“సప్త స్వరముల సమ్మిళతమే సంగీత సామ్రాజ్యానికి స్వరలహరులు”
భారతీయ సంస్కృతీ సంప్రదాయములలో సంగీతము విశిష్ఠ స్థానము అలరించినది. వేదముల వర్ణన ప్రకారము ప్రపంచమును విస్తరించి ఉన్నవి 64 కళలు. వీటన్నిటిలో ప్రముఖ స్థానమలరించినది భారతదేశమే. రాగ, భావ, తాళ శృతుల సమ్మిళనములతో ఏర్చి కూర్చబడిన సంగీత గని సంగీతము అని తెలుపబడినది. అది అంతులేనిది, అనంతమైనది.
ఆదిలో మన విద్య లయబద్ధముగా ఉండెడిది. ఎందువలన అనగా వేద మంత్రములు సంగీత రూపమున శృతిలయలతో నియమబద్ధముగా అవతరించినవే. భారతీయ సంగీతమునకు మూలమంత్రములు వేదములే. సప్త స్వరములతో అఖండమైన మృదుమధుర పల్లవములతో జగతిని ఆనందడోలికలలో ఊగింపచేసే సంగీత విశిష్ఠతలను అతి సూక్ష్మరీతిలో వివరించడమే ఈ వ్యాస ముఖ్యోద్దేశము.
సుమారు 40000 వేల సంవత్సరములకు పూర్వమే సంగీతము అవనిపై వెలసినది. ఆదికాలములో సంగీతమునకు మూలసృష్టి ప్రకృతి ప్రసాదించిన సంపదలే. అవి మృదుమధురమైన పక్షుల కిలకిలరవములు మరియు అనేక మృగముల అరుపుల నుంచి పుట్టినవే ఈ విధముగా
1.స-షడ్జమం-నెమలిక్రీకారం
2.రి-రిషభం-ఎద్దురంకె
3.గా-గాంధారం-మేక అరుపు
4.మ-మధ్యమం-క్రౌంచపక్షి కూత
5.ప-పంచమం-కోయిలకూత
6.ద-దైవతం-గుర్రం సకిలింపు
7.ని-నిషాధం-ఏనుగు ఘీంకారం
ఈ సప్త స్వరముల ఆలాపన తక్కువ స్థాయి నుంచి ప్రారంభమై ఎక్కువ స్థాయి స్వరముతో ఆలాపించడము లేదా వాద్య పరికరములను వాయించడము "ఆరోహణము" అవుతుంది. అనగా మధ్యమ స్థాయి షడ్జం నుంచి తారస్థాయి షడ్జం వరకు
ఉదా:-స రి గా మ ప ద ని స
ఎక్కువ స్థాయిలో ఉన్న స్వరము నుంచి ప్రారంభించి తక్కువ స్థాయిలో ఉన్న స్వరం దాకా పాడటం లేదా వాద్య పరికరములను వాయించడం "అవరోహణము" అవుతుంది. అనగా తారస్థాయి షడ్జం నుంచి మధ్యమ స్థాయి షడ్జం వరకు
ఉదా:-స ని ద ప మ గా రి స
ఈ సప్త స్వరములను అనేకరీతుల మేళవించడము వలన రాగాలు ఏర్పడుతాయి. అయితే ఒక రాగంలో సప్త స్వరాలు తప్పనిసరిగా ఉండాలన్న నియమంలేదు. భారతీయ సంగీతం ప్రపంచ సంగీత ప్రపంచములోనే తనదైన ప్రత్యేకతను నిలుపుకొన్నది. నిలుపుకో గలుగుతున్నది అనునది సంగీత విధ్వాంసుల విశ్లేషణ మరియు పరిశీలకుల భావన. స్వరములకు ఆధారము శృతులు. శృతి అనగా ధ్వని, విశేషం. సంగీతానికి పనికి వఛ్చే శృతులు 22. పాశ్చాత్య సంగీతంలో 12 శృతులతో సంగీతం ఉచ్చస్థితిని (అష్టమ స్వరం) చేరుకొనగా భారతీయ సంగీతము 22 శృతులలో తార స్థాయి చేరుకుంటుంది.
హిందూ సంస్కృతిలో సంప్రదాయబద్ధముగా దేవాలయములలో జరిగే ఆరాధనలు ఆలపించే కీర్తనలు, నృత్యములు, వాద్య గోష్ఠులు సంగీత ప్రాధాన్యలతో కూడుకొని ఉన్నవి. సంగీత దేవిగా ఆరాధింపబడే సరస్వతీదేవి తన వీణ "కచ్చపి" ని వాయించి సాక్షాత్ శ్రీ లలితాదేవిని ప్రసన్న పరచినది. నారద తుంబురులాది మునీశ్వరులు తమదైన సంగీత రీతిలో సర్వజగతిని సమ్మోహనపరచగా గంధర్వ, కిన్నెర, కింపురుషాదులు అతులిత ప్రతిభలతో సంగీత దేవిని అలరించగా దేవలోక నర్తకీ మణులుగా వినుతికెక్కిన రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమలు విశేష నృత్యాభినయములతో స్వర్గ లోకమును అలరించిరి.
మధ్య రాతియుగములో మెసపటోమియనులు 2500 బి.సి నుండి 3000 బి.సి మధ్యకాలములో మొదటిసారిగా విల్లు బాణములలో అమర్చిన తీగలపై ఆధారముగా జంతువుల అరుపులను, పక్షులరవములను, వీచే గాలి తరంగములను, జలపాత ఘోషణలను అనుకరిస్తూ వివిధ రాగములను ఆలపించెడివారు అనునది ఒక పురాతన సంఘటన.
తరువాత కాలములో మృగముల చర్మముతో తయారైన సంగీత వాద్య పరికరములు తబల, డప్పు, డోలు అతి ప్రాచీన వాద్య పరికరములుగా రూపు దిద్దుకొన్నవి. కొంత కాలము తరువాత సితార, వీణ, వయొలిన్ మొదలైన వాద్య పరికరములు తీగలపై జాలువారే మృదు మధుర ధ్వనులకు ఆలంబనగా నిలవడము విశేషమే. సంస్కృతములో "సితార" అనగా మూడు తీగలతో వెలసిన వాద్య పరికరము. "వయొలిన్"
"క్వీన్ ఆఫ్ మ్యూజికల్ ఇంస్ట్రుమెంట్స్" గా విఖ్యాతిచెందినది.
అతి పురాతనమైన వాద్య పరికరమైన "వేణువు" (ఫ్లూట్) దక్షిణ జర్మనీ గుహలలో లభ్యమైనది. అది దంతములతో పాతరాతి యుగకాలము నాటిది అని నిరూపణమైనది. ద్వాపర యుగములో శ్రీ కృష్ణుడు ఆలపించే వేణు గానము సర్వ జగతిని ఆనంద డోలికలలో ఊగింప చేసిన అతి సామాన్య వాద్య పరికరమే వేణువు.
పురాతన గ్రీకుల సంప్రదాయము ప్రకారము "మ్యూజిక్" అనునది ఒక గ్రీకు పదము. "మ్యూసిక్" అనగా "ఆర్ట్ ఆఫ్ మ్యూసెస్" వీరి సంప్రదాయము ప్రకారము "మ్యూసెస్" సంగీతకళా సామ్రాజ్ఞిగా ఆరాధింపబడు దేవతగా పరిగణింపబడినది. ఈమె ఒక్క సంగీతమునకే కాదు సకలకళలకు అధి దేవతగా పేరొందినది. అందువలన ఆమె పేరుతో "మ్యూజిక్" అను పదము నేటికీ చిరస్థాయిగా సంగీత ప్రపంచములో నెలకొన్నది.
సుమారు 1000 సి.ఇ.లో "గిడ్” "డి" “అరిజ్జో" మొదటిసారిగా సంగీత స్వరములను విభిన్న రీతిలో ఏర్చి కూర్చెను. ఈ స్వరములతో
"డు, రి, మి, ఫ, సొ, ల, తి (డు)
భారత దేశములోని వివిధ రాష్ట్రములు విభిన్న సంస్కృతీ సంప్రదాయములతో అలరారడము ఒక విశేషమైతే ప్రతీ ప్రాంతము తమదైన ప్రత్యేక సంగీత నృత్యకళలతో విఖ్యాతి చెందడము మరియొక విశేషము. ఎన్నో మరెన్నో విభాగములతో సంగీతము తనదైన రీతిలో విస్తరించి జనపద పాటలకు మరియు జన పద నృత్యములకు ప్రాణ సమానమై నెలకొన్నది.
1.ఆంధ్ర ప్రదేశ్:- "ధిమిస నృత్యము" మన్య ప్రాంతములలో లయబద్ధముగా అన్ని వర్గముల వారు తమదైన సంప్రదాయరీతిలో చేయు జనపద నృత్యము తనదైనరీతిలో ప్రాముఖ్యతను సంతరించుకొన్నది.
కూచిపూడి:- ఆంధ్రప్రదేశ్ క్రిష్ణాజిల్లాలో "కూచిపూడి" గ్రామములో (200 బి.సి.ఇ - 200 సి.ఇ) ప్రారంభమైన ప్రాచీన శాస్త్రీయ నృత్యశైలి. భారతదేశ సంస్కృతిని ప్రతిబింబింపచేసే శాస్త్రీయ నృత్యములో "కూచిపూడి నృత్యము" నాట్యశాస్త్రానికే వన్నె తెచ్చినది. కర్ణాటక సంగీతముపై ఆధారపడిన శైవ, వైష్ణవ ఆరాధకులు మరియు కళాకారులు ఈ నృత్యమును అభినయించడముఒక ముఖ్య సంప్రదాయము.
2.అరుణాచల్ ప్రదేశ్:-ప్రతీ మనిషిలోను మంచి చెడు కలసి ఉండుట సహజము. మనలోని చెడును నిర్మూలించి మంచిని స్థాపితము చేయు శుభ సందర్భములో చేయు నృత్యమే "బర్ డోచాం" గా అభినయించుట వీరి సంప్రదాయము.
3.అస్సాం:-ఈ రాష్ట్రంలోని ప్రజలు “బిహుగీతం”
తో వసంత ఋతువు ఆగమనాన్ని స్వాగతించుట ఒక సంప్రదాయం. వీరు ప్రకృతిని, భూమాతను ఆరాధించుట ఒక విశేషమైతే నూతన సంవత్సర ప్రారంభానికి గురుతుగా మొదటి రోజు పశువులను రెండవ రోజు సర్వజనతకు శుభసంకేతముగా వివిధ వాద్య పరికరములతో లయబద్ధతతో కూడిన నృత్యాభినయనము చేయురీతి మరియొక విశేషము.
4.బీహార్:-సకాలములో వర్షాలు లేక పంటలు ఎండిపోయి రైతులు యాతనపడే సమయములొ రైతులు వరుణదేవునికి చేసే ఆరాధనలే సంప్రదాయ జనపద నృత్యము "జిజియాన్" అను పేరుతో వాశికెక్కినది మరియు శ్రావణ మాసములో కురిసే వర్ష శభ్ధముల ఆధారముగా ఏర్పడిన జనపద నృత్యమే "కజారి" గా రూపుదిద్దు కొన్నది.
5.చట్టీస్ ఘర్:- గోపికలతో కూడిన శ్రీకృష్ణుని ఆరాధనములను సంప్రదాయ బద్ధముగా నిర్వహించు నృత్యమే "రౌత్ నాచా" అను పేరుతో ప్రశిద్ధి గాంచినది.ఈ నృత్య విశేషము (ఎవేకనింగ్ ఆఫ్ గాడ్ ఆఫ్టెర్ బ్రీఫ్ రెస్ట్) దేవధుని ఏకాదశి దినము ఈ నృత్యము అభినయించుట ఒక సంప్రదాయము.
6.గోవా:-హిందూమత సంప్రదాయ నృత్యములే"ఫంగ్డీ" అను పేరుతో వాశికెక్కినవి కొంకణ ప్రాంత సంప్రదాయములను అనుసరిస్తూ యువతులు లయ బద్ధతతో చేయు నృత్యములు భారతీయ పండుగలను అత్యున్నతస్థితిలో నిలుపుట మనకు గర్వకారణమే.
7.గుజరాత్:- గర్భా నృత్యం అతి పురాతనమైన సంప్రదాయ జనపద నృత్యం. మధ్యలో దీపమును అమరించి ఆ దీపమును శక్తిగా భావించి శరత్ నవరాత్రులలో వృత్తాకారములో లయబద్ధముగా సాగే నృత్యమే "గర్భానృత్యము" గా వినుతికెక్కినది. మానవ జీవనములో ఎదురయ్యే ఉపద్రవముల బారి నుండి వైతొలగుటకు తగిన శక్తిని ప్రసాదింపమని స్త్రీ పురుషులందరు కలసి దేవికి చేసే ఆరాధనలే ఈ నృత్య ఉద్దేశ్యము. నవీన కాలములో ఈ నృత్యమే "దాంట్య నృత్యము" గా నేటికీ ఆదరింపబడుట ఒక భారతీయ సంప్రదాయమే.
8.హర్యాన:- విభిన్నరీతి నృత్యములతో అలరారే ప్రాంతము. రాసలీల, హోలి, బీన్ (ధైర్యమునకు) గూమార్ మొదలగు నృత్యాభినయములను అనేక శుభ సమయములలో సంప్రదాయబద్ధములతో అభినయించుట వీరి సంస్కృతి.
9.హిమాచల్ ప్రదేశ్:- భారత దేశములో "దేవభూమి" గా పేరొందిన ప్రాంతము. "లొసర్ షోనచుక్సం" అనునది సుప్రశిద్ధ ప్రాంతీయ నృత్యము. "లోసర్" అనగా నూతన సంవత్సరమును స్వాగతించు శుభ సందర్భములో వసంత కాలములో కర్నల్, భుగియల్, దోల్ మొదలైన వాద్య పరికరములతో లయబద్ధముగా మనసులను రంజింపచేసే ప్రేమతో కూడిన అభినయములే గమనార్హం.
10.జార్ఖండ్:-రైతులు పుష్కలముగా పండిన తమ పంటలను కోసికొనిన శుభ సమయములో అభినయించు సంప్రదాయ నృత్యమే "జూమర్ నృత్యము" గా పేరుపొందినది.
11.కర్ణాటక :- హిందూదేవాలయ బయలు ప్రాంగణములలో అభినయించు నృత్యమే "యక్షగానము". ఇది ఉత్తర దక్షిణ కర్ణాటకరాష్ట్రములో "యక్కలగాన" అనుపేర ఆవిర్భవించి క్రమేపీ "యక్షగానము" గా రూపుదిద్దుకొన్న జనపదనృత్యశైలి. సామాన్యముగా కధావిభాగముపైన రచించిన సంభాషణలు, గీతములు, తాళ, మద్దెల, లయలకు అనుగుణముగా కళాకారులు నృత్యాభినయములు ప్రధాన అంశములుగా తమదైన రీతిలో అభినయించుట ఈ గాన ప్రత్యేకత.
12.కేరళ:- ఈ రాష్ట్రములో సుప్రశిద్ధ జనపద నృత్యమే "తెయ్యం". ద్రవిడ సంప్రదాయ రీతిలో సుమారు 800 సంవత్సరములకు పూర్వము మలబారు ప్రాంతములో దేవతలు సలిపే నృత్యశైలిగా "దైవము ఆట్టం" (డాన్స్ ఆఫ్ గాడ్స్) అనుపేరుతో ప్రాచుర్యము పొందినది. పురాణ ఇతిహాసిక కధనముల ఆధారముగా సంప్రదాయబద్ధ వస్త్రధారణముతో చేసే జనపద నృత్యసంగీత అభినయమే "తెయ్యాటము". కేరళ అటవీ ప్రాంతములలో సుమారు 456 "తెయ్యాకోలంస్" నేటికీ ప్రాచుర్యములో ఉన్నవి.
మోహినీఆట్టం:-కేరళలో విఖ్యాతిపొందిన శాస్త్రీయనృత్యం మహావిష్ణువు "మోహినిగా" అవతరించి అభినయించిన విశేష నృత్యంగా భావించబడి మంచికి చెడుకు మధ్య జరెగే యుద్ధ వాతావరణమును తలపింప చేస్తుంది (దేవ దానవుల నడుమ చెలరేగే సంఘర్షణ). మలయాళ, సంస్కృత పదములతో కూడి "మణిప్రవల" అని పేరుగాంచినది.
కధకళి:- భారత దేశములో 17వ శతాభ్ధములో ప్రాచుర్యము పొందిన సంప్రదాయ నృత్యము. కధలను "కళి" అనగా ప్రదర్శించుట అనునది ముఖ్యోద్దేశ్యము. సాధారణముగా ఈ శాస్రీయ నృత్యమును పురుషులు దేవాలయ ప్రాంగణములలో కధను వివరించుతూ నృత్యాభినయము చేయుట వలన "కధకళి" అని నామాంకితమైనది.
13.మధ్యప్రదేశ్:- పల్లెవాసులు మమేకమై తమ తమ గృహములకు విచ్చేసిన అతిధులను స్వాగతించు శుభ సమయములలో పండుగ వాతావరణమును ప్రస్ఫుటింప చేయుటకు చేయు సంప్రదాయ నృత్యమే "గిర్డా" అను పేర వాసికెక్కినది. ఈ రాష్ట్రములో సుమారు 2500 బి.సి ఇ లో లభ్యమైన సింధూ నాగరికుల శిధిలములలో శిల్పములు ఈ నృత్యరీతిని వ్యక్తీకరించుట విశేషమే. కళాకారులు పురాణ ఇతిహాసిక కధలను అభినయించుతూ తదనుగుణముగా లయబద్ధతతో చేయు అతి పురాతన శాస్త్రీఅయ సంప్రదాయ నృత్యము కథక్.
14. మహారాష్ట్ర:-సాగరతీర ప్రాంతములో వసించు మత్స్యకారులు స్త్రీ, పురుషులు ఎదురెదుగా నిలచి అలలపై పడవ నడుపుట చేపలను పట్టుటకు చేయు అభినయములే "కోలి" నృత్యముగా పేరొందినది. మరాఠా యుద్ధవీరుల విజయములను విశేషరీతిలో ప్రస్తుతించు గీతికలతో రూపొందిన జనపద నృత్యములే "పోవడ" అనుపేరుతో విఖ్యాతి పొందినవి.
15.మణిపూర్:-భారత దేశములో ఈశాన్య రాష్ట్రములలో సుప్రశిద్ధమైనది "మణిపూర్." ఇచట అలరారే శాస్త్రీయ సంప్రదాయ నృత్యము "జోగర్" అను పేరుతో ఒకరు లేదా అనేక మంది వృత్తాకారముగా తిరుగుతూ అభినయించే రాధాకృష్ణుల రాసలీలలే ఇతివృత్తాంతముగా
ప్రాముఖ్యతను సంతరించుకొన్నది. హిందూ మతములో వైష్ణవ సంప్రదాయమును ప్రతిబింబింప చేయు వేషధారణలతో అలనాటి గోపికలకు ప్రతి రూపముగా చేయు అభినయనములు నేటికీ తమదైన విలువలతో నిలచిఉన్నవి.
16.మేఘాలయ:-ఈ రాష్ట్ర నృత్యముగా పేరు పొందినది "లాహోడాన్స్" ఈ నృత్యమును సంప్రదాయ బద్ధముగా ఆరుబయట వినీల గగనము కనులకు ఆహ్లాదకరము చేయగా అభినయించుట అధ్భుతము. ముఖ్యముగా పండుగలలో విశేష రీతినిచేయు ఆలాపనలు ఆహ్లాదకరమే.
17.మిజోరాం:-వెదురు బద్దలపై లయబద్ధముగా చేయు నృత్యమే "చిరావ్" గా పేరొందినది. సుమారు ఒకట వ శతాబ్ధములో చైనా నుంచి వచ్చి "చిన్" కొండలలో నివశించు "మిజోస్" చేయు అతి పురాతన సంప్రాదాయ నృత్యము.
18.నాగాల్యాండ్:-మన్య ప్రాంతములలో వసించు "చాంగ్" జాతికి చెందిన పురాతన వాసులు శతృవుపై విజయము సాధించిన శుభ సందర్భములో చేయు నృత్యమే "చాంగ్ లో" అను పేర వాశికెక్కినది. ఇది కాక 'పోంగ్లీం" అను పేర మూడు దినముల పండుగను రైతులు తమ పంటలను కోసికొను శుభ సందర్భములో చేయు నృత్యమే విశేషము గా రూపు దిద్దుకొన్నది.
19.ఒడిస్సీ:- భారతదేశ శాస్త్రీయ నృత్యములో సుప్రశిద్ధమైనది. ఒరిస్సా రాష్ట్రములో 1 బి సి ఇ కాలములో ఉదయగిరి కొండలపై అనేకమంది కళాకారులు అభినయించిన అతి పురాతన శాస్త్రీయ నృత్యశైలి. ఆకాలములో "ఔద్ర" నేడు "ఒడిస్సీ" గా రూపుదిద్దుకొన్నది. నాట్యశాస్త్రము ఈ నృత్యమును "ఓద్రా-మాగధి" అని 200 బి.సి. నుంచి ఒరియా ప్రజల ఆరాధకుడైన జగన్నాధస్వామి దేవాలయ ప్రాంగణములో రాగం, ముద్ర, భంగిమలతో కూడి తాండవ, లాస్యములను ప్రస్ఫుటింపచేసే లయబద్ధతతో కూడిన శాస్త్రీయ సంగీతనృత్యమే.
20.పంజాబ్:- ఈ రాష్ట్రములో గిడ్డ అను జనపద నృత్యము అతి చిన్న స్వరగమకము జనపదముల నుంచి ఆవిర్భవించినది. ఎందరో యువతులు ఈ నృత్యమును సంప్రదాయ రీతిలో అభినయించుట విశిష్టమే.
21.రాజస్థాన్:-వీరాధి వీరుల కధనములు, ప్రేమకవనములు, మత సంప్రదాయములు, భక్తి భావనలతో కూడిఉన్న సంప్రదాయ సంగీత జనపద నృత్యములే "ఘూమర్" మరియు "కబెలియ" అను పేరులతో వాశికెక్కినవి.
22.సిక్కిం:-"సింఘీచాం" అనునది ఒక ప్రాంతీయ సంప్రదాయ నృత్యం. హిమాలయ పర్వత శ్రేణిలో కాంచనజంగ శిఖరము పైన (ప్రపంచములో మూడవ పెద్ద మంచు శిఖరం) మంచు సింహాకృతిలో ఏర్పడుట అనునది ప్రకృతిసృష్టి. ఈ సింహము దేశ రక్షణ కొరకే సహజముగా ఏర్పడిన కాపలాదారునిగా పురాణ, ఇతిహాసములు వర్ణించినవి. అందువలన స్థానికులు ఈ నృత్యమును దేశ రక్షణ కొరకు లయబద్ధముగా అభినయించుట ఒక సంప్రదాయముగా మారినది.
23.తమిళ్ నాడు: "భరతనాట్యం" భరతముని ద్వారా పరిచితమైన అతి పురాతనమైన శాస్రీయ నృత్యము. దేవాలయ కుడ్యములపై అందముగా మలచిన అప్సరసల శిల్పాలు భరత నాట్యకళాకారిణుల భంగిమలతో రూపు దిద్దుకొన్నవి. భావం, రాగం, తాళం మూడు ప్రాధమిక అంశాలతో మరియు 64 ముఖ, హస్త పాద కదలికలతో అతి కఠిన నియమములతో కూడి ఉన్న నృత్యమే భరతనాట్యం.
24.తెలంగాణ:- "పెరినిశివతాండవము" తెలంగాణా రాష్ట్రములో ప్రఖ్యాతిపొందిన అతి పురాతన జనపద సంగీత నృత్యశైలి. కాకతీయుల పరిపాలనలో యుద్ధములు అనివార్యము. యుద్ధ వీరులను ఉత్తేజపరచుటకు వారిని శక్తివంతులుగా తీర్చిదిద్దుటకు పురుషులు పాల్గొను ఈ సంప్రదాయ నృత్యము (డాన్స్ ఆఫ్ వారియర్స్) గా ప్రసిద్ధిగాంచినది.
25.త్రిపుర:-తలపైన వెలుగుతున్న దీపమును దాల్చి సంప్రదాయబద్ధముగా చేయు నృత్యమే 'హో జగిరి" ఇది ఒక పురాతన లయబద్ధములతో కూడిఉన్న సంతులనము మరియు కష్టతరమైన అభినయనము.
26.ఉత్తరప్రదేశ్:- శ్రీ కృష్ణుని రాసలీలలు ముఖ్యాంశముగా రూపుదిద్దుకొన్న నృత్యము. యువతులు నెమలిరూపములో తమను తాము అలంకరించుకొని చేయు అభినయనమే "మయూర నృత్యం" గా సుప్రశిద్ధమైనది.
27.ఉత్తరాఖండ్:- సహజ సుందరముగా ప్రకృతి ఆరాధనలతో, ఋతువుల మార్పిడిలో జరిపే పండుగలు, హిందుసాంస్కృతిక, సంప్రదాయములతో జనపద నృత్య గీతికలే బరదనాటి, భొటియ మరియు చోటియ. చరిత్రలో నిలచిన వీరాధివీరుల కధలను నేటికీ హిమాలయ పర్వత ప్రాంతములలో తబల, హార్మోనియం, తాళి ఆదిగా కూడిన అతి సామాన్య వాద్య పరికరములతో లయబద్ధముగా ఆలపించు గీతికలు ఎన్నటికీ మరపురావు.
28.పశ్చిమ బెంగాల్:- సుప్రశిద్ధ కవి రవీంద్రనాధ్ ఠాగూర్ బెంగాలీ భాషలో 2230 పైగా సాంస్కృతిక, సంప్రదాయ, జనపద గీతములను రచించి "రవీంద్ర సంగీతం" అనుపేరుతో సజీవత్వమును నింపెను.
29.అండమాన్ నికోబార్ ద్వీపములు:- సాగర తీరములో నివసించే గిరిజనులకు సముద్రయానమే ముఖ్యజీవనము. అతి పురాతనమైన ప్రాంతీయ జనపద నృత్యమే "నికోబరి" గా వినుతికెక్కినది. వైశాఖ పూర్ణిమ రోజున కొబ్బరిచెట్లకు అమరించిన ఊయలలూగుతూ గాలిలో తేలే వెన్నెల కాంతుల నడుమ కొబ్బరి ఆకులను విచిత్ర రీతిలో వస్త్రధారణ చేసికొని ప్రకృతికసౌందర్యంలో తేలియాడుతూ లయబద్ధముగా ఊగుతూ తూగుతూ చేసే జనపద నృత్యమే "నికోబరి" గా వినుతికెక్కినది.
30.చండీఘర్:- విశేషమైన అధ్భుత సంగీతములతొ ఆభినయించు "గిడ్డ" మరియు "భాంగ్ర" నృత్యములు సుప్రశిద్ధము.
31.దాదర్ నగర్ హవేలి:-భారత దేశములో వ్యవసాయమే ముఖ్యోపాధి. ఈ ప్రాంతములోని ప్రజలు తమ పంటలను కోసి గృహములకు తెచ్చిన శుభ సందర్భములో నిశీధి సమయములో మన్య ప్రాంతములలో వసించు అన్ని వర్గముల వారు చేరి అభినయించు నృత్యమే "ఘెర్రియ" నృత్యము గా పేరొందినది. చిత్ర వర్ణములతో సుశోభితమైన వాతావరణములో అధ్భుతముగా కొనసాగే డోల్, తాళి మరియు తూర్ ప్రముఖమైన సంప్రదాయ జనపద నృత్యములు.
32.డయ్యు డామన్:-అనేక సంవత్సరములు పోర్చుగీస్ పరిపాలనలో ఉండుట వలన వీరి సంస్కృతీ సంప్రదాయములు వారిని అనుకరించి ఉండుట విశేషము. కావున "మాండొ" నృత్యము వారి సంప్రదాయములో కొనసాగుట ఒక వింత.
33.డిల్లీ:-విశేషరీతిలో ఆచరింపబడు జాతీయ, అంతర్జాతీయ, మత, సాంస్కృతిక, సంప్రదాయ ఉత్సవములలో కళాకారులు అభినయించు "దాండియా" "భాంగ్రా" మరియు ఎన్నో భారతీయ సంప్రదాయ నృత్యములకు కాణాచిగా వెలుగులీను భారత రాజధాని నగరముగా విలసిల్లు మహోన్నత నగరమే "డిల్లీ" అని నేనంటాను. మరిమీరేమంటారు?
34.జమ్ముకాశ్మీర్:-వసంత కాల ఆగమనమును స్వాగతించు సందర్భములో యువతులు రెండు వరుసలలో ఎదురు ఎదురుగా నిలచి అతి సుందరముగా సంప్రదాయబద్ధముగా అలంకరించుకొని చేయు జనపద నృత్యమే "రౌఫ్" అని పేరొందినది. కొన్ని సందర్భాలలో, కొన్ని ప్రాతములలో అనేక మంది పురుషులు తమ చేతిలో "బ్యానర్" ధరించి వాద్య ఘోషణల మధ్య వాటిని భూమిపై ప్రతిష్టించి వృత్తాకారములో పాడుతూ చేసే నృత్యమే "డుమ్హాల్" గా ప్రశిద్ధమైనది.
35.లడక్:- "జాబ్రోనృత్యము" ఈ ప్రాంతములో సుప్రశిద్ధము. టిబెట్ ప్రాంత సంచారికులు వసంత కాల ఆగమనములో నూతన సంవత్సరము "లోసర్" అత్యంత వైభవముగా స్వాగతించు సందర్భములో పూలతో పరిసరములను అలంకరించి మృదుమధుర గీతాలను ఆలపించుతూ తీగల వాద్యము"డామీన్" మరియు డ్రం, డమ్మన్లాంటి వాద్య పరికరములతో ఈ విశేష నృత్యమును అభినయించుట ఒక విశేషమైతే ఈ ప్రాంతములో స్థిరపడిన ఆర్య సంతతి వారు "డ్రగ్పార్చెస్" అను నృత్యమును అభినయించుట మరి యొక విశేషము.
36.లక్షద్వీపములు:- అతి వేగవంతమైన సంప్రదాయ సంగీత ధ్వనులతో అలరారే జనపద నృత్యమే "కోల్కలి". ఈ నృత్యము కర్రలతో లయబద్ధముగా సాగుతుంది. కేరళ ఈశాన్య రాష్ట్రముల సంప్రదాయము వీరి నృత్యములపై ప్రభావితమైఉన్నది. అతి ముఖ్య విశేషము ఋతువుల మార్పులను అనుసరించుట వీరి సంప్రదాయములో సుశోభితము అవుతుంది.
37.పుదుచ్చేరి:- పంటలను కోసికొను శుభ సందర్భములలో అభినయించు నృత్య గీతికలే "భాంగ్రా" ప్రస్తుత కాలములో ఈ నృత్యములు వివాహాది శుభసమయములలో మరియు పండుగలలో అభినయించుట ఒక సంప్రదాయముగా మారినది.
మన దేశములో అత్యంత ప్రాచుర్యమును సంపాదించి సంగీత జగతిని ధరపై ప్రతిష్ఠింప చేసిన కొన్ని సంగీత విభావములు.
ఇ.హిందుస్థానీ సంగీతం:- ఉత్తర భారత దేశములో ప్రముఖ శాస్త్రీయ సంగీతముగా పేరొందినది. వేదమంత్రముల శృతులతో ఆలపించబడు అతి పురాతన సంగీతము. భారతీయ సంస్కృతీ సంప్రదాయములను ప్రతిబింపచేయడమే కాక వేదాంతసారమును విశదీకరించడము ఒక విశేషమే. ఈ సంగీతములో నిబిడీకృతమై ఉన్న పర్షియ పదములు ముఘల్ సంప్రదాయమును ప్రతిబింబిస్తాయి. అతిముఖ్య భావనలు స్వరం, అలంకారం మరియు రాగం పైన ఆధారపడిన సుప్రసిద్ధ పురాతన భారతీయ సంగీతముగా వినుతికెక్కినది. ఉత్తర, మధ్య, మరియు తూర్పు భారతదేశ విభాగములలో ఎంతో ప్రాచుర్యమును సంపాదించుకొన్నది.
"అమీర్ ఖుస్రో” (1253-1325) ఫాదర్ ఆఫ్ హిందుస్థాని సంగీత విధ్వాంసుడు గా పేరొందెను. వేదములే ఈ సంగీత ఆవిర్భావమునకు మూలము. భీంసేన్ జోషి, బడేగులాం ఆదిగా ఎందరో సుప్రసిద్ధ గాయకులు హిందుస్థానీ సంగీతమునకు ప్రాణము పోసిరి.
ఈ.కర్ణాటక సంగీతము:- దక్షిణ భారత దేశములో అత్యంత పేరు పొందిన సంగీతము. "కర్ణ" అనగా "చెవి" “అటకము" అనగా "ఆభరణము" కర్ణాటక సంగీతము వీనులకు విందు చేయు రీతిలో ఆలపించబడు సామగాన రాగము కనుక "కర్ణాటక సంగీతము" అని నామాంకితమైనది. ఈ సంప్రదాయ సంగీతము. 14 మరియు 15వ శతాభ్ధములలో దక్షిణ భారత దేశములో విజయనగర సామ్రాజ్యములో విశేష ఆదరణ పొందినది. రాగ, ఆలాపన కల్పనేశ్వరం, నెరావత్లతో కూడి రాగం, తాళం, పల్లవులతో అలరారుతున్నది. ఈనాటికీ 300 రాగాలు కలిగిఉన్నది. వీనిలో జనపద, సినీ సంగీతము మరియు శుభకార్యములలో ఆలపించే గీతములే కర్ణాటక సంగీతమునకు మూలాధారము. "సామగానము" కర్ణాటక సంగీతము నుండే ఆవిర్భవించినది. బంగ్లాదేశ్, పాకిస్తాన్ దేశస్థులు ఎంతో ప్రభావితులై ఈ రాగమాలికలను తమ సంగీతములో చేర్చుకొనిరి.
సంగీత విలువలను పెంపొందింపచేసి ఎనలేని కీర్తి ప్రతిష్టలతొ తనదైన రీతిలో సాంప్రదాయబద్ధముగా ఆలపించబడు విశిష్ట రాగము కనుక "కర్ణాటక సంగీతము". ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణ, తమిళ్నాడు రాష్ట్రములలో ప్రాచుర్యములో నేటికీ అలరారుతున్నది. "పురందరదాసు" ఈ సంగీతమునకు మూల పురుషునిగా నిలవగా త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితులు మరియు శ్యామశాస్త్రిలు ఆదిగా ఎందరో మహానుభావులు తమ విశిష్ట నైపుణ్యములతో సంగీత సామ్రాజ్యమును అలరించిరి.
ఈఇ.జనపద సంగీతము:- (ఫోక్ మ్యూజిక్")
పల్లె సీమలలో పల్లె ప్రజలు తమదైనందిన కార్యకలాపములను ఆచరించు వేళలలో ఆలపించే పదముల కూడికే పాటలరూపును తనదైన రీతిలో దిద్దు కొనినది. మరియు ఈ పదములు రాగ, తాళ, భావములను కూడి లయబద్ధముగా చేయు నృత్యములు "జన పద నృత్యములు" (ఫోక్ డ్యాన్స్) విశేష ప్రతిభను పొందినవి.
కొన్ని శతాభ్ధములుగా అతి పురాతనమై సంగీత విభాగములో సజీవత్వముతో నిలిచినది "ఉర్దూ" భాషలో ఏర్పడిన సంగీతమే.
ఇవ్.సుఫీగానం:- ఈ సంగీతము పాకిస్తాన్ మరియు కొన్ని హిమాలయ పర్వత ప్రాంతములలో సుప్రశిద్ధమైనది. సుఫీగానములో దేవతా ఆరాధనలు ప్రముఖ పాత్రను వహించుట మరియు దక్షిణ ఆసియా దేశములలో ప్రేమగీతములు ఘజల్స్ రూపములో తమదైన విశిష్ఠతతో అలరారుతున్నవి.
వ్.తామెంగ్ సెలో:- నేపాల్, పశ్చిమబెంగాల్, సిక్కిం ఉత్తరభారత దేశములో కొన్ని ప్రాంతములలో సుప్రశిద్ధమైన సంగీతము. వీరి గానములో విషాదము, ప్రేమ, ఆనందం, నిత్యజీవనములోని సంఘఠనలు మరియు చిత్రవిచిత్రమైన కధనములు ప్రముఖపాత్రను వహించుట గమనార్హం.
భారత దేశములో దాదాసాహెబ్ ఫాల్కే ప్రధమముగా 1913 లో "రాజాహరిశ్చంద్ర" అను పేరుతో విడుదల చేసిన చిత్రము. దానిని ఆధారముగా చేసుకొని ఎందరో సినీ దర్శక నిర్మాతలు తరువాత కాలములో సినిమా జగత్తునే మార్చి ఎన్నో అధ్భుత చిత్రములు చిత్రీకరించుటకు సుగమమైన మార్గము నిర్దేశించిడమైనది.
నేడు సంగీత జగతిలో ఏర్పడిన వివిధ విభాగములు:-
1.భాంగ్రా:- చలనచిత్ర రంగములో అతి ముఖ్యమైనది.
2. పాప్ సంగీతం:-రాక్, బ్లూస్, జజ్. ట్రాన్స్ వివిధ సినీ సంగీత రీతులు.
3.తుమ్రో, దాద్రా, గజల్, ఖవ్వాలీ, చైతీ, కజ్రీ, సూఫీ ఎన్నో విభిన్న సంగీత విబాగములు సప్త స్వరముల నుంచి ఆవిర్భవించినవే.
జోహన్ అంబ్ రోసియస్ "ఫాదర్ ఆఫ్ ఇంగ్లీష్ మ్యూజిక్" గా పేరొందిన మహనీయుడు. సినిమా ప్రపంచములో "హాలీవుడ్" (ఆంగ్ల సినిమా ప్రపంచము) నిర్మాతల నుంచి కొన్ని నిర్మాణాత్మికమైన వినూతనమైన ఆలోచనలకు 1929 లో పాకిస్తాన్ తమ దేశ చలన చిత్రములలో చేర్చి "లాలీవుడ్" అనుపేర ఘనవిజయములను సాధించెను. అదే రీతిలో భారతీయ చలనచిత్ర రంగం ప్రభావితమై "బాలీవుడ్" అను పేరుతో ముంబై, కల్కత్తా నగరములలో చిత్ర నిర్మాతలు పరిశోధనలు చేసి ధీటుగా అసంఖ్యాకమైన చిత్రములను నిర్మించిరి.
కొన్ని సంగీత పదములు:-
1.వాగ్గేయకారులు:-సంగీత విధ్వాంసులు
2.గాయకులు:-సంగీతమును ఆలపించువారు
3.వాద్యములు:-సంగీత వాద్య పరికరములు
4.భావములు:-రాగం, తాళం, పల్లవి
5.షడంగములు:-స్థాయి, స్వరము
6.గీతములు:-కృతి, వర్ణము
7.రాగ మాలికలు:-పదము, జావళి, తిల్లాన
8.జనపదములు:- పల్లె పదములు
9.సంగీత ధ్వనులు:-స్థాయి, తీవ్రత,నాదగుణము, ప్రతిధ్వని, అనునాదము.
10.సంగీత ప్రాచుర్యములు:-గ్రామఫోను, రేడియో
సంగీత సంప్రదాయము ప్రకారము స, రి, గ, మ, ప, ద, ని, స వివిధ జంతువుల ఘోషణల నుండి ఆవిర్భవించడము అనునది ఒక నిరూపణ. కానీ మన శరీరము ఏడు చక్రములతో సంధించబడినది సప్త స్వరముల ఆరోహణములో చక్రములు కూడా ఆరోహణములోనే చెప్పబడినవి. కోమల స్వరాలు ఎడమవైపు చక్రములతో సంధించబడితే శుద్ధ మరియు తీవ్ర స్వరములు కుడివైపు చక్రములతో సంధించబడినవి. అందువలన ప్రతీ రాగం దానికి అనుసంధించబడిన చక్రము ప్రకారము ప్రభావము చూపుతాయి.
స్వరము-వివరణ-అర్ధము-జంతువు-చక్రము- అవయవము-దేవుడు
స-షడ్జమం-సాగర్-నెమలి- మూలాధార- గుదము-బ్రహ్మ
రి-రిషభం-బుల్-ఎద్దు- స్వాధిష్ఠాన- జననేంద్రియములు -అగ్ని
గా-గాంధారం-గగన్-మేక- మణిపుర- ఉదరము-రుద్రుడు
మ-మధ్యమం-మిడిల్-క్రౌంచపక్షి- అనాహత- హృదయము, ఊపిరితిత్తులు-విష్ణువు
ప-పంచమం-ఫిఫ్థ్-కోయిల- విశుద్ధ- గళము-నారదుడు
ద-దైవతం-ధర్తి-గుర్రం- అగ్ని- మూడవ నేత్రము-వినాయకుడు
ని-నిషాదం-ఔట్కెస్త్ హుంట్-ఏనుగు- తలపై నుండు మాడు భాగము-సూర్యుడు
"సప్త స్వరముల ఆలాపనలే
రిషభ రంకెలలతో ఎగిసిపడే అలలు కాగా
గాన గంధర్వులతో గగనాన చేరువై
మదిలో మెరిసే ఆశల రూపములై
పలికే హృదయ, వీణల సుస్వరములలో
దరిచేరి వెలిగే సంగీత జ్ఞాన కిరణములే
నిశిని రూపు మాపే నూతన శకములు
సరి పోలికలు లేనివి భారత సంగీత నృత్య సంపదలే"
ఇన్ని విశిష్ఠలతో కూడి ఉన్న భారతీయ మరియు విదేశముల నృత్య, సంగీత సామ్రాజ్య లక్ష్మిని తమ సుస్వరాలతో నృత్యరీతులతో వైభవోపేతముగా అలరించిన, అలరించుతున్న అలరించబోయే అశేష సంగీత విధ్వాంసులకు, గాయనీ గాయకులకు, నృత్య కళాకారులకు శతకోటి అభినందనలతో అల్లిన ఈ సప్త స్వర కదంబ సుమమాలిక భారతమాత గళసీమలో ఎన్నటికి వసివాడదు. అని నేనంటాను. మరి మీరేమంటారు?
సప్తసంఖ్యల వైభవములు
1.సప్త ద్వీపముల ఆవిర్భావమే-భువిలో వెలసిన జీవ కోటి సందోహములు
సప్త సముద్రముల ఆవిర్భావమే-జలధిలో నిలచిన జల సంపత్తులు
2.సప్త ఊర్ధ్వలోకములు భువి నుంచి దివికి చేర్చే ఆరోహణలు
సప్త అధోలోకములు-దివి నుంచి భువికి చేర్చే అవరోహణములు
3.సప్త ఋషుల తపః సంపదలే-భువిపై చల్లిన విజ్ఞాన సంస్కార బీజములు
4.సప్త నదుల ప్రవాహమ్ములే-భువిలో పెరిగే సాగు సంపత్తులు
5.సప్త వర్ణముల ఆవిర్భావమే-హరివిల్లు అందించే సొగసులు
6సప్త పుణ్యక్షేత్రముల సందర్శనములే భువిలో వ్యాప్తీకరించే ఆధ్యాత్మిక సంపదలు
7సప్త దినములతో కూడిన సప్తాహమే-భువిలో జరిగే గ్రహముల ఆరాధనలు
8సప్త పది నడకలే భువిలో వివాహబంధాన్ని నిలిపే బంధనాలు
9.సప్తకుల పర్వతముల ప్రతిష్ఠంభనములే-భువిపై నెలకొన్న అఖండ ఖనిజ సంపత్తులు
10.సప్త గిరులపై వెలసిన శ్రీ శ్రీనివాసుని కృపాకటాక్షణములే-సర్వ జనతకు రక్షణ కవచములు
11.సప్త చిరంజీవుల ఆవిర్భావమే-యుగయుగాల చరిత్రకు ఆదర్శము
12.సప్త పతివ్రతల జీవన చరితములే స్త్రీ లోకానికి కర్తవ్య బోధనలు
13.సప్త మాతృకల దీవనలే-భువిలో అశేష భక్తులకు ఆలంబనలు
14.సప్త స్వరముల సమ్మిళితమే-సంగీత సామ్రాజ్యానికి స్వరలహరులు.
సప్త సంఖ్యలతో కూడిన ఈ వ్యాసముల విశిష్ఠతలే యుగయుగాల చరిత్రలకు ఆదర్శవంతములు కాగా శతకోటి ఆశలతో మరియు అశేష ఆశయములతో తీర్చిదిద్దిన ఈ సప్త సంఖ్యల సువర్ణ నక్షత్ర మాలిక విశ్వమాత గళమున సదా మెరిసే సువర్ణహారమే అవుతుంది అని నేనంటాను మరి మీరేమంటారు?
Very interesting
ReplyDeleteAnd very informative.....D.Saraswathy...
ReplyDelete