Thursday, 16 August 2018

సాగరతీరముల వైశిష్టత (మొదటిభాగము)


మనదైనందన జీవనములో ప్రకృతి ప్రసాదించిన సంపదలు పర్వతములు, సాగరములు, అటవీసంపదలు ప్రముఖ పాత్రవహిస్తాయి అన్నది జగద్విదితము. భువిపై ప్రాణికోటికి ఆధారము నీరు. భూభాగాన్ని మూడొంతులు పైగా ఆక్రమించుకొన్న నీరు ప్రకృతివరమే. సూర్యుని వేడిమికి సముద్రజలము ఆవిరిరూపములో నింగికి ఎగసి మేఘాల రూపుసంతరించుకొని గాలిలో తేలియాడుతూ చల్లబడి ధరణిపై వర్షరూపములో తీయనిధారలుగామారి కురుస్తుంది. ఈజలము నదులలో,బావుల్లో,చెరువుల్లో,ఏరుల్లో, సెల ఏరుల్లో నిండితే త్రాగునీరుగామారి కోట్లాదిప్రజల దాహార్తితీరుస్తుంది.వ్యవసాయ పంటలకు ఉపయుక్తము. అదేవర్షము సముద్రములో కురిస్తే నీరు తన రుచిని, పొగొట్టుకొని  ఉప్పునీరుగా మారిపోతుంది.

ప్రకృతి ప్రసాదించిన అమూల్యసంపదలు సాగరమ్ములే. పురాణోక్తి ప్రకారం ఇవిఏర్పడటానికి అతిచిన్న ఉదాహరణ. పూర్వం రఘువంశజుడైకీర్తికెక్కిన సగర చక్రవర్తి అయోధ్యా నగరాన్ని పరిపాలించే కాలములో ఆతని మొదటి భార్య శైభ్యకి అసమంజుడు అనే పుత్రుడు కలుగగా చిన్నభార్య వైధర్భి ఒక మాంసపు ముద్దను కంటుంది. జరిగిన ఉపద్రవమునకు మిక్కిలి విచారించి ఆమె ఈశ్వరుని ప్రార్ధించగా శివుడు బ్రాహ్మణ వేషముతో వచ్చి పిండమును అరవైవేల ముక్కలు చేసి ప్రాణ ప్రతిష్టజరిపి అదృశ్యమాయెను. ఈశ్వరానుగ్రహముతో వారు ఊపిరి పోసుకొని అరవైవేల మంది పుత్రులుగా పెరిగి పెద్దవారై నవయవ్వనవంతులై, అతిబలవంతులుగా, వీరులుగా సగర పుత్రులుగా ప్రశిద్ధి చెందిరి. కొంతకాలమునకు సగర చక్రవర్తి అశ్వమేధయాగము చేయ సంకల్పించి తన యజ్ఞాశ్వానికి రక్షకులుగా తన అరవైవేలమంది పుత్రులును పంపెను.వారు పాతాళలోకములో దాగివున్న అశ్వ జాడను కనిపెట్టడానికి భూమిని త్రవ్వగా అగడ్తలు ఏర్పడి అవే సాగరములుగా మారినవి. సగర పుత్రుల ద్వారా ఏర్పడినవి కనుక అవి "సాగరములు" అను పేరుతో నేటికి విరాజిల్లుతున్నవి.



తూరుపు పడమర కనుమలలో త్రికోణాకృతిలో అగ్నిపర్వతముల విస్ఫోటములతో ఏర్పడిన సారవంతమైన పీఠభూమి దక్షిణ భారత భూభాగం. మూడువైపుల ప్రవహించే సముద్రజలములతో భారతమాత పదద్వయము అనుక్షణము అభిషేకింపబడుట అద్భుత సౌందర్య వీక్షణమే. పడమటి కనుమలలో పుట్టిన  నదులు ఎన్నో ఉపనదులతో బంగాళాఖాతములో కలవడము ఒక నిబద్ధత అయితే ఈనదులు ధరావతు చేసిన ఒండ్రు మట్టితో సంవత్సరకాలమంతా వివిధ పంటలు విరివిగా పండేప్రదేశము. ఎటుచూసినా ఆకుపచ్చని పొలాలతో మరియు రతనాలసీమగా విలసిల్లే దక్కనుప్రాంతము భారతమాత కంఠాలంకృతముగా అలంకరింపబడిన పచ్చలహారమని ఒక కవి "దక్కనువజ్రాల పచ్చలహారం" అని అభివర్ణించెనుత్రికోణాకృతిలో వెలసిన ఈపీఠభూమి ప్రాంతములు సుస్థిరత్వముతో, సుఫలత్వముతో నెలకొన్న కొన్ని రాష్ట్రముల ప్రత్యేకతలు మరియు సాగరతీరములను అనుసరించి ఉన్న కొన్ని ముఖ్య నౌకాకేంద్రముల విశిష్టతను సులభ శైలిలో ఈవిధముగా అభివర్ణించడమైనది.

పశ్చిమబెంగాల్:- పురాతన మరియు నూతన కట్టడములతో విలసిల్లే సంస్కృతి. కటిక పేదవాడు మొదలుకొని అత్యంత ధనవంతుల వరకు నిర్భయముగా కూడు, బట్టకు లోటులేక బ్రతకగలిగే భూమి. ఇక్కడ వారి ఆరాధ్యదేవత "కాళికాదేవి" శక్తికి ప్రతిరూపం. తనమహిమలతో ఆశీర్వచనములనిచ్చి కాపాడుతుంది అనే వీరి నమ్మకములకు ఊపిరిపోస్తుంది. 16 శతాభ్దములో కలకత్తా నగరం అతి చిన్న చిన్న గ్రామములుగా విభజింపబడి ఉండెను. వ్యాపారముకొరకై వచ్చిన యూరొపియనులు వారి అనుకూలత కొరకు ఇచట దుర్భేధ్యమైన కోటలు నిర్మించి, అనేక సదుపాయములను కల్పించి, రోడ్, రైల్వే, నీటి రవాణాను పెంపొందింప చేసి కలకత్తా మరియు సాగర తీర పల్లెలను వ్యాపార నగరములుగా తీరిచి దిద్దారు. హిమాలయములలో పుట్టిన గంగానది సాగరములో చేరి "గంగాసాగరముగా" విశ్వ విఖ్యాతి చెందినది. సుప్రశిద్ధ "బంగాళాఖాత సముద్రము" రాష్ట్ర నామముతో విరాజిల్లడము వీరికి అత్యంత గౌరవప్రదము.



మొదటిసారిగా ఆంగ్లేయులు 1905 సంవత్సరములో అతిపెద్ద రాష్ట్రమైన బెంగాల్ మతపర రూపముగా విభజించిరి. విశ్వకవిగా అభివర్ణించబడే రవీంద్రనాద్ ఠాగూర్ 22-12-1901 "శాంతినికేతన్" సుస్థాపితము చేసి ప్రకృతికి సమీపములో యోగవిద్య, ఆరోగ్య, ఆధ్యాత్మిక మరియు ప్రార్ధనల ద్వారా విశ్వజనతకు శాంతి, నెమ్మదులను పొందే మార్గములను సూచించెను. ఇంతేకాక రవీంద్రనాథ్ ఠాగోర్ మన జాతీయగీతమైన "జన గణ మన" రచన చేసి  భారతదేశ గౌరవ ప్రతిష్టలను అత్యంత ఉన్నత స్థితిలో నిలిపెను. స్థానికులు చవ్, గంభీర, కీర్తన, కుషన్, అల్కప్ అను ఐదు ముఖ్య జనపద నృత్యములతో శుభకార్యములను కీర్తివంతము చేస్తారు. తమదైన బెంగాలి భాషపై అత్యంతాభిమానము కలిగిఉండటమేకాక సంస్కృతీ సంప్రదాయముల పట్ల నిష్టాగరిష్టులు. తమదైన విజ్ఞత, తెలివితేటలు మరియు చురుకుదనముల పైన అత్యంత నమ్మకముతొ  వ్యవహరిస్తారు.

ఓరిస్సా:- సామాన్య జీవనము నడిపే ప్రజలకు ఆలవాలము ఈశాంతిభూమి. సమస్త భారతావనిని జయించిన అశోకచక్రవర్తి ఆఖరి కళింగ యుద్ధానంతరము మరి యుద్ధముచేయబొనని నిశ్చయించుకొని బౌద్ధమతము స్వీకరించిన తదనంతరము నిర్మించిన ఉదయగిరి, స్కందగిరి స్తూపములు శాంతి అహింసలకు ధీటుగా నేటికి నిలిచి ఉన్నవి. భారత దేశములో అతి పెద్దదైన స్వచ్చనీటి సరస్సు "చిలకా లేక్" అను పేర దేశ విదేశ పక్షులకు నెలవుగా నిలిచినది. ప్రశిద్ధి చెందిన "కోణార్క్ సూర్యమందిరం" అద్భుత శిల్పకళతో ఇసుకరాయితో నిర్మించడము ఒక విశేషమైతే ప్రపంచములోనే అతి పెద్దవంటశాల పూరీ జగన్నాధుని మందిరములో ఉన్నది. ఒడిస్సీ నృత్యం, ఒరియాభాష  వారి సంప్రదాయములను  చాటి చెప్పే ప్రత్యేకతలు. స్థానిక ప్రజలు కష్టజీవులు మరియు అత్యంత విశ్వాసపాత్రులు.





ఆంధ్రప్రదేశ్:- ప్రపంచములోనే అత్యంత ధనవంతులుగా పరిగణింపబడే దేవీ దేవతా మూర్తులు వెలకట్టలేని ఆభరణములతో నిత్యమూ అలంకరింపబడి పూజలందుకొనే ఆంధ్రదేశ్ వైభవము చరిత్రలో సువర్ణాక్షరములతో లిఖింపబడుతుంది అనడములో సందేహములేదు. దేశానికి "అన్నపూర్ణ" గా అభివర్ణింపబడటము ఒక విశేషమైతే "అతిధిదేవోభవ" అని ఆదరించే వీరి ఔదార్యము ఎప్పటికీ ఈజగతిలో నిలిచి ఉంటుంది. ఆంధ్రులు  అత్యంత స్వాభిమానధనులు. పౌరుషానికి ప్రతీకలు.



అనంతమైన ప్రకృతి సంపదలు వీరి స్వంతం. విశాఖనగరము సాగరతీరమున చుట్టూకొండల సరిహద్దులతో సహజముగా ఏర్పడిన నౌకా కేంద్రం భారతదేశములోనే రెండవపెద్ద నౌకాకేంద్రముగా వినుతికెక్కినది. 1933 సంవత్సరములో బ్రిటిష్ వారుఏర్పరచిన నౌకా కేంద్రము ఒక పెద్ద ఆకర్షణీయమైన కన్వీయరుబెల్ట్ ద్వారా అతిభారమైన ఖనిజముల రవాణా షిప్స్ లోనికి ఎగుమతి దిగుమతుల ప్రక్రియలు దేశానికే అత్యంత లాభదాయకము మరియు గౌరవప్రదము. ఆంధ్రదేశము చేనేత, కుటీర పరిశ్రమలకు విఖ్యాతిచెందినది. "దేశభాషలందు తెలుగు లెస్స" అనిపించుకొన్న తెలుగుభాష వీరిదైతే "ఇటాలియన్ ఆఫ్ ఈస్ట్" అని విదేశీయులు పొగిడిన భాష. అన్నిపదములు ఓవల్స్ శభ్దముతో పరిసమాప్తికావడము ఈభాష ప్రత్యేకత. అజంత, ఎల్లోర అద్భుత శిల్పకళలకు కాణాచి. "కూచిపూడి" నృత్యరీతి ప్రపంచ వ్యాప్తిచెందిన  శాస్త్రీయ నృత్యము సంపగిపూల సౌరభములతో అలరారే ఆంధ్రదేశ స్వాగతరీతులు ప్రతీవారినీ ఆకట్టుకొనడమే విశేషము.

కర్ణాటక:- కన్నడ భాషలో "కరి" అనగా "నలుపు" "నాడు" అనగా "దేశము" "కరియనాడు" "కరునాడు" అనుపదముల చేరికతో కాలక్రమేణా "కర్ణాటక" అను నామము వ్యాప్తీకరించబడినది. నల్లరేగడి భూములు అత్యధికముగా కలిగి ఉన్న ప్రదేశముగా నెలకొనిన విభాగము. సహ్యాద్రి శిఖరమ్ములను ఆనుకొని కొంకణీ తీరములలో వెలసిన కర్ణాటక రాష్ట్రములో మన్ను బంగారుమయము. కొడగుకొండలలో పుట్టిన పవిత్ర కావేరీనది అగస్త్యమహర్షి దీవనలతో తాను ప్రవహించే తీరములన్నీ సస్యశ్యామలము అవుతాయి అను వరముపొంది  తీరములకు హరిత వర్ణ శోభను తెచ్చి చెరకు, పత్తి, మల్బర్రి, టేకు, సుగంధ ద్రవ్యములు, కాఫీతోటలు మరియు అనేక ఫలభరిత వృక్షములతో పర్యాటకులను స్వాగతించే తీరు కన్నడ  సంస్కృతికే తలమానిక. విశిష్ట శిల్పకళలతో (విజయనగర, హోయసల) అలంకృతమైన బేలూరు, హళేబీడు, హంపి, బాదామి, పట్టడకల్ నాటి వైభవమ్మును తలపింపచేస్తాయి.



కన్నడభాష సౌందర్యం, చందనతోటల సౌగంధ పరిమళములతో అలరారే కన్నడదేశ అందచందాలు ఎన్నటికీ మరపురావు. వీరి సంగీతము "కర్ణాటకసంగీతము" గా విఖ్యాతి చెందినది. స్థానికప్రజలు అలంకారప్రియులు, సాత్మిక స్వభావులు, స్నేహశీలురు. ఏకులమైన, ఏమతమైన, ఏభాష అయిన, ఏజాతి అయిన ప్రజలు శాంతినెమ్మదిలతో జీవనంగడపగలిగే అత్యంత సుఖప్రదమైన చల్లని మనోహర మల్లెల సౌరభములతో అలరారే ప్రశాంత బూమి. జనపద నృత్య శైలి మరియు "యక్షగాన" నృత్యములలో సుప్రసిద్దులు.

మంగుళూరు భారతదేశములో ఏడవ అతిపెద్ద సహజనౌకా కేంద్రముగా అరేబియాసముద్ర తీరమున విరాజిల్లుతున్నది. క్రీ.పూ. ఒకటవ శతాభ్ధము నుండి నేటివరకు అనేక మంది పాలకులు వ్యాపారాభివృద్ధి కొరకై తీరప్రాంతములో నీటిరవాణా సౌకర్యములను కల్పించి ఎంతో ఉపయుక్తము చేసికొనిరి అనునది చారిత్రిక ఆధారములతో నిరూపితమైనది. క్రీ. . 11 శతాభ్ధములో "హళేబీడు" "ద్వారసముద్రము" అను పేర సముద్ర మార్గమునకు ద్వారముగా నిలచి విఖ్యాతి చెందినది.

తమిళనాడు:- భారతదేశములో దేవాలయములు అదికముగా ఆధ్యాత్మిక శక్తిసంపన్నలతో భక్తి ప్రపుల్లతలతో అలరారే ప్రాంతము కావున "లాండ్ ఆఫ్ టెంపల్స్" అను పేరుతో బిరుదాంకితమై ప్రపంచములోనే విశిష్ట విఖ్యాతి పొందిన భూమి. రామేశ్వరములో వెలసిన  రామలింగేశ్వర లింగం త్రేతా యుగములో శ్రీరామునిచే ప్రతిష్టింప బడినది. వానర సేనతో నిర్మించిన వారధి నేటికి తగిన ఆధారములతో ఉన్నది. భారత దేశములో మూడవ అతి పెద్ద నౌకాకేంద్రము చెన్నై (మద్రాస్) గా అభివర్ణించడము అయినది. బంగాళాఖాత సాగరతీరములో తూరుపు కోరమండల్ కోస్ట్ వద్ద నిర్మితమై ఉన్నది. క్రీ.పూ ఒకటవ శతాభ్ధము నుండి అనేక దక్షిణ దేశ పరిపాలకులు కేంద్రమును దేశ విదేశ వ్యాపారరీత్యా అతున్నత రీతిలో అభివృద్ధిపరచిరి. 1639 సంవత్సరములో ఆంగ్లేయుల పరిపాలనా కాలములో  నౌకాకేంద్రము విశ్వ విఖ్యాతిగాంచినది. కాలక్రమేణ ఇచ్చోట వెలసిన శ్రీ చెన్నకేశవపెరుమాళ్  పేరుతో తమిళభాషలో "చెన్న" అనగా "తీర్చి దిద్దిన ముఖము" అను అర్ధము వస్తుంది. అందువలన "చెన్నై" అనుపేర రాష్ట్రము నామాంకితమైనది. చారిత్రాత్మిక మైన కంచి, మధుర, కుంభకోణం, చిదంబరం, తంజావూరు, ఎన్నో ఎన్నెన్నో లెక్కకుమించిన దేవాలయములు అతి శుభ్రతతో ఎటువంటి విధ్వంశములకు లోనుకాక నేటికి నిలచి చారిత్రాత్మిక శిల్పకళా వైభవమ్ములను ముందుతరాలకి అందించినారు.


సాక్షాత్ పరమేశ్వరి శక్తిరూపముతో కన్యకాపరమేశ్వరి రూపముతో మువ్వన్నెల మూడు సాగరమ్ముల సంగమతీరములో భారతదేశ చిట్టచివరి భాగమున వెలసినది. ఈతీరములో సూర్యోదయ, సూర్యాస్తమయ సౌందర్య వీక్షణములు వర్ణించుట మాటలకు అలవికానిది. "భరత నాట్యమే" భరతదేశ నాట్యముగా సంప్రదాయ కరమైన వస్త్రధారణతో విశ్వవిఖ్యాతి చెంది మనదేశ ప్రతిభకు గర్వ కారణముగా నిలిచి ఉన్నది. తమిళ సంస్కృతీ సంప్రదాయములను ప్రపంచ వ్యాప్తముగా విస్తరింపచేయడమే కాక తమదైన తమిళ భాషపై అచంచలమైన అభిమానము కలవారు. రుచికరమైన వంటలతో సంగీత నృత్యవిన్యాసములతో ఆరితేరినవారు. సుసంపన్నులు. వ్యాపార నైపుణ్యతలతో ప్రపంచమునే గెలవగల సమర్ధులు.



దక్కను తీర ప్రాంతములను అభివర్ణిస్తూ అల్లిన సుగంధ పరిమళ సుమమాల భారత మాత సిగలో ఎప్పటికీ అలంకృతమే అవుతుంది.

"తూరుపు పడమర కనుమల నడుమ
త్రికోణాకృతిలో వెలసిన భూమే
దక్కను సువర్ణ పీఠభూమిగా
వింధ్య,ఆరావళీ,సహ్యాద్రి నీలాద్రుల
ఉత్తంగ శిఖరమ్ములే ఠీవితో నిలచి
అత్యున్నత వైభవ కీర్తికి చిహ్నములుకాగా
అద్భుత శిల్పచిత్రకళా జగమే
ఆధ్యాత్మిక విజ్ఞాన సంపదలకు
నృత్య సంగీత సాహిత్యమ్ములకు
కాణాచికాగా
"భాషలు ఎన్నైనా భావాలు ఒకేతీరున
భిన్నత్వములోనే సమానత్వము నింపే
జలజల పారే జలపాతమ్ములు
తళతళ మెరిసే సంప్రదాయములు
ధీటుగ నిలచి వన్నెకెక్కగా
సుగంధ పూల పరిమళమ్ములు
సుగంధ ద్రవ్య సువాసనలు
సుగంధ భరిత పచనములెన్నో
నాటికి నేటికి స్వాగతించగా
భారత సుసంపన్నతల కీర్తి పతాకం
ఎగురును గగనాన ఎదురేలేకుండా."



6 comments:

  1. Nice narration of geographic and historic facts and facets of South India. కర్ణ అనగా చెవి, ఆటకము అనగా బంగారము......వీరి భాష చెవి ఆభరణము అని కూడా చెప్పుకోవచ్చు. బాగుంది. కొనసాగించండి.

    ReplyDelete
    Replies
    1. Thank you very much sir for the comment and encouragement

      Delete
  2. Very nice and descriptive.vry informative pinni.

    ReplyDelete
  3. అక్కా
    చాలా మంచి విషయం ఎంపిక చేసుకుని సందర్భానికి తగిన ఫోటోలు పెట్టడం వ్యాసం చదువుతున్నట్లు కాక ఎదురుగా నీవు చెపుతున్నట్లు ఉంది.సులువైన పదాలతో చెప్పడం చాలా బాగుంది అభినందనలు శ్రీలక్ష్మి చివుకుల
    విజయనగరం

    ReplyDelete
  4. Thank you very much for the positive comment

    ReplyDelete