Sunday, 10 September 2017

మనలో మన మాట

ఆది నుంచి భారతదేశం వ్యవసాయమే ముఖ్య వృత్తిగా పల్లెసీమలతో కళకళలాడుతూ పేరొందిన సంపన్నదేశం. ఇక్కడ నూటికి డెభ్భైఐదు మంది వ్యవసాయం పైనే ఆధారపడుతూ రైతుబలం సమృధ్హిగా దేశానికి రైతే వెన్నెముక అనుకునే దేశం. కాలక్రమంగా మనకు స్వాతంత్య్రం వచ్చిన దగ్గర నుంచి నేటి వరకు వ్యవసాయ అభివృద్ధికి ఎన్నో పధకాలు తయారుచేసారు. చేస్తున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో, కాలంలో వచ్హిన మార్పులు, వృత్తుల్లో వచ్హిన మార్పులు, వాతావరణ మార్పులు సై న్స్ టెక్నాలజీల అభివృద్ధితో వ్యవసాయం మెల్ల మెల్లగ ప్రక్కదారులకు మళ్ళుతోంది. అన్నదాత రైతు మాత్రం ఈ ధాటికి తట్టుకోలేక ఈ వేగాన్ని అధిగమించ లేక చాలా వెనక పడిపోయారు. ప్రస్తుత కాలంలో కులవృత్తి మానేసి వేరే సంపాదన వైపు పరుగులు పెడుతున్నారు. ఇది చివరకి దేశవ్యవసాయ పరిస్థితిని ఎటు దిగజారుస్తుందో నేటి పాలకులు చెప్పలేకపొతున్నారు.
పై విషయల్లో కేవలం ప్రభుత్వానిదే తప్పు అనలేము. రైతుదే తప్పని కూడా అనలేము. ఎందుకంటే వీరిద్ధరూ ఇటు ప్రభుత్వము, అటు రైతు కూడా ఒక నాణానికి రెండువైపుల వుండే వేర్వేరు ముఖాలు. రైతు లేనిదే ప్రభుత్వం లేదు. ప్రభుత్వం లేనిదే రైతు లేడు. కానీ చూడటానికి మాత్రం నాణెం ఒకటే. మన దేశ వాతావరణం నదులు, నేల అన్నీ బాగా పనికి వచ్చేది వ్యవసాయనికే. కానీ దీని వలన ప్రతీ సంవత్సరం నష్టాలే తప్ప లాభాలు లేవు. అతివృష్టి, అనావృష్టి ఈ రెండు నేటి వ్యవసాయ వ్యవస్థని ఎదగకుండా పీడించుకు తింటున్నాయి.
బాగా పంటలు పండి వాటి ఫలితం చేతికి వచ్చే సమయానికి ఏదో అవాంతరం వస్తోంది. పోనీ అన్నీ బాగుండి పంట ఫలం దక్కినా దానికి తగిన ధర రాదు. మధ్యవర్తులు లబ్ధి పొందుతున్నారు. వచ్చిన పంట దాచుకొని తగిన ధర వచ్చినపుడు మార్కెట్లో అమ్ముదామన్న తగిన సదుపాయాలు లేవు. ఇవన్నీ రైతుల వైపు నుంచి వచ్చే సమస్యలు. ప్రభుత్వం ఋణ మాఫీ అని, తక్కువ వడ్డీకి ఋణాలు అందిస్తున్నామని చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితి చూస్తూ వుంటే ఒక సంవత్సరము నష్టపరిహారంగా రైతుల ఋణాలు తీర్చేస్తాము. మళ్ళీ సంవత్సరము ఇదే పరిస్థితి వస్తే ఏం చేయాలి? ఇలా తీర్చుకుంటూ పొతే అంతం ఎప్పటికి అవుతుంది? ఇది ఆలోచించవలసిన విషయం. ఇందులో రైతులు తాత్కాలిక విముక్తి పొందుతారు. ప్రభుత్వం తమ సమస్యని అప్పటికి మాత్రమే తాత్కాలికంగా సానుకూలం చేయగలుగుతున్నది.
రైతులు చేసిన ఋణాలు తీర్చమని, నష్టపరిహారం ఇమ్మని, లేదా పంట గవర్నమెంటే కిట్టుబాటు ధరకు కొనాలని లేదా ఆత్మహత్య చేసుకుంటామని బెదిరింపులు. ఒకవేళ నిజంగా రైతులు వేరే కారణం చేత ఆత్మహత్య చేసుకున్నా అపోజిషన్ నాయకులు చెలరేగడం వారి ఒత్తిడి ప్రభుత్వం పైన వస్తుంది. ఇంకా ప్రభుత్వం ఏమీ చేయలేకపోతే బస్సులు కాల్చేయడం, నిలువునా పండిన పంటనంతా తగిన ధర రాలేదని రోడ్లమీద పోసెయ్యడం లాంటివి కోపంతో ఆవేశంతో జరుపుతున్నారు. అలా వద్దు అంటే ధర్నా. ఈ ఆవేశాలు దేశపు పురోగతిని ఉటు వైపు చేరుస్తాయో అన్నది అర్థం కావదంలేదు. ఇది నేను రైతులని కించపరచడానికి గానీ వారిని వ్యతిరేకిస్తూ గానీ వ్రాయటం లేదు. రైతులు తమ ఆగ్రహాన్ని చేతకాని పరిస్థితిని ప్రభుత్వం పైన ఇలా చూపిస్తున్నారు. పురుగులమందు కొని తమ ప్రాణాలు తీసుకునే బదులు ఒక్క క్షణం ఆలోచించి పంటకు నస్టం కలిగించే ఆ పురుగుల్ని చంపటం వేరే మార్గంలో మంచిది కదా! అని నాకు అనిపిస్తోంది. ఏ పని అయినా అలోచించి చెయ్యాలి. అన్ని అనర్థాలకు ఆవేశమే మూలకారణం. దేశం నీకేమి ఇచ్చింది? అన్న ప్రశ్న కన్నా నువ్వు దేశానికి ఏమి చేశావు? అన్నది ముఖ్యంగా ప్రతీ భారత పౌరుడు గుర్తుంచుకోవాలి. ఆగ్రహంతో, ఆవేశంతో క్షణంలో మనం బస్సుల్ని తగలేస్తే మన సమస్య తీరుతుందా? చేసిన రుణాలు తీరిపోతాయా? ప్రభుత్వానికి మళ్ళీ అటువంటి బస్సులు తయారుచేయడానికి కొన్ని కోట్ల రూపాయలు కావాలి. ఆ నష్టం పూడ్చడానికి టికెట్ ధర పెంచేసి నిత్యావసర ధరలు పెంచేసి మళ్ళీ మన దగ్గరే వసూలు చేస్తారు. నాశనం చేసేది మనమే. దానికి మూల్యం చెల్లించేది మనమే అవుతున్నాము. ఇది జగమెరుగిన సత్యం. మన ఆస్తిని మన ఇంటిని మనం ఎలా రక్షించుకోవాలని ఆరాటపడతామో అలాగే ప్రతి ఒక్కరు ఇది మన దేశం, ఇది మన ఆస్తి అన్న భావనతో రక్షించుకోవాలి. సృష్టిలో కెల్ల అద్భుతమైన దేశం భారతదేశం. ఎందుకంటే ఇచ్చట ఉన్నన్ని నదులు, సముద్రాలు, కొండలు, అడవులు, పశుసంపద, వ్యవసాయానికి సరిపడే సానుకూల వాతావరణం పృకృతి మనకిచ్చిన వరాలు. ఇవి ప్రపంచంలో వేరే ఏ దేశంలోనూ కనిపించవు.
పూర్వాకాలంలో రైతులు ఆనందంగా బ్రతికేవారు. తమకు పండిన పంట ధాన్యం, చెరకు, పప్పుదినుసులు, కూరగాయలు, పండ్లు, వగైరా ఎడ్లబండి మీదగాని, ట్రక్కులో గానీ, ట్రాక్టర్‌లపై గానీ, సంతలకి, మిల్లులకి, ఫ్యాక్టరీలకి తరలించేవారు తగినధరలు వచ్చేవి. కానీ ప్రస్తుత కాలంలో మనిషిలో పెరిగింది బద్ధకం. వారే కొనుగోలు చేస్తారు అనేది భీమా మొబైల్, కంప్యూటర్లు, ఆన్ లైన్లో సంప్రదింపులు వచ్చి వారి స్థితిగతులు పూర్తిగా మార్చేసాయి. వాటిని వారు సరిగ్గా సద్వినియోగం చేసుకోగలగాలి. అప్పుడే వారికీ దుర్గతి పట్టదు. వాతావరణ వివరాలు హెచ్చరికలు పట్టించుకోరు. కొన్నిచోట్ల వారి నిర్లక్ష్యం వలన పంట పాడవుతోంది. నిజంగా వాన వచ్చి ఆ పంట పోతే ప్రభుత్వానిదే బాధ్యత. వీరికి మద్ధతు ఇచ్చి అగ్నిలో ఆజ్యం పోసినట్టు రెచ్చగొట్టేవారు ఎక్కువ. ప్రభుత్వం ఎక్కడో లేదు. నీవే ప్రభుత్వం. ప్రస్తుత కాలంలో నాయకులే నీవద్దకు వస్తున్నారు. లేదా వారితో సంభాషించడానికి అనువైన అవకాశాలు కల్పిస్తున్నారు. టెక్నాలజీ అభివృద్ధి మనుషుల మధ్య దూరాన్ని చెరిపేసింది. కాబట్టి రైతులు సకాలంలో ఈ సదుపాయాల్ని వినియోగించుకోవాలి. ఒక వేన్‌గాని, ట్ర క్కులోగాని, కనీసం ఎడ్లబండి మీద గాని సరకుని మార్కెట్‌కు చేర్చలేరా? అక్కడ కూర్చుని అమ్ముకోలేరా? రెగ్యులేటడ్ మార్కెట్‌లో ధరలు నిర్ణయించుకోలేరా? నాణ్యమైన సరకు విదేశాలకు ఎగుమతి చెయ్యలేరా! ఇవన్నీ సాధ్యం చెయ్యగలరు తలచుకుంటే పూర్వం కన్నా రైతులు చదువుకున్నవారే, విద్య తెలిసిన వారే. ఒకవెళ నిరక్షరాసులైనా వారి అభివృద్ధికి తగిన అవకాశాలు ఏర్పడ్డాయి. కాబట్టి తమ కాళ్ళ మీద స్వశక్తితో నిలబడగలగాలి మనకి ప్రాణాలు నిలుపుకునే అవకాశం తప్ప వాటిని తీసుకునే అధికారం లేదు. అది ఒక్క దేవుని చేతుల్లో మాత్రమే ఉంది.
రైతులు ప్రతీ సంవత్సరం ఒకేలా తమ పంటకు తగిన ధర రాలేదని వాపొతున్నారు. ధరలు ఎప్పుడూప్రజల నుండి వచ్చే డిమాండ్సుని బట్టే ఉంటాయి. కానీ వారి దగ్గర వున్న సరుకును బట్టి కాదు. డిమాండు, సప్లై సమానంగా వున్నప్పుడే ధరలు కూడా అదుపులో వుంటాయి. దీన్ని బట్టి రైతులు తమ ఉత్పత్తిని పెంచుకోవటం కానీ తగించుకోవటం కానీ చెయ్యాలి. నేటిరోజుల్లో సేంద్రీయ పద్ధత్లో ఉత్పత్తి చేసే సరుకులకి మంచి డిమాండు వుంది. కనుక రైతులు భూమిని సారవంతం చేసి (చేలలో తయారు చేసిన ఎరువు) ప్రతీ సంవత్సరం ఒకే పంటని కాకుండా మార్చి వేయాలి. (ఉదా: కందులు వేసిన చేలో మరో సంవత్సరం మినుగులు గానీ, పెసలు గానీ) ప్రస్తుతం ప్రజల్లో ఏదో కొని తినెయ్యాలి అన్న ఊహ లేదు. డబ్బు ఖర్చుకి వెనుకాడే రోజులు పోయాయి. ఆరోగ్యంపై అవగాహన పెరిగింది. పరిశుభ్రతపై దృష్టి మరలింది. కనుక ఈ చిన్న మార్పులు రైతులు చేస్తే ప్రజలే సరకు కొనుగోలు కోసం వారి దగ్గరకు తప్పక వస్తారు.
నీటి ఎద్దడి కారణంగా పంటలు ఎండిపోతున్నాయి అన్నదానికి సకాలంలో పడిన వాన నీరు ఒడిసి పట్టడం అనేది చాలా రాష్ట్రాల్లో చేస్తున్నారు. పూర్వం చూరుల్లోంచి పడే నీరుతో గాగులు, ట్యాంక్‌లు నింపి వాడుకునేవారు. నేడు స్లోపుగా వేసి పైపులద్వారా వాననీరు ఒడిసి పడుతున్నారు. దీన్నే కాలువలు త్రవ్వి ప్రవహింప చేస్తున్నారు. వాడిన నీరే తిరిగి రీసైక్లింగ్ అనే పద్ధతిలో పైపుల ద్వార పొలాల్లోకి పంపుతున్నారు. ఆ నీరు తోటలకి, చెట్లకి, కూడా వాడుతున్నారు. ఇది పెద్ద పెద్ద నగరాల్లో భవంతుల్లో జరిగే ప్రక్రియ. గ్రామాల్లొ కూడా అవలంబించవచ్చును.
చేనుచుట్టూ మనం గట్లు కట్టి దానిపై గడ్డిని పెంచినా లేదా సీమచింత చెట్లు గానీ, పండ్ల చెట్లు గానీ వేస్తే కొంతవరకు భూసారాన్ని వరదల బారి నుంచి నిలపవచ్చు. ప్రతీ సంవత్సరం వరదలు వచ్చే సమయం మనకు తెలుసుకాబట్టి ఆ పంటలు వేయడం తాత్కాలికంగా ఆపుచేసి తరువాత కాలంలో వేయటం మంచిది అని నా అభిప్రాయం.
చివరిగా నేను చెప్పేదేమిటంటే వాతావరణానుకూలంగా పంటలు పండిద్దాము. ఒక మానవహారంలా చేయి చేయి కలుపుదాం. ఒక త్రాటి మీద నిలిచి భరతమాత ముద్దుబిడ్డలు 'రైతులే' అని నిరూపిద్దాం. 'అతిథి దేవో భవ ' అని ఇంటికి వచ్చినవారిని ఆదరించి వారి ఆకలి దప్పికలు తీర్చి పంపే సంప్రదాయం మనది. ఇది మన తెలుగు జాతి సంస్కారం. దీన్ని చూసి ప్రపంచమంతా గర్వించేలా తలెత్తుకు తిరగాలి. కాబట్టి ఈ సంస్కృతీ సంప్రదాయాలు నాడు కాదు నేడు కాదు ఎప్పటికీ నిలుపుకోవాలని ఆకాంక్షిస్తూ.
“పుణ్యభూమి నా దేశం నమోనమామి
కర్మ భూమి నా దేశం సదా స్మరామి
నన్నుగన్న నా దేశం నమోనమామి

అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి.”

భూదేవో రక్షతి రక్షిత:

సూర్యచండ ప్రతాపంతో వేడిగాడ్పులతో నిండిన భూమిపైన వాతావరణం ఋతుపరివర్తన ద్వార మార్పు చెంది వర్షాకాల ఆగమనాన్ని చల్లదనాన్ని స్వాగతిస్తుంది. సంతోషంతో రైతులు తమతమ పొలాలు చదును చేసుకొని విత్తనాలు వేసి వానలరాకకై ఎదురుచూసే కాలమది. ఆప్పుడు కురిసిన స్వాతివానతో ఒక్కసారిగా ఏరులు-నదులు, వాగులు-వంకలు సెలయేర్లు-చెరువులు పుష్కలంగా నీటితో దర్శనమిస్తాయి అన్నది నాటి మాట. స్వచ్చమైన వనరుల్లోకి మురుగునీరు చేరుతూ కలుషితం చేస్తున్నది అన్నది నేటి మాట. ఏది ఏమైనా ఎక్కడ విన్న, ఎక్కడ చూసినా నీటి నిల్వలు మురుగునీటితొ పేరుకుపోయి అనేక హానికరమైన బ్యాక్టీరియాలు, సూక్ష్మజీవులు, దోమలు వృద్ధి చెంది నీటిని నిరుపయోగం చేస్తున్నాయి. సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే సమస్య కనిపిస్తుంది. నేడే కాదు నాటి కాలంలో కూడా ఆషాఢమాసం వస్తుంది అంటే ముందు జాగ్రత్తలు ఎన్నో తీసుకునేవారు. విషజ్వరాలు ప్రబలుతాయి అనే భయంతో భోజనవిషయాల్లోను, నీటిని మరగించి త్రాగటం వగైరా పనులు ఎంతో నియమబద్ధంగా చేసేవారు. దాన్నే ఋతుప్రభావం అనేవారు. ఫరిసరాలు శుద్ధి చేయటమంటే మురుగునీటిని నదుల్లోకి, చెరువుల్లోకి వదిలెయ్యటం కాదు. ముందుగా మనం విషయంలోను తగిన జాగరూకత వహించకపోవటమే సమస్యలు జటిలమవడానికి గల కారణము. విషయాల్లో మనం చేతులు కాలేక ఆకులు పట్టుకోవటం లాగ అవుతున్నది. సముద్రం తనలోనికి ఎంత నీరైన ఇముడ్చుకునే శక్తి ఉన్నదని అది ఒక అంతులేని అగాధం అని తెలిసి కూడా నీటిని కలుషితం చేస్తున్నాము. దీనివల్ల సముద్రంలో నివసించే అనేక జీవులు తమ వాసాన్ని కోల్పోతున్నాయి. విగతజీవులుగా మారిపొతున్నాయి. కాబట్టి జలరక్షణ, వనరక్షణ ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉన్నాయనేది నిజం.
ముందుగా పల్లెలు చూద్దాం. ఇక్కడ మురుగునీరు నిల్వలు కుంటల్లోనో, లేక చెరువుల్లోనో పూడికలతో ఉంటుంది.
వాటిలోని నిల్వనీటిని కాలువరూపంలో త్రవ్వితే నీరు ప్రవహిస్తుంది. కొన్ని సూక్ష్మక్రిములు గాలివలన, సూర్యరశ్మి తగలటం వలన నాశనమవుతాయి. కొంతనీరు భూమిలోనికి ఇంకిపోతుంది. కొంతవరకు నీటిలోని కాలుష్యాలు వ్యర్ధాలు నాశనమవుతాయి. ఆందుకే మన పెద్దలుపారే నీటిలో దోషం ఉండదుఅంటారు. ఫ్రతి గ్రామసరిహద్దుల్లో చెట్లు పెరిగే అవకాశం మనమే కల్పించి నీటిని అందేలా చేస్తే అవి ఏపుగా పెరుగుతాయి. ఈ నీటి శుద్ధికి రసాయనాలు సాధ్యమైనంత తక్కువ వాడటం మంచిది. నీరు భూమి అడుగుపొరల్లో చేరటం వలన దానిలోని కాలుష్యాలు కొంతవరకు అరికట్టబడతాయి. కాలువల్లోని పూడికని మాత్రం ఎప్పటికప్పుడు తొలగించాలి. ఇది చాలా క్రమబద్ధంగా జరగాలి. మొక్కలు నాటడం ఎంత శ్రద్ధగా చేస్తున్నామో వాటిని రక్షించడం ప్రతి ఒక్కరు తమ బాధ్యతగా భావించాలి. అప్పుడే జలరక్షణ, వనరక్షణ జరుగుతుంది. నీటిలో నిల్వయైన కాలుష్యం దూరంగా కాలువ ద్వార ప్రవహించడం వలన కొంతవరకు నిర్వీర్యమవుతుంది. క్షీణపడిన మురికినీరు ఎప్పటికీ హానికరం కాదు. ప్రస్తుతకాలంలో కాలువకి ఇరుప్రక్కల పూలమొక్కల్ని పెంచితే కొంతవరకు అందాన్ని ఇస్తాయి. ముఖ్యంగా ఈశాన్యరాష్ట్రాల్లో ప్రతి ఇంటి వెనక పోక్రిలని (చెరువుల్లాంటివి) త్రవ్వుకుంటారు. వీటిలో వర్షం నీరు నిలువచేసుకుంటారు. నీటిని శుద్ధి చేసుకోవటానికి తామరపుష్పాలు వానిలో పెంచుతారు. ఈ నీటిని గృహోపకరణ పనులకు ఉపయోగిస్తారు. వీటిలో పెరిగే కమలపుష్పాలు అందంగా కనులవిందు చేయటమేకాక వాటి ఆకులు, పువ్వులు, కాడలు, విత్తనాలు వివిధ వంటకాల్లో వాడతారు. ఆరోగ్యరీత్యా చాల మంచిది అన్నది వారి నమ్మకం. మరి నమ్మకం మనకెందుకు వర్తించదు? ఇది పురాతనపద్ధతి అయినా నీటి స్వచ్చత అనే నిజం నిగూఢమై వుంది.
స్వచ్చత గురించి ఇంత విపులీకరిస్తున్న కొందరు తమ అశ్రద్ధతో కలుషితమైన నీరు ఉపయోగించి అస్వస్థతతో పాటు మరణిస్తున్నారు. దానికి ఓదార్పులు, మూల్యాలు చెల్లించుకునే డిమాండ్లు కూడా ఒక ప్రక్క పెరిగిపోతున్నై. దీనికంతకు అపరిశుభ్రతే కారణం. కొంచెం శ్రద్ధ వహిస్తే ఎవరో వచ్చి కాదు ప్రజలే తమని తాము రక్షించుకోగలరు. ఫ్రతి చిన్న సమస్యకి ప్రభుత్వ సానుభూతి కోసం వెంపరలాడనవసరం లేదు. వ్యాధులు వచ్చాక నివారణ కోసం అలోచించే కన్నా వ్యాధి ప్రబలకుండా ముందే శ్రద్ధ వహించడం మంచిది కదా అనిపిస్తుంది.

ఇక పట్టణాలు అభివృద్ధి చెందిన నగరాల్లో అతి పరిశుభ్రత కొన్ని భాగాల్లో అయితే అతి కాలుష్య వాతావరణం ఇంకొన్ని విభాగాల్లో. పని అయిన అది మంచైనా చెడైనా అవధులు దాటితే నిరుపయోగమే అవుతుంది. భవంతుల ప్రక్కనే మురికివాడలు అభివృద్ధి చెందుతున్నాయి. ఇక్కడ సరియైన అవగాహన లేక ముందుచూపు లేక కుక్కగొడుగుల్లా నిర్మిస్తున్న భవంతులు గృహనిర్మాణాలు (అభివృద్ధికి చిహ్నం అనుకునేవారికి) ఒక ప్రక్క అడ్డంకులైతే వేరొకప్రక్క వ్యర్ధనీరు పారడానికి సులభతరైమైన మార్గం లేకపోవటం కారణమవుతోంది. దీనివలన ఎక్కడ నీరు అక్కడే వుండిపోవటం సరైన అవగాహన లేని డ్రైనేజీ పద్ధతితో కొంచెం వర్షం పడినా అది వరదలా ముంచెత్తుతోంది. 'నీరు పల్లమెరుగు నిజము దేవుడెరుగు అన్న సామెత మనం అవగాహన చేసుకుని నీరునెప్పుడూ పల్లంవైపు మళ్ళించాలి. కలుషిత నీరు సమీపాన ఉన్న చెరువుల్లోకి, నదుల్లోకి మళ్ళిస్తున్నారు. ఇది దారుణం.
అప్పిచ్చువాడు వైద్యుడు; ఎప్పుడు ఎడతెగక పారు ఏరున్; ద్విజుడున్ చొప్పడిన యూరనుండుము చొప్పడకున్నట్టి యూరు సొరకుము సుమతీ:
పైన ఉదహరించిన నాలుగు ప్రతీ పల్లెకి, నగరానికి అవసరము. ఎక్కడో ఒకటి రెండు నగరాలు అభివృద్ధి చెందినా ప్రస్తుతం చాలా నగరాల్లో వరద ఉధృతి, మురికి నీటివల్ల వచ్చే రోగాలు అధికంగా ప్రజ్వరిల్లుతున్నాయి. దీనికి ముఖ్యకారణం నీటిపారుదలకు తగిన అవకాశం లేకపొవడమే. అవకతవక నిర్మాణాలు కూడా కొంతవరకు కారణం అవుతున్నయి. మనం పల్లెలోలాగా ఇక్కద మట్టి కాలువలు నిర్మించడం సాధ్యం కాదు. ఎందుకంటే చాలావరకు కరెంటు స్తంభాలు వుంటాయి. అందుకని పారే నీటిని సిమెంట్ లేదా ప్లాస్టిక్ పైపుల ద్వారా దూరతీరాలకు చేర్చవచ్చు. కానీ నీటిని ఎక్కడ విడుస్తారు? ఇదీ సమస్యే. మనదేశంలో భూగర్భాల ద్వారా మురికి నీటినిగాని, త్రాగునీటినిగాని, పంపించే పద్ధతి 25,000 సం. క్రితం నుంచే ఉంది. ఇది సింధునాగరికత అన్న పేరుతో ప్రసిద్ధి గాంచింది. నాగరికులు కాలంలో వున్నారనడానికి తార్కాణమిది. రోడ్డుకిరువైపుల పెద్ద పెద్ద భవంతులు నిర్మించి సువిశాలమైన దారులు ఏర్పరచారని చరిత్ర చెబుతోంది. కాబట్టి భూమి క్రింద నుంచి పైపుల ద్వారా నీటిపారుదల చెయ్యవచ్చు. దూరంగా వదిలిన నీటిని 'వాటర్ రీసైక్లింగ్' అను విధానంతో శుభ్రపరచి తిరిగి అదే నీటిని రోజువారీ వాడకానికి ప్రజలకు అందేలా చెయ్యలి. ఇది ఉద్యానవనాల పెంపుదలకి, గృహోపకరణ పనులకి ఉపయోగించవచ్చు. మనకు నీటిఎద్దడి తగ్గుతుంది. నీరు నిల్వలు వుండకపోవడం వలన దానిపై వాలే దోమలు, ఈగలు, సూక్ష్మజీవులు పెరగవు. కొంతవరకు భయంకర రోగాలను అరికట్టవచ్చు. ఎందరో జనులు మృత్యువాత పడకుండా నివారించవచ్చు. అంతగా అభివృద్ధి చెందని ప్రాంతాల్లో నీటిని క్లోరినేషన్ అనే పద్ధతిలో శుద్ధి చేసి ట్యాంకుల ద్వారా ప్రజలకి అందచేయవచ్చు. లేదా రోడ్డుకిరువైపుల పెంచిన వృక్షసముదాయానికి తరలించవచ్చు. అరటిచెట్లు పెంచడానికి అధికనీరు అవసరం అవుతోంది. వాటికి ఉపయోగించితే చెట్టు యొక్క ఆకులు, కాయలు, పండ్లు, మాను ఉపయోగకరమే. అధిక రాబడికూడా ఉంటుందితామరపూవులను బురదనీటిలో పెంచితే అవి నీటిని కొంతవరకు శుద్ధిచేయగలవు. సువేజీ క్లీనింగ్ (మెషిన్సు ద్వారా తీయటం) వ్యర్ధాలను దూరంగా నిర్మానుష్య ప్రదేశాల్లోకి చేర్చితే కొంతకాలానికి అది ఎరువుగా మారుతుంది. ఒక్క త్రాగేనీరుని (శుద్ధమైన చెరువుల ద్వారాగాని, బావులద్వారాగాని, నదులద్వారాగాని) మాత్రమే వాడుకుంటే మనం ఎంతో నీరు సదుపయోగం చేసినవారమవుతాము.
తరువాత మనం ముఖ్యంగా నీటిలోకి విడిచే వ్యర్ధాల్లో ప్లాస్టిక్ ముఖ్యమైన హానికర వ్యర్ధంగా భావించబడుతోంది. వ్యర్ధాలు సీసాలు, కవర్లు ఎన్నో మరెన్నో విధాలుగా రోజురోజుకీ కొండలా పేరుకుపోతున్నాయి. నవీనయుగంలో నీటివాడకం మితిమీరిపోయింది. వీటిని అరికట్టడానికి సులభమైన ఉపాయాలే వున్నయి. సాధ్యమైనంతవరకు ప్రయాణాల్లో ఎవరికివారు త్రాగే నీటిని తమకు అనుకూలంగా వెంట తీసుకు వెళ్ళే పద్ధతి మంచిది. రైల్వేస్టేషన్‌, బస్ స్టాండుల వద్ద ట్యాంక్‌లో నీరు క్లోరినైజ్ చేసి వాటిని కూలింగ్ ఫిల్టర్లు ద్వారా మంచి శుద్ధమైన చల్లని నీరు అందిస్తే వ్యర్ధాల్ని అరికట్టవచ్చు. దీనికి మినిమం చార్జీగా కొంతడబ్బు వసూలు చేస్తే వచ్చే ఆదాయంతో క్లోరినేషన్, ఫిల్టెరషన్ అనేవి జరుగుతాయి. ఆదాయంతోపాటు వ్యర్ధాలు కూడా అరికట్టబడతాయి. ఇంక ఇంటింటికీ వచ్చే పాలసరఫరా వారు కేన్లలో లేదా గాజుసీసాల ద్వారా తగిన కొలతతో అందిస్తే ఎంతో ప్లాస్టిక్ వ్యర్ధం అరికట్టబడుతుంది. నేడు కొనే పప్పుదినుసులు వగైరాలు ప్లాస్టిక్ కవర్ల బదులుగా కాగితంతో చేసిన సంచీలలో సరఫరా చేస్తే తొంభై శాతం ప్లాస్టిక్ వాడకం అరికట్టబడుతుంది. పేపరు కవర్లు తయారుచేసినవారికి కుటీరపరిశ్రమ అవుతుంది. అదే సమయంలో మనం వాడి పారేసిన పేపర్లు, మ్యాగజైన్లు ఉపయోగం అవుతాయి. నూనె, నెయ్యి, వగైరాలవంటివి గాజుసీసాల్లో పేక్ చేయవచ్చు. ఇవి తిరిగి ఉపయోగించడానికి అనుకూలం. ప్లాస్టిక్ అనేది ఎంతో అవసరమైతే తప్ప సామాన్యుడికి అందుబాటులో వుండకూడదు. ముఖ్యంగా నగరాల్లో గార్బేజీ కవర్లు ప్రతీరోజు గుట్టలు గుట్టలుగా నిండిపొతున్నాయి. వీటిని అరికట్టాలంటే ప్రతీ కూడలిలో రెండు డస్టుబిన్లు ఏర్పాటు చేయాలి. (ఆర్గానిక్) ఎరువు తయారీకి సంబంధించినవి ఒకదానిలో (డైమెటీరియల్) వేరొకదానిలో వాడాలి అన్న అవగాహన ప్రజల్లో కల్పిస్తే కొంతవరకు ప్లాస్టిక్ వ్యర్ధాలు అదుపులోకి వస్తాయి. లేకుంటే వ్యర్ధాల్ని నదుల్లోకి చెరువుల్లోకి పచ్చని పరిసరాల్లోకి వదిలేస్తున్నారు. కొన్నిచోట్ల పశువులు వ్యర్ధాలు తిని ప్రాణాపాయం తెచ్చుకున్న సంధర్భాలు ఉనాయి. ఇది మనం చేతులారా చేసుకుంటున్నాము. ప్లాస్టిక్ కవర్లలో కట్టే టిఫిన్ కన్నా  అరిటాకుల్లో, విస్తరాకుల్లో, బాదామి ఆకుల్లో, తామరాకుల్లో కడితే ఉపయోగిస్తే మనం తినిపారేసినా తిరిగి ఎరువు క్రింద తయారుచేయవచ్చు. వీటిని తగిన ఆకారాల్లో అందంగా తయారుచేస్తే తినడానికి జనం ఇష్టపడతారు. వీని ద్వారా కూడా కుటీర పరిశ్రమలు అభివృద్ధి చెందుతాయి అంటాను. మీరేమంటారు?
ఇంకొక అధిక వ్యర్ధాలు మనం పారేసే తిండిపదార్ధాలు. ఇవి ముఖ్యంగా కేటరింగ్ల్లోను, హోటల్సులోనూ, పెండ్లింటి వేడుకల్లోనూ, రైళ్ళలోను అధికం. ప్రతీచోట డస్టుబిన్లు ఉన్న చెత్త మాత్రం వాటి చుట్టూ పేరుకుపోయి ఉంటుంది. వాటి పైవాలిన ఈగలు, దోమలు వాతావరాణాన్ని విషపూరితం చేస్తాయి. అనేక జంతువులు పీక్కుతింటాయి. అడుక్కునే యాచకులు ప్లాస్టిక్ వ్యర్ధాల కోసం, లేదా తిండి కోసం చెత్తనంతా బయటకు లాగుతారు. దానివలన పరిసరాలన్నీ దుర్గంధమయం అవుతాయి. ఇది చాలా అనూహ్యమైన వాతావరణం. కంటికి కనిపించే ప్రత్యక్ష నిజం. దీన్ని అరికట్టడానికి కొన్ని ఎన్.జి.వొ. సంస్థలు ముందుకు వచ్చారు. వారు ఆహారవ్యర్ధాలను శుభ్రతతో ప్యాక్ చేసి పందుల పెంపకదార్లకు సరఫరా చేయడం వలన వీటిని పందులకు అహారంగా వాడతారు. కాలుష్యాన్ని అరికట్టడానికి సంస్థలు చేసే కృషి అభినందనీయం. సంస్థలు పని చేస్తున్నాయి కదా అని మనం తృప్తిపడి సమస్యలు తీరేయని అనుకోకూడదు. వారిని సహకరించడానికి మనవంతు కృషి మనం చెయ్యాలి.
"సాధించిన దానికి సంతృప్తిని పొందీ
అదే విజయమనుకుంటే పొరపాటోయి
ఆగకోయి భారతీయుడా
కదలిసాగవోయి ప్రగతిదారులా అన్నారొక కవి.
కాబట్టి సంస్థలు ఇంకా దేశమంతటా విస్తరించాలి. అప్పుడే కొంత స్వచ్చత దేశంలో చేకూరుతుంది.
ఈనాడు విందు స్టేటస్ సింబల్‌గా ఒకర్ని మించి ఒకరు తమ గొప్పతనాన్ని చాటుకుందికి వందల కొద్దీ తినే పదార్ధాలు తయారుచేస్తున్నారు. కోట్లకొలదీ ధనవ్యయం మాత్రమే కాదు భోజన వ్యయం కూడా అమితంగా చేస్తున్నారు. 'అన్నం పరబహ్మ స్వరూపం' అన్నారు వేదాల్లో. ఇది వ్యర్ధం చెయ్యడానికి మనకు అధికారం లేదు. అయిన అలా చేస్తున్నామంటే క్షమించరాని నేరమే. భగవంతుని ధిక్కరించడమే అవుతుంది. ఇది నేను ఎవరినీ కించపరచటానికి గానీ వారి రంగ రంగ వైభవాన్ని భంగపరచడానికి గానీ వ్రాయటంలేదు. జన్మలో చేసుకున్న పుణ్యమో భగవంతుడు మంచి భోజనం ప్రసాదించాడు అని అతనికి కృతజ్ఞతలు తెలిపి భక్తితో నమస్కరించి తినండి. అది మీకు అంతులేని ఆరోగ్యం ప్రసాదిస్తుంది. మనశరీరానికి ఏది హితవో అదే తినాలి. 'ఆరోగ్యమే మహాభాగ్యము అన్న ఆర్యోక్తి నిజంకదా! పైకి అతిచిన్నగా కనిపించే మార్పులు సలహాలు మనం ఆచరణలో పెడితే భూమి తనంతట తానే స్వచ్చమవుతుంది. భూదేవి మనకు ఇచ్చిన వనరుల్ని, నీటిని, గాలిని, పరిసరాల్ని సర్వజగత్తును కాలుష్యాల నుంచి నిర్మూలన చేసి విశ్వమానవ సౌరభ్యం చేకూర్చిననాడు.

'భూదేవో రక్షతి రక్షిత:' భూమిని మనం రక్షిస్తే భూదేవి తిరిగి మనల్ని కాపాడుతుంది అన్న పదాలు నిజాన్ని ఆపాదిస్తాయి.