"సప్త గిరులపై వెలసిన శ్రీ శ్రీనివాసుని కృపాకటాక్షములే సర్వ జనతకు పాపహరణములు"
కలియుగ దేవునిగా ఇలపై వెలసిన శ్రీ మహావిష్ణువుని దివ్యరూపమే తిరుమల గిరిపై నెలకొని ఉన్నది.
కలి యుగములో మానవులు నాస్తికులై అధర్మ మార్గములో సంచరించుటను చూసి కశ్యపాది మహామునులు లోక కల్యాణము కొరకు ధర్మ సంస్థాపన కొరకు ఒక విశిష్ట యాగము చేయ సంకల్పించిరి. వారు ఏ దేవుని కొరకు ఆరాధనము చేయుచున్నారో, యజ్ఞ ఫలమును త్రిమూర్తులలో ఏ దేవునికి సమర్పణ చేయనున్నారో తెలుపమని నారద మహర్షి ప్రశ్నించెను.
మునులు తమలో తాము వాదులాడుకొని భృగుమహర్షిని న్యాయనిర్ణేతగా ఎంచి
త్రిమూర్తులలో ఎవరు సత్వ గుణ సంపన్నులో, ఎవరు యజ్ఞ ఫల స్వీకరణకు అధిపతులో నిర్ణయింపమని త్రిలోకములకు పంపిరి.
వారి
అనుమతిని గైకొని భృగుమహర్షి ముందుగా సత్యలోకమును తలిపెను. అచట సత్యలోకాధి పతి అయిన బ్రహ్మదేవుదు వేదగోష్ఠిలో మరియు వేదమాత అయిన సరస్వతీదేవి వీణాగానములో పరవశమొందుచు తల్లీనమై భృగుమహర్షి రాకను గమనించక, ఆహ్వానించక నిర్లక్ష్య వైఖరిని ప్రస్పుఠింప చేసెను. కోపోద్రిక్తుడైన ముని ఈ అవమానమును “సహింపజాలక కలియుగములో బ్రహ్మకు అవనిపై ఆలయములు లేకుండు గాక” అని శపించెను.
తదనంతరము మహర్షి కైలాసమేతెంచగా అచట పరమేశ్వరుడు పార్వతీదేవితో తాండవ నృత్య కేళిలో తన్మయుడై ముని రాకను గమనించక సేవకుల అనుమతిలేక తన ఏకాంత మదిరము లోనికి ప్రవేశించినందులకు శివుడు మునిపై కోపోద్రిక్తుడాయెను. తక్షణము భృగుమహర్షి తామస గుణాధికుడైన ఈశ్వరుని క్రోధముతో చూసి “కలి యుగములో అవనిపై శివునికి లింగ రూపములోనే ఆరాధనలు జరుగుగాక” అని శపించెను.
తనలో
రగిలే కోపాగ్నులను అణచుకొనిన మహర్షి త్వరితముగా
వైకుంఠమును చేరెను. అచ్చట శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో శేష తల్పమున శయనించి ఉండగా లక్ష్మీదేవి అతని పాదములను ఒత్తుచుండెను. అంద చందములతో వైభవములతో అష్టైశ్వర్యములతో అలరారుచుండెడి వైకుంఠము చేరిన భృగువు తన రాకను గమనించని వారి తీరుకు కోపోద్రిక్తుడై ఆవేశముతో శ్రీ మహావిష్ణువు ఎదపై తన కాలితో తన్నెను. లోకములన్నీ గడగడ లాడెను. భూమి కంపించెను. శ్రీ మహావిష్ణువు ఎటువంటి అగ్రహము లేక పానుపు దిగి మహర్షి పాదదూళిచే తన శరీరము పావనమైనదని ఆతని పదములను ఒత్తుచూ అహంకార ప్రతి రూపమైన నేత్రమును చిదిమి వేసెను. శ్రీహరి శాంత స్వభావమునకు ప్రీతి చెందిన ముని తన అపరాధమును క్షమింపుమని త్రిమూర్తులలో సత్వగుణ సంపన్నుడు, యజ్ఞ ఫలమును స్వీకరించుటకు అర్హుడు శ్రీ మహావిష్ణువే అని నిర్ణయించెను. అంతేకాక శ్రీ మహావిష్ణువు కలియుగాంతము వరకు అవనిపై నిత్యపూజలను అందుకొని దూప దీప నైవేద్యములతో వెలుగులీను మహిమోపేతుడైన దేవునిగా కీర్తింపబడునని ఆతని అవతార విషయమును తెలిపెను. కానీ లక్ష్మీదేవి తన నివాస స్థలమైన శ్రీ మహావిష్ణువు హృదయస్థానము పైన జరిగిన పరాభవమును సహించలేక అతనితో వాదులాడి వైకుంఠమును వీడి వెడలిపోయెను.
పురాణ ఇతిహాసముల ప్రకారము లక్ష్మీదేవిని అనుసరిస్తూ వైకుంఠమును వీడి భువిపైకి చేరిన శ్రీ మహావిష్ణువు శ్రీనివాసుని రూపముతో ఏడు కొండలపైన వెలసి కలియుగాంతము వరకు అశేష భక్తకోటిని తన కరుణా కటాక్షములతో సంరక్షించును అను ప్రగాఢ నమ్మకమునకు నిలువెత్తు సాక్షాత్కారమే తిరుమల క్షేత్రము. కృత, త్రేత, ద్వాపర, కలియుగముల చరిత్రలకు తార్కాణముగా నిలచిన పుణ్య క్షేత్రము. ఈ సప్తగిరులయొక్క మహత్యమును అతి సామాన్య రీతిలో వర్ణించి
విశదీకరించడమే ఈ వ్యాస ముఖ్యోద్దేశ్యము.
ప్రపంచ ప్రశిద్ధిగాంచిన తిరుమలకి ఉన్న అసాధరణ ధర్మం ముఖ్య లక్షణం “ఏడుకొండలు" (సప్త గిరులు) కలిగి ఉండటమే. ఈ దేవునికి మరియొక పేరు ఏడు కొండల స్వామి (గాడ్ ఆఫ్ సెవెన్ హిల్స్). ఈ సప్త గిరులు
అవనిపై నెలకొన్న కాలము ఇతమిద్ధముగా తెలుపలేక పోయినా అన్ని యుగములకూ తార్కాణముగా నిలచి ఉండుట ఒక విశేషమైతే ఎన్నో మరెన్నో మహిమలతో నిరూపణము కావడము మరియొక విశిష్టత బ్రహ్మ సృష్టి ఆరంభము నుంచి వివిధ నామములతో ఈ సప్త శిఖరములు అతి ప్రాచీనమైనవిగా నిరూపించబడినవి.
శ్రీ
మహావిష్ణువు వసుధపై ఏడు దీక్షా తపస్సులను ఉంచి ఏడు కొండలను యజ్ఞవేదికగా చేయడము జరిగినది.
1. క్షవరము
తిరుమలకి వచ్చే భక్తులు పాటించే ప్రప్రధమ దీక్ష స్వామికి తలనీలాలు సమర్పించడము. ఈ దీక్ష తపస్సు వెనుక దాగిన రహస్యము మనలో అంతర్గతముగా దాగి ఉన్న అహాన్ని తీసివేయడమే.
2.స్నానము
శుచికి, శుభ్రతకు చిహ్నమే స్నానము. స్వామి పుష్కరిణిలో చేసే స్నాన మహిమ వర్ణించనలవి కానిది. భక్తులు బాహ్య, అంతరంగములను
పవిత్రీకరింప చేసుకొనే ద్వితీయ దీక్ష తపస్సే స్నానము.
3.నూతన ఉత్తరీయము
ప్రత్యేకమైన ఆచార వ్యవహారములతో, భారత దేశ సంస్కృతీ సంప్రదాయములతో సదా అలరారే వైకుంఠ వాసుని దర్శనమునకు ఒక సంప్రదాయ వస్త్రధారణ నియమం, రీతి, రివాజులు తృతీయ దీక్ష తపస్సులో నిర్దేశించడమైనది.
4. దీక్ష
యజ్ఞయాగాది క్రతువులలో భాగము వహించడమే ఈ దీక్ష ముఖ్యోద్దేశ్యము. వానిలో ముఖ్యమైనవి శ్రీనివాసుని దర్శనము, కల్యాణ మహోత్సవ సంభ్రమములలో పాల్గొనుట, వసంతోత్సవములు, దీపోత్సవములు, బ్రహ్మోత్సవములు ఎన్నో మరెన్నో వైభవోపేతమైన ఉత్సవములలో పాల్గొని కనులార వీక్షించుటయే నాల్గవ దీక్షా తపస్సుగా భాసిల్లుతున్నది.
మూడు
ఉపసత్తులు
1.ఉపవాసము
తిరుమలేశునికి అత్యంత ప్రీతి పాత్రమైనది "ఉపవాసదీక్ష". ఇది ముఖ్యముగా అశేష భక్తకోటి శనివారము అల్ప ఆహారమును సేవించే ఉపవాస దీక్ష. ఒక సర్వ సామాన్యమైన ఉపసత్తుగా భావించ బడినది.
2.వాసము
ఉపవాస దీక్షను అనుసరించు వారు ఇహ పర వాంఛలను వీడి భగవంతునికి చేరువుగా నామ సంకీర్తనలతో కాలము గడపడమే వాసములోని ముఖ్యోద్దేశ్యము.
3.సత్
అరిషఢ్వర్గములైన అత్యంత హానికరములైన కామ, క్రోధ, లోభ, మోహ, మద మత్సరములను విడచి మనసుని శుద్ధి చేసుకొని ఆరు కొండలను అధిష్టించడము ఒక అధ్భుత విశేషమైతే ఏడవ కొండ చేరుసరికి భగవంతుని దర్శనము సంప్రాప్తమై మనిషిలోని విజ్ఞాన జ్యోతి వెలిగించబడి మానసిక స్వచ్చత, శుద్ధి, శుభ్రత, నిర్మలత్వములతో అధిష్టింపబడే సప్త శిఖరమే "తిరుమల" అనునది ఒక నమ్మకము మరియు విశ్వసనీయత. మరియు తృతీయ ఉపసత్తుగా భావించబడిన ప్రగాఢమైన నమ్మకము.
అందువలన నాలుగు దీక్షలు మరియు మూడు ఉపసత్తులు = ఏడు సప్త గిరుల రూపములో వెలసినవి.
"అహము" అనగా రోజు “సప్తాహము” అనగా సప్త దినములు ఆది, సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని సప్త దినములతో కూడిన ఏడు అహములకు ప్రతీకగా ఏడు కొండలు తార్కారణముగా నిలచినవి అనునది వేదవచన.
సప్త
గిరులపై నెలకొన్న అనేక వృక్ష సంపత్తులు, అగణిత ఔషధీ మహిమలతో వీచే పవనములు ఆరోగ్యవృద్ధిని పెంపొందింప చేయడానికి ఎంతో శక్తివంతమైనవి. ఈ సప్త గిరులపై వెలసిన వృక్షములన్నీ కల్పవృక్షములే మరియు శిలలన్నీ మణులుగా భాసిల్లుతూ వాటి విలువలను నిర్దేశించుటకు మానవులకు అసాధ్యము అయినది. అచట వశించు ప్రాణులన్నీ దేవతల అంశలతో తిరుగాడు మహిమోపేత మైన ప్రకృతి ప్రసాదించిన ఉచిత సంపత్తులే.
సప్తగిరుల విస్తీర్ణము 26.75 స్కేర్ కిలొమీటర్స్ మరియు సముద్ర మట్టమునకు 980 మీటర్స్ ఎత్తులో అమరి ఉన్నవి. తొండై మండలమునకు అధిపతి మరియు తమిళదేశ పరిపాలకుడైన తొండమాన్ చక్రవర్తికి స్వప్న దర్శనములో ఆలయ నిర్మాణమునకు శ్రీ మహావిష్ణువు యొక్క అనుమతి లభించగా క్రీ.శ 300 సంవత్సరములో ఈ ఆలయనిర్మాణము జరిగినది. నడక దారిలో సప్త గిరులు ఆరోహణము చేయు భక్తులకు 3550 మెట్లు సక్రమ రీతిలో నిర్మింపబడినవి. దారి పొడవునా అనేక వన్యమృగములు, సుందర వృక్ష సంపదలు, చిరు జలపాత ఘోషలు, వేద మంత్రములతో ప్రతి ధ్వనించే పరిసరములు, చల్లగ వీచే మలయ పవనములు ఎన్నో మరెన్నో కనులకు విందు చేయు సౌందర్యములతో అత్యంత అధ్భుత వీక్షణములతో అనునిత్యము అలరారే సప్త గిరుల సందర్శనము ఎంతో మరెంతో పుణ్య సంపదే. ప్రపంచ దేశములన్నీ కులమతములకు అతీతముగా తిరుమలకు విచ్చేసి కలియుగ వైకుంఠనాధుని దర్శించి తరించడము ఒక విశేషమైతే కలియుగములో మనుజులకు బాహ్య అంతఃశుధ్ధి సంక్రమింప చేయగలిగేది మానవజన్మకు సార్ధకతను పెంపొందింప చేయగలిగేది తిరుమల శ్రీనివాసుని దర్శనము కావడము మరియొక విశేషము.
తిరుమలలో నెలకొన్న సప్తగిరులు కృతయుగమున (వృషభాద్రి), త్రేతాయుగమున (అంజనాద్రి), ద్వాపరయుగమున (శేషాచలం), కలియుగమున (వెంకటాద్రి), గరుడాద్రి, వృషాద్రి మరియు నారాయణాద్రిగా నామాంకితమైనవి.
1.వృషభాద్రి
కృతయుగములో తిరుమల శిఖరము వృషభాద్రి అను పేరుతో నెలకొని ఉన్నది. ఈ యుగములో వృషభుడను అతి బలవంతుడైన అసురుడు. ఋషుల తపమును విఘ్న పరచి తాను మాత్రము ప్రతి నిత్యము తుంబుర తీర్ధములో స్నానమాచరించి శ్రీ వరాహనరసింహునికి ప్రతీ నిత్యము భక్తి శ్రద్ధలతో పూజలొనరించి తన తలను తానే నరికి తరువాత దివ్యశక్తితో అతికించ కొనగలిగే అత్యంత శక్తిమంతుడైన భక్తి తత్పరుడు ఈ శిఖరముపై తపమాచరించెను. కొన్ని సంవత్సరములకు శ్రీ నారాయణుడు ఆతని అతులిత భక్తికి ప్రత్యక్షమై వరమును కోరుకొమ్మనగా హరిని తనతో యుద్ధము చేయుమని కోరెను. సుమారు 27 సంవత్సరములు వారిరువురి నడుమ భీకర యుద్ధము కొనసాగెను. చివరకు శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రముతో వృషభుని సంహరించ బోగా ఆ చక్రమునకు నమస్కరించి తరతరాల వారు తనను గుర్తు చేసుకొను రీతిలో ఆ కొండ తన పేరుతో కీర్తినొందవలేనని మరియు, శ్రీ మహావిష్ణువు శ్రీ నరసింహుని రూపముతో వెలసి
యుగయుగాంతముల వరకు భక్తకోటి పూజలను అందు కొనవలెనని ప్రార్ధించగా ఆతని కోరికను మన్నించి "తధాస్తు" అని దీవించెను. అందువలన కృత యుగమునుంచి నేటి వరకు వృషభుని పేర "వృషభాద్రి" గా విరాజిల్లుతున్న ఈ పర్వతము అత్యంత మహిమాన్వితము, మహిమోపేతము.
2.అంజనాద్రి
త్రేతా యుగములో ఈ పర్వతము "అంజనాద్రి" అను పేరుతో వాశికెక్కినది.
అతి సుందరమైన అంజనాదేవి "కేసరి" అను కపిరాజును వివాహమాడెను. చాలా కాలము వారికి సంతానము లేనందు వలన అంజనాదేవి ఇలపై అత్యంత బలవంతుడై సదా చిరంజీవత్వంతో విలసిల్లే కుమారుని కొరకై ఈ పర్వతముపై తపమాచరించెను. మాతంగ ముని ఆమెకు మంత్రోపదేశము గావించెను. ఆమె నిత్యము స్వామి పుష్కరిణిలో స్నానమాచరించి శ్రీ వరాహస్వామిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించి అశ్వద్ధ వృక్షమునకు ప్రదక్షిణలు చేసి, నీహారికగా ఘోర తపమాచరించినది. ప్రతి సంవత్సరము వాయుదేవుని అనుగ్రహము వలన ఒక ఫలము ఆమె ఒడిలో పడటము దైవేచ్చ. దానిని ఆమె ఆరగించి క్రమము తప్పక 12 సంవత్సరములు కఠిన దీక్షాపరురాలై నియమ నిష్ఠలతో గడిపి 13వ సంవత్సరము ప్రారంభము కాగానే వాయుదేవుని అనుగ్రహము వలన ఆతని వీర్యముతో నిండిన ఆ ఫలమును ఆరగించిన అంజనాదేవి గర్భము దాల్చి వీర పుత్రుడుగా చిరంజీవత్వముతో అలరారే "ఆంజనేయుని” ఆవిర్భావమునకు నాందీ పలికిన పుణ్య పర్వత ప్రాంతము. అంజనాదేవి తపమాచరించిన స్థలము కావున "అంజనాద్రి". సంతానము లేని వారు ఇచట పుష్కరిణిలో స్నానమాచరించి శ్రీ నరసింహుని పూజించి తదనంతరము శ్రీ శ్రీనివాసుని దర్శించితే వారి కోరిక ఈడేరుతుంది అనునది ఒక ప్రగాడ విశ్వాసము. ఇంత మహిమోపేతమయిన "అంజనాద్రి" శిఖరము తల్లి పేరుతో మరియు తనయుడు అదే పేరుతో వెలుగులీనడము అధ్భుత విశేషమే.
3.శేషాచలము
ద్వాపర యుగములో ఈ శిఖరము "శేషాచలం" (శేషాద్రి) అను నామముతో పేరొందెను. ఒకానొక కాలములో వాయుదేవునికి, ఆదిశేషునికి జరిగిన వాగ్వివాదములే వారిరువురి శక్తి యుక్తులను నిరూపించుకొను పరేక్షా సమయము ఆసన్నమాయెను. వారి బలాబలములను పరీక్షింప దలచిన శ్రీ మహావిష్ణువు మేరు పర్వత పుత్రుడైన ఆనంద పర్వతమును చూపి దానిని ఆదిశేషుడు తన విష జ్వాలలతో చుట్టి కదలింపబడ కుండా నిలుప గలగాలి. తదనంతరము వాయుదేవుడు ఆ శిఖరమును తన శక్తితో బలముతో కదిలించగలగాలి. ఎవరు గెలుపొందితే వారు విజేతలుగా వెలుగులీనెదరు అని తెలిపెను. అనంతరము వాయుదేవుడు శ్రీ మహావిష్ణువునకు నమస్కరించి ఆతని అశీర్వాదము పొంది తన కాలి చిటికిన వేలుతో ఆ పర్వతమును తాకగా అత్యంత అధ్భుత వీక్షణము ఏర్పడెను. ఆనంద పర్వతము పైకి లేచి కొంత భాగము కొండ చరియ రూపములో ఎన్నో వేల యోజనముల దూరములో దక్షిణ దిశగా సువర్ణముఖీ నది తీరమున పడినది. ఆది శేషుని తల భాగము తిరుమల శిఖరముపై వెలసెను. తిరుమలలో పడిన ఆదిశేషుని తల భాగము "శేషాద్రి" అని, శ్రీశైలము వరకు వ్యాప్తీకరించిన భాగము "శ్రీగిరి" అను నామముతో ప్రశిద్ధి చెందినది. ఆదిశేషుని వలన ఏర్పడిన పర్వత శ్రేణి కావున "శేషాద్రి" అను పేరుతో ద్వాపర యుగమునుంచి నేటివరకు తగిన సాక్ష్యాధారములతో నెలకొనిఉన్నది. ఆనందపర్వత కదలిక వలన రూపొందినది కావున "ఆనందశిఖరము” గా వెలుగులీనుతున్నది.
శ్రీ
శ్రీనివాస పద్మావతీదేవి వివాహమహొత్సవములు అతి వైభవముగా
జరిగిన సందర్భములో వివాహవేడుకలను చూడ వచ్చిన కోట్లాది జనులకు పంక్తులుగా వడ్డించిన విస్తరులు తిరుమల నుండి శ్రీశైలము వరకు వ్యాప్తీకరించినవి అను విషయము శ్రీ శ్రీనివాస కల్యాణ సమయ ముఖ్య సంఘఠనగా అభివర్ణించడమైనది. ఇంత మహిమోపేత మైన “శేషాద్రి" శిఖర దర్శనము పునః దర్శన ప్రాప్తిని అశేష భక్త కోటికి కలిగించితే "శ్రీగిరి" దర్శనము “పునర్జన్మరహితులను” గా భక్త కోటిని తరింపచేయును అనునది వేదనుడి.
4.వెంకటాద్రి
కలి
యుగములో తిరుమల శిఖరము "వెంకటాద్రి" అను పేరుతో విరాజిల్లుతున్నది. "వెం" అనగా పాపము, "కట" అనగా నశింప చేయునది. అందువలన తిరుమల శిఖరము
పాపములను నశింపచేయు పవిత్ర భూమి.
వరాహపురాణము "సర్వ పాపానివేం ప్రాహుః": కటా సదా ఉచ్యతే:సర్వపాపహారిత్వాత్ వెంకటాద్రి రితి స్మృతః" అని తెలిపినది.
వామన
పురాణము వెంకటాచల దర్శనము పాపములను దహింపచేసి అమృతమును, మోక్షమును, ఐశ్వర్యమును ప్రసాదింప చేయు సమాహమే "వెంకటాచలం"అని తెలిపినది.
ఋగ్వేద వర్ణనలో "అరాయికాణే వె్ంకటేగిరిం గచ్చ:అరాయికాణేశిరించి రస్త్య సత్వభిః:తేభిష్ట్వా చతయామసి". కటిక పేదవారైనను, అంధులైనను, అంగహీనులైనను లక్ష్మీపతి అయిన శ్రీ శ్రీనివాస సన్నిధికి సాత్త్వికులైన భక్తులతో కలసి వెళ్ళినచో వారి పాపములు తొలగుతాయి అనునది వెంకటాద్రి మహిమను వర్ణించు వేద సత్యనుడికారము..
ఒకానొక కాలములో నిష్టాచరితుడైన ఒక బ్రాహ్మణుడు కామానికి వశుడై వర్ణ సంక్రమణ జరిపి ఒక యువతిని వివాహమాడి ఆమె మరణముతో విరక్తి చెంది దక్షిణ దేశ యాత్ర చేయ సంకల్పించి భక్తపరివారమును అనుసరించి వెంకటాద్రిని చేరెను. అచట కపిల తీర్ధములో స్నానమాచరించి తన భార్యకు శ్రాద్ధకర్మలు చేసి భక్తితో నిలువగా శ్రీనివాసుని మహిమ వలన ఆతని పాపకర్మములు నశించబడి ఆతనికి పుణ్య లోక సంప్రాప్తిని కలిగించెను అనునది ఒక పురాణ కధనము. మరు జన్మలో ఆ బ్రాహ్మణుడే ఆకాశరాజుగా జన్మించి పద్మావతీదేవి తండ్రిగా శ్రీనివాసుని కళ్యాణమును ఆమెతో జరిపించెను. అందు వలన ఈ శిఖరము అంత ప్రతిష్టాత్మికమై "వెంకటాద్రి" నామముతో వెలుగులీనుతున్నది. భక్తకొటికి ఈ శిఖర దర్సనమే పరమ పవిత్రతను ఆపాదించును అనునది ఒక విశేషనమ్మకము.
5.వృషాద్రి
సప్త
గిరులలో పంచమ స్థానము అలరించిన తిరుమల శిఖరము "వృషాద్రి" గా విలసిల్లుతున్నది. సంస్కృతములో "వృష" అనగా యమధర్మరాజు. ఈతని వాహనము వృషభము. ఒకానొక కాలములో యమధర్మరాజు శ్రీ శ్రీనివాసుని ఈ పర్వతముపై భక్తి శ్రద్ధలతో పూజించి తన్నీలమై ఆ దేవుని అనుగ్రహముతో అశేష వరములు పొందెను అనునది పురాణ ఉవాచ. అందు వలన ఈ శిఖరము "వృషాద్రి" గా నామాంకితమైనది. ఈ శిఖర దర్శనము వలన భక్త కోటికి యమధర్మరాజు కృపతో నరక భాధలు కలుగవు అనునది ఒక ప్రగాఢ నమ్మకము.
6.గరుడాద్రి
సప్త
గిరులలో ఆరవ పర్వత శిఖరముగా నామాంకితమైనది. శ్రీ మహావిష్ణువు వాహనము "గరుడుడు" అతి వేగముగా శీఘ్రముగా పయనించగల శక్తిమంతుడు. పురాణోక్తుల ప్రకారము శ్రీ మహావిష్ణువు వైకుంఠమును వదలి భూలోకమునకు శ్రీ మహాలక్ష్మిని వెదకుచూ ఏతెంచగా గరుత్మంతుడు శ్రీ మహావిష్ణువు సమేతముగా వైకుంఠమును భూలోకమునకు విమానముపై తెచ్చి ఈ పర్వతముపై నిలిపెను. కావున నాటి నుంచి "గరుడాద్రి” గా వ్యవహరింప బడుతున్నది. శ్రీ మహావిష్ణువు విమానారూడుడై గగనము నుంచి అవనిపై నిలువగా ఆతని పద స్పర్శతో ధరణి మదిలో ఆనంద తరంగములు వెల్లువలై ఉప్పొంగెను. అందు వలన తిరుమల శిఖరము "ఆనంద పర్వతము" లేదా "ఆనంద నిలయము" అని నామాంకితమైనది. ఆ సమయములో అశేష భక్త కోటికి స్వప్నములో శ్రీ మహావిష్ణువు యొక్క దర్శనభాగ్యము "విమాన వెంకటేశ్వరుని" రూపములో గోచరించినది మరియు శంఖరాజు కధనములో శ్రీ మహావిష్ణువు స్వప్నములో సాక్షాత్కరించిన రూపము విమానమును అధిష్టించిన రూపము ఒకే రీతిలో సాక్షాత్కరింపబడుట ఒక విశేషమైతే ఏ రూపములో దర్శనము సంప్రాప్తమాయెనో అదేరీతిలో తిరుమల ఆలయ నిర్మాణము చేయుమని ఆదేశించడము జరిగినది. ఈ కధనానికి నిదర్శనముగా తిరుమల ఆలయ శిఖరముపై శ్రీ శ్రీనివాసుని దర్శనము "విమాన వెంకటేశ్వరుని" రూపములో తిలకించిన భక్త కోటి ఆనంద నిలయముపై ఆనందమగ్నులు కావడము అనునది నేటికీ ఆచరింపబడుతున్న విశేష ప్రక్రియ.
7.నారాయణాద్రి
సప్త
గిరులలో "నారాయణాద్రి" శిఖరము సప్తమ స్థానము అలరించినది. ఫూర్వ కాలములో నారాయణుడను పండితుడు శ్రీ మహావిష్ణువు యొక్క కరుణా కటాక్షణముల కొరకు విశేష తపమును ఆచరించెను. శ్రీ మహావిష్ణువు ఆతని తపమునకు మెచ్చి వరమును కోరుకొమ్మనగా ఆతడు భక్తి ప్రఫుల్లతలతో నమస్కరించి శ్రీ శ్రీనివాస రూపములో శ్రీదేవి భూదేవి సమేతముగా ఆ పర్వతముపై శాశ్వతముగా నెలకొమ్మని సదా భక్తులను అనుగ్రహించి కాపాడుమని వేడుకొనెను. మరియు బ్రహ్మదేవుని ఆనతిమేర తాను తపమాచరించితినని వినతి చేసెను. భావి కాలములో కలియుగాంతము వరకు అలవైకుంఠపురమును తలపింపచేయు రీతిలో తిరుమల శిఖరము కీర్తి నొంద వలెనని మరియు తరువాత కాలములో ఆ శిఖరము తన పేరుతో ప్రశిద్ధి చెందవలెనని వేడుకొనెను. శ్రీ మహావిష్ణువు ఆతని కోరికలను మన్నించి "తధాస్తు" అని వరమొసగుట వలన తిరుమల శిఖరము "నారాయణాద్రి" గా శాశ్వత రీతిలో ప్రస్థుతింపబడేడిదిగా, కీర్తింపబడెడిదిగా, భక్తకోటిని తరింపచేసెడిదిగా రూపుదిద్దు కొన్నది. శ్రీ మహావిష్ణువు తనను అచట ఆరాధించు భక్తులకు ప్రళయ కాలము వరకు స్వర్గ నివాసము సంప్రాప్తింప చేయుదునని స్వామి పుష్కరిణిలో స్నానమాచరించి తన దర్శనము చేసికొనిన భక్తులకు మోక్షము ప్రసాదింతునని వరములనీడెను. తదనంతరము తన భక్తుడైన నారాయణునికి సాయుద మోక్షమొసగెను.
శ్రీనివాసుని కీర్తించే అతి ముఖ్యమైన నామము "గోవిందా' అతి క్లుప్త రీతిలో ఈ పద అర్ధము
1.గో+వింద=గోవింద. వేదములను సంరక్షించిన పుణ్య మూర్తి (ప్రొటెక్టర్ ఆఫ్ వేదాస్).
2గోం+విందిత= గోవింద. శ్రీ మహావిష్ణువు విజ్ఞాన వెలుగులను ప్రసరింపచేసే శక్తిమంతుడు. క్రిష్ణావతారములో భగవద్గీత ఉఓపదేశమును అర్జునునికి చేసి జగత్ గురువుగా వాశి కెక్కెను.
3.గోవు+ఇంద=గోవింద. భూదేవి
ఇలపై పాప భారములు అధికమైన సమయాన గోవు రూపమున శ్రీ మహావిష్ణువునకు
విన్నవించు కొనగా వానిని పరిష్కరించుట కొరకు వివిధ అవతారములను దాల్చి ధరపై ధర్మసంస్థాపన చేయుటవలన "గోవిందా" అను పేరు సార్ధకమాయెను.
ప్రపంచములోనే అత్యంత ధనవంతుడుగా, భాగ్యవంతుడుగా వెలుగులీనే శ్రీ శ్రీనివాసుడు అలంకార ప్రియుడు. వెల కట్టలేని ఆభరణములతో నిత్యము అలంకరింపబడిన తిరుమలేశుని దర్శించుకొను, ముడుపులు చెల్లించుకొను భక్త సందోహములకు ఇలపై నెలకొనిన పవిత్ర ప్రదేశము తిరుమల. కలి యుగములో జరిగే అన్యాయ అక్రమార్జనలకు తిరుమల ముడుపులే పాపనివారణ. ఈ ఆర్జనలకు ఆతని ఎదపై నిలచి ఉన్న శ్రీ మహాలక్ష్మిదేవి అనుగ్రహము ఒక కారణమైతే కలియుగాంతము వరకు తన వివాహ సందర్భమున కుబేరుని వద్ద తీసుకొనిన
అప్పును ఈ ముడుపుల రూపములో భక్తుల ద్వారా సమర్పించబడిన సంపాదన కలియుగాంతము వరకు సమర్పించు కొనడమే
ఒక అంగీకారము అనునది ఒక విశ్లేషణ. ఈ రీతిలో నిత్యము మహా సముద్రమును తలపింపచేయు కోట్లాది భక్తుల సందర్శనముతో నిత్య కల్యాణ పచ్చ తోరణములతో సువర్ణ ఖచితమైన ఆలయ శిఖరముతో ప్రకృతి ప్రసాదించిన అందచందములతో నాటికీ, నేటికీ, ఎప్పటికీ, ద్విగుణీకృతమైన మహిమలతో అవనిపై వెలసిన బంగారు వాకిలితో సప్త ద్వారములు దాటి దరిచేరు భక్త కోటికి ఇలపై వైకుంఠమును తలపింపచేయునది 'తిరుమల క్షేత్రమే" అని నేనంటాను.
మరి మీరేమంటారు?
No comments:
Post a Comment