ఆది నుంచి భారతదేశం వ్యవసాయమే ముఖ్య వృత్తిగా
పల్లెసీమలతో కళకళలాడుతూ పేరొందిన సంపన్నదేశం. ఇక్కడ నూటికి డెభ్భైఐదు మంది వ్యవసాయం
పైనే ఆధారపడుతూ రైతుబలం సమృధ్హిగా దేశానికి రైతే వెన్నెముక అనుకునే దేశం. కాలక్రమంగా
మనకు స్వాతంత్య్రం వచ్చిన దగ్గర నుంచి నేటి వరకు వ్యవసాయ అభివృద్ధికి ఎన్నో పధకాలు
తయారుచేసారు. చేస్తున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో, కాలంలో వచ్హిన మార్పులు,
వృత్తుల్లో వచ్హిన మార్పులు, వాతావరణ మార్పులు సై న్స్ టెక్నాలజీల అభివృద్ధితో వ్యవసాయం మెల్ల మెల్లగ ప్రక్కదారులకు
మళ్ళుతోంది. అన్నదాత రైతు మాత్రం ఈ ధాటికి తట్టుకోలేక ఈ వేగాన్ని అధిగమించ లేక చాలా
వెనక పడిపోయారు. ప్రస్తుత కాలంలో కులవృత్తి మానేసి వేరే సంపాదన వైపు పరుగులు పెడుతున్నారు.
ఇది చివరకి దేశవ్యవసాయ పరిస్థితిని ఎటు దిగజారుస్తుందో నేటి పాలకులు చెప్పలేకపొతున్నారు.
పై విషయల్లో కేవలం ప్రభుత్వానిదే తప్పు అనలేము.
రైతుదే తప్పని కూడా అనలేము. ఎందుకంటే వీరిద్ధరూ ఇటు ప్రభుత్వము, అటు రైతు కూడా ఒక నాణానికి
రెండువైపుల వుండే వేర్వేరు ముఖాలు. రైతు లేనిదే ప్రభుత్వం లేదు. ప్రభుత్వం లేనిదే రైతు
లేడు. కానీ చూడటానికి మాత్రం నాణెం ఒకటే. మన దేశ వాతావరణం నదులు, నేల అన్నీ బాగా పనికి
వచ్చేది వ్యవసాయనికే. కానీ దీని వలన ప్రతీ సంవత్సరం నష్టాలే తప్ప లాభాలు లేవు. అతివృష్టి,
అనావృష్టి ఈ రెండు నేటి వ్యవసాయ వ్యవస్థని ఎదగకుండా పీడించుకు తింటున్నాయి.
బాగా పంటలు పండి వాటి ఫలితం చేతికి వచ్చే సమయానికి
ఏదో అవాంతరం వస్తోంది. పోనీ అన్నీ బాగుండి పంట ఫలం దక్కినా దానికి తగిన ధర రాదు. మధ్యవర్తులు
లబ్ధి పొందుతున్నారు. వచ్చిన పంట దాచుకొని తగిన ధర వచ్చినపుడు మార్కెట్లో అమ్ముదామన్న
తగిన సదుపాయాలు లేవు. ఇవన్నీ రైతుల వైపు నుంచి వచ్చే సమస్యలు. ప్రభుత్వం ఋణ మాఫీ అని,
తక్కువ వడ్డీకి ఋణాలు అందిస్తున్నామని చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితి చూస్తూ వుంటే
ఒక సంవత్సరము నష్టపరిహారంగా రైతుల ఋణాలు తీర్చేస్తాము. మళ్ళీ సంవత్సరము ఇదే పరిస్థితి
వస్తే ఏం చేయాలి? ఇలా తీర్చుకుంటూ పొతే అంతం ఎప్పటికి అవుతుంది? ఇది ఆలోచించవలసిన విషయం.
ఇందులో రైతులు తాత్కాలిక విముక్తి పొందుతారు. ప్రభుత్వం తమ సమస్యని అప్పటికి మాత్రమే
తాత్కాలికంగా సానుకూలం చేయగలుగుతున్నది.
రైతులు చేసిన ఋణాలు తీర్చమని, నష్టపరిహారం ఇమ్మని,
లేదా పంట గవర్నమెంటే కిట్టుబాటు ధరకు కొనాలని లేదా ఆత్మహత్య చేసుకుంటామని బెదిరింపులు.
ఒకవేళ నిజంగా రైతులు వేరే కారణం చేత ఆత్మహత్య చేసుకున్నా అపోజిషన్ నాయకులు చెలరేగడం
వారి ఒత్తిడి ప్రభుత్వం పైన వస్తుంది. ఇంకా ప్రభుత్వం ఏమీ చేయలేకపోతే బస్సులు కాల్చేయడం,
నిలువునా పండిన పంటనంతా తగిన ధర రాలేదని రోడ్లమీద పోసెయ్యడం లాంటివి కోపంతో ఆవేశంతో
జరుపుతున్నారు. అలా వద్దు అంటే ధర్నా. ఈ ఆవేశాలు దేశపు పురోగతిని ఉటు వైపు చేరుస్తాయో
అన్నది అర్థం కావదంలేదు. ఇది నేను రైతులని కించపరచడానికి గానీ వారిని వ్యతిరేకిస్తూ
గానీ వ్రాయటం లేదు. రైతులు తమ ఆగ్రహాన్ని చేతకాని పరిస్థితిని ప్రభుత్వం పైన ఇలా చూపిస్తున్నారు.
పురుగులమందు కొని తమ ప్రాణాలు తీసుకునే బదులు ఒక్క క్షణం ఆలోచించి పంటకు నస్టం కలిగించే
ఆ పురుగుల్ని చంపటం వేరే మార్గంలో మంచిది కదా! అని నాకు అనిపిస్తోంది. ఏ పని అయినా
అలోచించి చెయ్యాలి. అన్ని అనర్థాలకు ఆవేశమే మూలకారణం. దేశం నీకేమి ఇచ్చింది? అన్న ప్రశ్న
కన్నా నువ్వు దేశానికి ఏమి చేశావు? అన్నది ముఖ్యంగా ప్రతీ భారత పౌరుడు గుర్తుంచుకోవాలి.
ఆగ్రహంతో, ఆవేశంతో క్షణంలో మనం బస్సుల్ని తగలేస్తే మన సమస్య తీరుతుందా? చేసిన రుణాలు
తీరిపోతాయా? ప్రభుత్వానికి మళ్ళీ అటువంటి బస్సులు తయారుచేయడానికి కొన్ని కోట్ల రూపాయలు
కావాలి. ఆ నష్టం పూడ్చడానికి టికెట్ ధర పెంచేసి నిత్యావసర ధరలు పెంచేసి మళ్ళీ మన దగ్గరే
వసూలు చేస్తారు. నాశనం చేసేది మనమే. దానికి మూల్యం చెల్లించేది మనమే అవుతున్నాము. ఇది
జగమెరుగిన సత్యం. మన ఆస్తిని మన ఇంటిని మనం ఎలా రక్షించుకోవాలని ఆరాటపడతామో అలాగే ప్రతి
ఒక్కరు ఇది మన దేశం, ఇది మన ఆస్తి అన్న భావనతో రక్షించుకోవాలి. సృష్టిలో కెల్ల అద్భుతమైన
దేశం భారతదేశం. ఎందుకంటే ఇచ్చట ఉన్నన్ని నదులు, సముద్రాలు, కొండలు, అడవులు, పశుసంపద,
వ్యవసాయానికి సరిపడే సానుకూల వాతావరణం పృకృతి మనకిచ్చిన వరాలు. ఇవి ప్రపంచంలో వేరే
ఏ దేశంలోనూ కనిపించవు.
పూర్వాకాలంలో రైతులు ఆనందంగా బ్రతికేవారు. తమకు
పండిన పంట ధాన్యం, చెరకు, పప్పుదినుసులు, కూరగాయలు, పండ్లు, వగైరా ఎడ్లబండి మీదగాని,
ట్రక్కులో గానీ, ట్రాక్టర్‌లపై గానీ, సంతలకి, మిల్లులకి, ఫ్యాక్టరీలకి తరలించేవారు
తగినధరలు వచ్చేవి. కానీ ప్రస్తుత కాలంలో మనిషిలో పెరిగింది బద్ధకం. వారే కొనుగోలు చేస్తారు
అనేది భీమా మొబైల్, కంప్యూటర్లు, ఆన్ లైన్లో సంప్రదింపులు వచ్చి వారి స్థితిగతులు పూర్తిగా
మార్చేసాయి. వాటిని వారు సరిగ్గా సద్వినియోగం చేసుకోగలగాలి. అప్పుడే వారికీ దుర్గతి
పట్టదు. వాతావరణ వివరాలు హెచ్చరికలు పట్టించుకోరు. కొన్నిచోట్ల వారి నిర్లక్ష్యం వలన
పంట పాడవుతోంది. నిజంగా వాన వచ్చి ఆ పంట పోతే ప్రభుత్వానిదే బాధ్యత. వీరికి మద్ధతు
ఇచ్చి అగ్నిలో ఆజ్యం పోసినట్టు రెచ్చగొట్టేవారు ఎక్కువ. ప్రభుత్వం ఎక్కడో లేదు. నీవే
ప్రభుత్వం. ప్రస్తుత కాలంలో నాయకులే నీవద్దకు వస్తున్నారు. లేదా వారితో సంభాషించడానికి
అనువైన అవకాశాలు కల్పిస్తున్నారు. టెక్నాలజీ అభివృద్ధి మనుషుల మధ్య దూరాన్ని చెరిపేసింది.
కాబట్టి రైతులు సకాలంలో ఈ సదుపాయాల్ని వినియోగించుకోవాలి. ఒక వేన్‌గాని, ట్ర
క్కులోగాని, కనీసం ఎడ్లబండి మీద గాని
సరకుని మార్కెట్‌కు చేర్చలేరా? అక్కడ కూర్చుని అమ్ముకోలేరా? రెగ్యులేటడ్ మార్కెట్‌లో
ధరలు నిర్ణయించుకోలేరా? నాణ్యమైన సరకు విదేశాలకు ఎగుమతి చెయ్యలేరా! ఇవన్నీ సాధ్యం చెయ్యగలరు
తలచుకుంటే పూర్వం కన్నా రైతులు చదువుకున్నవారే, విద్య తెలిసిన వారే. ఒకవెళ నిరక్షరాసులైనా
వారి అభివృద్ధికి తగిన అవకాశాలు ఏర్పడ్డాయి. కాబట్టి తమ కాళ్ళ మీద స్వశక్తితో నిలబడగలగాలి
మనకి ప్రాణాలు నిలుపుకునే అవకాశం తప్ప వాటిని తీసుకునే అధికారం లేదు. అది ఒక్క దేవుని
చేతుల్లో మాత్రమే ఉంది.
రైతులు ప్రతీ సంవత్సరం ఒకేలా తమ పంటకు తగిన
ధర రాలేదని వాపొతున్నారు. ధరలు ఎప్పుడూప్రజల నుండి వచ్చే డిమాండ్సుని బట్టే ఉంటాయి.
కానీ వారి దగ్గర వున్న సరుకును బట్టి కాదు. డిమాండు, సప్లై సమానంగా వున్నప్పుడే ధరలు
కూడా అదుపులో వుంటాయి. దీన్ని బట్టి రైతులు తమ ఉత్పత్తిని పెంచుకోవటం కానీ తగించుకోవటం
కానీ చెయ్యాలి. నేటిరోజుల్లో సేంద్రీయ పద్ధత్లో ఉత్పత్తి చేసే సరుకులకి మంచి డిమాండు
వుంది. కనుక రైతులు భూమిని సారవంతం చేసి (చేలలో తయారు చేసిన ఎరువు) ప్రతీ సంవత్సరం
ఒకే పంటని కాకుండా మార్చి వేయాలి. (ఉదా: కందులు వేసిన చేలో మరో సంవత్సరం మినుగులు గానీ,
పెసలు గానీ) ప్రస్తుతం ప్రజల్లో ఏదో కొని తినెయ్యాలి అన్న ఊహ లేదు. డబ్బు ఖర్చుకి వెనుకాడే
రోజులు పోయాయి. ఆరోగ్యంపై అవగాహన పెరిగింది. పరిశుభ్రతపై దృష్టి మరలింది. కనుక ఈ చిన్న
మార్పులు రైతులు చేస్తే ప్రజలే సరకు కొనుగోలు కోసం వారి దగ్గరకు తప్పక వస్తారు.
నీటి ఎద్దడి కారణంగా పంటలు ఎండిపోతున్నాయి అన్నదానికి
సకాలంలో పడిన వాన నీరు ఒడిసి పట్టడం అనేది చాలా రాష్ట్రాల్లో చేస్తున్నారు. పూర్వం
చూరుల్లోంచి పడే నీరుతో గాగులు, ట్యాంక్‌లు నింపి వాడుకునేవారు. నేడు స్లోపుగా వేసి
పైపులద్వారా వాననీరు ఒడిసి పడుతున్నారు. దీన్నే కాలువలు త్రవ్వి ప్రవహింప చేస్తున్నారు.
వాడిన నీరే తిరిగి రీసైక్లింగ్ అనే పద్ధతిలో పైపుల ద్వార పొలాల్లోకి పంపుతున్నారు.
ఆ నీరు తోటలకి, చెట్లకి, కూడా వాడుతున్నారు. ఇది పెద్ద పెద్ద నగరాల్లో భవంతుల్లో జరిగే
ప్రక్రియ. గ్రామాల్లొ కూడా అవలంబించవచ్చును.
చేనుచుట్టూ మనం గట్లు కట్టి దానిపై గడ్డిని
పెంచినా లేదా సీమచింత చెట్లు గానీ, పండ్ల చెట్లు గానీ వేస్తే కొంతవరకు భూసారాన్ని వరదల
బారి నుంచి నిలపవచ్చు. ప్రతీ సంవత్సరం వరదలు వచ్చే సమయం మనకు తెలుసుకాబట్టి ఆ పంటలు
వేయడం తాత్కాలికంగా ఆపుచేసి తరువాత కాలంలో వేయటం మంచిది అని నా అభిప్రాయం.
చివరిగా నేను చెప్పేదేమిటంటే వాతావరణానుకూలంగా
పంటలు పండిద్దాము. ఒక మానవహారంలా చేయి చేయి కలుపుదాం. ఒక త్రాటి మీద నిలిచి భరతమాత
ముద్దుబిడ్డలు 'రైతులే' అని నిరూపిద్దాం. 'అతిథి దేవో భవ ' అని ఇంటికి వచ్చినవారిని
ఆదరించి వారి ఆకలి దప్పికలు తీర్చి పంపే సంప్రదాయం మనది. ఇది మన తెలుగు జాతి సంస్కారం.
దీన్ని చూసి ప్రపంచమంతా గర్వించేలా తలెత్తుకు తిరగాలి. కాబట్టి ఈ సంస్కృతీ సంప్రదాయాలు
నాడు కాదు నేడు కాదు ఎప్పటికీ నిలుపుకోవాలని ఆకాంక్షిస్తూ.
“పుణ్యభూమి నా దేశం నమోనమామి
కర్మ భూమి నా దేశం సదా స్మరామి
నన్నుగన్న నా దేశం నమోనమామి
అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి.”
No comments:
Post a Comment