మన పురాణోక్తుల ప్రకారము సప్త ఊర్ధ్వ లోకములు భూమికి పైన నిబిడీకృతమై ఉన్నవి. అదే రీతిలో భూమికి దిగువున సప్త అధోలోకములు నెలకొని ఉన్నవి.
భూర్లోకము
గగనములో మేఘములు ఉత్పన్నమయ్యే ప్రదేశము నుండి నూరు యోజనముల దిగువున "భూర్లోకము” వెలసియున్నది. రోదసిలో ప్రయాణించేవారికి గుండ్రముగా నీలిరంగుతో తేలియాడుతూ వీక్షింపబడు గ్రహమే భూర్లోకము. ఈ లోకము సర్వ ప్రాణికోటికి వాస యోగ్యముగా అధ్భుత భూమ్యాకర్షణ శక్తితో అలరారుతున్నది. అనేక నదులు, సముద్రములు, పర్వతములుతో అత్యంత అయస్కాంత బలముతో తనవైపు ఆకర్షించుకొని నిలుపగలిగే అతి శక్తివంతమైన లోకము. జీవులకు అవసరమైన పుష్కలమైన ప్రాణవాయువుతో నిండి ఉన్న ప్రదేశము.
భువర్లోకము
భూమికి అతి సమీపములో ఉన్నది. "సిద్ధచారిణులు" తిరుగాడే స్థలము. పురాణోక్తుల ప్రకారం వీరు సమాచారములను యోగబలముతో సేకరించి తమ వీక్షణ శక్తులతో గ్రహించి భూమిపైన వశించువారలకు తెలుపగల సమర్ధులు. రామాయణములో లంకా దహనము తరువాత సీతకు ముప్పు వాటిల్లినది ఏమోనని వ్యాకులపడు హనుమకు సీత క్షేమమును శుభవార్తను అందించిన వారు సిద్ధచారిణులే. ఎయిర్ క్రాఫ్ట్స్, విమానములు, కొన్ని పక్షులు ఎగురు లోకము. వాతావరణ వివరములు భూలోక వాసులకు అందించే ప్రదేశము. మానవ విజ్ఞతతో ఇచట ఎన్నో సాట్లైట్ స్టేషన్స్ ఏర్పాటు చేయబడినవి. రేడియో, టెలివిజన్, ఇంటర్నెట్ సంభందిత పరికరముల వాడిక నేడు సర్వ సామాన్యమైనది. గాలిలోతేలియాడే తరంగములను ఆకట్టుకొని అత్యంత ఉపయుక్తకరముగా మార్చి భువిపై చేరవేసే మానవ సాంకేతిక విజ్ఞత అబినందనీయమే.
సువర్లోకము
మేరు పర్వతానికి తూరుపు దిక్కున వెలసిన దేవేంద్రుని నివాస స్థలము, సకల దేవతలకు నిలయము అత్యంత ఆనందానికీ, భోగలాలసతలకు మారురూపుగా వర్ణించబడు "స్వర్గ లోకము" ఇలపై ప్రాణికోటి తాముచేసిన పాప, పుణ్య విచక్షణలు జరిగిన తదనంతరము ఈ లోకములో వాసము చేయుటకు అర్హులుగా పరిగణింపబడుదురు. మానవ శరీరము వదలి దైవ శరీర రూపముతో చేరుకొనే లోకము కావున ఈ లోక ప్రాప్తికి ధర్మవర్తన, దయ, క్షమ, దాన, శాంతం. ఆదిగాగల సద్గుణములతో జీవనము గడిపినవారికి ఈ లోక వాసము సంప్రాప్తమగును. నక్షత్ర మండలానికి, సూర్యకుటుంబానికి (సోలార్ సిస్టం) అనువైన లోకముగా భాసిల్లుతున్నది. ప్రతీ యుగములోను ఎందరో మహానుభావులు, మహర్షులు, తమ అతులిత భక్తి తత్పరతతో, స్వర్గారోహణము చేసిన ఉదంతములు మన భారత ఇతిహసిక చరిత్రలో నిరూపితమై ఉన్నవి.
మహర్లోకము
పురాణోక్తుల ప్రకారము "సప్త ఋషి మండలము" (ప్లేస్ ఆఫ్ సైంటీ సోల్స్) గా నిరూపితమైనది. శని గ్రహమునకు (శాటర్న్) 13 లక్షల యోజనముల దూరములో నెలకొని ఉన్నది. ఇచట వశించు సప్తఋషులు సదా లోక క్షేమమును కోరే ధర్మాత్ములు. భూ లోకములో జరిగే విశేషములను ఆశక్తితో వీక్షిస్తారు. అశ్విని ఆదిగా గల 27 నక్షత్రములు వారి అధిష్టాన దేవతలతో కరుణా కటాక్షములతో అందించే దీవనలు వెలలేనివి. ఏ పనికైనా ముందుగా ప్రతీఒక్కరు వారి నక్షత్ర అధి దేవతను స్మరించితే తలచినపనులు దిగ్విజయముగా సంపూర్ణ మవుతాయి అన్నది వేదవ్యాస విరచితమైన "భవిష్య పురాణ" ఉవాచ. కల్పాంతమువరకు సప్త ఋషులు, మునులు తపమొనరించే లోకము. తమ అభయ వరదానములను మానవ సంతతికి అందచేయుటకు సదా తన్నీలమౌతారు.
నక్షత్రము - అధిష్టాన దేవత - వరములు
అశ్వని – అశ్వనీకుమారులు - దీర్ఘాయువు, ఆరోగ్యము
భరణి – యమధర్మరాజు - అపమృత్యు బాధ ఉండదు
కృత్తిక – అగ్ని - కోరికలు తీరుతాయి
రోహిణి – బ్రహ్మ - కోరిన వరాలు
మృగశిర – చంద్రుడు - జ్ఞానము, ఆరోగ్యము
ఆరుద్ర- శివుడు - శుభములు
పునర్వసు – అదితి - కన్న తల్లిలా కాపాడు తుంది
పుష్యమి – బృహస్పతి – సద్భుద్ధి
ఆశ్లేష – నాగులు - నాగభయము ఉండదు
మఖ – పితృదేవతలు - ధన, ధాన్య, పుత్రులు
పుబ్బ – పుష - విజయం, రూపం, ద్రవ్యం
ఉ.ఫల్గుణి – భగ - విజయం, రూపం, ద్రవ్యం
హస్త – సూర్యుడు - సంపదలు
చిత్త – త్వష్ట - శత్రు విజయం
స్వాతి – వాయువు – పరమశక్తి
విశాఖ – ఇంద్రుడు - ధన, ధాన్య, తేజస్సు
అనూరాధ – సూర్యుడు - లక్ష్మీప్రాప్తి, చిరాయువు
జేష్ట – ఇంద్రుడు - గుణ, ధన, కర్మ
మూల – అందరిదేవతలు - అన్నిఫలాలు
పూర్వాషాడ – వరుణుడు - శారీరిక మనసిక సంతా పములు ఉండవు
ఉత్తరాషాఢ – విశ్వేశ్వరుడు - కోరినకోరికలు తీరుతాయి
శ్రవణం – విష్ణువు - లక్ష్మీవరం, విజయం
ధనిష్ట - వసువు - భయము పోతుంది
శతభిషం – ఇంద్రుడు - ఆరోగ్య, ఐశ్వర్యములు
ఫూర్వాభాద్ర – సూర్యుడు - భక్తి, విజయప్రాప్తి
ఉత్తరాభాద్ర – అగ్ని – శాంతి
రేవతి – సూర్యుడు - సర్వశుభాలు, చెదరని ధైర్యం, విజయం
జనలోకము
సృష్టి కర్త అయిన బ్రహ్మ సృష్టి కార్యమును గురించి తనలో తాను ఎంత ఆలోచించినా మానవసృష్టి చేయలేక పర దేవతను ఆరాధించి, మెప్పించి, ఆమె అనుగ్రహ బలముతో, మానస శక్తి ప్రభావము, వలన ఏడుగురు పుత్రులు జన్మించిరి. వీరు బ్రహ్మ మనఃశక్తి నుండి అవతరించడము వలన "బ్రహ్మ మానస పుత్రులు" గా విఖ్యాతిచెందిరి. కాలక్రమీణా వీరు మరీచి, అంగీరశుడు, అత్రి, వశిష్టుడు, పులహుడు, క్రతువు, పులస్త్యుడు అనుపేర ప్రశిద్ధి చెందిరి. వీరు వశించు లోకమే "జనలోకము" తదనంతరము లెఖ్ఖకు మించిన మానవ సృష్టి ఇలపై జరిగినది. నిర్మల మనస్తత్వము గలవారు, యోగులు, మునులు, సాత్మికులకు మాత్రమే ఈ లోకమున వసించు భాగ్యము లభిస్తుంది. గగనతలమున వెలుగులీనే గలాక్సీలు (అంతరిక్షములో వెలుగుతున్న లక్షల కోట్లాది నక్షత్రములు, వాయువు మరియు ధూళులతో కూడి ఆకర్షణ శక్తివలన ఏర్పడిన క్రమమే "గెలాక్సి" అను పేరుతో రూపు దిద్దుకొన్నది), మిల్కి వేలు (అంతరిక్షమున లక్షల కోట్లాది గెలాక్సీలు రూపు దిద్దుకొనగా ఏర్పడిన అధ్భుత వీక్షణమే "మిల్కీవే" గా అభివర్ణించడమైనది) ఆవిర్భవించిన అద్భుత లోకము.
తపోలోకము
తపోసిద్దులకు నెలవైన లోకము కావున "తపో లోకము" అను పేర విఖ్యాతి చెందినది. ఇచట వశించువారు నిప్పుతో కాలరు. అత్యంత ప్రభావితమైన తపఃశక్తి సంపన్నులు. గగనాంతరమున సదా వెలుగులీనే గ్రూప్ ఆఫ్ గలాక్సీలు, క్లస్టర్ ఆఫ్ గెలాక్సీలకు నెలవైన లోకము.
సత్యలోకము
సృష్టి కర్త అయిన బ్రహ్మదేవుని స్థానముగా అభివర్ణించ బడిన లోకమే "సత్యలోకము". బ్రహ్మ తన సృష్టి కార్యక్రమము నిర్వహించే లోకము. సత్యమునకు ఆలవాలము కనుక "సత్యలోకము" గా విఖ్యాతి చెందినది. ఈ లోకమున వశించువారికి మరణ భాధ ఉండదు. మరు జన్మ ఉండదు అనునది వేదోక్తి.
* *
భూమి నుంచి అవరోహణము చేయగా వ్యాప్తీకరించి ఉన్న ఏడు లోకముల క్రమమే "అధోలోకములు" గా విఖ్యాతి నొందినవి. "సప్త అధో లోకముల విస్తీర్ణమే-వసుధను నిలిపే ఆధారములు". భూమికి దిగువ అమరి ఉన్న లోకములకు సూర్యరశ్మి ప్రసరించే అవకాశములు శూన్యము. ఈ లోకములు గాఢాంధకారములో అదిక వేడిని కలిగి ఉండే ప్రదేశములు. ఊర్ధ్వ లోకాల పయనము చల్లదనాన్ని ఆపాదించితే అధో లోకాల పయనము వేడి శెగలను విరజిమ్ముతుంది. భూమి అంతర్భాగమున విలసిల్లే ఈ లోకములు 560000 మైళ్ల సుదూర తీరములవరకు వ్యాప్తీకరించి ఉన్నవి.
అతలము:- దైత్యులు, దానవులు, నాగజాతి సంతతివారు నివశించు లోకము. ఈ నగర కోటలు, ఇండ్లు వాకిళ్ళు దైత్యశిల్పి "మయుని" చే నిర్మితమైనవి. ఈ లోకములో వశించువారికి ముసలితనము, వ్యాధులు, దుర్వాసన వన్నెమాయటము కానరావు. మయుని కుమారుడు బలి రాజ్యాధిపతి. 96 మాయలు, మంత్రములు నేర్చి తానే ఈశ్వరునితో సమానమనే అహంకారము కలిగి ఉండటము ఒకవింత
వితలము:- సాక్షాత్ పరమేశ్వరుడు "హటకేశ్వరుడు" అను పేరుతో సతీ సమేతుడై రత్నములతో కూడి వెలసెను. వీరి వలన ఇచట "హటకి" అను నది ఏర్పడినది. అది బంగారుమయమై రత్నములతో కూడి ఎల్లప్పుడూ ప్రవహిస్తుంది. అందువలన సముద్రమును "రత్నగర్భ" అని ప్రస్తుతించడము ఒక రివాజు.
సుతలము:- దానవరాజు “బలి చక్రవర్తి” వశించే లోకము. శ్రీ మహా విష్ణువుని ద్వారపాలకునిగా నియమించు కొనిన అహంకారముతో వెలుగులీనే గర్వితుడు. వామనావతారములో తనని యాచించిన విష్ణువు ఆగమనము తన గొప్ప తనముగా భావిస్తాడు. దానగుణములో బలి చక్రవర్తి ధీశాలి. అత్యంత బలవంతుడు. రావణుడు ఒకసారి బలిని అవమానించగా తన కాలి బొటన వేలితో తన్నగా ఆతను పదివేల ఆమడల దూరములో నెత్తురు కక్కుకొని పడటము తన గొప్ప బలానికి ధీటుగా గర్వించుట ఈతని నైజము.
తలాతలము:- మాయావులకు అదిపతి అయిన "మయుడు" వశించు లోకము. గొప్ప శివభక్తుడు. శ్రీకృష్ణుని ఆనతి మీద పాండవుల రాజధాని అయిన ఇంద్రప్రస్థములో దానవ శిల్పి "మయుడు" నిర్మించిన ధర్మరాజు సభా మందిరమైన "మయసభ" వర్ణన మహాభారతములో ప్రస్తావించబడినది. ఈ సభలో అడుగు అడుగునా ఆతని సృష్టి, శిల్పకళా చాతుర్యములు వైభవోపేతమైన సభాప్రాంగణములు, అనేక వింతలతో, నిండిచూపరుల మనస్సులను ఆకట్టుకొనడమేకాక కౌరవులను మంత్ర ముగ్ధులను గావించినవి.
మహాతలము:- కద్రువ సంతతికి చెందిన నాగ జాతి వశించు లోకము. వేలాది శిరస్సులు గల నాగులు వశించు ప్రదేశము. తక్షకుడు, సుషేణుడు, కుహకుడు ఆదిగా గల ప్రముఖులు వశించు లోకము. గరుత్మంతునికి భయపడి నాగజాతి యావత్తూ మహాతలములో సురక్షితులైరి.
రసాతలము:- హిరణ్య పుర వాసులు నివసించు లోకము. విష్ణు చక్రానికి బెదురుతారు. ఇంద్రుని దూతిక సురమ తన భక్తి పూర్వక మైన మంత్ర శక్తులతో వీరిని భయ పెడుతుంది.
పాతాళము:- నాగ లోకాధీశులైన వాసుకి మొదలైన నాగులు వశించే ప్రాంతము. వీరి ఫణి ప్రభలచే పాతాళం ధగ ధగలాడుతూ, వెలుగులు వెదజిమ్మి చీకటిని చెల్లాచెదరు చేస్తుంది. ఈ లోకము భగవంతుని కళ అనే శక్తితో భాసిస్తున్నది. ఈ కళ అహంకారానికి ప్రతీకగా నిలచి ఉండటము విశేషము. నాగ రాజులందరూ సదా అనంతునిసేవలో తల్లీనమై ఉంటారు. నాగ కాంతలకు, భక్తులకు, ఉపాశకులకు, ముక్తిని ఇచ్చి వారి కోరికలు తీరుపచేసే అనంత పరాక్రమవంతుడు, కరుణామయుడు, లోక భీకరమైన కనులుగలవాడు, వైజయంతీ మాలాధరుడు. ఈ భూమి అంతా అనంతుని వేయి పడగల మీద ఆధారపడి ఉన్నది అన్నది జగద్విదితము.
"సప్త ఊర్ధ్వ లోకములు భువి నుంచి దివికి చేరే ఆరోహణములు"
సప్త అధోలోకములు భువి నుంచి దిగే అవరోహణములు"
వేదములు తమలో వెలుగులీనే నిబిడీకృతమైన విజ్ఞతతో ఊర్ధ్వ, అధో లోకములను కలిపి 'బ్రహ్మాండము" అను పేరుతో వర్ణించగా ఆంగ్ల భాషలో "కాస్మిక్ ఎగ్" అని అభివర్ణించడము అయినది.
అక్కా
ReplyDeleteసప్త ఊర్ధ్వ, అధో లోకాలు గురించి వివరంగా ఫోటోలతో పాటు అందరికీ తెలియజేసినందుకు చాలా సంతోషం.
ముఖ్యంగా నక్షత్రాలు వాటి అధిదేవత లను ప్రార్ధించడం బాగుంది.మెన్నో మంచి వ్యాసాలు కోసం ఎదురు చూస్తున్న నీ సోదరి శ్రీలక్ష్మి వారణాసి నుండి
అక్కా
ReplyDeleteసప్త ఊర్ధ్వ, అధో లోకాలు గురించి వివరంగా ఫోటోలతో పాటు అందరికీ తెలియజేసినందుకు చాలా సంతోషం.
ముఖ్యంగా నక్షత్రాలు వాటి అధిదేవత లను ప్రార్ధించడం బాగుంది.మెన్నో మంచి వ్యాసాలు కోసం ఎదురు చూస్తున్న నీ సోదరి శ్రీలక్ష్మి వారణాసి నుండి
Very informative. We don't know so many things. Nakshatralu, Adhipatulu chaala baagundi. Congrats pinni.
ReplyDelete