అంతము తెలియనిది, లేనిది మానవ విజ్ఞతకు అందనిది, అర్ధముకానిది, నీలివర్ణముతో కూడిన ఆకాశమే. ఇది మానవ ఊహలకు అందనంత ఎత్తులో ఉన్నది. వివిధ గాలులతో, ధూళులతో మరియు ఎన్నో పదార్ధములతో మిళితమై లెఖ్ఖకు అందని నక్షత్రములతో మెరిసిపడే అధ్భుత వీక్షణము. సూర్యకిరణములు శూన్యము నుండి ఆకాశముపై ప్రసరింపబడి నారింజ, పసుపు, నీలి మరియు ఊదా వర్ణములతో రూపు దిద్దుకొన్నవి.
ఈజిప్షియనులు ఆకాశమును "గాడ్ ఆఫ్ నట్" ప్రతినిధిగా వివరించి "గాడ్ హోరస్" దేవునిగా అభివర్ణించి ఆయన కుడి కన్ను సూర్యునికి గురుతుగా ఉదయమని, ఎడమ కన్ను చంద్రుని శక్తిగా రాత్రికి ప్రతిరూపమని వర్ణించిరి.
ఆస్ట్రేనియనులు, అబ్జోరియనులు, తమ శాస్త్ర రీత్యా ఆకాశము కూడా భగవంతునిచే సృష్టింపబడినది అని తెలిపిరి.
ఇరాక్వీనియనులు "అతాహెన్సిక్" అను పదము ఆకాశ దేవతకు ప్రతిరూపముగా భావించిరి. భూమి తనదైన రూపుదిద్దుకొని ఆకాశము నుండి జాలువారినది అనునది వారి భావన.
హిందూమత సిద్ధాంతము ప్రకారము ప్రళయ కాలములో చిక్క చీకటి అన్నిదిశలా అలముకొన్నది. పంచ భూతముల కలయికతో (అగ్ని, వాయువు, భూమి, ఆకాశం, జలం) కూడి ఒక బ్రహ్మాండము ఏర్పడినది (కాస్మిక్ ఎగ్). అంధకారములో పడిన ప్రకృతి ప్రార్ధనలతో ఒక్క పెట్టున భళ్ళున తెల్లారినటుల ఒక తేజపుంజం విస్ఫోటమైనది (బిగ్ బాంగ్ థీరీ). ఆ రూపమును చూచుటకు ఏ ఒక్కరికీ శక్తి చాలలేదు. అపుడు విశ్వకర్మ అనుగ్రహముతో అతిసౌమ్య రూపముతో అందరి కనులకు, హృదయాలకు సుఖాన్ని ఇచ్చే రూపం ఏర్పడినది. విశ్వసృష్టి కావున ఆ విశ్వనరుని శభ్ధం నారి అయినది. తొలిస్థానం నారాయణునిగా మారినది రెండు ముక్కలుగా విడివడిన బ్రహ్మాండము ఒక విభాగము పైకెగసి "ఊర్ధ్వలోకములు" గా క్రింది విభాగము "అధోలోకములు”
గా రూపుదిద్దుకొన్నది. వీని మధ్యలో ఆకాశము నిలచినది.
1.భూమి పైన పుట్టిన పక్షులు, హంసలు పైకి ఎగరగలిగే శక్తిని కలిగి ఉంటాయి.
2.అంతరిక్షానికి దిగువున నూరు యోజనముల దూరంలో భూమి ఉన్నది.
3.వాయువు సంచరించేంత వరకు మేఘాలు కమ్మే అవకాశం ఉన్నంత వరకు ఉండేది "అంతరిక్షం".
4.సిద్ధచారిణులు విహరించే ప్రదేశమునకు క్రిందుగా భూత, ప్రేత, పిశాచములకు విహారస్థలమైన అంతరిక్షము ఉన్నది.
5.రాహు మండలానికి క్రింద పదివేల యోజనాల దూరములో సిద్ధచారిణులు ఉన్నారు.
6.భూమికి 3,84,400 కి మీ దూరములో చంద్రుడు మరియు సూర్యునికి లక్ష యోజనముల దూరములో నెలకొన్న చంద్రునికి మూడు లక్షల యోజనముల దూరములో 27 నక్షత్రాల మండలం అభిజిత్ చక్రం పైన పరిభ్రమిస్తూ ఉంటాయి.
7.అభిజిత్ చక్రానికి రెండు లక్షల యోజనముల దూరములో శుక్ర గ్రహము
8.శుక్ర గ్రహానికి లక్షయోజనముల దూరములో బుధగ్రహము
9 బుధ గ్రహమునకు రెండు లక్షల యోజనముల దూరములో అంగారకుడు
10.అంగారకునికి రెండు లక్షల యోజనముల దూరములో గురువు
11.గురువునకు రెండు లక్షల యోజనముల దూరములో శనిగ్రహం.
12.శనిగ్రహానికి 13 లక్షల యోజనముల దూరములో సప్త ఋషి మండలం.
13.సప్త ఋషి మండలానికి 13 లక్షల యోజనములో ధృవమండలం
జనలోకం, తపోలోకం, సత్యలోకములు నిబిడీకృతమై ఉన్నవి.
కాలచక్రానికి సంభంధించిన గ్రహములు ధృవగతిని అనుసరించి సంచరిస్తాయి.
పాతాళలోకము నుండి సత్య లోకమువరకు ఏర్పడినదే "బ్రహ్మాండము".
కాలచక్రమును అనుసరించి గ్రహాలు సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తూ ఉండుట ప్రకృతి నియమము. వారి సంయోగ బలము వలన వాటికి భూపతనం అను ప్రమాదము సంభవించదు. కావున ఏ కోరికలు లేక సమస్త సృష్టి కార్యములను నిరంతర శ్రమతో పెంపొందింపచేయు ప్రకృతి, పురుషుల చరిత్ర విచిత్రం. మరియు వీరితత్వం అనూహ్యం. ఒకప్పుడు కాదు ఎన్నటికీ తెలియదేమో. ఇదే సృష్టివింత
వేదవర్ణన ప్రకారము అంతరిక్షం అష్ట దిక్కులతో విభజించబడినది. సృష్టి రక్షణ కొరకు ఎనిమిది దిక్కులలో వెలసిన ఎనిమిది మంది అధిష్ఠాన దేవతలు సదా తమ కరుణాకటాక్ష వీక్షణములను ప్రసరింపచేయుచూ కాపాడుట వీరి ప్రధమ కర్తవ్యము. వాస్తుశాస్త్ర రీత్యా అష్ట దిక్కులు, అష్ట దిక్పాలకులు, వారి గ్రహాధి దేవతల వివరములు విశదీకరింపబడినవి. వీరి ప్రాముఖ్యతను అతి క్లుప్తరీతిలో వివరించుటయే ఈ వ్యాస ముఖ్యోద్దేశ్యము.
"అష్ట" అనగా ఎనిమిది. "దిశ" అనగా "దిక్కు" "పాలకులు" అనగా పరిపాలించేవారు. ఆకాశమంతయు ఎనిమిది దిక్కులుగా విభజించి "అష్టదిక్పాలకులను" ప్రతిష్టించిరి. హిందూ మత సిద్ధాంతములో దేవాలయ ప్రాంగణములలో ఇండ్లలో వాస్తు శాస్త్ర పరిధిలో వీరిని ప్రతిష్టించుట, ఆరాధించుట సర్వసామాన్యము. మరియొక విశేషము కాలచక్ర భ్రమణమునకు అధిపతులుగా మన జీవనములో ఎదుర్కొనే కష్టనష్టములను నివారించుటకు వీరి ఆరాధన ఒక సంప్రదాయము.
శైవ మతము, వైష్ణవ మతముల మధ్య బేధ భావములు ఉత్పన్నమై అష్ట దిక్కులు తమ ఉనికిని ప్రాముఖ్యతను కోల్పోవడము జరిగినది. నేటికీ హిందూ దేవాలయములలో గర్భగుడి ప్రాంగణములో నెలకొన్న "మహామంటపము" లో దేవుని మూర్తికి అభిముఖముగా పైభాగమున అష్టదిక్పాలకులు వారి వారి స్థానములలో ప్రత్యేకముగా ప్రతిష్టించుట ఒక సంప్రదాయము.
ఇచట గర్భగుడి దేవునికి వాసమైతే, పైన ఊర్ధ్వ ముఖముగా అమర్చిన అష్టదిక్పాలకులు ఆకాశాన అమరిన రీతిలో ప్రతిష్టింపబడుట ఒక విశేషము.
భక్తి వివాదములు, సంగ్రామములు, విభిన్నమతములు వచ్చి చేరిన తదనంతరము నవీనకాల సంప్రదాయములు అతి సామాన్య రీతిలో జరిగే ఆరాధనలకు ప్రాముఖ్యము పెరిగి ఈ వాస్తు పరిజ్ఞానము కనుమరుగైనది.
శ్రీదేవి భాగవత వర్ణనలో సూర్య గమనముతో ఈ అష్ట దిక్కులు సూచింపబడిఉన్నవి. సూర్యునికి ఉదయాస్తమయములు లేవు. మేరుపర్వతమే మూలముగా అష్టదిక్కులూ ఏర్పడినవి. ఏ దిశలో ఉన్న వారికైనా సూర్యుడు ఉదయించే దిక్కు "తూర్పు" అస్తమించే దిక్కు "పడమర" గా తెలుపబడినది.
సూర్యుడు "ఇంద్రపురము" (అమరావతి) నందు ఉదయించిన రెండు ఝాములకు పడమర "సంయమని" (యమపురి) చేరి అచట అస్తమించి సందెవేళకు "వాయువ్యపురి" (వింలోచని) చేరి అచట పూర్తిగా అస్తమయం జరిగి చీకట్లు కమ్ముతాయి. అచట నుంచి "కుబేరనగరం" (విభావరి) పయనించే కాలం రాత్రిగా మారుతుంది.
గమనము అనే కాలచక్రములో సూర్యుని పయనము నిర్దేశింపబడినది. సూర్యరధానికి పన్నెండు రేకుల శ్వేతపద్మం 12 నెలలకి గురుతుగా, ఏడు గుర్రములు ఏడు చందస్సులుగా, ఒక చక్రం ఒక సంవత్సరానికి గురుతుగా అరణుని సారధ్యంలో ఒక నిముషానికి 34 లక్షల 800 యోజనముల (ఒకయోజనము = 13.4 కి. మీ) వేగముతో పయనిస్తుంది.
అంగుష్ఠ ప్రమాణులైన అరవైవేల మంది ఋషులు, దేవర్షులు, అప్సరసలు, దేవతలు సూర్య రధానికి ముందు వెళుతూ ఆదిత్యుని స్తుతించుతారు.
సూర్యుని ఆరాధించు గృహములోనికి యమధర్మరాజు ఆజ్ఞకి లోబడి యమకింకరులికి అనుమతి లేదు. సూర్యుడు ఉత్తమ నీచ పదార్ధములపై తన వెలుగు కిరణములను ప్రసరింప చేసినా ఏ దోషము అంటదు.
దిక్పాలకులు వారి గ్రహాధిపతులు
దిక్పాలకుడు |
దిశ |
గాయత్రి |
ఆయుధం |
గ్రహాధిపతి |
సతి |
కుబేరుడు |
ఉత్తర (నార్త్) |
ఓం నం కుబేరాయనమః; |
భద్ర |
బుధుడు(మెర్క్యురి) |
ఇల |
యమ |
దక్షిణ (సౌత్) |
ఓం మం యమాయనమః |
పాశము |
మంగళం (మార్స్) |
యమి |
ఇంద్రుడు |
తూర్పు (ఈస్ట్) |
ఓం లం ఇంద్రాయనమః; |
ఉరుములు, పిడుగులు (వజ్రాయుధం) |
సూర్య (సన్) |
శచీ |
వరుణుడు |
పశ్చిమ (వెస్ట్) |
ఓం వం వరుణాయనమః |
ఊచ్చు |
శని (సాటర్న్) |
వారుణ్ |
ఈశాన్య |
ఈశాన్య (నార్త్ ఈస్ట్ |
ఓం హం ఈశాయనమః; |
త్రిశూలం |
బృహస్పతి(జూపిటర్) |
సతి , గంగ, పార్వతి |
ఆగ్ని |
ఆగ్నేయ (సౌత్ ఈస్ట్) |
ఓం రం ఆగ్నేయానమః |
దండము |
శుక్ర (వీనస్) |
స్వాహా |
వాయువ్య |
వాయువ్య (నార్త్ వెస్ట్) |
ఓం యం వాయువేనమః; |
అంకుశం |
చంద్ర (మూన్) |
లహరి |
నైరృతి |
నైరృతి (సౌత్ వెస్ట్) |
ఓం క్షమ రక్షసాయైనమః |
ఖడ్గం |
రాహువు-కేతువు |
శివ:శివాని |
1.కుబేరుడు
ఉత్తర దిశకు దిశాధిపతి అయిన "కుబేరునికి" అభయహస్తమే ఆయుధము. ఇతనిని కొలచినవారికి అశేష ధన సంపత్తులనొసగును. కుబేరుని నగరము "విభావరి" వైభవానికి పేరొందినది. భువిపై, దివిపై సర్వ సంపదలకు ఉత్తరదిశలో నెలకొన్న కుబేరుని ఆరాధించవలసినదే. దారిద్రవిమోచనముల కొరకు ఆతని కృపను సంప్రాప్తింప చేసికొనవలసినదే. ఆరాధించవలసిన గ్రహాధిదేవత "బుధుడు" (మెర్క్యురి) సూర్యునితో సమానముగా పరిభ్రమించు గ్రహం. సూర్యుని విడచిన కాలములో పెనుగాలులు, తుఫానులు, అనావృష్టిలతో అవని అల్లాడు వేళలో కీడు ఎక్కువగా కలుగుతుంది. దేశనెమ్మదిని, శాంతిని అతలాకుతలం చేయువేళలో విపత్తులు సంభవించుట తప్పనిసరి. అందువలన ఉత్తర దిశగా నెలకొన్న గ్రహాదిపతి అయిన బుధుని
"ప్రియంగు గుళికా శ్యామం - రూపేణ ప్రతిమం బుధం
సౌమ్యం సత్వ గుణోపేతం - తం బుధం ప్రణమామ్యహం" అని
“ఓం నం కుభేరాయనమః”
అని ఉత్తర దిశ అధిపతి అయిన కుభేరుని
సర్వజగతిని సురక్షితము చేయుమని నుతించడము మన కనీస కర్తవ్యము, బాధ్యత.
2.యమ
దక్షిణ దిశ అధిపతి "యమధర్మరాజు" పాశమే ఆయుధముగా ధరించి సర్వప్రాణులను తన వశము చేసికొనగల సమర్ధుడు. సకల జీవచరములు చేసిన తప్పులకి, పాపపంకిలమై సదానడయాడువారికి శిక్షలు వేసే "సంయమనీ నగరం" ఈ దిశలో ప్రతిష్ఠాపితమై ఉన్నది. ఆరాధ్య గ్రహాధిపతి "మంగళ గ్రహం" (మార్స్). హస్తములో ఈటె వంటి ఆయుధము ధరించి భూదేవి గర్భము నుంచి విడివడిన గ్రహం. అందువలన దక్షిణ దిశాధిపతి అయిన యమధర్మరాజుని "ఓం మం యమాయైనమః" అని
మంగళగ్రహమును
"ధరణీగర్భ సంభూతం; విద్యుత్కాంతిసమప్రభం
కుమారం శక్తి హస్తంచం - తం మంగళంప్రణమామ్యహం”
అనుచు చేసే ఆరాధనలు పుణ్యసంపత్తిని పెంపొందింపచేస్తాయి. సర్వ సృష్టిని భయకంపితులను చేసే మంగళ గ్రహము గగనముపై దక్షిణ దిక్కుగా మూడు, మూడు పక్షాలలో ఒక్కో రాశిలో సంచరించు సమయములో లోకానికి ఎన్నో విధముల చికాకు కలిగించుట, చోర భయము, అగ్ని భయాలు, భూకంపములు, రోగ భయములు అధికం.
అందువలన దక్షిణ దిశలో నెలకొన్న యమునికి, గ్రహాధిపతి అయిన కుజ గ్రహమునకి సర్వజనులను రక్షింపుమని వేడుకొనుట సర్వదా సురక్షితమే.
3.ఇంద్రుడు
సర్వదేవతలకు ప్రభువైన దేవేంద్రుని నివాస స్థలం తూర్పు దిశలో నెలకొనిన స్వర్గలోకమే
అమరావతీ నగరం పృధ్వి పైన సర్వ జీవులు తమ జీవితము పరిసమాప్తి పొందిన తదనంతరము అభిలాషపడెడిది ఈ స్వర్గలోక నివాశము కొరకే.
ఈతని భార్య "శచీ దేవి". కడు పుణ్యవతి. ఉరుములు, మెరుపులు కురిపించి అరివీర భయంకరులైన శతృవులను దునుమాడు ఇంద్రుని ఆయుధము వజ్రాయుధం సదా దేవతలను కాపాడుతుంది. దేవతలు అర్ఘ్యపాద్య పూజలందుకొని తమ అనన్య ఆశీస్సులను కురిపించేది ఈ లోకమునుంచే అనునది సర్వలోక విదితము. ప్రతీ జీవి అభిలాష పడేది, తపన చెందేదీ పుణ్యము సంపాదించేదీ ఈ లోకవాసము కొరకే. అదిక్షీణించిన పిదప మరల పునర్జీవనము పొందేది ఈ భువిపైనే.
భూమి నుంచి సూర్యమండలానికి గల దూరం 2,61,400 కి.మీ
తూర్పుదిశలో వెలిసిన గ్రహాధిపతి సూర్య గ్రహం. ఎర్రని జపాకుసుమ వర్ణముతో ధరణిపై సూర్య కిరణములను ప్రసరింపచేసి అంధకారమును తొలగించి పరిసరములను వెలుగుతో నింపి ఆరోగ్యమును పెంపొందింపచేయు ఉచిత శక్తి ప్రదాత. దోషములను గ్రహించు వాడే కాని దోషితుడు మాత్రం కాడు అనునది "భవిష్య పురాణంలో" వ్యాస ఉవాచ.
అందువలన సూర్యుని ఆరాధన ఈ రీతిలో
"జపా కుసుమ సంకాశం - కాశ్యపేయం మహాద్యుతిం
తమోరిం సర్వపాపఘ్నం - ప్రణతోస్మి దివాకరం"
అని తూర్పు దిశాధిపతియైన దేవేంద్రుని “ఓం లం ఇంద్రయైనమః”
అని ఆరాధించుట మరియు ఇంద్రుని నివాశమైన స్వర్గలోకం గగనముపై తూర్పు దిశగా అమరి ఉండుట ఒక విశేషమైతే గ్రహాధిపతి అయిన సూర్యుని ఉదయము అష్ట దిక్కులకు ఆలంబనము కావడము మరియొక విశేషము. ఇలపై వీరి ఆరాధనములు సర్వదా శుభకరమే.
4.వరుణుడు
వర్షాధిదేవుడైన వరుణుని నివాసస్థలము పశ్చిమ దిశలో ప్రతిష్ఠింపబడినది. ఈ దిశలో నెలకొన్న "వింలోచని" నగరము వరుణిని నివాసము. సర్వ ప్రాణులకు ఆధారమైనది "జలం". ఇది వరుణ దేవుని కృప వలనే లభ్యమవుతుంది. ఆయుధము "ఉచ్చు". కావున వర్షపాతములు, అధికవృష్టి, అనావృష్టిలతో సతతము అవనిని అల్లకల్లోలము చేయుట సర్వ సామాన్యము.
పశ్చిమదిశ గ్రహాధిపతి "శనేశ్వరుడు"
ఒక్కోరాశిలో రెండున్నర సంవత్సరములు సంచరించుట ఒక విశేషమైతే మందగతి, మరియు సహజ పాపి అంటారు
ప్రతీ మనిషి జీవితములో అతిభయంకర విపత్తులను కలిగింపచేసి భయభీతులను కలిగించు శక్తివంతమైన గ్రహము. తన కురచ రూపముతో అతి మెల్లగా సంచరించు గ్రహము. కావున సర్వజన సంక్షేమము కొరకు లోకహితము కొరకు ఈ రీతిలో ప్రార్ధించిన శుభములను సంప్రాప్తింప చేయును.
“నీలాంజన సమాభాసం - రవిపుత్రం యమాగ్రజం
చాయామార్తాండ సంభూతం – తం-నమామి శనైశ్చర్యం" అని మరియు పశ్చిమ దిక్పాలకుడైన వరుణదేవుని “ఒం వం వరుణాయైనమః”
అని అతని ఆగమన నిగమాలకు క్షేమకరమైన సర్వసుభిక్షములు సర్వ దేశములకు ప్రసాదింప చేయుట కొరకు ఆరాధించుట మన కర్తవ్యమే.
5.ఈశాన్య
ఈశాన్య దిశాధిపతి ఈశ్వరుడు. సతి గంగ, పార్వతిలతో సదా రక్షణ కల్పించే దేవాధి దేవుడు. త్రిశూలమే ఆయుధముగా ధరించి సర్వ సృష్టిని లయము కావించ సమర్ధవంతుడు.
ఈశాన్య దిశ సర్వజనులకు ఆరాధ్య గ్రహాధిపతి అయిన “బృహస్పతి” (జూపిటెర్) నెలకొన్న ప్రాంతము. దేవతలకు గురువైన "బృహస్పతి అతి బుద్ధికుశలోపరి. సౌమ్య రూపములో విశేష తెలివి తేజస్సులతో గురుస్థానము అలరించిన బృహస్పతి విజ్ఞాని. సదా దేవతల క్షేమమును కోరి వారికి దానవుల వలన విపరీత పరిస్థితులు ఎదురైనప్పుడు ఎంతో విజ్ఞతతో అనుక్షణం కాపాడిన క్షేమంకరుడు. బుద్ధిలో బృహస్పతి అని విద్యార్ధులను వినయ విధేయవంతులను అభినందించుట మనదైన సంప్రదాయము. ఒక్కోరాశిలో ఒక సంవత్సరము సంచరించు గ్రహం. వక్రగతిలో తప్ప మిగిలిన కాలమంతా ప్రజలకు మేలు చేస్తాడు.
"దేవానాంచ ఋషీనాంచ - గురుకాంచన సన్నిభం
బుద్ధిమంతం త్రిలోకేశం - తం-నమామి బృహస్పతిం "
అని బృహస్పతిని ఆరాధించుట ఈశాన్య దిక్పాలకుడైన ఈశ్వరుని “ఒం హం ఈశాయనమః”
అని సతి, గంగ, పార్వతుల సమేతముగా పూజించుట సర్వదా అనుకూలమే.
6.అగ్ని
ఆగ్నేయ దిశాధిపతి "అగ్ని దేవుడు". ఆయుధము దండము.
బ్రహ్మ ముల్లోకములను సృష్టించిన అనంతరము దేవతలకు "హవిస్సులు” (పూజానంతరము చేసే నైవేద్యములు) దేవతలకు అందక విలవిలలాడు సమయములో వారు శ్రీమహావిష్ణువు వద్ద మొర పెట్టుకొనగా ఆతను బ్రహ్మదేవుని ఆభీష్టమును గైకొనెను. తదనంతరము బ్రహ్మ "స్వాహా దేవిని" అగ్నిదేవునికి ఇల్లాలుగా చేసి బ్రాహ్మణ క్షత్రియులు చేయు యజ్ఞయాగములకు సంబంధించిన హవ్యమును దేవతలకు అందించి వారి ఆకలిదప్పికలను తీర్చమనెను. వైదిక మంత్రములో "స్వాహా" అను పదములేనిదే యజ్ఞయాగఫలములు నిష్ఫలమగును. అంతటి శక్తివంతమైనది "స్వాహాదేవి". వైదిక కర్మలను దేవతలకు సంప్రాప్తము చేయడములో ఈమె అత్యుత్తమ స్థానము అలరించినది. ఫలములేని చెట్టువలె స్వాహా యుక్తము కాని హోమవిధి నిష్ఫలము అవుతుంది.
ఆగ్నేయ మూల "అగ్ని దేవునికి" సుస్థానం. సాధారణముగా వాస్తురీత్యా ప్రతీ గృహములో ఆగ్నేయ మూలమున వంటగది నిర్మించుటకు కారణము. అచట అగ్నిజ్వాలపై చేసే పక్వములు దేవతలకు ప్రీతికరమగు హవ్యములుగా మారడమే. దేవకార్యములకు మంత్ర శక్తిగల ఆగ్నేయదిశలో నెలకొన్న అగ్నిదేవుని మరియు స్వాహాదేవిని ఆరాధించుట సర్వదా శుభప్రదమే.
ఆగ్నేయ దిశ గ్రహాధిపతి "శుక్రుడు" (వీనస్). సూర్యునికి ముందు వెనుక భాగములను అనుసరించి సమాన గతిలో తిరిగే గ్రహం. లోక క్షేమంకరుడు. అనావృష్టి, అతివృష్టి, కరువు కాటకములు, క్షుద్భాధలు, గ్రహపీడనములు ఆదిగా సంభవించి దేశదేశాలను అతలాకుతలం చేయకుండా సదా సంరక్షించే గ్రహాధి దేవత శుక్రుడే. ప్రతీ ఒక్కరి జాతక గణనము ప్రకారం అభివృద్ధిపధము కొరకు, కీర్తి ప్రతిష్ఠల కొరకు, తపించేది, ఆరాటపడేది శుక్ర గ్రహ సంచారము కొరకే అనునది ఒక విశేషమైతే స్వచ్చమైన ధవళ కాంతితో వెలిగే మంచు శిఖరములా అతి సుగంధభరితమైన మల్లెల సువాసనలు వెదజల్లునది శుక్రగ్రహ సంచారమే.
కావున ఆగ్నేయ దిశాధిపతి అయిన అగ్నిదేవుని
"ఓం రం ఆగ్నేయాయై నమః" అని
గ్రహాధిపతి అయిన శుక్రుని
"హిమకుంద మృణాలాభం - దైత్యానాం పరమం గురుం
సర్వశాస్త్ర ప్రవక్తారం - భార్గవం ప్రణమామ్యహం"
అని చేయు ఆరాధన సర్వజనతకూ శుభప్రదమే.
7.వాయువ్య
వాయువ్య దిశాధిపతి వాయువు. సృష్టిలో సర్వ జీవచరములకు ప్రాణాధారమైనది అత్యంత అవసరమైనది, సర్వజీవులను ప్రాణములతో నిలప గలిగేదీ వాయువే. ప్రకృతి ప్రసాదితమైన పంచ భూతములలో వాయువు అత్యంత ముఖ్యమైనది. ఒక్క క్షణం వాయులహరి వీవకపోయినా సర్వ జీవచరములు విగత జీవులు కావడం సృష్టి వినాశనము జరుగుతుంది. ఈతని ఆయుధము "అంకుశము". వాయువ్య దిశ గ్రహాధిపతి "చంద్రుడు", అమృతమయుడు, మనోమయుడు, వేల్పులకు ఔషధీలతలకు, వృక్షములకు, జీవకళలను ప్రసాదింపచేయు శక్తిమయుడు. 16 కళలతో శోభిల్లు రూపం. 15 కళలతో వృద్ధిపొంది దేవతలకు (పౌర్ణమి) 15 కళలతో క్షీణత పొంది పితృదేవతలకు (అమావాస్య) వైభవమును సంప్రాప్తింపచేయును. 16వ కళలో సూర్యుడు నివశించుట శాస్త్ర సమ్మతము. జ్ఞానానికి, పశుసంపదలకు, విజయసిద్ధికి, పాపములు, అందోళనములు తొలగుటకు, ఆరోగ్యాభివృద్ధికి చంద్రుని ఆరాధన శుభప్రదము.
కార్తీక మాసములో వెండి లేదా రాగి పాత్రలో క్షీరమును నింపి చంద్ర కిరణములు వానిపై ప్రసరించు రీతిలో అమరించి తదనంతరము సేవించిన ఎన్నో ఔషధ శక్తులు చేరిన ఆ క్షీరము మనకు రోగ నిరోధక శక్తిగా పనిచేయును అనునది ఒక పురాణ నమ్మకము. ఇన్ని రీతుల ఉపయుక్తకరమైన వాయువ్య గ్రహాధిపతి అయిన చంద్రుని "ఓం చంద్రదేవతాయనమః" అని వాయవ్య దిశాధిపతి అయిన వాయుదేవుని
“ఓం యం వాయువే నమః"అని ఆరాధించుట సర్వదా క్షేమకరమే.
8.నైరృతి (సంస్కృతములోఈరీతిలో)
నైరృతి దిశాధిపతి "నైరృతి. ఈతని ఆయుధము ఖడ్గము.
భారత దేశానికి ఈ నైరృతీ రుతు పవనములే అదిక వర్షపాతమును కురిపింపచేయుట రక్షణాధి దేవతలుగా శివ, శివాని. వీరి కృపాకటాక్షణముల వలననే వ్యవసాయ పంటలు అధిక దిగుమతుల నిచ్చి రైతులకు ఎంతో మేలు చేస్తాయి.
సూర్యునికి పదివేల యోజనముల దిగువున "రాహుమండలం" ఉన్నది. శ్రీనారాయణుని అను గ్రహం వలననే రాహువుకు దేవగ్రహతత్వాలు వచ్చినవి. ఎంతో దూరము నుంచే సూర్యచంద్రులను ఆచ్చాదించుతూ తిరిగే గ్రహం. దేవతలకు అమృతము పంచే సమయములో శ్రీ మహావిష్ణువు మోహినీ అవతారమును దాల్చడమైనది. ఆ సమయంలో కపట వేషధారణము చేసిన ఒక దానవుడు దేవతల వరుసలో చేరి అమృతము పానము చేయబోగా మహావిష్ణువు మోసము గ్రహించి తన చక్రాయుధముతో ఆతని శిరస్సును ఖండించెను. తల భాగము రాహువుగా మొండెము కేతువుగా మారినవి. గ్రహణ సమయములో సూర్యచంద్రులను గ్రహణ పీడా బాధితులనుగా చేయడమే వీరి లక్ష్యం. అతి శక్తివంతమైన గ్రహణ పరిణామములు తీవ్రతరమే. కారణము సూర్యచంద్రుల ద్వారా విష్ణువు జరిగిన మోసం గ్రహించడమైనది. ఆ పగతోనే రాహు కేతువులు జగతిని అల్లకల్లోలము చేయబోయినా గ్రహణ సమయములో విష్ణువు తన చక్రాయుధముతో వారి బాధను ఉపశమింపచేయుట విశేషము. నైరృతిదిశాధిపతి అయిన నైరృతిని
"ఓం సం రక్షసాయై నమః" అనుచు అధి దేవతలైన శివుని శివానిని రాహుగ్రహ పీడిత విముక్తులను చేయుమని ఆరాధించుట
గ్రహాధిపతి అయిన రాహువుని ఆరాధించుట ఈ రీతిలో
"అర్ధకాయం మహావీర్యం - చంద్రాదిత్య విమర్ధనం
సింహికాగర్భ సంభూతం రాహుం తం ప్రణమామ్యహం" ఎంతో శుభప్రదం మరియు ఉత్తమం.
సృష్టికర్త అయిన బ్రహ్మ అతి ఉన్నతమైన ఊర్ధ్వ లోకములకు అధిపతి. విద్యాధి దేవత అయిన సరస్వతీదేవి ప్రాణసతి. కేతు గ్రహ బారినుండి జరిగే వినాశనముల నుండి సృష్టిని సదా రక్షించే శక్తి మంతుడు
"అతిరుద్రరూప భయంకరుడు అయిన కేతువును
"ఫలాసపుష్ప సంకాసం - తారకాగ్రహ మస్తకం
రౌద్రం రుద్రాత్మకంఘోరం - తంకేతుం ప్రణమామ్యహం" ఈ రీతిలో ఆరాధన సృష్టి రక్షణకే.
అధో లోకములన్నియూ (నాదిర్) శ్రీమహావిష్ణువు చక్రమే ఆయుధముగా సర్వజగత్తును తనాధీనములో ఉంచుకొని ధర్మ సంస్థాపన చేయు మహా శక్తిమంతుడు. వైష్ణవీదేవిగా శ్రీమహాలక్ష్మి ఆతని హృదయమందు సదా నిలచి ధరపై పాపభారము అధికమైనపుడు వారు వివిధ అవతారములను దాల్చి దుష్టశిక్షణ,శిష్టరక్షణ చేసి ధర్మమును సదా ధరపైన నిలుపుతారు.
ఈ రీతిలో బ్రహ్మ విష్ణువుల చేత ఊర్ధ్వ అధోః లోకముల పరిరక్షింపబడుట సర్వదా శుభకరమే.
అష్ట దిక్కులకు దిక్పాలకులకు మరియు గ్రహాధిపతులకు మంగళకరమైన యజ్ఞ, యాగ మంత్రాభిషేకములతో ప్రకృతి, పురుషులు ఇచ్చే నీరాజనములు సదా జగత్తును వెలుగు కిరణములతో నింపి తిమిరములను పారద్రోలే శక్తి సంపత్తులే అని నేనంటాను. మరి మీరేమంటారు?
**
అక్కా!
ReplyDeleteవ్యాసం చదివాను.
చాలా బాగుంది.
సింధువుని బిందువులో చూపించాలనే నీ ప్రయత్నం అభినందనీయం.
అష్టదిక్పాలకులు,
భూమి నుండి దూరం
ఆయా దిక్కులకు
అధి దేవతలు, మంత్రాలూ అన్ని విషయాలూ చక్కగా చెప్పావు. మరెన్నో మంచి వ్యాసాలు నీ కాలం నుండి వెలువడాలని కోరుకుంటూ సోదరి శ్రీలక్ష్మి చివుకుల
చాల బాగ క్లుప్తం గా అయిన వివరాలు స్పష్టం గా అందరికీ అర్థం అయ్యేలా చెప్పారు
ReplyDelete