Sunday, 15 July 2018

గుణాత్మిక జనవృద్ధి (మొదటి భాగం)


భూమికి ఆధిష్టాన దేవత భూదేవి. ఎంతటి పాప భారాన్నైనా మోసే శక్తి, సహనం,ఓర్ఫు, నేర్ఫు ఆమెకి పెట్తని ఆభరణాలు. పాపాల భారము భువిపై అధికమైనప్పుడు ప్రతీ యుగాంతములోను భూమాత శ్రీ మహావిష్ణువుని సన్నిధి చేరి మొరలిడగా దుష్టశిక్షణ, శిష్టరక్షణ జరిపి ధరపై శాంతి, ధర్మం సుస్థాపితము చేయుటకు శ్రీ మహావిష్ణువు జగతిపై వివిధ అవతారములుదాల్చటం జగద్విదితము.




"ధర్మ సంస్థాపనార్ధాయ సంభవామి యుగే యుగే" అన్న భగవద్గీత శ్లోకములో వెల్లువయ్యే సారం మనం తెలుసుకొంటే భగవంతుని అవతార రహస్యం విదితమౌతుంది. పాప పుణ్యాల మధ్య విచక్షణ తేలిపోతే భూమి తిరిగి తన పూర్వ స్థితిలో నిలుస్తుంది. అంతవరకు తనముందు జరిగే అన్యాయాలను అక్రమాలను జరిగే నష్టాలను మౌన దృష్టితో భూమాత వీక్షిస్తుంది.

నరులు వశించే లోకం "నరలోకం" ఇది మనందరము వశించేలోకం. మనకు తెలిసిన ప్రపంచం. కానీ తెలియని కానరాని "స్వర్గ" "నరక" లోకాలు కూడా ఉన్నాయి. ఇవి ఎలా ఉంటాయో జీవితం అంతమయ్యే వరకు ఎవ్వరికీ తెలియదు. ప్రతీ మనిషి  తాను చేసిన కర్మ ఫలంతోనే రెండు లోకాల్లో మనుగడ సంప్రాప్తమయ్యెది. సర్వ సుఖాలు అనుభవించే లోకం "స్వర్గలోకం". ఇది దేవతలు వశించే లొకం. మనిషి తాను చేసిన  పుణ్యంతో సంప్రాప్తం అయ్యేది. అదే సమయంలో పాపాలు చేసినవారు శిక్షలు భాధలు కష్టాలు అనుభవించేలోకం "నరకలోకం" ఈపైన ఉదహరించిన లోకాలు ఎవ్వరు చెప్పలేనివి చూడనివి. కొందరు అభూత కల్పనలు అనేవి. కానీ వీటి వర్ణన అన్ని మత గ్రంధాల్లోను వివరించబడటముతో సర్వజన నమ్మకాన్ని ఆపాదించుకొన్నాయి.

"క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి"  

 స్వర్గలోకమునందు భోగములు అనుభవించి చేసిన పుణ్యము క్షీణింపగానే మరల మర్త్య లోకమును ప్రవేశింతురు. మరల మానవ జన్మ లభిస్తే ఎంతటివారు భారత దేశములో పుట్టాలని కోరుకుంటారుట. ఎందువలన అనగా తిరిగి భూలోకములోకి రాకుండా శాశ్వతముగా బ్రహ్మపధం పొందాలంటే భారత భూమి పుణ్యపదప్రాప్తికి ఒక సాధనము. ఇచట సాధువులు పరమభాగవతులు, యోగులు మరియు ఎందరో సదా శ్రీహరి నామము సంకీర్తన చేస్తూ ఉంటారు. యజ్ఞ యాగాదులు నేటికీ విశేషముగా జరుగుతున్నాయి. అందుకే భారత భూమి వేదభూమిగా పుణ్యక్షేత్రముగా కర్మభూమిగా ప్రశిద్ధిపొందినది. ఇక్కడ పుట్టిన నదులను కనులార చూసినా ఆనదులలో స్నానమాచరించినా సర్వపాప విముక్తులవుతారు. ధరిత్రిపై వీచే గాలి, పారేనీరు, చలించని హిమశిఖరాలు, పెరిగేవృక్షసంపదలు, మసలే మానవ పశుపక్ష్యాదులు "ఓంకార" నాదముతో నిరంతరము పునీతమై ప్రజ్వరిల్లుతున్నాయి. ఇతర దేశాలు భోగలాలసతో అలరారేవేళ భారతదేశం ఆధ్యాత్మిక భావాలతో తేజరిల్లడమే కాక అనంత భక్తి భావనతోనిండి దేశంలో జన్మించాలనే కోరికకు ఊపిరి పోసింది.




అన్ని జన్మలకన్న ఉత్తమమైనది మానవజన్మ. మానవుడు శక్తిపరుడు, యుక్తిపరుడు, ఆలోచనాశక్తిగలవాడు మంచి చెడులమధ్య విచక్షణ తెలిసినవాడు, మరియు సంభాషణాప్రతిభగలవాడు. ఇవి సృష్టిలోని ప్రాణులకూ లేని శక్తులు. వీనికి విలువకట్టడము ఎవ్వరికీ, ఎప్పటికీ ఎన్నటికీ సాధ్యముకాదు.

సృష్టిలోని స్త్రీ పురుషుల సంగమముతో ఉత్పత్తి అయ్యేది సంతానము. నేడు ప్రపంచ నలుమూలల విభిన్న సంప్రదాయాలు, మతపర సిద్ధాతాలు, వేషభాషలు, వ్యాప్తి చెందిఉన్నాయో అంత త్వరితంగా పరిణాత్మికదిశలో జనవృద్ధి జరుగుతోంది. సంతాన వృద్ధి అరికట్టడానికి ఎవరికి వారే అర్ధముచేసుకొని తమదైన మార్గము నిర్దేసించుకొని నడవాలి. ప్రస్తుతం 2017 ప్రకారం ప్రపంచ జనాభా 7.6 బిలియన్స్.ఇంకా కొన్ని దేశాల్లో పరిణాత్మిక జనవృద్ధి హానికరమైన దిశలో మళ్లుతున్నది. ఆధునిక వైద్య అభివృద్ధి వలన కొన్ని వ్యాధులు అరికట్టబడటము, కొన్ని విడదీయలేని మత సిద్దాంతాలు, బహుభార్యత్వం, మూఢసంప్రదాయాలు, నిరక్షరాశ్యత ఎన్నో మరెన్నో కారణాలు పరిణాత్మిక జనవృద్ధికి తోడ్పడుతున్నాయి. దోహదకారులు అవుతున్నాయి.





ప్రభుత్వాలు కొన్ని నియంత్రణలు సదవకాసాలు మాత్రమే ప్రజలకు చేయగలవు. కానీ పూర్తిగామాత్రము కాదు. కొన్నివర్గాల్లో సంతాన నిరోధకము లేకపోవడానికి కారణము వారుకన్న సంతానం తెచ్చిపెట్తే సంపాదనపై ఆశే మూలకారణం. బాల్యము నుంచే వారిని సంపాదనాపరులను చేయడం వారు సంపాదించేది ఏమార్గం?మంచిదా చెడుదా అన్న ఆలోచన లేకపోవడము శోచనీయం.

నేను పుట్టినదినా కుటుంబాభివృద్ధికి"; "నా దేశాభివృద్ధికి"; "నా ప్రపంచాభివృద్ధికి" ఎంత కష్టమైనా సుఖమైనా అనుభవిస్తాను అన్న దృఢసంకల్పం ప్రతీ మనిషిలోనూ కలిగిననాడు నీతినియమాలు ప్రతిష్టాపితమైననాడు అసమానతలు తొలగి ప్రపంచ జనాభా 'పరిణాత్మికముగా కాక "గుణాత్మిక" దశలో పెరుగుతుంది. గుణాత్మికసంతానం వలన ఎక్కువలాభాలు అన్న దృక్పధం నేటి యువతలో ప్రజ్వరిల్లాలి. ప్రగతిపధంలో మనిషి ముందువరియాలి అంటే మానవత్వం అనేది ఉధ్భవించాలి. దీనికొరకై ప్రతీ జాతి, కులము, మతము, భాష మరియు ఉన్నతమైన నమ్మకాలతో ప్రపంచ నలుమూలలా ప్రాముఖ్యత సంతరించుకొంటే జనవృద్ధి గుణాత్మికంగా విస్తరిల్లుతుంది ఈవిధంగా:-
అమెరికా- ఆర్ధిక సంపన్నతలు, ఆధునికవిజ్ఞానం.
చైనా, జపాన్:- కఠోర పరిశ్రమ, పట్టుదల
ఆఫ్రికా:-సహజవనరులు,తమదైన సంస్కృతీసంప్రదాయాలు
రష్యా:- స్నేహసౌశీల్యములు, ఆదరణ
ఇస్లామిక్ దేశాలు:-మతపరమానవత్వ సిద్ధాంతాలు,వ్యాపారకౌశల్యాలు.
ఆస్ట్రేలియా:- నవనాగరికహంగులు,ప్రాకృతికసంపదలు.
జర్మని:-సమయపాలన,క్రమబద్ధత.
సింగపూర్:-మానవనిర్మిత వాతావరణం,పరిశుభ్రత.
బ్రిటన్:-ప్రకృతిప్రేమ,మంచితనంతో కూడిన తెలివితేటలు.
ఫ్రాన్స్:- మంచిస్వభావం, మాటనేర్పు
భారతదేశం:-అఖండ ఆధ్యాత్మికసంపదలు,వృత్తినైపుణ్యతలు.
పైన ఉదహరించిన దేశాలు కొన్నీమాత్రమే. ఇంకా ఎన్నెన్నో దేశాలు విభిన్న మతాలు, భాషలు మరియు సంస్కృతీ సంప్రదాయాలతో ప్రపంచమంతా విస్తరించిఉన్నాయి. మానవ వనరుల సంపద అభ్యున్నత దిశలో ఉపయోగ పడితే ఏదేశ చరిత్రనుంచైనా "పరిణాత్మికజనవృద్ధి" అనే పదం తనంతట తనే మాయమౌతుంది. "గుణాత్మిక జనవృద్ధి" ఇలలో తప్పక సుస్థాపితము అవుతుంది అని నేనంటాను. మరి మీరేమంటారు?

నేటి కాలంలో జననష్టం విపరీతంగా పెరిగిపోతోంది. కారణాలు అనేకం. ప్రకృతి పరంగా ఎదురయ్యే విఘాతాలు, భూకంపాలు, వరదలు, అతివృష్టి, అనావృష్టి కొన్ని కారణాలు అయితే మానవ నిర్మిత ఆయుధాలు, వైద్యశక్తికి అందని వ్యాధులు, మారణ ఆయుధాలు సృష్టించే దారుణ మారణకాండలు, విషపూరిత వాయువులు, క్రోధపూరిత హత్యలు, కలుషితమైన గాలి, నీరు, ఆహారాలు మరికొన్ని కారణాలు నేటి జన జీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. శాంతి నెమ్మది కరవు చేస్తున్నాయి. మానవుడు తాను పెంచిన విజ్ఞానాన్ని చూసి ఆనందపడినా అది తాత్కాలికమే అవుతోంది. కొన్ని నష్టాలు అనివార్యమైనా మరికొన్ని నివారణ చేయడము మన  చేతుల్లోనేఉంది

అదేశాంతిమంత్రం,  "స్వచ్చతామంత్రం",  "ఓంకార" మంత్రోచ్చరణ బలముతో కొన్ని నివారింపబడతాయి. జీవితాన్ని సుఖమయం చేసుకోవడం అనేది ప్రతీ మనిషీ తన చేతుల్లోనే ఉంది అనుకోవాలి. అది ఎలా సాధ్యం అవుతుంది అన్నది సూక్ష్మరీతిలో చెప్పాలన్నదే నా అభిమతం.




అందుకు అనుగుణముగా కూర్చిన ఈపదముల అల్లిక సమస్త ప్రజావనిపై విరిజల్లులాకురిసి ఆనందతప్తహృదయులను చేస్తుంది అనడములో సందేహము ఎంతమాత్రము లేదు అని నేనంటాను. మరి మీరేమంటారు?

"ధర్మసంస్థాపనకు-శాశ్వతపుణ్యపదప్రాప్తికి
ఆలంబనయే భారతావని
ఆధ్యాత్మిక సంపదలకు-నీతినియమములకు
ఆలంబనయే వేదాంతసారం
రాజనీతిజ్ఞులకు- యుద్ధనిపుణతలకు
ఆలంబనయే మహాభారతం
సహనసౌశీల్యములకు - స్నేహసంభందములకు
ఆలంబనయే మనప్రపంచం
సమ్మిళితవిజ్ఞానగనులకు-నవనాగరికనైపుణ్యతలకు
ఆలంబనమే అవని
సృష్టికి అతి సుందర ఆలంబనయే
గుణాత్మిక జనవృద్ధి"



No comments:

Post a Comment