Tuesday, 10 October 2017

అహింసయే పరమధర్మం : మొదటి భాగం

అన్ని ధర్మాల్లోకి అహింసయే ఉత్తమమైన ధర్మం అన్నది వేదనుడికారము. దీని ప్రతిష్ఠాపనకై ఆదినుంచి అనేక వీరులు, ప్రవక్తలు, మహాత్ములు ఎంతో కృషిచేసారు. వారి జీవితాలను ప్రాణాలను అహింస రక్షణకై ఒడ్డారు. తరువాత కాలంలో కూడా వారి బాటలోనే నడచిన నాయకులు ప్రజలను అదే మార్గంలో నడిపారు. ప్రజలకు మార్గదర్శకులయినారు. "భారతదేశం శాంతి కాముక దేశం" అన్న సందేశాన్ని ప్రపంచ దేశాలకు చాటిచెప్పారు. అసలుఅహింసా అంటే ఏమిటి అన్న ప్రశ్న వస్తే 'ప్రాణులను హింసించకుడదూ అనే నిజం ప్రస్ఫుటం అవుతుంది. నాడు ఇది ఒక ద్ధర్మంగా, కర్తవ్యంగా భావించేవారు. ఎప్పుడూ కాలంలో అయినా మంచికి చెడుకి జరిగే సంఘర్షణలో విజయం ఎప్పుడూ మంచి వైపే ఉంటుంది. అటువంటి మంచిని రక్షించడానికి ప్రాణత్యాగం చేసినా ఫర్వాలేదు. మీ సేవకు జగతి నీరాజనాలర్పిస్తుంది. రామాయణ, మహాభారత యుద్ధాలు జరిగాయి అంటే అవి ధర్మానికి, అధర్మానికి మధ్య జరిగిన పోరాటాలు. చివరికి అధర్మం ఎంత శక్తివంతమైనది అయినా ధర్మం ముందు తలవంచింది. ప్రస్తుతకాలంలో రాచరికం అంతరించింది. ప్రజలే ప్రభువులైనారు. కాబట్టి ధర్మాన్ని నిలబెట్టడం అహింసని ప్రతిష్ఠించడం అనేవి ఒక్క నాయకుల కర్తవ్యం మాత్రమే కాదు. మనందరిదీ అనుకోవాలి. అప్పుడే ధర్మం నిలబడుతుంది.

నేడు హింసాప్రవృత్తి ప్రబలింది. హింసించడమనేది ఒక రాక్షసకృత్యం. అది సామాన్యుల వరకు వ్యాప్తిచెందింది. ఎక్కడ చూసినా ఎక్కడ చదివినా హింసాత్మక చర్యలే కనిపిస్తాయి. ఇది నేడు హద్దులు దాటిపోయింది. హింసాకృత్యాలకి కారణాలు అనేకం. ప్రతీరోజు మనింట్లో కనుల ముందు కదలాడే టెలివిజన్ ప్రోగ్రాములు ముఖ్య భూమిక వహిస్తాయి. దేశనలుమూలల్లో ప్రపంచంలో ఎక్కడ ఏమూల హింసాత్మక ఘటన చోటు చేసుకున్నా దాన్ని పదే పదే వివరిస్తూ చూపడం ద్వార చూసేవారి మనసుల్లో చెదరని ముద్ర వేస్తుంది. అనుకరణ స్వభావం ఉన్న చిన్నారి మనసుల్లో ఉత్సుకత పెరుగుతుంది. వీటి ప్రభావం వారిమీద వారి ప్రవర్తన మీద తప్పక పడుతుంది. అదే హింసాత్మక ఘటన చేయాలనే ఆశకి ఊపిరి పోస్తుంది. ఇంక మిగిలిన భాగాన్ని కొంతవరకు సినిమాలు ఆవరిస్తున్నాయి. వీటిలో నూటికి తొంభైశాతం హింసాత్మిక చర్యలే ఉంటే ఒక పదిశాతం అహింస ఎక్కడ ఉందో వెతుక్కొవాలి. ధర్మం నిలపడానికి పోరాడితే అది నిజమైన వీరత్త్వం అనిపించుకుంటుంది. ప్రస్తుతకాలంలో సినిమాలద్వారా పొందే విజ్ఞానం, వినోదం చాలా పరిమితిగా ఉంటుంది. విలన్ని కొట్టడమే హీరో నీతిని నిలబెట్టడం అన్నదానికి పరాకాష్ఠ అవుతోంది. వారిని చంపడానికి గొడ్డలి, పిస్తోలు, కత్తి ఏం వాడారో లేక ఎడంచేత్తో ఎంతమందిని కొట్టిహింసించాడో ఇవే మనకు ముఖ్యం. వారి వారి సినిమాల్లో ఎన్ని ఫైట్లు అన్న పైశాచిక ఆనందం తప్ప విజ్ఞానం ఎంత ఉంది? సందేశం నిభిడీకృతమై ఉంది? అనేవి ఎవరికీ అవసరం లేదు. వారు కోట్ల కొలదీ డబ్బు ఖర్చుపెట్టి తెస్తున్నారు. ప్రతీసినిమాలోను ఒక సందేశం తప్పక ఉంటుంది. కానీ హింసల మధ్య మన దృష్టి అంతవరకు వెళ్ళదు. ఎందుకంటే హీరోలోని మంచితనం కనీకనపడనట్టుగా మసకబారి పోయింది. కాబట్టి పూర్వం సినిమాల్లో హింస మసకబారినట్టు ఉండేది. మంచితనం, నీతి, నిజాయితీ, సంస్కారం ప్రతీపాటలోను, మాటలోను, నటనలోను ఉండేవి. ప్రస్ఫుటించేవి. కమెడియన్స్ వస్తే నవ్వులు పూయించేవారు. వారి హావభావలు నటన అలా ఉండేవి. ప్రస్తుతం కమెడియన్స్ కారణం లేకుండానే తన్నులు తినాలి. వారు తిన్న చెంపపెట్టులతో నవ్వించాలని ప్రయత్నించినా మనకు నవ్వురాదు. బాధ వేస్తుంది. ముఖ్యంగా భాషాపరిజ్ఞానం చాలావరకు అంతరించింది. నేడువాడే పదాల్లో మర్యాద లేదు. మన్నన లేదు. పెద్దల మీద గౌరవం లేదు. నోటికి ఎంతమాట వస్తే అంత అనెయ్యడమే గొప్పగా భావిస్తున్నారు. మనం నవ్యతను అహ్వానించడమే గొప్పగా భావిస్తున్నారు. మనం నవ్యతను ఆహ్వానించాలి. పూర్వం కన్నాటెక్నాలజీ పెరిగింది. సైన్స్ విజ్ఞానం పెరిగాయి. వీటన్నిటినీ ఉపయోగించి అందమైన చారిత్రాత్మకమైన శ్రావ్యమైన సంగీతంతో మమతానురాగాలు మూర్తీభవించిన సినిమాలు తియ్యవచ్చు. అపుడు నిర్మాతలు పెట్టిన డబ్బుకి ఎన్నోవందల రెట్లు నిల్వలుగా మారుతాయి. ప్రభుత్వాలైనా వీటి విషయంలో కఠినత్త్వంతో ఉంటే ముఖ్యంగా పిల్లల్నే కాదు. పెద్దల్నీ యువతని ఎంతో మార్చవచ్చు. మనకు సెన్సార్ ఉంది. కమిటీవారు ఎంతవరకు సఫలీకృతులై విజయం సాధించగలుగుతు న్నారు అన్నది విషయంలో తెలియదు. దీనిమీద ప్రభుత్వం కొంచెం దృష్టి సారించడం ఎంతో అవసరం. పెద్దలు కాలక్షేపానికి చూసినా వారిమీద హింసాత్మక ప్రభావం అంతగా పడకపోవచ్చు. వారిలో విచక్షణాశీలత ఉంటుంది. కానీ పిల్లలు, యువతని మాత్రం వాతావరణం నుంచి దూరం చెయ్యటం మంచిది. అదేవిధంగాదూరదర్శన్ విభాగం వారు టెలివిజన్లో ప్రసారమయ్యే హింసాత్మక ఘటనలు సాధ్యమైనంతవరకు తొలగించడానికి అతిహింసాత్మికంగా కర్కశంగా ప్రవర్తించే ఆడవేంప్స్ పాత్రలను కొంచెం సరిదిద్దే ప్రయత్నాలు జరిపితే సమస్య కొంతవరకు తొలగుతుంది. ప్రయత్నంలో మనం సఫలీకృతులమైతే ఎన్నో కుటుంబాలను చక్కదిద్దినవారమవుతాము అనటంలో ఎంతమత్రం సందేహం లేదు.

సరియైన సమయంలో పిల్లలను యువతను మందలించి హింసాత్మిక మనోభావాలనుంచి సాధ్యమైనంత దూరంచేసి వేరే విషయాల్లో వారి ఆశక్తిని గమనించి పెయింటింగ్, కుట్లు, అల్లికలు, యోగా, వివిధ స్పోర్ట్స్, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ నేర్వడం, గార్డెనింగ్, మ్యూజిక్, డ్యాన్స్ వగైరా ఎన్నో విద్యలు ఉన్నాయి వారి తీరిక సమయాల్లో నేర్చుకునేందుకు. వీటిలో ఏది నేర్చుకున్నా అభివృద్ధి చేసినా వారి భావిజీవితంలో ఉపయోగమే కదా! ఇవి మనిషిలో మంచితనం అనే ఆశకి ఊపిరిపోస్తాయి. ‘నేటి బాలలే రేపటి పౌరులూ’ అవుతారు అన్న మాటలకి అర్ధం తెలుసుకుని మంచితనం మూర్తీభవించిన దేశోద్ధారకులు, ప్రయోజకులుగా తయారయి దేశాన్ని ముందుకు నడపాలి. ప్రతీమనిషిలోను లోపం ఉంటుంది. అదే దోషాన్ని సహృదయంతో మంచిమాటలతో సరిదిద్ది వారిని దరిచేర్చుకుంటే తప్పక మార్పు వస్తుంది. కాలంలో అభివృద్ధిపథం వైపు నడిపే మొబైల్స్, ఐపాడ్లు, కంప్యూటర్లు వగైరా కొంత వయస్సు వచ్చేవరకు వారికి దూరంగా ఉంచటం మంచిది. లేదంటే వారు తమకి నచ్చిన హింసాత్మక ఘటనలు కావలసిన భాషలో మరీమరీ తర్జుమా చేసుకుని చూడటం వలన పెరిగే ఉపద్రవాలే ఎక్కువ. ఏదో సీరియల్ చూసి నిజంగానే ఒక పది సం. బాలుడు తనని తాను కాల్చుకుని తరువాత చుట్టుముట్టిన మంటలలో పరుగులు పెట్టినా ప్రాణాన్ని కాపాడుకోలేకపోయాడు. కాలుతున్న శరీరంతో కేకలువేసాడు ముందు సీరియల్లో లాగా చేశాను చూడూ అని గొప్పగా. ఇక్కడ తప్పు ఎవరిది? ఇదా మనం నేర్పే సంస్కృతి? తరువాత విచారించి ఏం లాభం? దయచేసి పిల్లల్ని హింసకి దూరంగా పెంచండి. అంతులేని ఆశలు ప్రలోభాలకి దాసులై ఒకర్నిమించి ఒకరు పోటీలతో ఆధునిక పరికరాలు తల్లిదండ్రులు మనస్సులను కలతచేస్తున్నారు. అంతేకాక వారి అమూల్యమైన కాలాన్ని, శాంతిని, నిమ్మదిని కరువుచేసుకుంటున్నారు. కాలంలో నలుగురు విద్యావంతులు కలిసినా వారి వారి ఆధునిక పరికరాలతో మునిగిపోతున్నారు తప్ప కష్టసుఖాలు విచారించుకోవటం కానీ, ఆశక్తికరమైన విషయాల గురించి మాట్లాడుకోవటంగానీ జరగటంలేదు. పూర్తిగా నవజీవనానికి మనిషి కనిపెట్టిన యంత్రాలకి దాసులై వాటిలోనే రంగుల ప్రపంచాన్ని సృష్టించుకుని బానిసబ్రతుకు ఈడుస్తున్నారు. ఇది నామాట కాదు. జగమెరిగిన సత్యం.

నేడు సామాన్యంగా పిల్లలు పెరుగుతున్నది అతిప్రేమతో. వారిలో చదువుతో పాటు నైతికవిలువలు ఎంతవరకు పెంచాము మానవీయత ఉందా! అన్న సందేహం వస్తుంది. విద్యకన్న ముందు వారిలో బుద్ధి, క్రమశిక్షణ, వినయం, విధేయత, వివేకం పెరగాలి అన్న వాటి మీద మన దృష్టి సారించాలి. లేకపోతే వారు తమలోని ఆవేశకావేషాలను నిగ్రహించుకోలేరు. మొక్కై వంగనిది మానై వంగుతుందా. నేటిరోజుల్లో పిల్లలు టెలివిజన్ చూడనివ్వలేదని తల్లిదండ్రులను చంపినా ఫర్వాలేదు. టీచర్ని కొట్టినా తప్పులేదు. తనతోటి సహాధ్యాయుల చేత తగవులు పెంచుకొని హత్యలు చేసినా ఫర్వాలేదు. ఇంకా ఎవరన్నా మందలించబోతే ఆత్యహత్యలు చేసుకున్నా లైంగికదారుణాలు చేసినా ఫర్వాలేదు. ఇవన్నీ తప్పులు కావా? రేపు పెరిగి సమాజంలో వీరు నక్షలైట్స్ ఏమిటి? దేశద్రోహులేమిటి? దొంగలేమిటి? ఉగ్రవాదులేమిటి? ఏమన్నా అవుతారు. కటకటాలమధ్య ఏడుస్తారు. అలాంటి బిడ్డల్ని కన్నందుకు తరువాత తల్లిదండ్రులు విచారించాలి. వీటన్నిటికీ కారణం వారు మొక్కగా ఉన్నప్పుడు సరిగా పెంచకపోవటమే. ప్రేమ, అభిమానం, కరుణ, అనురాగం అనే సుగుణాలు ఉగ్గుపాలతో పోసి పెంచితే భావితరాలకి వీరు తప్పక ఉత్తమ మార్గదర్శకులవుతారు. అప్పుడు దేశం తనంతట తనే బాగుపడుతుంది. 

ప్రభుత్వసంస్థలు కూడా వీరివిషయంలో అనేక కార్యక్రమాలు నిర్వహించాలి. ముఖ్యంగా నేటియువత పెడదారి పడకుండా వారి విరామ సమయాన్ని సదుపయోగం చేసుకోవడానికి సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టగలిగేలా చేయాలి. ఒకసారి దేశమంతా మార్పులు, చేర్పులు వివిధ రంగాల్లో సమీకరించామంటే వీరిని కార్యోన్ముఖులను చెయ్యడానికి ఎంతోకాలం పట్టదు.
                               ‘చెడు వినవద్దు
                                  చెడు చూడొద్దు
                                  చెడు పలుకు నీనోట రానీయకూ
అన్న మాటల్లోని నీతిని భావాన్ని ప్రతీఒక్కరు ఆకళింపు చేసుకుని ప్రవర్తిస్తే హింసాత్మక ప్రవర్తన కొంతవరకు అరికట్టబడుతుంది. విషయాలు క్రియారూపంలోకి రావాలంటే మనుషులతత్త్వాలు మారాలి. ఆలోచనా విధానంలో మార్పు రావాలి. ఆధునిక పరికరాలు సవ్యమైన రీతిలో వాడుకుని అద్భుతాలు సృష్తించుకోగలగాలి.

ఆరోజుల్లో గాంధీగారు అహింస మార్గంలో దేశస్వాతంత్ర్య ఉద్యమానికి పిలుపునిచ్చినపుడు దేశమంతా ఒకటై కదలివచ్చింది. నేడు నాయకులు మానవాళిలో నిద్రిస్తున్న అహింసను మేల్కొలిపి సన్మార్గంలొ నడపడానికి పిలిస్తే ఒక్క భారతదేశమే కాదు యావత్ ప్రపంచదేశాలన్ని ఒక్కటిగా కదలివస్తాయి. అన్నది మనందరి నమ్మకం అంటాను. అపుడే
                                      ‘ధర్మసంస్థాపనార్ధాయ
                                       సంభవామియుగేయుగే
అన్న గీతోపదేశం సాధ్యం అవుతుంది అన్నది కేవలం నా మాట కాదు మనందరిమాట అంటాను. మరి మీ అభిప్రాయం అదే కదా!

నేరెళ్ళ రాజకమల

No comments:

Post a Comment