Monday, 30 July 2018

గుణాత్మిక జనవృద్ధి (రెండవ భాగం)



జగత్తులో కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర్యాలు అనే ఆరు మనిషిలోని అంతశ్శతృవులు. వీటిని వీడమని సుగమమైన మార్గములో నడవమని వేదాలు ఉద్భోదిస్తున్నా మనిషి తన అజ్ఞానముతో హితోపదేశాన్ని పెడచెవిని పెట్టడమే అన్ని అనర్ధాలకి మూలహేతువు. అంతశ్శత్రువులు జయింపబడితే మనిషిలొని మానవత్వం వెలుగులీనడమేకాక వారికి ఉధ్భవమయ్యే సంతానం కూడా సమాజంలొ తగిన సార్ధకతను ఆపాదించుకొంటుంది."గుణాత్మిక జన వృద్ధి" కి దోహదపడుతుంది. అనుక్షణం అల్ల కల్లోల జీవితం  గడిపే మనకెలా సాధ్యం? అని నిరాశ చెందవద్దు. మన పరిమితిలో ప్రయత్నం చేసి ఫలితాన్ని  దేవునిపై  (శ్రీకృష్ణునిపై) వదిలెయ్యమని భగవద్గీత సారాంశము.



"సర్వే జన సుఖినోభవంతు" అన్న పదాలలోని అర్ధము తెలుసుకొనిన నాడు "గుణాత్మిక జన వృద్ధి" లో దాగి ఉన్న అర్ధము, పరమార్ధం తమకు తామే విధముగా ఆపాదించ బడతాయి.

కామముఅంటే శారీరక వాంచ ఒక్కటే అంటే తప్పుడు అర్ధం వస్తుంది. బాగా ఆలోచ్స్తే అది వస్తువ్యామోహం, ధనవ్యామోహం, ఆహారవ్యామోహం, ఇహలోక వాంచలు ఎన్నో వాటిని తీర్చుకొనడానికి మనిషి పడే ఆరాటమే "కామము" కామంతోనిండిన వ్యామోహం వ్యాకులతను పెంచే తత్వం. ఉన్నదానితో తృప్తిపడటము అత్యంత ఆశలు పెంచుకోక పోవడమే  ఎనలేని  తృప్తిని ఇస్తుంది. ఇతరులపై దయ, కనికరం చూపించి సాధ్యమైన రీతిలో జీవితాన్ని సన్మార్గంలో మలచుకోవాలి.

రావణునిలోని కామగుణములు చివరి దశలో అంతమైనది శ్రీరాముని కరుణా కటాక్షములతోనే అన్నది జగద్విదితము.

"క్రోధము" అంటే ఒకవిధముగా అసహనమే. అతి మిక్కిలి కోపగుణము. ఇతరుల బాగోగులను చూసి ఓర్వలేక పోవడమే వీరి లక్షణము. ఇది మనిషిలోని మానవత్వాన్ని చంపి పశుత్వాన్నిపెంచేగుణం.

"తన కోపమె తన శతృవు తన శాంతమె తనకు రక్ష" అని సుమతీ శతకము చెబుతోంది. క్రోధము నశించాలి అంటే మనిషి మనసు నిర్మలముగా ఉండాలి. శాంతమే క్రోధాన్ని జయించే ఆయుధము.

అత్యంత క్రోధముతో రగిలే రావణుని జయించగలిగినది శ్రీరామునిలొని శాంత గుణమే అన్న ధర్మ సూత్రము ప్రజానీకానికి నిరూపితమైనది.

"లోభము" అనేది మనిషిలోని సంకుచిత్వాన్ని పెంచేతత్వం. అంతా తనకే కావాలి అనుకోవడము వీరి నైజము. వీరిలో దానగుణం కించిత్తు కూడా ఉండదు.

"లోభివానినడుగ లాభంబు లేదయా" అన్న వేమన సూక్తి వీరికి అన్వయిస్తుంది. లొభ గుణము గెలవాలి అంటే తనకున్న దానిలో దానమిచ్చి దాతగానిలిస్తే అంతులేని తృప్తి, సంతోషం ఆత్మానంద సంపదా మనదవుతుంది. ఇతరుల సంతోషాన్ని తన సంతోషంగా భావించే గుణంలో అంతులేని తృప్తి ఉంది.లోభాన్ని ఎదిరించే ఆయుధం "దానం"

మొదటిసారిగా యుద్ధభూమిలో ఆయుధహీనుడైన రావణునికి ప్రాణభిక్ష ప్రసాదించినది శ్రీరామునిలోని ఔదార్యము మరియు దానగుణములే కదా!

మోహము సర్వమూ తనదే అన్న భ్రమ, భ్రాంతి కలిగించే గుణము. ఇహలోక బంధాలపై ఆశలు పెంచేతత్వం. అనంతమైన కోరికలతో ఒక కోరిక తీరిన వెంటనే వేరొక కోరిక పెంచుకొని అంతులేని కోరికల దాహంతో మోహ పాశాల్లో చిక్కుకొని మనిషి వెంపరలాడే పరిస్థితి. మోహ పాశంలో మనిషి చేసే ప్రయత్నాలు, పనులు, పడేతపన, యాతన అంతమవ్వాలంటే నీతి" అనేదే సరైన ఆయుధము.

రావణునిలోని మోహగుణాలు శ్రీరాముడు తన "నీతి" అనే ఆయుధముతో గెలవడము సర్వలోక హర్షనీయమైనది.
మదము అనేది అహంకారానికి ప్రతిరూపము. ఇది మనిషి వినాశనానికి దారి తీసే భయంకర గుణము. లోకంలో లభ్యమయ్యే ప్రతీ సుఖము విలాసవస్తువులు సమకూర్చుకొన్న మనిషి తనలో మదాన్ని పెంచుకోవడమే ఒక బలహీనత. అవి శారీరక, స్థాన, జన, ధన, మరియు ఐశ్వర్యాదిభోగ బలాల్లో ఏవైనా కావచ్చు. అంతులేని మదంతో గర్వించి ఉండే తత్వం మనిషి స్వంతము ఇది అణచబడాలి అంటే నిశ్చలమైన నిర్వికారమైన "వినయం" సరైన ఆయుధము.

రావణునిలోనిమదాన్ని శ్రీరాముడు తనలో ప్రజ్వరిల్లే "వినయం" అనే ఆయుధంతో గెలవడము అత్యంత విశేషనీయంగా రామాయణంలో రూపు దిద్దుకొంది.

మత్సరములో ఈర్ష్వ, అసూయ, శతృత్వం, పగప్రతీకారం దాగిఉన్న దుర్గుణాలు. వీరిలో తృప్తి అనేది శూన్యం. సతతము తమ మనస్సును దుర్మార్గపు ఆలోచనలతో నింపుకొని పలు విధాల కృత్రిమ జీవనం సాగిస్తారు. సఫలులైతే గర్వంతో దారి తప్పుతారు. అసఫలులైతే నిరాశా నిస్పృహలతో కృంగిపోతారు. వీరు సంతోష పడలేరు ఇతరుల సంతోషమును చూసి ఓర్వలేరు. అసంతృప్తితో సదా అలమటించే తత్వం మత్సరము.

ఈర్ష్వ- అనురాగంతో
అసూయ-అనునయంతో
శతృత్వం-మితృత్వంతో
పగ-ప్రేమతో గెలవాలి.
మనిషిలోని మత్సరాన్ని ఎదిరించే ఆయుధం "కర్తవ్యపాలన"

రావణునిలోని మత్సరాన్ని శ్రీరాముడు "కర్తవ్యపాలన" అనే ఆయుధంతో సమాప్తి చేసి ఇలపై ధర్మాన్ని ప్రతిష్టించడము  ఆదర్శమేమరి.




కామము-దయ
క్రోధం-శాంతం
లోభం-దానం
మోహం-నీతి
మదం-వినయం
మత్సరం-కర్తవ్యపాలన

ఈపైన ఉదహరించిన విధముగా ప్రతీ మనిషి తనని తాను మలచుకొంటే ప్రభావం తప్పనిసరిగా మన సంతానం మీదకూడా ప్రభవిస్తుంది. "గుణాత్మిక జనవృద్దికి" బాటలు వేస్తుంది. మహాత్ములకే సాధ్యం కానివి మనలాంటి సామాన్యులకు సాధ్య పడతాయా అన్న శంక విడనాడితే నిస్సందేహంగా మన సంతానానికి ఉజ్వల భవిష్యత్తు ఉన్నది.
"ప్రపంచ దేశాలు భారత దేశంవైపు దృష్టి నిలిపేది మనదగ్గర లభ్యమయ్యే ఆధ్యాత్మిక సంపద మరియు దాని ద్వారా లభించే శాంతికొరకే" అని డాక్టర్. పౌల్ అనే విదేశీయ తత్వ వేత్త విశదీకరించడమైనది. అభిమాన అనురాగాలు చాలు ప్రపంచమంతా గుణాత్మిక జనవృద్ధికి బాటలు వేయడానికి. మనిషిలో ప్రజ్వరిల్లే నిర్మలమైన ఆలోచనలతో కూడిన నడవడికే ప్రపంచ నలుమూలల ఉధ్భవ మయ్యే సత్సంతానానికి ఆరంభం అవుతుంది అని నేనంటాను మరి మీరేమి అంటారు?

మనిషి తనలో దాగిఉన్న అంతశ్శత్రువులను నిర్మూలనము చేసుకొని సుగమమైన మార్గములో నడచి సమాజములో శాంతిభద్రతలను నెలకొలుపమనే సందేశములతో వ్రాసిన పదముల అల్లికలే భావి జనతకు రక్షణ కవచములుగా మారిన నాడు

"శారీరక మానసిక నిర్మలత్వములే జగతిని ఏలే అస్తిత్వములు

వినయ వినమ్రతలు దయాదాక్షిణ్యములే
దిగ్విజయానికి సంకేతములు

శాంతి నెమ్మది సత్య అహింసలే
సంతృప్తిని పెంచే తత్వములు

దాన ధర్మములు నీతి నిజాయితీలే
మన వెంట నడిచే సంపదలు
గుణాత్మిక జన వృద్ధికి సోపానములు"

4 comments:

  1. అక్కా మనిషి నిత్యం అంతర్యుద్ధం చేసేది ఈ ఆరు గుణాలతో నేను. మరి వాటిని జయించడానికి ఎటువంటి ఆయుధాలు మన దగ్గర ఉండాలి అని చక్కగా పోల్చి చూపుతూ చెప్పడం చాలా బాగుంది అభినందనలు అందుకోండి శ్రీలక్ష్మి విజయనగరం

    ReplyDelete
  2. Thank you very much for the encouraging comment

    ReplyDelete
  3. An excellent way of presentation Amma. Thank you. Sarma Rachakonda.

    ReplyDelete