రవర్తికి సరితూగు మహాత్ములు నేటికీ
వివిధ నామములతో చిరంజీవులుగా వెలుగుటకు
ఈ అవనిపై సాధ్యమే
అని నేనంటాను. మరి మీరేమంటారు?
3. వ్యాసమహర్షి
వేదములలోనే
యావత్ భారతీయ విజ్ఞానం నిక్షిప్తమై
ఉన్నది. ప్రాచీన ఋషులు మనకు
ప్రసాదించిన అతి గొప్ప జ్ఞాన
సంపద. బ్రహ్మదేవుని నాలుగు ముఖముల నుండి
నాలుగు వేదములు ఆవిర్భవించగా వాటిని
నాలుగు యుగములలోను సర్వ లోకములకు నివేదించడమైనది.
వ్యాసుడు ఏక రాశిగా ఉన్న
వేదములను విభజించి వాటి సారాంశములను
విపులీకరించుట వలన "వేదవ్యాసుని" గా నామాంకితుడాయెను. ధర్మసారములైన
18 పురాణములను, పంచమ వేదముగా ప్రస్తుతింపబడిన
మహాభారతం రచించిన తపోరాశి, ధర్మజ్ఞుడు,
విజ్ఞానవంతుడు గా సర్వకాలములలో నిలిచెను.
"వ్యాసం
వశిష్ఠనప్తారం:శక్తేః పౌత్రమకల్మషం
పరాశరాత్మజం_వందే శుకతాతం తపోనిధిం
వ్యాసాయ
విష్ణురూపాయ-వ్యాసరూపాయ విష్ణవే
నమో వే బ్రహ్మనిధయే వాసిష్ఠాయ
నమోనమః”
అనునది భగవద్గీత నుడి సాక్షాత్
విష్ణువుని అంశతో జన్మించిన మహోన్నతుదు.
విష్ణువాంశసంభూతుడు.
పరాశ మహర్షి యోజనగంధి అయిన
సత్యవతిల కుమారుడుగా అవనిపై వెలసెను కనుక
"సాత్య వతేయుడు" అని పేరొందెను. పరాశరుడు
తన మంత్రశక్తితో చుట్టుప్రక్కల
వాతావరణాన్ని పట్టపగలును చిట్టచీకటిగా మార్చివేసెను. తదనంతరము ఆమె కన్నెరికం
చెడకుండా వారిరువురి సంగమం జరగడము ఒక
విశేషమైతే వారి కలయిక ఈశ్వర
సంకల్పమే అను
నమ్మకము ఆమెకు కలిగించెను. పగలు
నల్లని చీకటి ద్వీపమందు జన్మించుట
వలన "కృష్ణద్వైపాయనుడు" గా వాసికెక్కెను. పరాశరునివలె
విజ్ఞానుడు, తపోధనుడు, విష్ణుతేజముతో అలరారే ప్రతిభాశీలుడు, సద్గుణశోభితుడు
అయిన వ్యాసుడు జన్మించెను. కొంత
కాలము తరువాత తల్లి సత్యవతి
అనుమతి గైకొని తలచినంతనే ఆగమించెదనని
మాటను ఇచ్చి తపోవనములకేగెను.
తరువాత కాలములో వ్యాసుని ఆగమనము
మహాభారత కాలములో ఎదురైన సంఘఠనలు:-
1.కాల మహిమ వలన కురువంశము
నాశనమగు సమయము ఏతెంచగా సత్యవతి
కలతచెంది వ్యాసుని స్మరించినది. ఆమె
ఆనతిమీర అంబిక
వ్యాసుని సేవించి పుత్రవతిగా అలరారుటకు
ఆగమించినది కానీ ఆతని రూపము
చూసి బెదరి భయ కంపితురాలై
కనులు మూసుకొనగా ఆమెకు అంధుడైన దృతరాష్ట్ర
జననమునకు నాందీపలికెను. అంధుడు రాజ్యమేల అనర్హుడని
ఎంచి అంబాలికను వాసుని సేవించి తరించమనెను.
ఆతని రూపు చూసి విశ్మయము
చెందిన అంబాలిక తెల్లబోయెను. కనుక
ఆమెకు పాండురోగగ్రస్తుడైన పాండురాజు జననమందెను. రోగిష్టి రాజ్యమేల అనర్హుడని
ఎంచి అంబికను వ్యాసుని సేవించమనెను.
కానీ ఆమె తన దాసిని
తన రూపులో అలంకరించి
పంపెను. ఆమె విశేష ఆరాధనలు
చేసి వ్యాసుని పూజించి వివేకవంతుడు,
ప్రతిభాశీలుడు, నీతిమంతుడుగా పేరొందిన విదురునికి జన్మను
ఇచ్చెను. కురు వంశములో దాసీపుత్రుని నీతి
తిరుగులేని శాసనముగా సర్వజనావళి ఆమోదించడమైనది.
ఆ నీతియే "విదుర
నీతి" గా విశిష్ఠ మన్ననలు
పొందినది. కురు సామ్రాజ్య ముఖ్యసలహా
దారునిగా, ప్రధాన మంత్రిగా విదురుడు
సామ్రాజ్య రక్షణ గావించెను. పిదప
వ్యాసుడు తల్లి సత్యవతిని ఓదార్చి
"బుద్ధి కర్మానుసారిణి" కావున విచారించ వలదని
తన పుత్రులను దీవించి
తల్లి ఆశీర్వాదము స్వీకరించి మరలెను.
2.మత్స్య
భేధము చేసి ద్రౌపదిని వివాహమాడిన
పంచ పాండవులు ఆశీర్వచనమునకై వేదవ్యాసునికి
పాదాభివందనము చేయగా భవిష్యత్తు ఎరిగిన
వ్యాసుడు పాంచాలిని చూసి "కారణజన్మురాలవు నీ ఆత్మ శక్తి
ముందు నా ఆశీర్వచనము ఏ
పాటిది? దీర్ఘ సుమంగళీ భవ"
అని దీవించెను. ఆ సమయములో
ఆమె ఆత్మ శక్తి వ్యాసుని
సైతం విస్మయ పరచినది.
3.రాబోవు
కాలములో జరుగు అనర్ధములు, సహింపజాలరని
సత్యవతి, అంబ, అంబాలికలను తనతో వాన
ప్రస్థమునకు వ్యాసుడు మరలించెను.
4.మహాభారత
యుద్ధ పరిసమాప్తమైన కొంత కాలమునకు వ్యాసుడు గాంధారి, దృతరాష్ట్రుడు,
విదురుడు, కుంతి మరియు
సుభద్రలను కలవనేతెంగా, గాంధారి తన శతపుత్రులను,
కుంతి కర్ణుని, సుభద్ర అభిమన్యుని
ఆతని తపోబలముతో వీక్షింపనెంచిరి.
5.వారి కోర్కెలను ఈడేర్చ సంకల్పించిన వ్యాసుడు
అతి శక్తిమంతురాలైన ఆదిశక్తిని మనసార ప్రార్ధించెను. ఆతని
భక్తికి ప్రసన్నురాలైన దేవి వారికి తన
దివ్యదృష్టిని ప్రసాదింపచేసి స్వర్గవాసులైన వారి దర్శన భాగ్యము
కలిగింప చేసెను. వ్యాసుని తపోబలముతో
దేవి అనుగ్రహముతో తమ సంతానాన్ని కనులార
వీక్షించి ఎంతో సంతృప్తి చెందిరి.
తదనంతరము వారి దివ్య దృష్టి
మాయమాయెను. సృష్టిలో అసాధ్యము అనుకొన్నవి
ఎన్నో వ్యాసుడు తన తపోబలముతో
సుసాధ్యము చేసేను.
6.మహాభారత
యుద్ధానంతరము జరిగిన ఎన్నో కష్ట
నష్టములను అర్జునుడు వ్యాసునికి వివరించెను. అన్యమనస్కుడుగా దుఃఖితుడుగా కలతలతో నిలచిన పార్ధుని
ఓదార్చి “భవిష్య కాలములో మీరందరు
పునర్జన్మ పొంది శ్రీకృష్ణునితో మరల
సత్సంసంబంధములు ఏర్పడుతాయి. ఈ ఎడబాటులు,
దుఃఖము అన్నీ తాత్కాలికమే,
అనుచు కొన్ని భవిష్య కాలములో
నిబిడీకృతమై ఉన్న కొన్ని రహస్యములను
వివరించెను. వ్యాస భోధనలతో సంతృప్తులైన
పాండవులు మహా ప్రస్థానమునకు ఆరంభము
చేసి స్వర్గారోహణము గావించిరి.
వేదవ్యాసుని
దీవనల ఫలితమే "భవిష్యపురాణ" రచనకు నాందీ పలికినది.
అందులో వ్యాస వర్ణనలో కౌరవులు,
పాండవులు. యాదవులు, వారి వారి
కర్మఫలానుసారము కలి యుగములో పునర్జన్మలను
సంప్రాప్తింప చేసుకొనిరి. పేరులు వేరు, ప్రాంతాలు
వేరు, భాషలు వేరు, మతాలు
వేరు, సంస్కృతీ సంప్రదాయములు వేరు
అయినా ఎన్నో విభిన్నతలతో ప్రపంచమంతటా
వ్యాప్తీకరించిరి.
కలి యుగములో కూడా కౌరవులు
అధర్మాన్నే అనుసరించగా, పాండవులు ధర్మాన్ని నిలపడానికి
అంతే ధీఠుగా నిలబడటం వారి
సహాయ సహకారముల కొరకు యాదవులు
జన్మించిరి. సాక్షాత్ భగవత్ స్వరూపుడైన
శ్రీకృష్ణుని అవతారము ఆపన్న హస్తముగా
వేలాది అర్జునులకు సహాయ సహకారములతో అండదండలుగా
నేటికీ విజేతలు కావడానికి దోహదము
కావడము ఒక అధ్భు తమే.
నేడు ధర్మ
సంస్థాపన కొరకు శ్రీ
వేదవ్యాసుని "భవిష్యపురాణము" విశ్వమంతా వ్యాపించి ఉన్న అక్షర సత్యములు
ఎన్నటికీ, ఎప్పటికీ విలువ మాయనివి
అని నేనంటాను. మరి మీరేమంటారు?
4. హనుమ
సప్త చిరంజీవులలో ప్రముఖుడుగా చతుర్ధ స్థానమలరించిన "హనుమ"
నాలుగు యుగములలో తిరుగాడిన వైనము
నేటికీ నిరూపణమై ఉన్నది.
కృత యుగములో ప్రచండ రౌద్రాకారముతో
మూర్తీభవించిన రుద్రుడు మరియు ఆదిశక్తుల
అంశలతో జన్మించెను శక్తికి, యుక్తికి ప్రతీకగా
అఖండ బ్రహ్మచర్య దీక్షతో, అతులిత విజ్ఞాన
సంపత్తులతో దుష్ట శక్తులను నాశనము
చేయుటకు ఇలపై అవతరించిన రుద్రాంశ
సంభూతుడే "హనుమ".
త్రేతా యుగములో శ్రీరామ బంటుగా
రామాయణ మహాకావ్యములో అనేక అధ్భుతములను చేసి
అసాధ్యములను సుసాధ్యము కావించెను.
ద్వాపర యుగములో పాండవులు అరణ్యవాసములో
తిరుగాడు సమయములో భీముడు సౌగంధికా
పుష్పముల కొరకు విచ్చేసి
హనుమను కలసి ఆతని ఆశీర్వాదములను
పొంది రాబోవు కాలములో జరుగు
మహాభారత యుద్ధములో వారి రధముపై "జండాపై
కపిరాజు" గా కీర్తి పతాకములో
నిలచి ఎగురుతూ వారికి యుద్ధములో
విజయము సంప్రాప్తింప చేయుదునని వరమును ఒసగెను.
కలి యుగములో హనుమ తన
చిరంజీవత్త్వమును నిరూపణము చేసికొనగలిగేది ఎచ్చట
రామ సంకీర్తనము జరుగునో అచట వశించును.
రామనామ స్మరణలో తేలియాడు భక్తులను
సంరక్షించును అనునది అధ్భుత రహస్యము.
కృత్రిమ భక్తులకు, తాంత్రిక దుష్ఠ శక్తులకు
వితండ వాదములతో బానిసలై తిరుగాడు
జనులకు హనుమ శక్తి అంచనాలకు
అందదు.
మరియొక కధనము ప్రకారము అంజనాదేవి
ఒక దేవకన్య. అతి
సుందరమైన యువతి. శాపవశాన భువిపై
మానవ కాంతగా అవతరించినది. బృహస్పతి
కుమారుడైన కేసరిని వివాహమాడినది. చాలా
కాలము వారికి సంతానము లేనందున
అంజనాదేవి అతి బలవంతుడైన చిరంజీవిగా
వెలుగులీనే కుమారుని కొరకు మాతంగముని
మంత్రోపదేశము చేయగా నీహారికగా 12 సంవత్సరములు
ఘోర తపమాచరించెను. 13వ సంవత్సర
ప్రారంభములో వాయుదేవుని అనుగ్రహముతో లభించిన ఫలమును ఆరగించగా
అతి వీరుడైన "ఆంజనేయస్వామి" చైత్ర శుద్ధ పూర్ణిమ
దినము జన్మించెను. అంజనాదేవి కుమారుడు
కావున "ఆంజనేయుడు" అను నామముతో వెలుగులీనెను.
సీతాన్వేషణలో
కిష్కింద తలపిన రామలక్ష్మణులను ప్రధమముగా
దర్శించిన హనుమ వారి వివరముల
కొరకు బ్రాహ్మణ వేషధారిగా ఏతెంచెను.
పరులకు కానరాని కాంచన హారమును
శ్రీరాముడు గుర్తించి ప్రశ్నించగా హనుమచకితుడై తాను ఎవరి దర్శనార్ధము
పరితపించుచున్నాడో ఆస్వామి శ్రీరాముడే అని వారిని
తన భుజములపై నీడుకొని
మాల్య పర్వతమును అధిరోహించి వానర రాజు సుగ్రీవుని
వద్దకు చేర్చెను. వారిరువురు అగ్ని సాక్షిగా మిత్రులైరి.
ఆనవాలుగా సీత జారవిడిచిన నగల
మూటను శ్రీరామునికి సమర్పించెను. ఆమె జాడ అరయుటకు
ఆలంబనము అయినది. తదనంతరము వాలిని
వధించి సుగ్రీవుని రాజ్యాభిషిక్తుని గావించి సీతాన్వేషణలో
సముద్ర లంఘనము గావించి సింహిక,
సురస, లంకిణి ఆదిగా ఎదురైన
శక్తులను ఎదిరించి కార్య సాధకుడాయెను.
అశోక వనములో సీతను గాంచి
శ్రీరామ ముద్రికను సమర్పించి, ఆమె ఆనవాలు తోడ్కొని
ధైర్యమును ఆమె ఎదలో నింపెను.
రాక్షస బలము తెలిసికొనుటకు అశోక
వనము విధ్వంశము గావించి బ్రహ్మాస్త్ర బద్దుడై
రావణ సభకు ఏతెంచెను.
శతృవు బలవంతుడైనపుడు ధర్మపధము దారి తప్పినపుడు
హనుమ తన దైన రీతిలో
ఎంతో సహనముతో, వివేకముతో సుస్పష్టరీతిలో
శ్రీరామ దూతగా రావణునితో సంభాషణలు
జరిపెను.
"శ్రీరామ
దూతం శిరసా నమామి" అని
భక్త కోటిచే కొనియాడబడెను.
ఆగ్రహము
చెందిన రావణుడు దూతను వధింప
మనగా విభీషణాదులు దూతను వధింపవలదని వేరే
శిక్షను విధింపమనిరి. వాలమును కాల్చ మనగా అదే
వాలముతో లంకా దహనము గావించి
శ్రీరాముని చేరి "చూసితి సీతను" అనెను
కారణము వేరేఏపదమైనా శ్రీరామునికి క్షణకాలమైనా కలత తెచ్చునేమో అనునదే
నిగూఢమైనది. రాముని కలతను సహించే
శక్తి హనుమకి లేదు. అందువలన
సీత ఆనవాలు రామునికి సమర్పించి
అమిత సంతోషపరచిన హనుమ సేవాతత్పరతకు, నిజాయితీకి,
ధీఠుగా వేరొకరిని కానము.
ఒకసారి హనుమ సీతాదేవి తన నుదిటిపై సిందూరము
తీర్చి దిద్దుకొనుటను చూసి కారణమడిగెను. ఈ
సిందూరం రామునికి చిరాయువును ప్రసాదించునది
అని తెలుపగా వెనువెంటనే హనుమ
సిందూరాన్ని తన శరీరమంతా లేపనము
చేసుకొని శ్రీరాముని చిరంజీవత్వాన్ని ప్రసాదించాలి అనుభావనకి ప్రేరణగా నిలచి హనుమ
శరీరము సింధూరమయమై నేటికీ
నిలచిపోయినది చరిత్రలో శాశ్వతముగా.
హనుమకి రామ నామమును మించిన
అమృత పానము లేదు. రామసేవను
మించిన కర్తవ్యము లేదు అనునది రామాయణ
కావ్యములో అణువణువునా, అడుగు అడుగునా నిరూపితమైనది.
శ్రీరామ
పట్టాభిషేక సమయములో సీతాదేవి హనుమ
చేసిన ఉపకారములకు అమిత ప్రీతినొంది గౌరవించుటకు
తన మెడలోని అతి
విలువైన ముత్యాల కాంచన హారము
బహుమతి గా సమర్పించెను.
దాని విలువ తెలియని హనుమ
రామదర్శనము కొరకు ప్రతీ ముత్యము
పన్నుతో కొరికి చూడ సాగెను.
సీత కినుకతో విధ్వంచ చర్యకు
కారణము అడిగెను. రామ సేవ
విలువకు హనుమకు
అతి ముఖ్యమైనది రామదర్శనమే అంతకు మించి ఎంత
విలువైన బహుమతి అయినా హనుమ
దృష్టిలో నిరుపయోగమే. అవి జీవమున్నవి అయినా,
జీవములేనివి అయినా రాముని ఉనికే
ప్రధానము. ఇది ఒక హాస్యసంఘఠనే
అయినా, కల్పితమే అయినా ఎంతో నిగూఢ సత్యము
ఇమిడి ఉన్నది.
మనము నమ్మిన వారి ప్రేమాభిమానములు
ఎన్నటికీ ఈ ప్రపంచములో
లభ్యమయ్యే ఇహ
పర పదార్ధములతో సరిపోల్చలేము.
ఇది హనుమ నమ్మిన సూత్రం,
అంతే కాక స్వామి సేవా
తత్పరతకు చిహ్నమే, ఏ కాలమైనా,
ఇది ఆదర్శమే.
తులసీదాసు
హనుమ శక్తిని వర్ణించుతూ
"భూత
పిశాచ నికటనహి ఆవై-మహావీర
జబ నామ సునావై"
భూత ప్రేత పిశాచములు దరి
చేరకుండా కాపాడ గల శక్తిమంతుడు
హనుమే వాల్మీకి
ఆశ్రమము వద్ద చివరగా సీతాదేవి భూగర్భములో
చేరగా శోకతప్తులై విలపించు శ్రీరాముని లవకుశులను
ఓదార్చిన కరుణామయుడు. లవకుశులను రాజ్యాధికారులను చేసి అవతారపరిసాప్తి చేసుకొను
శ్రీరాముడు తనను అనుసరించుటకు అనుమతి
నీయలేదు. హనుమకు కర్తవ్యము తెలుపుతూ
"దుష్టశక్తులను దునుమాడుటకు, కలి యుగములో జరిగే
అనర్ధములను అరికట్టుటకు హనుమ అవసరము అవనికి
ఎంతో కలదని కర్తవ్య పాలన
చేయుమని ఆనతి నీడెను. హనుమ
సహాయ సహకారముల కొరకు మనము
ఏ పూజలు, యజ్ఞ,
యాగములు నిర్వహించ అవసరము ఈ యుగములో
లేదు. రామనామ కీర్తనలే చాలు
సర్వ సౌభాగ్యములు ప్రసాదించును అనునది ఒక ప్రగాఢ
నమ్మకము.
“యత్ర
యత్ర రఘునాధ కీర్తనం తత్ర
తత్ర కృతమస్తకాంజలిం
బాష్పవారి
పరిపూర్ణలోచనం మారుతిం నమ రాక్షసాంతకం
శ్రీరామ భక్తాయ హనుమతే నమః"
5. విభీషణుడు
సప్త చిరంజీవులలో పంచమ స్థానమును అలరించిన వివేకవంతుడు,
నీతిపరుడు, సాత్విక గుణసంపన్నుడుగా విఖ్యాతి
గాంచిన విభీషణుడు కైకసి విశ్రావల కనిష్ఠ
పుత్రుడు.
పులస్త్యుడు
బ్రహ్మ మానస పుత్రులలో ఒకరుగా
అభివర్ణించబడెను. విశ్రావునకు రావణ, కుంభకర్ణ, విభీషణులు
అను కుమారులు కలిగిరి. వీరి
సంతతి దేవతల ఆరాధనలో నిమగ్నులు
కావడమే అధ్భుతము. యుగయుగాలకు తార్కాణముగా నిలచిన విభీషణుడు అసురుల
నడుమ తిరుగాడినను విష్ణువుపైన భక్తి సడలక ధర్మనిరతితో
మనుగడ సాగించెను.
బాల్యము
నుంచి దైవభక్తి పరాయణుడు. ఒకానొక
కాలములో బ్రహ్మదేవుని కొరకు ఘోరతప మాచరించెను.
బ్రహ్మ మిక్కిలి సంతసించి వరము
కోరుకొమ్మనగా భగవంతుని చరణ కమలములను
సదా పూజించు భాగ్యము ప్రసాదింపుమనెను.
ఈ తపఃఫలితమే ఆతను
నమ్మిన ధర్మం, నీతి, నియమనిష్ఠలభక్తి
తత్పరతలే శ్రీరాముని సన్నిధికి చేర్చినవి.
సీతాపహరణము
చేసిన రావణుని అధర్మరీతిని వారించి
రామునితో వైరము వలదని సీతను
శ్రీరాముని సన్నిధికి చేర్చమని ఎన్నో హిత
వచనములను పలికెను. అన్న అను
గౌరవముతో కుంభకర్ణుడు అధర్మము వైపు నిలచి
అసువులుబాసెను. కానీ విభీషణుడు ఎన్ని
ఉపదేశములు ధర్మనిరతిలో చెప్పినను రావణుడు వినక అగ్రహముతో
సోదరునికి దేశ బహిష్కరణ శిక్ష
విధించెను. విభీషణుడు తన బలగముతో కూడి
శ్రీరాముని శరణు వేడెను. శతృబలగము
నుంచి వచ్చి చేరిన విభీషణాదులను
వానర సేనలోని ప్రముఖులు అనుమానించిరి.
వారి సందేహములను నివృత్తి గావించి రావణుడే
వచ్చి తనను శరణు వేడినను
క్షమించగలనని తన ఔదార్యమును చాటెను.
అన్న రాజ్యమును స్వాధీన పరచు కొనుటకు
స్వార్ధబుద్ధితో విభీషణుని తూలనాడిన వారు కొందరైతే
ధర్మనిరతిని అన్నకి బోధన చేసినను
వినక దేశ బహిష్కరణ శిక్ష
విధించగా శ్రీరామునికి చేసిన సహాయ సహకారములను
చూసి మహనీయునిగా ఎంచి నీరాజనాలు పట్టిరి.
గంధమాధన
శిఖర సమీపమున విభీషణుని సముద్ర
జలములతో అభిషిక్తుని గావించి లంకాధిపతిని గావించిన
శ్రీరాముని సాక్షాత్ విష్ణుమూర్తిగా నమ్మి
కొలిచిన ఘనుడు విభీషణుడు. ఈ
పర్వత శిఖరముపై శ్రీరామ లక్ష్మణ
సమేతుడై విభీషణుడు ఆరాధింపబడుట విశేషమే అయినా సీతాదేవి
ప్రతిమ కొంచము దూరముగా దక్షిణ
దిశకు తిరిగి ఉండుట మరియొక
విశేషము. ఇచట శ్రీరాముని "శోకరాముడని
" అనుట ఒక నానుడి.
రామరావణ
యుద్ధములో విభీషణుడు రామునికి రావణుని యొక్క
జన్మ రహస్యమును తెలిపి ఆతని ఉదరములో
నిక్షిప్తమై ఉన్న అమృత కలశము
పడగొట్టమని కాకున్న ఆతనిని వధించుట
దుస్సాధ్యమని తెలుపగా రాముడు నాభి
వైపు బాణము వేయుట యుద్ధ
నీతికి విరుద్ధమని సంశయించెను. కానీ హనుమ తన
తండ్రి అయిన వాయుదేవుని మరియు
సర్వదేవతలను ధర్మానికి విజయము సంప్రాప్తింప చేయుమని
వేడుకొనెను. ఒక్కసారిగా గాలి దుమారము చెలరేగి
వాయు వేగముతో సంధింపబడిన బ్రహ్మాస్త్రం
రావణ వధను న్యాయ సమ్మతము
గావించెను.
రావణ చెర నుంచి సీతకు
విముక్తి కల్పించిన శ్రీరాముడు ఆమెకు అగ్ని పరీక్షను
ఆదేశించెను. అగ్ని పునీత అయిన
సీతను స్వీకారము చేసిన రాముడు సపరివారముగా
పుష్పక విమానమును అధిరోహించి అయోధ్యకు తలపెను. మార్గ
మధ్యములో రామేశ్వరము వద్ద ఋషుల ఆదేశము
ప్రకారము రావణబ్రహ్మను హతమార్చుట వలన శ్రీరామునికి
బ్రహ్మ హత్యా పాతకము సంక్రమించినది
కావున ఆ దోష
నివారణార్ధమై శివలింగమును ప్రతిష్ఠాపనము చేయుమనగా శ్రీరాముడు "రామలింగేశ్వర
లింగమును" ప్రతిష్ఠించెను..
సింహళ దేశ వాశులు విభీషణుని
"సతార వారం దేవియో" అని
భావించి ఆరాధించుట ఒక రివాజు
విభీషణుని
లాంటి నిజ స్నేహితులు ఆపదలలో
ఆదుకొనే కరుణామయులు యుగ యుగాలకు తార్కాణముగా అవనిపై నడయాడటము భారత
దేశ పుణ్య సంపదలే కదా.
నేడు ఇవే స్నేహ సంబధాలను
ఆధునిక మిత్రులు ప్రతి సంవత్సరము
ఆగస్ట్ నెలలో వచ్చే మొదటి
ఆదివారము "ఫ్రెండ్ షిప్" దినముగా
జాతి, మత, కుల, భాష
విభేధములు లేక ప్రపంచమంతటా
విస్తరింప చేసి ఆచరించడము విభీషణుని
ఆశీస్సులతో ఏ యుగమైనా
పేరు మార్పులతో, సంఘఠనల మార్పులతో ఎప్పటికీ శతృ దేశవాశులైనా
వారి స్నేహ బంధములు శ్రీరామ
విభీషణుని మైత్రిలా శాశ్వతము అందుకే
ఆంగ్లములో
"ట్రూ ఫ్రెండ్స్ ఆర్ రేర్;కీప్
దెం విత్ కేర్" అనగా
తెలుగు నుడిలో “సృష్టిలో తీయనిది
స్నేహమే" అని అభివర్ణించేరు
ఇది ఎప్పటికీ వసివాడని సత్యమే
అని నేనంటాను. మరి మీరేమంటారు?
6.కృపాచార్యుడు
సప్త చిరంజీవులలో ఆరవ శక్తిమంతుడైన యుద్ధవీరుడు
మరియు కౌరవపాండవులకు గురుతుల్యునిగా అభివర్ణించడమైనది. శ్రీకృష్ణుని కృప వలన మరియు
ద్రోణాచార్యుని వరప్రభావము వలన చిరంజీవత్వం సంప్రాప్తింపబడినది.
శారద్వాన,
జనపదిల కుమారునిగా అవనిపై అవతరించెను. ఈతని
జన్మ విచిత్ర రీతిలో సంభవమైనది.
కారణము గౌతముని మనుమడు అయిన
శరద్వాన మహర్షి పుట్టుక తోనే
విలువిద్య నిపుణుడు కావున "శరద్వాన"
అని నామాంకితుడాయెను. విలువిద్యలో ఈ మహనీయుని
ఎదిరించు మహనీయులు లేరు. సాక్షాత్
దేవతలు సైతము ఈ వీరుని
బల పరాక్రమములకు భీతిచెంది
అచ్చెరువొంది ఇంద్రుని శరణు వేడిరి.
వారి ప్రార్ధనలను ఆలకించిన దేవేంద్రుడు "జనపది"
అను అప్సరసను భువిపైకి పంపెను.
ఆమె అతిలోక సౌందర్యమును వీక్షించిన
తక్షణము శరద్వానుడు విచలితుడై విల్లు బాణములను వదలెను.
ఆతని వీర్యము దర్భలపై పడి
రెండుగా చీల్చబదినవి. ఎడమ భాగము పుత్రికగా,
కుడి భాగము పుత్రునిగా మారివిచిత్ర
సంతానముగా రూపు చెందిరి. తదనంతరము
సంతానాపేక్ష లేని ఇరువురు తమ
తమ స్థానములకు అరిగిరి.
ఈ అధ్భుత బ్రాహ్మణ
సంతానమును చూసిన శంతన మహారాజు
వారిరువురిని తన రాజ్యమునకు చేర్చెను.
ఆతని కృపతో క్షేమవంతులైరి కావున
"కృప" “కృపి" అని నామాంకితము చేసెను.
కొంత కాలమునకు శరద్వాన మహర్షికి
ఈ విషయము తెలిసి
అంతఃపురమునకు అరుదెంచి తన సంతానమునకు
శాస్త్రోక్త కర్మలను గావించి వేద
పారంగుతులను గావించెను. కృపుడు పెద్దవాడైన తదనంతరము
కౌరవపాండవులకు కొంత కాలము గురువుగా
మారి "కృపాచార్యుడు" అని బిరుదాంకితుడాయెను. ఈతని
సోదరి కృపి ద్రోణాచార్యుని భార్యగా
ఆతని సేవలో సదా నిమగ్నురాలాయెను.
మహాభారత
వర్ణనలో కృపాచార్యులు అతి నిరాడంబరజీవి. ఎన్నోరీతుల
కౌరవుల చేతిలో అవమానములను అనుభవించెను.
సభలో ద్రౌపదికి జరిగిన పరాభవము ఎదిరించలేని
అసహాయులలో ఒకడైనా తనవంతు ధర్మనిరతిని
దుర్యోధనాధులకు విశదీకరించి కౌరవుల దుశ్చర్యలను అడ్డగించ
ప్రయత్నించెను. కర్ణ అర్జునల మధ్య
యుద్ధరీతిని ఆపుటకు ఉత్తర గోగ్రహణ
సమయములో ప్రయత్నించి విఫలుడాయెను.
మహాభారత
యుద్ధ సమయములో ధర్మరాజు గురుతుల్యుల
ఆశీర్వాదము కొరకు శిరస్సు వంచి
ప్రణమిల్లగా కురువృద్ధులు వాని వినయ సౌశీల్యతలకు
మెచ్చిరి కృపాచార్యుడు వరముగా "గురువుని మించిన శిష్యులు
కమ్మని ధర్మము మీతోఉన్నది తప్పక
విజయము సాధిస్తారు” అని దీవించెను. అతిరధ
మహారధులు కౌరవ సేన కలిగి
ఉన్నను, చిరంజీవత్వముతో అలరారే అశ్వద్ధామ, కృపాచార్యులు
నిలచి పోరాడినను, స్వచ్చంద మరణముతో భాసిల్లు
భీష్ముని వంటి పితామహులున్నను, 18 అక్షౌణీల
సైన్య సంపత్తులున్ననూ, దైవబలము తోడు రాలేదు.
ఆ దైవబలం పాండవుల
వైపు నిలచినది. అందులకే విజయం వారికి
సంప్రాప్తమైనది.
వేద పారంగతుడు, యుద్ధనిపుణుడు అయిన భీష్ముడు ఉద్యోగ
పర్వములో కృపాచార్యుని మహారధిగా నియమించెను. ఆతను
రధము నడుపుటలో నిపుణుడు అవలీలగా
అరవై వేల మంది యోధులతో
పోరాడి గెలిచిన వీరుడు.
స్వార్ధ
రహితునిగా నిగర్విగా నిలచిన కృపాచార్యుడు తనదైన
రీతిలో కౌరవుల వైపు నిలచి
పోరాడినా ఆశీస్సులను మాత్రము పాండవుల పైనే
కురిపించెను. కనుకనే యుద్ధ భూమిలో
అర్జున కృపాచార్యుల భీకర యుద్ధమును దేవతల
ఆగమనము విశేషమే.
కురుక్షేత్ర
యుద్ధానంతరము కృపాచార్యుడు అర్జుని మనుమడైన పరీక్షిత్తుకు
గురువుగా మారి సకల విద్యా
పారంగతుని గావించెను. అందులకు మెచ్చిన శ్రీకృష్ణుడు
ఆతనికి గురు దక్షిణగా చిరంజీవత్వమును
సంప్రాప్తింప చేసెను.
కలియుగములో
కృపాచార్యుని వంటి గురుతుల్యులు లభ్యము
కావడము విద్యార్ధులకు అనుకూలమే అయినా కొందరు
గురువులు కాల, మాన పరిస్థితులను
బట్టి అధర్మాన్ని ఎదిరించలేక పోయినా మనసా వాచా
ధర్మానికే విజయం కలగాలని తమ
విద్యార్ధులను హృదయ పూర్వకముగా గురువుని
మించిన శిష్యులు కమ్మని ఆశీర్వదిస్తారు
విజయులైతే అభినందిస్తారు అని నేనంటాను. మరిమీరేమంటారు?
7. పరశురాముడు
సప్త చిరంజీవులలో పంచమ స్థానము అలరించిన
విశేష తపోధనుడు, విజ్ఞానసంపన్నుడు, దైర్యవంతుడు, మహిమోన్నతుడు అయిన పరశురాముని అవతారం
జగతికి సుశోభితము. "పరశు" అనగా "గండ్రగొడ్డలి" పరశువును ఆయుధముగా ధరించిన
యుద్ధవీరుడు. సాక్షాత్ శ్రీ మహావిష్ణువుని
దశావతారములలో పంచమ అవతారములో ఒక
అవతార పురుషునిగా అవనిపై అవతరించెను. భృగువంశ
సంజాతుడు కావున "భార్గవరాముని" గా పేరొందెను. అతి
ముఖ్యమైన సుప్రశిద్ధులైన
ముగ్గురు రాములు అవనిపై అవతరించిరి.
త్రేతా యుగములో రఘురాముడు, ద్వాపర
యుగములో బలరాముడు, చిరంజీవునిగా అనేక పురాతన చరిత్రలకు
సాక్షిగా పరశురాముడు నిలిచారు.
వైవశ్వంత
- మన్వంతరములో సప్త ఋషిగా నిలచిన
జమదగ్ని, సూర్య దేశ రాజకుమారి
రేణుకాదేవిలకు ఐదవ కుమారుడుగా జన్మించెను.
అనేక సంవత్సరములు హిమవత్ పర్వతముపై తపమాచరించి
ఈశ్వరుని మెప్పించెను. ఈశ్వరుడు ప్రత్యక్షమై బలమైన తిరుగులేని ఆయుధములను,
పరశురామునికి ప్రసాదించెను.
ఒక దినము రేణుకాదేవి నీటి
కొరకై నదీ తీరమునకు వెడలి
అచట గంధర్వుల ఆటపాటలను చూసి
మైమరచి తన రాకను ఆలస్యము
చేసెను. జమదగ్ని ఆగ్రహము చెంది
ఆమె శిరస్సును నరకమని తన కుమారులకు
ఆనతీయగా వారు నిరాకరించగా శిలలు
కమ్మని శపించెను. తండ్రి మాట విధేయుడైన
పరశురాముడు ఆతని ఆజ్ఞను పాలించెను.
ఆతని పితృభక్తికి మెచ్చి రెండు వరములు
కోరు కొమ్మనగా తన తల్లిని
జీవంతవాగి చేయుమని, శిలలై పడిఉన్న
తన సహోదరులను పునర్జీవితులను
చేయుమని కోరెను. పునర్జీవితులైన కుటుంబ
సభ్యులు చిరకాలము ఆనందముగా జీవించిరి.
కార్తవీర్యార్జునుడు
అతి బలవంతుడు. సహస్ర బాహువులలో వేయి
అస్త్రములు దాల్చి రిపులకు భయ
భ్రాంతులను కలిగించుచుండెను. ఒకసారి జమదగ్ని ఆశ్రమమునకు
విచ్చేసి ఆతని వద్ద ఉన్న
"కామధేనువుని" అడిగెను. ఎంత ధనమిచ్చినా
జమదగ్ని నిరాకరించగా బలవంతముగా కట్టి తీసుకొని వెళ్ళెను.
పరశురాముడు ఈ అకృత్యమును
సహించనేరక కార్తవీరార్జునిని
వధించి గోవుని తీసుకువచ్చెను. దేశమునేలే
అన్యాయ మార్గములో నడిచే రాజవధ అక్రమమే
అయిన ధర్మ
సంస్థాపితము కొరకే అని మనము
గ్రహించాలి.
కొంత కాలము తరువత కార్తవీర్యుని
కుమారులు హైహైలు జమదగ్నిని వధించిరి.
ఈ దుర్వార్త తెలిసిన
పరశురాముడు ఈ లోకములో దుర్మార్గులైన
క్షత్రియులైన వారిని నాశనం చేస్తానని
శపధం చేసి 21 సార్లు భూ
ప్రదక్షిణం చేసి శతృనిర్మూలనము గావించెను.
ఈ దారుణ కాండములో
నిలచినది రఘువంశమే.
రుధిరం ఏరులా ప్రవహిస్తే ఆరాజ
నెత్తురులో పితృతర్పణం చేసిన ఈ ఐదు
రక్తపు మడుగులే "శమంతక పంచకం" అని
పేరొందినవి. మహాభారత యుద్ధం జరిగిన
ప్రాంతమే ఇది. తన తపః
శక్తితో తండ్రి శిరస్సుని మొండానికి
అతికించి అతిగొప్ప యజ్ఞం చేయగా ఆవ్రత
ప్రభావము వలన జమదగ్ని పునర్జీవితుడై
సప్త ఋషులలో ఒకనిగా గగన
మండలములో వెలుగులీనుట అధ్భుతమే.
శ్రీరాముడు
శివధనస్సు విరిచి సీతను వివాహమాడెను
అను వార్త విన్న పరశురాముడు
ఆగ్రహముతో తన చేతిలో ఉన్న
విష్ణువు ధనస్సు విరవమని సవాలు
చేయగా ఆ విల్లు
శ్రెరాముని చేతిలో అవలీలగా సంధింపబడినది.
పరశురాముని తేజస్సు రామునిలో చేరి
ఆతను సాక్షాత్ శ్రీ మహావిష్ణువే
అని నమస్కరించి "భార్గవ
రాముని అవసరం అవనికి తీరినది
రఘురాముని ఆగమనము అవనికి సంప్రాప్తమైనది” అని రాజస, తామస ప్రవృత్తులను
వీడి తపస్సు చేసుకొనడానికి మహేంద్ర
పర్వతము చేరెను. అందువలన ఈ
ప్రాంతము "పరశురామ క్షేత్రమని" పేరొందెను.
ద్వాపర యుగములో కర్ణునికి గురువుగా
అస్త్ర శస్త్ర విద్యలు నేర్పెను.
కానీ కర్ణుడు తాను సూత
పుత్రుడనని నిజము దాచి పరశురాముని
వద్ద విద్యలను అభ్యసించెను. ఒక
దినము కర్ణుని ఒడిలో విశ్రాంతి
తీసుకొను సమయములో ఒక పురుగు
కర్ణునికి చేసిన గాయము వలన
రక్తము కాలువలా పారెను. కర్ణుడు
గురువుకి నిద్రా భంగము కారాదు
అని ఆబాధను బిగపట్టెను. మెలకువ
వచ్చిన పరశురాముడు
జరిగిన ఘాతుకమును చూసి క్షత్రియునికి తప్ప
ఇంత సహనము వేరెవ్వరికీ సాధ్యము
కాదని తన దివ్య దృష్టితో
సర్వము తెలిసికొని “అసత్యమాడి నేర్చిన విద్య నిష్ఫలమగుగాక.
యుద్ధ భూమిలో అస్త్రప్రయోగ సమయములో
మంత్రము జ్ఞప్తికి రాకుండు గాక" అని
శపించెను. ఈ విధముగా
కర్ణుని శక్తి నిర్వీర్యమవడానికి ఒక
కారణము పరశురాముని శాపమే.
అందుకని
కలి యుగములో పరశురాముని వంటి
గురుదేవులు మనకు సాక్షాత్కరించినా వారిలోని
శక్తి యుక్తులను తక్కువ అంచనా వేయరాదు.
వారు సదా విధ్యార్ధులలో దాగి
ఉన్న ప్రతికూల ఆలోచనలను మూల
మూలలనుంచి వెలికి తీసి సన్మార్గములో
నడపటానికి సర్వదా ప్రయత్నిస్తారు. ధర్మం
నాడే కాదు నేటికీ మరియు
ఎప్పటికీ ఆదర్శమే. చిరంజీవులుగా విలసిల్లే
విద్యార్ధులు ఈ అవనిపై
సదా తల్లితండ్రులని ఏ యుగమైనా
సదా కాపాడుకొంటారు. అని నేనంటాను. మరి
మీరేమంటారు?
No comments:
Post a Comment